టొరాంటో తెలుగు వాహిని

ఈ మధ్య చేసిన మంచి పనుల్లో ఒకటి టొరాంటో వెళ్ళి అక్కడి తెలుగు సాహితీమిత్రులతో ఒక పూట గడిపి రావడం.

కొమరగిరి మురళిగారితోనూ, కొమరవోలు రావుగారితోనూ, పిళ్ళారిశెట్టి భాస్కర్ గారితోనూ సుమారు మూడేళ్ళుగా పరిచయం. 2008లో మా డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితి పదవ పుట్టిన రోజు వేడుకలకి వీరందరూ విచ్చేసి సభల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆ సభలోనే తెలుగు బ్లాగుల్ని ఇక్కడి తెలుగు సాహిత్య ఔత్సాహికులకి పరిచయం చేశాము. యాదృఛ్ఛికంగా దీప్తిధార బ్లాగరి సీబీరావుగారు కూడా ఆ సభలో పాల్గొన్నారు.

అప్పటికే టొరాంటోవారు ప్రతినెలా కలుసుకుని తెలుగు సాహిత్య చర్చలు చేస్తున్నామని చెప్పారు. 2009 సెప్టెంబర్లో తెలుగు సాహితీమూర్తుల శతజయంతి వేడుకలు జరిగిప్పుడు కూడా ఈ బృందం మా ఊరికి వచ్చి సభల్లో పాల్గొనగా, ఆ సందర్భంగా వీరితో కొంచెం సావకాశంగా ముచ్చటించే అవకాశం చిక్కింది. మాకు మరీ దూరం కాదు కాబట్టి ఎప్పుడైనా వెళ్ళి వారి నెలసరి సమావేశంలో పాల్గొంటే బాగుంటుందని అనుకున్నాను. తరవాత మురళిగారితో రెండు మూడు సార్లు ఫోనులో మాట్లాడినప్పుడు తప్పక రమ్మని ఆహ్వానించారు. మొత్తానికి అది జూన్ నెలలో సాధ్యపడింది.

శనివారం తెల్లారుజామునే బయల్దేరాను. రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. సరిహద్దు దగ్గర కూడా ఏమీ ఇబ్బంది లేదు. కెనడాలో ప్రవేశించి, విండ్సర్ నగరం దాటగానే, మళ్ళీ టొరాంటో నగరాన్ని సమీపించే దాకా (సుమారు 250 మైళ్ళు) పొలాలు. కనుచూపు మేర ఎటు చూసినా పుడమితల్లి వొడిలో నవనవలాడుతున్న సజీవమైన పచ్చదనం. అక్కడక్కడా ఎర్రటి పెయింట్ వేసి ఉన్న పశువుల కొట్టాలూ (barns), ధాన్యాగారాలూ (silos). ముందూ వెనకా ఇతరవాహనాలు కూడా ఎక్కువ లేవు. నిద్ర మత్తు ఆవరించకుండా ఇంటినించి తెచ్చుకున్న మసాలా చాయ్ చప్పరిస్తూ, స్టీరియోలో పెట్టిన తెలుగు పాటల్ని, నా అపస్వరంలోనే గాట్ఠిగా గొంతెత్తి పాడుకుంటూ (ఒంటరి ప్రయాణం విసుగే అయినా అందులో ఇదొక చిన్న వెసులుబాటు), ఐదున్నర గంటల్లో టొరాంటో చేరుకున్నాను.

ఆ మధ్యాహ్న భోజనం భాస్కర్ గారింట్లో. శ్రీమతి కళగారు కమ్మటి తెలుగు భోజనం పెట్టారు. వారి అబ్బాయి చి. అశ్విన్ ఉద్యోగరీత్యా సాఫ్టువేరు నిపుణుడైనా కూడా తెలుగు సాహిత్యంలోనూ, కర్నాటక హిందూస్తానీ సంగీతాల్లోనూ మంచి అభిరుచి ఉన్నవాడు, స్వయంగా సంగీత సాధన చేస్తున్నాడు. దిగిన దగ్గర్నించీ అతనితో కబుర్లే కబుర్లు. ఇంతలోకే కొమరవోలు సరోజగారు, రావుగారు విచ్చేశారు. మరి కాసేపటికి మురళి గారూ చేరారు. ఎడతెగని కబుర్ల మధ్యలోనే భోజనాలు పూర్తి చేశాము. రావుగారు సరోజగారు టొరాంటోలో చాలాకాలంగా నివాసం ఉన్న వారు. అక్కడి తెలుగు సమాజానికి మూలస్తంభాలు అంటే అతిశయోక్తి కాదు. పైగా సరోజగారు ఇప్పటికే చాలా కథలు రాశారు. కళగారు అక్కడి భారతీయ హైకమిషన్ నడిపే పౌర సాంస్కృతిక సంఘంలో ఉపాధ్యక్షులుగా ఉన్నారు. మురళిగారు తమ ఇంట్లోనే సత్యసాయి సత్సంగ్ నడుపుతూ పిల్లలకి హిందూ ధార్మిక విషయాలు నేర్పుతుంటారు. మన సంస్కృతిని తరువాతి తరానికి అందించడం పట్ల వీరికి ఆసక్తి మెండు. ఇక అశ్విన్ తన వీలుని బట్టి అనేక కార్యక్రమాల్లో ఉత్సాహంగా వాలంటీర్ చేస్తుంటారని తెలిసింది. మొత్తానికి వీరంతా గొప్ప ఉత్సాహం ఉన్న కార్యశీలురు, బహుముఖ ప్రజ్ఞావంతులు. వీరందరితో కాసేపు సావకాశంగా మనసులు కలబోసుకోవడం చాలా ఉత్తేజం కలిగించింది నాకు.

సాయంత్రం నాలుగ్గంటల ప్రాంతంలో మురళిగారింటికి చేరుకున్నాం. మొత్తం పదిహేనుమందిదాకా సభ్యులు చేరుకున్నారు. వీరిలో శ్రీరాం, వారి శ్రీమతి అజంతా గారిని ఇంతకు మునుపు డిట్రాయిట్‌లో కలిశాను. సమావేశం నిర్వహించే భారం నెత్తిన వేసుకున్న మిత్రులు పోతంశెట్టి సత్యం గారిని ఇదే కలవడం. ఆయన కూడా మంచి ఉత్సాహవంతులు, చతుర హాస్య సంభాషణలో దిట్ట. మురళిగారి శ్రీమతి మాలతిగారు అందర్నీ సాదరంగా ఆహ్వానించి మిరపకాయ బజ్జీలూ, చాయ్ అందించారు. ఆ రోజు సమావేశం వారింట్లోనే. వీరు ప్రతినెలా ఎవరో ఒకరు సభ్యుల ఇంట్లోనే సమావేశ మవుతున్నారు. సమావేశం ముగిసినాక సభ్యులందరూ వంతుల వారీగా తెచ్చిన వంటకాలతో విందుభోజనం, ఓపిక ఉన్నంతసేపు ఇష్టాగోష్ఠి - వీరి పద్ధతి నాకు ఆహ్లాదకరంగా అనిపించింది. జరగబోయే మూడు నాలుగు సమావేశాలకి తేదీలు, ఎవరింట్లో జరుపుతున్నారనే సమాచారం ముందుగానే నిర్ణయించడం కూడా బాగుంది. ప్రతి సమావేశంలోనూ కనీసం మూడు అంశాలు చర్చకి వస్తాయి. మొదట సాంప్రదాయ సాహిత్యాన్నించి ఒక కావ్య భాగాన్ని చదివి వక్కలంక రాం గారు వ్యాఖ్యానిస్తుంటారు. నేను వెళ్ళినరోజున రాం గారు వ్యక్తిగత కారణాల వల్ల సమావేశానికి రాలేకపోవడంతో మరో బహుముఖ ప్రజ్ఞాశాలిని కలుసుకునే అవకాశం కోల్పోయాను. తరవాత ఒక సమకాలీన కథ. కథని అందరూ ముందే చదివి ఉన్నా అక్కడ మళ్ళీ సభ్యులొకరి పైకి కథని చదువుతారు. అటుపైన ఆ కథ గురించి చర్చ. మూడవ భాగంలో సభ్యులు ఒకరు తమకి ఇష్టమైన సాహిత్యాంశం మీద ప్రసగించడం, మళ్ళీ దాని మీద చర్చ. ఇదీ సాధారణంగా వీరి సమావేశం జరిగే క్రమం.

నేను వెళ్ళిన రోజున ఆముక్తమాల్యద కావ్యాన్ని గురించి ప్రసంగిస్తున్న రాం గారు రానని ముందే తెలియ జెయ్యడంతో మొదటి రెండు గంటలు నాకే కేటాయించారు. నా కథల సంపుటి రంగుటద్దాల కిటికీ నించి ఇండియన్ వేల్యూస్ కథ చదివి వినిపించాను. నేను చదవడం ముగిశాక సభ్యులందరూ ఒకరి తరవాత ఒకరు కథ గురించి తమ తమ అభిప్రాయాలు, మృదువుగానే అయినా, నిర్మొగమాటంగా చెప్పారు. ఈ కథ గురించి ఇప్పటివరకూ నాకు చేరిన విమర్శలు కాక కొన్ని కొత్త కోణాలు ఇక్కడ చర్చకు వచ్చాయి. రచయితగా నాకిది చాలా సంతోషం కలిగించింది. స్వల్ప విరామం తరవాత సమకాలీన సాహిత్యాన్ని ఎలా చదవాలి అన్న విషయమ్మీద నేను ఒక పావుగంట సేపు ఉపన్యసించి, ఇండియన్ వేల్యూస్ కథనే ఉదాహరణగా తీసుకుని చర్చకు పెట్టాను. ఈ చర్చకూడా మంచి రసవత్తరంగా సాగింది.

ఈ సమావేశానికి తిరుమలకృష్ణ దేశికాచార్యులుగారు ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. పోతన, వేమన ఫాంట్ల సృష్టికర్తగా బ్లాగరులు కొందరికైనా వీరి పేరు పరిచయమయ్యే ఉంటుంది. తొలితరం తెలుగు వెబ్సైట్లు చాలా వరకు వీరి పోతన లిపితోనే ప్రదర్శితమయ్యేవి. నాకు ఇదివరకు తెలియని విషయము, ఈ సమావేశంలోనే అనుభవానికి వచ్చిన విషయము దేశికాచార్యులు గారు ఛందోబద్ధ పద్య రచనలో అందెవేసిన చేయి. తాను ఇటీవల రచించిన రెండు ఖండకావ్యాలను శ్రావ్యముగా చదివి వ్యాఖ్యానంతో వివరించారు. మొదటి దాని పేరు శరణాగతి. రెండవ దాని పేరు పసిడి పల్లకీ. పద్యాలు చాలా గొప్పగా ఉన్నాయి. సున్నితమైన భావాలు, ప్రౌఢమైన అభివ్యక్తి, చక్కనైన మాటల పొందిక వీరి స్వంతం. మొదటి దానిలో ఒక మగవాడు తన ప్రేయసి కనబడక వనంలో వెతుకుతూ వెళ్ళి చివరికి ఆమెని కలుసుకోవడం కథాంశం. పోలికలు కవిసమయాలు కూడా భలే విలక్షణంగా చెబుతారు కవిగారు. ఈ నాయకుడు సన్నజాజి తీగని అడిగాడు నా చెలిని చూశావా అని. జాజితీగ అంటుంది, హబ్బో ఆవిడ తనూలత నాకంటే వంపులు తిరిగి వయ్యారాలు పోతుంది. ఇక ఆమెతో నేనేమి మాట్లాడనూ అందుకని పట్టించుకోలేదు అంటుంది. సరసులోని పద్మాన్ని అడుగుతాడు. పద్మం అంటుంది, ఆమె మొహం నాకంటే ఎంతో కాంతివంతంగా అందంగా ఉంది. ఆ కారణం చేత ఆమెకి మిడిసిపాటు ఉండొచ్చు. ఒకవేళ ఉన్నా, అది అర్ధం చేసుకో దగినదే. ఐనా ఆమె సరసుదగ్గర ఆగి నాతో ముచ్చటించింది. ఆమె నాపట్ల చూపిన ఆదరణతో ధన్యనైనాను. ఈ ఖండిక చివర ఒక గొప్ప సస్పెన్స్ నవలలో ఉండే ట్విస్టు ఇచ్చి పాఠకుల్ని దిగ్భ్రాంతుల్ని చేస్తారు కవిగారు. అది కథా నిర్వహణపట్ల వింత ఆలోచన చెయ్యగల కవిగారి సృజనశక్తికి మంచి గుర్తు. నా సొద ఎందుకుగాని, మీరే చదివి ఆనందించండి.

పసిడి పల్లకీలో వస్తువు పెద్దన మనుచరిత్ర కావ్యాన్ని నిండుసభలో రాయలకి అంకితమియ్యగా రాయలు ఆంధ్ర కవితా పితామహుణ్ణి తగురీతిని సత్కరించి బంగారు పల్లకీ ఎక్కించి తానే భుజాన మోసి ఊరేగించడం. నలభై తొమ్మిది పద్యాలలో చక్కటి ధారతో తన స్వగ్రామంలో స్వగృహంలో పెద్దన ఎలా ఉన్నాడు అని మొదలు పెట్టి, ఆనాటి జీవన విధానం, తరవాత రాయల కొలువు వైభవం అంతా హృద్యమైన వర్ణనతో మన కళ్ళకు కట్టేశారు కవిగారు. కర్నాటాంధ్ర దేశాలలో రాయల 500 వార్షికోత్సవాలు జరుగుతున్న సందర్భమే ఈ కావ్యరచనకి ప్రేరణ అని దేశికాచార్యులుగారు సెలవిచ్చారు. కవితాపఠనం ముగియగానే సభ్యులందరూ లేచి నించుని ఆగని కరతాళధ్వనులతో దేశికాచార్యులుగారి కవిత్వం పట్ల హర్షామోదాలు తెలియజేశారు. దేశికాచార్యులుగారి కవితావ్యవసాయాన్ని వారి స్వంత సైటులో చూడొచ్చు.

అటుపైన షడ్రుచులే కాదు, అనేక రుచులతో విందు భోజనం. నంజుకోడానికి సరస సంభాషణ. ఎంతకీ ముగియదే, ఎంతకీ తనివి తీరదే. అర్ధరాత్రి కొడుతోందనగా చివరి అతిథులు అయిష్టంగానే శలవు తీసుకున్నారు. ఆ రాత్రికి మురళిగారింట్లోనే విశ్రమించి మర్నాడు ఉదయం మరి కాసేపు వారి కార్యకలాపాల గురించీ, సంగీతం గురించి మురళిగారితో ముచ్చటించి, తిరుగు ప్రయాణమయ్యాను. అమెరికా సరిహద్దులో ఇమ్మిగ్రేషను వాళ్ళు ఒక గంట చికాకు పెట్టినా పెద్దగా బాధ అనిపించలేదు, వారాంతమంతా మనసునిండిన సంతృప్తి వల్ల.

Comments

భావన said…
చాలా బాగుందండి. వారాంతానికి మంచి విందు దొరికిందన్నమాట మీకు. మాకు కూడా పంచినందుకు థ్యాంక్స్.
నేను కొంచం కుళ్ళింగ్ ..
శ్రీ said…
బాగుందండీ! ఈ నెల 24 మన డీటీయెల్సీ నుండి మేము కూడా వెళ్తున్నాము.
భావన, It was wonderful.
చక్రవర్తి, :)
శ్రీ, నిజమా? సంతోషం
స్వామీ! మీరెక్కడున్నా సూర్య ప్రకాశులే. మీరుఆనందంతో వెలుగుతూ అందరికీ ఆనందం పంచుతూ ఆనందంతో ప్రకాశించేలా చేస్తారు. మీ అందుబాటు మాకు కొరతే. ఐనా ప్రవాసాంధ్రులనేకం చేస్తూ మన ఆంధ్ర భాషామతల్లిని జగజ్జేగీయమానంగా వెలిగేలా చేస్తారు. చాలా సంతోషం.
జరిగిన వృత్తాంతాన్ని జర్ఇగినట్టుగా వ్రాస్తే అది వ్యాసమనిపించుకోవచ్చు.దానిలో టెంపో ఉండదు. కాని జరిగిన అంశాన్నే పాఠకులింకా ఇంకా చదవాలనిపించేలా వ్రాయడమే చక్కని కథనమౌతుంది.అది అందరికీ అబ్బే విద్య కాదు కేవలం ఉత్తమ కథకునకే అది సాధ్యమౌతుంది. మీరు నా ఉద్దేశ్యంలో ఉత్తమ కథారచయిత. ఇంత పెద్దగా నేను వ్రాస్తే అది వ్యాసం. అదే మీరు వ్రాస్తే కథ. థేంక్యూ!
Kalpana Rentala said…
కొత్తపాళీ,
ఇండియన్ వాల్యూస్ కథ గురించి వాళ్ళు చెప్పిన కొత్త పాయింట్లు మాకు కూడా చెప్పవచ్చు కదా. ఇంకో పోస్ట్ కేవలం ఆ కథ మీద జరిగిన చర్చ రాయండి. అలాగే మీరు చెప్పిన సమకాలీన సాహిత్యాన్ని చూడాల్సిన విధానం గురించి కూడా కలిపి.
కల్పన
రామకృష్ణ మాస్టారూ, అది మీ అభిమానం. తెలుగు సాహిత్యమంటే మంచి ఉత్సాహం ఉన్న కొందరు ప్రవాసాంధ్రులు (వీరు కొద్దిమందే, గంగిగోవు పాల చందం) చేస్తున్న భాషాసాహిత్య సేవ ఎన్నదగినది, మీరన్నట్టు.
కల్పన, నేను నోట్సు రాసుకోలేదు. అందుకని వివరంగా గుర్తు లేదు. నోట్సు రాయవలసిన వారుకూడా చర్చ వాడిగా వేడిగా ఉండడంతో నోట్సు సంగతి మరిచారు! సమకాలీన సాహిత్యాన్ని చదవడం గురించి నా ఉద్దేశాలు విడీగా రాస్తాను.
Unknown said…
తిరుమల కృష్ణ దేశికాచార్యుల వారిని, వారి వెబ్ సైట్ ని పరిచయం చేసినందుకు ధన్యవాదములు.
Ennela said…
కొత్తపాళీ గారూ కృతజ్ఞతలండీ
రావు గారిని సరోజ గారినీ ఒక మాటు తెలుగు సంబరాల్లో చూట్టం తప్ప విశేషాలేమీ తెలియవు.
మా ఊరి గురించి తెలిపినందుకు కృతజ్ఞతలు. మీ పాళీ కొత్తదేమో కానండీ, కలం మాత్రం రాయల కాలం నుంచీ పారంపర్యంగా వచ్చినట్లుగా అనుభూతిస్తున్నాను.
@ennela - ఓ, మీరు టొరాంటో వాసులా. తెలుగు భాష, సాహిత్యం అంటే ఆసక్తి ఉంటే తప్పక తెలుగు వాహిని వారిని కలవండి.
ఇక రాయల కాలం సంగతి - మీరు పొగిడారో తెగిడారో అర్ధం కాలేదు :(
Ennela said…
koththa paalee gaaru,
avunandee memu toronto vaasulame. kaanee prastutam st.catharines ki valasa vachchanu.. konni nelala kosam....maa vaaru inka mississauga loney untunnaaru....
raayala kaalam antey sangeetha saahityaala kaalam kadandee..... alanti suvaasanalu vastunnayi mee kalam nunchi ani wraasaanu.... artham chesukoru......