Monday, September 26, 2011

తెలుగు పాఠం - సెప్టెంబరు 27

తెలుగు పాఠం చెప్పి చాలా వారాలైంది, భక్తులందరూ ఆదమరచి హాయిగా నిద్రావస్థలోకి జారుకుంటున్నారేమోనని మేలుకొలపడానికొచ్చా.

ఈ మధ్యన బ్లాగుల్లో కొంచెం తరచుగా కనబడిన రెండు వాడుకల గురించి కొంచెం చెప్పాలనిపించింది.

ఒక చోట ఏదో రచనని పరామర్శిస్తూ "సునిశితమైన హాస్యం" అన్నారు. మరి అక్కడ సమీక్షకులు ఇచ్చిన ఉదాహరణల్లో నైశిత్యమేమీ కనబళ్ళేదు నాకు. ఇంచుమించు ఇలాంటి వాడుకే ఇంకొన్ని చోట్ల కనడేసరికి ఇదేదో కొంచెం దృష్టి పెట్టవలసిన విషయం అనిపించింది.
నిశితము అంటే పదునైనది. సు అంటే మంచి. వెరసి సునిశితము అంటే మాంఛి పదునైనది అని అర్ధం.
హాస్యం సునిశితంగా ఉండకూడదనేం లేదు, ఉండొచ్చు. వ్యంగ్యంలో పుట్టిన హాస్యంలో కనిపిస్తుంది ఇటువంటి పదును. సాధారణంగా హాస్యం కితకితలు పెట్టి నవ్విస్తుంది. అంతమాత్రాన అది సునిశిత హాస్యం కానక్కర్లేదు. కొన్నిచోట్ల హాస్యం సున్నితంగా ఉంటుంది. అంటే, పైకి స్పష్టంగా జోక్‌లాగా కనబడకుండా ఆ వాక్య నిర్మాణం వల్ల, మాట విరుపు వల్ల, చమత్కారం వల్ల హాస్యం పుడుతుంది.
దృష్టి సునిశితంగా ఉండొచ్చు. విశ్లేషణ, విమర్శ కూడా సునిశితంగా ఉండొచ్చు. అంటే విషయంలోని పైపై పొరల్ని ఛేదించి, పదునుగా అసలు విషయంలోకి చొచ్చుకు పోతాయి అన్న మాట.
సునిశితమైన హాస్యం అని వాడేముందు ఆ హాస్యం నిజంగా పదునుగా ఉందో లేదో చూసుకుని వాడితే మంచిది.

ఈ రెండో వాడుక, బ్లాగర్లేమి, బాగా చెయ్యి తిరిగిన రచయితలు కూడా తరచూ తప్పుగా వాడుతుంటారు.
గొప్ప కరుణ, గొప్ప ప్రేమ అనే ఉద్దేశంలో "అవ్యాజమైన కరుణ, అవ్యాజమైన ప్రేమ" అని చాలా చోట్ల చదివాను. ఒకరెవరో రాశారు, శ్రీరామచంద్రునికి హనుమంతుడంటే అవ్యాజమైన ప్రేమ అని.
వ్యాజము అంటే కారణం, నెపం. అవ్యాజం అంటే కారణం లేనిది, అకారణం.
అవ్యాజమైన కరుణ అంటే, కారణం లేకుండా కలిగిన కరుణ. అది గొప్ప కరుణ అయితే అయి ఉండొచ్చు, కానీ ఇక్కడ అవ్యాజమనే విశేషణం గొప్ప అనే పరిమాణానికి సూచనకాదని గ్రహించాలి. శ్రీరామునికి హనుమంతునియందు ప్రేమ ఉండడానికి చాలా కారణాలే ఉన్నాయి. లలితా సహస్రనామంలో (ఇవ్వాళ్టినించీ దేవీ నవరాత్రులు కదా!) అమ్మవారిని "అవ్యాజ కరుణామూర్తి - రజ్ఙానధ్వాంతదీపికా!" అని కీర్తించారు. అంటే మనం ఆమె కరుణకి అర్హులము కాకపోయినా ఏ కారణమూ లేకుండానే కరుణిస్తుందని.

పనిలో పనిగా యువమిత్రుడు సందీప్ వ్యాజస్తుతి అనే అర్ధాలంకారాన్ని గురించి సోదాహరణంగా రాసిన చక్కటి టపా ఇక్కడ.

పాఠం చెప్పినాక పరీక్ష లేకుండా ఎలా?
కింది పదాలకి మీ చేతనైనట్టు అర్ధాలు చెప్పండి, నిఘంటువుల్లో జాలంలో వెతక్కుండా!
అర్ధాలు రాసిన వ్యాఖ్యల్ని రెండు రోజుల తరవాత ప్రచురిస్తాను.

కాటు
పోటు
నాటు
మాటు
చేటు

అతడు నేను లోయచివరి రహస్యం

Thursday, September 22, 2011

అనువాదం

ఇది తెలుగు kalateeta tel ఇది ఇంగ్లీషు Kalateeta Eng అయ్యా, అదీ సంగతి.

Thursday, September 8, 2011

ఆంగ్లహారం

ఈ టపాకి శీర్షిక రాస్తుంటే భరతశాస్త్రంలో అసంయుక్త హస్తవినియోగం శ్లోకశకలం గుర్తొచ్చింది - సర్లెండి, ఆదిలోనే హంసపాదు. అసలు కథ మొదలెట్టకముందే పిట్టకథ అంటే జనాలు తంతారు గనక అసలు కథకొచ్చేద్దాం, ఈ మధ్యన హారం వారు కొన్ని మార్పులు, మరింత భారీగా చేర్పులు చేసేశారు వారి సంకలినికి. ముఖ్యమైన చేర్పేవిటయ్యా అంటే, నేరుగా ముఖపత్రంలోనే దేశీయ ఆంగ్లబ్లాగుల సంకలినిని ప్రదర్శిస్తున్నారు. దాంతో కొన్ని ఇబ్బందులెదురవుతున్నాయి. ఒకటి, తెలుగు బ్లాగ్లోకంలో ఏం జరుగుతున్నదో చూద్దామని బయల్దేరిన నా లక్ష్యాన్ని నేరుగా చేరుకోలేకపోవడం. సరే - కొద్దిగా ఆలస్యమైనా పరవాలేదు. అంతకన్న దారుణమైన ఇబ్బంది ఇంకోటున్నది. ఎదురుగా పేజీ ప్రత్యక్షమైతే చదవగలిగిన నాలుగు ముక్కలూ చదవకుండ వొదిలిపెట్టముగదా. ప్రత్యక్షమైన పేజీని కనులు స్కాన్ చేసే నాలుగు క్షణాల్లోనే ఏదో ఒక ఆంగ్లటపా శీర్షిక ఆ కళ్ళని ఆకర్షిస్తున్నది. ఆ లంకెని నొక్కడం - అరె, వీళ్ళెవరో భలే రాశారే అనుకోవడం, బుక్ మార్కు చేసుకోవడం. తెలుగు బ్లాగుల్లోకి వెళ్ళాలనే ఆలోచన గోవిందా గోవింద. అయ్యా, అదీ సంగతి. హారం వేపు వెళ్తే మాత్రం తస్మాత్ జాగ్రత. (మనలోమాట, ఆంగ్లంలో రాస్తున్న జనాభా మా పసందుగా రాస్తున్నారుకూడా!) ఈ తప్పటడుగుల్లో (పక్కటడుగుల్లో??) నేను కనుగొన్న కొన్ని ముత్యాలు (ఆణివో కాదో మీరే చెప్పాలి) http://eternalwanderingsoul.com/ http://sujathasathya.blogspot.com/ http://karvediat.blogspot.com/ http://kranjani.wordpress.com/2011/07/30/ http://whataworldagain.wordpress.com http://www.sandeepweb.com/ http://dearpseudodiary.blogspot.com/ http://debolinasbooks.blogspot.com/