శ్రీ రామ నవమి

"తల్లిగా జానకీ!

మనం మాట్లాడుకుని చాలా రోజులయిందమ్మా.
అప్పుడప్పుడూ భద్రాచలం వస్తూనే ఉన్నాను. అయిదారు రోజులు ఆగుతూనే ఉన్నాను. అమ్మని పలకరించ డానికి అవకాశమే కనబడదు. వచ్చే జనానికి అంతూ పొంతూ లేదాయె. వచ్చిన వాళ్ళు తమకి కావాలిసిందేదో ఆయనతో మాట్లాడుకుని వెళ్తారేమో అంటే అయన పిలిస్తే పలకడాయెను.
పలుకే బంగారమట!
అంత ఇదేమిటో?
పాలక్కపోతే మన అదృష్టం ఇంతే అనుకుని పోనీ ఆ వచ్చిన వాళ్ళు తిరిగి పోతారా? ఊహూ. పక్కన నువ్వున్నావుగా, జాలిపడే తల్లివి. 'సీతమ్మ తల్లీ! నీవైనా చెప్పవమ్మా' అని కొందరు, విభునికి మా మాట వినిపించవమ్మా అని కొందరు,  తీస్తూ నీ చుట్టూ మూగుతారు. నీకీ సిఫార్సులతోనే సరిపోతుంది. ఎప్పుడూ ఇదే మేళం. ఇంకా నీ దగ్గర కూచునేదెప్పుడు?

వాళ్ళందర్నీ తప్పించుకుని ఎదరకి వద్దామా అనుకుంటూ ఉంటాను. రావచ్చు గానీ, పాపం వాళ్ళంతా ఎక్కడెక్కడి నించో ఎన్నెన్నో కోరికలతో వస్తారని, వాళ్లకి అడ్డొస్తే బాధ పడతారని ఎప్పటికప్పుడే వెనక్కి తగ్గుతుంటాను. మొన్నటి తఫా అట్లాగే ఉండుండి వెళ్ళిపోయాను. వెళ్లిపోయానన్న మాటే గానీ, మనసంతా ఇక్కడే ఉంది. ఎలాగా మళ్ళీ రాదలచుకున్నాను. కనుక, ఆ వచ్చేది కల్యాణానికే వద్దామనిపించి ఈ సమయానికి వచ్చాను. యాత్రీకుల హడావిడి అంతా అయ్యేదాకా ఆగాను. కళ్యాణం ఇదివరకు కూశాననుకో, ఎన్ని సార్లు చూసినా చూడవలసిందేగా అది. ఏవంటావా? ఎంతమంది కావలేదు పెళ్లిళ్లు? పార్వతీ పరిణయాలూ, రుక్మిణీ కళ్యాణాలూ, జాంబవతీ పరిణయాలూ, ఎన్నో వందలు, వేలు ఉన్నాయి. ఉంటే? అవన్నీ పుస్తకాల్లో ఉండేవే! ఇట్లా మహా వైభవంగా ఇన్నివేల లక్షలు జనం కలిసి ఏటేటా ముచ్చటగా చేసుకునేది సీతాకల్యాణం ఒక్కటేనమ్మ! ఉంది దాన్లో ఎదో విశేషం. విశేషం అంటే లోకమంతా అనుకునే విశేషం. ఒక్క సంగతి చూడు - నీ వివాహం అయినా తరవాత లోకంలో ఎన్నో కోట్లు అద్భుతంగా అయ్యాయి కదా పెళ్లిళ్లు, ఇన్ని పెళ్ళిళ్ళకీ శుభలేఖల్లో ఓ మంగళ శ్లోకం వేస్తూ ఉంటారు. ఎప్పుడైనా చూసావా? చూసి ఉండవ్. ఏ ధన్యాత్ముడు రాశాడో, ఏనాడు రాశాడో చెప్పలేం గానీ మా మంచి శ్లోకం.

జానక్యా  కామలామలాంజలి పుటే యా పద్మరాగాయితాః
నస్త్యాహ్ రాఘవ మస్తకేచ విలసత్ కుండా ప్రసూనాయితాః
స్రస్తాహ్  శ్యామల కాయకాన్తి కలితాః యా ఇంద్రనీలాయితాః
ముక్తాస్సా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాః

అనే ఈ శ్లోకం ప్రతి శుభలేఖలోనూ కనబడక తప్పదు. లోకంలో ఇన్నిసార్లు అచ్చు పడ్డ శ్లోకం మరొకటి లేదనుకో.
ఏమి శ్లోకం?
మీ కల్యాణ మాంగల్య శోభంతా ఈ శ్లోకంలో ప్రతిఫలిస్తుంటుంది.
బిడియ పడుతూ సంబర పడుతూ ఎంత ముచ్చటగా తలంబ్రాలు పోశావమ్మా!"

గమనిక 1:
ఇది నా రచన కాదు.
బొమ్మలో చూపించినట్లు, కళాప్రపూర్ణ దువ్వూరి వేంకట రమణ శాస్త్రి గారి చిన్న ముచ్చటైన వ్యాసం, జానకితో జనాంతికం అనే రచనలో మొదటి కొద్ది భాగం. తెలుగు వ్యాకరణ పండితులు, విద్యా ఉద్యోగ విషయాల్లో యాభయ్యేళ్లకు పైబడి పరమ గ్రాంధికం తప్ప మాటవరసకు కూడా వ్యావహారికం ముట్టని మహాపండితులు, రాయడమంటూ మొదలు పెడితే ఎంత కమ్మటి వ్యావహారిక భాష రాస్తారో తెలుసుకోవాలంటే, ఈ చిన్ని వ్యాసంతో పాటు శ్రీ శాస్త్రిగారి సువీయ చరిత్ర కూడా చదవాల్సిందే.
రెండూ కలిపి అందమైన బాపు బొమ్మ ముఖ చిత్రంగా తిరుపతి రాజాచంద్ర ఫౌండేషన్ వారు 2012 లో సుందరంగా ప్రచురించారు. ప్రతులు ఇంకా దొరుకుతూ ఉండొచ్చు.


గమనిక 2:
పదేళ్లు దాటిన మరో సీతాకల్యాణం ముచ్చట నా మాటల్లో
http://kottapali.blogspot.com/2009/04/6.html


గమనిక 3:
మరో చక్కటి బ్లాగు, ఎవరో భారతి గారుట.
http://smarana-bharathi.blogspot.com/2013/04/blog-post.html


సర్వే జనాః సుఖినో భవన్తు
  

Comments

MURALI said…
బ్లాగులు తెరవటానికి సిరికిం చెప్పడు.. తీరున రాముడే వచ్చాడు :)
పునః స్వాగతం సార్.

నిన్న ఒకాయన నా బ్లాగ్ లో కమెంట్ పెట్టారు
"మీ బ్లాగ్ హిస్టరీ చూస్తుంటే సీనియర్ బ్లాగర్ లా ఉన్నారే"
అని. నాకు మీరే గుర్తొచ్చారు. నేను సీనియర్ అయితే
మీరేంటా? అని :)
Kottapali said…
నేనా?
కురు వృద్ధుడినేమో?
☺️☺️