శ్రుత పాండిత్యం

ధనుర్మాసం కదా, నా చిన్నప్పటి ఆంజనేయస్వామి గుడి బాగా గుర్తొస్తున్నది. హబ్బ తెల్లారగట్ల నాలుగ్గంటల నించే గ్రామఫోను హడావుడి.

మా అమ్మా వాళ్ళ ఇల్లు మాచవరం ఆంజనేయస్వామి గుడికి కూతవేటు దూరంలో ఉండేది. చిన్న చిన్న గుడుల వాళ్ళు పండగలకీ పబ్బాలకీ ఉత్సవాలకీ మాత్రం గ్రామఫోను - లౌడుస్పీకరు సెట్టు అద్దెకి తెచ్చి పాటలు వేస్తుండేవాళ్ళు కానీ ఆంజనేయస్వామి ఆ చుట్టుపట్ల మంచి ఆదాయం ఉన్న దేముడు. అంచేత అప్పటికే సొంతానికి గ్రామఫోను - లౌడుస్పీకరు సెట్టు ఉండేది. ఆకాశవాణి గొంతు విప్పడానికి ఖరాగా ఒక గంట ముందే సుబ్బలక్ష్మి పాడిన శ్రీవేంకటేశ్వర సుప్రభాతంతో ప్రసారం మొదలయ్యేది. వాళ్ళ దగ్గర ఒక అరడజను కంటే రికార్డులు లేవనుకుంటా, అవే మార్చి మార్చి ఉదయం ఒక రెండు మూడు గంటలసేపూ సాయంత్రం ఓ రెండు గంటల సేపూ వేస్తుండేవాళ్ళు.

వాటిల్లో బ్రహ్మశ్రీ మల్లాది చన్ద్రశేఖర శాస్త్రిగారు చెప్పిన సుందరకాండ పురాణ ప్రవచనం నాకు చాలా నచ్చేది. కొద్దిగా బొంగురుగా ఉండే విలక్షణమైన ఆయన గంతు, శ్లోకం చదివే తీరు, వచనంలో విడమరిచి చెప్పేటప్పుడు ఒక తాతయ్య తన మనవలకి కథ చెబుతున్నట్టు చనువుగా కలుపుగోలుగా ఉండే మాట తీరు - అన్నిటినీ మించి హనుమంతుడంటే ఉన్న ఇష్టం, ఆయన కథ వినడం పట్ల ఆసక్తి - ఇవన్నీ కలిసి నన్ను ముగ్ధుణ్ణి చేసేశాయి.
ఒక రోజున .. నాకప్పుడు ఏడెనిమిదేళ్ళు ఉంటాయి.  ఎవరో ఒక పెద్దాయన వచ్చి వరండాలో మా అప్పతో (నాన్నగారితో) మాట్లాడుతూ ఉండగా నేను ఏదో గొణుక్కుంటూ అటుగా వెళ్తున్నా. మా అప్ప నన్ను పిలిచి, ఏవిట్రా అదీ, గట్టిగా చెప్పూ అన్నారు. ఆ వయసులో జంకూ గొంకూ ఏముండవుగా - మొదలెట్టేశా - తతః అని మొదలు పెట్టారు సుందరకాండ. సుందరమైన కాండ గనక దీనికి సుందరకాండ అని పేరు .. ఇలా మొదలు పెట్టేసి చన్ద్రశేఖరశాస్త్రిగారి ప్రవచనాన్ని సుమారొక ఐదారు నిమిషాల పాటు వప్పజెప్పాను. మా అప్పా, ఆ వచ్చిన పెద్దాయనా దిగ్భ్రాంతులయ్యారు. నేనూ నెవ్వెరపోయాను - అప్పటిదాకా స్పష్టంగా గ్రహించలేదు అంతగా ఆ ప్రవచనం నా మనసులో ఇంకిపోయిందని. అదేమి పని గట్టుకుని నేర్చుకున్నది, రాసుకుని చదివినది అసలే కాదు.

తరవాత్తరవాత బడిప్రభావంలో పడిపోయి పుస్తకంలోనో కాగితమ్మీదనో చదివితేనే చదువు అనే భావన బలపడిపోయింది. ఈ విషయంలో బడిచదువు నాకు (బహుశ మనలో చాలా మందికి) చాలా అన్యాయం చేసిందనే అనుకుంటున్నాను. ఏనార్బర్లో ఉండే రోజుల్లో కొన్నాళ్ళు ESL పంతులుగా వాలంటీర్ చేశా. ముందు ఒక వారం రోజులు శిక్షణ ఇచ్చారు. అందులో చెప్పారు - నేర్చుకునే పద్ధతులు ముఖ్యంగా మూడు రకాలుగా ఉంటాయిట. చూపు (చదవటం), వినికిడి, స్పర్శ (చెయ్యడం). బడి బోధనా పద్ధతులు చూపు పద్ధతుల మీదనే దృష్టి కేంద్రీకరించి మిగతా పద్ధతుల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసేశాయి.

ఎప్పుడన్నా మీరు ఖాళీగా కూర్చున్నప్పుడో, వొంటరిగా డ్రైవు చేసుకుంటూ వెళ్తున్నప్పుడో ఎక్కణ్ణించో మనసులోతుల్లోనుంచి, జ్ఞాపకాల పొరల్లోనించి ఏవేవో గొంతులు, మాటలు, పాటలు అలవోకగా కదుల్తూ ఉంటాయి. విని చూడండి!

Comments

kastephale said…
విన్నది మనసులో ఇంకిపోతుంది.
Sanath Sripathi said…
విశాఖపట్నం లో కనకమాలక్ష్మి గుడికి దగ్గర్లో ఉండేవాళ్ళం, పక్కనే రామాలయం. నాకు రాముడంటే ఎందుకో తెలీని అభిమానం ఏర్పడ్డానికి ఆ ఆలయమే కారణమేమో... ఎంతబాగుండేవో పొద్దున్నే పాటలు.. ఇక్కడ కాంక్రీటు వాతావరణం లో పడ్డాక 3-4 కిలోమీటర్లు వెడితే గానీ గుడి రాదు, వచ్చినా అక్కడ ప్రశాంత వాతావరణం, పవిత్ర వాతావరణం కనిపించదు... ఎప్పుడైనా నల్లకుంటో, శంకరమఠమో, గుడిమల్కాపూరో వెడితే ఇంటికొచ్చినంత సంబరంగా ఉంటుంది అప్రయత్నం గానే.. అక్కడనుండీ వచ్చేస్తున్నప్పుడు అక్కడున్నవాళ్ళమీద అకారణంగా అక్కసుగా కూడా అనిపిస్తూంటుంది...(ఉండలేకపోయానని)
Anonymous said…
బాగుందండీ... మా ఊళ్ళో కూడా మా ఇంటికి చాలా దగ్గర్లో హనుమంతుడి గుడి ఉంది. ఇప్పటికీ పొద్దున్నా సాయంత్రం మైకులో మల్లాదివారిదీ, ఎమ్మెస్ రామారావుగారిదీ సుందరకాండ వాయగొడుతూ ఉంటారు. నేను ఇప్పటికీ మా ఇంట్లో కామెడీ చేస్తుంటా - మల్లాదివారి గొంతు అనుకరిస్తూ, శ్లోకాలు ఆయన చదివినట్టుగా చదువుతూ...

చిన్నతనంలో రామనవమికి ఆ గుడిదగ్గర పందిరివేసి పొద్దున్నా సాయంత్రం కొద్దిగా భక్తిగీతాలు, మిగతా రోజంతా చిరంజీవి సినిమా పాటలూ పిచ్చెక్కించేసేవారు. సరిగ్గా అదే టయింలో స్కూల్లో ఇయరెండ్ ఎక్జామ్స్ ఉండేవి. చికాకూ, తలనొప్పీ వచ్చి చాలా ఇబ్బందిగా ఉండేది. ఇహ రాత్రిళ్ళైతే రోడ్డంతా మూసేసి, తెర మీద‌ సినిమాలో, స్టేజి మీద నాటకాలో, రికార్డింగ్ డాన్సులో... ఈ టాపిక్కు మీద ఓ నాలుగైదు బ్లాగు టపాలు రాయొచ్చు నా అనుభవాల్తో... :‍)

ఈమధ్య చాలాకాలం నుంచీ ఈ సినిమాలు గట్రా సాంస్కృతిక కార్యక్రమాలు ఆగిపోయాయని విన్నాను.
nareshnunna said…
బోధనా పద్ధతులలో మనం ఎలా colonial ప్రభావానికి గురవుతున్నామో self referential గా చెప్పారు. Thank u. నేర్చుకునేవారి genderని బట్టి ఆ బోధనా పద్ధతులలో మూడవది - స్పర్శ అన్నిటి కన్నా బాగుంటుందేమో అనిపిస్తుంది కొత్తపాళీ గారు...
Vasu said…
"...అప్పటిదాకా స్పష్టంగా గ్రహించలేదు అంతగా ఆ ప్రవచనం నా మనసులో ఇంకిపోయిందని...."

ఎం ఎస్ అమ్మ పుణ్యమా అని విష్ణు సహస్రం ఇలాగే హృదయస్థం అయింది.

"ఈ విషయంలో బడిచదువు నాకు (బహుశ మనలో చాలా మందికి) చాలా అన్యాయం చేసిందనే అనుకుంటున్నాను. "

మీరు చెప్పినది శిక్షణ పరంగా చేసిన అన్యాయం గురించి అనుకుంటా. అసల అన్యాయం మన పుస్తకాలలో మన చరిత్ర, మన సంస్కృతి లేకుండా చెయ్యడం. తెల్లోళ్లు రాసినదే చరిత్ర ఐపోయింది.
నావి చాలా వరకూ శృత పాండిత్యమేనండీ! మా అమ్మ పని చేసుకుంటూ విష్ణు సహస్ర నామాలు, లలితా ఖడ్గమాల,సహస్ర నామాలు చదువుతూ ఉండేది.అవన్నీ వింటూ నాల్గో క్లాసుకొచ్చేసరికి కంఠతా వచ్చేశాయి.(ఒక్క ముక్క అర్థం తెలిస్తే ఒట్టు) అక్కయ్య అమ్మ దగ్గర పాఠం నేర్చుకుంటుంటే అటూ ఇటూ పోతూ ఆడుకుంటూ వర్ణాల దాకా లాగించా! కానీ ఇలా నేర్చుకున్నవి మీరన్నట్టు ఎప్పుడో మనసు పొరల్లోంచి అలవోగ్గా కదిలి బయట పడటం నాకూ అనుభవమే!

గుడి విషయానికొస్తే మా వూర్లో మా ఇంటిదగ్గర సత్యనారాయణ స్వామి గుడి ఉంది. ఇక్కడ హైద్రాబాదులో మాత్రం ఆనజనేయుల వారే! ఈ గుడిలో మంగళవారం శనివారం తిన్నన్ని ప్రసాదాలు పెడతారు. వడమాలలూ,అప్పాలూ, పులిహోరలూ మొక్కేవాళ్ళుంటారు ఆ రెండ్రోజులూ! అందుకే ఆ రోజుల్లో మాత్రం మిస్ కాకుండా వెళ్తాను.:-)

ఎన్ని రకాలు గా చేసినా గుళ్ళో పులిహోర రుచి ఇంట్లో రానే రాదు
baaguNdandee..:)
naakoo ilaantive chaalaa anubhavaalunnai. avannee gurtochchayi
చాలా బాగుందండీ. నాకు బాలు గారు పాడిన శివస్తుతి, ఎమ్మెస్ రామారావు గారి తెలుగు చాలీసా ఇలానే వినీ వినీ కంఠతా వచ్చేసాయి. ఇంకా ఇలాంటి ఙ్ఞాపకాలు బోలెడు. మంచి పాయింట్ గురించి రాశారు.
Kottapali said…
శర్మగారు, వినగ వినగ ఇంకుచుండు!

సనత్, బాగుంది.

నాగమురళి, ఇది మరీ బాగుంది. ఏప్రిల్లో రామనవమికి వీధిలో సినిమాలు మాకూ ఉండేవి. తప్పకుండ మీ అనుభవాలు రాయండి.

నరేష్, ఏమో అది మీ బోంట్లకి తెలియాలి. నేను ఇంజనీరింగ్ పాఠం మాత్రమే చెప్పాను. ఫౌండ్రీలో స్పర్శిస్తానంటే తోలూడుతుంది :)
Kottapali said…
వాసు, నిజమే.

సుజాత, కదా! కానీ అదేంటో నా చిన్నప్పుడు మరి మా ఆంజనేయుడికి ఇవన్నీ ఉండేవి కావు. ఇప్పుడున్నాయేమో. ఆ రోజుల్లో ఎక్కువగా ఆకుపూజ చేసేవారు - తమలపాకులతో సహస్రనామార్చన. ధనుర్మాసం రోజుల్లో పొంగలి ప్రసాదం పెట్టేవారు గానీ మిగతా రోజుల్లో పండ్లే. ఆ తరవాత పెద్దాచార్యులుగారు ధనుర్మాసపు రోజుల్లోనే పరమపదించారని, ధనుర్మాసపు ఆచారం ఆలయానికి అచ్చిరాలేదని ఏదో తీర్మానం చేసి, ధనుర్మాస ఉత్సవాలు చెయ్యడం మానేశారు. ఈ గుడికి ఇంకో విశేషం ఉన్నది - వాహన పూజకోసం, ముఖ్యంగా లారీల వాళ్ళు బాగా వచ్చేవాళ్ళు. లారీకి కాయతో దిష్టితీసి, ఆ చిప్పల్ని లారీ దాటి అవతలికి పడేట్టుగా విసుర్తారు. అటుపక్కనే ఒక అప్పర్ ప్రైమరీ స్కూలుండేది. ఆ బడి పిల్లకాయలు లారీ వెనకాల నించుని ఆ చిప్పల్ని కేచ్ పట్టి తీసుకు పోయేవాళ్ళని చెప్పి ఆ బడిని కొబ్బరి చిప్పల బడి అని పిలిచేవాళ్ళు. :) ఈ గుడిని గురించి రెండుమూడేళ్ళ కిందట చిల్లర శ్రీమహాలక్ష్మి అనే టపాలో రాశాను.

రాజ్ కుమార్, మీరు తెలుగుని తెలుగులిపిలో రాయాలి, దయచేసి.

వేణూ శ్రీకాంత్, నెనర్లు.
SHANKAR.S said…
ఒక్కసారి ఎక్కడికో తీసికెళ్ళి పోయారు గురువు గారూ. చిన్నప్పుడు ఎమ్మెస్సమ్మ గొంతులో "భజ గోవిందం" టేప్ రికార్డర్ లో వింటూ నిద్రలేచేవాడిని. ఆ వెంటనే విష్ణు సహస్ర నామం చెవిలో పడేది. ఆ గొంతులోంచి వస్తే చెవిలో పడ్డవి మనసులో ఇంకకుండా ఆగుతాయా? :)

ఇక మా అమ్మగారు చదివే మహాలక్ష్మాష్టకం, లలితా సహస్రనామం, హనుమాన్ చాలీసా కూడా ఇదే రీతిలో మెదడులో తిష్ట వేసుకున్నాయి.

మా ఇంటిదగ్గర రామాలయంలో రాముడు అంత రిచ్ కాకపోవడం చేత శ్రీరామనవమికి మాత్రం ఎమ్మెస్ రామారావు గారి సుందరకాండ, సుబ్బలక్ష్మమ్మ హనుమాన్ చాలీసా వాటితో పాటు రాముడి మీద వేసే సినిమా పాటల్లో నాకు బాగా గుర్తుండి పోయినవి "శ్రీరామ నామాలు శతకోటి", "ఏమి రామ కథ శబరీ శబరీ" , "రామయ తండ్రీ ఓ రామయ తండ్రీ".ఈ పాటలు ఇప్పుడు విన్నా నాకు ఆ గుడి మైకులో విన్న ఫీలింగే వస్తుంది. ఇక ఉదయం, సాయంత్రం సుందర కాండ అయ్యాక,హనుమాన్ చాలీసా మొదలవడానికి మధ్య టైం లో మా ఏరియా పిల్లలకి (కేవలం పిల్లలకి మాత్రమె) అర్చకుల వారు ప్రసాదం పంచడం. దానికోసం నిలబడే లైన్లోనే నేను ముందంటే నేను ముందని అల్లరి చేయడం ఇప్పుడు గుర్తొస్తే మనసుని మలయ"మారుతం" తాకినట్టు ఉంటుంది.

మీరన్న మనసు లోతుల్లోంచి, జ్ఞాపకాల పొరల్లోంచి వినబడే గొంతులు టైం మెషీన్ లాంటివే.ఇప్పుడు నన్ను అక్కడికి తీసికెళ్ళి పోయాయి. తిరిగి రాడానికి మనసొప్పటం లేదు :((
రవి said…
This comment has been removed by the author.
మీ శ్రుతపాండిత్యం బాగుందండి . కొన్ని సార్లు విన్నవి మనసులో అలా వుండిపోతాయి .
బాగుందండీ! ఇప్పటి పిల్లలకి... ఈ శ్రుత పాండిత్యం రాదు. పెద్ద వాళ్ళు పైకి పారాయణం చేసుకుంటున్నా ఊరుకోరు. అప్పుడే మొదలెట్టావా? మీ దేవుళ్ళు దేవతలు ఎప్పుడు మెలుకువగానే ఉంటారు. సుప్రభాతాలు అవసరం లేదు. స్తోత్రాలు అవసరం లేదు.. నీకు ఇష్టమైతే లోలోపల చదువుకో..అంటారు. ఇక గుళ్ళో వినిపించేవి వీళ్ళ చెవుల బడతాయంటారా?ఎప్పుడు..ఇయర్ పోన్స్ చెవికి అతికించుకుని ఉంటారు.

సుజాత గారు ..గుడిలో చేసే పులిహార రెసిపీ నేను ఈ రోజు వ్రాస్తాను చూడండీ! ఇంట్లో చేయడానికి ప్రయత్నించండి.
SRAVAN BABU said…
ఎలాగూ సందర్భం వచ్చింది కనుక నా అనుభవం కూడా చెప్పాలనిపిస్తోంది. మా ఇంటిపక్కన వెంకటేశ్వరస్వామివారి గుడి ఉంది. అప్పట్లో తి.తి.దే.వారు వెంకటేశ్వరస్వామి ఆలయాలకు గ్రామ్ ఫోన్ ప్లేయర్, కొన్ని రికార్డులు ఉచితంగా ఇచ్చే కార్యక్రమంలో భాగంగా మా గుడికి కూడా అవి వచ్చి చేరాయి. వాళ్ళిచ్చిన రికార్డుల్లో అన్నమయ్య మీద ఒక ఎల్.పి. ఉంది. దానిని పూజారిగారు తెల్లవారుఝామునే పెట్టేవారు. జగ్గయ్యగారి వ్యాఖ్యానంతో, బాలుగారు పాడిన ఆ రికార్డ్ పుణ్యమా అని నాకు అన్నమాచార్య కీర్తనలన్నీ దాదాపు కంఠతా వచ్చేశాయి. తర్వాత ఆ రికార్డ్ ఎక్కడన్నా దొరుకుతుందేమోనని చాలా ప్రయత్నించాను. దొరకలేదు. మనబ్లాగర్లలో అన్నమాచార్య కీర్తనలపై బ్లాగు రాసే ఒకాయన(పేరు మరిచిపోయాను)ను కూడా అడిగాను, ఈ ఎల్.పి. వివరాలు చెప్పి. ఆయనకూడా తెలియదన్నారు. అది కాలగర్భంలో కలిసిపోయిందనుకుంటాను.
తేజస్వి గారూ,
ఆ అన్నమయ్య కీర్తనల రికార్డు పేరు "గీతాంజలి" అప్పట్లో అది వినిపించని గుళ్ళే లేవనుకోండి. నా అసంఖ్యాక ఆడియో కాసెట్లలో ఉందేమో చూస్తానుండండి. దొరికితే పంచుకుంటాను.

ఆ కాసెట్లలో "శ్రీనివాసమూ నీ హృదయం" (బాలూ)
"మా తల్లి అలివేలు మంగ"(సుశీల)
"ఏడు కొండల మీద ఏమున్నది" (రామ కృష్ణ, సుశీల) ఈ పాటలు బాగా గుర్తుండిపోయాయి. ఎంతగా అంటే ఇలా రాస్తుంటే గుర్తొచ్చేస్తున్నాయి. జగ్గయ్య వ్యాఖ్యానం ఆ రికార్డ్ కి ఒక అస్సెట్
రవి said…
ఈ కాలం పిల్లలకు శ్రుతపాండిత్యానికి కీలకం మారిందండి. వీడియోలో చూపిస్తే వంటబడుతూంది. భక్తప్రహ్లాద సినిమా ఏదో సందర్భంలో మా పాప కు చూపిస్తే చూసి ఓ రోజు గొణుక్కుంటూ ఏదో పాడుతూంది. ఆ పాట కష్టపడి కనుక్కుంటే ఇలా ఉంది.

కంజాచ్చునకు కాని కాయంబు గాయమె
పవన గూమిత చమ్మ బత్తి గాక
వెనకుంటు బొగనని వత్తంబు వత్తమె
దమదమద్దని తోడి దక్క గాక
..
..

డీకోడ్ చేసిన తర్వాత చాలా ఆశ్చర్యమేసింది.ఆ పద్యం దానికి పూర్తిగా వచ్చు. ఈ మధ్య శ్రీరామరాజ్యం లో సప్తాశ్వరథమారూఢం ప్రచన్డం కశ్యపాత్మజం కూడా నోటికి వచ్చింది. (సినిమా చూసి, పంఖాగా మారి టీవీ ముక్కలతో, ఎమ్పీత్రీలతో నేర్చుకుంది)
Kottapali said…
రవి, అవును. ఆ చిన్న వయసులో పిల్లల గ్రహణశక్తిని తక్కువ అంచనా వెయ్యలేము. జాడీలో ఉప్పు గాలిలో తేమని లాగినట్టు విషయపరిగ్రహణం చేస్తుంటారు.

శంకర్,మాలాకుమార్, వనజవనమాలి, తేజస్వి, సుజాత - నెనర్లు మీ జ్ఞాపకాలు పంచుకున్నందుకు.
lalithag said…
అబ్బో ఎన్నో జ్ఞాపకాలు కదిలాయి ఈ టపా చదివి. ముందు విషయం చూసి వచ్చాను. ఎవరు వ్రాశారో తర్వాత చూశాను. వ్యాఖ్యలు చదివి ఇంకా ఎన్నో జ్ఞాపకాలు అలా దొర్లుకుంటూ వస్తున్నాయి. ఎక్కడ మొదలు పెట్టలి? మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరా ఒక గుడి ఉండేది. అక్కడ మైకులో సుబ్బలక్ష్మి గారి విష్ణు సహస్ర నామమ, ఘంటసాల గారి భగవద్గీత, గుడిలో మంత్రపుష్పం మంచి జ్ఞాపకాలు. హైదరాబాదు నగరంలో శ్రీ రామ నవమికి పందిరిలో బాలసుబ్రహ్మణ్యం, సుశీల గొంతుల్లో శ్రీరాముడి పాటలు (private songs అనుకుంటా, సినిమా పాటలు కావు?), ఉదా హరణకు "రామచంద్రుడితడూ రఘువీరుడూ..." ఇక మా ఇంట్లో మా అన్నయ్య హోరెత్తించే సంగీతం వినిపించే వాడు. మొదట్లో విసుక్కున్నా, మెల్లగా మా కుటుంబం మొత్తం ఇష్టపడే కొన్ని signature melodies(?) ఏర్పడిపోయాయి. వీటిలో 'జగదానంద కారకా' నాకు ప్రత్యేకంగా ఇష్టం. మా అందరికీ హరిప్రసాద్ చౌరసియావి కొన్ని creations ఎప్పటికీ ఇష్టమైనవీ, ఆ రోజుల్లో మా అనుబంధాన్ని గుర్తు చేసేవీ, ఎప్పటికి మా అందరికీ తోడుగా నిలిచి ఉండేవీను.
ఇక సుందరకాండ పారాయణకి వెళ్తూ మా అమ్మమ్మ నన్ను కూడా తీసుకు వెళ్ళ వలసి వచ్చేది. అలా తెలుసుకున్న విషయాలు ఎన్నో.
ఇక మీరన్నట్లు కొందరు విని నేర్చుకుంటారు, కొందరు చదివి నేర్చుకుంటారు, కొందరు చూసి, ఇంకొందరు చేసి నేర్చుకుంటారు. ఐతే ఒకలా ఎక్కువ నేర్చుకునే వారు ఇంకోలా నేర్చుకోరని ఏమీ లేదు. నేర్చుకున్నా నేర్చుకోకపోయినా, గుర్తు వచ్చినా రాకపోయినా, అన్ని sense కి జరిగే eposure ప్రభావమూ మొత్తం మీద మన ఎదుగుదల మీద కచ్చితంగా ఉంటుందని నా నమ్మకం, అనుభవం కూడా. అందుకే ఓపిక ఉన్నప్పుడు, సమయం అనుకూలించినప్పుడు నాకు ఇష్టమైనవి, మా పిల్లలు నేర్చుకోతగ్గవీ అనిపించినవి అలా play చేస్తూ ఉంటాను. అందులో కొన్నైనా వాళ్ళు తెలియకుండానే అందుకుంటుంటారు.
Kottapali said…
lalithag, చాలా సంతోషం. బాలు సుశీల రాముడి పాటల రికార్డు నాకు తెలుసు. కొన్ని రామదాసు కీర్తనలు, కొన్ని అన్నమ్మయ్య కీర్తనలు (రామచంద్రుడితడు అన్నమయ్యదే), కొన్ని ఆధునిక కవులు రాసినవి కలిపి చేశారు.
రసజ్ఞ said…
చాలా సున్నితంగా మదిలోని సంగతులన్నిటినీ తట్టారు! పూర్వం విద్యాభ్యాసం అంతా గురు ముఖత నేర్చుకునేవారుట కదా! అలా విన్నదే ఎప్పటికీ మదిలో ఉండిపోతుంది! ఇలా నేను నా ఆరేళ్ళ వయసులో విని నేర్చుకున్న మంత్రపుష్పం (అపాం పుష్పం, శ్రీ సూక్తంతో సహా) ఇంకా చాలా నామాలు, స్తోత్రాలు, కథలు అలా గుర్తుండిపోయాయి. కానీ ఎందుకు పైకి చదివానా అని మా అమ్మమ్మ తరువాత తెగ బాధపడింది! నాకు వచ్చినప్పటినుండీ చిన్నతనం కదా తెలియక గుడిలో ఒక్కోసారి పూజారులు మంత్రపుష్పం పూర్తిగా చదవరు కదా! మరి నేనేమో వాళ్ళతో పాటు మొదలెట్టి మొత్తం చదివేదానిని నా కోసం తప్పక, వాళ్ళు మధ్యలో ఆపలేక మొత్తం చదివేవారు!
బావుందండీ మీ పోస్ట్. మీరు చెబుతుంటే నాకు నా చిన్నప్పుడు రోజులు తెగ గుర్తుకు వచ్చేశాయి. మా ఇంటి దగ్గరా ఒక రామమందిరం ఉండేది. పండగలప్పుడు ఆ గుడి కళే వేరుగా ఉండేది. భోగీ రోజున మరీను. మీ వల్ల ఆ మధుర జ్ఞాపకాలు మళ్ళీ గురకతుకువచ్చాయి, ధన్యవాదాలు. మీరు చెప్పొనది నిజం. మనం చదివిన దానికన్నా విన్నదే బాగా గుర్తుండిపోతాయి. చిన్నప్పుడెప్పుడే విని నేర్చుకున్న లవకుశ, గుణసుందరి కథ సినిమాలలో పద్యాలు ఇప్పటికీ గుర్తుండడానిక అదే కారణం ఏమో. మా అక్క, నేను చిన్నప్పుడు మా జుల్లోకి నాన్నగారు చెబుతుంటే నేర్చుకునేవాళ్ళమట. మళ్ళీ ఆ రోజుల్లోకి వెళిపోతే ఎంత బాగుంటుందో కదా.
Kottapali said…
రసజ్ఞ, మనోజ్ఞ, రసవత్తరంగానూ మనోజ్ఞంగానూ ఉంది. ఐతే నా ఉద్దేశం జ్ఞాపకాల్ని తల్చుకోవడమే తప్ప వెనక్కి వెళ్ళాలని కాదు. జీవితం ఎప్పుడూ ముందుకే అని మీరూ ఏకీభవిస్తారనుకుంటాను.
Disp Name said…
భద్రం కర్ణేభి శృణుయామ దేవా


జిలేబి.
Kottapali said…
Zilebi గారు, అంటే చెవులు జాగ్రత్త, దేవతలెత్తుకుపోతారు అనా? :)
Disp Name said…
@కొత్త పాళీ గారు,

అయ్య బాబోయ్,

ఆ ఒక్కటీ అడక్కూడదండీ !

హుష్! టాప్ సీక్త్రేట్!

చీర్స్
జిలేబి.
మేధ said…
వాహన పూజలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి ఆంజనేయ స్వామికి.. ఎంతలా అంటే, విజయవాడ మొత్తంలో ఎక్కడ, ఎవరు ఏది కొన్నా, అక్కడ వాహన పూజ చేయించకపోతే ఇబ్బందులు వస్తాయి అనేంతగా!

మా ఇంటికి దగ్గరలోనూ ఆంజనేయ స్వామి గుడే.. నేను ప్రొద్దునే చదువుకోవడానికి లేచినప్పుడు, ఆ పాటలు వింటూ, గడిచిపోతూ ఉండేది.. అప్పట్లో లవ-కుశ సినిమా పాటలు కూడా పెడుతుండేవారు.. ఏ నిమిషానికి ఏమి జరుగునో పాట నాకు ఎప్పుడూ నోట్లో ఆడే పాట :)
మాలతి said…
అవునండి శృతపాండిత్యంలో మనం నేర్చుకునే అంశాలు మనకే అర్థమవుతుంది. ఆమధ్య ఒక అమెరికన్ స్నేహితురాలు నాకు ఒక వ్యాసం చూపింది. ఆ వ్యాసకర్త మనచదువులగురించి రాసినమాటలు - రాతియుగంనాటి పుస్తకాలు వల్లె వేస్తూ చాలా వెనకబడి ఉన్నారు. వీళ్ళకి కంప్యూటరులిచ్చి, ఆధునికవిద్యలు మనమే పూనుకుని నేర్పాలి అని.
హుమ్. ఎవరు వెనకబడి ఉన్నారో!!!
chavera said…
తిరుపతి లో వేసవిలో వచ్చే గంగ జాతర ,
చేదుజ్ఞాపకాలనే గుర్తుకు తెస్తుంది.
కంటి మెర మెర లా , చెవులో దూరిన పురుగులా,
చెప్పులోని రాయి లా , నా సొంత వూరు మధురాను భూతు లలో ,
ఒకమరచిపోవలసిన బూతు జ్ఞాపకం.