ది ఫైటర్ - తెరవెనుక కథ

ఈపాటికి తేదీలన్నీ గజిబిజి అయిపోయినై. ఈపాటికి మార్క్ వాల్బర్గ్ అందుకున్న నిరాకరణలని అన్నిటినీ ఎక్కడో తనమనసు లోతుల్లో పాతేశాడు. ఎన్నిసార్లు ఎవరెవరు ఈ సినిమాని నిరాకరించారు అని మార్క్‌ని అడిగి చూడండి, మనిషి ఉన్నట్టుండి మౌనం వహిస్తాడు పైకప్పు వేపుకి చూస్తూ. కాసేపాగి మెల్లగా అన్నాడు, "చాలా విషయాలు జరిగినై ఈ సినిమా గురించి." వెల్టర్ వెయిట్ బాక్సింగ్ ఛాంపియన్ మిక్కీ వార్డ్ జీవిత కథని తెరకెక్కించాలనే తన ఆశయాన్ని ఎందరితోనో పంచుకున్నాడు మార్క్ - గత అయిదేళ్ళలోనూ ఎందరో నటులు, దర్శకులు, స్టుడియో మేనేజర్లు ముందు ఆసక్తి చూపించడం, మెల్లగా పక్కకి జారుకోవడం. అయినా బాక్సింగ్ అభిమాని అయిన మార్క్ తన పట్టుదల వదల్లేదు, మిక్కీ పాత్రని విడవలేదు. పైగా తానే బాక్సింగ్ పోటీకి తయారవుతున్నట్టు శిక్షణ సాగించాడు. రానురాను, నిజంగా బాక్సర్ కాకపోయినా, అతి గొప్ప వెల్టర్ వెయిట్ బాక్సర్‌లాగా కనిపించసాగాడు. నేను బాక్సర్‌ని కాదు, అంటాడు నవ్వుతూ. కానీ ఈ సినిమాకోసం అతను పడిన కష్టం చూస్తే అతను బాక్సరే కాదు, బాక్సింగ్ చాంపియన్ అయినా ఆశ్చర్యం లేదనిపిస్తుంది.

లాస్ ఏంజిలస్ నగరానికి పశ్చిమంగా, కొండల్లో, పాంచెట్ల తోపు మధ్య తన ఇంటి వెనకాల ఉన్న సొంత జింలో ఉన్నాడు మార్క్ ఆ పూట. రెండున్నర వేల చదరపు అడుగుల ఈ జిం అతనికి మరో ఇల్లే అయింది ఇన్నాళ్ళూ. పూర్తి సైజు బాక్సింగ్ రింగ్, ఐదు బడ్వైజరు బీర్ చిహ్నాలతో సహా, 2003 లో పెట్టించాడు. ఇక ఎక్సర్సైజు మెషిన్లకైతే లెక్కే లేదు, ఎన్ని రకాలు ఉన్నాయో. గోడలమీద అక్కడక్కడా మొహమ్మద్ ఆలీ లాంటి బాక్సింగ్ హీరోల బొమ్మలు కొన్ని. బయట బోస్టన్ సెల్టిక్స్ టీం చిహ్నంతో పెయింట్ చేసిన బాస్కెట్ బాల్ కోర్టులో లియొనార్డో డికాప్రియో వంటి తోటి నటులతో అప్పుడప్పుడూ బాస్కెట్‌బాల్ ఆడుతుంటాడు మార్క్. అతని మనసులో ది ఫైటర్ సినిమా ఆలోచన ఎప్పుడోనే రూపుదిద్దుకున్నా, దాన్ని సాకారం చేసుకోవడానికి ఎందుకింత సమయం తీసుకుంది అంటే, చాలా కారణాలున్నాయి అంటాడు. ఐతే ఈ జాప్యం ఈ సినిమా ఇప్పటిదాకా వచ్చిన బాక్సింగ్ సినిమాల్లో అతి గొప్పదిగా తయారయేందుకు కూడా దోహదం చేసింది.

అతి గొప్ప బాక్సింగ్ సినిమా - ఈ బిరుదుని అందుకోవడానికి చాలా సినిమాలే పోటీ పడతాయి: ఇటీవలే వచ్చిన ది రెస్లర్ (డేరెన్ ఆరనోఫ్‌స్కీ, 2008) ముఖ్య నటీనటులకి ఆస్కార్ ప్రతిపాదనలు తెచ్చిపెట్టింది. 2004 లో క్లింట్ ఈస్త్‌వుడ్ తీసిన మిలియన్ డాలర్ బేబీ ఆస్కార్ల పంట పండించుకుంది. ఇంకా పాత సినిమాలు చాలా ఉన్నాయి. కానీ ఇవేవీ కూడా కథలోని ముఖ్యపాత్రల్ని గురించి మనం పట్టించుకునేట్టు చెయ్యవు - ది ఫైటర్ ఆ పని విజయవంతంగా చేస్తున్నది. ఈ సినిమాలో డికీ ఇక్లండ్ (మికీ వార్డ్‌కి మారుటి అన్న, కొన్నాళ్ళ అతని ట్రెయినర్, మాదకద్రవ్యాలకి అలవాటు పడినవాడు)పాత్రలో నటుడు క్రిస్టియన్ బేల్ చూపించిన నటన స్థాయికి ఈ ఇతర సినిమాలు వేటిల్లోనూ, ఏ నటీనటులూ సాటిరాలేరు. అంతే కాదు - అన్నిటకంటే ముఖ్యమైన తేడా - కథావస్తువుని మసిబూసి మారేడుకాయ చెయ్యకుండా, లేనిపోని హంగులు రంగులు వెయ్యకుండా ఉన్నదున్నట్టు చెప్పగల్గిన నిజాయితీ ది ఫైటర్‌లో ఉన్నట్టుగా మనకెక్కడా కనబడదు.

నిజజీవిత ముఖ్యపాత్ర మికీవార్డ్‌లోనే ఉన్నది ఆ నిజాయితీ. ఐదడుగుల ఎనిమిదంగుళాల పొడుగు, నూటయాభై పౌండ్ల బరువుతో వెల్టర్ వెయిట్ బాక్సింగ్‌లో అప్పటికి కొన్ని విజయాల్ని సాధించి ఉన్నా, ఒకదానివెంట ఒకటిగా వరసగా నాలుగు పోటీలలో అపజయం పొందేటప్పటికి ఏదో కొత్త స్పృహ కలిగి మొత్తానికే బాక్సింగ్ మానేశాడు 1991లో. మానేసి రోడ్లు వేసే పనిలో చేరాడు. ఈ రోడ్డు పని చెయ్యడంలోని శారీరక శ్రమ సినిమాలోని తొలిసీన్లలో కళ్ళకు కట్టినట్టు తీశారు. అతను వివిధ ప్రోద్బలాల వల్ల బాక్సింగ్‌కి తిరిగి వచ్చి కొన్ని విజయాలు సాధించినా, ఆ విజయాలలో కనులు మిరుమిట్లుగొలిపే చమక్ ఏమీలేదు. అసలు విషయమేంటంటే నిజజీవితంలో గానీ, బాక్సింగ్‌లోగానీ మిక్కీ ఒక పేద్ద హీరో కాదు, హిమాచలోన్నతుడు కాదు - అతి మామూలు వ్యక్తి, అతి నేలబారు మనిషి. అదే అతని ప్రత్యేకత. అతనిలోని ఆ లక్షణమే ఈ సినిమాకి ఇతర బాక్సింగ్ సినిమాలలోలేని విశిష్టతని తెచ్చిపెట్టింది.

నటుడు మార్క్ నిజజీవితానికీ బాక్సర్ మిక్కీ జీవితానికీ చాలా పోలికలున్నాయి. మిక్కీ లాగానే మార్క్ కూడా మాసచుసెట్స్ రాష్ట్రంలో, తొమ్మిదిమంది తోబుట్టువులలో చివరివాడుగా పెరిగాడు. యవ్వనంలో అనేక చెడుసావాసాలు మరిగి కొన్నాళ్ళు జెయిల్లో గడిపాడు. తన పద్ధెనిమిదేళ్ళ వయసులో మార్క్ మొదటిసారి బాక్సర్ మిక్కీని కలిశాడు. ఆ తొలి సమావాఏశం అతని మనసులో చెరగని ముద్రవేసింది. 2004లో, తాను అప్పటికే సినీతారగా ఎదిగినాక, మిక్కీని మళ్ళి కలిసి అతని జీవిత కథని సినిమా తియ్యాలనే ఆలోచన ఉన్నట్టు, మిక్కీ పాత్రని తానే పోషిస్తాననీ చెప్పాడు మార్క్. అదే ప్రతిపాదనని పారమౌంట్ స్టూడియోకి కూడా చెప్పాడు. ఐతే అప్పటికీ మిక్కీ వార్డ్ జీవితకథకి అన్ని హక్కులూ పొంది ఉన్న ఒక మీడియా సంస్థ మార్క్‌ని ఆ ప్రయత్నాన్నించి విరమించమని లీగల్ నోటీసులు పంపసాగింది. సుమారు రెండేళ్ళ సుదీర్ఘమైన కోర్టు యుద్ధం తరవాత, 2006 అక్టోబరు 13న - ఈ తేదీని మట్టుకు మార్క్ ఏమాత్రం తడుముకోకుండా గుర్తు చేసుకుంటాడు - పారమౌంట్ నించి ఫోనొచ్చింది, మిక్కీ జీవిత కథకి హక్కులు పొందామనీ, స్క్రిప్టు సిద్ధమైందనీ.

ఇక అటుపైన దర్శకుని కోసమూ ఇతర ముఖ్య పాత్రలకి నటీనటుల కోసమూ వెతుకులాట. మొదట్లో చాలా మందే ఆసక్తి చూపించినా, స్క్రిప్టు బాగుందని మెచ్చుకున్నా, ఎందుకనో మరి ఎవరూ నిలవలేదు. మిక్కీ మారుటి అన్న డిక్కీ ఇక్లండ్ పాత్ర చాలా ముఖ్యమైనది. మిక్కీ కన్నా సుమారు పదేళ్ళు పెద్దవాడు, అదే తల్లికి వేరే తండ్రివల్ల పుట్టిన సోదరుడు, కొంతకాలం ప్రొఫెషనల్ బాక్సింగ్ చేసి, తరవాత కొకెయిన్‌కి బానిస అయి జెయిలు పాలైనాడు, మిక్కీ తొలి రోజుల్లోనూ, ఆ తరవాత ప్రొఫెషనల్ బాక్సర్‌గా మారిన కాలంలోనూ మిక్కీకి ముఖ్య ట్రెయినర్‌గా మిక్కీ పక్కనే నిలబడినవాడు - స్క్రిప్టు లెక్కన చూసుకుంటే ఈ సినిమా ఎంతవరకూ మిక్కీ కథని చెబుతున్నదో, అంతమేరకీ డిక్కీ కథని కూడా చెబుతున్నది - ఎందుకంటే వారిద్దరి కథలూ విడదీయలేకుండా పెనవేసుకుని ఉన్నాయి మరి. మొదట్లో ఈ పాత్రకి మార్క్ సొంత అన్న డానీ వాల్బర్గ్ అనుకున్నారు, కానీ డానీకి తగినంత స్టార్ వేల్యూ లేదని స్టూడియో నిరాకరించింది. అటుపైన మేట్ డేమన్ అనుకున్నారు (మేట్ కీ మార్క్ కీ బాగా పోలికలుంటాయి, నిజంగా అన్నదమ్ముల్లాగానే అనిపిస్తారు), కొన్నాళ్ళు బ్రాడ్ పిట్ పేరు సూచించబడింది. కానీ ప్రాజెక్టు ముందుకు సాగక పోవడంతో ఆయానటులు నిలబడలేదు. అలాగే దర్శకునిగా ముందు ఆరనోఫ్స్కీని అనుకున్నారు. ఇంతలో అతను (2008లో) రెస్లర్ తీశాడు, మళ్ళీ ఇంకో బాక్సింగ్ సినిమా చెయ్యడానికి ఒప్పుకోలేదు. డిపార్టెడ్ సినిమాలో నటిస్తుండగా మార్క్ ఆ సినిమా దర్శకుడైన మార్టిన్ స్కోర్సీస్‌ని కదిపాడు దీని విషయమై. ఆయన స్క్రిప్టు చదివి చాలా బావుంది గానీ అప్పుడెప్పుడో (రాబర్ట్ డినీరోతో) రేజింగ్ బుల్ సినిమా తీసినాక ఇన్నాళ్ళకి ఇప్పుడు మళ్ళీ బాక్సింగ్ ప్రపంచంలో కాలుమోపే ఆసక్తి లేదు అనేశారు. అలా చివరికి, ఇంతకు మునుపు కొన్ని తాను నటించిన సినిమాల దర్శకుడైన డేవిడ్ రస్సెల్ పేరు ఖాయమైంది. ఇంచుమించు ఇదే సమయంలో, తమ పిల్లలు చదువుకునే ఎలిమెంటరీ బడి దగ్గర క్రిస్టియన్ బేల్‌ని కలిశాడు మార్క్. 2005లో మొదలైన బేట్‌మేన్ వరససినిమాల్లో బేట్‌మేన్ పాత్రపోషించడంతో బాగా ఖ్యాతి సంపాయించుకున్న బేల్ ఒక డ్రగ్ ఎడిక్టయిన డిక్కీ ఇక్లండ్ పాత్రకి ఒప్పుకోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది ఎవరికైనా. ఈ పాత్ర చెయ్యడానికి, బేల్ సుమారు 30 పౌండ్ల బరువు తగ్గాడు. సహజంగా చాలా అందగాడైన బేల్, అతి సాధారణంగా కొంచెం వికృతంగా కనబడ్డాడు డిక్కీ పాత్రలో - ఇక అతని నటన .. అద్భుతం. ఈ పాత్రలో బేల్ నటనని చూసి నిజ డిక్కీయే మెచ్చుకున్నాడు, అచ్చం తనలాగానే ఉన్నాడని. ఇంకో తమాషా - బేల్ మార్క్‌కంటే మూడేళ్ళు చిన్నవాడు! అలాగే వీళ్ళిద్దరి తల్లిగా వేసిన మెలిస్సా లియో ఈ నటులిద్దరికంటే సుమారు పదేళ్ళు మాత్రమే పెద్దది. ఆమెకూడా అద్భుతమైన నటన కనబరిచింది.

గమనిక: ఒక ఆంగ్లపత్రిక నించి అనువాదం

Comments

I hurt, అదేంటో యూకేలో దాదాపు అన్ని సినిమాలు ఆలస్యంగా విడుదలవుతాయి:(. ఇక్కడ ఈ సినిమా విడుదల తేదీ ఫిబ్రవరి 4, సోషల్ నెట్వర్క్ కూడా చాలా ఆలస్యంగా విడుదలైంది. గోల్డెన్ గ్లోబ్।కి ఉత్తమ ప్రతిపాదిత చిత్రాల్లో ఇన్।సెప్షన్, సోషల్ నెట్వర్క్ మాత్రమే విడుదలయ్యాయి. ఇక పిక్సర్ సినిమాలైతే అమెరికాలో వంద రోజుల పండగైతే తప్ప ఇక్కడికి రావు.

ఏదేమైనా, ఈ చిత్రం ట్రయలర్ చూసినప్పుడే బాగుంటుందనిపించింది. ఇప్పుడు వేచిచూడ్డం తప్ప ఏం చేయలేను.
Anwartheartist said…
బేల్ ఎప్పటికీ అద్భుతమే నాకు, ఏమి డెడికేట్ రా దేవుడా.
Anwartheartist said…
మామూలుగా సూపర్ హీరొల్లందరికన్నా కాస్త స్త్రౌట్ గా కనపడేవాదు బాట్మాన్ వొక్కడే పొట్టిగా మట్టంగా(ఇతర హీరొలతొపొల్చుకుంటే ) అట్లాంటి సినిమాలొ హీరొ గా కనిపించినా వాడు సంవత్సరం కిందటి మెషినిస్ట్ లొ ఆ స్కెలిటన్ వాడు , నిన్న మొన్నటి బాక్సర్ లొ డిక్కి వీడు, వీడు కదా కళాకారుడు అంటే . నారాయణస్వామి గారు నా చేతులు అమెరికకి పాకేంత పొడవుగా లేవు గాని ఈ సినిమా గురించి వ్రాసినందుకు మిమ్మల్నిక్కణుంచే కావిలించుకుంటున్నాను పట్టండి.
@కన్నగాడు, ఇప్పటికైనా చూశారా సినిమా?

@Anwar, చాన్నాళ్ళకి కనిపించారు. మంచి సినిమాలంటే మీకున్న అభిరుచి మీ బ్లాగులోనే ఎప్పుడో చదివిన గుర్తు. ఈ సినిమా చూసి చాలా థ్రిల్లయ్యాను. అందుకే పని గట్టుకుని తెరవెనక కథ కూడా వెదికాను. బేల్ నిజంగా చాలా అద్భుతమే. ఈ సినిమాలో సహాయ నటిగా ఆస్కార్ గెల్చుకున్న మిలిసా లియో ఇలా చెప్పారు ఒక ఇంటర్వ్యూలో - బేల్ చాలా పద్ధతి గల నటుడు. ఈ సినిమాలో అతను చేసింది నిజజీవిత పాత్ర కావడంతో అతను ఆ ఇంకో మనిషిలోకి పరకాయ ప్రవేశం చెయ్యడం - అతనితో నటించిన ప్రతి సీనులోనూ అబ్బురం గొలుపుతూనే ఉంది. అది కేవలం ఇమిటేషను కాదు. ఇంకొక మనిషిగా మారిపోవడమే.