ఆహా ఎట్టకేలకు మా ఊరికి వసంతమొచ్చిందని మురుసుకున్నది మొన్ననే అన్నట్లుంది .. చూస్తుండగానే వేసవి కూడా ఆ దారినే వెళ్ళిపోయింది.
కార్తీక మాసపు పేరంటాలకి వెళ్ళడానికి రంగు రంగుల పట్టుచీరలు కట్టి ముస్తాబవుతున్న ముత్తైదువల్లాగా చెట్లన్నీ సింగారించుకుంటున్నాయి. ఈ క్షణంలోని అందాన్ని అనుభవించి ఆనందించలేని నేనేమో .. అయ్యో ఇంకొన్ని రోజుల్లో ఇవన్నీ మోడులైపోతాయి గదా అని విచార పడుతుంటాను.
పాశ్చాత్యులకి నాలుగే ఋతువులు .. స్ప్రింగ్, సమ్మర్, ఆటం, వింటర్ .. వెరసి ఫోర్ సీజన్స్. వివాల్డి అనే వెనీషియన్ తుంబురుడు ఆ పేరిట ఒక అద్భుత సంగీత మాలికని రచించి ప్రకృతిమాతకి అలంకరించాడు. స్ప్రింగ్ అంటే వసంతం, సమ్మరంటే గ్రీష్మం లేదా వేసవి, వింటరంటే చలి కాలం. గొడవంతా ఆటం దగ్గరే వస్తుంది. నెలల ప్రకారం చూస్తే మన ఊళ్ళలో ఇప్పుడు శరదృతువు. ప్రకృతి పరిణామాల ప్రకారం చూస్తే ఇక్కడ ఇది శిశిర ఋతువు (ఆకురాలు కాలం). విపరీతంగా చేమంతి పూలు కూడా పూస్తాయి కాబట్టి హేమంతం అనికూడ అనుకోవచ్చు. మన ఊళ్ళో చలికాలం ఐపోయాక రాబోయే వసంతానికి సూచనగా శిశిరంలో వేపలాంటి కొన్ని చెట్లు ఆకులు రాలుస్తాయి. ఇక్కడ కోనిఫర్ జాతి వృక్షాలు తప్పించి మిగతావన్నీ, ఆఖరికి మొక్కలూ పొదలూ కూడా, భయంకరమైన చలికాలానికి సన్నద్ధమయే ప్రయత్నంలో ఆకులు రాలుస్తాయి. ఈ ఆకురాలు కాలం, లోలోపలి రక్తనాళాల్ని కూడా గడ్డకట్టించే చలికి చోపుదారు, వెచ్చబరిచే వసంతానికి కాదు.
ఈ అమెరికా వాళ్ళది ఎడ్డెమంటే తెడ్డెమనే వ్యవహారం కాబట్టి ఇంగ్లీషువాళ్ళు "ఆటం" అని పెట్టుకున్న పేరుని కాదని వీళ్ళు సొంత బుర్రతో ఆలోచించి దీనికి "ఫాల్" (fall) అని నామకరణం చేశారు .. ఎందుకంటే ఆకులు రాలతాయి కాబట్టి! సంవత్సరానికి మొదలు కాదు. ఋతువుల్లోనూ మొదటిది కాదు. కానీ బడులూ విశ్వవిద్యాలయాలూ ఫాల్ సెమిస్టరుతోనే ప్రారంభమవుతాయి. అనేక కళాసంస్థల ప్రదర్శన సీజను ఫాల్‌తోనే మొదలవుతుంది.
సాధారణంగా సెప్టెంబరు చివరికల్లా చిరు చలి మొదలవుతుంది ఒక స్వెటరో పల్చటి కోటో వేసుకుంటే బాగుండు అనిపిస్తుంటుంది. చెట్ల ఆకులు మెల్లగా ఆకుపచ్చ నించి పసుపు, నారింజ, ఎరుపు రంగులు పులుముకుంటూ ఉంటాయి. ఉన్నట్టుండి ఒక రాత్రి ఉత్తరాన్నించి ఒక గాలివాన వస్తుంది. దాని విసురుకి మొదటి విడత ఆకులు రాలిపడతాయి. నిన్నటికంటే ఇవ్వాళ్ళ ఉష్ణోగ్రత ఒక ముప్ఫై డిగ్రీలు (మేం ఫారెన్ వాళ్ళం కదా, మాది ఫారెన్‌హీటు లెండి :)) పడిపోతుంది. దాంతో అధికారికంగా ఫాల్ ప్రవేశించినట్లే!
అట్లా రంగు మారటం మొదలు పెట్టిన ఆకులు నాలుగైదు వారాల పాటు వర్ణార్ణవ తరంగాలవుతాయి. తమాషా చెయ్యటానికి అన్నట్టు సృష్టికర్త ఒక కుంచె పట్టుకుని కొద్ది సేపు మోనే వేషం వేసుకుంటాడు. నేనేం తక్కువ తిన్నానా అని సర్వసాక్షి పడమటి నింగిపై సిందూరం చల్లుతుంటాడు. ప్రకృతి మొత్తం ప్రదర్శనకి సిద్ధమౌతున్న మహానటిలా అలంకారం చేసుకుంటూ ఉంటుంది. ఆ అలంకారమే అసలు ప్రదర్శన అని మనం గ్రహించే లోపలే ఒక అద్భుతమైన రంగులవల మనమీద పరుచుకుని సమ్మోహితుల్ని చేసేస్తుంది.
చూస్తూ చూస్తూ ఉండగానే .. ప్రదర్శన ముగిసిపోతుంది. రంగుల ప్రపంచం మీద ఒక తెల్లటి మంచు తెర కప్పబడుతుంది.
దాని అందాలు .. మరోమాటు .. సందర్భోచితంగా ..
***********************
(వివాల్డి వికీ పేజీ చివర ఫోర్ సీజన్స్ సంగీతపు తునకలు ఉన్నాయి వినవచ్చు.)

Comments
ఒక కాలంలో నేను ఉత్తర సంయుక్త రాష్ట్రాలలోనే ఉద్యోగాలు వెదుక్కొనేవాణ్ణి!
మీకు మంచు పడ్డప్పుడు ఒక పెట్టిలో పెట్టి, మాకు పంపించి పుణ్యం కట్టుకోండి! :)
-నేనుసైతం
btw, fall always reminds me of a funny drive-out day we had once..to please our visitors we had to take them to Shenendoah valley and then to the skyline drive. Skyline drive just before fall might be a beautiful one, but after fall it was very much like the location of 'blairwitch project' :)
బ్లాగేశ్వర - "మంగళ సూత్రమ్మునెంత మది నమ్మినదో" - ఆ పద్యమేనా?
రాకేశ్వర - ఎందుకు నాయనా "బ్లూ"? "బ్రౌను"ని మరీ రుద్దుకుంటున్నావేమో?? :-) లేకపోతే ఈ దేనవారటమేవిటి? మిషిగన్ విడిచాక రెండున్నరేళ్ళున్నాను మాతృ భారతంలో, ఒక్కసారికూడా మంచుని మిస్సవలేదు :-)
నేనుసైతం - ఆ సినిమా చిన్న చిన్న ముక్కలు చూశాను కానీ పూర్తిగా చూళ్ళేదు. నా వర్ణన నచ్చినందుకు థాంకులు.
గిరీ - మీరు చెప్పిన ఫొటో చూళ్ళేదు గానీ నా పనిప్రదేశం వెనకాతల ఒక చిన్న అడవి ఉంది. ఋతువుకి ఒక బొమ్మేం ఖర్మ, రోజుకో బొమ్మ తీసి ఒక flip book చెయ్యాలనుంది .. చేస్తానెప్పుడో. మీరు చెప్పింది నిజమే. నా మురిపెమంతా ఈ వారమే. వచ్చేవారం రాలిన ఆకుల్ని బస్తాలకెత్తేప్పుడు ఉంటుంది, బ్లేర్ విచ్చి ప్రాజెక్టు దేవుడెరుగు, బ్రేకు నీ బ్యాకు (break your back) కాకుటే చాలు :-)
@శ్రీరాం - పద్మగారన్నట్టు ఏకాలపు అందం దానిదే .. రేపొక రెండడుగుల మంచు పడితే దానికీ ఇంత పులకిస్తానేమో!
పద్మగారిచ్చిన వికీ వ్యాసం చదువుతుంటే గుర్తొచ్చింది, టపాలో చెప్పడం మర్చిపోయాను. వెర్మాంట్ అనే రాష్ట్రం ఈ ఫాల్ రంగుల ప్రదర్శనకి పెట్టింది పేరు. రెండొందల మైళ్ళ దూరంలో ఉన్న బాస్టను నగరం నుండి వెర్మాంట్‌కి ఈ సమయంలో వారాంతాల్లో ప్రత్యేక రైళ్ళు నడుపుతారు, కేవలం ఈ రంగులు చూసి ఆస్వాదించడానికి. మిషిగను రాష్ట్రమంతా బల్లపరుపుగా ఉంటుంది, కానీ ఏనార్బరు నగరంలో చిన్న నది లోయ వల్ల కొద్దిగా ఎత్తుపల్లాలుంటాయి. ఫుల్లర్ అనే రోడ్డు మీద వెళుతుంటే భవనాల మధ్యలోనించి పూర్తి నగర వాతావరణంలో వెళుతుండగా, ఒక చోట రోడ్డు తొంభై డిగ్రీల మలుపు తిరుగుతుంది. ఆ చోటు కొంత ఎత్తులో ఉంటుంది. ఆ మలుపు తిరిగేప్పటికి ఎదురుగా హ్యూరాన్ నది లోయ దట్టంగా చెట్లతో నిండి కనుచూపు మేర పరుచుకుని ఉంటుంది. ఫాల్‌లో ఆ దృశ్యం అందం చెప్పనలవిగాదు.
కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై
ఈ యడవి దాగిపోనా ఎట్లైన నిచటనే యాగిపోనా?
...
తరు వెక్కి యల నీలగిరి నెక్కి మెలమెల్ల
చద లెక్కి జలదంపు నీలంపు నిగ్గునై
ఈ యడవి దాగిపోనా ఎట్లైన నిచటనే యాగిపోనా?
మీ రాత నాతో ఓ కూని రాగం తీయించింది. నెనర్లు!
// చూస్తూ చూస్తూ ఉండగానే ప్రదర్శన ముగిసిపోతుంది. రంగుల ప్రపంచం మీద ఒక తెల్లటి మంచు తెర కప్పబడుతుంది. //
జీవితమే ఒక నాటకరంగం, ప్రకృతి అందులో ఒక అంకం అన్నట్టు బాగా చెప్పారు.
prakruti varnana chaalabaagundi
excellent. unread recently
bolloju baba
ఆటం అను పదాన్ని అనువదించటానికి శిశిరమనాలా, లేక శరత్ ఋతువనాలా అని సందేహమొచ్చి నెట్ లో వెతుకుతూంటే మీ పోస్టు కనపడి పొగమంచు తొలగించింది. ఎందుకంటే సంస్కృత నిఘంటువులో ఆటం ని శరత్ అనీ, తెలుగు నిఘంటువులలో ఆకు రాలు కాలమనీ ఉంది.
నేను శరత్ ఋతువు గానే అనువదిస్తున్నానండి.
థాంక్సండీ
బొల్లోజు బాబా
పి.ఎస్. లోగడ కామెంటినట్టున్నాను. మందమతిని. హి.హి. హి. :-)
మాల, ఇందు, మీకు నచ్చినందుకు సంతోషం.
Radhika (nani)