Saturday, January 29, 2011

ఈ మధ్య చూసిన సినిమాలు - కాలహంస

Black Swan
ఈ సినిమాగురించి బయట బాజా బాకా - లోపల మాత్రం ఊక.
న్యూయార్కు నగరంలో ఒక ప్రసిద్ధ బాలే నాట్య కంపెనీ డైరెక్టరు (విన్సెంట్ కేస్సెల్, ఫ్రెంచ్ తార) తమ సరికొత్త సీజనుకి స్వాన్‌లేక్ నృత్యనాటకాన్ని ప్రదర్శించాలని నిర్ణయించాడు. తెలుగు నాటకాల్లో హరిశ్చంద్రుడూ, పాండవోద్యోగ విజయాలూ ఎలాగో, బాలేకి ఈ స్వాన్‌లేక్ నాటకం అలాగు - అత్యంత ప్రసిద్ధి చెందినదే కాక, ఇప్పటికే కొన్ని వందల కంపెనీలు లక్షల ప్రదర్శనలిచ్చి ఉన్నారు. మళ్ళీ ఇచ్చే ప్రదర్శనలో కొత్తగా చూపించేందుకు ఏంఉన్నది? ఉన్నది - నాటకంలో పరస్పరం విరుద్ధ మనస్తత్వాలతో ఉండే తెల్ల హంస - నల్ల హంస పాత్రలు రెంటినీ ఒకే హీరోయిన్ నర్తించాలనేది ఈ డైరెక్టరుగారి కొత్త ఊహ. ఆ ద్విపాత్రాభినయానికి అతడెంచుకున్న నర్తకి ఇరవయ్యయిదేళ్ళ నీనా అనబడే నేటలీ పోర్ట్‌మన్. ఒక్కటే సమస్య - నీనా మనస్తత్వం తెల్ల హంసలాగా, మంచిమంచిగా మెత్తమెత్తగా భయపడుతూ ఉలికిపడుతూ ముడుచుకుపోతూ ఉంటుంది తప్ప కాలహంసలాగా తెగింపుగా విరగబడుతూ విరుచుకుపడుతూ ఉండదు.

ఇప్పుడు ఈ తెల్లహంసలోనించి ఆ కాలహంసని బయటికి రప్పించడానికి ఆ దర్శకుడేం చేశాడు, ఆ ప్రక్రియలో నీనాలోని అంతర్బహిశ్చేతనలు పరస్పరం ఎలాంటి యుద్ధం చేసుకున్నాయి, ఈ యుద్ధంలో నీనా తల్లి, తోటి కళాకారులు (మిలా కూనిస్ వేడి పెనమ్మీద పెసరట్టులా సురసురమంది) ఎలాంటి పావులయ్యారు .. ఇదీ కథ.

కళల్లో సర్రియలిజపు సూచనలు, చారికలు నాకు చాలా ఇష్టం. కానీ ఈ సినిమాలో, మూలవిషయం ఆసక్తిగా ఉన్నా, రచయితలూ దర్శకుడూ, కథ పైనా ముఖ్యపాత్ర పైనా పట్టు సాధించలేక మొత్తానికి ఒక పదమూడేళ్ళ కుర్రాడి (కుర్రదాని?) మాస్టర్బేటరీ ఫేంటసీలాగా తయారైంది సినిమా. సాధారణంగా మంచిగా మెత్తగా ఉండే ఒకమ్మాయి (అసలు ఆధునిక ప్రపంచంలో, అందులో న్యూయార్కులో బాలే చేస్తున్న ఒక ఇరవయ్యయిదేళ్ళ ఆధునిక యువతి అలా ఎలాగైంది?) తన అంతశ్చేతనలో లోలోపలి పొరల్లో కప్పెట్టేసి ఉన్న వికృత స్వభావాన్ని తన నటనలో ప్రతిఫలించేందుకు బయటికి తియ్యాలంటే - ఏంటంటే - సారీ ముతగ్గా చెబుతున్నా, మరో విధంగా చెప్పే దారిళేదు - మాస్టర్బేట్ చేసుకోవాలని డైరక్టరుగారి సూచన! దానికి తోడు ఏదో డాక్యుమెంటరీ టైపు ఫీల్ రావాలని కాబోలు చాలా సీన్లలో కేమెరా స్థిరంగా ఉండకుండా చేత్తో పట్టుకుని ఉన్నట్టు ఊగుతూ తూలుతూ. మొత్తమ్మీద కళ్ళకి శ్రమ, తలకి నెప్పి. ఇప్పటిదాకా చూసిన సినిమాల్లో నేటలీ పోర్ట్‌మన్ చాలా అందంగా ఉన్నట్టు అనిపిస్తుండేది. ఈ సినిమాలో ఆమెని పరమ అందవిహీనంగా చూపించడానికి దర్శకుడూ ఛాయాగ్రాహకుడూ బాగా ప్రయత్నం చేశారు. బహుశా నీనాలోని వికృతస్వరూపాన్ని బయటకి తియ్యడంలో ఇదికూడా ఒక ప్రక్రియ కావచ్చు.

అసలు మూలవిషయమ్మీద స్పష్టత ఉన్నప్పుడు సర్రియల్ కథనంలో ఉండే పొరలూ, అస్పష్టతా బాగా రాణిస్తాయి. అంతేగాని కేవలం అస్పష్టత దానికదే ఒక విలువకాదు. మనిషిలో దాగి ఉండి, సాధారణంగా పైకి కనిపించని ఒక డార్క్ సైడ్‌ని గురించి కనీసం పంతొమ్మిదో శతాబ్దం నించీ పాశ్చాత్య రాచయితలు ఆసక్తులై ఉన్నారు, వివిధ ప్రక్రియల్లో దీన్ని శోధించారు. సినిమాల్లోనూ, ఈ ఇంటర్నల్ డార్క్ సైడ్‌కీ, లైంగికతకీ - అందులోనూ మామూలుగా బయటా సమాజంలా గుడీ టూషూస్ లాగా ఉంటూ ఉండే స్త్రీపాత్రల విషయంలో - ఈ సబ్జక్టుని అనేక పద్ధతుల్లో పరిశీలించారు. ఇన్నాళ్ళకి ఇన్నేళ్ళకి ఈ విషయమ్మీద, దర్శకుడూ అరనోఫ్‌స్కీ, ఇంకా రచయితలూ ఈ బ్లాక్ స్వాన్ ద్వారా కొత్తగా చెప్పినదేమీ లేదు. అసలు ఆ సబ్జక్టు గురించి లోతైన అవగాహన సంగతి పక్కన పెట్టండి, కనీస అవగాహన కూడా వీళ్ళకి ఉన్నట్టు కనబడదు. పూర్వకాలపు కేథొలిక్ మతగురువులు పిల్లకాయల్ని భయపెడుతూండే వారట - మాస్టర్బేట్ చేసుకుంటే లోపల ఉన్న సైతాన్ బయటికొస్తాడని - ఆ స్థాయిలో ఉంది వీళ్ళ వ్యవహారం. దర్శకుడు ఆరనోఫ్‌స్కీ ఈ మధ్యనే రెస్లర్ అనే కుస్తీ సినిమా తీశాడు. బాలే అంటే కుస్తీకి అప్పగారు అనుకున్నట్టు ఉన్నాడు, అదే పద్ధతులు దీంటోనూ ఉపయోగించాడు. నప్పలేదని వేరే చెప్పనక్కర్లేదు. పోగా సినిమా గురించి మొదలెట్టినప్పణ్ణించీ బాలే బాలే అని మొత్తుకుంటున్నాను కాబట్టి ఈ సినిమాలో చాలా బాలే ఉందనుకునేరు. కె. విశ్వనాథ్ సినిమా శంకరాభరణంలో శాస్త్రీయ సంగీతం ఎంత ఉన్నదో ఈ సినిమాలో బాలే అంత ఉన్నది - అంటే ఏమీ లేదు. లేకపోయినందువల్ల పెద్ద నష్టం లేదు. విశ్వనాథ్‌కి తన పాత్రలూ, వాళ్ళ ఆవేశాలూ, లోటుపాట్లూ క్షుణ్ణంగా తెలుసు. అందుకే శంకరాభరణం అంత రక్తి కట్టింది. ఆరనోఫ్‌స్కీకి తన ప్రధానపాత్రల గురించి దాదాపుగా ఏమీ తెలియదు.

ఈ సినిమాలో ఆస్వాదించదగినవి రెండు - నిరంకుశుడైన బాలే దర్శకుడిగా విన్సెంట్ కాస్సెల్, కనురెప్ప వాల్పులో సెక్సు కురిపించగల రసాధిదేవతగా మిలా కూనిస్.

Thursday, January 27, 2011

రాయాలి!

రాయాలి రాయాలి

బోలెడు రాయాలి

ఇంకా చాలా చాలా రాసెయ్యాలి

జీవితాన్ని ప్రతిబింబించేట్టు రాయాలి

మనసుల్ని తాకేట్టూ మనుషుల్ని కదిలించేట్టూ రాయాలి

నా వాళ్ళ కథలు రాయాలి నా గొంతు వినిపించ గలగాలి

రాసి నేనూ చదివి మీరూ ఏదో తెలీని ఆనందంలో తలమునకలయ్యేలా రాయాలి

కానీ రాయలేదు .. నెల ఐపోవస్తోంది! ప్చ్!!

Monday, January 24, 2011

గాన గంధర్వా! నమస్తే!ఎంత విచిత్రం?
సరిగ్గా ఇవ్వాళ్ళే త్యాగరాజస్వామి వారి ఆరాధన తిథి.
ఇప్పుడే ఈయన స్వర్గారోహణం.

అక్కడ త్యాగరాజస్వామితో కలిసి జుగల్బందీ చేస్తాడు కావును!

మొన్నటికి మొన్న వినాయకచవితి పండక్కీ, పండరిపూర్ యాత్రా సందర్భంగానూ పుణే నగర వీధుల్లో అనుకోకుండ ఈయన పాట ఎదురుపడితే నిశ్చేష్టుడినై, బయటికి వెళ్ళిన పని మరిచిపోయి ఆ సంగీతంలో తలమునకలై పోయిన అనుభవం ఇంకా పచ్చిగానే ఉంది. హేమంతపు రాత్రుల్లో తన గురువుగార్ని తల్చుకుంటూ మహామహుల్ని పుణేకి రప్పించి రాత్రింబవళ్ళు కచేరీలతో హోరెత్తించిన సవాయ్ గంధర్వ ఉత్సవ జ్ఞాపకం వెచ్చగానే ఉంది.

గాన గంధర్వా! నీ స్మృతికి మరుపెక్కడ! నిన్ను మరవాలంటే ఆ విమలగాంధర్వం మరపుకి రావాలి.

అది ఈ జన్మకి జరిగే పని కాదు.

Monday, January 3, 2011

కాదేదీ కవిత కనర్హం

ఏది కవిత్వం? ఏది కాదు?
తూచేందుకు గానీ సానబట్టేందుకు గానీ రాళ్ళున్నాయా?

మొన్నా మధ్య అఫ్సర్ గారి బ్లాగులో తోటి బ్లాగరి వంశీగారు, ముందు మెత్తగా ఇదేమి కవిత నాకు అర్ధం కాలేదు అంటూనే, తరవాత ధ్వజమెత్తారు, ఉప్పెనలా విరుచుకుపడ్డారు.


ఏది కవిత్వం? పెద్ద ప్రశ్నే!

మందార మకరంద మాధుర్యమున దేలు మధుపమ్ము వోవునే మదనములకు? అంటే, ప్రతిపదార్ధం చెప్పేందుకు తెలుగు అయ్యవారు అవసరపడతారుగాని అది కవిత్వం కాదనే ధైర్యం చెయ్యరెవ్వరూనూ.

మరి ఇది కవిత్వమా కాదా అన్న ప్రశ్న అల్లా వచన పద్యం దగ్గరే వస్తోంది.

పోనీ ఇది చూడండి - కవి పేరూ, పద్య శీర్షికా కావాలనే చెప్పట్లేదు. సమకాలీన సాహిత్యం బాగా పరిచయం ఉన్నవారికి తెలిసే ఉండవచ్చు, కానీ ఈ చర్చ వారి కోసం కాదుగదా - మనలాంటి వాళ్ళకోసం ఇది.

***
యవ్వనం చెవిలో ఎన్నెన్ని కామసూత్రాలు ఊదేడో?
పూల బాణాలతో కొట్టించి పూర్తిగా వివశురాలిని చేశాడు
ముగ్ధ మనస్సును అగ్నిగోళంలో తోశాడు
సూర్యుణ్ణి ఊహించి సుందరుణ్ణి ఊహించి
వేణిని జారేసుకుంది వోణీని జారేసుకున్నట్లు
తెలుసుకో లేక పోయింది మేక వన్నె పులి లాంటి
గెడ్డం పెంచుకున్న ముని కీచకుడి ముందు కాలు జారేసుకున్నట్లు ..
స్పృహ తెచ్చుకొన్నప్పటికి పొద్దు పొడిచింది

కుండపోతగా ఏడుస్తున్న కన్నెను
దున్నపోతుల్లా వచ్చి దీవించారు దేవతలు
ఆకాశం అడ్రసిచ్చి నిష్క్రమించాడు ఇనుడు
ఇంద్రుడికి ఈర్ష్య చంద్రుడికి నవ్వు
కడుపు శోకంతో కర్ణుణ్ణి కాల ప్రవాహంలో విడిచింది
కడుపు మంటలో కడుపు పంట గుర్తును
గుప్త పరుచుకొంది హిందూ రాజ్యాంగం
భారతాన్ని తెలుగు చేసిన రాజాశ్రిత కవి నన్నయ
కన్నె రేప్ గుట్టును మరింత రసవత్తరంగా రట్టు చేసి
మానభంగ సంస్కృతిని ఆర్ష ఆద్ర్శంగా ప్రకటించాడు
కన్నెలు గర్భవతులైతే కర్ణులూ భరతులూ పుడతారని
కవి సామ్రాట్టులూ కరుణశ్రీలూ ఖండ కావ్యాలు రాసి
భాషా ప్రవీణ వారసులతో
బడిపిల్లలకు బోధిస్తూ బులుపు తీర్చుకున్నారు

కళ్ళంలోనూ కాలిబాటల మీద హాస్టళ్ళ ముందు హాస్పటళ్ళ వెనుక
కన్నె పిల్లను కని వదిలేస్తుంది
ప్రభుత్వం అనాధ శరణాలయాలను చూపిస్తుంది
స్త్రీ శిశు సంక్షేమ బడ్జెట్టు మగ తేనెటీగలకు విందు చేస్తుంది
ఫ్యూడల్ సంస్కృతి పురిటిలోనే మీసమెత్తి పుడుతుంది

ఆనాటి కుంతి అవిశ్రాంతంగా ఆలోచిస్తూ బతికిపోయింది
నిన్నటి కుంతి నిరంతరం పెనుగులాడుతూ హత్య గావించబడింది
నేటి కుంతి
సంఘటిత పోరాటాల లోనికి అహ్వానించ బడుతోంది.

****

ఇది కవిత్వమేనా? ఐతే, ఎందుకు అవును? కాకపోతే, ఎందుకు కాదు?

Sunday, January 2, 2011

ది ఫైటర్ - తెరవెనుక కథ

ఈపాటికి తేదీలన్నీ గజిబిజి అయిపోయినై. ఈపాటికి మార్క్ వాల్బర్గ్ అందుకున్న నిరాకరణలని అన్నిటినీ ఎక్కడో తనమనసు లోతుల్లో పాతేశాడు. ఎన్నిసార్లు ఎవరెవరు ఈ సినిమాని నిరాకరించారు అని మార్క్‌ని అడిగి చూడండి, మనిషి ఉన్నట్టుండి మౌనం వహిస్తాడు పైకప్పు వేపుకి చూస్తూ. కాసేపాగి మెల్లగా అన్నాడు, "చాలా విషయాలు జరిగినై ఈ సినిమా గురించి." వెల్టర్ వెయిట్ బాక్సింగ్ ఛాంపియన్ మిక్కీ వార్డ్ జీవిత కథని తెరకెక్కించాలనే తన ఆశయాన్ని ఎందరితోనో పంచుకున్నాడు మార్క్ - గత అయిదేళ్ళలోనూ ఎందరో నటులు, దర్శకులు, స్టుడియో మేనేజర్లు ముందు ఆసక్తి చూపించడం, మెల్లగా పక్కకి జారుకోవడం. అయినా బాక్సింగ్ అభిమాని అయిన మార్క్ తన పట్టుదల వదల్లేదు, మిక్కీ పాత్రని విడవలేదు. పైగా తానే బాక్సింగ్ పోటీకి తయారవుతున్నట్టు శిక్షణ సాగించాడు. రానురాను, నిజంగా బాక్సర్ కాకపోయినా, అతి గొప్ప వెల్టర్ వెయిట్ బాక్సర్‌లాగా కనిపించసాగాడు. నేను బాక్సర్‌ని కాదు, అంటాడు నవ్వుతూ. కానీ ఈ సినిమాకోసం అతను పడిన కష్టం చూస్తే అతను బాక్సరే కాదు, బాక్సింగ్ చాంపియన్ అయినా ఆశ్చర్యం లేదనిపిస్తుంది.

లాస్ ఏంజిలస్ నగరానికి పశ్చిమంగా, కొండల్లో, పాంచెట్ల తోపు మధ్య తన ఇంటి వెనకాల ఉన్న సొంత జింలో ఉన్నాడు మార్క్ ఆ పూట. రెండున్నర వేల చదరపు అడుగుల ఈ జిం అతనికి మరో ఇల్లే అయింది ఇన్నాళ్ళూ. పూర్తి సైజు బాక్సింగ్ రింగ్, ఐదు బడ్వైజరు బీర్ చిహ్నాలతో సహా, 2003 లో పెట్టించాడు. ఇక ఎక్సర్సైజు మెషిన్లకైతే లెక్కే లేదు, ఎన్ని రకాలు ఉన్నాయో. గోడలమీద అక్కడక్కడా మొహమ్మద్ ఆలీ లాంటి బాక్సింగ్ హీరోల బొమ్మలు కొన్ని. బయట బోస్టన్ సెల్టిక్స్ టీం చిహ్నంతో పెయింట్ చేసిన బాస్కెట్ బాల్ కోర్టులో లియొనార్డో డికాప్రియో వంటి తోటి నటులతో అప్పుడప్పుడూ బాస్కెట్‌బాల్ ఆడుతుంటాడు మార్క్. అతని మనసులో ది ఫైటర్ సినిమా ఆలోచన ఎప్పుడోనే రూపుదిద్దుకున్నా, దాన్ని సాకారం చేసుకోవడానికి ఎందుకింత సమయం తీసుకుంది అంటే, చాలా కారణాలున్నాయి అంటాడు. ఐతే ఈ జాప్యం ఈ సినిమా ఇప్పటిదాకా వచ్చిన బాక్సింగ్ సినిమాల్లో అతి గొప్పదిగా తయారయేందుకు కూడా దోహదం చేసింది.

అతి గొప్ప బాక్సింగ్ సినిమా - ఈ బిరుదుని అందుకోవడానికి చాలా సినిమాలే పోటీ పడతాయి: ఇటీవలే వచ్చిన ది రెస్లర్ (డేరెన్ ఆరనోఫ్‌స్కీ, 2008) ముఖ్య నటీనటులకి ఆస్కార్ ప్రతిపాదనలు తెచ్చిపెట్టింది. 2004 లో క్లింట్ ఈస్త్‌వుడ్ తీసిన మిలియన్ డాలర్ బేబీ ఆస్కార్ల పంట పండించుకుంది. ఇంకా పాత సినిమాలు చాలా ఉన్నాయి. కానీ ఇవేవీ కూడా కథలోని ముఖ్యపాత్రల్ని గురించి మనం పట్టించుకునేట్టు చెయ్యవు - ది ఫైటర్ ఆ పని విజయవంతంగా చేస్తున్నది. ఈ సినిమాలో డికీ ఇక్లండ్ (మికీ వార్డ్‌కి మారుటి అన్న, కొన్నాళ్ళ అతని ట్రెయినర్, మాదకద్రవ్యాలకి అలవాటు పడినవాడు)పాత్రలో నటుడు క్రిస్టియన్ బేల్ చూపించిన నటన స్థాయికి ఈ ఇతర సినిమాలు వేటిల్లోనూ, ఏ నటీనటులూ సాటిరాలేరు. అంతే కాదు - అన్నిటకంటే ముఖ్యమైన తేడా - కథావస్తువుని మసిబూసి మారేడుకాయ చెయ్యకుండా, లేనిపోని హంగులు రంగులు వెయ్యకుండా ఉన్నదున్నట్టు చెప్పగల్గిన నిజాయితీ ది ఫైటర్‌లో ఉన్నట్టుగా మనకెక్కడా కనబడదు.

నిజజీవిత ముఖ్యపాత్ర మికీవార్డ్‌లోనే ఉన్నది ఆ నిజాయితీ. ఐదడుగుల ఎనిమిదంగుళాల పొడుగు, నూటయాభై పౌండ్ల బరువుతో వెల్టర్ వెయిట్ బాక్సింగ్‌లో అప్పటికి కొన్ని విజయాల్ని సాధించి ఉన్నా, ఒకదానివెంట ఒకటిగా వరసగా నాలుగు పోటీలలో అపజయం పొందేటప్పటికి ఏదో కొత్త స్పృహ కలిగి మొత్తానికే బాక్సింగ్ మానేశాడు 1991లో. మానేసి రోడ్లు వేసే పనిలో చేరాడు. ఈ రోడ్డు పని చెయ్యడంలోని శారీరక శ్రమ సినిమాలోని తొలిసీన్లలో కళ్ళకు కట్టినట్టు తీశారు. అతను వివిధ ప్రోద్బలాల వల్ల బాక్సింగ్‌కి తిరిగి వచ్చి కొన్ని విజయాలు సాధించినా, ఆ విజయాలలో కనులు మిరుమిట్లుగొలిపే చమక్ ఏమీలేదు. అసలు విషయమేంటంటే నిజజీవితంలో గానీ, బాక్సింగ్‌లోగానీ మిక్కీ ఒక పేద్ద హీరో కాదు, హిమాచలోన్నతుడు కాదు - అతి మామూలు వ్యక్తి, అతి నేలబారు మనిషి. అదే అతని ప్రత్యేకత. అతనిలోని ఆ లక్షణమే ఈ సినిమాకి ఇతర బాక్సింగ్ సినిమాలలోలేని విశిష్టతని తెచ్చిపెట్టింది.

నటుడు మార్క్ నిజజీవితానికీ బాక్సర్ మిక్కీ జీవితానికీ చాలా పోలికలున్నాయి. మిక్కీ లాగానే మార్క్ కూడా మాసచుసెట్స్ రాష్ట్రంలో, తొమ్మిదిమంది తోబుట్టువులలో చివరివాడుగా పెరిగాడు. యవ్వనంలో అనేక చెడుసావాసాలు మరిగి కొన్నాళ్ళు జెయిల్లో గడిపాడు. తన పద్ధెనిమిదేళ్ళ వయసులో మార్క్ మొదటిసారి బాక్సర్ మిక్కీని కలిశాడు. ఆ తొలి సమావాఏశం అతని మనసులో చెరగని ముద్రవేసింది. 2004లో, తాను అప్పటికే సినీతారగా ఎదిగినాక, మిక్కీని మళ్ళి కలిసి అతని జీవిత కథని సినిమా తియ్యాలనే ఆలోచన ఉన్నట్టు, మిక్కీ పాత్రని తానే పోషిస్తాననీ చెప్పాడు మార్క్. అదే ప్రతిపాదనని పారమౌంట్ స్టూడియోకి కూడా చెప్పాడు. ఐతే అప్పటికీ మిక్కీ వార్డ్ జీవితకథకి అన్ని హక్కులూ పొంది ఉన్న ఒక మీడియా సంస్థ మార్క్‌ని ఆ ప్రయత్నాన్నించి విరమించమని లీగల్ నోటీసులు పంపసాగింది. సుమారు రెండేళ్ళ సుదీర్ఘమైన కోర్టు యుద్ధం తరవాత, 2006 అక్టోబరు 13న - ఈ తేదీని మట్టుకు మార్క్ ఏమాత్రం తడుముకోకుండా గుర్తు చేసుకుంటాడు - పారమౌంట్ నించి ఫోనొచ్చింది, మిక్కీ జీవిత కథకి హక్కులు పొందామనీ, స్క్రిప్టు సిద్ధమైందనీ.

ఇక అటుపైన దర్శకుని కోసమూ ఇతర ముఖ్య పాత్రలకి నటీనటుల కోసమూ వెతుకులాట. మొదట్లో చాలా మందే ఆసక్తి చూపించినా, స్క్రిప్టు బాగుందని మెచ్చుకున్నా, ఎందుకనో మరి ఎవరూ నిలవలేదు. మిక్కీ మారుటి అన్న డిక్కీ ఇక్లండ్ పాత్ర చాలా ముఖ్యమైనది. మిక్కీ కన్నా సుమారు పదేళ్ళు పెద్దవాడు, అదే తల్లికి వేరే తండ్రివల్ల పుట్టిన సోదరుడు, కొంతకాలం ప్రొఫెషనల్ బాక్సింగ్ చేసి, తరవాత కొకెయిన్‌కి బానిస అయి జెయిలు పాలైనాడు, మిక్కీ తొలి రోజుల్లోనూ, ఆ తరవాత ప్రొఫెషనల్ బాక్సర్‌గా మారిన కాలంలోనూ మిక్కీకి ముఖ్య ట్రెయినర్‌గా మిక్కీ పక్కనే నిలబడినవాడు - స్క్రిప్టు లెక్కన చూసుకుంటే ఈ సినిమా ఎంతవరకూ మిక్కీ కథని చెబుతున్నదో, అంతమేరకీ డిక్కీ కథని కూడా చెబుతున్నది - ఎందుకంటే వారిద్దరి కథలూ విడదీయలేకుండా పెనవేసుకుని ఉన్నాయి మరి. మొదట్లో ఈ పాత్రకి మార్క్ సొంత అన్న డానీ వాల్బర్గ్ అనుకున్నారు, కానీ డానీకి తగినంత స్టార్ వేల్యూ లేదని స్టూడియో నిరాకరించింది. అటుపైన మేట్ డేమన్ అనుకున్నారు (మేట్ కీ మార్క్ కీ బాగా పోలికలుంటాయి, నిజంగా అన్నదమ్ముల్లాగానే అనిపిస్తారు), కొన్నాళ్ళు బ్రాడ్ పిట్ పేరు సూచించబడింది. కానీ ప్రాజెక్టు ముందుకు సాగక పోవడంతో ఆయానటులు నిలబడలేదు. అలాగే దర్శకునిగా ముందు ఆరనోఫ్స్కీని అనుకున్నారు. ఇంతలో అతను (2008లో) రెస్లర్ తీశాడు, మళ్ళీ ఇంకో బాక్సింగ్ సినిమా చెయ్యడానికి ఒప్పుకోలేదు. డిపార్టెడ్ సినిమాలో నటిస్తుండగా మార్క్ ఆ సినిమా దర్శకుడైన మార్టిన్ స్కోర్సీస్‌ని కదిపాడు దీని విషయమై. ఆయన స్క్రిప్టు చదివి చాలా బావుంది గానీ అప్పుడెప్పుడో (రాబర్ట్ డినీరోతో) రేజింగ్ బుల్ సినిమా తీసినాక ఇన్నాళ్ళకి ఇప్పుడు మళ్ళీ బాక్సింగ్ ప్రపంచంలో కాలుమోపే ఆసక్తి లేదు అనేశారు. అలా చివరికి, ఇంతకు మునుపు కొన్ని తాను నటించిన సినిమాల దర్శకుడైన డేవిడ్ రస్సెల్ పేరు ఖాయమైంది. ఇంచుమించు ఇదే సమయంలో, తమ పిల్లలు చదువుకునే ఎలిమెంటరీ బడి దగ్గర క్రిస్టియన్ బేల్‌ని కలిశాడు మార్క్. 2005లో మొదలైన బేట్‌మేన్ వరససినిమాల్లో బేట్‌మేన్ పాత్రపోషించడంతో బాగా ఖ్యాతి సంపాయించుకున్న బేల్ ఒక డ్రగ్ ఎడిక్టయిన డిక్కీ ఇక్లండ్ పాత్రకి ఒప్పుకోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది ఎవరికైనా. ఈ పాత్ర చెయ్యడానికి, బేల్ సుమారు 30 పౌండ్ల బరువు తగ్గాడు. సహజంగా చాలా అందగాడైన బేల్, అతి సాధారణంగా కొంచెం వికృతంగా కనబడ్డాడు డిక్కీ పాత్రలో - ఇక అతని నటన .. అద్భుతం. ఈ పాత్రలో బేల్ నటనని చూసి నిజ డిక్కీయే మెచ్చుకున్నాడు, అచ్చం తనలాగానే ఉన్నాడని. ఇంకో తమాషా - బేల్ మార్క్‌కంటే మూడేళ్ళు చిన్నవాడు! అలాగే వీళ్ళిద్దరి తల్లిగా వేసిన మెలిస్సా లియో ఈ నటులిద్దరికంటే సుమారు పదేళ్ళు మాత్రమే పెద్దది. ఆమెకూడా అద్భుతమైన నటన కనబరిచింది.

గమనిక: ఒక ఆంగ్లపత్రిక నించి అనువాదం