తెలుగుపాఠం - మే 18

పుట్టి మునిగినట్టు ఏవిటా హడావుడి అని కోప్పడుతుండేది మా అమ్మ. చిన్నప్పుడు నాకు అన్నిటికీ ఆత్రమే. అమ్మ మాటల్లో ఆ వాడుకని అంతగా పట్టించుకోలేదు గాని తరవాత్తరవాత చదువుతున్న పుస్తకాల్లో కూడా ఈ వాడుక కనబడుతూ ఉండేసరికి దీని సంగతి కొంచెం ఆలోచించాను. పుట్టి అంటే పుట్టిన తరువాత (మనుజుడై పుట్టి టైపులో), మునిగినట్టు అంటే మునక వేసి అని అర్ధం చెప్పుకున్నాను. కానీ అన్వయం సరిగ్గా కుదర్లేదు. పుట్టంగానే మునక వెయ్యడం ఏవిటి? మనమేవి చేపపిల్లలం కానీ కనీసం కప్ప పిల్లలం కానీ కాదే, పుట్టంగానే మునక వేసేందుకు? ఈ ముంక వెయ్యడానికి ఆత్రానికీ సంబంధం ఏవిటబ్బా? ఈ ఆలోచన ఎప్పటికీ తెగేది కాదు. ఓహో, ఇది కూడా నాకు ఎప్పటికీ అర్ధంకాని మిస్టరీల్లో మిగిలిపోవాల్సిందే అనుకుంటూ వచ్చా. మొన్న మల్లాది రామకృష్ణశాస్త్రిగారి కథలు చదువుతుంటే అందులో ఒక పాత్రతో అనిపిస్తారు శాస్త్రిగారు - ఏదో వాడి పుట్టి అంతా మునిగిపోయినట్టు హడవుడిగా .. ఆహా! పుట్టి అంటే పుటకలకి సంబంధించిన విషయం కాదు - ఇది వేరే యవ్వారం.

పుట్టి అని ధాన్యపు కొలత ఒకటుంది. సుమారు వెయ్యి శేర్లు. ఏటికేతామెత్తి యెయి పుట్లు పండించి అని పాట వుంది. పుట్టెడు అంటే చాలా అనే అర్ధం దీన్నించే వచ్చింది, మనం పోయిన వారం చెప్పుకున్న బోలెడు, బొచ్చెడు లాగానే. ఆమె పుట్టెడు దుఃఖంలో ఉంది అంటారు. అలాగ, ఈ పుట్టి మునగడం అంటే ఏదన్నా ధాన్యపు గాదె మునిగిందా, వెయ్యి శేర్ల ధాన్యం మునిగే నీరు (వానో వరదో) వచ్చిందంటే కంగారే మరి. బహుశా ఇదేనేమో అనుకుంటూ నిఘంటువు తెరిచాను. బ్రౌణ్యములో పైన చెప్పిన ధాన్యపు కొలత అర్ధంతో పాటు ఈ అర్ధం కూడా చెప్పారు.
"A wicker boat woven of cane and covered with leather. వాని పుట్టి ముణిగినది his raft is sunk, i.e., he is shipwrecked or ruined."
అదన్న మాట పుట్టి మునిగిన విశేషం!

గతవారపు పదాలు


గోము: నిఘంటువులు ఈ పదానికి సౌకుమార్యము, శ్రమమెరుగనితనము నిర్వచనాలు ఇచ్చాయి. కానీ వాడుకలో "గోముగా" అనే వాడుకనే ఎక్కువగా చూస్తుంటాము. దీన్ని గారాబంగా, ముద్దుముద్దుగా అనే అర్ధంలో, సాధారణంగా యవ్వనవతి, వయ్యారి అయిన స్త్రీ విషయంలో వాడుతారు. సత్యభామ శ్రీకృష్ణుణ్ణి గోముగా అడిగింది తనని కూడా యుద్ధానికి తీసుకెళ్ళమని. ఈ వాడుక మీద ఒక మంచి చమత్కారమైన పద్యం పొద్దులో ఇక్కడ చూడవచ్చు.
నీటు: శృంగారపరమైన, అందమైన. కేవలం అందం కాదు, ఆ అందం చూస్తే శృంగార భావనలు రేకెత్తాలన్న మాట. నీటుకాడు, నీటుకత్తె అంటే ఇటువంటి లక్షణం కలిగిన పురుషుడు స్త్రీ. ఇటువంటిదే ఇంకో పదం గోటు, అంటే వయ్యారం, కులుకు అని. మాయాబజారులో కౌరవులు విడిదిచేసినాక మాయాశశిరేఖ విడిదికి వచ్చి దూరాన్నించి లక్ష్మణకుమారుణ్ణి చూడగా ఆమెతో - ఆ నీటూ గోటూ మా బావేనా? - అనిపించాడు ఆ మాటల మాంత్రికుడు మహానుభావుడు పింగళి. యమగోల సినిమాపాటలో రాటుదేలిపోయావు నీటుగాడ అనే వేటూరి వాక్యం అందరికీ పరిచితమే.
తాట: చర్మమే, కానీ మనుషులది కాదు, చెట్లది. దీన్నే బెరడు అని కూడా అంటారు.
వేల్పు: వేలుపు, దేవుడు లేక దేవత. ఇలవేల్పు అంటే ఆ కుటుంబం అభిమానంగా ఆరాధించుకునే దైవం. మ్రొక్కిన వరమీని వేల్పుని (మరికొన్ని పనికిరాని వాటితోపాటుగా) గ్రక్కున విడవాలని సుమతీశతకం బోధిస్తుంది.
వెన్ను: వీపు. వీపుకి ఆధారంగా ఉండేది కాబట్టి వెన్నెముక అయింది. వెన్ను విరుచుకోవడం అంటే వీపు వెనక్కి ఛాతీ ముందుకి వచ్చేట్టుగా చేసే చర్య, ఆత్మవిశ్వాసానికీ ధైర్యానికీ సూచన. ఇంద్రుడికి వజ్రాయుధం కోసం తన వెన్నెముకని దానం చేసిన ఋషి ఎవరో చెప్పగలరా?
వరి, చెరకు వంటి మొక్కలకి వచ్చే కంకిని (కాండం కాదు) కూడా వెన్ను అంటారు. చెరకు తుద వెన్ను పుట్టిన చెరకున తీపెల్ల చెరచునని సుమతీవాక్యం. జెఱకు వెన్నుపుట్టి చెరపదా తీపెల్ల అని వేమన వాక్యం.
విష్ణువు కి వికృతి వెన్నుడు అని వాడుక. వేనామాల వెన్నుడా నిన్ను వినుతించనెంత వాడ అని అన్నమయ్య పదం.

ఈ కింది పదాలకి అర్ధాలు చెప్పండి - నిఘంటువుల్లో వెతక్కుండా!
పరవళ్ళు
పొదుగు
అనువు (అనవు)
వేకువ
మేలము

Comments

మేలమాడటం = హాస్యాలాడటం
వేకువ = తెల్ల వారక మునుపు (వేగు చుక్క పొడిచే వేళా?)
అనువు = వీలు (అనువు గాని చోట..)
Unknown said…
వేకువ = తెల్లవారగట్ల , ఉదయాన్నే
అనువు = తగిన చోటు .అనువు గాని చోట అధికుల మనరాదు
పొదుగు = చనుకట్టు( పశువులకు )
పరవళ్ళు = గంతులు వేయు
మేలము = వేళాకోళము
నిఘంటువును చూడకుండా రాశినవి. నిఘంటువుల్లో ఇంకా కొత్త అర్థాలు చాలా ఉండొచ్చు.
మీ పుట్టి పురాణం బాగుంది, మా అమ్మ "ఊత్రమాగని బాపనోడు ఉడుకు ఉడుకు పప్పు తిన్నడట" అనే వాక్యం వాడేది.
ఆజానుబాహుడు అంటే అర్థమేమిటి, సాధారణ వాడకంలో ఎత్తుగా ఉన్న వాళ్ళను అంటారు కాని చేతులు బాగా పొడవుగా ఉన్న వాళ్ళకు వాడే ఉపమానమని ఎవరో చెప్పగా విన్నాను.
జవాబులు:
పరవళ్ళు - పరుగులు,
పొదుగు - సరిగ్గా తెలీదు కానీ, ఆవుకి పొదుగు ఉంటుంది, కోడి పుదుగుతుంది :)
అనువు - అనుకూలంగా
వేకువ - ప్రాత:కాలము, ఆడవాళ్లు వేకువ జామున లేచి ముగ్గులేస్తున్నారు.
మేలము - ఎప్పుడు వినలేదు.
మీ తెలుగు పాఠాలు బానే ఉన్నాయి. అందరికి పని పెడుతున్నారే.:)
పరవళ్ళు - వేగంగా,వడివడిగా కదలడం, గోదావరి పరవళ్లు, ఉత్సాహం పరవళ్లు తొక్కుతుంది అంటారు కదా..

పొదుగు - పాలు తాగే పొదుగు, నగలలో రాళ్లు పొదగడం..

అనువు (అనవు) - convenient , అనువుగాని చోట అధికులమనరాదు అని అంటారు కదా.

వేకువ - ప్రభాతవేళ, early morning before sunrise

మేలము - హాస్యమాడటం , బావామరదళ్లు, తోడికోడళ్ల మధ్య ఎక్కువగా జరిగేది. సరదాగా ఒకరినొకరు మేలమాడుకుంటారు. (జోకులేసుకుంటారన్నమాట)
కొత్తపదాలకి అర్ధాలు చెప్పే వ్యాఖ్యల్ని వెంటనే ప్రచురించబోవడం లేదు. ఒక రెండు రోజులైన తరవాత ప్రచురిస్తాను. పదాలకి అర్ధాలుకాక వేరే ఏమైనా చెప్ప దల్చుకుంటే విడిగా వ్యాఖ్య పెట్టండి.
వజ్రాయుధం - దధీచి మహర్షి వెన్నెముకేనా?
గురూ గారూ,
అచ్చంగా ఒకే పదంలో అర్ధం చెప్పడం నాకు సరిగ్గా రాదు. కానీ, ఏ అర్ధంలో వాడతారో తెలుసు నాకు. మీరడిగిన పదాలతో సొంతవాక్యాలు రాసే ప్రయత్నం చేస్తున్నా!

1. పరవళ్ళు - గోదావరి పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తోంది. కొన్ని సినిమా పాటల్లో కూడా 'పరవళ్ళు తొక్కే వయసు' లాంటి ప్రయోగాలు చేస్తుంటారు.
2. పొదుగు - కోడి పిల్లల్ని పొదుగుతుంది / ఆవు పొదుగు నుండి పాలు పిండుతారు.
3. అనువు - వీలు - అనువుగాని చోట అధికులమనరాదు పద్యం ఉందిగా!
4. వేకువ - తెల్లవారుజామున
5. మేలం - మేలమాడటం - ఆట పట్టించడం.
థాంక్సండి..ముందుగా అర్ధాలు కలిగిన కమెంట్స్ ప్రచురించనందుకు...తెలిసిన వాళ్ళు ముందే చెప్పేస్తే మాకు తర్వాత ఆలోచించాలన్న ఆసక్తి ఉండటం లేదు...

ఇక నా భాషా పాండిత్యాన్ని వెలికి తీసే పని...:-)

పరవళ్ళు - ఉరకటం, పరిగెత్తటం..
ఉదా: గోదారమ్మ పరవళ్ళు తొక్కుతుంది అని అంటాం..

పొదుగు - జంతువులకు పాలు పితికే చోటు(అయ్యో.. ప్లీజ్ నవ్వకండి..నాకు సరిగ్గ ఎక్స్ ప్రెస్ చెయ్యటం రాలే!! :))
ఉదా: ఆవు పొదుగు

అనువు - సమయం( టైం మనది కానప్పుడు )
ఉదా: అనువుగాని చోట అధికుల మనరాదు(చిన్నప్పటి పద్యం ఏదో లీలగా గుర్తుకువస్తోంది...)

వేకువ - పొద్దు పొద్దున్నే, Early Morning

మేలము - గుంపు, సమూహం
ఉదా: బ్యాండ్ మేలం
పరవళ్ళు - నది ఎగురుతూ, దుముకుతూ ప్రవహించడం.
పొదుగు - ఆవు పొదుగు, గుడ్డు పొదగడం
అనువు - అనుకూలమైన వాతావరణం
వేకువ - తెల్లవారుజాము
మేలము - తమాషా చేయడం

పుట్టి గురించి చెప్పారు. పట్టెడు ( భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు, విశ్వదాభిరామ వినుర వేమ) అంటే ఎంత, ఏమిటి?
మాలతి said…
ఈ పాఠాలు చాలా బాగున్నాయండి. మీరు ఇది వేరే సైటుగా రూపొందించి, ఇలా వాడుకలో లేని మాటలకి, వివరణలిస్తూ మరిచిపోతున్న పదజాలాన్ని గుర్తుకి తెచ్చేదిగా చేస్తే బాగుంటుందేమో. ఆలోచించండి.
టపాల్లో అయితే, నాలుగురోజులయేసరికి వెనకబడిపోతాయి.
Dr.Pen said…
మాస్టారండీ! మీ పాఠాలు ఎంచక్కా ఉన్నాయో, రోజూ పలకా, బలపం చేతపట్టి మీ దగ్గర ట్యూషను చెప్పించుకోవాలని ఉంది:-)
మీరు కూడలి నుంచి నిష్క్రమించి తెలుగువారికి అన్యాయం చేస్తున్నారు...ఇవి ఎక్కువ మందికి చేరకుండా. నేను చాలా మిస్సయ్యాను.
@మధురవాణి...దధీచి కరెష్టే సుమండీ!
రాధిక said…
పరవళ్ళు= గల గల పారింది, పొంగినది అని అర్థం (కృష్ణమ్మా పరవళ్ళు తొక్కింది అని వాడుక )
పొదుగు =స్తన్యం (ఆవు పాల "పొదుగు" )
అనువు = సౌకర్యం,తగు ("అనువు" కాని చోట)
వేకువ =తెల్లవారుజాము
ఓహో పుట్టి అంటే ఇదా అర్థం...పుట్టెడు దుఖం అని వినడమే కానీ అర్థం ఇప్పుడే తెలిసింది. తాట అంటే బెరడా, నేనింకా మానవ చర్మమే అనుకున్నాను.
పరవళ్ళు - ఉరకలు పరుగులతో, వేగంగా సాగిపోయే, పరవళ్ళు తొక్కింది గోదావరి అంటారు కదా.

పొదుగు - దీనికి రెండు అర్థాలున్నాయి. ఒకటీ పాల"పొదుగు" ఇంకోటి పొదగడం అంటే అమర్చిపెట్టడం, వజ్రాలు పొదగడం అంటారుగా.

అనువు - కలిసివచ్చే అంశం, "అనువుగాని చోట అధికులమనరాదు"

వేకువ - తెల్లవారుఝాము, "వేకువనే లేచి" అని వాడుకలో ఉంది. "పెందరాళే" అని ఇంకో పదం కూడా ఉంది.

మేలము - దీనికి అర్థం తెలీదు, కానీ ఊహిస్తున్నా...."మంచి" అయినా అయ్యుండాలి లేదా "ఎత్తైనది", "పైన" అయినా అయ్యుండాలి.
తూలిక వారిది చక్కని సూచన. ఈపాఠాలు వేరే సైటుగా ఇస్తే బావుంటుంది.
పుట్టి అన్న పదానికి ఇచ్చిన వివరణ బాగుందండీ నాకు raft మాత్రమే తెలుసు కొలత గురించి తెలీదు.

వేటూరి గారి నీటుగాడు గుర్తొచ్చాడు కానీ ఆయన అలాంటి పాటల్లో అచ్చ తెలుగు పదాలే వాడతారు అన్న నమ్మకం లేక అది ఆంగ్లమే అనుకున్నాను :-) వివరణ బాగుంది.

"శ్రోతలు కోరిన పాటలు" టైపు లో "శిష్యులు కోరిన పాఠాలు" అనే ఆలోచన ఉంటే కనుక "పదహారణాల తెలుగమ్మాయి" ని పదహారణాలే ఎందుకన్నారో పదిహేనో, పజ్జెందో, ముఫ్ఫైరెండో ఎందుకనలేదో వివరించగలరా మీ తర్వాతి పాఠంలో :-)
హ హ అన్నీ తెలిసిన పదాలే కానీ అర్ధాలు రాయాలంటే ఏంరాయాలా అని ఆలోచించాల్సి వస్తుంది :-) ప్రయత్నిస్తాను.

పరవళ్ళు : గంగ పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తుంది కానీ అర్ధం ?? ఉరకలు వేయడమా..
పొదుగు : దగ్గరగా తీసుకోవడం (గుడ్లను పొదగడం/పొదుగునుండి పాలను పితకడం అని తెలుస్తుంది కానీ అర్ధం అంటే ??)
అనువు (అనవు) : వీలు (అనవుగాని చోట అధికులమనరాదు)
వేకువ : సూర్యోదయానికి ముందటి ఝాము
మేలము : సరసము ??
SD said…
@కన్నగాడు
ఆజానుబాహుడు అంటే నించున్నప్పుడు ఎవరి చేతులు మోకాళ్ళను తాకుతాయో వాడు. ఒక్క రాముడికే అలాగ ఉండేవిట. కాశీలో తులసీ దాసు ఎవరైన బొట్టు పెట్టించుకోవడానికొస్తే ముందు మోకాళ్లకేసి చూసేవాడుట. ఓ రోజు అలా బొట్టూ పెడుతూ పరధ్యానంగా చూశేట్ట. వచ్చినాయన చటుక్కున మాయమైపోయేట్ట. ఆ తర్వాత తులసీదాసు ఆగకుండా ఏడిచేట్ట ఆజానుబాహుణ్ణి మిస్ ఐనందుకు. ఆ తర్వాత నానా కష్టాలు పడి హనుమంతుడి ద్వారా రాముణ్ణి చూశేడని కధ. వచ్చినాయన ఎవరో తెల్సిందా? :-)

శ్రీ రాఘవం....ఆజానుబాహుమరవింద దళాయతాక్షం.. అని శ్లోకం.
టపా వేసి రెండు రోజులైంది కదా, ఇంక కొత్తగా అర్ధాలు రాసేవాళ్ళు ఉండరులే అని పేరుకున్న వ్యాఖ్యలన్నీ ప్రచురించేశాను.

@ కన్నగాడు .. ఈ శీర్షికని ఆసక్తితో చదువుతూ ప్రతివారం పాల్గొంటున్నందుకు నెనర్లు. మీ అమ్మగారి సామెత బాగుంది. ఇదివరకెప్పుడూ వినలేదు. సామెతల్లో కులాల జాతుల ప్రసక్తి, ఇప్పుడు పొలిటికల్లీ కరక్టు కాకపోవచ్చుగానీ, చాలా fascinating గా ఉంటాయి.

@ మధురవాణి .. దధీచి - మీ పురాణజ్ఞానాన్ని మెచ్చాను! :)

@ ఫణిప్రసన్నకుమార్ .. పట్టెడు - ఆ పద్యం విన్నాను. పట్టెడు మెతుకులు అని కూడా అంటారు. ఎలా వచ్చిందో మరి నాకూ తెలియదు.
@ కన్నగాడు .. జానువు అంటే మోకాలు. ఆజానుబాహుడు అంటే మోకాలిదాకా ఉండే చేతులున్నవాడు. పూర్వకాలంలో మరి అలా ఉండేవాళ్ళేమో తెలియదు. పొడుగైన వ్యక్తి కాదుగాని బలమైన, చక్కటి అవయవ పుష్టికలిగిన వ్యక్తి అనే అర్ధంలో ప్రస్తుతం వాడుతున్నారు.

@ తూలిక .. జరిగినంత కాలం ఇలా జరుపుదాం. తగినంత సరుకు పేరుకుంటే అప్పుడు వేరే పాఠశాల కట్టిద్దాం.

@ ఇస్మాయిల్ .. ఈ బ్లాగులో ఏమిజరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ఎలాగో మీకు తెలియదని నేననుకోను.
@ వేణు శ్రీకాంత్ .. పదహారణాలు. వచ్చేవారం పాఠం దీనిగురించే. సూచించినందుకు థాంకులు.:)
బావున్నాయండీ మీ పాఠాలు.
"నీటుగాడు వీడు" అని మిష్టర్ పెళ్లాం లో కూడా ఓ కోలాటం పాట ఉంటుంది. రచయిత ఎవరో తెలియదు.
కృష్ణా తీరం వారికి పుట్టి తెలియకపోవడం చిత్రమే, స్వాతిముత్యం లో కమలహాసనుడు ఎక్కినది అని నా అనుకోలు.
భవదీయుడు
ఊకదంపుడు
@ vooka .. yeah, right. You think my folks would let me hang out around Krishna river in my youth? :)
తెరువు పదానికి అర్ధం ఏంటండి?? బ్రతుకు తెరువు అంటారుగా...

అలాగే ఆనవాలు.
కొత్తపాళీ గారు "లీల గా గుర్తు" అని వాడుతాం కదా, అంటే ఇక్కడ అంతగా ఙ్ఞాపకం లేదు, చిన్నగా గుర్తు ఉంది అని అర్థంలో వస్తుంది. దానికి "లీల" అనే పదం ఎలా వచ్చిందో చెప్పగలరా? నేను నిఘంటువులో చూసాను, కానీ నాకు దొరకలేదు.
చాలా బాగుందండి..... అలాగే పరదార అంటే ఏంటో చెప్తారా ?
అన్ని సందేహాలకి కలిపి వచ్చే పాఠంలో జవాబిస్తాను (నాకు తెలిసిన మట్టుకి)
వ్యాఖ్యలు వెంటనే ప్రచురించద్దన్న విన్నపాన్ని విన్నందుకు ధన్యవాదాలు.

తెలుగుపాఠాలు ఇంత బాగా చెబుతుంటే ఎందుకు పాల్గొనము, అసలే అర్థం తెలియని పదాల అర్థం ఎవరిని అడగాలో అర్థం కాక తలగోక్కుంటుంటే మీరు కనిపించారు. ఇక చూస్కోండి :)
@DG గారు,
సమాచారం అందించినందుకు ధన్యవాదాలు, నాకు తులసీదాసు గురించి తెలియదు కాని, ఎవరో అజానుబాహుడు అంటే చేతులు మోకాల్ల వరకు ఉన్నవాడు అని చెప్పినప్పటినుండి నేను ఎవరికైనా అలా ఉంటుందా, కనీసం మోకాల్లకు కొంచెం పైవరకైనా ఉంటుందా అని అనుమానంతో చూసే వాడిని(రాముడొక్కడే అలా ఉంటాడని తెలీదు).
SD said…
@DG
ఏడేళ్ల వయసు నించీ ధనుర్బాణాలు ప్రాక్టిస్ చేసి చేసి రాముడలాగ అయ్యేడు(ట). ఇక్కడోజోకు మళ్ళీ. ఎవరో సంగీత విద్వాంసుణ్ణి అడిగేరుట. ఇది ఇంత సులభంగా వాయించే టెక్నిక్ చెప్పండి అని. "అమ్మా దీనంత సులువు ఇంకోటి లేదు. ఎటొచ్చి రోజుకి పదహారు గంటలు ఏకధాటిగా అదే పనిగా ప్రాక్టీస్ చెయ్యలంతే!" అన్నాట్ట. బై ద వే మనకి బాణాలు ప్రాక్టీస్ చేస్తే ఆజానుబాహులొస్తాయేమో కానీ, మనం రాముడవ్వాలంటే అంత వీజీ కాదు. "ఆత్మార్ధే ప్రుధ్వీం త్యజేత్" అని విన్నారా?

[ఇంకో పిట్ట కధ.. ముళ్ళపూడి వారి జోకే అనుకోండి...అర్ధరాత్రి రాముడికొక్క సందేహం వచ్చిందిట. వశిష్టుడి ఆశ్రమానికి వెళ్ళి తలుపు తట్టేడుట. లోపల్నుంచి "ఎవరది?" అని వినపడింది. "నేనే" అన్నాడు రాముడు. "నేనంటే?" అని మళ్ళీ అడిగేడు వశిష్టుడు. "అది తెల్సుకోడానికే వచ్చేను స్వామీ" అన్నాడుట పురుషోత్తముడు.]
PS:- ఎందుకేనా మంచిది చూస్తూ ఉండండి. ఎవరు చెప్పగలరు. మీరు తులసీ దాసుకంటే అద్రుష్టవంతులై ఉండొచ్చు :-)
నేను ఏదో దంచుదామనుకొని ఇక్కడకు వచ్చి, డి.జీ గారి వ్యాఖ్య చూశి - మరపున బడ్డాను.
అయ్యా డి.జీ గారూ, నిజం గా మీకు తెలుగు బ్లాగు లేదా? మీరింకా ఆ అవసరం గుర్తించలేదా?
Anonymous said…
భాషా పాండిత్యం! బాగుంది!

పుట్టి = కాలువ దాటడానికి ఉపయోగించే పెద్ద గంపలాంటిది. ఒకేసారి నలుగురు ఎక్కి ప్రయాణం చేయవచ్చు.పెద్దవి కూడా వుంటాయి. నైపుణ్యం లేనివాళ్ళు దీన్ని నడపడం కష్టం.
దాన్ని మీరు చూడాలంటే నాగార్జునసాగర్ వెళ్ళాలి.

http://www.naturecamps.co.in/2010/a-night-with-chenchus/

పై సైటు లో చివరి పొటో గుండ్రంగా ఉన్న ఆ గంప పేరే పుట్టి.
కమల్ said…
కొత్తపాళీ గారు మీ బ్లాగ్ చాలా ఆలశ్యంగా ఇప్పుడు చూసాను..! గోముః అన్న పదం ఇప్పటికీ రాయలసీమ వాసుల్లో వాడుకలో ఉన్నది, ఎవరన్న తల్లి తనపిల్లాడిని ఎక్కువగా గారాభం చేస్తే .." పెద్ద బో గోమ్ పడ్తానాడే పిల్లాడు " అని అంటారు. నేనింక ఆ పదం రాయలసీమ మాండలికం అనుకున్నా కాదన్న మాట..! ఊరుకే అనలేదు అన్నమయ్య రాసినవన్ని అచ్చుతెనుగు పాటలు అని.
కమల్ గారు, నా బ్లాగుకి స్వాగతం. అవును, సో కాల్డ్ మంచి తెలుగు మాట్లాడే గుంటూరు కృష్ణా గోదావరి జిల్లాల వాడుకభాషలోనించి మాయమై పోయిన ఎన్నో అచ్చతెలుగు పదాలు ఇప్పటికీ తెలంగాణ, రాయలసీమ పల్లెల్లో సాధారణ వాడుకలో ఉన్నై.