Thursday, December 31, 2009

శ్రుతీ సందర్భమూలేని ఓ పండుగ

ఖుష్వంతసింగు గారు అప్పుడెప్పుడో ఒక కథ రాశారు - అందులో గుడ్ మాణింగ్ అనే పలకరింపుని మహా యెద్దేవా చేస్తాడు మహానుభావుడు. ప్రతీరోజూ కావాలనుకున్నా వొద్దనుకున్నా సంభవించి పోయే ఒకానొక సమయ శకలానికి ముందు గుడ్ అనే విశేషణం జోడించితే అదొక సంబోధన అయిపోతుందా, అదొక పలకరింపా .. ఇంత అర్ధం పర్ధం శ్రుతీ సందర్భం లేని పలకరింపు ఇంకోటి లేదు. పనిలేని తెల్లోడెవడో మొదలెట్టాడు, ఇహ పొలోమని మనవంతా చేలో పడ్డ గుడ్డెద్దుల్లాగా అదే అనుసరించేస్తున్నాం .. అచ్చగా ఈ మాటలే కాకపోయినా ఇంచుమించు ఇదే సారాంశం.

ఆంగ్ల సంవత్సరాది ఎదురైనప్పుడల్లా నాకు సరిగ్గా ఇదే భావన కలుగుతుంది, బొత్తిగా శ్రుతీ సందర్భమూ లేని పండగ ఇదని. పైగా దానికి హేప్పీ అనే విశేషణం తగిలించడం. అదొక గ్రీటింగు!

అనంతంగా దొర్లిపోతుండే ఈ కాలచక్రాన్ని గమనించుకోడానికి ఇదికూడా ఒక మైలురాయి. ఇతరత్రా పండగల్లో ఏదో ఒకటి సెలెబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి ఆ హడావుడిలో ఉంటాం. ఈ పండగ కాని పండగ రోజున వేరే సెలెబ్రేట్ చేసుకునేందుకు ఏవీ లేదు కాబట్టి, ఏతావతా జరిగేదేవిటంటే, మందితో పాటు మనమూ అన్నట్టు, తీరి కూచ్చోని గత సంవత్సరంలో ఏమి జరిగిందీ, జరగబోయే సంవత్సరంలో ఏవి జరగించాలీ అని లెక్కలేసుకోవచ్చు.

జనవరి ఒకటి తీర్మానాల్ని గురించి సుజాతగారు ఆల్రెడీ బహు పసందుగా రాశ్శారు. నా తీర్మానం కూడా అక్కడే చెప్పేశ్శా కాబట్టి ఆ జోలికి పోవట్లా. పలువురు బ్లాగర్లు తమకి నచ్చిన బ్లాగులవీ సినిమాలవీ లిస్టులు పెట్టేశ్శారు .. నాకు ఇది బాగా నచ్చింది. గత ఐదార్నెల్లుగా బ్లాగులు క్రమంగా పద్ధతిగా చూడక మంచి టపాలు చాలానే మిస్సయ్యానే అనుకున్నా. అల్లాగే సినిమాల్ని కూడా నా నెట్టుఫ్లిక్సు జాబితాలో చేరుస్తున్నా.

2009 నా మట్టుకి నాకు చాలా ఆసక్తికరంగా గడిచిందనే అనుకోవాలి. మొదలవడమే బహు బీభత్సంగా మొదలై, అటూ ఇటూ అల్లకల్లోలంగా పోట్లెత్తి, మళ్ళీ అంతలోనే ఆశాకిరణాలు విరజిమ్మి, అందలాలెక్కించింది. చింతామణి నాటకంలో అనుకుంటా .. ".. ఈ కాలమన .." అని ఒక పద్యం ఉంది. కాలమహిమ ఎటువంటి ఊహించని పరిణామాలు తెచ్చిపెడుతుందో ఉదహరిస్తూ. అందుకనే అన్నారు కాబోలు మంత్రపుష్పంలో యస్సంవత్సరస్యాయతనం వేద - ఆయతనవాన్ భవతి. అలిగో కోపగించో అపార్ధం చేసుకునో దూరమైపోయిన మిత్రులు కొందరు తొలగిపోగా, మనసుని ఎంతో కుంగదీసే సందర్భాల్లోనూ మీకెందుకండీ బెంగ మేమున్నాంగా అని పలువురు మిత్రులు తోడునిలవగా, మంచిఅభిరుచి కలిగిన సరికొత్త మిత్రుల పరిచయాలు కాగా, కొన్ని పదుల సంవత్సరాల గడువు తరవాత ఆప్తులైన బంధుమిత్రుల సాంగత్యం లభించగా .. మొత్తానికి 2009 చాలా ఆసక్తికరంగా నడిచిందనే అనుకోవాలి.

ఈ శ్రుతీ సందర్భమూ లేని ఆంగ్ల సంవత్సరాది మీకూ మీ వారందరికీ సంకల్పించిన తీర్మానాలని సాకారం చేసి కోరిన కోరికలని దీర్చుగాక!

కొసమెరుపు: మురళి గారూ, జనవరి నెలాఖరులోగా దివాకరతనూజం పూర్తి చేసేస్తాను. కొత్త సంవత్సరమ్మీదాన!

Sunday, December 20, 2009

కబుర్లు - డిసెంబరు 21

ఏదో కాస్త అలా ఇండియా వెళ్ళొద్దామని, వెళ్తూ వెళ్తూ నాయనలారా నేను తిరిగొచ్చే టైముకి ఈ హెల్తుకేరు బిల్లుని, ఊరకే కారుకారు మని కాకిగోల చెయ్యకుండా, కేరుఫుల్గా పాస్ చెయ్యండ్రా బాబూ అని చిలక్కి చెప్పినట్టు చెప్పి పోతే, తిరిగొచ్చే సమయానికి ఎక్కడి గొంగళీ అక్కడే ఉన్నట్టుంది పరిస్థితి. చివరి నిమిషందాకా లాగి పీకి, చివరికి మంచుతుపానులో సెనేటు భవనాన్ని వదిలి పోయే దోవ లేకుండా దార్లు మూసుకుపోతే అప్పుడు ముక్కి మూల్గి మొత్తానికి నిన్న అర్ధరాత్రి మొదటి వోటు వేశారు. పూర్తిగా పార్టీ చీలిక ప్రకారం నడిచిన ఈ వోటులో ప్రభుత్వ ప్రతిపాదనవేపుగా 60 వోట్లు పడ్డాయి. క్రిస్మసుకి ముందే పూర్తి బిల్లు ఆమోదించబడే అవకాశం ఉండంటున్నారు విశ్లేషకులు.

అంతర్జాతీయ వేదిక మీద, క్యోటో తరవాత మళ్ళి అంత పెద్ద జాతర కోపెన్‌హేగెను లో జరుగుతోంది. మాటల హడావుడే తప్ప చేతల పనితనం సున్న అంటున్నారు పరిశీలకులు. అమెరికానించి చైనా దాకా, ఎవరికీ ఈ "డీల్" అత్యవసరంగా కనబట్టల్లేదు. చివరికి "నో డీల్" యే మిగిలేలా ఉంది. చర్చల్లో బిగుసుకుపోయి కూరుకుపోయున్న డెలిగేత్లకంటే బయట గడ్డకట్టే చలిలో సంగీతంతో ఆట పాటల్తో నిరసన చూపుతున్న ప్రొటెస్టర్లే ఎక్కువగా ఈ తమాషాని ఎంజాయ్ చేస్తున్నారల్లే ఉంది.

ఒబామహాశయుడు నోబెలు స్వీకరణతో సహా ఇంకో మూడు స్పీచిలు దంచికొట్టి వక్తృత్వ నిరూపణ చేసుకుంటున్నాడు గానీ, పరిపాలనా పటుత్వ నిరూపణ ఎక్కడ కనబట్టల్లేదు. నెలపైగా నాన్చినాన్చి మొత్తానికి ముప్ఫై వేల సైన్యాన్ని మంజూరు చేశాడు ఆఫ్ఘనిస్తానుకి. మళ్ళీ వార్తా ఛానళ్ళన్నిటిలోనూ ఆఫ్ఘనిస్తానూ పాకిస్తానూ ప్రముఖంగా వినిపిస్తున్నాయి. 70-80లలో సోవియట్ ఆక్రమణ నాటి దృశ్యాలన్నీ పునరావృత్తమవడమే గాక ఈ సారి పశ్చిమ పాకిస్తానులోకి బలంగా చొచ్చుకుని వచ్చే సూచనలున్నాయి.

ఈ వార్తా ఛానెళ్ల వీక్షణంలో ఒక పెద్దాయన పాకిస్తాను ప్రభుత్వపు కార్యాచరణ గురించి మాత్లాడుతూ, ఆఫ్ఘనిస్తానులో భారద్దేశం 1.2 బిలియన్ల డాలర్ల వరకూ పెట్టుబడి చేసింది అని ఒక మాటన్నాడు. నాకు షాకయింది. ఎక్కడ, ఏ రూపంలో, ఎలా ఈ పెట్టుబడి జరిగింది? మీలో ఎవరికన్నా ఈ కబురు తెలుసునా? తెలిస్తే కాస్త విశదీకరించి పుణ్యం కట్టుకోండి. నాకెక్కడా సమాచారం దొరకలా.

వస్తూ వస్తూనే నాకు థెర్మల్ షాకు .. బయటి ఉష్ణోగ్రత సున్నా దిగువకి జారిపోతుండగా, కొండల్లో మంచు వానల్లో కారు ప్రయాణం జర్రుబుర్రున జారుకుంటూ, ఇష్టం లేని స్కేటింగులు చేసుకుంటూ. ఎట్లా ఇల్లు చేరానో ఆ భగవంతుడికే తెలియాలి. ఇండియా విషయాలు కబుర్లు విశేషాలు ఇంకా చాలానే చెప్పాలి. అవెలాగూ ఒక్క టపాలో ముగిసేవీ కావు కాబట్టి మెల్లగా వీలెంబడి చెబుతాను. కానీ ఒక్క మాట .. ఏంటో అందరూ ఆహా ఓహో అంటే ఎమిరేట్స్ వారి విమానంలో ప్రయాణించాము. అంత దౌర్భాగ్యపు సర్వీసు నేను ఎక్కడా చూళ్ళేదు. పైగా దుబాయి విమానాశ్రయం, షాపింగుకి గొప్పేమో కానీ, వసతులకి మాత్రం దుర్భరం.

హైదరాబాదు పుస్తక ప్రదర్శన రంజు రంజుగా సాగుతోందిగా. రాష్ట్ర విభజన ప్రహసనం ఏ స్థాయిలో ఉందో, తెలుగు పేపర్లు చూసే సాహసం చెయ్యట్లేదు. తెలుగు పేపరంటే గుర్తొచ్చింది. ఇవ్వాళ్ళ ఆంధ్రజ్యోతి వివిధలో పలువురు అమెరికా తెలుగు రచయితలు ఈ సమస్యపై వారివారి అభిప్రాయాలు వెలిబుచ్చారు. పనిలోపనిగా నేనుకూడా ఒక అభిప్రాయం వెలువరించేశా. ఇక్కడ చదవొచ్చు.

ఈ పిల్లోడెవరో, పిట్ట కొంచెం కూతఘనం అన్న లెవెల్లో బ్రహ్మాండంగా బొమ్మలేస్తున్నాడు. పనిలో పని మంచి సెన్సాఫ్ హ్యూమరు కూడా .. మీరూ ఓ లుక్కెయ్యండి. అన్వర్ జాగ్రత్త పడటం మంచిది!

Friday, December 11, 2009

నా కథల పుస్తకం దొరికే వివరాలు


హైదరాబాదులో కాచిగూడాలో ఉన్న నవోదయ బుక్ హౌసులో రేపటినించీ దొరుకుతుందీ పుస్తకం.

కాచిగూడా వెళ్ళడం దూరం, కష్టం అనుకుంటే, హాయిగా విజయవాడ నవోదయ పబ్లిషర్సుని సంప్రదించండి. మీ యింటికే అందేట్టు పోస్టులో పంపిస్తారు. వివరాలివి..
Navodaya Publishers
Karl Marx Road,
Vijayawada.
520 002
Phone : (0866) 2573500
e-mail : vjw_booklink@yahoo.co.in

అమెరికాలో ఉన్న మిత్రులకి .. పుస్తకాల్ని అమెరికాకి దిగుమతి చేసుకునే ప్రయత్నాలు ఇంకా జరుగుతూ ఉన్నాయి. అందుబాటులోకొచ్చాక తెలియజేస్తాను.
ఎవరో AVKF.org గురించి అడిగారు. వాళ్ళు కొత్తగా విడుదలయ్యే పుస్తకాల్ని గమనిస్తూనే ఉంటారనీ, ఆయా పుస్తకాలకి తమ సిబ్బందితో చిన్న పరిచయాలు రాయించి డేటాబేస్లో ఎక్కిస్తారనీ, ఇదంతా జరిగేందుకు కోంచెం సమయం పడుతుందనీ తెలిసింది. బహుశా ఇంకో వారంలో ఆ సైట్లో కూడా దొరకొచ్చు.

Friday, December 4, 2009

విజయవాడ కబుర్లు

రంగు రుచి వాసన ఆ పైన పంచేంద్రియాలకీ అందని ఆత్మానుభవాలు ఇంకా పైన వీటన్నిటికీ అతీతమైన అలౌకికానందాలు .. ఎన్నెన్ని ఎన్నెన్ని .. రోజూ నన్ను ముంచెత్తుతున్న ఆ వరదలో మునిగి పోనా తేలిపోనా కొట్టుకు పోనా ..

అమ్మని గురించైనా రాయడం సాధ్యమవుతుందేమోగాని మాతృభూమిని గురించి మాత్రం సాధ్యం కాదు .. కనీసం నాకు. రాయడం అంటు వచ్చేప్పటికి ఏదో ఒక దృక్కోణం ఉండాలి - హాస్యమో, ప్రేమో, ద్వేషమో, ఎక్కిరింపో - విజయవాడని గురించి వాటిల్లో ఏ ఒక్క భావాన్నీ కోణాన్నీ ఎంచుకోలేను. ఎవరో మిత్రులు అడిగారు .. మాతృదేశ పర్యటన అనుభవాలు రాయమని .. ఏం రాయను?

కొన్ని విషయాల్లో విజయవాడ (భారద్దేశం) చాలా మారిపోయింది .. కొన్ని విషయాల్లో అస్సలు మారలేదు. జరిగిన మార్పు మంచిదో, మార్పు చెందకుండావున్న స్థిరత్వం చెడ్డదో మరి నాకు తెలియదు. కానీ ఉన్న పరిస్థితి మాత్రం ఇది. వూరూ దేశం లాగానే మనుషులూనూ .. కొన్ని విషయాల్లో చాలా మారిపోయారు, కొన్ని విషయాల్లో నలభయ్యేళ్ళ కిందటా ఎలాగో, అలాగే ఉన్నారు.

ఒకటి మాత్రం నిజం .. వాళ్ళ ఆప్యాయత .. అభిమానం .. ప్రేమ .. అలాగే ఉన్నాయి, నన్ను తడిపేస్తూనే ఉన్నాయి.

పుస్తకం గెటప్ బాగా వచ్చింది, నేను కోరుకున్నట్టుగా. అందరికీ నచ్చుతుందనే ఆశిస్తున్నా. విజయవాడలో అయితే, ఏలూర్రోడ్డు మీదున్న నవోదయలో దొరుకుతుంది. మిగతా వూళ్ళలో వివరాలు కనుక్కుని చెబుతాను.
మళ్ళీ కలుద్దాం.