ఒక వేసవి ప్రోగ్రెస్ రిపోర్టు

పోయినేడాది పెరటి వ్యవసాయం చిన్న యెత్తున చేసినా పెద్దయెత్తున సక్సెస్ కావడంతో ఈ సారి కార్యక్రమం భారీ అంచనాలతో మొదలు పెట్టాను. జూలై మొదటి వారానికి అసలు మొత్తం నీరు కారిపోయేలా అనిపించింది. ఏమైందో మొత్తానికి గత రెండువారాల్లో మొక్కలన్నీ కొత్త ఊపిరి పోసుకున్నట్టున్నాయి, తోట ననవలాడుతోంది. ఒక గొప్ప నిరాశ - గోంగూర అస్సలు రాలేదు. అవి పోయిన యేటి గింజలు మరి - పాతబడితే ఇక రావేమో?? చిక్కుడూ కూడా సరిగ్గా పెరగలేదు, అవి కొత్తగా ఈ దేశంలో కొన్నవే మరి. ఈ సారి మాతోటకి మెయిన్ ఎట్రాక్షన్ తలకిందుల టొమేటో మొక్కలు. మొక్కలు బాగానే ఉన్నాయ్ - చూద్దాం కాపెలా కాస్తుందో.

జూలై నెల అంతా ఎండలు బాగా కాశాయి - ఇంకా కాస్తున్నాయి.

మిషిగన్‌లో వసంతం సూచన ప్రాయంగా చివురించినప్పటినించీ మళ్ళీ మంచు కురిసేవరకూ రకరకాల పూలు వంతులేసుకుని కనులవిందు, నాసికలకి విందు చేస్తుంటాయి. ప్రస్తుతం లిల్లీల హవా నడుస్తోంది. అందులోనూ టైగర్ లిల్లీలని ఉంటాయి, ఒకలాంటి చెంగావిరంగు రేకలతో - ఎక్కడబడితే అక్కడ రోడ్ల వెంట పూస్తాయి. అవి అలా పక్కనుంటే రోడ్డు కనకాంబరం రంగు జరీతో ఉన్న ముదురునీలం పట్టుచీరలా ఉంటుంది. మా యింటిముందు వేసిన పది లిల్లీ మొక్కల్లో ఎనిమిదింటిని లేళ్ళు, కుందేళ్ళు తినేశాయి. రెండిటిని మాత్రం వెయ్యి కళ్ళతో కాపాడుకొస్తున్నా.

సంగీతం ఒక మోస్తరుగా వింటున్నా. మోహినీభస్మాసుర ట్రూపుతో టూరుకి వెళ్ళలేకపోయా పని వత్తిడి వల్ల. పక్క వూరికి వెళ్తేనైనా కాస్త హాల్లో కూర్చుని చూసే అవకాశం వస్తుందేమోనని ఆశపడ్డా, కుదర్లేదు, ప్చ్. కానీ ఆయా ఊర్లలో ఉన్న మిత్రులందరూ నా పోరు పడలేక వెళ్ళి చూసొచ్చి అద్భుతంగా ఉన్నదని చెబుతున్నారు. ఇంక ఒకే ఒక ప్రదర్శన మిగిలి ఉన్నది ఆగస్టు 13న షికాగోలో - ఆరోరాలోని దేవాలయంలో జరుగుతుంది.

నవల్లు చదివే ఓపిక లేదు, అంత టైము కమిటయ్యే తీరిక లేదు. అందుకని ప్రస్తుతానికి సాహిత్య పత్రికల్లో చిన్న చిన్న కథలు చదువుతున్నా. ఏదేవైనా ఈ అమెరికా పత్రికల్లో కథల తీరుకీ, మన కథల తీరుకీ చాలా తేడా ఉంది. ఇక్కడి కథలన్నీ జీవితమనే చలన చిత్రంలో ఇక స్టిల్ ఫొటో తీసినట్టు ఉంటాయి. సందేశాలూ పాడు ఉండవు. ట్విశ్తులు, ఉద్వేగాలూ కూడా పెద్దగా ఉండవు. SUN అని పత్రిక ఉంది. అందులో కథలు నాకు బాగా నచ్చుతాయి. మీకు దగ్గర్లో పబ్లిక్ లైబ్రరీ ఉంటే అందులో ప్రయత్నించి చూడండి. నచ్చితే చందా కట్టి తెప్పించండి.

తానా సావనీరు కాపీ పంపించారు సంపాదకులు. కంటికింపుగా బావుంది. ఎత్తీ దించీ చేస్తే బైసెప్సుకి మంచి వర్కవుటు కూడా అవుతుంది. ఇంకా లోతుగా చూళ్ళేదు.

ప్రస్తుతానికి ఇదీ ప్రోగ్రెస్.

Comments

Anonymous said…
తానా సావనీరు కాపీ పంపించారు సంపాదకులు. కంటికింపుగా బావుంది. ఎత్తీ దించీ చేస్తే బైసెప్సుకి మంచి వర్కవుటు కూడా అవుతుంది.
:)
చిన్న డౌటు అమెరికా చలిదేశం కదా. ఆ నేలలో మన సైడు పంటలు ఎలా పండాయండీ.
Kalpana Rentala said…
కొత్తపాళీ,బ్రీఫ్ గా అన్నీ విషయాలు చెప్పేశారు గా..ఏమైనా పంట కాపుకొస్తే మాకు ఇవ్వాల్సి వస్తుందని ముందే ఇంకా ఏమీ రాలేదని చెప్పేస్తున్నారా..:-))
కథల మీద మంచి ఆబ్జెర్వేషన్.
మురళి said…
అవి అలా పక్కనుంటే రోడ్డు కనకాంబరం రంగు జరీతో ఉన్న ముదురునీలం పట్టుచీరలా ఉంటుంది.
...బాగుందండీ పోలిక.. సావనీరుతో వ్యాయామం కూడా :))
చీర కాంబినేషన్ సూపర్!!! :-)
తృష్ణ said…
భలే భలే...లేళ్ళూ,కుందేళ్ళు..నిజంగా మీ ఇంటి ముందుకు వస్తాయాండీ? క్రితం ఏడు మీరు గోంగూర పెంపకం మరియు పచ్చడి గురించి రాసీన టపా గుర్తుంది..:)
మీరు మాటలతో భలే ఊరిస్తారండి మేస్టారు.. పుటోలు పెట్టమంటే పెట్టరు. జ్ఞానప్రసూనగారు చూడండి. ఎన్ని పోటోలు పెట్టారో తమ పెరటి మళ్లనుండి..

రోడ్డు కనకాంబరం రంగు జరీతో ఉన్న ముదురునీలం పట్టుచీరలా ఉంటుంది.
ఇప్పుడు మా వారికి టెండర్ పెట్టాల్సిందే.. వచ్చేది శ్రావణమాసం, పండగ సీజన్ కూడా సంక్రాంతి వరకు..
పక్కింటబ్బాయి, అమెరికా మొత్తం చలిదేశం కాదు, వైవిధ్యమైన వాతావరణం ఉంటుంది. మా వూరు చలిదేశమే. కానీ వేసంకాలంలో బాగానే వేడిగా ఉంతుంది. 60 నించి 90 రోజుల్లో కాపుకొచ్చే పంటలన్నీ బాగానే పండుతాయి. ఆకుకూరలు మరీను. ఇంటి వ్యవసాయంలో కొంచెం పైచెయ్యి సాధించడానికి విత్తనాలని ముందుగానే స్టార్టర్ కిట్‌లో ఇంట్లోనే నాటి, మొలకలు వచ్చాక, బయట తగినంత వెచ్చబడినాక నేలలో నాటుతాము. వీలుంటే పోయిన వేసవి టపా చూడండి.

కల్పన, మీ ఆస మరీనండీ. జూలైకే పంట రావాలంటే ఎలా? అవి కాయాలే గాని, మీకంటే ఎక్కువా?

మురళి, మీరు లిల్లీల హవా లో శ్లేష పట్టుకుంటారనుకున్నాను.

మందాకిని :)

తృష్ణ. అవునుతల్లీ అవును. ఈ లేళ్ళతో కుందేళ్ళతో బాధ ఇంతింత కాదు. చూడ్డానికి ముద్దుగానే ఉంటాయిగానీ.

జ్యోతి, లిల్లీ ఫొటో పెట్టానుగా. తోట ఫొటోలు అప్పుడే కాదు. సీజన్ చివర్లో.
ramesh said…
@ఇక్కడి కథలన్నీ జీవితమనే చలన చిత్రంలో ఇక స్టిల్ ఫొటో తీసినట్టు ఉంటాయి
భలే చెప్పారండి. కొన్ని సినిమాలు కూడా అలాగే వుండి, అప్పుడప్పుడు కొంచెం చిరాకు తెప్పిస్తాయి - ఎలా అర్ధం చేసుకోవాలో, ఎలా ముగించుకోవాలో తెలియక.
Mee Thota photos kooda petti vunte bavundedi kottapali gaaru :)
వేసవి పాఠశాల బాగుంది...తానా సావనీర్ పై అదిరింది సార్....
@Ramesh, I hear you. Did you see "Tree of Life"?
@విరిబోణి, తెలుగుని తెలుగులిపిలో రాయమని మనవి.
@వర్మ, :)
Anonymous said…
ఈ సారి మాకు కూడా "గోంగూర" మొండి చెయ్యి చూపించిందండీ! వంకాయలూ టమాటాలు తెగ కాసేయి. కిందటి సంవత్సరం చిక్కుడు కాయలూ, గోంగూరా, మేము తిన్నంత తిని ఊళ్ళో పందారం కూడా చేసాము. ఈ సారి చలికాలం వెళ్లగానే (ఇంకొక్క నెల రోజులు) మురళీ గోంగూర సంగతేంటో తేలుస్తానని శపధం చేసారు! మేము తోటలో రకరకాలు వేసి బుర్ర గోక్కునే టైపు నిజానికి (మేం వేసిందేం మొక్కో అర్ధం కాక!).
శారద
శారద, ఐతే మీరూ మాంఛి పెరటిరైతులన్న మాట. బాగుబాగు. విత్తనాలు జల్లాక, అవేం మొక్కలో అర్ధంకాక తలగోక్కోడం - ఈ విషయంలో మీరు నాతో పోటీ పడలేరు. మా నాన్నగారు బోటనీ మేష్టారు. నేను బోటనీ పండిత పుత్రుణ్ణి :)
చలి ప్రదేశం లో మీరు చక్కని పెరటి తోట పెంచుతున్నారు . ఇక్కడ నేను ఎంత కష్టపడ్డా నా కష్టమే మిగులుతోంది . ఎప్పటికైనా కనీసం ఆకుకూరలైనా పండించక పోతానా అని ఆశపడుతూ వుంటాను :)
నిజం గా తొట పెంచటం చాలా సంతొషాన్ని ఇస్తుంది.
అయితె తానా వాళ్ళ పుస్తకం మీకు బాగా
ఉపయోగపడింది అన్న మాట....హ...హ...
ramesh said…
లేదండి. German Cinema లా ఉంది.
@Ramesh, No, it's very much American.
Please see this
http://www.imdb.com/title/tt0478304/

If you have stomach for experimental and weird (not scary or anything, but still weird), you might try it. :)

@మాల, మా పెరట్లో కూడా మట్టి బాగుండదు. కాకపోతే, ఇక్కడ షాపుల్లో ఎరువు కలిపిన మట్టి సంచుల్లో అమ్ముతాడు. అవొక డజను సంచులు తెచ్చి కుమ్మరించేప్పటికి బాగానే పెరుగుతున్నాయి. అసలు ఆక్కూరలు అడివిలాగా పెరుగుతాయే, ఎందుకు పెరగటం లేదబ్బా?

@Sasi - true.