ముద్దర్ల ముచ్చట్లు

బాపట్లలో ఒక్క ఏడూ పంతులు గిరీ చేసిన సమయంలో అయిన ఒకానొక గొప్ప వింత అనుభవం ఎన్నికల డ్యూటీ చెయ్యడం.

నాకప్పటికి 21 నిండుతూ ఉండగా, 22 ఇంకా రానా వొద్దా అంటూ ఉంది. కాయితమ్మీద వోటు హక్కు వచ్చినట్టే గానీ ఇంకా ఎక్కడా వినియోగించే అవకాశం రాలేదు. హస్తినాపురిలో రాజీవుడూ, భాగ్యనగరిలో తారకరాముడూ ప్రశాంతంగా రాజ్యమేలుతున్న కాలమది. ఎక్కడా మధ్యంతర ఎన్నికల వాసన కూడా లేదు.

ఇదిలా ఉండగా తారకరాముడు ఒకానొక సుముహూర్తాన స్థానిక పరిపాలనా వ్యవస్థనంతా ప్రక్షాళించేస్తున్నాం, పంచాయితీ రాజ్ వ్యవస్థకి పూర్తి శక్తి నాపాదిస్తున్నాం అని చెప్పి, జిల్లాపరిషత్తులకి ఎన్నికలు ప్రకటించాడు. ఇది జెనెరల్ ఎలక్షను కాకపోవడంతో మామూలుగా ఎన్నికలకి సహకరించే సిబ్బందిని వాడలేకపోయారు గామాలు, మొత్తానికి మాది ప్రైవేటు కాలేజీనే అయినా మా సిబ్బందికీ ఎన్నికల వేటు పడనే పడింది.

డ్యూటీ నోటీసులు చూసుకుని మా కుర్రకారంతా ఉత్సాహంగానే ఉంది. ఆహా, ఒక్క సారైనా వోటెయ్యక పోయినా ఎన్నికలు జరిపించే గురుతర బాధ్యత నెరవేర్చి ప్రజాస్వామ్యానికి నేను సైతం లెవెల్లో మేం ఫీలైపోతుంటే, సీనియర్ మేష్టార్లు గత ఎన్నికల చేదు అనుభవాల్ని తలుచుకుని, తగ్గండి తగ్గండి తమ్ముళ్ళారా అని హెచ్చరించ జూశారు. ఐనా మా యువబృందపు ఉత్సాహాన్ని వాళ్ళాట్టే తగ్గించ లేక పోయారు. మొత్తానికి ఒక పిక్నిక్కి బయల్దేరినట్టు బయల్దేరాం గుంటూరుకి, ఛార్జి తీసుకోడానికి.

జిల్లా ఎన్నికల ప్రధాన కార్యాలయానికి చేరుకున్నాం. విజయవాడలో కాళేశ్వర్రావు మార్కెట్లో ఉదయాన్నే కూరగాయల లారీలు వచ్చే టైములో అక్కడి సందోహాన్ని మీలో ఎవరన్నా ఎప్పుడన్నా చూశారా? ఈ కార్యాలయ ప్రాంగణంలో హడావుడి దానికి వంద రెట్ల ఎక్కువ గందరగోళంగా ఉంది. మా శక్తియుక్తులు, తెలివితేటలూ అన్నీ ఉపయోగించి మాకు ఛార్జి ఇచ్చే చోటు తెలుసుకుని అక్కడ హాజరయ్యాం. అసలే వరంగలార్యీసీ గ్రాడ్యువేట్లం, అటుపైన బాపట్లింజనీరింకాలేజీ అధ్యాపకులం అయ్యేప్పటికి తగు మాత్రం గీరగా ఉండేవాళ్ళం. అసలు మేమేంటి, మా లెవెలేంటి, మా ముందు ఈ తుఛ్ఛ ప్రభుత్వోద్యోగులందరూ అల్పజీవులూ, పిపీలికాలూ కదా అన్నట్టుండేది మా తీరు. మా లెవెలు చూసి అక్కడి క్లర్కులు హడలి పోయి, గబగబా మా పేపర్లు చూసి మా ఎసైన్మెంట్లు అందజేశారు. అందరమూ అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లము. ఈ టైటిలేదో బాగానే ఉందే అని మురుసుకున్నాము. ఇహ అప్పుడు మొదలైంది .. అసలు పండుగ ..

మా నలుగురికీ ఒక వూరు కాదుగదా, పక్కపక్క వూర్లు కాదుగదా, ఒక రూట్లో ఉండే వూళ్ళు కూడా వెయ్యలేదు. అది మొదటి దెబ్బ. నేను నా మిత్రుల్ని విడిచి నా పై అధికారియైన ప్రిసైడింగాఫీసరు గారిని వెతుక్కుంటూ వెళ్ళాను. నా అదృష్టం కొద్దీ ఆయన అనుభవజ్ఞుడైన ఒక డిగ్రీకాలేజీ మేష్టారు, అనేక ఎలక్షన్ల క్షతగాత్రుడు .. అబ్బే, నిజంగా దెబ్బల్తిన్నాడని కాదు, క్ష అనుప్రాస బాగుందని వాడానంతే. మొత్తానికి ఆయన అనుభవజ్ఞుడు. నన్ను తేరిపార చూసి, ఏం భయం లేదు, నేను చూసుకుంటాను అంతా, నేను చెప్పే కొన్ని చిన్న చిన్న పనులు చేస్తే చాలు అని అభయమిచ్చారాయన.

మారూట్లో ఉన్న వూళ్ళలో డ్యూటీ సిబ్బందినందర్నీ, సుమారొక నలభై మందిని అక్కడున్న ఒక డాడ్జిలారీ ఎక్కించారు. జీపు లేదు, బస్సు లేదు, వేను లేదు, ఒక లారీలో వెనకాల గొర్రెల మందని ఎక్కించినట్టు ఎక్కించారు. పాఠక మహాశాయులారా, సూపర్ డీలక్సు బస్సు తప్ప ఎక్కని ఈ శరీరం ఒక మట్టిలారీలో పైన టాపైనా లేకుండా గుంటూరునించీ, రేపల్లె దగ్గర ఒక చిన్న పల్లెటూరికి మిట్టమధ్యాన్నపు ఎండలో ప్రయాణం చేసింది! మీకెప్పుడైనా వోటెయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎలక్షనాఫీసర్ల మీద కోపమొస్తే, ఈ దృశ్యాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి.

మొత్తానికి వొళ్ళు పూర్తిగా బాబాయి హోటల్లో కొబ్బరి పచ్చడై పోకముందే మా కుగ్రామం చేరుకున్నాం. అప్పటికి సాయంత్రం అయిదవుతోంది. పోలింగ్ కేంద్రం ఊళ్ళో ఉన్న ఒకేఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో. దాని పుణ్యమా అని ఆస్కూలికి ఒక పక్కా భవనమూ, దానికి గొళ్ళెం పెట్టి తాళం వెయ్య దగిన తలుపూ ఉన్నాయి. ఫేను కానీ, లైటు కానీ లేవు. ఒకేళ ఉన్నా, కరంటు ఎలాగూ కట్టే. మేము దిగడం చూసిన అక్కడి పిల్లవాళ్ళు ఊళ్ళోని పెద్దమనుషుల్ని పిలుచుకు వచ్చారు.

నాకప్పటికి బొత్తిగా లోకజ్ఞానం లేకపోవడంతో అక్కడి స్థానిక పరిస్థితుల్ని గురిచి కూలంకషంగా తెలుసుకునే అవకాశం పూర్తిగా పాడుచేసుకున్నా. నాకిప్పుడు గుర్తున్నదల్లా .. ఊళ్ళో ఇద్దరు మోతుబరి రైతులు. ఒకాయన కాంగ్రెస్, ఇంకొకాయన తెలుగు దేశం. ఇద్దరికీ సుమారుగా సమాన బలగమే ఉంది. కానీ, ఊరిజనం కొట్లాటలకి దిగే రకం కాదు. ఎన్నికల కార్యక్రమం ప్రశాంతంగా జరిగిస్తామని ఇద్దరు మోతుబరులూ మా పెద్దాఫీసరుగారికి భరోసా ఇచ్చారు. మా ఇద్దరి భోజనాలు, పడక ప్రసక్తి వచ్చింది. మోతుబరులిద్దరూ గుసగుసలాడుకుని ఒక నిర్ణయానికొచ్చారు. వాళ్ళిద్దరికీ నమ్మకమయిన ఒక మధ్య మనిషి ఉన్నాడు. ఆయన ఇంటి ముందు గచ్చు చేసిన వరండాలో పడుకోవచ్చు. మర్నాడు ఎలక్షను రోజు మధ్యాన్న భోజనం కూడా ఆయన ఇంట్లోనే ఏర్పాటవుతుంది. కానీ ఇవ్వాళ్టి రాత్రికి మాత్రం మీ ఏర్పాటు మీరు చూసుకోవాల్సిదే నన్నారు. మా పెద్దాయన పోనీ ఇక్కడ ఊళ్ళోగానీ పక్క ఊళ్ళోగానీ పూటకూళ్ళ ఇళ్ళూన్నాయా అనడిగారు .. చెప్పాను కదా, అనుభవజ్ఞుడని? నేనింకా హాచ్చెర్యపడి చూస్తున్నా, వార్నీ ఇంకా ఈ రోజుల్లో కూడా పూటకూళ్ళ ఇళ్ళున్నాయా అని.

ఆ ఊళ్ళో లేదుగానీ పక్కూళ్ళో ఉంది. కానీ ముందు చెప్పుకునుంటే బెటరు. అని చెప్పి వాళ్ళు చక్కా పోయారు. ఆపక్క ఊరు సుమారు రెండు మైళ్ళు. వెళ్ళి, భోజనం చెప్పుకుని, తిరిగొచ్చి, మళ్ళీ వెళ్ళి .. ఇదంతా ఎందుకులే అని మేమిద్దరమూ డైరెక్టుగా వెళ్ళి భోంచేసి రావడానికి బయల్దేరాము. అప్పటికే ఆరు దాటి బాగానే చీకటి పడింది. అదేమీ రోడ్డు కాదు, డొంకదారి. చెప్పానుగా పెద్దాయన అనుభవజ్ఞుడని, చక్కగా నాలుగు బేట్రీల టార్చిలైటుతో సహా వచ్చారాయన. పక్కూరు చేరుకుని పూటకూళ్ళిల్లు కనుక్కోడం పెద్ద కష్టం కాలే.

దానికి పూటకూళ్ళిల్లు అనడం కూడా పెద్ద బిరుదిచ్చినట్టే. అది మామూలుగా బస్సులాగే చోట ప్రయాణీకులకి టీ, అరటిపళ్ళు అమ్మే చిన్న పాక. ఇలా ఎప్పుడన్నా మాలాంటి కాందిశీకులు ఆ ప్రాంతాలకొస్తే అదే టెంపొరరీగా పూటకూళ్ళింటి స్థాయికి ఎత్తబడుతుందన్న మాట. మేమక్కడికి చేరుకునేప్పటికి బయట సుమారొక అరడజను మంది పేంట్లూ షర్ట్లూ వెసుకున్న జనాలు .. చూడంగానే పట్నం సజ్జు అనిపించే బాపతు జనాలు .. సిగరెట్లు కాల్చుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ కనిపించారు. ఓహో, పరవాలేదు, ఇదీ ఒక మోస్తరు హోటలన్నమాట అనుకుని సమీపించాము మేము. తీరా అందులో కొన్ని పరిచయమైన మొహాలున్నాయి. ఈ జనాభా కూడా ఆయా చుట్టుపక్కల గ్రామాలకి మేమొచ్చిన పని మీద వొచ్చినవారే .. ఇందాక మా లారీలో వచ్చిన వారే. ఆ తట్టు ఐదారు గ్రామాలకి ఇదే పూటకూళ్ళిల్లు. ఒక్కసారిగా పదిమంది భోజనాలకి దిగేసర్కి ఆ పాకవాడికి కాళ్ళూ చేతులూ ఆడక, అవసరమైన సరుకులు కూడదీసుకుని, వొండి మాకు పెట్టేప్పటికి రాత్రి తొమ్మిదయింది. అప్పటికి నాకు శోషొచ్చి సగం నిద్రకి పడి ఉన్నాను. పొడిపొళ్ళాడుతున్న అన్నం, నాలిక చురుక్కుమనే పచ్చిమిరపకాయల కారంతో రోట్లో నూరిన దోసకాయ పచ్చడి, ఘుమఘుమలాడే గేదె నెయ్యి! ఒక పెద్ద పట్టు పట్టాను. నెక్స్ట్ .. అంతే ఇంకేమీ లేదు. మజ్జిగే. ఐతే, ఆ పచ్చడే మళ్ళి పట్రా .. నిజంగా చెబుతున్నానండీ, జీవితంలో అంత రుచికరమైన దోసకాయపచ్చడన్నం నేనెప్పుడూ తినలేదు. దాన్నే ఇదే పప్పూ, ఇదే కూరా, ఇదే సాంబారూ అనుకుని నాలుగు సార్లు కలుపుకు తిన్నా. పాడికి లోటు లేదల్లే ఉంది, ప్రతీసారీ నెయ్యి మాత్రం తప్పనిసరి. ఒక అరగ్లాసుడు మజ్జిగ తాగి (మందెక్కువయ్యాము గదా, అది పల్చగానే ఉంది) సుమారు పదిన్నరకి మా బళ్ళో వొచ్చి పడ్డాం. ఎలా నిద్ర పోయానో నాకిప్పుడు గుర్తు లేదు .. వొళ్ళు హూనమైంది కాబట్టి, ఫేను లేకపోయినా, ఉక్క పోసినా, దోమలు కుట్టినా నిద్రమాత్రం బాగానే పోయాననుకుంటా.

మర్నాడు ఎనిక్కల తతంగం తగుమాత్రం ఎఫిషియెంట్ గానూ, ప్రశాంతంగానూ జరిగింది. ఏవో చిన్న చిన్న కొట్లాటలు వచ్చాయిగానీ, మా పెద్దాయన ఆధ్వర్యంలో సద్దుబాటైపోయాయి. నాకు పని కూడా పెద్ద కష్టమనిపించలేదు. ఊరి పెద్దమనుషులు వాగ్దానం చేసినట్టు మధ్యానం భోజనం ఆ తటస్థుడైన పెద్దమనిషి ఇంట్లో షడ్రసోపేతం కాదుగానీ, మంచి భోజనమే పెట్టించారు. ఎన్నికలు కట్టేసినాక, చూడాల్సిన కూడికలూ తీసివేతలూ అన్నీ పెద్దాయనే చేసేసి, నాతో కూడా ఒక సంతకం పెట్టించేశారు. మూటా ముల్లే సద్దుకుని కూర్చున్నాం, మా పుష్పక విమానం కోసం. అది సుమారు ఎనిమిదింటికి వచ్చి మమ్మల్ని ఎక్కించుకుంటే, అర్ధరాత్రి ఏ వొంటిగంటకో గుంటూర్లో ఎన్నికలాఫీసుకి చేరుకున్నాం. ముందస్తుగా సీలేసిన వోట్లడబ్బా, నింపిన ఫారాలూ అన్నీ అధికారులకి అందజేసి, మా పెద్దాయన దగ్గర వీడుకోలు తీస్కుని నా మిత్రుల్ని వెదుకున్నాను. వాళ్ళూ ఇంచుమించుగా అదే సమయానికి చేరుకున్నారు. నలుగురమూ బేటా ఇచ్చే చోటికి వెళ్ళాము. మేము డ్యూటీకి రిపోర్టు చేసినప్పుడు ఉన్న క్లర్కులే ఇప్పుడు బేటాల పంపిణీ చూస్తున్నారు. మేం వెళ్ళగానే భయభక్తులతో మా పే స్లిప్పులందుకుని చూశారు. చూసి వాళ్ళల్లో వాళ్ళు గుసగుసలాడుకుంటున్నారు. మధ్యమధ్యలో ఒకరిద్దరు పెద్దగా, కొంచెం ఎకసక్కెంగా నవ్వారు. మావాడికి కొంచెం టెంపరెక్కువ. ఏంటా నవ్వులు, మా బిల్లులు సెటిల్ చేసి పంపండి అని గట్టిగా అన్నాడు. క్లర్కుల్లో కొంచెం లీడర్లాగా ఉన్నతను .. వార్నీ, కేడరు మాత్రం లోయర్ గ్రేడు క్లర్కంత లేదు, ఈళ్ళకెంత పొగర్రా అన్నాడు. మా నలుగురికీ తిక్క రేగింది. కానీ ఇంతలో మా స్లిప్పులు తీసుకున్న క్లర్కు, గబగబా మా సంతకాలు తీసుకుని చెరొక ఇరవై రూపాయలు చేతులో పెట్టాడు. మేం నిర్ఘాంత పోయాం. కనీసం తలా వందైనా వస్తుందని ఆశించాం అప్పటిదాకా. పాపం అతను మా మీద దయతల్చి జ్ఞానోదయం కలిగించాడు. బేటా పూర్తి జీతం మీద ఆధారపడి ఉండదు. పేస్కేల్లో బేస్ పే ఎంతనో దాని మీద ఆధార పడి ఉంటుంది. మీకు మొత్తం జీతం బాగా ఎక్కువే కానీ, అందులో చాలా భాగం ఎలవెన్సుల కింద ఇస్తున్నారు. మీ బేస్ పే స్కేలు ఒక లోయర్ గ్రేడు క్లర్కు జీతం స్కేలు .. అని అతను చెప్పాడు. సరే ఏదో ఒకట్లే, ఇదైనా దక్కింది, రేపాదివారం, సినిమా టిక్కెట్టుకి పనికొస్తుందని గేటుకేసి బయల్దేరాం.

అయ్యా .. అదీ .. నా ఏకైక ఎలక్షను అనుభవం.

Comments

బావున్నాయి మీ ఎలక్షన్ల ముచ్చట్లు.. :).. చదువుతుంటే సినిమా రీళ్లలా కధ నడిచింది.
మురళి said…
"సూపర్ డీలక్సు బస్సు తప్ప ఎక్కని ఈ శరీరం ఒక మట్టి లారీలో పైన టాపైనా లేకుండా గుంటూరునించీ, రేపల్లె దగ్గర ఒక చిన్న పల్లెటూరికి మిట్టమధ్యాన్నపు ఎండలో ప్రయాణం చేసింది!" that is life.. బాగున్నాయి కబుర్లు..
cbrao said…
చచ్చీ చెడి ఎలక్షన్ డ్యూటీ చేస్తే ఇచ్చింది 20 రూపాయలా? ఇంతకీ ఏ సంవత్సరమో రాయలేదు. 20 రూపాయలకి ఏమొస్తుంది? పూటకూళ్ళిల్లు లో భోజనం ఖరీదెంత?
Anonymous said…
ఎలక్షన్లెప్పుడొచ్చినా మా నాన్నగారికి డ్యూటీ పడేది. ఆయన ఇంటికొచ్చాకా ఎలక్షన్ అనుభవాలు అన్నీ పూసగుచ్చినట్టు చెప్పేవారు. మీ కబుర్లు చదువుతుంటే అవే గుర్తొచ్చాయి.

మా నాన్నగారు ప్రిసైడింగాఫీసరుగా వెళ్ళేవారు. ఆయనవల్ల ఎలక్షన్ డ్యూటీ చేసేవాళ్ళకి ఎన్ని అధికారాలుంటాయో, ఎంత రిస్కుంటుంతో, గ్రామాల్లో ఎలక్షన్ రాజకీయాలు ఎలా ఉంటాయో తెలుస్తూ ఉండేది. ఒకసారి ఆయన డ్యూటీ చేస్తుండగా ఒక రౌడీ బాలట్ పేపర్ల కట్ట ఒకదాన్ని చించేశాట్ట. చాలా గొడవైంది అప్పుడు.
ఒక షార్ట్ ఫిల్మ్ చూసినట్టుగా ఉండి బావుంది.. :)
asha said…
ఎన్నికల డ్యూటీకి వెళ్ళేవాళ్ళని బెదరగొట్టేసినట్లున్నారే?
ఒకోసారి మా తాతయ్యవాళ్ళ ఊరెళ్ళినప్పుడు కిక్కిరిసిపోయిన బస్సుల్లో వెళ్ళేవాళ్ళం.
కొందరు కోళ్ళు కూడా తీసుకొచ్చేవారు. కిటికీ నుండి ఎండా, దుమ్మూ, చిరాకు కలిగించే చెమటా, కోడి అరుపులు, కునుక్కుంటూ వెళ్ళే బస్సు....మా నాన్నగారు వాళ్ళ చిన్నప్పుడు వాటిని గెడ్డాల బస్సులు అని పిలిచేవారట. అంటే దిగేటప్పటికి మాసిన గెడ్డంతో దిగే పరిస్థితి వస్తుందట. అందుకు.
శ్రీ said…
బాగున్నాయండీ కబుర్లు.
@cbrao .. ఈ సంఘటన ఎప్పుడూ జరిగిందో తెలుసుకోడానికి తగిన ఆధారాలు టపాలోనే ఉన్నాయి. ఇరవై రూపాయలు అప్పుడు సామాన్యం కాదు. విజయవాడ ఊర్వశీ థియేటర్లో బాలకనీ టిక్కెట్టు పది ఉండేది అప్పుడు. :)
మా బాధ అల్లా, అక్కడి ప్రభుత్వ గుమాస్తాల ముందు మా లెవెలు కాస్తా నీరుకారిపోయిందని .. డబ్బు గురించి కానే కాదు.
@భవాని .. అలాంటి బస్సు/రైలు ప్రయాణాలు .. అదింకో అనుభవం.
sunita said…
మంచి రుచికరమైన గుంటూర్ పచ్చిమిరపకాయల దోసకాయ పచ్చడి అన్నము తిన్నారన్నమాట.
హరేఫల said…
మా నాన్న గారు 55--60 లలో ఒకసారి ఎలక్షన్ డ్యుటీ కి వెళ్ళినప్పుడు తూర్పు గోదావరి జిల్లా రాజొలు కి వెళ్ళాను. ఆ రోజుల్లో అక్కడ ఉన్న స్థానిక రాజకీయ నాయకులకి, ప్రాక్సీ ఓటింగ్ చేయనీయలేదని, ఈయనని కొట్టడానికి దారి కాశారు. పోలీసులు సహాయంతో ఎలాగో బయట పడ్డారు.
Anil Dasari said…
నాకు ఓట్లేయించిన అనుభవం లేదుగానీ, ఒకే ఒక సారి ఓటేసిన అనుభవముంది. పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు కలిసొచ్చిన సందర్భమది. పార్లమెంటుకి తెదెపా, అసెంబ్లీకి కాంగ్రెస్ అభ్యర్ధికేశా (క్రాస్ వోటింగురంగడ్నన్నమాట). ఫలితాలొచ్చాక చూస్తే అభ్యర్ధులిద్దరూ ఓడి-పోయారు. అనగా - ముందిద్దరూ ఓడారు, ఏడాది తిరిగేలోపు కాస్త అటూ ఇటుగా ఇద్దరూ పోయారు. ఆ తర్వాత భూతదయతో మళ్లీ ఎప్పుడూ ఎవరికీ వోటెయ్యలా.
మాస్టారూ, చక్కగా రాసారు మీ ఎన్నికల అనుభవం. మీరెళ్ళిన ఆ ఊరికి దగ్గర్లోనే మా ఊరు.

ఇంతకీ, అసలు పని గురించి ఏమీ రాయలేదు చూసారా!! ఆ 20 రూపాయల కోసము, దోసకాయ ముడిబద్దల కోసమూ వెళ్ళినట్టుంది గానీ, పోలింగు జరిపించేందుకెళ్ళినట్టు లేదు. :)
మేధ said…
మా అమ్మగారికి ప్రతిసారీ ఈ ఎలక్షన్స్ డ్యూటీ పడుతూనే ఉండేది.. నేను కూడా అప్పుడప్పుడు తనతో వెళ్తూ ఉండేదాన్ని.. టపా చదువుతుంటే, అవన్నీ గుర్తు వచ్చాయి! ఎటూ వెళ్ళిన దాన్ని ఖాలీగానే ఉండేదాన్ని కాబట్టి, ఎంత పర్సెంటేజీ
వోటర్లు వచ్చారు, అసలు ఎవరు ఎవరికి వోట్ వేస్తున్నారు, అంటూ నేను సొంత లెక్కలు వేసుకునే దాన్ని!! ఆ తరువాత రోజు పేపర్ లో చూసుకుంటే, దాదాపు సరిపోయేవి :)
నేను వెళ్ళిన అన్నిటిలోకీ భయంకరమైన అనుభవం మాత్రం నరసారావుపేటలోది.. మేమున్న పోలింగ్ స్టేషన్ ప్రక్కనే బాంబులు పడ్డాయి..!
duppalaravi said…
బాగున్నాయి, మీ ఎలక్షను డ్యూటీ ముచ్చట్లు.
చాలా బాగారాసారు ..కాని ఇప్పుడు అర్జెంటుగా దోసకాయ పచ్చడన్నం తినాలి :)
duppalaravi said…
తొమ్మిదేళ్ల కిందట నేను గిరిజన గురుకులంలో పనిచేస్తున్నప్పుడు సీతంపేటకు దూరంగావున్న పెదరామ అనే కుగ్రామానికి ఇదే ఎలక్షన్ డ్యూటికు వెళ్లాను. ఆ వూరిలో కనపడిన క్రమశిక్షణ, పారిశుధ్యం, గ్రామస్తుల జ్రాగ్గత్త, సారా అమ్మకుండానే కాదు తాగకుండా వుండడం... నిజంగా నేను ఇండియాలో వున్నానా లేదంటే హాలీవుడ్ సినిమాల్లో చూపిస్తారే సెట్ వేసి తయారుచేసిన డీసెంట్ పల్లెటూర్లు... అక్కడ వున్నానా అనిపించింది. ఈ రోజు సాయంతరం వెళ్లి రేపు మరునాడు సాయంత్రం ఆ వూరు విడిచిపెట్టినపుడు ఎంత బాధనిపించిందో... చిత్రాల్లోకెల్లా చిత్రమేమిటంటే అక్కడ సవర పిల్లలు సాయంత్రం తొక్కుడుబిళ్ల ఆట ఆడుకుంటున్నపుడు ఇంగ్లిషు రైములు హమ్ చేసుకుంటూ వుండడం... మరింత లోతుగా ఆరా తీసినప్పుడు తెలిసింది ఆ వూరిలో ప్రాథమిక పాఠశాలకు కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులు ఆ మార్పులకు కారణమంట. ఆ పిల్ల ఉపాధ్యాయులిద్దరూ పెళ్లికాని వారేకావడం విశేషం. అయినా ఆ గ్రామస్తులను, ముఖ్యంగా ఆ మహిళలను అభినందించి తీరాలి. మీ వ్యాసం చదువుతుంటే అవన్ని ఒక్కసారి గుర్తొచ్చాయి.
సుజాత said…
నాన్నగారికి ఏదైనా పల్లెటూళ్ళో పి.వో గా డ్యూటీ పడినపుడు అక్కడెం జరుగుతుందో చూడాలని భలే కుతూహలంగా ఉండేది కానీ ఆయన రానిచ్చేవారు కాదు.
అసలు మా వూళ్ళో వోటు వేసి క్షేమంగా ఇంటికొస్తే చాలన్న పరిస్థితి ఉండేది. పార్టీల వాళ్ళు నా చిన్నప్పుడు రిక్షా లకు పార్టీ జెండాలు కట్టి ఫ్రీగా పోలింగ్ స్టేషన్లకు తీసుకెళ్ళేవాళ్ళు. వాళ్లకు మన మొహాలు చూడగానే తెలిసిపోతుంది మనం ఎవరికేస్తామో వోటు.అమ్మమ్మ, బామ్మ కాంగ్రెస్ వాళ్ళ రిక్షాలెక్కి వెళ్ళి కాసు బ్రహ్మానందరెడ్డికో,కృష్ణారెడ్డికో వోటేసి వచ్చేవారనుకుంటా!

మీ అనుభవాలు చాలా బాగున్నాయి కొత్తపాళీ గారూ! ముఖ్యంగా దోసకాయ పచ్చడి అర్జెంటుగా అమ్మను గుర్తుకు తెచ్చేసింది.

అబ్రకదబ్ర,
క్రాస్ వోటింగ్ అంటే ఇదా? నాకింత వరకూ తెలీదు నిజంగా! మీరిక్కడ ఉండి రెండు వోట్లు ఇద్దరు ప్రధాన అభ్యర్థులకు వేస్తే మీ సొమ్మేం పోయిందో?
@అబ్రకదబ్ర,
"ఆ తర్వాత భూతదయతో మళ్లీ ఎప్పుడూ ఎవరికీ వోటెయ్యలా" :).ఈ సారి YSR కి వెయ్యాల్సింది. :)
@చదువరి .. సరిగ్గా కనిపెట్టారు. విధినిర్వహణలో గుర్తుంచుకోదగిన విశేషం ఏం జరగలేదు. ఒకటేమో .. ఒక యువకుడు ఎక్కడో కొంచెం దూరాన ఉన్న ఉద్యోగపుటూరునించి స్వగ్రామం వచ్చాడు వోటెయడానికి .. అతని పేరు లిస్టులో కనబడక పోయేప్పటికి కోపమొచ్చి కొంచెం ఆవేశ పడ్డాడు. ఏజెంట్లూ అందరూ కాస్త జాగ్రత్తగా వెదికితే పేరు దొరికింది అనుకుంటా. రెండో విషయం .. పని ముగిశాక ఆ కాయితాలూ అవన్నీ ఒక కేలికో బట్టలో చుట్ట చుట్టి దానిమీద లక్క ముద్ర వెయ్యాలి. లక్క కరగబెట్టి వెయ్యడంలో ఒక చుక్క నా ఎడమచేతి మీద పడి, ఆ మేర తోలూడిపోయింది. చిన్న మచ్చ ఇంకా ఉంది. అంతే .. డ్యూటీ గురించి నాకు గుర్తున్నది.

@దుప్పలరవి .. మీరు చెప్పిన గ్రామం గురిచి చదివి చాలా సంతోషం కలిగింది.
మీ ఎలక్షన్ డ్యూటీ కబుర్లు చదువుతుంటే మా అమ్మ కష్టాలు గుర్తొస్తున్నాయి.. నాన్న సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఆయనకీ బాధల్లేకపోయినా అమ్మకి ప్రతి చిన్నా చితకా ఎలక్షన్స్ కీ డ్యూటీ పడేది.. కొన్నిసార్లు విజయవాడ, చుట్టుపక్కల ఊళ్ళల్లోనే అయినా 4,5 సార్లు మేము అప్పటివరకూ వినని ఊళ్ళల్లో పడింది.. మానాన్న కూడా వస్తానంటే ఒప్పుకునేది కాదు, ఇంటిదగ్గర మమ్మల్ని చూసుకోవాలని.. ఓ ఇంత పులిహోర, పెరుగు చేసుకుని ముందురోజు రాత్రికల్లా వెళ్ళిపోయేది.. మళ్ళీ తిరిగి రావడం మరుసటిరోజు రాత్రి ఏ పది, పదకొండింటికో! తనని చూడగానే మా ప్రాణాలు లేచివచ్చినట్లనిపించేది! మానాన్నేమో 'ఇకనించీ చేయనని చెప్పేయ్.. కావాలంటే ఓ మెడికల్ సర్టిఫికేట్ ఇవ్వొచ్చు ' అంటే మా అమ్మ 'ఇలాంటి ఊళ్ళల్లో బయటనించి వచ్చిన ఆడవాళ్ళని ఎంత బాగా చూసుకుంటారో తెలుసా!' అనేది..

ఇంతకీ ఆ ఇరవై పెట్టి ఎన్ని/ఏవేం సినిమాలు చూశారో గుర్తుందా? :-)
Bolloju Baba said…
నాలుగు బేట్రీల టార్చిలైటుతో

ప్రస్తుతం సెల్ ఫోను లైటును వాడుతున్నాం.
ఎలక్షన్ల క్షతగాత్రుడు
శబాష్ శబాష్
పరిస్థితులు, పద్దతులూ ఏమీ మారలేదు.

భలే ఉన్నాయి మీ ముచ్చట్లు.
అబ్రకదబ్రగారు
ఆ విషయంలో నాదీ భస్మాసురహస్తమే. :-)
అందరిలా ఆలోచించలేకపోతున్నానే అన్న బెంగొకటి.
Unknown said…
గురువు గారూ,

అది 1986 అని నా నమ్మకం. ఈ లెక్కన మీ పుట్టిన సంవత్సరం 1964 లేదా 1965 అయి వుండాలి :)
కాముధ said…
మా నాన్నగారు ప్రతీ ఎలెక్షన్ కి PO గానో APO గానో వెళ్ళేవారు.

ఏప్పుడు పేర్లు వినని ఊళ్ళు కూడ వెళ్ళే వారు. ఒక సారి అరకు దగ్గర ఒక ఊరి కి వెళ్ళినప్పుడు అతనిని పాము కరిచింది కూడా. అక్కడ ఉండే కొండ వాళ్ళే పసరు మందులు వాడి బ్రతికించేరు.

అది తల్చుకుంటే ఇప్పడికీ భయం వేస్తుంది.

కాముధ
గురువుగారూ, మీరు తాడిగిరి పోతరాజుగారి కథ "ఎర్రబుట్ట"ను చదివినారా? అచ్చంగా మీ కథే! ఇంకో దశాబ్దం వెనకటి కథ కావచ్చు. అప్పటికీ ఇప్పటికీ పెద్ద మార్పులేమీ లేవనే అనిపిస్తుంది ఎన్నికల అధికారుల బాధలు దినపత్రికల్లో చూస్తూవుంటే.
@నిషిగంధ .. బాగుంది.
@నేనుసైతం .. మీ అంకగణిత పరిజ్ఞానం మీద నాకు పూర్తి నమ్మకముంది.
@కాముధ .. సంతోషం.
@రానారె .. ఈ కథ చూళ్ళేదు. ఏదన్నా సంకలనంలో దొరుకుతుందా?
భలే కబురు. నాకూ ఓ ముచ్చటవుంది. మావూరి పంచాయితి ఎన్నికలకి బూషియ్య మావయ్య గారి రాజా బావ ఒకప్రక్క, రవి బావ మరొక ప్రక్క మద్దతు ఇచ్చారు. మా బుజ్జి వదినకి వోటుహక్కువచ్చింది కాని ఆ సమయానికి తను వూర్లో లేదు. అప్పుడే వోణీ వేసుకుని కాస్త కాళ్ళబారుగావున్న నన్ను రవి బావ "పదవే బుజ్జి వోటు నువ్వేసేద్దిగాని" అని మా అమ్మమ్మ గారు వద్దన్నా లాక్కుపోయాడు చివరి నిమిషంలో రవి బావ వచ్చి నానా యాగీ చేసి "ఏమే ఇంతాదానివయ్యావా, పోలీసులకి పట్టివ్వనా" అని బెదిరించగానే అక్కడే కూలబడి ఒకటే ఏడుపు, ఆ ఏడుపులోనే "దేవా వీడు వాడు కూడా చచ్చిపోవాలి" అని మొక్కుకున్నా. తర్వాతి కొద్ది సంవత్సరాల్లో ఆ ఇద్దరు కూడా చిన్న వయసులోనే ఒకరివెనుక ఒకరు పోయినపుడు మాత్రం చాలా బాధపడ్డాను. ఒకవేళ నా ప్రార్థన తాలూకు ప్రభామేమోనని కాస్త అపరాధభావం కూడా కలిగింది.
మీ అనుభవం బాగుంది ,అంతకన్నా మీ కధనం చాల బాగుంది .స్వచ మైన నెయ్యి వడ్డన చెయ్యడం మానేసి ఆంద్ర రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడో నా చిన్నప్పుడే మానేసారే !!!మీరు చాల లక్కి సార్, అదీ దోసకాయ పచ్చడితో ఆకలిమీదున్నప్పుడు అభినందిస్తూ ..... నూతక్కి
గురువు గారూ..
బావున్నాయి మీ ముద్దర్ల ముచ్చట్లు. టైటిల్ భలేగా పెట్టారు ;)
ఇంత విశదంగా ఎలక్షన్ డ్యూటీ గురించి వినడం ఇదే మొదటిసారి.
మీరు వివరించిన తీరు చాలా ఆకట్టుకుంది. వీడియో ఊహించేసుకున్నా నేను :)
Anonymous said…
కొత్త పాళీగారూ,

బాగున్నాయండీ మీ బాపట్ల ముచ్చట్లు. బాపట్ల అప్పటికీ ఇప్పటికీ సాపేక్షంగా ఎదిగినప్పటికీ మేము మాత్రం దాన్ని ఇంకా కుగ్రామంగానే పరిగణించేవాళ్ళం. నాకయితే అసలు సోదిలోనే ఉండేది కాదు. మా ఊరు పక్కనే తెనాలి కావటముతో ఏ పనిపడినా తుర్రుమని తెనాలి వెళ్ళిపోవటమే. నీళ్ళ కష్టాలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఇక కాలేజి రాశిలో విద్యార్థులు పెరిగారుకానీ పేరు అంత బాగాలేదిప్పుడు. 1996లో కెమికల్ ప్రారంభించారు.2010లో అయ్యిందనిపించాను. ఇప్పుడు నివాసం యు.కె (నేనే అప్పుడప్పుడూ గిల్లి చూసుకుంటాలెండి నేనేనా యు.కెలో ఉన్నది అని) (MS Sustainable Waste Management) ఇప్పుడు దాదాపు 9 బ్రాంచిలు అందుబాటులో ఉన్నాయి.