కబుర్లు - జూలై 26

ఆగస్టు 3 న ఇక్కడ ప్రైమరీ ఎన్నికలు. ఈ సంవత్సరం మిషిగన్‌కి గవర్నర్ని ఎన్నుకోవాలి. రెండు ప్రధాన పార్టీలలోనూ కొందరు హేమాహేమీలు బరిలోకి దిగారు కానీ ఎవరి ప్రచారమూ పెద్దగా ఊపందుకున్నట్టుగా లేదు. స్థానిక ప్రోగ్రాముల్లోనూ ఎక్కడా పెద్దగా చప్పుడు వినబడ్డం లేదు. ఈ రాష్ట్రం ఎంతగా కష్టాల్లో కూరుకు పోయిందంటే దీన్ని పైకి లేవదీసేందుకు ఏ అభ్యర్ధికీ పెద్దగా ఐడియా ఉన్నట్టు తోచదు.

ప్రైమరీలతో బాటుగా మరికొన్ని ముఖ్యమైన స్థానిక విషయాలు కూడా ఈ రోజున వోటింగుకి వస్తున్నాయి, ప్రజాభిప్రాయ నిర్ణయానికి. వీటిలో అతి ముఖ్యమైనది SMART బస్సులకోసం అవసరమయ్యే ఆర్ధిక మదుపు. SMART అంటే డిట్రాయిట్ పరిసరప్రాంతాల్ని అనుసంధానించే బస్సుల సిస్టం. స్వంత కారులేని వేలాది ఉద్యోగస్తులు తమ ఉద్యోగాలకి వెళ్ళేందుకు ఈ బస్సులమీద ఆధారపడి ఉన్నారు. ఇప్పుడూ వోటింగుకి వచ్చిన విషయం ఇప్పటికే ఉన్న ఆర్ధిక వనరుల్ని మరో ఐదేళ్ళదాకా పొడిగించమనే తప్ప, కొత్త సహాయం కోసం కాదు. అందుచేత, మీకు గనక వోటుహక్కు ఉన్నట్టయితే ఆగస్టు 3 న శ్రమ అనుకోకుండా పోలింగ్ స్టేషనుకి వెళ్ళి SMART ప్రతిపాదనకు వోటు వెయ్యవలసిందిగా ప్రార్ధన.

కాంగ్రెసు దిగువసభకి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. మొన్న ఒబామాగారి ఆరోగ్య చట్టం, అటుపైన బేంకు సంస్కరణల చట్టాలకి అనుకూలంగా వోటు వేసిన డిమోక్రాటిక్ సభ్యులందరికీ వ్యతిరేకంగా ఆ పార్టీనించే ప్రైమరీ అభ్యర్ధులు ఎదురవుతున్నారు. ఇది మంచిదే. ప్రజాస్వామ్యం అన్న తరవాత ఆ మాత్రం భిన్నాభిప్రాయం ఉండాలి. గత ఎన్నికలు గెలిచామని సంతృప్తిగా కూచున్న డిమోక్రాటిక్ నాయకత్వానికి ఏమన్నా కదలిక వస్తుందేమో చూద్దాం ఈ ప్రతిఘటనల వల్ల.

షెర్లీ షెరాద్ సంఘటన చాలా రాకాలుగా అనేక జీవితసత్యాలని ఆవిష్కరించింది. అసలు ఆవిణ్ణి గురించి తొలివీడియో బయటపడగానే ఈ హేమాహేమీలంతా కాళ్ళు విరగదొక్కుకుంటూ అంత నోళ్ళు పారేసుకోవడమేమి? ఎవడు బలవంత పెట్టాడు వీళ్ళని అడ్డగోలు స్టేట్మెంట్లిమ్మని? ఎవరిని నమ్మగలం? ప్రభుత్వాన్ని నమ్మలేమని ఏనాటినించీ గట్టిగా బుద్ధి చెబుతూనే ఉన్నది. పోనీ ప్రత్యామ్నాయంగా పౌరహక్కుల కోసం ఉద్యమించే పౌరసంఘాలనైనా నమ్మగలగాలి కదా. తుంటిమీద కొడితే మూతి పళ్ళు రాలాయన్న విధంగానూ, దున్నపోతు ఈనిందిరా అంటే దూడని కట్టేయండి అంటూనూ స్టేట్మెంట్లు చేస్తుంటే .. ఎవరిని నమ్మడం? నా తొలి ఉద్యోగంలో నా బాసు ఒక జీవిత పాఠం చెప్పారు - ఇంజనీర్లుగా మనకి మిగిలేది మన క్రెడిబిలిటీనే! ఆ క్రెడిబిలిటీ పోయిననాడు మన బతుకులు ఎందుకూ పనికిరావు అని. అలాంటి పాఠం రాజకీయులకి గానీ పౌరహక్కుల ఉద్యమ నేతలకిగానీ వర్తించదల్లే ఉంది!! ఏదేమైనా, పునాదులు కదిల్చే సంక్షోభంలో ఎంతా నిబ్బరంగా తన కథనాన్ని వినిపించి వెన్నువంచకుండా నిలబడిన వీరవనిత షెర్లీ షెరాద్ గారికి గౌరవాభివందనం!!!

నాకు ఎంతో ఇష్టమైన వార్తా విశ్లేషకులు, డేనియెల్ షోర్ మరణించారు 93 ఏళ్ళ వయసులో. ఈయన చాలా కాలంగా నేషనల్ పబ్లిక్ రేడియో కార్యక్రమాలకి విశ్లేషకులుగా పని చేస్తూ తన సునిశితమైఅన్ బుద్ధి కుశలతతో జాతీయ అంతర్జాతీయ విషయాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తుండేవారు. ఆయన వ్యాఖ్య విన్నాక, హబ్బ, ఏమి చెప్పాడ్రా అనుకున్న సందర్భాలు ఎన్నో! 1998లో బీజేపీ కేంద్రప్రభుత్వ సారధ్యంలో భారత్ అణువిస్ఫోటన పరీక్ష నిర్వహించినప్పుడు ఇక్కడ క్లింటను మహాశయుడి శ్వేతసౌధం తెల్లమొహమేసుకుని మతి పోయినట్టు తిక్క తిక్క స్టేట్మెంట్లు ఇస్తున్న సందర్భంలో షోర్ గారు ఇలా అన్నారు - "ఇంతకు పూర్వం జరిగిన ఎన్నికల ప్రచారాన్ని బీజేపీ తన అస్తిత్వానికి సవాలుగా తీసుకున్నది. ఆ ప్రచారంలో అణ్వాయుధ శక్తి తమ అంతర్జాతీయ ఎజెండాలో ముఖ్యభాగమని ఎలుగెత్తి చెబుతూనే ఉన్నది. ఎన్నికలు ముగిసి, విజయాన్ని చేజిక్కించుకుని ప్రభుత్వాన్ని ఏర్పరిచిన తరవాత, అధికారికంగా కూడా భారత్ అణ్వాయుధాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని బీజేపీ నాయకత్వం చెబుతూనే ఉన్నది. ఇప్పుడది జరిగినాక ఎందుకింత ఆశ్చర్యం. అందుకని ఇకనైనా శ్వేతసౌధవాసులు ఆ తేభ్యపు నోళ్ళు మూసి భారత్ ప్రభుత్వంతో అణుశక్తి విషయమై సక్రమమైన చర్చాకార్యక్రమానికి దారితీస్తే మంచిది." ఈ వార్తాయోధునికి ఎన్‌పీఆర్ వారి అక్షర వీడ్కోలు.

సాక్షి ఫన్‌డేలో నా పుస్తకం రంగుటద్దాల కిటికీ ప్రస్తావన.

Comments

భావన said…
ఆ ఇంక పైకి ఏమి లేవ దీస్తారండి మీ రాష్ట్రాన్ని. ఒబామ ఇచ్చిన పేకేజీ లు చాలవా?
అయ్యో డేనియల్ షోర్ చని పోయారా.. నాకు కూడా ఇష్టమైన ఎనలిస్ట్. ఈ మధ్యన్ వర్క్ మరీ రెండూ మైళ్ళ దూరానికి వచ్చేసి NPR వార్తలు మిస్ అవుతున్నా. May his soul rest in peace.

సాక్షి లో మీ పుస్తక పరిచయమొచ్చినందుకు అభినందనలు.
భావన .. అదేంటండి, మా రాష్ట్రాన్ని మరీ చారులో కరివేపాకులా తీసిపడేశారు? ఎంతైనా మా రాష్ట్రం కదా, ఆ మాత్రం ఆశలు పెట్టుకున్నాం! :)
Reduction in driving time is directly proportional to reduction in NPR listening = I agree, but yeah, too sad. Mr. Schorr is no more.
pi said…
Being the NPR junkie, I am really going to miss Daniel Schorr!
Well GM is back to sub-prime lending & profits. Things may finally get better for you.

Both health care & financial reform are run-down, but something is better than nothing.

Also, any thoughts about Sarah Palin?
మీ ప్రస్తుత గవర్నర్ బావుంటుంది. ఆమె మాజీ మోడలట కదా. సుప్రీం కోర్ట్ న్యాయమూర్తిగా ఒబామా ఆమెను ఎన్నిక చేస్తాడేమోనని చూసాను కానీ ప్చ్. ఆమెనే మళ్ళీ గవర్నర్ గా వస్తే బావుండును. అందంతో పాటు ప్రతిభ కూడా ఆమెకు వుందంటారా లేదంటారా?
@Sarath .. Gov. Granholm can not be governor again due to term limits. It was not her doing, but it was under her watch that Michigan plunged into a nosedive - so, naturally, many of the state residents are not particularly happy with her. However, she has been trying to do some good work over the last couple of years within the bad economy and bad situation all around. Unfortunately, it was too little and too late.
Vasu said…
అధ్యక్షా !!
నేను దీన్ని ఖండిస్తున్నాను.. ఆంగ్లం లో రాసిన వ్యాఖ్యలు ప్రచురిచరని చెప్పి ఇప్పుడు ప్రచురిస్తున్నారు. నేనేదన్నా మిస్ అయ్యానా ??
@Vasu - yes, you missed :)
తెలుగుని ఆంగ్లలిపిలో రాయవద్దని మాత్రమే నా మనవి. అచ్చంగా ఇంగ్లీషు కేమెంట్లతో సమస్య లేదు.
కొత్తపాళీ గారికి,

నేను మొన్నీ మధ్య హైదరాబాద్ కి వెళ్ళినప్పుడు 2-3 షాపుల్లో మీ పుస్తకం కోసం వెతికానండీ.. దొరకలేదు. బెంగుళూరు లో దొరకదేమో అనుకుంటున్నాను. ఏదైనా బుక్ స్టోర్స్ మీకు తెలిస్తే చెప్పగలరు. లేదా పబ్లిషర్లకి ఫోన్ చేసి తెప్పించుకుంటాను లెండి..

కృష్ణప్రియ/
@ కృష్ణపిర్య, నా పుస్తకాన్ని గురించి ఆసక్తి కలిగినందుకు సంతోషం.
పబ్లిష్ చేసుకున్నది నేనే.
విజయవాడలో నవోదయ పబ్లిషర్సుని సంప్రదించండి. పార్సెల్లో పంపిస్తారు. ఒక ఉచిత సలహా మరియూ సేల్స్ పిచ్. ఒక్క పుస్తకం తెప్పించుకోవడం పోస్టేజి చేటు. అంచేత ఒహ ఐదారు కాపీలు కొనెయ్యండి. ఎట్లాగూ మీకు అక్కడ మీకులాగానే అమెరికా వాసం చేసి తిరిగొచ్చిన మిత్రులుండే ఉంటారు కాబట్టి వాళ్ళతోనూ పంచుకోవచ్చు! నా పేరు చెప్పండి, కనీసం 10% రాయితీ ఇస్తారు. :)
vjw_booklink AT yahoo[.]co[.]in