పుడమి తల్లికి పూజచేద్దాం

ఇవాళ పొద్దున యాహూ తెరిస్తే జాలలోకమంతా ఏవిటో పచ్చపచ్చగా కనబడింది. ఇది పసుప్పచ్చ కాదు ఆకుపచ్చకాబట్టి నాకు కామెర్ల రోగమేదీ రాలేదని నిర్ధారణ చేసుకుని, కారణమేవిటా ఈ పచ్చదనానికని చూస్తే .. ఇవ్వాళ్ళ ఎర్త్ డే - ట!

పాశ్చాత్య పైత్యపు బుద్ధి కనిపెట్టిన సవాలక్ష దినాల్లాగే ఇది కూడా ఓ దినం.

ఐతే, ఎంతైనా భూమాత మనందరికీ తల్లి కాబట్టి, ఈ దినం తద్దినం కాకోడదని నా ఆకాంక్ష, ఆసయం ,కోరికానూ.

ఒకానొక్కాలంలో పర్యావరణం గురించి పట్టించుకోవడం, ఏదన్నా ప్రయత్నం చెయ్యడం, అందోళన చెయ్యడం వంటివి హిప్పీలవంటి వారు మాత్రమే చేసేవారు. తరవాత్తరవాత గ్రీన్‌పీస్, ఆడుబాన్ లాంటి ఉద్యమ సంస్థలు తయారయ్యాయి, కానీ సాధారణ సమాజం వీళ్ళందర్నీ చాలా అనుమానంతోనూ, కించిత్ చులకనగానూ చూస్తూ వచ్చింది. మరిప్పుడు పచ్చ పచ్చ మాటలు మాట్లాడే నల్లమనిషొకాయన ఏకంగా శ్వేతసౌధంలో తిష్ట వేసేప్పటికి .. ఎన్విరాంటలిజానికి యుక్తవయసొచ్చినట్లైంది.

రెండేళ్ళ క్రితం ప్రశాంతి గారి ప్రోద్బలంతో పర్యావరణ విశేషాల్ని చర్చించేందుకు ఒక బ్లాగు మొదలు పెట్టాం. అప్పటి ఉత్సాహంలో మన బ్లాగు మిత్రులు చాలా మంది ఒక చెయ్యేసి మంచి మంచి వ్యాసాలు రాశారు. సీరియస్‌గా, విశ్లేషణలతో, తమ ఆలోచనల్తో, ఒక్కోసారి సరదాగా, కించిత్ రొమాంటిగ్గా కూడా -- భలే భలే విషయాలు రాశారు. మీరూ ఓ లుక్కెయ్యండి.

ఆ తరవాత కూడలి చర్చా వేదికలో ఒక రోజున పర్యావరణ రక్షణకై వ్యక్తిగత కార్యకలాపాల గురించి మంచి చర్చ జరిగింది. అనేక దేశాల్నించి చాలా మంది పాల్గొన్నారు. ఆ చర్చకి సంక్షిప్త నివేదికలు కింది లంకెల్లో చూడచ్చు.

నివేదిక మొదటి భాగం
రెండో భాగం
మూడో భాగం

జై పుడమి తల్లీ!
నాలుక్కాలాల పాటు పచ్చగా వర్ధిల్లు!!

గమనిక - గత టపాలో రామనాథుడి గూగులమ్మ పదాలకిచ్చిన లింకు తప్పయింది. ఇప్పుడు సవరించాను. ఇక్కణ్ణించి కూడ చూడచ్చు.

Comments

మాలతి said…
ఎంతైనా భూమాత మనందరికీ తల్లి కాబట్టి, ఈ దినం తద్దినం కాకూడదని నా ఆకాంక్ష, ఆశయం ,కోరికానూ. :). బాగా చెప్పేరు నాక్కూడా ఈ దినాలు మహ సంకటంగా ఉన్నాయి. ముఖ్యంగా వచ్చేనెలలో రానున్న అమ్మదినం!
మురళి said…
చాలా రోజుల తర్వాత టపా.. కబుర్లూ అవీ ఏమైపోయాయండీ??
@ మాలతి - నిజం. నిన్ననే ఈ టపా ప్రచురించేశాక ఇంకో బ్లాగులో చూశా - ధరణీమాత దినోత్సవం అని రాశారు. ఆ పదబంధం బాగుందనించింది. మదర్స్ డేని మాతృవందనం అంటే ఎలా వుంటుంది?

@ మురళి - క్రమం తప్పకుండా రాయాలనే అభిమతమండీ. మీకు తెలియనిదేవుందీ, నా ప్రతిజ్ఞలూ వాటి ఉల్లంఘనల సంగతీ! ఇదిగో మళ్ళీ ఈ సోమవారం నించీ కబుర్లు ప్రచురిస్తాను.
Kalpana Rentala said…
కొత్తపాళీ, తద్దినాల్ని తప్పించుకున్నాము ఆధునికత పేరు చెప్పి. మరిన్ని దినాల్ని భరిస్తున్నాము ఇప్పుడు.
మాలతి గారు,అమ్మ దినం మరీ ఘోరం ఆండీ బాబు. ఆ రోజు మన మీద కురిపించే అతి గౌరవానికి చికాకు. ఆ ఒక్క రోజు కాకుండా ఎప్పుడూ ప్రేమ గా , గౌరవం గా వుంటే ఎంత బావుంటుంది?
@ కల్పన - "అమ్మ", ఆశ, దోశ :)