తెలుగు పాఠం - సెప్టెంబరు 27

తెలుగు పాఠం చెప్పి చాలా వారాలైంది, భక్తులందరూ ఆదమరచి హాయిగా నిద్రావస్థలోకి జారుకుంటున్నారేమోనని మేలుకొలపడానికొచ్చా.

ఈ మధ్యన బ్లాగుల్లో కొంచెం తరచుగా కనబడిన రెండు వాడుకల గురించి కొంచెం చెప్పాలనిపించింది.

ఒక చోట ఏదో రచనని పరామర్శిస్తూ "సునిశితమైన హాస్యం" అన్నారు. మరి అక్కడ సమీక్షకులు ఇచ్చిన ఉదాహరణల్లో నైశిత్యమేమీ కనబళ్ళేదు నాకు. ఇంచుమించు ఇలాంటి వాడుకే ఇంకొన్ని చోట్ల కనడేసరికి ఇదేదో కొంచెం దృష్టి పెట్టవలసిన విషయం అనిపించింది.
నిశితము అంటే పదునైనది. సు అంటే మంచి. వెరసి సునిశితము అంటే మాంఛి పదునైనది అని అర్ధం.
హాస్యం సునిశితంగా ఉండకూడదనేం లేదు, ఉండొచ్చు. వ్యంగ్యంలో పుట్టిన హాస్యంలో కనిపిస్తుంది ఇటువంటి పదును. సాధారణంగా హాస్యం కితకితలు పెట్టి నవ్విస్తుంది. అంతమాత్రాన అది సునిశిత హాస్యం కానక్కర్లేదు. కొన్నిచోట్ల హాస్యం సున్నితంగా ఉంటుంది. అంటే, పైకి స్పష్టంగా జోక్‌లాగా కనబడకుండా ఆ వాక్య నిర్మాణం వల్ల, మాట విరుపు వల్ల, చమత్కారం వల్ల హాస్యం పుడుతుంది.
దృష్టి సునిశితంగా ఉండొచ్చు. విశ్లేషణ, విమర్శ కూడా సునిశితంగా ఉండొచ్చు. అంటే విషయంలోని పైపై పొరల్ని ఛేదించి, పదునుగా అసలు విషయంలోకి చొచ్చుకు పోతాయి అన్న మాట.
సునిశితమైన హాస్యం అని వాడేముందు ఆ హాస్యం నిజంగా పదునుగా ఉందో లేదో చూసుకుని వాడితే మంచిది.

ఈ రెండో వాడుక, బ్లాగర్లేమి, బాగా చెయ్యి తిరిగిన రచయితలు కూడా తరచూ తప్పుగా వాడుతుంటారు.
గొప్ప కరుణ, గొప్ప ప్రేమ అనే ఉద్దేశంలో "అవ్యాజమైన కరుణ, అవ్యాజమైన ప్రేమ" అని చాలా చోట్ల చదివాను. ఒకరెవరో రాశారు, శ్రీరామచంద్రునికి హనుమంతుడంటే అవ్యాజమైన ప్రేమ అని.
వ్యాజము అంటే కారణం, నెపం. అవ్యాజం అంటే కారణం లేనిది, అకారణం.
అవ్యాజమైన కరుణ అంటే, కారణం లేకుండా కలిగిన కరుణ. అది గొప్ప కరుణ అయితే అయి ఉండొచ్చు, కానీ ఇక్కడ అవ్యాజమనే విశేషణం గొప్ప అనే పరిమాణానికి సూచనకాదని గ్రహించాలి. శ్రీరామునికి హనుమంతునియందు ప్రేమ ఉండడానికి చాలా కారణాలే ఉన్నాయి. లలితా సహస్రనామంలో (ఇవ్వాళ్టినించీ దేవీ నవరాత్రులు కదా!) అమ్మవారిని "అవ్యాజ కరుణామూర్తి - రజ్ఙానధ్వాంతదీపికా!" అని కీర్తించారు. అంటే మనం ఆమె కరుణకి అర్హులము కాకపోయినా ఏ కారణమూ లేకుండానే కరుణిస్తుందని.

పనిలో పనిగా యువమిత్రుడు సందీప్ వ్యాజస్తుతి అనే అర్ధాలంకారాన్ని గురించి సోదాహరణంగా రాసిన చక్కటి టపా ఇక్కడ.

పాఠం చెప్పినాక పరీక్ష లేకుండా ఎలా?
కింది పదాలకి మీ చేతనైనట్టు అర్ధాలు చెప్పండి, నిఘంటువుల్లో జాలంలో వెతక్కుండా!
అర్ధాలు రాసిన వ్యాఖ్యల్ని రెండు రోజుల తరవాత ప్రచురిస్తాను.

కాటు
పోటు
నాటు
మాటు
చేటు

Comments

Vasu said…
కాటు - కరవడం
పోటు - నొప్పి, పొడవడం
నాటు - రా , సౌ , మాస్ (అన్నీ ఇంగ్లీష్ లోనే వచ్చాయ్ ):),
నేలలో పాతడం,కల్తీ లేని
మాటు - దాక్కుని, అతకడం (బిందేలకు మాటు వెయ్యడం విన్నట్టు గుర్తు) కూడా వస్తుందేమో
చేటు - చెడు, ఆపద,

అయితే ఆంజనేయుడికి రాముడి మీద ఉన్నది అవ్యాజమైన ప్రేమ, భక్తీ అంటారా ?
కాటు = నోటితో కరచుట
పోటు = లోపలికి దిగే దెబ్బ, రోట్లో రోకటితో వేసే లాంటిది, కత్తి వాడి వేసే పోటు.
నాటు = భూమిలో విత్తనాలు మొక్కలు నాటటం, రాళ్ళు నాటటం. భూమిలో స్థిరంగా ఉండేలా ఉంచటం
మాటు = చాటు , మఱుగు
చేటు = కీడు
పరీక్షలకు వేచి ఉన్నాం మరి.
కాటు - దెబ్బ ( కుక్క కాటు, పాము కాటు, కరువు కాటు...

పోటు - ఇది కూడా దెబ్బలాంటిదే.. వ్యాట్ పోటు, పన్నుపోటు, ఆటుపోటు, సూటిపోటు మాటలు,పెద్ద పోటుగాడు... ఇలా...

నాటు.. చెట్లు నాటడం.

మాటు - చాటున,

చేటు - కీడు
సునిశితమైన హాస్యం అని నేనూ చాలా సార్లు వాడాను.. అర్థం పూర్తిగా తెలియకుండానే. ఇప్పుడే అర్థమైంది. :)

ఇక మీ పరీక్ష కి నాకు తెలిసిన జవాబులు..

కాటు - పాము కాటు వేసింది అంటారు. అంటే విషం ఎక్కేలా కరవటం.
పోటు - పొడవటం (కత్తి పోటు, వెన్ను పోటు)
నాటు - unprocesssed/unsophisticated. (నాటు సరుకు)

మాటు - దాచి ఉంచబడినది.(మబ్బుల మాటున) ఈసారి అనటానికి ఈ మాటు అని వాడటం కూడా చూశాను.
చేటు - కీడు, అలాగే 'అంత చేటు చేస్తారా ఎవరైనా?' అనే వాడకం కూడా విన్నాను.
Anonymous said…
కాటు - బైట్ (ఉదా: పాము కాటు)
పోటు - పైన్, ఎక్కువవ్వడం (ఉదా: పన్ను పోటు, గోదావరి వరద పోటెత్తింది. నాది తూగోజి. గోదావరి కాపోతే ఇంకేం వస్తుంది నానోట?)
నాటు - (మొక్కలు వెయ్యడం). నారు (బహు వచనం). (ఉదా: నారు మడి)
మాటు - నక్కి ఉండడం రహస్యంగా (హైడ్ సెక్రెట్లీ) (ఉదా: జింకని పట్టుకోవడానికి వేటగాడు మాటు వేసాడు)
చేటు - ఏదో చెడు జరిగేది (ఉదా: వీడు మా కులానికి చేటు)

మన (నా) తెలుగు ఎంత అధ్వాన్న స్థితి కి జారిపోయిందంటే, తెలుక్కి అర్ధాలు ఇంగ్లీషులో చెప్తే కానీ తెలియట్లేదు. ఏమి సేతురా లింగా?
అన్నాజీ

కాటు - రకరకాల అర్థాలు. ఒకటి, పాలు కాటు బొయ్యాయి అంటారు. అంటే బాగా మరిగిపొయ్యాయి అనుకుంటాను
పోటు - అంటే పొంగటం, వెల్లువ (?) పోటెత్తిన జనం. ఏరు పోటెత్తింది.
నాటు - విత్తనాలు నాటు, నారు నాటు, నాటు అంటే దేశవాళి అనికూడా అనుకోచ్చు
మాటు - ఈ సారి అంటానికి కొందరు ఈ మాటు అంటారు. చీటికి మాటికి. నిశ్శబ్దం అనుకూడా అంటారనుకుంటాను. ఊరంతా మాటుమణిగి ఉంది అంటారు.
చేటు - హాని, ఆపద అనుకుంటాను
వాసు గారు,

అవును మాటు - బిందెలకి మాటు అన్నవాడకం ఉంది.. చాలా కాలం తర్వాత మళ్లీ ఇప్పుడే వినటం మీ ద్వారా.. థాంక్స్!


ఇక నాటు అనగానే (ఈ అర్థం తెలిసినా) మొక్కల నాట్లు అన్న అర్థం గుర్తు రాకపోవటం .. బహుశా.. ఒక్క సారి కూడా వాడకపోవటం అనుకుంటా, గ్రామీణ నేపధ్యం లేదాయె :-(
రసజ్ఞ said…
కొత్త పాళీ గారు
ఇంతమంది పండితుల ముందు మాట్లాడే అంతటి దానిని కాదు. కానీ ఏదో నా ఉడత ప్రయత్నం చేతదలచాను.
కాటు- ఇక్కడ జనాలు చెప్పినట్టు పంటితో కరవడాన్ని కాటు అంటారు , పాలు మాడితే కాటు వాసన వస్తోంది అంటారు
పోటు- అధికం అని చెప్పడానికి పోటు అంటారు అంటే వీడు పోటుగాడు అంటారు కదా! అలానే గోదావరిలో నీళ్ళు ఎక్కువగా ఉన్నా పోటెత్తింది అంటారు!, పొడవడం, ఇంక బాధ (పన్ను పోటు అంటారు కదా!)
నాటు- మొక్కలు నాటడం, నారు మళ్ళు, పచ్చి అని చెప్పడానికి నాటు అంటారు (ఎవరయినా పచ్చిగా మాట్లాడితే నాటుగా మాట్లాడుతున్నాడు అంటారు), అలాగే సహజసిద్ధంగా అని చెప్పడానికి నాటు అంటారు (నాటు టమాటాలు, నాటు కూరలు అంటారు) అలానే నాటు మనిషి అంటారు, ఎక్కువగా హంగులు లేకపోయినా నాటు అంటారు
మాటు- దాక్కోవడం, గిన్నెలకి వేసే మాటు, పులి మాటు వేసింది అంటారు
చేటు- చెడు చేయడం, ఆపద
ఉత్సాహంగా పాల్గొన్న సభ్యులందరికీ అభినందనలు. నిజానికి ఈ మాత్రం సమాధానాలు వస్తాయని ఊహించలేదు నేను. ఎందుకంటే ఇవి చాలా చిన్న మాటలూ, చాలా తరచు వాడే మాటలే అయినా, ఆధునిక జీవనంలో మరుగుపడిపోతున్న మాటలు. కృష్ణప్రియగారు అననే అన్నారు పల్లెలో పెరగక పోవడం వలన నాటు అంటే మొక్క నాటడం అని చప్పున స్ఫురించలేదని. మనం పట్టించుకోకపోతే మిగతా మాటలు కూడా మరుగున పడిపోతాయి. ఆపైన కేక, కెవ్వు, అదుర్స్ - ఇవే మిగుల్తాయి.
నా సమాధానాలు వచ్చే వారం పాఠంలో.
మాటు అంటే ఇంకో విధంగా కూడా వాడతారు. ఈమాటు, మరోమాటు వచ్చినప్పుడు ... ఇలా..

గిన్నెలకు వేసేది మాటు..
కాటు కరవడం
పోటు నొప్పి
నాటు పాతడం
మాటు వెనుక, దాగియున్న
చేటు చెడు, కష్టం

మీ టపా ఆలస్యంగా చూశాను. తెలియని విషయాలు తెలిశాయి. ఇలాంటి పదాలు ఇంకా పంపించండి.