Monday, July 26, 2010

కబుర్లు - జూలై 26

ఆగస్టు 3 న ఇక్కడ ప్రైమరీ ఎన్నికలు. ఈ సంవత్సరం మిషిగన్‌కి గవర్నర్ని ఎన్నుకోవాలి. రెండు ప్రధాన పార్టీలలోనూ కొందరు హేమాహేమీలు బరిలోకి దిగారు కానీ ఎవరి ప్రచారమూ పెద్దగా ఊపందుకున్నట్టుగా లేదు. స్థానిక ప్రోగ్రాముల్లోనూ ఎక్కడా పెద్దగా చప్పుడు వినబడ్డం లేదు. ఈ రాష్ట్రం ఎంతగా కష్టాల్లో కూరుకు పోయిందంటే దీన్ని పైకి లేవదీసేందుకు ఏ అభ్యర్ధికీ పెద్దగా ఐడియా ఉన్నట్టు తోచదు.

ప్రైమరీలతో బాటుగా మరికొన్ని ముఖ్యమైన స్థానిక విషయాలు కూడా ఈ రోజున వోటింగుకి వస్తున్నాయి, ప్రజాభిప్రాయ నిర్ణయానికి. వీటిలో అతి ముఖ్యమైనది SMART బస్సులకోసం అవసరమయ్యే ఆర్ధిక మదుపు. SMART అంటే డిట్రాయిట్ పరిసరప్రాంతాల్ని అనుసంధానించే బస్సుల సిస్టం. స్వంత కారులేని వేలాది ఉద్యోగస్తులు తమ ఉద్యోగాలకి వెళ్ళేందుకు ఈ బస్సులమీద ఆధారపడి ఉన్నారు. ఇప్పుడూ వోటింగుకి వచ్చిన విషయం ఇప్పటికే ఉన్న ఆర్ధిక వనరుల్ని మరో ఐదేళ్ళదాకా పొడిగించమనే తప్ప, కొత్త సహాయం కోసం కాదు. అందుచేత, మీకు గనక వోటుహక్కు ఉన్నట్టయితే ఆగస్టు 3 న శ్రమ అనుకోకుండా పోలింగ్ స్టేషనుకి వెళ్ళి SMART ప్రతిపాదనకు వోటు వెయ్యవలసిందిగా ప్రార్ధన.

కాంగ్రెసు దిగువసభకి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. మొన్న ఒబామాగారి ఆరోగ్య చట్టం, అటుపైన బేంకు సంస్కరణల చట్టాలకి అనుకూలంగా వోటు వేసిన డిమోక్రాటిక్ సభ్యులందరికీ వ్యతిరేకంగా ఆ పార్టీనించే ప్రైమరీ అభ్యర్ధులు ఎదురవుతున్నారు. ఇది మంచిదే. ప్రజాస్వామ్యం అన్న తరవాత ఆ మాత్రం భిన్నాభిప్రాయం ఉండాలి. గత ఎన్నికలు గెలిచామని సంతృప్తిగా కూచున్న డిమోక్రాటిక్ నాయకత్వానికి ఏమన్నా కదలిక వస్తుందేమో చూద్దాం ఈ ప్రతిఘటనల వల్ల.

షెర్లీ షెరాద్ సంఘటన చాలా రాకాలుగా అనేక జీవితసత్యాలని ఆవిష్కరించింది. అసలు ఆవిణ్ణి గురించి తొలివీడియో బయటపడగానే ఈ హేమాహేమీలంతా కాళ్ళు విరగదొక్కుకుంటూ అంత నోళ్ళు పారేసుకోవడమేమి? ఎవడు బలవంత పెట్టాడు వీళ్ళని అడ్డగోలు స్టేట్మెంట్లిమ్మని? ఎవరిని నమ్మగలం? ప్రభుత్వాన్ని నమ్మలేమని ఏనాటినించీ గట్టిగా బుద్ధి చెబుతూనే ఉన్నది. పోనీ ప్రత్యామ్నాయంగా పౌరహక్కుల కోసం ఉద్యమించే పౌరసంఘాలనైనా నమ్మగలగాలి కదా. తుంటిమీద కొడితే మూతి పళ్ళు రాలాయన్న విధంగానూ, దున్నపోతు ఈనిందిరా అంటే దూడని కట్టేయండి అంటూనూ స్టేట్మెంట్లు చేస్తుంటే .. ఎవరిని నమ్మడం? నా తొలి ఉద్యోగంలో నా బాసు ఒక జీవిత పాఠం చెప్పారు - ఇంజనీర్లుగా మనకి మిగిలేది మన క్రెడిబిలిటీనే! ఆ క్రెడిబిలిటీ పోయిననాడు మన బతుకులు ఎందుకూ పనికిరావు అని. అలాంటి పాఠం రాజకీయులకి గానీ పౌరహక్కుల ఉద్యమ నేతలకిగానీ వర్తించదల్లే ఉంది!! ఏదేమైనా, పునాదులు కదిల్చే సంక్షోభంలో ఎంతా నిబ్బరంగా తన కథనాన్ని వినిపించి వెన్నువంచకుండా నిలబడిన వీరవనిత షెర్లీ షెరాద్ గారికి గౌరవాభివందనం!!!

నాకు ఎంతో ఇష్టమైన వార్తా విశ్లేషకులు, డేనియెల్ షోర్ మరణించారు 93 ఏళ్ళ వయసులో. ఈయన చాలా కాలంగా నేషనల్ పబ్లిక్ రేడియో కార్యక్రమాలకి విశ్లేషకులుగా పని చేస్తూ తన సునిశితమైఅన్ బుద్ధి కుశలతతో జాతీయ అంతర్జాతీయ విషయాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తుండేవారు. ఆయన వ్యాఖ్య విన్నాక, హబ్బ, ఏమి చెప్పాడ్రా అనుకున్న సందర్భాలు ఎన్నో! 1998లో బీజేపీ కేంద్రప్రభుత్వ సారధ్యంలో భారత్ అణువిస్ఫోటన పరీక్ష నిర్వహించినప్పుడు ఇక్కడ క్లింటను మహాశయుడి శ్వేతసౌధం తెల్లమొహమేసుకుని మతి పోయినట్టు తిక్క తిక్క స్టేట్మెంట్లు ఇస్తున్న సందర్భంలో షోర్ గారు ఇలా అన్నారు - "ఇంతకు పూర్వం జరిగిన ఎన్నికల ప్రచారాన్ని బీజేపీ తన అస్తిత్వానికి సవాలుగా తీసుకున్నది. ఆ ప్రచారంలో అణ్వాయుధ శక్తి తమ అంతర్జాతీయ ఎజెండాలో ముఖ్యభాగమని ఎలుగెత్తి చెబుతూనే ఉన్నది. ఎన్నికలు ముగిసి, విజయాన్ని చేజిక్కించుకుని ప్రభుత్వాన్ని ఏర్పరిచిన తరవాత, అధికారికంగా కూడా భారత్ అణ్వాయుధాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని బీజేపీ నాయకత్వం చెబుతూనే ఉన్నది. ఇప్పుడది జరిగినాక ఎందుకింత ఆశ్చర్యం. అందుకని ఇకనైనా శ్వేతసౌధవాసులు ఆ తేభ్యపు నోళ్ళు మూసి భారత్ ప్రభుత్వంతో అణుశక్తి విషయమై సక్రమమైన చర్చాకార్యక్రమానికి దారితీస్తే మంచిది." ఈ వార్తాయోధునికి ఎన్‌పీఆర్ వారి అక్షర వీడ్కోలు.

సాక్షి ఫన్‌డేలో నా పుస్తకం రంగుటద్దాల కిటికీ ప్రస్తావన.

Tuesday, July 20, 2010

సూపర్ సింగర్ ఫైవ్

ఇంట్లో కొత్తగా శాటిలైట్ టీవీ పెట్టించడంతో మాటీవీలో సూపర్ సింగర్ ఫైవ్ చూడ్డం మొదలెట్టాను. మరికొన్ని కార్యక్రమాల్ని కూడా రుచి చూసినా, నన్ను కొద్దిగా ఆకట్టుకున్న కార్యక్రమం ఇదొకటే.

ముందొక డిస్క్లెయిమరు. నేను సాధారణంగా టీవీ చూడను. 2000 సంవత్సరంలో మానేశాను టీవీ చూడ్డం. అందుకని ఇటు అమెరికను ఐడల్ లాంటి కార్యక్రమాలు గానీ అటు పాడుతాతీయగా, వాయిస్ ఆఫ్ యూత్, సూపర్ సింగర్ - ఇవేవీ చూసిన వాణ్ణి కాదు.

మేము కనెక్షను పెట్టించేప్పటికే సీజను మొదలైపోయి కొన్ని ఎపిసోడ్లు జరిగిపోయాయి. ఆ తరవాతెప్పుడో యూట్యూబులో ఆ తొలి ఎపిసోడ్లు కొన్ని చూశాను. ముందుగా ఏంకర్ సాగర్‌నీ, అటుపైన టీం లీడర్లు ఐదుగుర్నీ పరిచయం చెయ్యడం కొంచెం అతి చేశారు. ఇది గనక నేను మొదట టీవీలోనే చూసి ఉంటే కచ్చితంగా ఈ కార్యక్రమం పట్ల శ్రద్ధ కలిగి ఉండేది కాదు, తరువాతి ఎపిసోడ్లని శ్రద్ధగా చూసేవాణ్ణి కాదు. అదలా మిస్సవడం మంచిదే అయింది.

కాన్సెప్టు
ఈ కాన్సెప్టు నాకు బాగా నచ్చింది. పోటీదారులు ఎవరికి వాళ్ళు టెన్షనుతో కూర్చోవడం, తమ వంతొచ్చినప్పుడు పాడి వెళ్ళిపోవడం కాకుండా; ఐదు టీములు. ఒక్కోదానికీ కొంత ప్లేబాక్ అనుభవం కలిగిన ఒక లీడర్, ఇద్దరు ఔత్సాహిక గాయకులు. ముగ్గురు న్యాయ నిర్ణేతలలో కోటి, చంద్రబోస్ రెండేసి టీములకి, గాయని సునీత ఒక టీముకీ మద్దతు నివ్వడం (ఇలా జడ్జీలు పోటీదారులకి మద్దతు నివ్వడంలోని ఆంతర్యం నాకు అర్ధం కాలా. దీన్ని గురించి ఇంకొంచెం తరవాత). రౌండ్లు కూడా కొంచెం వినూతనంగా ఉన్నాయి. టీములుగా పాల్గోవడాన్ని బాగా ఉపయోగించుకునేట్టు రూపొందించారు. టీం లీడర్ల సోలో, జూనియర్ల సోలో, యుగళ గీతాలు, ముగ్గురూ కలిసి పాడిన బృంద గానాలు; రకరకాలుగా -- మొత్తమ్మీద బాగా రుచికరంగా కార్యక్రమం రూపొందిందని చెప్పుకోవచ్చు.

నేను సినిమాసంగీతాన్ని ఎప్పుడూ పెద్దగా పట్టించుకున్న వాణ్ణి కాను. పాతపాటలైతే ఆకాలంలో ఇష్టమున్నా లేకున్నా జనరంజని వినీవినీ ఏదో కొంత గుర్తుండిపోయాయి. కానీ గత ఇరవై ఏళ్ళలో వచ్చిన సినిమాపాటలైతే బొత్తిగా మనసుకి హత్తుకోలేదు. సినిమాలు విరివిగా చూస్తూనే ఉన్నా, ఎవరన్నా మిత్రులు పాట వినమన్నప్పుడు పాటలుకూడా అప్పుడప్పుడూ వింటూ ఉన్నా, ఏ పాటా ఇది బాగుంది అని నా దృష్టిని ఆకర్షించలేదు, అసలు ఇదో సంగీతమనే ఎప్పుడూ అనిపించలేదు. తీరా ఈ ప్రోగ్రాములో ఈ యువతీయువకులు పాడుతూ ఉంటే విన్నప్పుడు ఈ కొత్త పాటల్లో కూడా సంగీత విశేషాలు బాగున్నాయి, ఇది నిర్లక్ష్యం చెయ్యాల్సిన విషయం కాదు అని ఒక కనువిప్పయింది. ఇది నేనసలు ఎదురుచూడని పరిణామం.

రేండం ఆలోచనలు
టీం లీడర్లు ఐదుగురికీ (గీతామాధురి, శ్రావణభార్గవి, శ్రీకృష్ణ, కృష్ణచైతన్య, దీపూ) గొంతులు చాలా బావున్నాయి. ఐదూ విలక్షణమైన గొంతులు. కానీ సెమీఫైనల్సు లోనూ, ఫైనల్సులోనూ, ఒకటి రెండు చోట్ల బాగా పాడేరు గానీ, వీళ్ళు పాడగలిగినంత గొప్పగా పాడలేదనిపించింది. ప్రిలిం రౌండ్సులోనే, బహుశా కొంచెం రిలాక్స్‌డ్ గా ఉన్నారేమో, హాయిగా గొంతులు విప్పి పాడారు. జూనియర్లలో అమ్మాయిల గొంతుల్లో అస్సలు పరిపక్వత లేదు. కొంత మజ్జాగతమైన టేలెంటు ఉన్నది గానీ, ఈ ఐదుగురూ ఇంకా బాల సాధకావస్థలోనే ఉన్నారని నాకనిపించింది. జూనియర్లలో అబ్బాయిల గొంతులన్నీ విలక్షణంగా ఉన్నాయి. రేవంత్‌ని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ అబ్బాయి ఏది పాడినా (తప్పులు పాడినప్పుడూ, అక్కడక్కడా సాహిత్యం మర్చిపోయినప్పుడూ కూడా) నాకు చాలా నచ్చేసింది. ధీరజ్ కూడా, ముఖ్యంగా రాక్ (rock) బాణీలో ఉన్న పాటల్ని చాలా బాగా పాడాడు. ఈ అబ్బాయిలు ఐదుగురూ త్వరలో ప్లేబాక్ గాయకులుగా మనకి కనిపిస్తారు, సందేహం లేదు.

జడ్జీలు కూడా నాకు బాగా నచ్చారు. కోటి పెద్దతరహాగా అందర్నీ ప్రోత్సహించిన తీరు బాగుంది. తప్పులెంచాల్సి వచ్చిన చోట సాహిత్య పరమైన తప్పుల్ని ఎక్కువగా చంద్రబోస్, సంగీత పరమైన తప్పుల్ని సునీత వదలకుండా పట్టుకున్నారు. పాడుతున్నది సీనయర్లైనా, లేక జరుగుతున్నది ఫైనల్స్ అయినా, తప్పు తప్పే అన్నట్టు, మృదువుగానే, మనసు నొచ్చుకోకుండానే, ఐనా కచ్చితంగా తమ విమర్శని వినిపించారు. సునీత మాట్లాడే గొంతుకూడా నాకు చాలా నచ్చింది. ఆవిడ మాట్లాడుతుంటే హాయిగా అలా ఎంతసేపైనా వింటూ ఉండొచ్చు. ఆవిడ చాలా గొప్ప ప్లేబాక్ సింగరని విన్నాను గానీ ఆవిడ ఈ వేదిక మీద పాడిన పాటలు నాకు పెద్దగా నచ్చలేదు. చంద్రబోస్ అద్భుతంగా పాడతారని తెలుసుకోవడం ఒక రివెలేషన్. వ్యాఖ్యలు చెప్పేప్పుడు ఈయన వీలున్నచోటల్లా ఏదో ఒక పదవిన్యాసం చెయ్యడం (ఉదా. స్వ-రాకింగ్) కూడా సరదాగా ఉంది.

ఈ కార్యక్రమం మొత్తానికీ అస్సలు చలించని పునాదిలాగా ఉండి ఆద్యంతమూ అత్యుత్తమ స్థాయిలో పని చేసిన వారు ఆర్కెస్ట్రా సభ్యులు. అందరూ చాలా గొప్పగా చేశారు కానీ, వేణువు వాయించిన ఆయన్నీ, కీబోర్డ్స్ వాయించిన ఇద్దరినీ ప్రత్యేకంగా అభినందించాలి. కార్యక్రమం నడుస్తుండగా పార్టిసిపెంట్లూ, జడ్జీలూ ఈ వాద్య బృందానికి అభినందనలు చెప్పుకున్నారు గానీ, కనీసం ఒక్కసారైనా వీళ్ళని పేరుపేరునా పరిచయం చేసి ఉండాలిసింది. అది చెయ్యకపోవడం పెద్ద లోపం.

ఏంకర్‌గా, సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ తమ్ముడూ, స్వయంగా గాయకుడూ సాగర్, కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించాడు. అతనికి ఏంకరింగ్ కొత్త కావడం వల్లనూ, అతను సహజంగా పెద్ద మాటకారి కాకపోవడం వల్లనూ (కనీసం నాకలా అనిపించింది) కొంచెం వొద్దికగా చేశాడు. తామే పెద్ద పిస్తా అనుకునే ఏంకర్ల దెబ్బ ఆల్రెడీ రుచి చూశాను మరి కొన్ని కార్యక్రమాల్లో. వాటితో పోలిస్తే సాగర్ కొత్తదనం ఫ్రెష్గా అనిపించింది.

చివరి ఎపిసోడ్లలో ఎవరెవరో స్పెషల్ గెస్టులు రావడం మొత్తానికి కొంచెం చిరాకు కలిగించింది. ఒక పక్కన గాయనీ గాయకులు ఈ హడావుడికి కొంత తడబడినట్టు అనిపించింది. ఇంకో పక్క కేమెరా అతను పిచ్చ పట్టినట్టు మాటిమాటికీ ఈ గెస్టుల మొహాలు క్లోజప్ చూపించడం - వాళ్ళేమో ఏంటో నెర్వస్ గా అటూ ఇటూ కదుల్తూ ఉండడం. అప్పటికి ఆరేడు వారాలుగా ఈ కార్యక్రమం చూడ్డం ఒక హాయైన అనుభవంగా ఉన్నది కాస్తా చివర్లో తన ఫోకస్ కోల్పోయి కంగాళీ అవకతవగ్గా తయారైంది.

ది సింగింగ్ పార్టీ అని టేగ్ లైన్ పెట్టుకున్నందుకు కేవలం ఇంకో పాటల పోటీ లాగా కాకుండా ఆద్యంతం నిజంగానే ఒక పార్టీలాగా, సరదాగా, హాయిగా, అలరిస్తూ, ఆహ్లాదం కలిగిస్తూ జరిగింది కార్యక్రమం.

Wednesday, July 14, 2010

పెరడు వ్యవసాయం - గోంగూర రుచి

చాలా ఏళ్ళ తరవాత మళ్ళీ పెరటి వ్యవసాయం మీద బుద్ధి పోయి ఈ ఏడాది నడుం బిగించాను. వారాంతపు రైతుగా అవతారమెత్తాను.

దానికితోడు ఈ ఏడు ఏప్రిల్లోనే వాతావరణ ఉష్ణోగ్రత ఎనభైల్లోకి పాకి కితకితలు పెట్టింది. ఇంకేముంది, వసంతం వచ్చేస్తోంది అని హడావుడి పడిపోయి సీడ్ స్టార్టర్ కిట్ తెచ్చేసి, ఇండియానించి భద్రంగా తెచ్చుకున్న గోంగూర విత్తులు నాటేశాను. పొద్దున్నే నా నోట్లోకి ఇన్ని టీనీళ్ళతో బాటు దీనికి అన్ని మామూలు నీళ్ళు వొంపుతూ ఉండడం. ఏ చిన్న అరలోనన్నా మొలక పైకి తొంగి చూస్తోందా అని ఎదురు చూడ్డం. మొదటి మొలక కనిపించిన రోజున ఎంత సంతోషం వేసేసిందో.

ఎట్టకేలకు అన్ని అరల్లోనూ విత్తులు మొలిచి చిగుళ్ళు వేశాయి.

ఇంతలో నా ఉత్సాహం మీద నీళ్ళు చల్లడం కాదు, ఏకంగా మంచే కురిసింది - టెంప్రేచరు నలభైల్లోకి పడిపోయింది. మే నెల అంతా ఇలాగే.

మేనెల ఆఖర్లో, హమ్మయ్య కాస్త వెచ్చబడుతోంది, ఇంక మొక్కల్ని బయట నాటెయ్యొచ్చు అనుకుంటున్న నాకు ఇంకో కఠోర సత్యం ఎదురైంది. నేను మొక్కలు నాటాలి అనుకున్న ఆ చిన్న మడి చెక్క, గత రెండు మూడేళ్ళుగా సరైన శ్రద్ధ పెట్టక పోవడం వల్ల పిచ్చి మొక్కలకి ఆలవాలమైంది. అవన్నీ ఇల్లరికపు అల్లుళ్లలాగా హాయిగా సెటిలైపోయాయి. ధిక్కారము సైతునా అని హుంకరించి పార పట్టుకుని మహోగ్రం వాటి మీద దాడి చేశాను. ఐతే నా సమరోత్సాహం పది నిమిషాల్లో రొప్పుగానూ, మరో ఐదు నిమిషాలకి ఆయాసంగానూ, అటుపైన రెండు నిమిషాలకి నీరసంగానూ పరిణమించింది. వేళ్ళ పట్టు తప్పి పార కింద పడిపోయింది. ఓ కప్పు వేడి బ్రూక్‌బాండ్ రెడ్‌లేబుల్ టీతో మళ్ళీ శక్తి పుంజుకుందామని లోపలికొచ్చి, టీతాగి పుంజుకున్న శక్తితో మడి చెక్కే పనిని మర్నాటికి విజయవంతంగా వాయిదా వేశాను.

ఇప్పుడు వివెల్ అల్ట్రాప్రోవారి రైతుబిడ్డ కార్యక్రమంలో ఒక చిన్న విరామం! ఈ విరామంలో నా సోదర రైతు తెలుగుయాంకీగారి కబుర్లు చదివి రండి. మళ్ళీ ఇక్కడికే వచ్చెయ్యండేం, అక్కడ కామెంట్లు పెడుతూ కూర్చోవద్దు!!

అలా చాలా మర్నాడులు గడిచాయి. టీకప్పు నాకిస్తున్న శక్తి పనిని వాయిదా వేసేందుకే పనికొచ్చింది తప్ప పని మొదలు పెట్టేందుకు పనికి రాలేదు. ఈలోగా నా శత్రువులు కబ్జా భూమిలో మరికాస్త వేళ్ళునుకున్నాయి. ఇంట్లోకొస్తే, విండో పక్కన స్టార్టర్ ట్రేలో అప్పుడే ఆరంగుళాల ఎత్తుకి ఎదిగిన గోంగూర మొక్కలు పెళ్ళికెదిగిన కూతుళ్ళు బక్కచిక్కిన గుమాస్తా తండ్రిని చూసినట్టు చూస్తున్నాయి నిష్ఠూరంగా. ఆ రూములోకి ఎంటరైనప్పుడల్లా "అంతా భ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా" అని ఓ ముప్ఫై గొంతులతో 6-ట్రాక్ స్టీరియోఫోనిక్ ఎఫెక్ట్స్ తో విషాద గీతం.

ఇక భరించలేక, విజయమో వీరస్వర్గమో అని కబ్జాదారులమీద దండెత్తాను. మొత్తానికి రెండు సాయంత్రాలు హోరాహోరి ముష్టాముష్టిగా పోరాడి నా మడిచెక్కని ఆ కలుపుమొక్కల కబంధ హస్తాల పట్టునుంచి విడిపించుకున్నాను. ఓ రెండు సంచుల పైమన్నూ, ఒక సంచీ ఎరువూ మట్టిలో కలిపాను. ఇంతదాకా బానే ఉంది.

మొక్కల్ని తెచ్చి నేలలో పాతడం .. అప్పుడు తెలిసింది నరకమంటే ఏవిటో. హాయిగా స్టార్టర్ కిట్‌లో విత్తులు నాటినట్టు కాదు. వొంగి లేచి వొంగి లేచి ముప్ఫై మొక్కల్ని నాటేప్పటికి .. నాకు అకస్మాత్తుగా వరి పొలాల్లో నాట్లు, కోతలు చేసే రైతుకూలీలతో సోదరభావం ఏర్పడిపోయింది.

చీడలు పీడలూ ఏమీ లేకుండా, వాటి పుణ్యమా అని మొక్కలు ఏపుగా ఎదిగినాయి.

ఇప్పుడు సుమారు ఆరు వారాల తరవాత, మొన్న సోమవారం నాడు మొదటి విడత ఆకు కోశాము.

మా అత్తయ్యగారు దానితో పచ్చడి చేశారు.

ఆహా ఏమి రుచి!

Saturday, July 3, 2010

ఓ తారల చారల పతాకా!


అమెరికాలో ప్రవాసం ఉన్న భారతీయుల మనసుల్లో మా మెట్టినిల్లైన అమెరికాని తలుచుకున్నప్పుడల్లా ఎన్నో పరస్పరం విరుద్ధమైన భావాల సంఘర్షణ చెలరేగుతుంది.

పైపైన చూస్తే కొన్ని విషయాల్లో చాలా ముచ్చటేస్తుంది. నిత్యావసరాలకి తడుముకోనక్కరలేకుండా సులభంగా పనులు జరగిపోవడం, అధికార్లూ పోలీసులూ ఒక మోస్తరు నిజాయితీతో పని చెయ్యడం, నిత్య జీవితంలో ఒక క్రమశిక్షణ, ఒక క్రమబద్ధత, ఇలాంటివి. ఇంకోపక్కన ఈ దేశంలో కనబడే, అనుభవమయ్యే ప్రకృతి వైవిధ్యం హాయి గొల్పుతుంది, చూసే కళ్ళుంటే, స్పందించే మనసుంటే పులకరింపచేస్తుంది (మరీ కాంక్రీటు జంగిల్లాంటి నగరాల్లో ఉంటే తప్ప). సాంఘిక కోణంలో చూస్తే మన చుట్టూ ఉన్న రకరకాల మనుషులు, రకరకాల సంస్కృతులు, వేషభాషలు, మత పద్ధతులు, భోజనాలు, సంగీత సాహిత్యాది కళలు - ఈ మహాసముద్రంలో ఎన్ని అలలో, ఎన్నెన్ని లోతులో. ఇంకా ఇలా చాలా చాలా ..

ఈ అనుభవసాగరాల్ని మధించడం మొదలెడితే ముందుగా పైకొచ్చేది హాలాహలమే.

చుట్టూతా వ్యాపించి ఉన్న సంస్కృతి మనది కాదు. మన సంస్కృతినీ మన భాషనీ మన మతాన్నీ మన పద్ధతుల్నీ మింగెయ్యగలదు, నామరూపాల్లేకుండా ఎగరగొట్టెయ్యగల మహా ప్రభంజనం మధ్యలో ఉన్నాం. ఒక చిన్న మైనారిటీగా. పైపెచ్చు మోడల్ మైనారిటీ అనే గుదిబండనోదాన్ని మెడకి కట్టుకుని. మన అస్తిత్వాన్ని కాపాడుకోగలమా ఈ ప్రభంజనంలో ఈ ఝంఝామారుతంలో? పెద్దమానులను కూల్చు తుపాను గడ్డిపరకను కదల్చదట!

మన చూపు మరి కాస్త విస్తరిస్తే - ఏమేమి కనిపిస్తున్నాయి? మానవత్వాన్ని కబళించే దురాశ, మనుషులకీ కార్పొరేట్లకీ ఒక్కలాగే, బిలియన్ల ఆస్తుల్ని క్షణాల్లో హూష్కాకీ అని మాయం చేసే వాలువీధి మంత్రజాలం. మేం స్వేఛ్ఛకి ప్రతీకలం అని చెబుతూనే ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ఈ ప్రభుత్వం చేస్తున్న పోలీసు జులుం. మాటల్లో చేతల్లో ద్వంద్వ వైఖరులు.

ఏదేమైనా అమెరికా ఒక విలక్షణమైన దేశం. అమెరికా జీవితం అదో వింత అనుభవం.

నా మెట్టిన దేశానికి జన్మదిన శుభాకాంక్షలు.

Friday, July 2, 2010

అమెరికా తెలుగు బ్లాగర్లకి ఓ కొత్త పిలుపు

ఆదివారం జూలై నాలుగు
అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం

ఇక్కడ ప్రవాసం ఉంటున్న వ్యక్తిగా ఈ సందర్భంలో ఈ జూలై 4 న మీ మనోభావాలేవిటి?

జస్ట్ ఇంకో సెలవరోజు సమ్మర్లో?

ఈ ప్రపంచవ్యాప్త కల్లోల పరిస్థితుల్లో ఈ లోకానికి అమెరికా తప్ప దిక్కులేదు! America has to show the way.

బీపీ డౌన్ డౌన్! కార్పొరేట్ గ్రీడ్ డౌన్ డౌన్!

హబ్బ, ఏంది నీ సొద, కాసేపు వర్ళ్డ్ కప్ చూస్కోనీ!

పర్యావరణ చమురుతో పూడుకుపోతే నాకేం? బీపీ షేరు 60 శాతం తగ్గింది. కొనేస్కోడానికి ఇంతకంటె మంచి ఛాన్సు దొరకదు, కొను కొను కొను!

ఈ దేశం ఎక్కడికి పోతోంది? రెండు దేశాల్లో తమది కాని యుద్ధం చేస్తున్న వేలాది సైనికులు. క్షతగాత్రులై తిరిగొస్తున్న సైనికులకి కనీస అవసరాలు తీర్చలేని ప్రభుత్వం! ఎన్నెన్నో ఆశలు చూపించి ఎన్నికైన అధ్యక్షుడు ఇప్పుడన్ని రుగ్మతలకీ తన తీపి మాటలే చక్కెర మాత్రలుగా వేస్తున్నాడు!

ఈ దేశం నాకేమిచ్చింది?

అమెరికా!! డాలర్ల గుడ్లు పెట్టే నా బంగారు బాతు!!

ఈ దేశం ఎక్కడికి పోతోంది? తనతో బాటు ప్రపంచాన్ని ఏ లోతుల్లోకి ముంచేస్తోంది?పైన చెప్పిన భావాల్లో ఏవైనా మీ ఆలోచనలకి దగ్గరగా వస్తాయా? యూ డోంట్ కేరా? అస్సలు టోటల్లీ డిఫరెంటా? ఏంటీ మీ ఆలోచన?? ఇప్పుడు, ఇప్పుడే, ఈ క్షణాన!
దయచేసి మీ మీ బ్లాగుల్లో పంచుకోండి.
(నా ఆలోచనలు జూలై 4న ఇక్కడే!)

Thursday, July 1, 2010

టొరాంటో తెలుగు వాహిని

ఈ మధ్య చేసిన మంచి పనుల్లో ఒకటి టొరాంటో వెళ్ళి అక్కడి తెలుగు సాహితీమిత్రులతో ఒక పూట గడిపి రావడం.

కొమరగిరి మురళిగారితోనూ, కొమరవోలు రావుగారితోనూ, పిళ్ళారిశెట్టి భాస్కర్ గారితోనూ సుమారు మూడేళ్ళుగా పరిచయం. 2008లో మా డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితి పదవ పుట్టిన రోజు వేడుకలకి వీరందరూ విచ్చేసి సభల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆ సభలోనే తెలుగు బ్లాగుల్ని ఇక్కడి తెలుగు సాహిత్య ఔత్సాహికులకి పరిచయం చేశాము. యాదృఛ్ఛికంగా దీప్తిధార బ్లాగరి సీబీరావుగారు కూడా ఆ సభలో పాల్గొన్నారు.

అప్పటికే టొరాంటోవారు ప్రతినెలా కలుసుకుని తెలుగు సాహిత్య చర్చలు చేస్తున్నామని చెప్పారు. 2009 సెప్టెంబర్లో తెలుగు సాహితీమూర్తుల శతజయంతి వేడుకలు జరిగిప్పుడు కూడా ఈ బృందం మా ఊరికి వచ్చి సభల్లో పాల్గొనగా, ఆ సందర్భంగా వీరితో కొంచెం సావకాశంగా ముచ్చటించే అవకాశం చిక్కింది. మాకు మరీ దూరం కాదు కాబట్టి ఎప్పుడైనా వెళ్ళి వారి నెలసరి సమావేశంలో పాల్గొంటే బాగుంటుందని అనుకున్నాను. తరవాత మురళిగారితో రెండు మూడు సార్లు ఫోనులో మాట్లాడినప్పుడు తప్పక రమ్మని ఆహ్వానించారు. మొత్తానికి అది జూన్ నెలలో సాధ్యపడింది.

శనివారం తెల్లారుజామునే బయల్దేరాను. రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. సరిహద్దు దగ్గర కూడా ఏమీ ఇబ్బంది లేదు. కెనడాలో ప్రవేశించి, విండ్సర్ నగరం దాటగానే, మళ్ళీ టొరాంటో నగరాన్ని సమీపించే దాకా (సుమారు 250 మైళ్ళు) పొలాలు. కనుచూపు మేర ఎటు చూసినా పుడమితల్లి వొడిలో నవనవలాడుతున్న సజీవమైన పచ్చదనం. అక్కడక్కడా ఎర్రటి పెయింట్ వేసి ఉన్న పశువుల కొట్టాలూ (barns), ధాన్యాగారాలూ (silos). ముందూ వెనకా ఇతరవాహనాలు కూడా ఎక్కువ లేవు. నిద్ర మత్తు ఆవరించకుండా ఇంటినించి తెచ్చుకున్న మసాలా చాయ్ చప్పరిస్తూ, స్టీరియోలో పెట్టిన తెలుగు పాటల్ని, నా అపస్వరంలోనే గాట్ఠిగా గొంతెత్తి పాడుకుంటూ (ఒంటరి ప్రయాణం విసుగే అయినా అందులో ఇదొక చిన్న వెసులుబాటు), ఐదున్నర గంటల్లో టొరాంటో చేరుకున్నాను.

ఆ మధ్యాహ్న భోజనం భాస్కర్ గారింట్లో. శ్రీమతి కళగారు కమ్మటి తెలుగు భోజనం పెట్టారు. వారి అబ్బాయి చి. అశ్విన్ ఉద్యోగరీత్యా సాఫ్టువేరు నిపుణుడైనా కూడా తెలుగు సాహిత్యంలోనూ, కర్నాటక హిందూస్తానీ సంగీతాల్లోనూ మంచి అభిరుచి ఉన్నవాడు, స్వయంగా సంగీత సాధన చేస్తున్నాడు. దిగిన దగ్గర్నించీ అతనితో కబుర్లే కబుర్లు. ఇంతలోకే కొమరవోలు సరోజగారు, రావుగారు విచ్చేశారు. మరి కాసేపటికి మురళి గారూ చేరారు. ఎడతెగని కబుర్ల మధ్యలోనే భోజనాలు పూర్తి చేశాము. రావుగారు సరోజగారు టొరాంటోలో చాలాకాలంగా నివాసం ఉన్న వారు. అక్కడి తెలుగు సమాజానికి మూలస్తంభాలు అంటే అతిశయోక్తి కాదు. పైగా సరోజగారు ఇప్పటికే చాలా కథలు రాశారు. కళగారు అక్కడి భారతీయ హైకమిషన్ నడిపే పౌర సాంస్కృతిక సంఘంలో ఉపాధ్యక్షులుగా ఉన్నారు. మురళిగారు తమ ఇంట్లోనే సత్యసాయి సత్సంగ్ నడుపుతూ పిల్లలకి హిందూ ధార్మిక విషయాలు నేర్పుతుంటారు. మన సంస్కృతిని తరువాతి తరానికి అందించడం పట్ల వీరికి ఆసక్తి మెండు. ఇక అశ్విన్ తన వీలుని బట్టి అనేక కార్యక్రమాల్లో ఉత్సాహంగా వాలంటీర్ చేస్తుంటారని తెలిసింది. మొత్తానికి వీరంతా గొప్ప ఉత్సాహం ఉన్న కార్యశీలురు, బహుముఖ ప్రజ్ఞావంతులు. వీరందరితో కాసేపు సావకాశంగా మనసులు కలబోసుకోవడం చాలా ఉత్తేజం కలిగించింది నాకు.

సాయంత్రం నాలుగ్గంటల ప్రాంతంలో మురళిగారింటికి చేరుకున్నాం. మొత్తం పదిహేనుమందిదాకా సభ్యులు చేరుకున్నారు. వీరిలో శ్రీరాం, వారి శ్రీమతి అజంతా గారిని ఇంతకు మునుపు డిట్రాయిట్‌లో కలిశాను. సమావేశం నిర్వహించే భారం నెత్తిన వేసుకున్న మిత్రులు పోతంశెట్టి సత్యం గారిని ఇదే కలవడం. ఆయన కూడా మంచి ఉత్సాహవంతులు, చతుర హాస్య సంభాషణలో దిట్ట. మురళిగారి శ్రీమతి మాలతిగారు అందర్నీ సాదరంగా ఆహ్వానించి మిరపకాయ బజ్జీలూ, చాయ్ అందించారు. ఆ రోజు సమావేశం వారింట్లోనే. వీరు ప్రతినెలా ఎవరో ఒకరు సభ్యుల ఇంట్లోనే సమావేశ మవుతున్నారు. సమావేశం ముగిసినాక సభ్యులందరూ వంతుల వారీగా తెచ్చిన వంటకాలతో విందుభోజనం, ఓపిక ఉన్నంతసేపు ఇష్టాగోష్ఠి - వీరి పద్ధతి నాకు ఆహ్లాదకరంగా అనిపించింది. జరగబోయే మూడు నాలుగు సమావేశాలకి తేదీలు, ఎవరింట్లో జరుపుతున్నారనే సమాచారం ముందుగానే నిర్ణయించడం కూడా బాగుంది. ప్రతి సమావేశంలోనూ కనీసం మూడు అంశాలు చర్చకి వస్తాయి. మొదట సాంప్రదాయ సాహిత్యాన్నించి ఒక కావ్య భాగాన్ని చదివి వక్కలంక రాం గారు వ్యాఖ్యానిస్తుంటారు. నేను వెళ్ళినరోజున రాం గారు వ్యక్తిగత కారణాల వల్ల సమావేశానికి రాలేకపోవడంతో మరో బహుముఖ ప్రజ్ఞాశాలిని కలుసుకునే అవకాశం కోల్పోయాను. తరవాత ఒక సమకాలీన కథ. కథని అందరూ ముందే చదివి ఉన్నా అక్కడ మళ్ళీ సభ్యులొకరి పైకి కథని చదువుతారు. అటుపైన ఆ కథ గురించి చర్చ. మూడవ భాగంలో సభ్యులు ఒకరు తమకి ఇష్టమైన సాహిత్యాంశం మీద ప్రసగించడం, మళ్ళీ దాని మీద చర్చ. ఇదీ సాధారణంగా వీరి సమావేశం జరిగే క్రమం.

నేను వెళ్ళిన రోజున ఆముక్తమాల్యద కావ్యాన్ని గురించి ప్రసంగిస్తున్న రాం గారు రానని ముందే తెలియ జెయ్యడంతో మొదటి రెండు గంటలు నాకే కేటాయించారు. నా కథల సంపుటి రంగుటద్దాల కిటికీ నించి ఇండియన్ వేల్యూస్ కథ చదివి వినిపించాను. నేను చదవడం ముగిశాక సభ్యులందరూ ఒకరి తరవాత ఒకరు కథ గురించి తమ తమ అభిప్రాయాలు, మృదువుగానే అయినా, నిర్మొగమాటంగా చెప్పారు. ఈ కథ గురించి ఇప్పటివరకూ నాకు చేరిన విమర్శలు కాక కొన్ని కొత్త కోణాలు ఇక్కడ చర్చకు వచ్చాయి. రచయితగా నాకిది చాలా సంతోషం కలిగించింది. స్వల్ప విరామం తరవాత సమకాలీన సాహిత్యాన్ని ఎలా చదవాలి అన్న విషయమ్మీద నేను ఒక పావుగంట సేపు ఉపన్యసించి, ఇండియన్ వేల్యూస్ కథనే ఉదాహరణగా తీసుకుని చర్చకు పెట్టాను. ఈ చర్చకూడా మంచి రసవత్తరంగా సాగింది.

ఈ సమావేశానికి తిరుమలకృష్ణ దేశికాచార్యులుగారు ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. పోతన, వేమన ఫాంట్ల సృష్టికర్తగా బ్లాగరులు కొందరికైనా వీరి పేరు పరిచయమయ్యే ఉంటుంది. తొలితరం తెలుగు వెబ్సైట్లు చాలా వరకు వీరి పోతన లిపితోనే ప్రదర్శితమయ్యేవి. నాకు ఇదివరకు తెలియని విషయము, ఈ సమావేశంలోనే అనుభవానికి వచ్చిన విషయము దేశికాచార్యులు గారు ఛందోబద్ధ పద్య రచనలో అందెవేసిన చేయి. తాను ఇటీవల రచించిన రెండు ఖండకావ్యాలను శ్రావ్యముగా చదివి వ్యాఖ్యానంతో వివరించారు. మొదటి దాని పేరు శరణాగతి. రెండవ దాని పేరు పసిడి పల్లకీ. పద్యాలు చాలా గొప్పగా ఉన్నాయి. సున్నితమైన భావాలు, ప్రౌఢమైన అభివ్యక్తి, చక్కనైన మాటల పొందిక వీరి స్వంతం. మొదటి దానిలో ఒక మగవాడు తన ప్రేయసి కనబడక వనంలో వెతుకుతూ వెళ్ళి చివరికి ఆమెని కలుసుకోవడం కథాంశం. పోలికలు కవిసమయాలు కూడా భలే విలక్షణంగా చెబుతారు కవిగారు. ఈ నాయకుడు సన్నజాజి తీగని అడిగాడు నా చెలిని చూశావా అని. జాజితీగ అంటుంది, హబ్బో ఆవిడ తనూలత నాకంటే వంపులు తిరిగి వయ్యారాలు పోతుంది. ఇక ఆమెతో నేనేమి మాట్లాడనూ అందుకని పట్టించుకోలేదు అంటుంది. సరసులోని పద్మాన్ని అడుగుతాడు. పద్మం అంటుంది, ఆమె మొహం నాకంటే ఎంతో కాంతివంతంగా అందంగా ఉంది. ఆ కారణం చేత ఆమెకి మిడిసిపాటు ఉండొచ్చు. ఒకవేళ ఉన్నా, అది అర్ధం చేసుకో దగినదే. ఐనా ఆమె సరసుదగ్గర ఆగి నాతో ముచ్చటించింది. ఆమె నాపట్ల చూపిన ఆదరణతో ధన్యనైనాను. ఈ ఖండిక చివర ఒక గొప్ప సస్పెన్స్ నవలలో ఉండే ట్విస్టు ఇచ్చి పాఠకుల్ని దిగ్భ్రాంతుల్ని చేస్తారు కవిగారు. అది కథా నిర్వహణపట్ల వింత ఆలోచన చెయ్యగల కవిగారి సృజనశక్తికి మంచి గుర్తు. నా సొద ఎందుకుగాని, మీరే చదివి ఆనందించండి.

పసిడి పల్లకీలో వస్తువు పెద్దన మనుచరిత్ర కావ్యాన్ని నిండుసభలో రాయలకి అంకితమియ్యగా రాయలు ఆంధ్ర కవితా పితామహుణ్ణి తగురీతిని సత్కరించి బంగారు పల్లకీ ఎక్కించి తానే భుజాన మోసి ఊరేగించడం. నలభై తొమ్మిది పద్యాలలో చక్కటి ధారతో తన స్వగ్రామంలో స్వగృహంలో పెద్దన ఎలా ఉన్నాడు అని మొదలు పెట్టి, ఆనాటి జీవన విధానం, తరవాత రాయల కొలువు వైభవం అంతా హృద్యమైన వర్ణనతో మన కళ్ళకు కట్టేశారు కవిగారు. కర్నాటాంధ్ర దేశాలలో రాయల 500 వార్షికోత్సవాలు జరుగుతున్న సందర్భమే ఈ కావ్యరచనకి ప్రేరణ అని దేశికాచార్యులుగారు సెలవిచ్చారు. కవితాపఠనం ముగియగానే సభ్యులందరూ లేచి నించుని ఆగని కరతాళధ్వనులతో దేశికాచార్యులుగారి కవిత్వం పట్ల హర్షామోదాలు తెలియజేశారు. దేశికాచార్యులుగారి కవితావ్యవసాయాన్ని వారి స్వంత సైటులో చూడొచ్చు.

అటుపైన షడ్రుచులే కాదు, అనేక రుచులతో విందు భోజనం. నంజుకోడానికి సరస సంభాషణ. ఎంతకీ ముగియదే, ఎంతకీ తనివి తీరదే. అర్ధరాత్రి కొడుతోందనగా చివరి అతిథులు అయిష్టంగానే శలవు తీసుకున్నారు. ఆ రాత్రికి మురళిగారింట్లోనే విశ్రమించి మర్నాడు ఉదయం మరి కాసేపు వారి కార్యకలాపాల గురించీ, సంగీతం గురించి మురళిగారితో ముచ్చటించి, తిరుగు ప్రయాణమయ్యాను. అమెరికా సరిహద్దులో ఇమ్మిగ్రేషను వాళ్ళు ఒక గంట చికాకు పెట్టినా పెద్దగా బాధ అనిపించలేదు, వారాంతమంతా మనసునిండిన సంతృప్తి వల్ల.