వాగ్భూషణం భూషణం

కేయూరాణి న భూషయంతి పురుషం హారా న చన్ద్రోజ్జ్వలా
న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః
వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతాధార్యతే
క్షీయన్తే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం


మీలో మరీ చిన్నవారికి పరిచయం ఉండక పోవచ్చు, నా తరం వాళ్ళూ, రేడియో వినటం అలవాటున్నవాళ్ళూ ఐన వారికి ఈ శ్లోకం చిర పరిచయమే.

ఆ రోజుల్లో "సంస్కృత పాఠం" అని ఒక పది పదిహేను నిమిషాల కార్యక్రమం వచ్చేది. ఈ శ్లోకం ఆ కార్యక్రమానికి "థీం సాంగ్" అన్నమాట. నాలుగైదు ఆడా మొగా గొంతులు కలిసి పాడిన బృందగానం. అలాగని నాటకాల్లో సినిమాల్లో పద్యాల్లాగా రాగాలు తియ్యరు - సస్వరమైన వేద పఠనంలా ఉంటుంది. వెనకాల కేవలం ఒక్క వీణ మాత్రమే వత్తాసు ఇచ్చేందుకు.

ఇంతకీ నేను సంస్కృతం నేర్చుకున్నది లేదు, ఆ సంస్కృత పాఠాలు విన్నదీ లేదు. అప్పటికి ఈ శ్లోకానికి అర్థమూ తెలీదు. ఇది ఫలానా అని తెలియ చెప్పిన వారూ లేరు. అసలు శ్లోకంలోని చాలా మాటలే స్పష్టంగా తెలీవు. ఎటొచ్చీ వినడానికి చాలా హాయిగా అనిపించేది. చివరి వరుసలో .. "వాగ్భూషణం భూషణం" అన్న ముక్తాయింపు మాత్రం పట్టుబడింది. ఆ రెండు మాటల్నే వాళ్ళు పాడిన బాణీలో ఒకటికి పది సార్లు అనుకునే వాణ్ణి.

తరవాతెప్పుడో తెలిసింది - ఇది భర్తృహరి నీతి శతకంలో విద్వత్పద్ధతిని చెప్పే శ్లోకాల్లో ఒకటి అని.

పురుషుని (పోనీ మనిషిని అనుకోండి) భుజకీర్తులు అలంకరించవు. భుజకీర్తులు అంటే దుర్యోధన వేషం వేసినప్పుడు NTR భుజాల మీద బంగారు తొడుగు వేసుకుంటాడు చూడండి - అది. ఇక్కడ భుజకీర్తులు అలంకరించవు అంటే అర్థం, ఒకవేళ ఆ మనిషి ధనికుడై ఉండి భుజకీర్తుల్ని అలంకరించుకున్నా కూడా అవి అతనికి నిజమైన అలంకారం కాదూ అని. అలాగే, చంద్రుడిలా తెల్లని కాంతితో ప్రకాశించే ముత్యాల హారాలు కూడా అలంకారం కాదు. స్నాన విలేపనాలు (అంటే సబ్బులూ, లోషన్లూ), పువ్వులూ, ఎంచక్కా పెంచుకున్న జుట్టూ - ఇవేవీ మనుషునికి నిజమైన అలంకారాన్ని ఇవ్వవు.

ఒక్క వాణి (వాక్కు, మాట) మాత్రమే మనిషిని అలంకరిస్తుంది. ఎటువంటి వాక్కు? యా సంస్కృతా ధార్యతే - తర్క వ్యాకరణాది శాస్త్రములచే చక్కచేయబడి ధరించిన వాక్కు - అంటే చదువు, పాండిత్యం. మిగతా అలంకారాలన్నీ క్షీణించవచ్చు, వాక్కు అనే భూషణం ఎప్పటికీ వన్నె తరగక కలకాలం అలంకరిస్తుంది.

ఇక్కడ అలంకారం అంటే - కేవలం అందం ఆకర్షణ మాత్రమే కాదు. భూషణాలు ధరించట మెందుకు? అందం ఆకర్షణ పెంచుకునే ప్రయత్నం ఎందుకు? అవి మనిషి విలువని పెంచుతాయని. ఏ ఆభరణలూ ఇవ్వని విలువ మంచి మాట ఇస్తుంది మనిషికి.

ఈ శ్లోకం శార్దూలవిక్రీడితం అనే ఛందస్సులో ఉంది. దీనిలో "న, న" అంటూ మొదలుపెట్టటాన్ని వ్యతిరేక అలంకారం అంటారుట.

ఈ శ్లోకానికి ఏనుగు లక్ష్మణ కవి గారి అనువాదం ఇదిగో -
ఉ. భూషలు గావు మర్త్యులకు భూరి మయాంగద తార హారముల్
భూషిత కేశపాశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్
భూషలు గావు పూరుషుని భూషితు జేయు పవిత్ర వాణి వాక్
భూషణమే సుభూషణము భూషణముల్ నశియించు నన్నియున్.

తా.క. రానారె వ్యాఖ్యతో శ్లోకంలో నేను గమనించిన కొన్ని చిన్న తప్పులు సవరించాను.

Comments

కొత్తపాళీ గారూ!
ఈ శ్లోకం వినడానికి ఎంతో హాయిగా ఉంటుంది. దాదాపు రోజూ ఉదయాన్నే వింటూ ఉండేవాళ్ళం. ఈ మధ్య వినడం లేదుగానీ ఇప్పుడు కూడా వస్తోందనుకుంటా. ఈ శ్లోకం పై మీ వ్యాఖ్యానం చాలా బాగుంది. "వాక్ భూషణమే సుభూషణము. భూషణముల్ నశియించు నన్నియున్" :)
అవునండి, చాలా చక్కగా ఉండేది ఈ శ్లోకం. ఇక్కడ చదువుతూ ఉంటే ఆ శ్లోకం పాడే విధానం గుర్తొచ్చింది.
ఈ శ్లోకం నాకు తెలియకుండానే రాగయుక్తంగా చదివేసా. అంత పరిచయమైన శ్లోకం. కాని ఇంత అర్ధం ఉన్నట్లు మీరు చెపితేనే గమనించా. కృతజ్ఞతలు.
ఐతే పరవాలేదు, నేను మరీ ముందు తరం వాణ్ణి కాదన్న మాట :-)
ఆకాశవాణి కొన్ని మంచి పనులు చేసేది .. ఆ పాఠం సంగతేమో గాని, ఈ శ్లోకాన్ని మనకి అందించింది.
భర్తృహరికి ముందు ఇలాంటివి ఎవరన్నా రాశారో లేదో తెలీదు, ఈయన తన (నీతి శ్రంగార వైరాగ్య) శతక త్రయంలో ఒక్కొక్క శ్లోకంలో ఎంతో భావం ఇందట్టించి పెట్టాడు. ఎన్నో popular practices ని తీవ్రంగా విమర్శించాడు. ఈ రెండు విషయాల్లో ఈయన మన వేమన వంటి వాడు. శృంగార వైరాగ్య శతకాలు నేటి దృష్టితో చూస్తే misogynisticగా అనిపిస్తాయి.
అయ్యా, మన్నించాలి. ఎన్నోరోజులు ఈ శ్లోకం నేను వినడము, ఈ తరువాత తొమ్మిదోతరగతిలో దీని తాత్పర్యం మా సంస్కృతోపాధ్యాయినిగారి నుండి గ్రహించడము జరుగుటచేత, నామీది నమ్మకంతో చెబుతున్న మాట - మీరిక్కడ రాసిన శ్లోకంలో చిన్న తప్పులున్నాయి. నేను నేర్చుకొన్నది ఇదీ -

కేయూరా న విభూషయంతి పురుషం హారా న చంద్రోజ్జ్వలాః
న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః|
వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతాధార్యతే
క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం||

केयूरा न विभूषयन्ति पुरुषं हारा न चन्द्रोज्ज्वलाः ।
न स्नानं न विलेपनं न कुसुमं नालङ्कृता मूर्धजाः ॥
वाण्येका समलङ्करोति पुरुषं या संस्कृता धार्यते ।
क्षीयन्ते खलु भूषणानि सततं वाग्भूषणं भूषणम् ॥
spandana said…
ఇంత మంచి సంస్కృత పద్యం అర్థం తెలియగానే గొప్పదనం తెలిసింది. మీలాంటి వారు ఇలాంటివి మరిన్ని అందిస్తే మాలాంటి వారికి బాగుంటుంది కదా!
--ప్రసాద్
http://blog.charasala.com
రానారె,
ఎంతమాట, తప్పున్న తరవాత ఎత్తి చూపించాల్సిందే. మనకి తెలిసి చెప్పక పోతే తెలియని వారెవరు చెబుతారు?

మొదటి వరుసలో సవరణ పెద్ద విషయం కాదు, రెండు రకాలుగానే ఒకటే అర్థం వస్తుందని నాకు అనిపిస్తోంది. చివరి వరుసలో మార్పు మీరు చెప్పింది బావుంది. నేను రాసిన పద్ధతిలో "క్షీయంతి + అఖిల" కి సంధి కుదర్లేదే అనుకుంటున్నాను. "క్షీయంతే ఖలు" అక్కడ సరిగ్గా సరిపోతుంది. థాంకులు.

ప్రసాద్ గారు, ఈ మాత్రం దానికి మీ లాంటి వారు, మా లాంటి వారు అని వర్గీకరణలెందుకు? నాకు తట్టే నాలుగు విషయాలు నలుగురితోనూ పంచుకోవాలనే ఈ ప్రయత్నం. :-)
Sriram said…
ఆహా కొత్తపాళీ వారు మంచి జోరు మీదున్నారు...ఇలాగే కొనసాగించండి.
ఈ అమృతగుళిక ఆకాశవాణి వర ప్రసాదం. ఈ శ్లోకానికి బాణీ కట్టింది ఎవరో కానీ చాలా ధన్యజీవి. హిందుస్తానీ కాపి రాగానికి దగ్గరగా ఉంటుందని నా అభిప్రాయం(కొంతమంది మిత్రులు కూడా ఏకీభవించారు). అందుకే ఓలేటి గారేమో అని అనుమానం.
ఆకాశవాణిని స్వయం ప్రతిపత్తి 'సాధించుకోమని ' ప్రసార భారతి చెప్పాక, డబ్బులొచ్చే మతపరమైన కార్యక్రమాలు, కుటుంబ సంక్షేమ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమాలు ఉషోదయ వేళ ఊదర గొడుతున్నాయి.

ఈ శ్లోకమే గాక, పొలం పనులు, కార్మికుల కార్యక్రమం ముందు వచ్చే జింగిల్స్, ప్రతీ రోజూ ఉదయం గం.5.56 ని.లకు వచ్చే జింగిల్స్ గుర్తొస్తేనే భలే ఉంటాయి.

ఒక సంవత్సరం క్రితం వరకు సంస్కృత పరిచయం కార్యక్రమం రాత్రి పదికో పదిన్నరకో వచ్చేది. ఇప్పుడు నేను కూడా వినడం లేదు, అందువల్ల వస్తుందో లేదో తెలీదు.

ఇప్పుడు ఎఫ్.ఎం వచ్చాక వివిధభారతి ఎఫ్. ఎం. మాత్రం వింటున్నాను. వాళ్ళ ఉచ్చారణ మాత్రమే బాగుంటుంది. ఇతర ఎఫ్.ఎం.ల ఆర్.జె.ల మాటలు గుర్తొస్తేనే వాతులొస్తాయి.

వివిధభారతిలో కూడా ఫోన్ ద్వారా అడగా, పాటలు ప్రసారం చేసే కార్యక్రమం కన్నా, ఉత్తరాలు చదివి పాటలు వేసే కార్యక్రమమే బాగుంటుంది.

కొత్త రవికిరణ్
Anonymous said…
ఇది చాలా మంచి అర్ధం ఉన్న శ్లోకం. నేను మరీ చిన్నప్పుడు మా నాన్నగారు రేడియో లొ ఆకాశవాణి కార్యక్రమాలు ప్రతీదినం వినే రోజుల్లో, దాని అర్ధం తెలియకపోయినా, మనన చేసుకుంటూ ఉండేవాళ్ళం. కానీ ఇంటర్మీడియట్ లొ సంస్కృతం చదివేదాకా నాకు తెలియలె ఆ శ్లోకం లోని మాధుర్యం. మంచి శ్లోకాన్ని మీ బ్లాగు ద్వారా అందించి మరల మాకు గుర్తుకు చేసినందుకు క్రుతజ్ఞతలు. మీ దగ్గర ఆ సంస్కృత పాఠం ఆడియో ఉంటే పంపగలరు.
Anonymous said…
ఇది చదివి పాత జ్ఞాపకాలు తవ్వుకున్నాము. చాలా ధన్యవాదాలు. ఈ సంస్కృత పాఠం చివరలో శిష్యురాలు "వెళ్లివస్తానండీ నమస్కారం" అంటే, గురువుగారు "మంచిదమ్మా, ఆశీర్వాదం" అనేవారు. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు.
ఇంటరుచేరాక క్లాసులో మనకుకొద్దిగా ఇమేజీ సంపాదించిపెట్టిన శ్లోకమిది.(సంస్కృతంలో శ్లోకాలనాలి పద్యాలనకూడదు అని చెప్పాడు మాసారు.) మీపుణ్యమాని ఈరోజు కనిపించింది. కంట్రోల్+సీ-->కంట్రోల్+వీ చేశా
rākeśvara said…
ఈ పద్యం నేనెప్పుడూ వినలేదు। ప్రసార మాధ్యమాలకు దూరంగా పెరగడం వలనేమో।

సంస్కృతంలో ఈ వాగ్భూషణం భూషణం లాంటి వాడుక నచ్చుతుంది।
ఉదా - యః పస్యతి స పస్యతి - ఎవరు చూచునో వాడే (లెస్సగా) చూచును।
దీని వస్స క్లుప్తత వచ్చి, ఒక శ్లోకంలో చాలా సమాచారం పొదగడానికి అవకాశం వుంటుంది।
ఈ శ్లోకాన్ని నా చిన్నప్పుడు రేడియోలో వినేవాన్ని. "సంస్కృత పాఠం" అనే ఒక కార్యక్రమంలో ఈ శ్లోకం వినబడేది. కొన్ని సార్లు అర్థం కాకపోయినా ఆ కార్యక్రమాన్ని వింటుండేవాడిని. ఆ జిజ్ఞాసే ఇప్పుడు నేను సంస్కృతం నేర్చుకోవడానికి ( ఇన్నేళ్ళ తరువాత ) దోహదపడుతోందని నేను భావిస్తాను.
నాగరాజు రవీందర్ గారు, మీకు ఈ పాత టపా కనబడినందుకు, మీరు సంస్కృతం నేర్చుకుంటున్నందుకూ సంతోషం.
మాలతి said…
ఇక్కడ చూసినతరవాత నాకు తెలుగు పద్యం గుర్తొచ్చింది. ఆరోజుల్లో నాకెంతో ఇష్టమయిన పద్యం, - మాలతి
పాత రోజులు గుర్తుకు తెచ్చారు సంతోషంగా ఉంది
పాత రోజులు గుర్తుకు తెచ్చారు సంతోషంగా ఉంది
K Ram Mohan Rao said…
Nostalgic and evergreen memories of AIR
Unknown said…
neenu ee padhyam kosam vethukutunnaanu naaku ee padhyam vintadam vuchharinchadamante chaala ishtam...post chesina mithruniki dhanyavaadaalu.