కాదేదీ కవిత కనర్హం

ఏది కవిత్వం? ఏది కాదు?
తూచేందుకు గానీ సానబట్టేందుకు గానీ రాళ్ళున్నాయా?

మొన్నా మధ్య అఫ్సర్ గారి బ్లాగులో తోటి బ్లాగరి వంశీగారు, ముందు మెత్తగా ఇదేమి కవిత నాకు అర్ధం కాలేదు అంటూనే, తరవాత ధ్వజమెత్తారు, ఉప్పెనలా విరుచుకుపడ్డారు.


ఏది కవిత్వం? పెద్ద ప్రశ్నే!

మందార మకరంద మాధుర్యమున దేలు మధుపమ్ము వోవునే మదనములకు? అంటే, ప్రతిపదార్ధం చెప్పేందుకు తెలుగు అయ్యవారు అవసరపడతారుగాని అది కవిత్వం కాదనే ధైర్యం చెయ్యరెవ్వరూనూ.

మరి ఇది కవిత్వమా కాదా అన్న ప్రశ్న అల్లా వచన పద్యం దగ్గరే వస్తోంది.

పోనీ ఇది చూడండి - కవి పేరూ, పద్య శీర్షికా కావాలనే చెప్పట్లేదు. సమకాలీన సాహిత్యం బాగా పరిచయం ఉన్నవారికి తెలిసే ఉండవచ్చు, కానీ ఈ చర్చ వారి కోసం కాదుగదా - మనలాంటి వాళ్ళకోసం ఇది.

***
యవ్వనం చెవిలో ఎన్నెన్ని కామసూత్రాలు ఊదేడో?
పూల బాణాలతో కొట్టించి పూర్తిగా వివశురాలిని చేశాడు
ముగ్ధ మనస్సును అగ్నిగోళంలో తోశాడు
సూర్యుణ్ణి ఊహించి సుందరుణ్ణి ఊహించి
వేణిని జారేసుకుంది వోణీని జారేసుకున్నట్లు
తెలుసుకో లేక పోయింది మేక వన్నె పులి లాంటి
గెడ్డం పెంచుకున్న ముని కీచకుడి ముందు కాలు జారేసుకున్నట్లు ..
స్పృహ తెచ్చుకొన్నప్పటికి పొద్దు పొడిచింది

కుండపోతగా ఏడుస్తున్న కన్నెను
దున్నపోతుల్లా వచ్చి దీవించారు దేవతలు
ఆకాశం అడ్రసిచ్చి నిష్క్రమించాడు ఇనుడు
ఇంద్రుడికి ఈర్ష్య చంద్రుడికి నవ్వు
కడుపు శోకంతో కర్ణుణ్ణి కాల ప్రవాహంలో విడిచింది
కడుపు మంటలో కడుపు పంట గుర్తును
గుప్త పరుచుకొంది హిందూ రాజ్యాంగం
భారతాన్ని తెలుగు చేసిన రాజాశ్రిత కవి నన్నయ
కన్నె రేప్ గుట్టును మరింత రసవత్తరంగా రట్టు చేసి
మానభంగ సంస్కృతిని ఆర్ష ఆద్ర్శంగా ప్రకటించాడు
కన్నెలు గర్భవతులైతే కర్ణులూ భరతులూ పుడతారని
కవి సామ్రాట్టులూ కరుణశ్రీలూ ఖండ కావ్యాలు రాసి
భాషా ప్రవీణ వారసులతో
బడిపిల్లలకు బోధిస్తూ బులుపు తీర్చుకున్నారు

కళ్ళంలోనూ కాలిబాటల మీద హాస్టళ్ళ ముందు హాస్పటళ్ళ వెనుక
కన్నె పిల్లను కని వదిలేస్తుంది
ప్రభుత్వం అనాధ శరణాలయాలను చూపిస్తుంది
స్త్రీ శిశు సంక్షేమ బడ్జెట్టు మగ తేనెటీగలకు విందు చేస్తుంది
ఫ్యూడల్ సంస్కృతి పురిటిలోనే మీసమెత్తి పుడుతుంది

ఆనాటి కుంతి అవిశ్రాంతంగా ఆలోచిస్తూ బతికిపోయింది
నిన్నటి కుంతి నిరంతరం పెనుగులాడుతూ హత్య గావించబడింది
నేటి కుంతి
సంఘటిత పోరాటాల లోనికి అహ్వానించ బడుతోంది.

****

ఇది కవిత్వమేనా? ఐతే, ఎందుకు అవును? కాకపోతే, ఎందుకు కాదు?

Comments

budugu said…
మేష్టారూ, సత్తెప్రమాణంగా చెబుతున్నా. ఇది కవిత ఐతే, మా ఈనాడు డిస్ట్రిక్ట్ ఎడిషన్ లో వచ్చే సగం వార్తలూ, మా టీవీ ఛానల్లో ఫీచర్లోకి దిగే ముందు వచ్చే పరిచయ వాక్యాలన్నీ మహాప్రస్థానాలే.
మీరూ చాన్నాళ్ళు ప్రవాసులయ్యేసరికి మీకు డిస్ట్రిక్ట్ ఎడిషన్ తో టచ్ పోయినట్టుంది.

ఒకమాట చెప్పండి. కవిత అంటే కొన్ని ఉపమానలు జోడించిన వచనమేనా? ఈమాట జనవరీ11 సంచికలో కనకప్రసాద్ గారు చక్కని వ్యాసం రాశారు చూడండి కవితల గురించి.
మప్పితాలు కొత్తపాళీ గారు...మప్పితాలు....బాగుంది...ఉప్పెనలా విరుచుకుపడటం ఇప్పటిదాకా మా ఇంటా వంటా లేదు.....:).. ముందు అఫ్సర్ గారిని పక్కనబెట్టెయ్యండి....మీరు ఈ పోష్టులో ఇచ్చిన కవిత సంగతి ఇప్పటికి పక్కనబెట్టేసా! ఎందుకా? మొదటి నాలుగు లైన్లు చదవగానే రక్తపోటు పెరిగింది అందుకు....ఇహ నా ఘోషకొస్తే - నాకు ఈనాటి కవులవల్లా, వారి కవితల దయ వల్లా కళ్లు, ఒళ్లు తిరిగి వెనక్కు విరుచుకుపడిపోతుండటం ఎక్కువైపోటంతో, మూర్ఛ రోగివా అని ఎవడన్నా అడుగుతాడేమో అన్న సిగ్గుతో చచ్చిపోతూ, ఆ "ఇది" తగ్గించుకుందామని "ఆ" ప్రయత్నమూ, కొచ్చెన్లూ. అంతేకానీ మెత్తగానూ, ఉప్పెనలానూ - భవం, భయం కోసం కాదు....భావం కోసం మాత్రమేనని అర్థం చేసుకోవాలి.... ఆ "సోకాల్డ్" వచనంలోని "ఆనందమేదో" తెలుసుకుందామన్న ఆసక్తి. దానికి మీ ఈ పోష్టు ఊతమో, భూతమో తెలీటల్లా!... ఇహ ఎవరి ప్రమాణాలు వారివే కాబట్టి, నా ప్రమాణాలు వివరించుకుంటా ఇక్కడ - (ఓ ఇరవై ఏళ్ల క్రితం చదువుకున్న వాక్యాలివి! ప్రతిష్ఠించుకొనిపోయాయి మరి....)

కవితా సరస్వతికి
అ)పదసముదాయం = శరీరం
ఆ) అర్థం = ప్రాణం
ఇ) భావం = ఆత్మ
ఈ) నాదం = సరిగంచు చీర

అర్థం కానివాళ్లకి - నాదం నుంచి వర్ణం, వర్ణం నుంచి పదం, పదం నుంచి వాక్యం, వాక్యం నుంచి...ఇహ మీకు తెలిసిందే...అదీ సంగతి...మరి నాదం "అ" లో ఉండాలిగా? "ఈ" లోకి ఎందుకొచ్చిందా? అక్కడే ఉంది కిటుకు మహానుభావా!! ఇహ పైనిచ్చిన వాటి విషయంలోకి వచ్చేస్తే - అ, ఆ, ఇ, ఈ లు కూడితే రమ్యమైన కళ, సాహిత్యం, ఆ సాహిత్యంలో ఇమిడే కవితానూ...లెక్కలు, ఎక్కాలు రానివాడు తొమ్మిది పదులు తొమ్మిదని చెబుతే, వచ్చినవాడు "టొంబై" అనీ చెబుతాడు. అవును "టొంబై" యే తొంభై కాదు..సరిగ్గానే వ్రాసాను...కవికి ఎక్కాలు రావాలి, సరిగ్గా కూడటం రావాలి అని నేను చెప్పేది...కూడకుండా వీటిలో ఈ పై నాలుగిట్లో ఏ ఒకటి తీసేసినా "చోద్యమే" అని భవదీయుడి అభిప్రాయం..కవేమన్నా లెక్కల మాష్టారా లెక్కలు సరిగ్గా రాటానికి అని అడుగుతున్నారా? ఐతే అలా అడిగిన తమరు ఆ జాతివారే! మీక్కూడా లెక్కలు రాపోతే ఆ రాట్నానికే కట్టి తిప్పటమో, రుబ్బురోల్లో వేసి రుబ్బటమో - ఈ రెండే మిగులుతాయి...ఎవరో పెద్దాయన అన్నట్టు, గబుక్కున గుర్తురావట్లేదు కానీ - "శుద్ధి చెయ్యని పాదరసం ఎలా కొంప తీస్తుందో, పరిపక్వం కాని కవిత అలా రోత పుట్టిస్తుంది." నిక్కమైన నిజం! కనీసం "కవి" అన్న బిరుదం తగిలించుకోటానికి పరిపక్వత అనే పదార్థం ఒక నియమమూ, నీతి, ధర్మం. చేసే వంటలో ఉప్పెంత వెయ్యాలో తెలియనివాడు వంటవాడు ఎలా అవుతాడండీ? కొచ్చెనేసిన మిమ్మల్ని కాకులెత్తుకెళ్లా! :) వంట చెయ్యకుండా ఉప్పెంత వెయ్యాలో ఎలా తెలుస్తుందీ? అదే నేనూ చెప్పేది...ఉప్పు సరిగ్గా వెయ్యటం వచ్చేంతవరకూ వంటలోడు అని పేరు తగిలించుకోవద్దని. రక్తపోటు ఉన్నవారికీ, రుచులక్కర్లేనివారికీ ఉప్పు తక్కువే వేస్కోవాలిగా మరి? రుచులవాళ్లని పక్కబెట్టి చదివి రక్తపోటు పెరిగినవారి పరిస్థితేమిటి అని అడుగుతున్నామండీ! ఆ పోటు పెరిగి పెరిగి ప్రాణాలు పోతే ఎవడిదీ బాధ్యత? :) కామెంటినోళ్లలో మళ్లీ నన్ను కొచ్చెన్లేసేముందు, పిచ్చివైనా సరే, ముందు పోష్టులో ఇచ్చిన లంకెలు అన్నీ తీరిగ్గా చదివి, అక్కడున్న, వ్యక్తపరచిన అభిప్రాయాలు అర్థం చేసుకుని, జంఘాల శాస్త్రిగారు పూనటంతో నేను నా బ్లాగులో వ్రాసుకున్న "మూడు" పోష్టులు చదివి తరువాత కొచ్చెన్లెయ్యండి అని - ప్రార్థన...

భవదీయుడు
వంశీ
Anonymous said…
కొత్తపాళి గారు, ఇంతకీ ఇది కవితా, తవికా అన్నాదాని గురించి మీరేమనుకొంటున్నారు?

సరే పుట్టి, వదిలేయబడుతున్న బాలికల గురించి ఆవేదన కవిత రూపం లో, "వేణి", "వోణి" అంటూ వెలిబుచ్చారు అనుకొన్నా, అందులో "హిందూ రాజ్యాంగం" అసంధర్భం కాదా? నిజానికి మన రాజ్యాంగాన్ని లౌకికంగానే వ్రాసుకున్నా, ముస్లిం లకు ఉన్న వెసులుబాటు హిందువులకు నిజంగా కల్పించిందా? సరే ముస్లిం, హిందూ మాట ఎందుకనుకొంటే, కని పడేసే పిల్లలు వాల్ల భవిషత్తుకు "హిందువుకు" సంభంధం ఏమిటి? కాదు కూడదు, కర్ణుడు హిందువే కదా అంటే, మరి కిరస్తానీ లలో, తురకలలో ఇది లేదా?

నిజానికి ఈ తవిక వ్రాసిన ఆయనకో/ఆమెకో కుప్ప తొట్టిలలో వదిలివేయబడుతున్న బాలికలకంటే , హిందువుల మీద, మొగాళ్ల మీద ఉన్న biased వాదమే, కనిపిస్తుంది కాని, తీసుకొన్న వస్తువుకు పూర్తి న్యాయం చేసారని ( ఇది కవిత అనుకొన్నా, తవిక అనుకొన్నా) మీకు కనిపిస్తుందా?

ఇలాంటివి బుడుగు చెప్పినట్లు, ఏ TV9 లాంటి వి, చెప్పబోయే item కు సంబంధించి, నాలుగు పడికట్టు పదాలతో, విషయానికి ఏ మాత్రం సంభంధం లేకుండా ప్రతిరోజూ మనమందరం చూస్తున్నే ఉన్నాము కదా!!

చివరగా, తా మునిగింది గంగ, --- రంభ అన్న సామెత లాగానే, దీనిని కవితని నెత్తినెట్టుకొనే వారు ఉంటారు, దీనిని చదివి వాంతులు చేసుకొనేవాళ్లు ఉంటారు :)

ఇంతకీ మీ ఉద్దేశ్యం ఏమిటి? ఇది మంచి కవిత్వమంటారా? చేయితిరిగిన రచయతగా మీ అభిప్రాయం తెలుసుకోవాలన్న తుత్తి మాత్రమే :)
Sanath Sripathi said…
మన దేశంలో కవితా మార్గాలు రెండు. (1) మార్గ కవిత్వం, (2) దేశీయ కవిత్వం.
చందస్సు నాశ్రయించి, వ్యాకరణాన్ని ఆశ్రయించి, శబ్ద శక్తినాశ్రయించి, రసము నాశ్రయించి, గుణదోష విచారించి, వృత్తిరీతిపాకాదులను నిక్షేపించి, అలంకార సంయోజనంచేసి, ధ్వనిని ప్రధానంగా చేసికొని వ్రాసిన కవిత్వం- మార్గ కవిత్వం... (ఉదా.. చిత్ర కవిత్వం, చాటు కవిత్వం, బంధ కవిత్వం... మొ)
స్త్రీల పాటలు, సువ్వి పాటలు, ఏలపాటలు, వచన కవిత్వం మొ..దేశీయ కవిత్వం.

మార్గాలు సరే.. అసలు కవిత్వమంటే ఎమిటి?

ఇది చలా పెద్ద ప్రశ్నే... భాష రెండురకాలు గనుక నిర్వచనం కూడా వాడుక భాష,గ్రాంథిక భాషలలో చెప్పుకుందాం.

భాష, భావం, కవి గారి ఆవేశం, చెప్పే విషయం యొక్క ప్రాధాన్యత, కవిగారి నేర్పు వీటన్నిటి సమ్మేళనమే కవిత్వం...
అదే గ్రాంథికం గా చెప్పాలంటే కవిత్వమన్నది వాగ్వైచిత్రి, వ్యంగ్య వైభవము, వక్రోక్తి నైపుణ్యము, అలంకారసంగ్రహ దక్షత, ఔచిత్యవేతృత్త్వము, రస సంధాన నైపుణ్యము, రచనాశిల్ప సామర్ధ్యము - వీటిని ఆశ్రయించి ఉంటుంది - అది పద్య కవిత్వమైనా, గద్య కవిత్వమైనా, గేయ కవిత్వమైనా, వచన కవిత్వమైనా.....

అందరికీ అర్థమయ్యె భాషలో కవిత్వం ఉండాలన్నది వచన కవిత్వానికి (వాడుక భాషా కవిత్వానికీ) పునాది. నిజానికి వాడుకభాషలోని వాక్యం అసమగ్రం. సమాసాలనీ, ఇంగ్లీషు మాటలనీ కలనేత నేస్తూ వచన కవిత్వం చెప్పినా దానికి దక్కే సమాదరం ప్రజా బాహుళ్యం లో నెలకొని ఉన్న ఆధునిక సమస్యలు దానియందు పరామర్శింపబడటమే కానీ మరొకటి కాదు.

సాహిత్య నిర్మాణం కవులమీద ఆధారపడి ఉన్నది. మానవులు మూడు రకాలు (ఉత్తమ, మధ్యమ..మొ) వివేకులూ, మందబుధ్ధులూ,
జడులు... ఆ మూడు రకాల మానవులలో కవులూ ఉంటారు కనుక, వారు వ్రాసిన కవిత్వాలూ ఉంటాయి. వివేకి వ్రాసినవి కాలాంతరంలో కలిసిపోవు, తక్కినవి కలిసిపోతాయి.

భావం, సౌకుమార్యం, రసం, ఔచిత్యం మొదలైనవాటిని వివేకులూ, శబ్దార్థ విషయ పరిజ్ఞాం కలవారు తెలిసి కవిత్వ రచనచేశారు. అవి వదిలిన వారి ముద్ర స్వల్పం...అందుకే వీటికి భిన్నంగా ఉన్న కవిత్వాలు (పద్య కావ్యాలూ, వచన కావ్యాలూ) కాలాంతరంలో కలిసిపోయాయి..

అగ్గిపుల్ల, సబ్బు బిళ్ళ కాదేదీ కవితకనర్హం కనుక ప్రస్తుత టపాలో చెప్పినది కవిత కాదనడానికి ఆస్కారం లేదు. ఉత్తమ కవితా? అది కాలమే నిర్ణయించగలదు. నావరకూ నాకు బాగున్నదా/ నచ్చిందా అన్న ప్రశ్నకి బానే ఉన్నా నచ్చలేదు అన్నది సమాధానం. కారణం అడిగితే క్రమాలంకారం, అనుప్రాశ కోసం కొన్ని శుష్క పదాల పాట్లు. (వేణిని ?? జారేసుకుంది వోణీని జారేసుకున్నట్లు, ఆకాశం అడ్రసిచ్చి నిష్క్రమించాడు ఇనుడు, గుర్తును గుప్త పరుచుకొంది, కుండపోత/ దున్నపోతు).

అసంపూర్ణమైన వాక్యాలు (ఇంద్రుడికి ఈర్ష్య చంద్రుడికి నవ్వు...అన్నారు) ఎవరిని చూసి ఈర్ష్య? ఎవరిని చూసి నవ్వు? అడ్రస్సు ఇచ్చి నిష్క్రమించిన ఇనుణ్ణి చూశా? దున్నపోతుల్లాంటి దేవతల్ని చూశా? ఏడుస్తున్న కన్నెని చూశా? ఎవరిని చూసి ఈర్ష్య? ఈర్ష్య, నవ్వు వేరే వేరే వారి గురించా ఒకరి గురించేనా?)

లోకోక్తులు పద్యం లో ఉంటే స్వభావోక్తి అలంకారం. అట్లాంటిది వచన్ కవిత్వలో లోకోక్తులూ, స్వభావోక్తులూ కోకొల్లలు. ఆత్లాంటివాటి అన్వయం లో తేడా వస్తే? ఉదా..నాగార్జున అమలకి తానెంతగొప్పవాడో నిరూపించే ఒకానొక గొప్ప పాటలో "హలో గురూ ప్రేమ కోసమేరొయ్ జీవితం..ప్రేమించాను దీన్నే, కాదంటోంది నన్నే.." అంటూ పాడుతూ కిసుక్కున "మహా మహా సుందాంగులే పొందలేనివాణ్ణి" అంటాడు గేయ రచయిత. ఇక్కడ భావం "నన్ను సో అండ్ సో పొందలేకపోయారు" అని గొప్ప చెప్పుకోవటం గా భావించి రాద్దామనుకుని తద్భిన్నంగా నేను "సో అండ్ సో ని పొందలేకపోయాను" అని రాశారు (అంటే నీతో సర్దుకోవాల్సి వస్తోంది అన్న భావం ధ్వనించేలా రాశారు). అది ఒక హిట్టు పాట. దానికేమంటారు?

అన్నిటికీ మించి ఈ కవితలో నాకు నచ్చనిది వాజ్ఞియమం లేకపోవటం (మానభంగ సంస్కృతిని ఆర్ష ఆద్ర్శంగా ప్రకటించాడు, కవి సామ్రాట్టులూ కరుణశ్రీలూ బడిపిల్లలకు బోధిస్తూ బులుపు తీర్చుకున్నారు) ఇటువంటి పద ప్రయోగం కొత్త కవిత్వానికి అక్షరాభ్యాసం చేయించిన శ్రీశ్రీ వంటివాళ్ళు వాడలేదు.

వంశీ గారితో దీనికి సంబంధించిన అన్నిటపాలూ, వ్యాఖ్యలూ చదివినతరువాత ఇన్ ప్రిన్సిపల్ ఏకీభవించేది వారి నిర్వచనం, వారి ప్రశ్నలూ ఉత్తమ కవిత్వం విషయం లో ముమ్మాటికీ సబబే. ఉత్తమం కాని కవితలు ఉండవా? ఉండకూడదా అన్న ప్రశ్న వారు వేయలేదు. అఫ్సర్ గారి కవిత కూడా బాగున్నా నచ్చలేదు, కారణాలు పైవాటి లానే)

ఈ కవిత్వం రాసినవారు బహుశా పెద్దవారై ఉండచ్చు, వారిపై దురభిప్రాయం లేదు, ఈ కవిత్వం మాత్రం విమర్శకు తావిచ్చింది అన్నది సత్యం (నా దృష్టిలో)
Sanath Sripathi said…
మన దేశంలో కవితా మార్గాలు రెండు. (1) మార్గ కవిత్వం, (2) దేశీయ కవిత్వం.
చందస్సు నాశ్రయించి, వ్యాకరణాన్ని ఆశ్రయించి, శబ్ద శక్తినాశ్రయించి, రసము నాశ్రయించి, గుణదోష విచారించి, వృత్తిరీతిపాకాదులను నిక్షేపించి, అలంకార సంయోజనంచేసి, ధ్వనిని ప్రధానంగా చేసికొని వ్రాసిన కవిత్వం- మార్గ కవిత్వం... (ఉదా.. చిత్ర కవిత్వం, చాటు కవిత్వం, బంధ కవిత్వం... మొ)
స్త్రీల పాటలు, సువ్వి పాటలు, ఏలపాటలు, వచన కవిత్వం మొ..దేశీయ కవిత్వం.

మార్గాలు సరే.. అసలు కవిత్వమంటే ఎమిటి?

ఇది చలా పెద్ద ప్రశ్నే... భాష రెండురకాలు గనుక నిర్వచనం కూడా వాడుక భాష,గ్రాంథిక భాషలలో చెప్పుకుందాం.

భాష, భావం, కవి గారి ఆవేశం, చెప్పే విషయం యొక్క ప్రాధాన్యత, కవిగారి నేర్పు వీటన్నిటి సమ్మేళనమే కవిత్వం...
అదే గ్రాంథికం గా చెప్పాలంటే కవిత్వమన్నది వాగ్వైచిత్రి, వ్యంగ్య వైభవము, వక్రోక్తి నైపుణ్యము, అలంకారసంగ్రహ దక్షత, ఔచిత్యవేతృత్త్వము, రస సంధాన నైపుణ్యము, రచనాశిల్ప సామర్ధ్యము - వీటిని ఆశ్రయించి ఉంటుంది - అది పద్య కవిత్వమైనా, గద్య కవిత్వమైనా, గేయ కవిత్వమైనా, వచన కవిత్వమైనా.....

అందరికీ అర్థమయ్యె భాషలో కవిత్వం ఉండాలన్నది వచన కవిత్వానికి (వాడుక భాషా కవిత్వానికీ) పునాది. నిజానికి వాడుకభాషలోని వాక్యం అసమగ్రం. సమాసాలనీ, ఇంగ్లీషు మాటలనీ కలనేత నేస్తూ వచన కవిత్వం చెప్పినా దానికి దక్కే సమాదరం ప్రజా బాహుళ్యం లో నెలకొని ఉన్న ఆధునిక సమస్యలు దానియందు పరామర్శింపబడటమే కానీ మరొకటి కాదు.

సాహిత్య నిర్మాణం కవులమీద ఆధారపడి ఉన్నది. మానవులు మూడు రకాలు (ఉత్తమ, మధ్యమ..మొ) వివేకులూ, మందబుధ్ధులూ,
జడులు... ఆ మూడు రకాల మానవులలో కవులూ ఉంటారు కనుక, వారు వ్రాసిన కవిత్వాలూ ఉంటాయి. వివేకి వ్రాసినవి కాలాంతరంలో కలిసిపోవు, తక్కినవి కలిసిపోతాయి.

భావం, సౌకుమార్యం, రసం, ఔచిత్యం మొదలైనవాటిని వివేకులూ, శబ్దార్థ విషయ పరిజ్ఞాం కలవారు తెలిసి కవిత్వ రచనచేశారు. అవి వదిలిన వారి ముద్ర స్వల్పం...అందుకే వీటికి భిన్నంగా ఉన్న కవిత్వాలు (పద్య కావ్యాలూ, వచన కావ్యాలూ) కాలాంతరంలో కలిసిపోయాయి..

అగ్గిపుల్ల, సబ్బు బిళ్ళ కాదేదీ కవితకనర్హం కనుక ప్రస్తుత టపాలో చెప్పినది కవిత కాదనడానికి ఆస్కారం లేదు. ఉత్తమ కవితా? అది కాలమే నిర్ణయించగలదు. నావరకూ నాకు బాగున్నదా/ నచ్చిందా అన్న ప్రశ్నకి బానే ఉన్నా నచ్చలేదు అన్నది సమాధానం. కారణం అడిగితే క్రమాలంకారం, అనుప్రాశ కోసం కొన్ని శుష్క పదాల పాట్లు. (వేణిని ?? జారేసుకుంది వోణీని జారేసుకున్నట్లు, ఆకాశం అడ్రసిచ్చి నిష్క్రమించాడు ఇనుడు, గుర్తును గుప్త పరుచుకొంది, కుండపోత/ దున్నపోతు).

అసంపూర్ణమైన వాక్యాలు (ఇంద్రుడికి ఈర్ష్య చంద్రుడికి నవ్వు...అన్నారు) ఎవరిని చూసి ఈర్ష్య? ఎవరిని చూసి నవ్వు? అడ్రస్సు ఇచ్చి నిష్క్రమించిన ఇనుణ్ణి చూశా? దున్నపోతుల్లాంటి దేవతల్ని చూశా? ఏడుస్తున్న కన్నెని చూశా? ఎవరిని చూసి ఈర్ష్య? ఈర్ష్య, నవ్వు వేరే వేరే వారి గురించా ఒకరి గురించేనా?)

లోకోక్తులు పద్యం లో ఉంటే స్వభావోక్తి అలంకారం. అట్లాంటిది వచన్ కవిత్వలో లోకోక్తులూ, స్వభావోక్తులూ కోకొల్లలు. ఆత్లాంటివాటి అన్వయం లో తేడా వస్తే? ఉదా..నాగార్జున అమలకి తానెంతగొప్పవాడో నిరూపించే ఒకానొక గొప్ప పాటలో "హలో గురూ ప్రేమ కోసమేరొయ్ జీవితం..ప్రేమించాను దీన్నే, కాదంటోంది నన్నే.." అంటూ పాడుతూ కిసుక్కున "మహా మహా సుందాంగులే పొందలేనివాణ్ణి" అంటాడు గేయ రచయిత. ఇక్కడ భావం "నన్ను సో అండ్ సో పొందలేకపోయారు" అని గొప్ప చెప్పుకోవటం గా భావించి రాద్దామనుకుని తద్భిన్నంగా నేను "సో అండ్ సో ని పొందలేకపోయాను" అని రాశారు (అంటే నీతో సర్దుకోవాల్సి వస్తోంది అన్న భావం ధ్వనించేలా రాశారు). అది ఒక హిట్టు పాట. దానికేమంటారు?

అన్నిటికీ మించి ఈ కవితలో నాకు నచ్చనిది వాజ్ఞియమం లేకపోవటం (మానభంగ సంస్కృతిని ఆర్ష ఆద్ర్శంగా ప్రకటించాడు, కవి సామ్రాట్టులూ కరుణశ్రీలూ బడిపిల్లలకు బోధిస్తూ బులుపు తీర్చుకున్నారు) ఇటువంటి పద ప్రయోగం కొత్త కవిత్వానికి అక్షరాభ్యాసం చేయించిన శ్రీశ్రీ వంటివాళ్ళు వాడలేదు.

వంశీ గారితో దీనికి సంబంధించిన అన్నిటపాలూ, వ్యాఖ్యలూ చదివినతరువాత ఇన్ ప్రిన్సిపల్ ఏకీభవించేది వారి నిర్వచనం, వారి ప్రశ్నలూ ఉత్తమ కవిత్వం విషయం లో ముమ్మాటికీ సబబే. ఉత్తమం కాని కవితలు ఉండవా? ఉండకూడదా అన్న ప్రశ్న వారు వేయలేదు. అఫ్సర్ గారి కవిత కూడా బాగున్నా నచ్చలేదు, కారణాలు పైవాటి లానే)

ఈ కవిత్వం రాసినవారు బహుశా పెద్దవారై ఉండచ్చు, వారిపై దురభిప్రాయం లేదు, ఈ కవిత్వం మాత్రం విమర్శకు తావిచ్చింది అన్నది సత్యం (నా దృష్టిలో)
>>ఇది కవిత్వమేనా? ఐతే, ఎందుకు అవును? కాకపోతే, ఎందుకు కాదు?

ఈ ప్రశ్నల్లోనే చాలా తిరకాసులున్నాయి. ఇది కవిత్వం అవును/కాదు అని నిర్ణయించేది ఎవరు? ఒక పాఠకుడా? ఒక విమర్శకుడా? ఒక కవా? ఒక పాఠకునికో, విమర్శకుడికో కవికో ఇది కవిత్వం కాదనిపించిందనుకుందాం. మరొకరికి కవిత్వమే అనిపించిందనుకుందాం. అప్పుడది కవిత్వమా కాదా అని ఎలా తేలుస్తాం? ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటింగు పెట్టా?
ఎందుకు అవును ఎందుకు కాదు అన్న ప్రశ్నలకి కూడా ఇవే సందేహాలు వర్తిస్తాయి. సరే ఏదో శాస్త్రపద్ధతిలో వీటికి సమాధానాలు వెతుకుదాం అనుకుంటే... అసలల్లాంటి శాస్త్రం ఉన్నదా? లేదు. నా దృష్టిలో అది సాధ్యమూ కాదు. మరింక ఇల్లాంటి ప్రశ్నలు వేసుకొని బుఱ్ఱలు బద్దలుకొట్టుకొనుట ఏల?

మీరు వచనపద్యంగా ఉదహరించిన ఆ వాక్యసముదాయం నాకు కవిత్వాన్ని చదివిన అనుభూతినిచ్చిందా, నచ్చిందా? ఎందుకు నచ్చింది/నచ్చలేదు - ఇలా అడగండి, ఎంతోకొంత మాట్లాడగలను.

నాకది కవిత చదివిన అనుభూతిని ఇవ్వలేదు. నచ్చలేదు. ఎందుకు?

1. గాఢమైన అనుభూతి కాని, తీవ్రమైన ఆలోచన కాని, కనీసం ఒక కొత్త దృక్కోణం కాని అది నాకు మిగల్చలేదు.
2. తలాతోకాలేని వాక్యాలు (5, 7, 12, 15, 17), మోకాలికీ బోడిగుండుకీ ముడిపెట్టిన భావాలు - కలగూరగంపగా గందరగోళం మిగిల్చాయి.
3. మన పురాణాల మీద, కవుల మీద నిర్హేతుకమైన కసి ద్వేషం - ఈనాటి ఒక సమస్యతో ముడిపెట్టి వెళ్ళగక్కడం, అసహ్యం వేసింది.

అయితే, ఇది కవిత్వమా కాదా అని నిర్ణయించే శక్తి, అధికారం నాకు లేవు.
బాబు said…
తూచేందుకు రాళ్ళు లేవు గానీ గోక్కునేందుకు గోళ్ళున్నాయి. చలం దగ్గరే లేకపోతే మాకాడ ఏడనుంచి వస్తాయి స్వామీ..!
వీరతాడు అని వ్రాస్తే చమత్కారం-అధరకాగితం అని రాస్తే చీత్కారం (రెండూ దుంప సమోసాలే). బాలసుబ్రమణ్యం హిందీలో పాడింది పాటే అయితే, ఉదిత్ తెలుగులో పాడింది కూడా పాటే..! శ్రీశ్రీ మరోప్రస్థానంలో రాసింది కవిత్వమే అయితే, త్రిపురనేని శ్రీనివాస్ రాసింది కవిత్వమే కనుక అయితే, మీరు ఉదహరించినది కూడా కవిత్వమేనని- ప్యాంటు చినిగినా సరే...తోలు ఊడినా సరే..తొడగొట్టి చెప్తున్నాసారూ..!

పదండి ముందుకు..పదండి ముందుకు..పదండి ముందుకు..
మీరువెళ్తూ ఉండండి.. నేను తొడకి ఆయిట్మెంటు రాసుకొస్తా!
స్పందించిన అందరికీ అనేకానేక ధన్యవాదాలు. ఆసక్తి కరమైన విషయాలు చాలా వచ్చినై. నా దృక్కోణం కూడా చెబుతాను ఒకటి రెండు రోజుల్లో. ఈ లోపల ఇంకెవరైనా చెబుతారేమో చూద్దాం.
budugu said…
lol..బాబు గారు. వీరతాళ్ళు, అధరకాగితాలు రెండు రాక్షస సమాసాలే.
మొదటిది రాక్షసుల సంభాషణ కోసం సృష్టించారు కాబట్టి చమత్కారం. రెండవది మనుషుల్లో వాడుకుంటే రసాభాస. ఈ అధరకాగితం ఎక్కడో విన్నట్టుంది. అప్పుడూ ఇప్పుడు అన్నవాళ్ళను రెండు పీకాలనిపిస్తుంది. ఉదిత్ నారయణ్ పాట విని నవ్వారు కాని శ్రేయాఘోషల్ పాటను విని నవ్వినవాళ్ళు ఎక్కువ లేరు. స్థాయి భేదాలు లేవంటారా?
బాబు said…
@బుడుగు గారు
అప్పుడు అన్నాయన ఇప్పుడు దొరకడు. ఇప్పుడు అన్నాయన్ని మాత్రం ఎప్పుడు కావాలంటే అప్పుడు పీకచ్చు. చంద్రబోస్..లిరిసిస్ట్..హైద్రాబాద్(చెప్పింది నేను అని చెప్పకపోతే చాలు..). బొంబాయి ప్రియుడు అనే సిన్మాలో "గుప్పెడు గుండెను తడితే" పాటకు కాగితాన్ని ఆ రకంగా వాడారు.
తాళ్ళూ కాగితాల్నీ వదిలేస్తే , బాల సుబ్రమణ్యం పాడిన హిందీ పాటలను అనుకరిస్తూ మా హిందీ మిత్రులు పడీపడీ నవ్వుతుంటారు..కానీ ఆ పాటలు హిట్..ఉదిత్ తెలుగు పాటల్లాగే..! స్థాయి భేదాలను కొలిచే స్కేళ్ళు నా దగ్గర లేవు..సారీ!

నేను పాడిందే పాట..నేను రాసిందే రాత అనుకుంటే ఆ పాటకి, రాతకి కాలం చెల్లినట్లే.(బ్రహ్మకి వర్తించదు-వ్యాఖ్యాత సమయం)
pi said…
నాకు కవిత్వం గురించి పెద్దగా తెలియదుకాని, ఈ కవిత అస్సలు నచ్చలేదు. ఒక structure లేదు, భావం లేదు.
రెండురోజులయ్యింది మాష్టారూ....ఛాయారాజు గారి కవిత మీద మీ ఛాయ/నీడ ఏదండీ? :)

నేనైతే ఓ పేద్ద వమనం చేసుకున్నా మళ్లీ అది చదివి....సనత్ గారు చెప్పినట్టు విమర్శకు "చక్కగా" తావిచ్చే కవిత అది....నాలాటి ఉత్సాహపరులకు మరింత ఉత్సాహం ఇలాటి చిక్కుముడులు చూసినప్పుడు..... రాస్తే గిలకలబావిలో మళ్లీ గులకరాళ్లేసానంటారు మీరు...:)
రాఘవ said…
నావఱకూ నేను కవిత్వమంటే “ఏ స్థితిలో ఉన్న పాఠకుణ్ణి/శ్రోతని ఐనా చెప్పేటప్పుడు కవి ఏ స్థితిలో ఉన్నాడో అచ్చంగా అదే స్థితిలోనికి తీసికొనివెళ్లగలిగినది” అని అర్థం చెప్పుకుంటాను. సరీగ్గా ఇక్కడే పాఠకభేదాలు కూడా వస్తాయి. ఏది చెప్పినా అర్థం చేసికొనగలిగిన (ఉత్తమ) పాఠకునికి/శ్రోతకు కూడా హృదయతంత్రులు మీటలేనిది కవిత్వమే కాదు. డమడమధ్వనికంటె హీనం. ఇక్కడ పాఠక/శ్రోతృభేదాలు ఎందుకు వచ్చాయంటే పదవాక్యప్రమాణాలు తెలిసి చదివే పద్ధతి కచ్చితంగా ఉత్తమమైనది కనుక. ఎంత బాగా మన భావం హృదయానికి హత్తుకుంటుందో అంత మంచి కవిత్వం. కవిత్వానికి ఎలా చెప్పామన్నదానికంటె ఎంత బాగా ఎంత పూర్ణంగా చెప్పగలిగామన్నది ముఖ్యం. ఎంత బాగా ఎంత పూర్ణంగా అర్థం చేసికొనగలము అన్నది పాఠకుడికి/శ్రోతకు ముఖ్యం. వాడే ప్రతి పదంతోనూ చెప్పే ప్రతి భావంతోనూ పరిచయం ఉండటం ఉత్తమపాఠక/శ్రోతృలక్షణం. “తొలినాళుల పద్యార్థము తెలియనిచో పాఠకునిది తెలియమి…” అన్నపుడు విశ్వనాథవారి ఆవేదన చెందారంటే కారణం ఈ రకమైన ఉత్తమపాఠకులు లోపిస్తున్నారని. విలక్షణంగా చెప్పడం, తన అనుభవాన్ని జత చేయటం కవిలక్షణం. విలక్షణంగా చెప్పడం అన్నదానిలోనికే ధ్వని రీతి రసం ఇత్యాదులు అన్వయిస్తాయి. ఋషుల ప్రయోజనం వీలైనంత స్పష్టంగా అధమపాఠకునికి/శ్రోతకు కూడ అర్థమయ్యేలా చెప్పటం కనుక వారి పదజాలం వాక్యనిర్మాణం సరళంగా ఉంటుంది. ఒకమాటలో చెప్పాలంటే కవిత్వమంటే కేవలం వాల్మీకిది. ఆయనే తొలి కవి. ఆయనే చిట్టచివఱి కవి. మిగతావారు కేవల కవిశబ్దవాచ్యులు.

నేటికాలంలో బయటకు చెప్పకపోయినా నన్ను కవిని కానన్నవాణ్ణి కత్తితో పొడుస్తా అనేవారే అధికసంఖ్యాకులు. నాలుగు పద్యాలల్లటం కూడా కవిత్వమే ఐతే ప్రపంచంలో కవులు కానివారు దుర్భిణీవేసి వెతికినా కానరారు.

జగన్నాథ పండితుడు రమణీయార్థప్రతిపాదకశ్శబ్దఃకావ్యమ్ అన్నాడు. ఈ వాక్యానికి చాలా వ్యాఖ్యానం అవసరం ఔతుంది. కనీసం చెప్పబోయేదానికి అర్థం ఉండి తీరాలి. హూ హా కైకర్ బీకర్ అంటే అవేవో అరుపులౌతాయే తప్పితే కవిత్వం కాదు.

ఈ మధ్య కవిత్వం అనే దానికి వింత అర్థాలు చెప్పటం ఎక్కువయ్యింది. ఒకాయన సబ్బుబిళ్ల అగ్గిపుల్ల ఇత్యాదులపై కూడ కవిత్వం చెప్పవచ్చు అన్నాడు. అధమపాఠకుడు వస్తువు ఏదైనా ఇబ్బంది లేదని అర్థం చేసుకుంటాడు. ఉత్తమపాఠకుడు ఏ వస్తువుకైనా ఉదాత్తతను సంపాదించిపెట్టి కవిత్వం చెప్పవచ్చు అని అర్థం చేసుకుంటాడు. ఆయన చెప్పినదానికీ ఇక్కడ అర్థానికీ ఎంత దూరం ఉంది? ఎందుకు వచ్చింది ఇంత వ్యత్యాసం? అలా చెప్పడం ఆ చెప్పినాయన ధోరణి. (ఇది నా దృష్టిలో మధ్యమకవిత్వం.) సరే, ఇంతకూ విషయమేమిటంటే, నాలుగు పదాలు పేర్చి అర్థం మీరే వెతుక్కోండి అంటే అవి సూత్రాలు అవ్వచ్చు కానీ కవిత్వం మాత్రం కాదు.

ఇక కవిత్వానికి సానబెట్టటం దానిని చెప్పినవ్యక్తికే సాధ్యం. చెప్పదలచుకున్నది కవే కనుక. ఆ చెప్పదలచుకున్నది అర్థం చేసికొంటే కానీ సానబెట్టటం కుదఱదు. అర్థం చేసికొనేలా ఉంటే అది కవిత్వమే అవ్వాలి. కాబట్టి సానబెట్టవలసిన అవసరం కలిగిందీ అంటేనే అది (ఉత్తమ)కవిత్వం కాదూ అని స్పష్టం.

ప్రస్తుతం మీరు ఉటంకించినది నా దృష్టిలో కవిత్వం కాదు.
ముందుగా, వ్యాఖ్యలు రాసిన మిత్రులందరికీ పేరుపేరునా నెనరులు.
రెండవదిగా, గతవారం అనుకోకుండా దేశాంతరం తటస్థించింది, అందుకని నా అభిప్రాయం రాద్దామనుకుంటూనే ఆలస్యమయింది.

ఈ టపా వేసినప్పుడు, ఎవరూ పెద్దగా పట్టించుకోరులే అనుకున్నా. పట్టించుకోవడమే కాదు, ఎంతో చక్కటి వ్యాఖ్యానాలు కూడా వెలువరించారు మీరందరూ. పనిలో పనిగా బుడుగు, బాబు గార్ల మధ్య మంచి చమత్కారాలు కూడా దొర్లినాయి. నాకు చాలా సంతోషమైంది.

నా దృష్టిలో ఇది తప్పకుండా కవిత్వమే. ఇది కవిత్వమే అనడానికి నాకు కనిపించిన లక్షణాలు ఇవి - నిర్దిష్టమైన వస్తువు, చెప్పడంలో ప్రతీకల వాడుక, భాష వాడుకలో ఒక చమత్కారం, ఒక లయ, వ్యంగ్యంలో ఘాటైన విరుపు, మొత్తమ్మీద పద్యాన్ని చూసినప్పుడు ఎంత స్పష్టంగా చెప్పడం ఉన్నదో కొంత సంక్లిష్టత, కొంత తెరమరుగు కూడ ఉన్నది. పద్యం చదివినప్పుడు వివిధ దృక్కోణాలకి, విభిన్న విచారణలకి తావిచ్చేది ఈ సంక్లిష్టతే.

నేను అర్ధం చేసుకున్న తీరుగా కొన్ని వివరణలు.
ఈ పద్యానికి వస్తువు భారతం కుంతి కాదు. ఎనాడో భారతంలో మోసపోయిన కుంతిని తల్చుకుని ఏడవడం ఈ కవి లక్ష్యం కానే కాదు. ఈనాడు ప్రబలి ఉన్న పాశవిక సంస్కృతికి బలైపోతున్న కుంతి. ఆ బలిని అడ్డుకోకపోవడమే గాక, బలిపీఠాన్ని కూడా తానే సిద్ధం చేసి, బలి జరుగుతుంటే కళ్ళు మూసుకుని ఆ బలిని క్షమిస్తున్న, ప్రోత్సహిస్తున్న వ్యవస్థ మీద నిరసన.
పద్యం మూడు భాగాలుగా ఉంది. "బులుపు తీర్చుకున్నారు" అనే వరకూ మొదటి భాగం. ఇదే అతి పొడవైన భాగం. మొదలు పెట్టి ఇక్కడిదాకా చదివినప్పుడు ఈ కవికి భారతమన్నా, ఆర్ష సాంప్రదాయమన్నా, భారతీయ హిందూ సంస్కృతి అన్నా ఎంత ద్వేషం అనిపించక మానదు. కుంతి మీద పెద్దగా జాలి కలగదు కానీ అలాంటి అమాయకురాల్ని అంతదారుణంగా అంత లాఘవంగా మోసగించి ఏదో గొప్ప ఘనకార్యం చేశాం అని మురుసుకుంటున్న దేవపురుషుల మీద కడుపు రగలక మానదు.
"కళ్ళంలోనూ" అనే వరస దగ్గిరికి వచ్చేసరికి పద్యం ధోరణి (టోన్, స్వరం) మారింది. ఇప్పటిదాకా చెప్పింది ప్రతీక మాత్రమే - ఇప్పుడే బయట పడుతున్నది అసలు వస్తువు. మనం ఇప్పటిదాకా అనుకున్నట్టు ఈ పద్యం భారతం గురించి కానీ పౌరాణిక పాత్ర కుంతి గురించి కానీ కాదు. ఇది ఇప్పటి గురించి, మన చుట్టూ ఉన్న సంస్కృతిని గురించి, మనం జీవిస్తున్న వ్యవస్థ గురించి అని అర్ధమయ్యేప్పటికి ఒక షాక్ తగులుతుంది. ఎప్పుడో జరిగిన, అసలు జరిగిందో లేదో తెలియని కథలోని కుంతిని తల్చుకుని జాలి పడ్డం, ధర్మాగ్రహం ఫీలవడం వేరు. ఇప్పుడే, ఇక్కడే, మన చుట్టూ వేలాది సంఖ్యలో కుంతులు ఉన్నారు, కర్ణులకి జన్మనిస్తున్నారు అని తెలిసినప్పుడు కలిగే ఫీలింగ్ వేరు. పద్య గమనంలో అకస్మాత్తుగా వచ్చే ఈ మార్పు ద్వారా గొప్ప ఎఫెక్టు సాధించాడు కవి. "ఫ్యూడల్ సంస్కృతి పురిటిలోనే మీసమెత్తి పుడుతుంది" - ఈ వాక్యం నాకు చాలా నచ్చింది. చిక్కనైన వాక్యం.
ఇక మూడో భాగం దిశా నిర్దేశం చేస్తుంది - మౌనంగా ఉంటే కుదరదు, విప్లవం జరిగితే కాని వ్యవస్థ మారదు అనేది ఆ దిశా నిర్దేశం.
ఈ పద్యంలో పని చెయ్యని అంశాలు, అనవసరమైన ప్రస్తావనలు, ఇమడని అన్వయాలూ ఉన్నాయి.
వేణిని జారేసుకుంది వోణీని జారేసుకున్నట్టు - అన్న వరుసకి అన్వయం అంత తేలిగ్గా కుదరదు. కేవలం ప్రాసబాగుందని వాడేసినట్టుంది. కవిసామ్రాట్టులూ కరుణాశ్రీలు అన్న ప్రస్తావన - నాకు అర్ధమైనంతలో జంధ్యాల పాపయ్య శాస్త్రిగారు రాసిన కుంతికుమారి ఖండిక గురించి. అందులో ముఖ్యంగా కుంతి మనసులో అయోమయాన్ని, బాధని కరుణరసభరితంగా చిత్రించారు కవి. ఘంటసాల గళంలో ఆ ఖండిక ఇంటింటా వ్యాపించి బహుళప్రజాదరణ పొందింది. ఆ ఖండికని పాఠంగా బడులలో బోధించి అదే సంస్కృతిని వ్యాపింప చేస్తున్నారు అనేది ఈ పద్యంలో ఉద్దేశం కావచ్చు. కానీ ఆ అన్వయం నాకు సరిపడలేదు. కవిసామ్రాట్టు ప్రస్తావన అనవసరం. అదికూడా ప్రాసబావుందనీ, పనిలోపనిగా విశ్వనాథ వారు సనాతన సాంప్రదాయవాది అనీ ఆయన్ని కూడా ఇందులో చేర్చినట్టు ఉంది.
ఇక దిశానిర్దేశానికై రాసిన చివరి మూడు వరుసలూ చాలా పేలవంగా ముగిసినై. అవి స్లోగన్లే. మిగతా పద్యాన్ని ఒక ఆలోచన ప్రకారం శ్రద్ధగా నిర్మించిన కవి ఈ ముగింపుని అర్ధాంతరంగా హడావుడిగా మూడు ముక్కల్లో తేల్చేశారు. దాంతో పద్యానికి మొత్తమ్మీద రావలసిన ఎఫెక్టు తేలిపోయింది.

ఈ పద్యం శీర్షిక "కుంతి". రాసింది ఛాయారాజ్. దీన్ని నేను కవితా ఓ కవితా అనే సంకలనంలో చదివాను.
కొత్తపాళీగారు,

మీ అభిప్రాయాలని మార్చాలని కాదు కాని, కవిత్వం గురించి మరి కొంత లోతుగా ఆలోచించాలన్న ఉద్దేశంతో మీ వ్యాఖ్యకి యీ ప్రతివ్యాఖ్య రాస్తున్నాను. మీరు కవిత్వంగా చెప్పిన లక్షణాలన్నీ కవితా స్వరూపానికి సంబంధించిన సాంకేతిక అంశాలు. ఇవన్నీ ఉన్నా ఒక రచన కవిత కాకుండా పోవచ్చును కాదంటారా?

అందుకే, ఒక కవిత గురించి నేనే విమర్శ చదివినా ముందుగా అందులో ఆ విమర్శకుడు (ఒక పాఠకునిగా) పొందిన అనుభూతి ఏమిటన్నదానికోసం చూస్తాను. నా ఉద్దేశంలో అది అసలు కవితా కాదా అన్నది ఆ అనుభూతి పట్టిస్తుంది. ఈ కవిత చదివిన తర్వాత మీకు ఎలాంటి అనుభూతి కలిగింది? ఏదైనా కొత్త అనుభూతి కాని, కొత్త ఆలోచనలు కాని మనసులో చెలరేగాయా? ఒక పాఠకునిగా నాకిది ముఖ్యం (మీరు కవితని ఎలా అర్థం చేసుకున్నారన్న దానికన్నా ఇది ముఖ్యం).

ఇక, మీ వివరణపై నాకొచ్చిన సందేహాలివి.
"ఎనాడో భారతంలో మోసపోయిన కుంతిని తల్చుకుని ఏడవడం ఈ కవి లక్ష్యం కానే కాదు." భారతంలో కుంతి మోసపోయిందా?
"ఈనాడు ప్రబలి ఉన్న పాశవిక సంస్కృతికి బలైపోతున్న కుంతి." - ఈనాడు బలైపోతున్న స్త్రీలకీ కుంతికీ ఏమిటి సంబంధం?
"కానీ అలాంటి అమాయకురాల్ని అంతదారుణంగా అంత లాఘవంగా మోసగించి ఏదో గొప్ప ఘనకార్యం చేశాం అని మురుసుకుంటున్న దేవపురుషుల మీద కడుపు రగలక మానదు." - ఎవరీ దేవపురుషులు? భారతంలో వాళ్ళా, ఇప్పటి మోసగాళ్ళా? భారతంలో దేవపురుషులు లాఘవంగా మోసం చేసి ఘనకార్యం చేశామని మురుసుకున్నారా? అసలు పద్యానికి వస్తువు భారతంలో కుంతి కానప్పుడు పద్యంలో అధిక భాగం ఎందుకు ఆ ప్రస్తావనతో నిండిపోయింది? అసలీ ప్రతీక వల్ల చేకూరుతున్న ప్రయోజనం ఏమిటి? నిజానికి మొదటి భాగమంతా కుంతి గురించే అని కూడా చెప్పలేం. కుంతి గురించే అయితే, మధ్యలో "గెడ్డం పెంచుకున్న ముని కీచకుడి ముందు కాలు జారేసుకున్నట్లు .." అన్న వాక్యం ఏమిటి?

"ఇక్కడే, మన చుట్టూ వేలాది సంఖ్యలో కుంతులు ఉన్నారు, కర్ణులకి జన్మనిస్తున్నారు అని తెలిసినప్పుడు కలిగే ఫీలింగ్ వేరు." ఈ విషయం ఈ పద్యం చదివినంత వరకూ ఎవరికీ తెలియదనడం హాస్యాస్పదం. అప్పటికే మనకి తెలుసున్న విషయమే అయినా, వైయక్తికమైన ఒక అనుభూతి మనలో ఒక కొత్త చలనాన్ని కలిగించే శక్తి కలదై ఉంటుంది. కవిత్వంలోని రహస్యమదే. కాని దాన్ని ఒక సాధారణ విషయంగా (general fact) సాధారనమైన వాక్యాలలో (ప్రభుత్వం అనాధ శరణాలయాలను చూపిస్తుంది, స్త్రీ శిశు సంక్షేమ బడ్జెట్టు మగ తేనెటీగలకు విందు చేస్తుంది) ప్రకటించినప్పుడు అది ఎల్లాంటి చలనమూ కలిగించదు కదా, మనకి తెలిస్న విషయాన్నే మళ్ళీ చెపుతున్నాడన్న చిరాకుకూడా కలుగుతుంది. కాదంటారా?

"ఫ్యూడల్ సంస్కృతి పురిటిలోనే మీసమెత్తి పుడుతుంది" - ఫ్యూడల్ సంస్కృతికీ పురుషాహంకారానికీ ఏవిటి అవినాభావసంబంధం? ఇప్పటి మన సమాజం ఫ్యూడల్ సమాజం కాదు. అయినా పురుషాధిపత్యమింకా కనిపిస్తూనే ఉంది కదా? ఈ రెంటికీ లింకెక్కడ? అమెరికాలో పురుషాధిపత్యం లేనేలేదా? ఈ వాక్యంలో మీకు కనిపించిన చిక్కదనం ఏమిటి?

"కవితా ఓ కవితా" సంకలనం నేను చదివాను కానీ ఈ కవిత గుర్తులేదు, అందులో చాలా కవితల్లాగానే.
కామేశ్వర్రావుగారూ, మీ చర్చ ఇక్కడ ఎప్పుడూ ఆనందదాయకమే.
రచనలో సాంకేతిక అంశాలున్నా అది కవిత కాకుండా పోవచ్చు - నిజమే.
నేను ఈ పద్యం గురించి పైన రాసింది నాకు కలిగిన అనుభూతే. సాంకేతిక లక్షణాలు కవితాంగాలు, భాగాలు అనుకుంటే మొత్తం పద్యం ఆయాభాగాలని మించిన ఒక అనుభూతిని మిగిల్చింది అనే నేను అంటున్నాను.
Whole is greater than sum of parts.

నా వివరణ మీద మీరడిగిన ప్రశ్నలు మీవంటివారు అడగవలసినవి కావు. అలాగని మీ ముందరికాళ్ళకి బంధం వెయ్యడం లేదు. కవిత్వంలో ప్రతీక ఉంది కానీ లెక్కల్లో ఫంక్షన్ల లాగా one-to-one సంబంధం ఉండదు అని మీకు తెలియనిది కాదు. ఉపమకీ, రూపకానికీ, ప్రతీకకీ ఉండే తేడాల్ని గురించి ఈ మధ్యనే ఇంకేదో బ్లాగులో మనమంతా ముచ్చటించుకున్నాం.
భారతంలో కుంతి మోసగించబడిందా? - మంచి ప్రశ్న. కర్ణుడు పుట్టిన క్షణంలో కుంతి స్థానంలో మనమే ఉంటే ఏమని ఫీలై ఉండేవారం? కారణాలు ఏవైనా (వరమివ్వడం ముని లక్షణం, మంత్ర బలంవల్ల బద్ధుడవటం సూర్యుడి లక్షణం - ల్లేక మంత్ర లక్షణం, ఇత్యాది) చివరిగా ఫలితం (జీవితాంతం) అనుభవించవలసి వచ్చినది కుంతే కానీ ఆ మునీ కాదు, సూర్యుడూ కాదు. ఇక్కడే నాకు ఆ పద్యంలో ఆ వ్యూహం నచ్చింది. ప్రస్తుతాన్ని హత్తుకునేట్లు చెప్పడమంటే అది స్లోగన్లే అవుతుంది. అందుకని దాన్ని ఒక పురాణ ప్రతీకగా చెప్పాడు. ఆ ప్రతీక చెప్పడంలో, (కుంతికి జరిగిన) ఆ అనుభవం వ్యక్తి అనుభవాన్నించి ఒక సమిష్టి అనుభవానికి కలుపుతూ, దానిలో వ్యవస్థ పోషిస్తున్న దుష్టపాత్రని ఆవిష్కరించాడు. ముని కీచకుడి ప్రస్తావన కూడా ఈ చట్రంలోనే ఇమిడింది. మామూలుగా మనం కుంతి కథని చదివినప్పుడు ఆ వరమిచ్చిన మునిని (దూర్వాసుడా?) ఒక benevolent benefactorలాగా చూస్తాము. కానీ చివరికి జరిగిన పర్యవసానం దృష్టితో చూస్తే ఆమె పట్ల అతడి ప్రవర్తన కీచకుడిమాదిరిగానే ఉన్నది కాదా? ఇంతకంటే వివరంగా నేను చెప్పలేను. ఇంకా విశ్లేషించ పూనుకున్నా అది చర్విత చర్వణమూ, శల్యపరీక్షా అయి కూర్చుంటాయని భయం కూడా.

ఇది గొప్ప కవిత్వం అనడంలేదు కానీ కవిత్వమే అంటున్నాను. పద్యం చదివాక తెలియని విషయమేదో తెలిసింది అనిపించకపోవచ్చు కాని తెలిసిన విషయాన్నే ఒక కొత్త దృష్టితో చూసిన అనుభూతి నాకు మిగిలింది. అందుకే నచ్చింది.
మీ వ్యాఖ్యలో నన్ననిటికన్నా ఆశ్చర్యపరచిన వాక్యం "నా వివరణ మీద మీరడిగిన ప్రశ్నలు మీవంటివారు అడగవలసినవి కావు."
నేనేదో "తేడా" మనిషినని మీరు ఊహించుకోవడం ఆ ఆశ్చర్యానికి కారణం! :-)

ఈ చర్చలో నాకనిపించిన దేమిటంటే, "కుంతి" కూడా ఈనాటి ఆడపిల్లల్లాగే మోసగింపబడిందనే అభిప్రాయం మీకుంది. అందుకే ఆ పోలిక మీకు నచ్చింది. నాకీ రెంటి మధ్యనా ఎలాంటి పోలికా కనిపించలేదు. కాబట్టి ఇది నాకు నచ్చలేదు. ఆ కారణంగానే, అసందర్భప్రేలాపాలుగా నాకనిపించిన అనేక వాక్యాలు మీకు అలా అనిపించలేదు. ఆ కారణంగానే అందులోని లోపాలని కూడా క్షమించేసి అది గొప్ప కవిత కాకపోయినా అది కవితే అని మీరు నిశ్చయించారు. ఆ కారణంగానే నేను ఆ లోపాలని క్షమించలేక అది కవితే కాదన్నాను.

దీని వల్ల నాలో చాలా రోజులుగా ఉన్న అనుమానానికి మరింత బలం చేకూరింది. కవిత నచ్చడానికీ నచ్చకపోవడానికీ అందులో చెప్పిన విషయంతో పాఠకునికి సహానుభూతి ఉందా లేదా అన్నదొక్కటే కారణం. దాని రూపమూ, అభివ్యక్తి వగైరా వగైరా ఆ విషయంలో శుద్ధ దండగ. నచ్చిన కవితల మధ్య తారతమ్యాన్ని గుర్తించడానికి అవి ఉపయోగపడవచ్చు తప్పితే అసలు కవిత నచ్చడానికి అవేవీ పనికిరావు. కాబట్టి కవిత్వాన్ని గురించి (ఇది కవిత, కవిత కాదు మొదలైన) general, objective statements are meaningless and futile.
కామేశ్వర్రావుగారు, తేడా అని కాదండి బాబు. అయినా మీరు చమత్కారానికి అంటున్నారు, నా భావం మీకు అర్ధమయే ఉంటుందని నా నమ్మకం. :)
కవిత్వమే కాదు, అసలు కళ అంటేనే ఈ subjective-objective భేదం వస్తూనే ఉంది. చర్చకి చివర అంగీకారం కలగకపోయినా, మంచి చర్చ దానికదే తృప్తిగా ఉంటుంది. నాకైతే తృప్తిగానే ఉంది - మీకు మరీ వొళ్ళు మండిపోలేదని ఆశిస్తున్నా.
ఒక రచన నచ్చిందా అన్న ప్రశ్న - అది కవిత్వమా కాదా అన్న ప్రశ్న: ఈ రెండిటి మధ్య ఉన్న సంబంధాన్ని ఇంకొంచెం తరచి చూడాలని ఉంది నాకు. చూద్దాం, ఇంకోపూట.
కామేశ్వర రావుగారు - బాగుంది మీ వ్యాఖ్య...:)

నాకు ఇదివరకు అప్పుడప్పుడు, వర్తమానంలో ఎప్పుడూ అనిపిస్తూన్నది ఇదీ - చెప్పిన భావాన్నే తిరగామరగాగా విపరీతమైన, విచిత్రమైన శబ్దజాలాన్ని ఉపయోగించి చెప్పిందే చెప్పి, చెప్పిందే చెప్పి కవితను "పులిమేసి" పాఠకుల బుర్రకు ఆ రంగు అంటిస్తున్నారేమో అనిన్నూ...బ్రష్షుచ్చుకుని ఓ నాలుగో, నలభయ్యో గీతలతో బొమ్మకో రూపమూ, ఆకారమూ తేలేనివాడు పక్కనే ఓ రంగుల తొట్టి పెట్టుకుని, రంగులు పులిమితే రూపం, ఆకారం లేని బొమ్మకు విలువ వస్తుందా అనిన్నూ.....

ఏదైతేనేం - ఎక్కడో, ఎప్పుడో చదివిన కవిత గుర్తుకు తెప్పించారు.....:)

రాతలు చేతలు కాక
పప్పులు గొప్పల మనుకొని
పండ్లను ఫట, ఫట కొరికితె
కవిత్వమౌనా?

పిచ్చి రాతలతో
ఇచ్చీ (దుఱద) వదుల్చుకుంటే
చచ్చీ చావని శవమల్లే
అసహ్యమేస్తుంది

పెడర్థమే అర్థమైతే
ఆభాసే భాషైతే
నీరసమే రసమైతే
పొయిట్రీ కాదిది
తొయిట్రీ, టాయిలెట్రీ

రక్తపు గిన్నె చేతుల్లో పట్టుకొని, పుర్రెల హారం మెళ్లో వేసుకొని, జుట్టు విరబోసుకొని, పాఠకుల నెత్తిమీద కరాళ నృత్యం చేస్తే కానీ నవ కవితకు నవ్యత కలగదు, కవిగారికి కరాళనృత్యం చెయ్యకపోతే నిద్రా పట్టదు...చివరకు మిగిలేదేమిటయ్యా అంటే ఆ నవకవి కరాళనృత్యం వల్ల పచ్చడైపోయిన బొమికల పెంటలోనుంచి వచ్చే వాసన. ఆ వాసన ఆస్వాదించేవాడిని బట్టి ఇంపా, కంపా అనేది తేలుతుంది.......సర్వేజనా స్సుఖినోభవంతు...జై కాళీ మాత...


చివరి మాట - కొన్నాళ్లు పోతే ఈ కింది విధంగా రాసి, మణిప్రవాళం అనగల సమర్థులు మన అపర కాళికావతార నవకవులు

ఆవిడతో నీ Black చీరని
किसीको देदो అంటే
Why? इस में मैं బాగులెనా
అని room లోకి आके
Bulb ఆర్పి अब देखो
అన్నది मेरी प्यारी

స్వస్తి అండి ఇహ....

భవదీయుడు
వంశీ
కల్పన గారు ఇలా అన్నారు:
చర్చ బావుంది. కవిత మీద కన్నా కామెంట్ల మీద బోలెడు చర్చించవచ్చు. కానీ నేను ఆ సాహసానికి పూనుకోవటం లేదు. సూటి గా నా అభిప్రాయం అయితే ఇది కవిత నే. మంచిదా, కాదా? ఉత్తమమైనదా , కాదా? amte మాత్రం భిన్నాభిప్రాయాలుండవచ్చు.

కల్పన
Ruth said…
నాకు కవిత్వం గురించి చెప్పేంత దృశ్యం లేదు గాని, పైనెవరో ఒకతను హేలో గురు... పాట గురించి రాస్తూ, "మహా మహా సుందరాంగులే పొందలెనివాణ్ణి" అంటె ఆ సుందరాంగున్ల్ని పొందలేక పోయాను అని అర్ధం అని రాశారు??? కాని నాకు ఆ వాక్యం మామూలు రచయిత అనుకున్నట్టే అర్ధం అయిందేంటీ? "మహా మహా సుందరాంగుల్నే పొందలెనివాణ్ణి" అని ఉంటే వ్యాఖాత చెప్పిన అర్ధం వచ్చేదేమో!

ఏంటి ఈ పిడకల వేట అంటారా, నాకు తెలుగు కూడా రాకుండా పోతోందేమో అని భయం, అంతే !!!
Sanath Sripathi said…
రూత్ గరూ!
మరీ నా వ్యాఖ్యతోనే తెలుగురాదేమో అని మీరు భయపడుతున్నారనే పెద్ద మాటేందుకులెండి కానీ, మీ ఉద్దేశంలో "పట్టుమని పది రాళ్ళైనా సంపదించలేనివాణ్ణి" కీ "మహా మహా సుందరాంగులే పొందలేని వాణ్ణి" కీ తేడా ఉందా? ఆ ఉదాహరణ నచ్చలేదు, ఇంకోమాటలో అడగాలి అంటే "ఎంసెట్ లో ఫస్టు ర్యాంకునే పొందలేని వాణ్ణి" ని తీసుకోండి...

ఒకవేళ మీ అనుకోలే నిజం అనుకున్నా "ఫలానా ఎక్స్, వై లే (మహా మహా సుందరాంగులు) నన్ను పొందలేకపోయారు .. అట్లాంటిది నేను నీ వెంట పడుతున్నా పట్టించుకోవట్లేదు అన్నప్పుడు ఆ అమ్మాయిపోలికలో హెచ్చు వైపు ఉన్నట్టా? తగ్గు వైపు ఉన్నట్టా? నువ్వెంత నీ అందమెంత అన్నట్టు (అంటే వారికన్నా తక్కువే అన్న భావం) స్ఫురించదూ??
Sanath Sripathi said…
కొత్తపాళీ గరూ!
మీ వ్యాఖ్యతో విభేధిస్తున్నందుకు క్షమించగలరు. నా ప్రతి స్పందన కొంచం వ్యంగ్యం గా ఉంటే అన్యధా భావించద్దు అని ప్రార్థన కూడా...

కవిత్వాన్ని నిర్వచనం చెబుతూ మీరన్నారు
(1) నిర్దిష్టమైన వస్తువు,
(2) చెప్పడంలో ప్రతీకల వాడుక,
(2) భాష వాడుకలో ఒక చమత్కారం,
(4) ఒక లయ,
(5) వ్యంగ్యంలో ఘాటైన విరుపు,
(6) మొత్తమ్మీద పద్యాన్ని చూసినప్పుడు ఎంత స్పష్టంగా చెప్పడం ఉన్నదో కొంత సంక్లిష్టత, కొంత తెరమరుగు.

చెబ్దామనుకున్నదాన్న్లో అస్పష్టతనే సంక్లిష్టత అనుకుంటే ఆ ఒక్క దాన్లో తప్ప, పై అన్ని లక్షణాల్లో ఈ కవిత తుస్సు మనిపించింది. పైపెచ్చు నాక్కొన్ని డౌట్లు కూడా పుట్టాయి.

(అ) లయ వచన కవిత్వానికి లక్షణమా? నిజం చెప్పండి? లయ జనబాహుళ్యానికి తోడ్పడే లక్షణమే కానీ కవిత్వానికి లక్షణం కాదు కదా () లయ లేని వచన కవితలు కూడా ఉన్నాయి కదా. జన బాహుళ్యాన్ని పొందాయి కదా?

(ఆ) ఈ కవితలో ఉన్న చమత్కృతి (కుంతి కడుపు మంట/ పంట ను వింతగా హిందూ రాజ్యాంగం గుప్త పరచుకోవటం...)

(ఇ)ప్రతీకల వాడుక:- ఆరేసుకోబోయి పారేసుకున్నాను అన్నట్ట్లు వోణీ జారేసుకున్నట్లు .. కాలు జారేసుకున్నట్లు...అని వాడేసుకున్నారు.. కొంచం ముందుకెళ్ళి నోరు పారేసుకున్నారు కూడా.. (అయినా కాలు జారటం విన్నం కానీ తలుపు జారేసుకున్నట్లు కాలు జారేసుకోవటం ఎమిటండీ... బహుశా ఇది చమత్కృతా?)

(ఈ) వ్యంగ్యం లో ఘాటైన విరుపు:- సమగ్రత చూడకుండా నచ్చినదానికి నచ్చిన విసురు చూపిస్తే అది వ్యంగ్యమౌతుందా? వ్యంగ్య కవి తెనాలి వారు చేసిన వ్యంగ్య కవిత్వంలో కూడా భావం లేదూ?? (కుంజర యూధంబు, మేక తోక.. మొ) అటువంటి భావం ఇక్కడ వ్యక్తమయ్యిందా?

(ఉ) నిర్దిష్టమైన వస్తువు :- తీసుకున్న వస్తువు, దానికి ఒక ప్రాధాన్యత, దాని మీద కవిగారి అభిప్రాయాలు అన్నీ దేనికవిగానే ఉన్నయి పొడి అన్నం మెతుకుల లాగా.. ఏమాత్రం స్పష్టత లేదు. కన్నె పిల్లను కని వదిలెయ్యటమేమిటి? వారి ఉద్దేశం ఆడపిల్లని కని వదిలేస్తోంది అనా? పైగా ఇక్కడ వారి అక్కసు/ ఆక్రోశం దేని మీడ? అబల పై జరుగుతున్న అన్యాయం పైనా? రాజ్యాంగం పైనా? కవులపైనా? పురాణ ఇతిహాసాలపైనా? లేక వీటన్నిటిపైనానా? కొంపదీసి బడ్జెట్టు ఎలాగూ ఉంది కదా అని కుంతుల్ని ఎడా పెడా కని పారేస్తున్నరా? సంఘటిత పోరాటాలు ఆనాటి కుంతికి లేవా? నిన్నటి కుంతి దేనితో పెనుగులాడింది? తనకన్యాయం జరిగిన సమాజం తోనా? అక్కడ అన్యాయం జరిగింది కుంతి కా? కర్ణుడికా? నిన్నటి కాలం లో హత్య కావించబడుతున్నది కుంతులా? కర్ణులా? నాకు తెలిసినంతవరకూ వోణీ జారేసుకున్నవాళ్ళు, వద్దనుకున్న గర్భాన్ని తుంచుకుని పోవటమో, వీలుకాకపోతే వద్దనుకుని కుప్పతొట్లో పారేసుకుని పోయి వేరే కాపురాలు చెయ్యటమో జరిగిందని నా భావం. కుంతులు హత్యకావించబడ్డప్పుడు కూడా భ్రూణహత్యలు జరిగినట్టే... కనుక ఎక్కువశాతం హత్యగావించబడ్డది కర్ణులే కానీ కుంతులు కాదేమో కదా... అప్పటి సమాజం మీద, సంస్కృతి మీద వింతవైఖరి చూపించి, సహజీవనాన్ని, పెళ్ళితో సంబంధంలేకుండా సంతతిని కనటాన్ని ప్రోత్సహిస్తున్న నేటి సమాజాన్ని సంఘటితపోరాటంగా అభివర్ణించటం ఏమిటి?

విశ్వనాథ సత్యనారాయణ గారి మాటనే నేను ముందు ఉదహరించా.. భాష, భావం, కవి గారి ఆవేశం, చెప్పే విషయం యొక్క ప్రాధాన్యత, కవిగారి నేర్పు వీటన్నిటి సమ్మేళనమే కవిత్వం... ఆ సమ్మేళనం చప్పగా ఉండకూడదు అని లేదు.
24 విభాగాల వాళ్ళు పనిచేస్తే అది సినిమానే, నోడౌట్. సంవత్సరానికి విడుదలయ్యే ఎన్ని సినిమాల్లో పైత్యప్రకోపాలు లేవు గనక? అంతమాత్రాన అవన్నీ సినిమాలు కాకపోయాయా ఏమిటి? చూసినవాళ్ళెట్టాగూ తేల్చేశారు వాళ్ళ నిస్చితాభిప్రాయం ఏమిటో... అయితే మాత్రం అవి సినిమాలు కావా? దేముడు మాత్రం అందరినీ మంచివారినే పుట్టించాడా ఏమిటి? బాలెన్సు ఉండద్దూ, అందుకే కొన్ని సినిమాలు అట్లా కూడా ఉండాలి... కొన్ని కవిత్వాలు ఇట్లా కూడా ఉండాలి. ఇట్లా ఉన్నంతమాత్రాన కవిత్వం కాదనగలమా? అంటే మాత్రం వింటారా? రెచ్చిపోయి వాద ప్రతివాదాలన్నీ కవిత్వం లో కుమ్మేసుకోరూ?

కాబట్టి, కట్టకడపటి కబురేంటటే పై కపిత్వం కూడా కవిత్వం కాకపోవటానికి కారణాలు కనుచూపుమేరలో కనపడటంలేదు (కావల్సివస్తే మీరింకొన్ని కాలూ, కీలూ, కూలూ కూడా కలిపేసుకుని కెలికేసుకోవచ్చుచు.. లయ ఇంకొంచం బాగుంటుంది కూడా...)
Sandeep P said…
మంచి చర్చ జరుగుతోంది ఇక్కడ. నా వరకు నాకు అనిపించేది ఏమిటంటే - కవి అనగానే ఇష్టమొచ్చినట్టు వ్రాసెయ్యొచ్చు అని లేదు. కవి కూడా ఒక సమాజంలోని జీవే. సమాజనియమాలను అనుసరించి తీరాల్సిందే. చాలా మంది కవులు కేవలం ఆర్ద్రతతో కూడిన సాహిత్యాన్ని అందిస్తూ ఉంటారు. ఇంత దేశాన్ని విమర్శించేవాళ్ళు నిజానికి దేశానికి ఏం చేశారు అన్నది ముఖ్యం. నిజంగా చేసేవాళ్ళు ఈ కవిత్వాన్ని వ్రాయక్కరలేదు. గాంధీ వ్రాశాడా? పటేల్ వ్రాశాడా? జయప్రకాష్ నారాయణ్ వ్రాశారా? లేక నరేంద్ర మోదీ వ్రాశారా? ఒక చిత్రం వలనో, ఒక కవిత వలనో సంఘంలో మార్పు వస్తుంది అంటే అది నేను నమ్మను. లేకపోతే శంకరాభరణం చిత్రం చూసిన ప్రతీ బ్రాహ్మడూ బడుగువర్గాల్లో ఉన్న లాఘవాన్ని అభినందించి ఆశ్రయం కల్పించేవాడు, భగవద్గిత ఒక సారి చదివిన వాడికీ మోక్షం రావాలి. అర్జునుడికే మోక్షం రాలేదు - ప్రత్యక్షంగా గీతను విన్నా - అదీ పరమాత్మముఖతః. మరి మనబోటివాళ్ళెంత?

మరి ఈ మాత్రం దానికి కొంతమంది మనోభావాలు కించపడేలాగా ఇంత బరువైన కవిత్వం వ్రాయనేల? పోనీ ఇందులో వ్యాకరణం, అలంకారాలు మొదలైన విషయాలు ఉన్నాయా అంటే లేవు. భావం సరైనదైనా పదాలు జాగ్రత్తగా వాడటం కవి లక్షణం. ఉదాహరణకి నా ప్రియురాలు రతీదేవిలాగా ఉందనిపించింది అనడం ఒక ఎత్తు, న ప్రియురాలిని చూస్తే వెంటనే రతిలో పాల్గొనాలి అనిపించింది అనడం మరొక ఎత్తు. మొదటిదానికీ, రెండోదానికీ భావంలో పెద్ద తేడాలేదు. కానీ, పలకడంలో మృదుత్వంలో తేడా ఉంది.

దాని బదులు ప్రతిమనిషిలోనో ఏదో చిన్న మార్పు తీసుకొచ్చే ఒక వ్యాసం వ్రాయడం మేలు.
Anonymous said…
@Ruth: నాకు గ్రామర్ రాదు. కానీ మీరు చెప్పిందే కరెక్టుగా ఉందనిపిస్తోంది.I don't know why others haven't commented/confirmed.
@sandeep:
>>గాంధీ వ్రాశాడా? పటేల్ వ్రాశాడా? జయప్రకాష్ నారాయణ్ వ్రాశారా?
రాశారు. కవిత్వం కాదుగానీ ఎడతెగని రాతలు రాశారు. వాళ్ళు ఏదో సాధించారనుకుంటే, అది సాధించటానికై వాళ్ళు చాలా రాశారు. కానీ, అది కవిత్వం కాదు.నరేంద్ర మోదీ ఏం సాధించడో తెలీదు. రాశాడో లేదో కూడా తెలీదు. ఐతే, ఒక్క స్వాతంత్ర్యపోరాటం చాలు, వివిధ కళలు ఏ విధంగా ’మార్పు’ని ఏ మేరకు సాధిస్తాయో తెలుసుకోవడానికి. మార్పు తేవడానికి ఓ వ్యాసమే చాలు అని నిర్ణయించలేరు.
@కొత్తపాళీ: ’ఛాయారాజ్ ’కుంతి’ via కొత్తపాళిగారి ’టపా’ ’ అంటూ నా బ్లాగులో రాశాను. కొంచెం చూసి చెప్పండి.
పైన సందీప్ వ్యాఖ్యని గమనించలేదు, ఇప్పుడూ మళ్ళీ రేరాజ్ ఎత్తి చూపేదాకా. చేసేవాళ్ళు వేరు, రాసే వాళ్ళు వేరు, చేసే వాళ్ళు బహుశా రాయడానికి కూర్చోకపోవచ్చు, కానీ ప్రపంచ ఉద్యమాలన్నిటిలోనూ కవిత్వం ఏదోవిధంగా ప్రధాన భూమిక పోషిస్తూనే ఉన్నది. భారత స్వాతంత్ర్య పోరాటానికి ఒకటి కాదు అనేక భారతీయ భాషల్లో అనేక పద్యాలు పాటలు స్లోగన్లయ్యాయి. ప్రస్తుతం ఈజిప్టులో చెలరేగుతున్న ఉద్యమంలోనూ ఈ కవితాత్మ సజీవంగా ఉన్నది.
ఉదా: ఈ వ్యాసం చూడండి.
"వేణిని జారేసుకుంది వోణీని జారేసుకున్నట్లు
తెలుసుకో లేక పోయింది మేక వన్నె పులి లాంటి
గెడ్డం పెంచుకున్న ముని కీచకుడి ముందు కాలు జారేసుకున్నట్లు .."

వేణిని జారేసుకుంది అంటే " she let her down hair" అని అన్వయమా అండీ?
Ruth said…
@ Sanath Sripathi గారు, నేను నిజం గానే నా తప్పు ఉందేమో అనుకుని రాసాను. కాని మీరు చెప్పిన ఉదాహరణలు చూసినా,పట్టుమని పది రూపాయల్నే" అంటే పదిరూపాయలు + నే సంపాదించలేని వాణ్ణి అని అలాగే EAMSET రాంకు+ నే సంపాదించ లేకపోయాను --> కాబట్టి సుందరాగులే కాకుండా సుందరాంగులనే అని ఉంటెనే మీరు చెప్పిన అర్ధం వస్తుందని నా అభిప్రాయం.
ఇక, మీ రెండో ఆప్షన్, నా అనుకోలు కరెక్టే అవడం, నా ఉద్దేశం ప్రకారం, ఆ పాట అంతా అదే tone తో ఉంటుంది. "మగాడి తో ఆడదానికేలా పౌరుషం..." కూడా అంతే కద? మరి రచయిత అలాంటి పాట ఎందుకు రాసాడు అంటె మాత్రం నాకు తెలియదు. నేను ఆ సినీమా చూడా లేదు, ఆ పాట మిగతా సాహిత్యం నాకు తెలియనూ తెలియదు. ఎదో ఆ రెండు ముక్కలూ మాత్రం స్కూల్ లొ అంతాక్షరి ఆడుకునేటప్పుడు పాడేవి అంతే.
@ Ray raj గారు, కదా !
Srinivas said…
చర్చకేమో గానీ ఉపచర్చ బాగుంది.
"ఎంసెట్ లో ఫస్టు ర్యాంకు పొందలేని వాణ్ణి"
"సుందరాంగులు పొందలేని వాణ్ణి"
ఈ రెండింటికీ తేడా ఎక్కడంటే ర్యాంకు కర్త కాలేదు కానీ సుందరాంగులు కర్త కాగలరు. అందువల్ల రెండో వాక్యానికి రెండు అర్థాలూ చెప్పుకోవడంలో తప్పు లేదేమో!
ఈనాటి తరం కేవలమ్ మట్టి ముద్దలనే, రాతి బండలనే ఇష్ట పడుతున్నారు...
వాటితో చేయాల్సిన శిల్పాలని ఇష్టపడటం లేదు....
అదో నవీన వాదంగా , అమాయకంగా అనుసరిస్తున్నారు....
వివరంగా చెపాలంటే...దయ చేసి గమనించ గలరు...

మట్టి ముడి సరుకు, బొమ్మలు చేయడానికి.
కాని కేవలం మట్టి ముద్దని చూపించి బొమ్మనలేం…

రాయి కేవలం ముడి సరుకు, శిల్పానికి చేయడానికి.
కాని కేవలం రాయిని చూపి శిల్పమనలేం…

అదే విధంగా ....
భావాలు కేవలం ముడి సరుకు, కవిత రాయడానికి.
కాని కేవలం భావాలు రాసి కవిత్వమనలేం…

కవితకి ఆయుష్షునివ్వడానికి (చాలా కాలం గుర్తుండడానికి)
కవిత్వాన్ని ధారంణ చేయడానికి (కఠస్థం చేయడానికి) ,
ఆ సాహిత్యాన్ని పాటకట్టడానికి,
శిల్పం( structure) తప్పని సరి..(వస్తువేదైనా సరే!)

ఈ విషయం మన పూర్వీకులకి వేల సంవత్సరాలక్రితమే తెలుసు....(అందుకే అలంకార, వ్యాకరణ, ఛందస్సు లు)

ఈ శిల్పాన్ని భావ, లలిత , జానపద సాహిత్యాలలో కూడా అత్భుతంగా ప్రసరింపజేయవచ్చు!!

ఇప్పుడు కవితలు రాస్తున్న చాలా మంది బ్లొగర్లు ఈ విషయాన్ని మరుస్తున్నారు....

కవితకి నిజమైన ఆదరణ దొరకాలంటే అందులో అందం (సౌందర్యం)వుండాలి,
అసలు నేటి తరం కవితల్లో ఆత్మ నే(soul)ఉండటం లేదు...

కేవలం భావాలని పాదాలు గా రాసి పోస్ట్ చేస్తున్నారు!మనసునొప్పించ కూడదని కామెంట్ లు పెడుతున్నారు!!


-సత్య
ఈనాటి తరం కేవలమ్ మట్టి ముద్దలనే, రాతి బండలనే ఇష్ట పడుతున్నారు...
వాటితో చేయాల్సిన శిల్పాలని ఇష్టపడటం లేదు....
అదో నవీన వాదంగా , అమాయకంగా అనుసరిస్తున్నారు....
వివరంగా చెపాలంటే...దయ చేసి గమనించ గలరు...

మట్టి ముడి సరుకు, బొమ్మలు చేయడానికి.
కాని కేవలం మట్టి ముద్దని చూపించి బొమ్మనలేం…

రాయి కేవలం ముడి సరుకు, శిల్పానికి చేయడానికి.
కాని కేవలం రాయిని చూపి శిల్పమనలేం…

అదే విధంగా ....
భావాలు కేవలం ముడి సరుకు, కవిత రాయడానికి.
కాని కేవలం భావాలు రాసి కవిత్వమనలేం…

కవితకి ఆయుష్షునివ్వడానికి (చాలా కాలం గుర్తుండడానికి)
కవిత్వాన్ని ధారంణ చేయడానికి (కఠస్థం చేయడానికి) ,
ఆ సాహిత్యాన్ని పాటకట్టడానికి,
శిల్పం( structure) తప్పని సరి..(వస్తువేదైనా సరే!)

ఈ విషయం మన పూర్వీకులకి వేల సంవత్సరాలక్రితమే తెలుసు....(అందుకే అలంకార, వ్యాకరణ, ఛందస్సు లు)

ఈ శిల్పాన్ని భావ, లలిత , జానపద సాహిత్యాలలో కూడా అత్భుతంగా ప్రసరింపజేయవచ్చు!!

ఇప్పుడు కవితలు రాస్తున్న చాలా మంది బ్లొగర్లు ఈ విషయాన్ని మరుస్తున్నారు....

కవితకి నిజమైన ఆదరణ దొరకాలంటే అందులో అందం (సౌందర్యం)వుండాలి,
అసలు నేటి తరం కవితల్లో ఆత్మ నే(soul)ఉండటం లేదు...

కేవలం భావాలని పాదాలు గా రాసి పోస్ట్ చేస్తున్నారు!మనసునొప్పించ కూడదని కామెంట్ లు పెడుతున్నారు!!


-సత్య