రచయితా కథకుడూ చర్చకి నా తరపు పొడిగింత - తుపాకీ కథ

మాలతి గారు రచయితా కథకుడూ అంటూ మంచి చర్చ లేవనెత్తారు. ఈ మొదటి చర్చ ఇక్కడ.

కథల కమామిషు చర్చించే క్రమంలో నాకథలు ఉపయోగపడతాయని అనిపిస్తే దయచేసి ఉపయోగించుకోండి అని నేను అన్నందుకు, నేను 1999లో రాసిన తుపాకి కథలో ఈ రచయితా కథకుడూ అనే అంశాన్ని చర్చించారు. ఈ రెండో చర్చ ఇక్కడ చదవొచ్చు.

ఈ చర్చలో కథకుడు అని మనం చెప్పుకుంటున్న మనిషిని ఆంగ్లంలో Narrator అంటారు. అంటే కథ చెప్పేందుకు రచయిత ఉపయోగిస్తున్న ఒక గొంతు. ఒక సర్వజ్ఞానియైన అశరీరవాణి చెప్పినట్టుగా ఉంటాయి చాలా మట్టుకు కథలూ నవల్లూ. దీన్ని Omniscient third person narrator అంటారు. తెలుగు సినిమా ఉదాహరణ కావాలంటే జల్సా సినిమాని మహేష్ బాబు గొంతు చెప్పినట్టు. అశరీరవాణి అని ఎందుకన్నానంటే కథలో ఈ కథకుడు అనే పాత్రగానీ మనిషిగానీ ప్రత్యేకంగా ఎవరూ ఉండరు. ఈ సర్వజ్ఞాని కథకుడికి ఏ పాత్ర మనసులో ఏమున్నదో సంపూర్ణంగా తెలుసు. ఒక్కొక్క పాత్ర ఒక సన్నివేశంలో ఎటువంటి మనోభావాలకి లోనవుతోందో తెలుసు ఈ కథకుడికి. కానీ తెలిసిందంతా పూర్తిగా పాఠకుడికి చెప్పెయ్యడు. కథకి అవసరమైన మట్టుకే, కొద్ది కొద్దిగా చెబుతాడు.

ఇలాక్కాకుండా రచయిత కథ చెప్పేందుకు పనిగట్టుకుని ఒక కథకుడి పాత్రని కల్పిస్తాడు. సూతుడు శౌనకాది మునులకి రకరకాల పురాణాలు చెప్పడం, షహరజాద్ రాణి దున్యజాద్ అనే తన చెల్లెలి వంక పెట్టుకుని తన భర్తయైన షహర్యార్ రాజుకి వెయ్యిన్నొక్కరాత్రులు కథలు చెప్పడం, విష్ణుశర్మ అనే గురువుగారు మూఢులైన నలుగురు రాజపుత్రులకీ పంచతంత్రం చెప్పడంలో ఉన్న కథకులు ఇట్లాంటి కథకులు. ఈ కథకులు సర్వజ్ఞులు అవ్వొచ్చు, కాకపోవచ్చు. ఈ పద్ధతి ఆధునిక తెలుగు సాహిత్యంలో తక్కువే, కానీ చలం మొదలుకొని కొకు, తిలక్, రావిశాస్త్రి, ఇటీవల యండమూరి (డబ్బు టు ది పవరాఫ్ డబ్బు) ఈ టెక్నిక్ ని చక్కగా ఉపయోగించి కొన్ని మంచి కథలూ నవల్లూ రాశారు. తెలుగు సినిమా ఉదాహరణ ఏదీ నాకు గబుక్కుని గుర్తుకి రావడంలేదు. ఆంగ్లంలో అమెరికను రచయిత Henry James ఈ పద్ధతిని బహు సమర్ధవంతంగా ఉపయోగించడమే గాక దీనిలో ఎన్నో ప్రయోగాలు చేసి ఈ పద్ధతిని ఒక కళారూపంగా తీర్చి దిద్దాడని అంటారు.

ఈ రెండు పద్ధతులకీ పూర్తిగా భిన్నమైనది ఉత్తమ పురుష కథనం (First Person Narrator)- కథకుడు "నేను" అంటూ కథ చెప్పడం. అంటే కథకుడు కూడా కథలో ఒక పాత్ర అన్నమాట. ఇందులో మళ్ళీ రెండు రకాలు - ఈ నేను అనే కథకుడు ముఖ్య పాత్ర అయితే అదోరకం. ఇటీవలి తెలుగు సినిమాల్లో మహేష్ బాబు నటించిన అర్జున్ సినిమాలో ఈ టెక్నిక్ ఉపయోగించారు. యద్దనపూడి నవల్లు మీనా, ఈ దేశం మాకేమిచ్చింది రెండిట్లోనూ కథానాయికే కథ చెబుతుంది. Arthur Conan Doyle రాసిన Sherlock Holmes కథల్ని హోంస్ స్నేహితుడైన డా. వాట్సన్ (Dr. Watson) గొంతులో చెప్పిస్తాడు. వాట్సన్ కథానయకుడు కాకపోయినా, కథలో కీలకమైన పాత్ర పోషితాడు కాబట్టి ముఖ్యపాత్ర అనే చెప్పుకోవాలి. అదీ కాక అతనికి హోంస్ అంటే విపరీతమైన అభిమానమూ, గౌరవమూ.
రెండో రకంలో నేను అనే కథకుడు కథలో ఒక ప్రేక్షకుడిగా మాత్రం ఉంటాడు. మహా అయితే ఏదన్నా ఒక చిన్న పాత్ర పోషిస్తాడు. మధురాంతకం రాజారాంగారి అనేక కథలు ఈ పద్ధతిలో ఉంటాయి. సింహాద్రి సినిమాలో బ్రహ్మానందం పాత్ర (తలుపులు) కేరళలో జరిగిన కథని ఇలా చెప్పుకొస్తాడు.

ఈ ఉత్తమ పురుషకథనంలో తమాషా ఏంటంటే కథ చెప్పేది కథలోనే ఉన్న ఒక వ్యక్తి కాబట్టి ఆ వ్యక్తికి తాను చూసేవీ వినేవీ తప్ప ఇతర పాత్రల మనోభావాలు తెలిసిపోయే అవకాశం లేదు. ఈ పద్ధతిని జాగ్రత్తగా ఉపయోగిస్తే, రచయిత "నేను" అనే కథకుడి పాత్ర మనోభావాల్ని జాగ్రత్తగా పాఠకుల మనసుల మీదికి ప్రొజెక్ట్ చెయ్యడం ద్వారా అద్భుతమైన సైకలాజికల్ ఎఫెక్ట్ సాధించొచ్చు. ఈ ఎఫెక్ట్ నే పైన మాలతి గారి బ్లాగులో జరిగిన చర్చలో కత్తి మహేష్ గారు "ఆ రచన పాఠకుడికి మరింత చేరువవుతుంది." అన్నారు. అఫ్కోర్సు, ఒక్కోసారు కొందరు చెయ్యితిరిగిన రచయితలు కూడా, ఉత్తమపురుషలో రాస్తున్న విషయం మరిచిపోయి అవతల పాత్రల గుండెల్లో రైళ్ళు పరిగెత్తించడం, మనసులో గుబులు పుట్టించడం లాంటి పనులు చేస్తుంటారు. ఈ ఉత్తమ పురుష కథనం కొంతవరకూ రచయితకి సహాయమే చేస్తుంది. ఎందుకంటే, కథలో అన్ని పాత్రల మనోభావాలన్నిటిని గురించి రచయిత బాధ పడనక్కర్లేదు. ఈ నేను అనే ఒక్క మనిషి మనసులో ఏమి జరుగుతోందో పట్టించుకుంటే చాలు.

ఇప్పటిదాకా చెప్పింది ఉపోద్ఘాతం.

తుపాకి కథలో నేను ఉపయోగించినది సర్వజ్ఞాని అశరీరవాణి కథకుడు (స.అ.క).

కథలో ముఖ్య పాత్రలు రెండు - శంకర్, కిరణ్. తల్లి రాజ్యలక్ష్మి, మిత్రులు మేట్, బ్రయన్, జిమ్మీలు సహాయ పాత్రలు. కథ ఎక్కువగా కిరణ్ శంకర్ల చుట్టూ జరుగుతుంది. అంటే, వాళ్ళ మనసుల్లో ఏమి జరుగుతోందో అనే దాన్ని గురించి ఎక్కువగా పట్టించుకుంటాడు ఈ స.అ.క. అదే చెబుతుంటాడు పాఠకులకి. ఉదాహరణకి మొదటి దృశ్యంలో శంకర్, కిరణ్, రాజ్యలక్ష్మి ముగ్గురూ ఉన్నా, కథకుడి ప్రభావం వల్ల పాఠకుడి దృష్టి కిరణ్ శంకర్ల మీదనే ఎక్కువగా ఉంటుంది. రాజ్యలక్ష్మి మనసులో ఏముందో అనేది పెద్దగా గణనకి రాదు. ఆ తరవాత కొంతసేపు మాత్రం బాలుడైన కిరణ్ మనోభావాలు వాడి మాటల్లోనే స్వగతంలాగా, ఒక చైతన్య స్రవంతి ధారలో వెలువడుతాయి. ఆ భాగం కూడా కథ చెబుతున్న స.అ.క. పాఠకుల్ని కిరణ్ మనసులోకి ఓ రెణ్ణిమిషాలసేపు తొంగి చూడనిచ్చాడు అంతే. బస్సులో కిరణ్ మేట్‌ని మొదటి సారి కలిసినప్పుడు మేట్ మనసులో ఏముందో కథకుడు ఎక్కడా చెప్పడు. పాఠకుడి దృష్టి ఎంతసేపూ కిరణ్ మనసుమీదనే ఉంటుంది. అలాగే చివర్లో ఎమర్జెన్సీ రూంలో కథకుడు పూర్తిగా శంకర్ మనోభావాల మీద దృష్టి పెడతాడు.

స.అ.క. కి కథలో ఉన్న అన్ని పాత్రల మనోభావాలూ తెలిసినా కథకి అవసరమైన మేరకు, పాథకుల దృష్టిని ఇలా ఒకటి రెండు పాత్రల మీద మాత్రమే ఫోకస్ చెయ్యడం ద్వారా ముందుగా ఒక స్పష్టతనీ, ఒక కథా క్రమాన్నీ సాధిస్తాడు. కథకుడితో ఆ పని చేయించేది రచయిత. సినిమా పోలిక చెప్పుకోవాలంటే - రచయిత సినిమా దర్శకుడైతే, కథకుడు కేమెరా లెన్సు.

మాలతిగారి విశ్లేషణలో రచయితని స్వయంగా కథలోకి చొప్పించే ప్రయత్నం చేశారల్లే వుంది. నేను పురుషుణ్ణీ, ఒకస్థాయి వయసు వాణ్ణి కావడంతో నన్ను శంకర్ పాత్రలో ఊహించుకున్నట్టున్నారు. నేను అమెరికాలో చిన్నపిల్లవాడిగా పెరగలేదు కాబట్టి కిరణ్‌ని అయ్యే అవకాశం లేదు. స్త్రీని కాదు కాబట్టి రాజ్యలక్ష్మినయ్యే అవకాశం లేదు. మళ్ళీ మాలతిగారే చెప్పినట్టు నేను వృత్తి రీత్యా డాక్టర్నీ కాదు, నాకు పదేళ్ళ వయసున్న కొడుకూ లేడు. వాస్తవానికి ఈ కథలో రూపించిన సన్నివేశాలేవీ నాకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ జరిగిన అనుభవాలు కావు. కానీ ఈ కథలోని రెండు ముఖ్యపాత్రల్లోనూ నేనున్నాను. దీన్నే మాలతిగారు "రచయిత కథకుడిద్వారా తనని బాధిస్తున్న ప్రశ్నలు కూడా చెప్తున్నాడేమో" అన్న అబ్సర్వేషనుతో చక్కగా పట్టుకున్నారు.

అమెరికాలో భారతీయ కుటుంబాలు పిల్లల్ని పెంచడం అనే విషయం చాలా కాలంగా నా మనసులో సుళ్ళు తిరుగుతూనే ఉంది. ఆ అంతర్మథనానికి ఒక రూపం ఈ కథ. ఈ మథనం ఇంకా సాగుతూనే ఉంది. ఈ కథని నేను ఫిబ్రవరి మార్చి ప్రాంతాల్లో రాశాను 1999లో. రాసి, వంగూరి ఫౌండేషను వారి ఉగాది కథల పోటీకి పంపించాను. పంపిన కొద్ది రోజులకి కొలరాడో రాష్ట్రంలో కొలంబైన్ హైస్కూలు మారణహోమం జరిగి ఈ దేశం మొత్తాన్నీ అచేతనం చేసేసింది కొన్నాళ్ల పాటు. ఆ మారణహోమానికి కారణం నా కథలో చెప్పినలాంటి జాతి విద్వేషం కాదు. నా కథకి మొదటి బహుమతి వచ్చింది. కానీ ఈ కథని తలుచుకున్నప్పుడల్లా నాకు ఆ బహుమతి గుర్తు రాదు. కొలంబైనే గుర్తొస్తుంది. బాధే మిగుల్తుంది.

Comments

Purnima said…
నాదో డౌట్:

మొన్నే ఒక కథ చదివాను. కథ మొత్తం స.అ.కలోనే నడుస్తుంది. కానీ ఉన్నట్టుండి కథ ముగియడానికి కొన్ని పేరాల ముందు, "అతడు ఆమెపై ఉన్న భావాన్ని ప్రేమ అనుకుంటున్నాడని నేననుకోను" (యధావిధి వాక్యం కాదు, ఇలాంటిదేదో ఉంటుంది) అని ఒకే ఒక్క లైనులో నరేషన్ లో "నేను" అని వాడబడుతుంది.

ఇప్పుడా కథ నరేషన్ ఏమిటే అంటే ఏం చెప్పాలి? కొన్ని కథలు భాగాలుగా విడదీస్తారు కదా.. అలాంటప్పుడు ఒక్కో భాగానికి ఒక్కో నరేషన్ ఉండవచ్చా? If there are hard and fast rules about these, where can I know more about them?
మాలతి said…
కథకుడి లక్షణాలు వివరించడంలో, ఉదాహరణలు ఇవ్వడంలో, ఉత్తమపురుషలో రాయడంలో సుళువులో చాలా చక్కగా వివరించేరు. కొలంబైను ఉదంతం - ఏదీ ముందు, ఏది వెనక -అన్నది నాకు తెలీదు కానీ నాక్కూడా మీకథ చదువుతుంటే, అది గుర్తొచ్చింది. మీరే అన్నట్టు రెంటికీ వాతావరణంలో పాత్రలతత్త్వాలలో చాలా తేడా వుంది. నేను చెప్పేది కూడా అదే. ఏకథలో ఏభాగం ఎవరికి ఏమిటి గుర్తు చేస్తుందన్నది వ్యక్తిగతం.
మీరు మీకథని వివరించినందుకు ధన్యవాదాలు.
ఇతర రచయితలు కూడా ఇలా తమకథలని వివరిస్తే, అనేక ఇతరకోణాలు కనిపించడానికీ నేను అనుకున్న చర్చ అర్థవంతమవడానికి దోహదం చేస్తుంది అనుకుంటున్నాను.
@ Purnima ..
కథలు రాసేవారందరూ కథనమ్మీద ఆ మాత్రం దృష్టిపెడితే ఇహ లేనిదేముంది? బాగా అనుభవజ్ఞులైన రచయితలు కూడా ఇటువంటి తప్పులు చెయ్యడం నేను చాలాసార్లే చూశాను. ఇది తప్పంటే మళ్ళీ తప్పు కూడా కాదు. రచయిత దృష్టిలో అలా నేను అని కథ చెప్తున్న కథకుడి పాత్ర ఒకటుంది. ఆ నేను పాత్ర కథలో అప్పటిదాకా అవసరం రాలేదు కనక తానుగా ఎక్కడా కనబళ్ళేదు. చివర్లో మరి తన అభిప్రాయం చెప్పాల్సి వచ్చిందేమో, అలా బయటపడ్డాడు. ఉదాహరణకి మీ అమ్మగారు సింహాద్రి సినిమా చూసొచ్చారు. ఇంటికొచ్చాక, సినిమా కథ ఏంటని మీరడిగితే ఆవిడ సినిమా కథ చెప్పడంలో తన ప్రసక్తి ఎక్కడా ఉందదు కదా .. తాను స్వయంగా సినిమా కథలో భాగం కాదు. కానీ చెబుతూ చెబుతూ అప్పుడు భూమిక ఒక గునపం తీసుకుని సింహాద్రిని పొడిచింది. అలా ఎండుకు చేసిందా అని సెకండాఫంతా సస్పెన్సుతో చచ్చిపోయాననుకో .. అన్నారు. ఇక్కడ అకస్మాత్తుగా, అంతవరకూ ప్రమేయం లేని "నేను" అనే నేరేటర్ బయల్పడి తన మనోభావాల్ని మీకు చెపుతోంది.

ఇది ఏ టైపు కథనం? ఈ విభజనలు ఒక మాదిరిగా చర్చకి కొన్ని బరులు గీసుకోవడానికే తప్ప ఇవేమీ శిలాశాసనాలు కాదు. అసలు సృజనాత్మక రచనలో శిలాశాసనాలేవీ లేవు. సమర్ధులైన రచయితలు కలగాపులగంగా ఉన్న కథన పద్ధతుల్ని కూడా చాలా సమర్ధవంతంగా ఉపయోగించారు.
మాలతిగారు, ఆశిద్దాం.
Kalpana Rentala said…
కొత్తపాళీ గారు, వివరం గా చెప్పారు. మీరు చేసిన ఇంకో మంచి పని ఏమిటంటే సినిమా వుదాహరణలు ఇవ్వటం. సాధారణ పాఠకులకు ఇలా చేయడం వల్ల ఇంకా సులువుగా అరటిపండు వొలిచి చేతిలో పెట్టినట్లు వుంటుంది. మీ కధల్లో నాకు ఇష్టమైన కధ తుపాకీ. తర్వాత ఇండియన్ వాల్యూస్. తుపాకీ గురించి మీ వివరణ బావుంది.
Kalpana Rentala said…
అవునూ, ఇంతకూ పొడిగింత నా? పొడిగింపు నా?
Vasu said…
మీ టపాలో బోలెడు ముత్యాలు ఏరుకున్నాను. వాటి అవసరానికి వాడి అందమయిన దండ కట్టగలిగే నేర్పు ఎప్పటికి వస్తుందో.

నెనర్లు,
వాసు
భావన said…
చాలా బాగుంది కధ కొత్త పాళి గారు. ఇన్ని విషయాలు చూస్తుంటే అమ్మో ఏదైనా రాయాలంటే ఇన్ని తెలియాలా అని భయం తో బ్లాగ్ లో కూడా రాయలని పించటం లేదు( అజ్నానం ఒక వరం అని ఎవరన్నారో కాని నిజంఏమి తెలియక పోతే ఏదో తోచింది రాస్తూ పోతాము కదా) :-(
ఈ కధ ఇంకా ఇండియన్ వాల్యూస్ కధ రెండు చాలా ఆలోచన లో పడేసేయి. మా అబ్బాయి తో కూడా చాలా సేపే మాట్లాడేను ఈ కధ ల గురించి ఈ రోజు. పర్టిక్యులర్ గా ఈ కధ చాలా చాలా బాగుంది, నేను కూడా ఆ కధ తో పాటు కాసేపు ఆ స్కూల్ కి ఆ కుటుంబాల మధ్య కు వెళ్ళి వచ్చాను.
@ KR .. గింత? గింపు? ఏమోనండీ. కంటగింపు కాకుండా కంటికింపుగా ఉంటే చాలు :)

@ Vasu .. రాస్తూంటే అదే వస్తుంది.

@ భావన .. ఇవన్నీ రాసేసుకున్న వాటిల్ని గురించి మనలాంటి వాళ్ళం జుట్టు పీక్కోడానికే. రాసేందుకు ఇవేవీ అవలంబనలూ కావు, అడ్డంకులూ కావు. రాయదల్చుకున్నప్పుడూ రాసెయ్యడమే. అయితే, ప్రతి రచనా ప్రక్రియకీ కొన్ని సహజ మర్యాదలు ఉంటాయి - కవిత్వ మర్యాద వేరు, కథా మర్యాద వేరు. ఆయా ప్రక్రియల్లో కుస్తీ పట్టే రచయిత ఆ మాత్రం మర్యాద తెలిసి ఉండాలి అని నేను అనుకుంటాను. కానీ అన్ని వేళలా అలా జరగదు. కనీసపు భాషా మర్యాద కూడా తెలియకుండా రాస్తుంటారు జనాలు. ఉదాహరణకి కథలు ఎలారాయకూడదు అనే నాఘోష చూడండి.
kiranmayi said…
కొత్త పాళీ గారు
మీ తుపాకి కధ చదివాను. ఎప్పుడు చూసినా "నీకేం తెలీదు నోరుమూసుకో" అనకుండా, అంత మంచిగా పిల్లలకి అన్ని విషయాలు విడమర్చి చెప్పే తల్లితండ్రులు మనకి ఎంతైనా అవసరం. కధ మాత్రం చాలా బాగుంది.
On a lighter note,
నేను ఇంతక ముందు ఇండియన్ culture గురించి వ్రాసినప్పుడు ఈ కధ కాకుండా, మీ వేరే కధ నన్ను చదవమన్నారు. ఈ కధ గురించి చెప్పలేదేంటి?

ఇకపోతే, మీ కధ చదివేసరికి ఇంత లేట్ అయిపొయ్యి, మీ అసలు పోస్ట్ చదవలా. ఇవ్వాళ MLK day సెలవని సుబ్భరంగా మొన్న చేసిన పొంగలి తింటూ ఇంట్లో కూర్చున్నా. అందుకని పెండింగ్ పనులన్నీ చెయ్యటానికి రేపు కొంచెం తొందరగా వెళ్ళాలి. మీ పోస్ట్ ఎప్పుడు చదువుతానోఏంటో?
కిరణ్మయి .. మిమ్మల్ని ఇండియన్ వేల్యూస్ చదవమన్నాను. ఆ సమయానికి అది సందర్భోచితంగా గుర్తొచ్చింది.