కబుర్లు - మార్చి 29

మొత్తానికి హౌస్ డెమోక్రాట్లు అనుకున్నది సాధించారు. అందుకు అభినందనలు. ఈ రిపబ్లికన్ల గోలేంటో నాకు అర్ధం కాదు. అంత శఠం పట్టి కూర్చోవాల్సినదేమూందో ఈ హెల్తుకేరు బిల్లులో. పైగా ఈ బిల్లుకి వోటేసిన డెమోక్రాట్లందర్నీ పదవీచ్యుతుల్ని చేసేస్తామని వీరంగాలు. కానీ చాలా విచిత్రంగా దేశమంతా కూడా ఈ సమస్య మీద సగానికి సగంగా విడిపోయింది - ఇటీవలి చరిత్రలో ఇంతగా దేశాన్ని విభజించిన ఇష్యూ మరోటి కనబడదు. రానున్న ప్రమాదాన్ని గుర్తించినాడో అన్నట్టు ఒబామా బిల్లు పాసైన తక్షణం అయోవాకి బయల్దేరాడు, అమెరికా ప్రజలకి నచ్చ జెప్పడానికి, ఈ బిల్లు ద్వారా మంచే జరుగుతుందని. ఏదైనా, వచ్చే నవంబర్లో కాంగ్రెసు ఎన్నికలు ఆసక్తికరంగా ఉంటాయి.

నిన్న రాత్రి పైరేటు డిస్కు మీద లీడరు సినిమా చూశా. సాధారణ సినిమాలకి భిన్నంగా ఉన్నది అనేదొక ప్లస్ పాయింటు. కుర్రాడు చూడ్డానికి బావున్నాడు, డిక్షనూ ఏక్షనూ పర్లేదనిపించాడు - ఇది రెండో ప్లస్ పాయింటు. బ్రహ్మానందం ఇత్యాదుల డోకు కామెడీ, పనీపాటా లేనప్పుడల్లా హీరోహీరోయిన్ల పాటలూ లేవు. హీరో ఎంట్రీ జరిగినప్పుడు ఫెళఫెళార్భాటాలు, ఉరుములు మెరుపులు భూకంపాలేవీ జరక్కుండా, మామూలు మనిషిలాగే నడిచి తెరమీదికొచ్చేశాడు - ఆ అబ్బాయేనే హీరో అని మాయావిడ ఆశ్చర్యపోయింది కూడా. సాధారణంగా సెకండ్ విలన్, మజిల్ మేన్ గూండా లాంటి పాత్రలు వేసే నటుడు (పేరు తెలీదు) ధనంజయ పాత్రలో బాగా చేశాడు. ఇంతకి మించి చెప్పుకోదగినదేమీ కనబళ్ళేదు. సినిమా ఎక్కడా ఇమోషనల్‌గా కానీ, ఇంటలెక్చువల్‌గా కానీ కదిలించలేదు. కథ అంటూ ఏమీ లేకుండా ఉత్తుత్తి అల్లిబిల్లి కబుర్లు నాలుగు కలిపి సినిమా తియ్యడం శేఖరాయికిది రెండోసారి.

అంధ్రజ్యోతివారి నవ్యవీక్లీ జాలప్రవేశం చేసిందిట.

ఉగాది సందర్భంగా పొద్దువారి నిర్వహణలో మేము జరిపిన కావ్యకలాపాలు పొద్దులో ధారావాహికంగా ప్రచురిత మవుతున్నాయి.

కొత్త బ్లాగర్లకి చాలా మందికి పరిచయం ఉండక పోవచ్చు, రానారెగా ప్రసిద్ధుడైన రామనాథరెడ్డి అలనాటి ఆరుద్ర కూనలమ్మ పదాలకి దీటైన గూగులమ్మ పదాలు రాస్తూ వచ్చాడు - సమకాలీన జీవన సంక్షోభాల్నీ, అమెరికాలో ప్రవాస జీవితపు చమత్కారాల్ని కలిపి నంజుకుంటూ. కొత్తవాళ్ళకిది పరిచయం, పాతకాపులకిది నెమరువేత.

అన్నట్టు గత వారంలో శ్రీరామనవమి, సీతారామ కళ్యాణం. పోయినేడాది ఈ సందర్భంగా రాసుకున్న నా భావనలు.

గతవారపు తెలుగు పదాలకి అర్ధాలు


కలికము - కంటికి వేసే మందు. ఏదైనా (లేక ఎవరైనా) కనబడకుండా పోయినప్పుడు కలికం వేసినా కనబట్టల్లేదు అంటారు. ఏదైనా పదార్ధం నిండుకుండి అని చెప్పడానికి కలికంలోకి కూడా లేదు అంటారు, బహుశా కలికం తయారీలో బహు చిన్న మోతాదు దినుసులు వాడతారు కావచ్చు. అంజనం అని ఇంకోటి ఉంది. సాధారణంగా కాటుకకి పర్యాయపదంగా వాడుతారు. మంత్రగాళ్ళు అంజనం వేసి పోయిన వస్తువులు, పశువులు, మనుషుల ఆచూకీ చెబుతుంటారు.

కోటేరు - నాగలిని తిరగేసి కాడికి వేలాడదియ్యడాన్ని కోటేరెయ్యడం అంటారు. కోటేరేసినప్పుడు నాగలి మొన కిందకి తిరిగి, తిన్నగా ముందుకు పొడుచుకొచ్చి ఉంటుంది. ఎవరిదైనా ముక్కు తిన్నగా పొడుగ్గా ఉంటే కోటేరేసిన ముక్కు అంటారు.

మక్కెలు - ఎముకలు. మక్కెలిరగ్గొడతా అనేది సర్వసాధారణమైన బెదిరింపు.

తుక్కు - చెత్త. తుక్కు కింద కొట్టడం అనే వాడుక కూడా ఉంది.

మొగసాల - ముఖశాలకి వికృతి. ఇంటి ముఖద్వారం వద్ద ఉండే చిన్న గది. గుమ్మం దగ్గర గదులు కట్టడం మానేశాక, పైన చూరు దించిన వీధరుగుని కూడా మొగసాల అని వ్యవహరిస్తుంటారు. మొగుణ్ణి కొట్టి మొగసాల కెక్కింది అని సామెత.

Comments

Vasu said…
ఈ హెల్త్ కేర్ బిల్ వల్ల సిటిజెన్స్ కాని వాళ్ళకి ఉపయోగం ఏమన్నా ఉంటుందా ? రిపబ్లికన్ల, మీరన్న మిగతా సగం అమెరికన్ల బాధ బలిసిన వాళ్ళ జేబులకి టాక్స్ చిల్లు ఎక్కువవుతుంది అనా లేకా నిజంగా ఇంకేదయినా ఉందా ??

అదేంటండీ పైరేట్ సి డీ అని అంత బహిరంగంగా చెప్పేస్తునారు :). కథ ఏం లేదంటారా.. నేనింకా దర్శకత్వం పాడు చేశాడు మంచి కథకి అనుకున్నానే.
ఆ ధనుంజయ్ పాత్రధారి సుబ్బరాజు (పూరి జగన్నాథ్ గ్యాంగ్ )

పొద్దు లో కవి సమ్మేళనం అద్భుతంగా ఉంది (సగం వరకూ అర్థం కాకపోయినా). ఇంత మంది కవీశ్వరులు ఉన్నారని తెలిసింది జాలంలో. మీ నిర్వహణ కూడా బావుంది. సనత్ గారు మీ మీద రాసిన పద్యం కూడా :) పద్యాలంటే ఆశక్తి కూడా కొంచం పెరిగింది.

గూగులమ్మ పదాలు గురించి చెప్పినందుకు నెనర్లు. నాకు తెలియదు. నేను కొత్త బ్లాగరు కిందే లెక్క కాబోలు.
బాగున్నాయ్ సార్. కోటేరేసిన మక్కు గురించి తెలుసు కాని ఎందుకు అలా అంటారో ఇపుడే వినడం నాగలి అస్సలు ఊహించలేదు :-) ధన్యవాదాలు.
kiranmayi said…
హమ్మా !! కోటేరేసిన ముక్కు అంటే అదా? నాకు తెలీనే తెలీదు. మక్కెలు మాత్రం తెలుసు. హైదరాబాద్ లో ఎప్పుడు వింటూనే ఉంటాంగా
రవి said…
పైరేట్ సీడీ అనబాకండీ, బయట ఇప్పటికే సినిమావాళ్ళు ఈ విషయం మీద పెనుగులాడుతున్నారు.

లీడర్ సినిమాలో, నన్ను మాత్రం దళితుడి ఆవేదన కదిలించివేసింది. ఆ సినిమా చూసిన మరో రోజు వరకూ తేరుకోలేదు. (అద్భుతంగా తీశాడని కాదు కానీ, బహుశా అలాంటి దృశ్యాలతో నేను ఎక్కువగా ఐడెంటిఫై అవుతానేమో)

గూగులమ్మ పదాలు గుర్తు చేసుకోవడం బావుంది. చిన్నపద్యాల్లో అందమైన భావం పొదగడం గిజిగాడు గూడు కట్టటంలా అందమైన ప్రక్రియ.

మీరు చెప్పిన పదాలు కొత్తగా, వింతగా బావున్నాయి.
మురళి said…
"కథ అంటూ ఏమీ లేకుండా ఉత్తుత్తి అల్లిబిల్లి కబుర్లు నాలుగు కలిపి సినిమా తియ్యడం శేఖరాయికిది రెండోసారి." Is it??
కథ కూడా ఉంది అని ఒకరిద్దరు మిత్రులు అభిప్రాయ పడ్డారండీ ఈ సినిమాలో.. నేనింకా చూడలేదు..
Ruth said…
బాగుంది !
మీరు చెప్పిన పదాల్లో నాకు మూడు ముందే తెలుసు "కలికము, మక్కెలు, తుక్కు". కోటేరు తెలుసు గాని, దాని అసలు కథ ఇప్పుడే వింటున్నాను(చదువుతున్నాను).
హ్మ్మ్... మీ బ్లాగు జల్లెడలో కనిపించదెందుకో?
భావన said…
వో కోటేరెయ్యటం అంటే అదా. రెండు రోజులు ఆలోచించి మర్చి పోయాను ఆలోచించటం. :-)
హెల్త్ కేర్ మూలం గా టేక్స్ లు పెరుగుతాయని అని ఒకటే గుంజుకుంటున్నారు రెపబ్లికన్స్. దాని బదులు Massachusetts లో లా ఇన్స్యూరెన్స్ కంపల్సరీ అని పెట్టొచ్చు గా అనే వాదన విన్నా. అది ఇన్స్యూరెన్స్ లకు కాని ప్రజలకు ఏం మంచి జరుగుతుందో తెలియదు మరి. ఈ బిల్ లో కూడా మానిటరీ గా మనక వచ్చే పెద్ద లాభం ఏం వుంది, అంటే ఏదైనా పెద్ద ప్రాబ్లమ్స్ తో బాధ పడే వాళ్ళకు వుంటుందేమో, నాకు నచ్చింది పిల్లలు మన ఇన్స్యూరెన్స్ ల కింద కవర్ అయ్యే ఏజ్ పెంచాడు కదా.
లీడర్ ఏదో పర్లేదు మీరన్నట్లు. రెండో సగం లో బోర్ కొట్టించి బాధ పడతామని మా తెలుగు తల్లి కి అని ఎమోషనల్ గా పాట పెట్టి ఆ వెంకన్న పాదాలు (అదే నండీ బాబు ఆ హీరో 14 సైజు పాదాలు) చూపించి కాస్త డ్రామా చెయ్యటానికి ప్రయత్నించాడూ. మొన్నీ మధ్య న తెలుగు చానల్ లో శేఖర్ ఇంకా వెంకటేష్ తెలుగు సినిమా (పేరు ఇంగిలీసే లీడర్) లీడర్ గురించి ముక్కల ముక్కల ఇంగిలీసు లో మాట్లాడు కున్నారు. హి హి హి బలే వుంది వింటానికి you know ;-)
నాకు ఈ గూగులమ్మ పద్యాలు తెలియదు కొత్తే కామోలు నేను కూడా. :-(
వెల్కం భావన గారూ. ఏంటో మీ ఊరి వేపంతా వరదల్లో కొట్టుకు పోతోందని వార్తలు - ఇల్లూ పిల్లా మేకా క్షేమమేనా?
మా అత్తగారెప్పుడూ , నా ముక్కు కోటేరేసినట్లుంది , అనేవారు . అంటే ఏమిటా అనుకునేదాన్ని . ఇదన్నమాట సంగతి .
గుగులమ్మ పదాల లంకె సరిచేయాలనుకుంటానండీ
కొత్తపాళీ గారు నా బ్లాగులో కామెంటు పెట్టినందుకు ధన్యవాదములు.

"హమ్మయ్యా కొత్తపాళీగారు, నాకున్న పెద్ద బాధని తొలగించారు. నేను ముందు ఏకసంతగ్రాహి అనే రాసాను. నేను అలాగే నెర్చుకున్నాను. కానీ ఇక్కడ ఒక మిత్రుడు తప్పుపట్టేసరికి. నాదే తప్పేమో అని ఏకసంథాగ్రాహి అని మళ్ళీ మార్చాను. మార్చానేగానీ మనసంతా దాని మీదే ఉంది, నేనిన్నాళ్ళు తప్పుగా నేర్చుకున్నానా అని. మీరు దానికి వివరణ ఇచ్చి నా గుండెభారం తగ్గించారు. హమ్మయ్య నేను తప్పుగా నేర్చుకోలేదన్నమాట. మళ్ళి ఏకసంతగ్రాహి కి మార్చేసానోచ్చ్"

ఈ కామెంటు నా బ్లాగులో కూడా పెట్టానండీ, కానీ మీరు చూస్తారో చూడరో అని మళ్ళీ ఇక్కడ పెడుతున్నాను. మీకు కృతఙ్ఞతలు చెప్పుకునే భాగ్యం ఎక్కడ తప్పిపోతుందో అని మళ్ళీ ఇక్కడ పెట్టేను.

అసందర్భంగా మీ పోస్ట్ లో కామెంట్ పెట్టినందుకు క్షంతవ్యురాలిని.
కోటేరు తప్ప అన్ని పదాలకి అర్థం తెలుసు. ఇప్పుడు కోటేరుకీ తెలిసింది. తెలియజెప్పినందుకు ధన్యవాదములు.

గూగలమ్మ పద్యాల లింకు మాలాంటి వాళ్ల కోసం మళ్ళీ ఇవ్వగలరా?
Anonymous said…
’ఉత్తుత్తి అల్లిబిల్లి కబుర్లు నాలుగు కలిపి సినిమా తియ్యడం శేఖరాయికిది రెండోసారి’-ఇస్మైల్.

ఆనంద సినిమాలో మాటిమాటికి గంగాళాలు వంటి కప్పులతో కాఫీలు తాగటం చిరాకుగా అనిపించింది.