కబుర్లు - మార్చి 17

ఏమానందము భూమీతలమున

పలికెడునవె పక్షులు బ్రాబలుకులొ
కల హైమవతీ విలసన్నూపుర
నినాదములకున్ అనుకరణంబులొ

కొమ్మల కానందోత్సాహమ్ములు
ముమ్మరముగ మనముల గదలించెనొ
తలనూచుచు గుత్తులు గుత్తులుగా
నిలరాల్చును బూవుల నికరమ్ములు

అంటూ మొదలుపెడతారు పుట్టపర్తి నారాయణాచార్యులుగారు తన శివతాండవ వర్ణనాలాపనను. అరవై మీరిన ఉష్ణోగ్రతలో మా వూరి భూమీతలము కూడా ఇలాగే పరవశిస్తోంది నిన్నా ఇవ్వాళ్ళా. ఇంకా గుత్తులు గుత్తులుగా పూవులు ఇలరాల్చే సన్నివేశం రాలేదు గానీ, తరువులన్నీ శీతాకాలపు ముసుగులు విదిల్చి కొత్త చివుళ్ళు తొడుగుతున్నాయి కచ్చితంగా. ఆ సంబరంలో క్షణం సేపూ నేనూ సొక్కి సోలి ఒక రోజు కబుర్లాలస్యమైనందుకు విజ్ఞులు క్షమించగలరు.

ఇహ ఇదే వింటర్కి వీడ్కోలు అని తనువులోని అణువణువు కోరుకుంటున్నా మనసులో ఏమూలో దాగిన డౌటింగ్ థామసొకడు మేనెల వచ్చేదాకా ఈ ఉత్సాహాన్ని కాస్థ అదుపులో ఉంచమని హిత బోధ చేస్తున్నాడు. House smearing, not festival!

నాకు యద్దనపూడి సులోచనారాణి నవల్లంటే చాలా ఇష్టం. అందులో నాకు అతిగా నచ్చిన నవల కీర్తి కిరీటాలు. తేజ అనే వాడు హీరో ఇందులో. తేజా వాళ్ళమ్మ గొప్ప గాయని. తన కెరీర్ కోసం తేజ వాళ్ళ నాన్ననీ, తేజానీ వొదిలేసి విదేశాలకి వెళ్ళిపోయి అక్కడ ఇంకో పెళ్ళి చేసుకుని బోలెడు డబ్బూ ఖ్యాతీ అవన్నీ సంపాయించుకుందావిడ. ఇక్కడ తేజా కూడా బాగానే పెద్దవాడయ్యాడు, తన సొంత వ్యాపారం నిర్వహించుకుంటున్నాడు, కానీ వాళ్ళమ్మని చాలా ఛాలా మిస్సయ్యాడు పాపం. ఎనీవే, ఇప్పుడు నవల కథంతా చెప్పలేను గానీ, క్లైమాక్సులో వాళ్ళమ్మ ఆస్పత్రిలో చావుబతుకుల్లో ఉందనీ, తను అక్కడే ఉన్నాడని తెలిసి తనని చూడాలని అడుగుతోందనీ తెలిసి .. తేజా ఏం చేశాడు? ఆ తల్లిని క్షమించాడా?

ఈ క్షమా గుణం ఒకటీ, త్యాగాలు ఒకటీ నాకస్సలు అర్ధం కావు. స్వార్ధం అనండి, ఇట్టే అర్ధమవుతుంది. స్వలాభం అనండి, కరతలామలకం. కానీ త్యాగం .. క్షమ ..? అందుకే నాకు మిస్సమ్మ పెంపుడు తలిదండ్రులు అర్ధం కాలేదు.

తేజాకి అన్నేళ్ళ పాటు, ఆ పసి వయసు నించీ, టీనేజి మీదుగా .. యుక్తవయసులోకి ఆ ప్రయాణంలో .. మా అమ్మ నేను వెళ్ళాలనుకున్నా సినిమాకి వెళ్ళద్దంటేనే నా గుండె రగిలి పోయేదే! తేజాకి ఎంత రగిలి పోయుండాలి, కడుపూ గుండే అన్నీనీ.. ఆ ఒక్క క్షణంలో వాడి మనసు మారి పోయిందంటే, క్షమించేశాడంటే .. ఎవడన్నా వెర్రి కుట్టె నమ్మాలి గానీ, నేను కాదు. రియలిజమంటే ఇలా ప్రాణం పెట్టే నేను .. నిజజీవితమే తిరగబడి నా అంచనాలని తారు మారు చేసేస్తే .. మనుషులు, మామూలు మనుషులే .. స్వభావ విరుద్ధంగా ప్రవర్తిస్తే?

జెన్నిఫర్ అనే తెల్ల అమ్మాయి. మనుషుల్లో నలుపు తెలుపు విభజన రేఖని స్పష్టంగా అమలు జరిపే భూభాగమైన ఉత్తర కెరలైనా రాష్ట్రంలో .. ఒక మగపశువు చేత బలాత్కారానికి గురైంది. పోలీసులు ఆమె యెదుట నిలబెట్టిన వరుసలోంచి రోనాల్డ్ అనే నల్లబ్బాయిని చూపించింది, వీడే నన్ను రేప్ చేసినవాడు అని, నిర్భయంగా, నిస్సంశయంగా. రోనాల్డ్ ఖైదుకి .. జెన్నిఫర్ చిరిగిన తన జీవితానికి .. దాన్ని మళ్ళి చిగురింప చేసుకోవడనికి ప్రయత్నిస్తూ.

పదకొండేళ్ళ తరవాత, కొత్తగా కనిపెట్టిన డీఎన్యే విశ్లేషణ పద్ధతుల్లో ఎందుకో మళ్ళీ విచారణ తెరిచి చూస్తే, ఆ ఘాతుక చర్య చేసినవాడు రోనల్డ్ కాదని నిస్సంశయంగా కచ్చితంగా తేలింది. ఒకటి కాదు రెండు కాదు పదకొండేళ్ళ జీవితం జైలుపాలు, అందులో నిండు యవ్వనంలో, ఒక తప్పుడు ఆరోపణ వల్ల.

ఇప్పుడు ఎవరు ఎవర్ని క్షమించాలి? అసలు ఎవరైనా ఎట్లా క్షమిస్తారు?

వాళ్ళ మాటల్లోనే వినండి!

క్షమ .. forgiveness!!

Comments

నా ఉద్దేశంలో 'క్షమించగలగటం' కుడా 'మతిమరుపు' లాంటి ఒక వరమే మనిషికి!
మనం బాగా ఇష్టపడే, ప్రేమించే వ్యక్తి ఒక తప్పు చేస్తే అప్పుడు మనం ఏం చేస్తాం? కోప్పడతాం... బాధపడతాం... తర్వాత క్షమించేస్తాం... సర్డుకుపోతాం... మెల్లిగా ఆ సంగతి మర్చిపోతాం.

సులోచనారాణి గారి నవలలో హీరో ఏం చేసాడో నాకైతే తెలీదు కాని... నా ఊహ ప్రకారం మాత్రం ఖచ్చితంగా తల్లిని క్షమించి తన దగ్గరకి వెళ్ళే ఉంటాడు. ఒక వ్యక్తి చివరి దశలో ఉన్నారని తెలిసి కూడా పంతానికి పోవటం ఎంత వరకు కరెక్ట్!? బాల్యంలో తను తల్లిని ఎంతగా మిస్ అయి ఉంటాడో ఆ అబ్బాయికి తెలుసు కదా... ఆ బాధ ఎంత తీవ్రంగా ఉంటుందో తెలిసిన మనిషి తన వలన మరొకరు అలంటి బాధనే పడుతుంటే చూసి ఊరుకోగలడా!? ఆ సందర్భంలో అయితే తేజ తల్లిని క్షమించి తన దగ్గరకి వెళ్ళటమే న్యాయం అనిపిస్తుంది నాకైతే.

జెన్నిఫర్, రోనాల్డ్ ల విషయంలో మాత్రం... ఆ అమ్మాయి చేసింది క్షమించరాని నేరమే! ఏం చేసినా అతని 11 ఏళ్ళ జీవితాన్ని తిరిగి తెచ్చివ్వలేం కదా!
asha said…
క్షమను ఇంకో కోణంలో కూడా చూడొచ్చు. మనం అంతగా ప్రేమించని వ్యక్తులను సులభంగానే క్షమించగలుగుతాము. తేజ తన తల్లిని ఎప్పుడో వదిలేసుకున్నాడేమో మనసులో. అందుకే అలా క్షమించగలిగాడేమో. ఈ కోణంలోనుండి చూస్తే క్షమించబడటం కూడా బాధగానే ఉంటుందేమో.
ఇంక రెండో విషయంలో ఆమె కావాలని అతనిని జైలులో పెట్టించలేదు. పొరపాటున పెట్టించింది. కానీ, మామూలుగా అయితే ఓ మనిషి ఇవన్నీ ఆలోచించలేడనుకోండి. ఆ పదుకొండు సంవత్సరాలూ అతన్ని అలా తయారుచేసాయేమో మరి.
ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఆమె తనను మానభంగం చేసిన అసలు వ్యక్తిని క్షమించటం. తనని ఒకరు క్షమించటం వల్ల ఇంకో వ్యక్తిని తను క్షమించటం.
క్షమ అంటే నాకు కూడా తెలియదు. అది లేకపోవటం వల్ల మనశ్శాంతి కోల్పోతామని తెలిసినా, ఇప్పటికీ అదేంటో తెలుసుకోలేకపోయాను.
భావన said…
ఏమోనండి నాకు మటుకు త్యాగం,క్షమ అంటే దాసరి నారాయణ రావు గారు, నాగేశ్వర రావు గారు, ఈ బ్యాచ్ అంతా గుర్తు వస్తారు. చలం గారి భాష లో చెప్పలి అంటే మనకు అఏ మోటివ్ బలం గా వుంటే అది చేస్తాము ఆటోమేటిక్ గా ఇంకోటి త్యాగమైపోతుంది.. మంచి పోస్ట్.... ఎన్నో ఆలోచనలను ఆవేశాన్నీ రేకెత్తిస్తాయి మీ పోస్ట్ లు...
Anonymous said…
"నాకు యద్దనపూడి సులోచనారాణి నవల్లంటే చాలా ఇష్టం.",అని మీరన్నందుకు ఆశ్చర్యం!
".. ఎవడన్నా వెర్రి కుట్టె నమ్మాలి గానీ, నేను కాదు. రియలిజమంటే ఇలా ప్రాణం పెట్టే నేను" ?!
@నెటిజెన్ .. ఎందుకూ ఆశ్చర్యం? కథని నడిపించడంలో, పాత్రల మనస్తత్వ చిత్రణలో యద్దనపూడి చేతిలో ఉన్న నేర్పరితనం తెలుగు నవలా రచయితల్లో చాలా అరుదుగా కనిపిస్తుంది.
రియలిజమంటే ప్రాణం పెట్టినంత మాత్రాన యద్దనపూడి నచ్చకూడదని మీరు సూత్రీకరించారా? నాకర్ధం కాలేదు.
మురళి said…
జెన్నిఫర్, రోనాల్డ్ ల గురించి ఆలోచిస్తున్నానండి.. ముఖ్యంగా రోనాల్డ్ కోల్పోయిన జీవితం గురించి..
karthik said…
నాకు తెలిసినంత వరకు క్షమించడం అంటే, జరిగినది వదిలేసి/మర్చిపోయి వాళ్ళను తిట్టకుండా ఉండటం.
ఇది కూడా కేవలం మనిషికి మాత్రమే సాధ్యం అని నా అభిప్రాయం. ఎందుకంటే మిగత అన్ని జంతువులు తమకు హాని కలిగించిన వాళ్ళకి హాని చెయ్యాలని చూస్తాయి. మనిషి మాత్రం చెయ్యకుండా ఉండగలడు.

-కార్తీక్
@ karthik .. మీరు పొరబడ్డారు. జంతువులు తమపైన దాడి జరిగినప్పుడు తమని తాము రక్షించుకోడానికి పోరాడతాయి. దాడి జరిగి పోయినాక పని గట్టుకుని తనని గాయపరచిన వాళ్ళ మీద పగ పెట్టుకోవు. పాము పగ ఇలాంటివన్నీ కట్టు కథలు. ఒక బాధని గుర్తు పెట్టుకుని ద్వేషించడమూ, దాన్ని అధిగమించి క్షమించడమూ .. రెండూ మనిషికే.
"క్షమ" సంగతి నాక్కూడా అర్థం కాదండీ!కానీ ఎన్నాళ్ళని ద్వేషాన్నో, పగనో మనసులో పెట్టుకోగలం? కొన్నాళ్ళకు మర్చిపోయి మామూలుగా ఉంటామనుకోండి. దాన్నే క్షమ అనొచ్చా లేక మరుపనొచ్చా? ఇది మానవ సహజం కదా! ఇలాంటి confusionsవల్ల క్షమ నాకు సరిగా అర్థం కాదు!
Unknown said…
ఈ మధ్య మీ కబుర్లు చప్పగా ఉంటున్నాయి. మీకు యద్దనపూడి నచ్చడమేమిటో మాకు అర్థంకావడం లేదు. యద్ధనపూడి ఆడవాళ్ళకి నచ్చే రచయిత్రి. కొంచం కబుర్లు రూటు మార్చండి
@సుజాత, చైతన్య .. క్షమ, మరుపు ఒకటి కాదు.

@ మురళి .. ఈ ఆడామగా వర్గీకరణలు ఒకప్పుడు ఒప్పలేదూ, ఇప్పుడూ ఒప్పను. యద్దనపూడి నవలల్ని మెచ్చిన చేత్తోటే పల్ప్ ఫిక్షన్ సినిమాని కూడా మెచ్చుతా. కబుర్లు చప్పబడటం సంగతంటారా, మార్చేద్దాం, దానికేం? ఎట్లా మారుద్దామో చెప్పండి.
karthik said…
నిజమే, జంతువులు పగ పట్టవు.

-కార్తీక్
very inspiring!! ఉత్తర కెరోలీనా మీద మీ దారుణమైన జెనరలైజేషన్ బాగోలేదు
@రవి .. నిజమే, నాకూ బాగోలేదు!:)
Sharada said…
నాకు భలే నచ్చింది, house smearing, no festival :)) Cool sense of humor!!
మురలీ గారు,
అలా జనరలైజ్ చేసెయ్యకండి! యద్దనపూడి నవలలు నాకు నచ్చవు.పేజీలకొద్దీ వర్ణన, ఎంత వెదికి చూసినా ఒక్కటి కూడా నిజజీవితంలో తారసపడని పాత్రలు,..ఇలాంటి కారణాల వల్ల!.ఆడవాళ్లందరికీ ఆమె ఆరాధ్య దేవతంటే నేనొప్పుకోను.
క్షమా, మరపు ఒకటి కాదు... నిజమే. "మరపు లాగా క్షమించగలగటం కూడా ఒక వారమే" అని మాత్రమే నా ఉద్దేశం.
ఒకరి వలన మనం పడిన బాధ లాంటిదే మన వలన మరొకరు(మనల్ని బాధ పెట్టిన వారైనా సరే) పడుతున్నారు అంటే చూస్తూ ఊరుకోగాలమా! ఆ బాధ ఎంతగా కలచివేస్తుందో తెలిసి కుడా క్షమించకుండా మనసులో కోపం (లేదా పగ) పెట్టుకుని చూస్తూ కుర్చోగాలమా!
but ofcourse... మనుషులంతా(రూపంలో) ఒకలా ఉండనట్టే... మనస్తత్వాలు కుడా ఒకలా ఉండవు కదా!
opinions vary from person to person.
kshamo,marupo lekundaa ade manasulo pettukoni mana life waste chesuko lemugaa.
@ సుజాత, మీరు మరీనండీ. సెక్రెటరీ రాజశేఖరమూ, మీనా కృష్ణ నాకు బెస్టు ఫ్రెండ్సయితేనూ! :)
@ చైతన్య .. నిజం.
@ మాల .. దయచేసి ఇక మీద వ్యాఖ్యలు తెలుగులో రాయండి.
మాలతి said…
ఈ క్షమా గుణం ఒకటీ, త్యాగాలు ఒకటీ నాకస్సలు అర్ధం కావు - నాక్కూడానండీ. ఇవన్నీ కథల్లోనే.
మంచి టపా రాసారు. అభినందనలు.
Anonymous said…
@కొత్తపాళీ: రియలిజానికి ఆమడ దూరం యద్దనపూడి నవలలు. కధని నడిపించడం లో ఆమెకున్న నైపుణ్యం జగమెరిగిన సత్యం - కాష్ చేసుకున్న ప్రొడ్యూసర్ల సాక్షిగా!
ఇక పాత్రల చిత్రీకరణ లో అంటారా - యండమూరి లాంటి వారే " కాపిరైట్" ఉన్నా, కాపికొట్టి పైకి వచ్చాం అని సగర్వం గా చెప్పుకున్నారు.
అది ఆ రచియిత్రి గొప్పదనం.

లేదు. రియలిజం నచ్చినంత మాత్రనా యద్దనపూడి నవలలు నచ్చకూడదు అని సూత్రికరించలేదు.
యద్దనపూడి నవలలో మీకు రియలిజం కనపడిందా అన్న సందేహం వచ్చింది? అంతే! నౌ ఇట్ ఈజ్ క్లియర్.