అమెరికాలో ప్రవాసం ఉన్న భారతీయుల మనసుల్లో మా మెట్టినిల్లైన అమెరికాని తలుచుకున్నప్పుడల్లా ఎన్నో పరస్పరం విరుద్ధమైన భావాల సంఘర్షణ చెలరేగుతుంది.
పైపైన చూస్తే కొన్ని విషయాల్లో చాలా ముచ్చటేస్తుంది. నిత్యావసరాలకి తడుముకోనక్కరలేకుండా సులభంగా పనులు జరగిపోవడం, అధికార్లూ పోలీసులూ ఒక మోస్తరు నిజాయితీతో పని చెయ్యడం, నిత్య జీవితంలో ఒక క్రమశిక్షణ, ఒక క్రమబద్ధత, ఇలాంటివి. ఇంకోపక్కన ఈ దేశంలో కనబడే, అనుభవమయ్యే ప్రకృతి వైవిధ్యం హాయి గొల్పుతుంది, చూసే కళ్ళుంటే, స్పందించే మనసుంటే పులకరింపచేస్తుంది (మరీ కాంక్రీటు జంగిల్లాంటి నగరాల్లో ఉంటే తప్ప). సాంఘిక కోణంలో చూస్తే మన చుట్టూ ఉన్న రకరకాల మనుషులు, రకరకాల సంస్కృతులు, వేషభాషలు, మత పద్ధతులు, భోజనాలు, సంగీత సాహిత్యాది కళలు - ఈ మహాసముద్రంలో ఎన్ని అలలో, ఎన్నెన్ని లోతులో. ఇంకా ఇలా చాలా చాలా ..
ఈ అనుభవసాగరాల్ని మధించడం మొదలెడితే ముందుగా పైకొచ్చేది హాలాహలమే.
చుట్టూతా వ్యాపించి ఉన్న సంస్కృతి మనది కాదు. మన సంస్కృతినీ మన భాషనీ మన మతాన్నీ మన పద్ధతుల్నీ మింగెయ్యగలదు, నామరూపాల్లేకుండా ఎగరగొట్టెయ్యగల మహా ప్రభంజనం మధ్యలో ఉన్నాం. ఒక చిన్న మైనారిటీగా. పైపెచ్చు మోడల్ మైనారిటీ అనే గుదిబండనోదాన్ని మెడకి కట్టుకుని. మన అస్తిత్వాన్ని కాపాడుకోగలమా ఈ ప్రభంజనంలో ఈ ఝంఝామారుతంలో? పెద్దమానులను కూల్చు తుపాను గడ్డిపరకను కదల్చదట!
మన చూపు మరి కాస్త విస్తరిస్తే - ఏమేమి కనిపిస్తున్నాయి? మానవత్వాన్ని కబళించే దురాశ, మనుషులకీ కార్పొరేట్లకీ ఒక్కలాగే, బిలియన్ల ఆస్తుల్ని క్షణాల్లో హూష్కాకీ అని మాయం చేసే వాలువీధి మంత్రజాలం. మేం స్వేఛ్ఛకి ప్రతీకలం అని చెబుతూనే ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ఈ ప్రభుత్వం చేస్తున్న పోలీసు జులుం. మాటల్లో చేతల్లో ద్వంద్వ వైఖరులు.
ఏదేమైనా అమెరికా ఒక విలక్షణమైన దేశం. అమెరికా జీవితం అదో వింత అనుభవం.
నా మెట్టిన దేశానికి జన్మదిన శుభాకాంక్షలు.
Comments
సందీప్ .. నాకేంటి అనుకునే వాళ్ళకి లెక్కలేదు, నిజమే. కానీ ఈ విషయం నేను పట్టించుకోవాలి అనే కార్యదీక్షా పరులకి కూడా లెక్క తక్కువకాదు.
మాలతి .. రూల్సు - స్వేఛ్ఛ. నిజమే. కానీ ప్రజాస్వామ్యం అంటేనే రూల్సు కదా. బాధ్యత లేకుండా హక్కులెలా ఉంటాయి?
అమ్మఒడి .. మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు. అమెరికా జీవితాన్ని నా కళ్ళతో, నా అనుభవంతో మాటల్లో పెట్టే ప్రయత్నం ఈ బ్లాగులో చాలా చోట్ల చేశాను. మీకు వీలున్నప్పుడు అవికూడా చూడావలసిందని ప్రార్ధన.
రాజేశ్వరిగారు .. నమస్కారం. ఓపిగ్గా నా బ్లాగు టపాలు చదువుతున్నందుకు నెనర్లు. ఒక తల్లిగా కొడుకు ఇంటిపని చెయ్యడం మీకు విడ్డూరంగానూ కొంచెం కష్టం కలిగించేదిగానూ ఉండొచ్చు. పైగా బయట ఉద్యోగం చెయ్యడం ఒక బాధ్యతే కానీ అదొక్కటే బాధ్యత కాదు. పిల్లలతల్లి అయితే తప్ప full time work అనే పదబంధానికి అర్ధంలేదనే నానుడి మీకు తెలియనిది కాదు. కానీ విద్యావంతులైన మీవంటివారే అటువంటి భావనల్ని ఇంకా ప్రచారం చెయ్యడం నాక్కొంచెం ఆశ్చర్యం కలిగిస్తున్నది. మా అమ్మ పెంపకంలో మేమందరమూ ఇంటిపనులు చెయ్యడం నేర్చుకున్నాము. రోజూ మేము తిన్న కంచాలు మేమే కడుకున్నాము. నేను ఆర్యీసీలో బీ.టెక్ చదివే రోజుల్లో కూడా ఇంటికొచ్చినప్పుడు పనిమనిషి రాకపోతే మా అమ్మకి సాయం కోసం అంట్లు తోమాను, అందుకేమీ కించపడలేదు. ఇక అమెరికాలో విషయం - కొన్ని కొన్ని పనులు ఆయా నిర్ణీత సమయానికి జరిగిపోవాలి. సోమవారం పొద్దుటికి ట్రాష్ బయట పెట్టాలి. మిస్సయ్యామంటే చచ్చామన్నమాటే. అలాంటి పరిస్థితుల్లో ఎవరు చేశారన్నది ముఖ్యం కాదు, పని జరిగిపోవడం ముఖ్యం. ఇది అమెరికా పద్ధతి అని నేను అనను. నా అమెరికను స్నేహితుల్లోనూ, ఇటుపుల్ల అటు పెట్టని పురుషపుంగవులు ఉన్నారు.
ఏదేమైనా మీరు చెప్పినట్టు కొంతవరకూ (అలా నిర్వహించుకోగలిగితే) భారతీయ స్త్రీలకి ఈ దేశంలో జీవితం కొంత సుఖానిస్తున్నది.