శ్రుతీ సందర్భమూలేని ఓ పండుగ

ఖుష్వంతసింగు గారు అప్పుడెప్పుడో ఒక కథ రాశారు - అందులో గుడ్ మాణింగ్ అనే పలకరింపుని మహా యెద్దేవా చేస్తాడు మహానుభావుడు. ప్రతీరోజూ కావాలనుకున్నా వొద్దనుకున్నా సంభవించి పోయే ఒకానొక సమయ శకలానికి ముందు గుడ్ అనే విశేషణం జోడించితే అదొక సంబోధన అయిపోతుందా, అదొక పలకరింపా .. ఇంత అర్ధం పర్ధం శ్రుతీ సందర్భం లేని పలకరింపు ఇంకోటి లేదు. పనిలేని తెల్లోడెవడో మొదలెట్టాడు, ఇహ పొలోమని మనవంతా చేలో పడ్డ గుడ్డెద్దుల్లాగా అదే అనుసరించేస్తున్నాం .. అచ్చగా ఈ మాటలే కాకపోయినా ఇంచుమించు ఇదే సారాంశం.

ఆంగ్ల సంవత్సరాది ఎదురైనప్పుడల్లా నాకు సరిగ్గా ఇదే భావన కలుగుతుంది, బొత్తిగా శ్రుతీ సందర్భమూ లేని పండగ ఇదని. పైగా దానికి హేప్పీ అనే విశేషణం తగిలించడం. అదొక గ్రీటింగు!

అనంతంగా దొర్లిపోతుండే ఈ కాలచక్రాన్ని గమనించుకోడానికి ఇదికూడా ఒక మైలురాయి. ఇతరత్రా పండగల్లో ఏదో ఒకటి సెలెబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి ఆ హడావుడిలో ఉంటాం. ఈ పండగ కాని పండగ రోజున వేరే సెలెబ్రేట్ చేసుకునేందుకు ఏవీ లేదు కాబట్టి, ఏతావతా జరిగేదేవిటంటే, మందితో పాటు మనమూ అన్నట్టు, తీరి కూచ్చోని గత సంవత్సరంలో ఏమి జరిగిందీ, జరగబోయే సంవత్సరంలో ఏవి జరగించాలీ అని లెక్కలేసుకోవచ్చు.

జనవరి ఒకటి తీర్మానాల్ని గురించి సుజాతగారు ఆల్రెడీ బహు పసందుగా రాశ్శారు. నా తీర్మానం కూడా అక్కడే చెప్పేశ్శా కాబట్టి ఆ జోలికి పోవట్లా. పలువురు బ్లాగర్లు తమకి నచ్చిన బ్లాగులవీ సినిమాలవీ లిస్టులు పెట్టేశ్శారు .. నాకు ఇది బాగా నచ్చింది. గత ఐదార్నెల్లుగా బ్లాగులు క్రమంగా పద్ధతిగా చూడక మంచి టపాలు చాలానే మిస్సయ్యానే అనుకున్నా. అల్లాగే సినిమాల్ని కూడా నా నెట్టుఫ్లిక్సు జాబితాలో చేరుస్తున్నా.

2009 నా మట్టుకి నాకు చాలా ఆసక్తికరంగా గడిచిందనే అనుకోవాలి. మొదలవడమే బహు బీభత్సంగా మొదలై, అటూ ఇటూ అల్లకల్లోలంగా పోట్లెత్తి, మళ్ళీ అంతలోనే ఆశాకిరణాలు విరజిమ్మి, అందలాలెక్కించింది. చింతామణి నాటకంలో అనుకుంటా .. ".. ఈ కాలమన .." అని ఒక పద్యం ఉంది. కాలమహిమ ఎటువంటి ఊహించని పరిణామాలు తెచ్చిపెడుతుందో ఉదహరిస్తూ. అందుకనే అన్నారు కాబోలు మంత్రపుష్పంలో యస్సంవత్సరస్యాయతనం వేద - ఆయతనవాన్ భవతి. అలిగో కోపగించో అపార్ధం చేసుకునో దూరమైపోయిన మిత్రులు కొందరు తొలగిపోగా, మనసుని ఎంతో కుంగదీసే సందర్భాల్లోనూ మీకెందుకండీ బెంగ మేమున్నాంగా అని పలువురు మిత్రులు తోడునిలవగా, మంచిఅభిరుచి కలిగిన సరికొత్త మిత్రుల పరిచయాలు కాగా, కొన్ని పదుల సంవత్సరాల గడువు తరవాత ఆప్తులైన బంధుమిత్రుల సాంగత్యం లభించగా .. మొత్తానికి 2009 చాలా ఆసక్తికరంగా నడిచిందనే అనుకోవాలి.

ఈ శ్రుతీ సందర్భమూ లేని ఆంగ్ల సంవత్సరాది మీకూ మీ వారందరికీ సంకల్పించిన తీర్మానాలని సాకారం చేసి కోరిన కోరికలని దీర్చుగాక!

కొసమెరుపు: మురళి గారూ, జనవరి నెలాఖరులోగా దివాకరతనూజం పూర్తి చేసేస్తాను. కొత్త సంవత్సరమ్మీదాన!

Comments

Kalpana Rentala said…
“అలిగో కోపగించో అపార్ధం చేసుకునో దూరమైపోయిన మిత్రులు కొందరు తొలగిపోగా…”
వాళ్ళు నిజమైన స్నేహితులు కారని తెలుసుకొని ,మీ నెత్తిన వాళ్ళు పాలు పోసారని సంతోషించండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు
నూతన సంవత్సర శుభకాంక్షలు .
Purnima said…
Wish you a very happy new year! :)
తృష్ణ said…
మీకూ మీ కుటుంబ సభ్యులకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
సరిగ్గా గ్రహణం టైం లోనే వీధుల్లో పరుగులిడుతూ కేరింతలు. ఏవిటో! నేనైతే ఎంచక్కా ఇంట్లో బజ్జోని గడిపేశా. మీకూ నూతన సంవత్సర శుభకాంక్షలు .
మురళి said…
పన్నెండు నెలల్లో కరిగిపోయే కొత్త సంవత్సరంమీద వేసిన ఆనని నమ్మేదెలా?! నేను 'ఆన'లని నమ్మను కానీ, ఈసారైనా మీరు మాట మీద నిలబడతారని ఎందుకో నమ్మకం కలుగుతోంది.. శ్రుతీ సందర్భమూ లేకపోయినా 'పండుగ' అని ఒప్పుకున్నారు కాబట్టి శుభాకాంక్షలు అందుకోండి మరి :):)
Unknown said…
అయినా మీకు "Happy" న్యూ ఇయరే :-)
నూతన సంవత్సర శుభాకాంక్షలు
sunita said…
మీకూ మీ కుటుంబ సభ్యులకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
రవి said…
మీరు రాసిన మొదటి పేరాగ్రాఫు మీద ఓషో ప్రసంగం కూడా ఒకటుంది. కుష్వంత్ సింగ్ ఓషో అభిమాని కాబట్టి, ఆయన కథకూ ఓషో ప్రసంగమే స్ఫూర్తి అయి ఉంటుందని నా ఊహ.

మీరు ఆముక్త మాల్యద మీద వేసిన శీతకన్నును ఈ యేడాది తీసేయాలని వ్యక్తిగతంగా నా అభ్యర్థన.
అయినా సరే మీకూ మీ కుటుంబానికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు :-)
Sanath Sripathi said…
నూతన సంవత్సర శుభకాంక్షలు
Vasu said…
"బొత్తిగా శ్రుతీ సందర్భమూ లేని పండగ ఇదని" -
ఇంగ్లీష్ క్యాలెండర్ (జూలియన్) అన్నిటికీ వాడుతూ, ఇలా అనడం నాకు మింగుడు పడలేదు.
అన్నట్టు టపా లో మొదటి రెండు ప్యారాలు చూసి ఇంకా ఎకేస్తారనుకున్నా దీని గురించి. కానీ శాంతించి నలుగురితో నారాయణ అన్నారు. సంతోషం.

మీకు హ్యాపీ న్యూ ఇయర్.
kiranmayi said…
మీకు గ్రీటింగ్ ఇష్టం లేదని అర్ధమయిపోయ్యింది అందుకని "Happy New Year" అని నేను చెప్పను.
ఈ కొత్త సంవత్సరం లో మీరు బోల్డు బోల్డు మంచి పోస్ట్లు మీ బ్లాగ్ లో పెట్టాలని, అవి మేము చదవి కంమెంట్లు పెట్టాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే అప్పుడు మీరు, మేము అందరు హేపిస్.
కాని మరీ శుభాకాంక్షలు చెప్పకుండా ఉండలేము కదా? అందుకని మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.
మాలతి said…
బావుందండీ. గతాన్ని ఓమారు తలుచుకుని ముందేం చేస్తామో, జరుగుతుందో లెక్క చూసుకోడమే అనుకుంటాను న్యూయియర్ పరమావధి. శుభాకాంక్షలు.
durgeswara said…
చాలా రోజులకు మీ పోస్ట్ చూసాను. చాలా చక్కని విశ్లేషణతో ఆలోచనలను రేకెత్త్తించారు జనం లో. నాకు ఉగాది నే కొత్తసంవత్సరం వేడుకగా భావించే అలవాటుకనుక ఇప్పుడు శుభాకాంక్షలు చెప్పటం లేదు
ఎప్పుడూ కాదుకాని అండి ఈ సారి నేను ఎంతో ఎదురు చూసా ఈ కొత్త సంవత్సరం కోసం
ఎన్ని గొడవలు ఇక్కడ తెలుగు దేశంలో. ముఖ్యం గా తెలుగు దేశం అంతా పాకిన మా లాంటి ఫామిలీస్, ఇక్కడ నుండి అక్కడి కి వెళ్ళటానికి లేక, అక్కడనుండి ఇక్కడికి రావటానికి లేక ..
నేను నా స్నేహితులూ , నేను నా పొరుగు వారు , నేను నా బిజినెస్ కలీగులు, నేను నా బంధువులూ ఒక జాతి వారం కాదా ... వారితో నేను ఏమి మాట్లాడాలో మాట్లాడకూడదో ఆలోచించి మాట్లాడాలా?
ఎన్ని మానసిక గోడలు, ఎన్ని ఆందోళనలూ సృష్టించింది ఈ 2009 . ?
డిసెంబర్ అంతా ఎంత చెత్త గా గడిచింది. విరోధి నామ సంవత్సరం ఇంకా వెళ్లక పోయినా.. ఒక ఆశ కనీసం ఈ కొత్త ఇంగ్లీష్ ఏడాది ఐనా ఏమైనా శాంతి తెస్తుందేమో నని.
నాక్కూడా చిన్నప్పట్నుంచీ ఎందుకనో ఈ హ్యాపీ గట్రాలు ఎందుకో నచ్చవు. కానీ మిత్రులు అలా పలకరించినపుడు తిరిగి సమాధానమివ్వకపోతే బాగుండదని అలాగే అంటాను.
నా వరకు పలకరించడానికి ఒక చిరునవ్వు చాలంటాను.
మిత్రులు కాబట్టే అపార్థాలు విపరీతార్థాలు వస్తాయి,మీకు చెప్పగలిగేంతటి వారమా గురువుగారూ?
అందుకోండి ముందుగా మా మన పండగ సంక్రాంతి శుభాకాంక్షలు(వమెరికాలో ఉంటున్నారు కాబట్టి కొత్త సంవత్సరానికి కలిపి).
@ మైత్రేయి .. మీ గుండెలో బాధ వినబడుతోంది.

@ శ్రీనివాస్ .. కావచ్చు. కానీ నిజమైఅన్ మిత్రులైతే అపార్ధాలొచ్చినా విషయం మాట్లాదుతారు, నిలబడతారు. వీరు తొలిగిపోయారు అదీ తేడా.