మీసము దిద్దరుగా ...

మీసానికీ తెలుగు పౌరుషానికీ అవినాభావ సంబంధం.

నాలుగో తరగతి తెలుగు వాచకంలో తిరుపతి వేంకటకవుల మీద పాఠంలో వాళ్ళు రచించిన మీసం పద్యం పువ్వుగుర్తు కాకపోయినా బట్టి పట్టేశాను.
ఉ. దోసమటంచె రింగియును దుందుడు కొప్పగ పెంచినారమీ
మీసము రెండు బాసలకు మేమె కవీంద్రులమంచు దెల్పగా
రోసము కల్గినన్ కవివరుల్ మము గెల్వుడు గెల్చిరేని యీ
మీసము తీసి మీ పద సమీపములం దలలుంచి మ్రొక్కమే.
(తెవికీకి నెనర్లు!)
శ్రీశ్రీ అంతటి మహాకవి (ఆయన సొంతానికి మీసం పెంచకపోయినా)మీసం గొప్పతనాన్ని పొగుడుతూ ఏకంగా సీసపద్యమే రాసేశాడు.
ఇహ తెలుగు ఆత్మగౌరవం, తెలుగు పౌరుషం అంటే అన్నగార్ని తలుచుకోకుండా ఎలాగ? విజయవాడ ఎస్సారార్ కాలేజిలో (మా యింటి వెనకాతలే) పీయూసీ చదివే రోజుల్లో విశ్వనాథ సత్యనారాయణగారి ఆధ్వర్యంలో పల్నాటి యుద్ధం నాటకంలో నాయకురాలు నాగమ్మ పాత్రకి ఎంపికయ్యి, స్త్రీపాత్ర కదా మీసం తీసెయ్యమని గురువుగారంటే, .. ఎంతైనా అప్పుడప్పుడే మొలుస్తున్న నూనూగు మీసం కదా .. నా పౌరుషానికి చిహ్నం తియ్యనని భీష్మించి, మీసాల నాగమ్మగా చరిత్ర సృష్టించాడు మహానుభావుడు ఆ రోజుల్లోనే.

పువ్వు పుట్టగనే పరిమళించును అన్నారు.
మనం కూడా అదే టైపు.

చిన్నప్పుడు నాకు పౌరాణిక సినిమాలంటే గొప్ప మోజు (చిన్నప్పుడనే ఏముంది లేండి, ఇప్పటికీని). కథల్లో ఉండే ఆసక్తి అలా ఉండగా, ఆ (మగ) పాత్రల కేశాలంకరణ నన్ను విపరీతంగా ఆకట్టుకునేది. ముఖ్యంగా జులపాలు, సైడు చెంపలేమో ముందుకి చిన్న రింగు తిరిగినట్టుగా .. ఇహ మీసాల సంగతి వేరే చెప్పనక్కర్లేదు. మహాభారత కథతో వచ్చిన సినిమాల్లో కేవలం మీసాల సైజు షేపు మార్పు వల్ల వివిధ పాత్రల్ని గుర్తు పెట్టుకునేట్టుగా తీర్చి దిద్దే వారంటే అతిశయోక్తి కాదు, నా దృష్టిలో. ధర్మరాజు మీసమూ, అర్జునుడి మీసమూ, దుర్యోధనుడి మీసమూ ఒక్కలా ఉండవు ఎప్పటికీ. భీముడికి మీసం లేకుండా చేశారన్న ఒక్క కారణం వల్ల దూరదర్శన్ మహాభారతాన్ని తీవ్రంగా నిరసించాను!

అఫ్కోర్సు, చూసొచ్చిన సినిమాల్లోని వీరోచిత ఘట్టాలన్నీ సాయంకాలపు ఆటల్లో మళ్ళీ పునస్సృజించక పోతే మన గొప్ప ఏముంది? పందిట్లోంచి పీకిన వెదురు బద్దతో విల్లు, చీపురు పుల్లల్తో బాణాలు .. కత్తులూ గదలూ .. ఇత్యాది ప్రాపులన్నీ కూడా తయారై పోయేవి గానీ మేకప్పుతోనే వచ్చేది గొడవంతా. సరైన కేశాలంకరణ లేకపోతే పాత్ర మూడ్‌లోకి ఎలా రావడం? నాకు ఓ రెణ్ణేల్లపాటు కటింగక్కర్లేదు, ఎంచక్కా దుర్యోధనుళ్ళాగా జులపాలు పెంచుతాను అని ఒకశనారం రాత్రి భోజనాల్దగ్గర ప్రకటిస్తే, ఆ మర్నాటి ఆదివారమే మా అప్ప మమ్మల్ని అప్పారావు సెలూన్ కి తీసుకెళ్ళి డిప్ప కటింగ్ చేయించేశారు. మా అమ్మ సవరం మీద కన్నేశాను గానీ, అప్పటికే బుడుగు పుస్తకం చదివున్న మా అమ్మ .. నా సవరం ముట్టుకున్నావంటే వీపు చీరేస్తా అని వార్నింగిచ్చింది. అంతేకాక, మీ మీ సవరాల్ని జాగ్రత్త చేసుకొమ్మని పక్కింటి పిన్నిగార్లందర్నీ కూడా హెచ్చరించేసింది.

అలా జులపాల ఆశలన్నీ అడియాసలు కాగా, సరే, అసలు పాత్ర వ్యక్తిత్వం అంతా మీసంలోనే కదా ఉన్నది అన్చెప్పి కేశాలంకరణ వదిలి మీసాలంకరణ మీద దృష్టి సారించాను. బాయిలర్ కోసం నీళ్ళగదిలో ఓమూల బుట్టలో ఉండే మసి బొగ్గులు మా పాటి బంగారు కణికలయ్యాయి. కానీ బొగ్గు ముక్కతో తిన్నగా మూతి మీద మీసం దిద్దుకునేందుకు చచ్చే చావయ్యేది. చర్మానికి నలుపు పట్టేట్టు దిద్దాలి అంటే, బొగ్గు ముక్కని చర్మమ్మీద నాలుగైదు సార్లు రుద్దాల్సి వచ్చేది. అందులో మూతి మీద తోలు కొంచెం పల్చగానూ, సున్నితంగా ఉంటుంది గదా, మంట పుట్టేది. దానికి తోడు ఒక్కోసారి బొగ్గు మొక్క అంచులు బాగా మొనదేలి ఉండి కోసుకు పోయేది కూడా. మా సహదేవుడికొకడికి కోరమీసం దిద్దబోతుంటే ఇలా సన్నగా గీరుకుందని ఏడిచి వెళ్ళిపోయాడు. ఇహ ఇలా లాభం లేదని, సిమెంటు గచ్చు గరుగ్గా ఉండే చోట ముందు బొగ్గు ముక్కని మెత్తగా నూరి, ఆ పొడిని వేలి కొసల్తో మూతి మీదకి ట్రాన్స్ఫరు చేసేవాళ్ళం. ఇదీ అంత బాగా పని చెయ్యలేదు. మా పాత్రల వెరైటీకి కావలసిన మీసాల వెరైటీని ఈ వేలి కొసల ఆర్టుతో సృష్టించడం కష్టమై పోయింది. అర్జునుడి మీసాలూ దుర్యోధనుడి మీసాలూ, ఆఖరికి సహదేవుడి మీసాలూ ఒకేలాగుండేవి. అదీగాక, గచ్చంతా బొగ్గులు నూరి నల్లగా చేస్తున్నామని పనామె వెళ్ళి మా అమ్మకి ఫిర్యాదు చేసింది.

ఒకసారి పనీ పాటూ లేక ఇల్లంతా చక్కబెడుతుంటే, తలనూనే దువ్వెనలూ పౌడరూ ఇత్యాది సామాన్లుండే అలమారులో ఒక చిన్న గుండ్రటి నల్లటి డబ్బా నా కళ్ళని ఆకట్టుకుంది. అది మా అక్కయ్య తాలూకా ఐటెక్స్ కాటుక డబ్బా అని గనక మీరు కనిపెట్టేసి ఉంటే మీకు మీరు ఓ పది మార్కులేసేసుకోండి. ఇన్నాళ్ళూ బొగ్గుల్తో అవస్థ పడుతున్న రోజుల్లో అది నా కళ్ళ ఎందుకు పడలేదు అంటే, నా కళ్ళు ఆ సామాన్లుండే అర స్థాయిని అప్పుడప్పుడే అందుకుంటున్నా యన్నమాట. ఆహా .. భగవంతుడా ఏమి నీ లీల? ఈ భూప్రపంచంలో నావంటి వారి మీసార్ధం ఇలా సుతిమెత్తని ఐటెక్స్ కాటుకని సృష్టించావా! నీ సృజనశక్తి అమోఘమయ్యా అని మనసులోనే ధన్యవాదాలు చెప్పుకుని కార్యక్రమానికి ఉపక్రమించాను. ఈ మెత్తని నల్లని లేహ్య పదార్ధాన్ని సుతారంగా నా మూతి మీద మొలిపించడం ఎలా? ఆ సమస్య కూడా తీరిపోయింది .. ఎదురుగుండానే తిలకం సీసా. తిలకం సీసా లోపల, మూతకే యెటాచుడ్ గా తిలకం దిద్దుకునే ప్లాస్టిక్ పుల్ల కూడా ఉంటుంది. అది ఎల్లప్పుడూ తిలకం ద్రవంలో మునిగి ఉంటుంది కాబట్టి, దాన్ని చాలా జాగ్రత్తగా తీసి, ఒక పాత గుడ్డ పీలిక ఒకటి సంపాయించి, దాంతో పుల్లని శుభ్రం చేసి (మీసాల్లో ఎరుపు ఉండకూడదు కదా .. ప్లస్ తిలకం జాడలు కాటుక డబ్బీలో కనబడకుండా ఉండేందుకు కూడానూ ..) మా నట వర్గాన్ని రావించి రకరకాల మీసాలు దిద్దేశాను. అందరూ చాలా సంతోషించారు. మా బుల్లి సహదేవుడు మరీనూ. ఆ రోజు సాయంత్రం మా కురుక్షేత్రం బహు రక్తి కట్టిందని వేరే చెప్పక్కర్లేదు. అఫ్కోర్సు, నెలకి పైగా వచ్చే కాటుకడబ్బా వారం రోజులకే ఖాళీ అవడంతో మా అక్కకి దొరికి పోయి తొడపాశం తిన్నాననుకోండి.

తీరా నిజంగా మీసాలు మొలిచి అవి కాస్త మెలివేసేంత ఎదిగే నాటికి ఫేషన్లు మారిపోయి చిరంజీవి నమూనా స్లాంట్ కటింగ్ ఫేషన్ ఐపోయింది. ఇహ అక్కడ మొదలెట్టి తెలుగు హీరోలు, హిందీ హీరోలు, అంతర్జాతీయ హీరోలు (కొండొకచో విలన్లు), అటుపైన దేశవాళీ విదేశవాళీ క్రికెటర్లు .. ఇలా అనుసరించాల్సిన ఫేషన్లన్నీ అనుసరించాక .. ఇన్నాళ్ళకి .. ఇవ్వాళ్ళ పొద్దున మొహం కడుక్కుంటూ అద్దంలో చూసుకుంటే ... నల్లగా తుమ్మెద రెక్కల్లాగా కాటుక చారలాగా నిగనిగ లాడాల్సిన మీసకట్టులో డజనుకి తక్కువకాకుండా వెండి తీగలు మెరిశాయి. కళ్ళు బైర్లు కమ్మాయి. మా ఆవిడ ఏ అలమార్లోనన్నా ఏ మూలన్నా ఐటెక్స్ కాటుక డబ్బా దాచి ఉంచిందేమోనని పొద్దున్నుంచీ వెతుకుతున్నా!

Comments

మీరు బొగ్గు గురించి రాసింది చదువుతుంటే అనుకున్నా. అరే! కాటుక డబ్బీ ఉందిగా ఎందుకన్ని తిప్పలు అని.
మీ ఆవిడ కాటుక పెట్టుకుంటుందా. ఐలైనర్స్ వాడతారు కదా చాలా మంది. ఇక్కడినుండి కాటుక డబ్బీలు పంపమంటారా??? :)
"పువ్వు పుట్టగనే పరిమళించును అన్నారు. మనం కూడా అదే టైపు."

"మా అమ్మ సవరం మీద కన్నేశాను గానీ, అప్పటికే బుడుగు పుస్తకం చదివున్న మా అమ్మ .. నా సవరం ముట్టుకున్నావంటే వీపు చీరేస్తా అని వార్నింగిచ్చింది."

"ఆహా .. భగవంతుడా ఏమి నీ లీల? ఈ భూప్రపంచంలో నావంటి వారి మీసార్ధం ఇలా సుతిమెత్తని ఐటెక్స్ కాటుకని సృష్టించావా! "
:))))
టపా కేక! ఎండింగ్ సూపర్..
btw, ఇప్పుడు డబ్బాలు రావట్లేదు కానీ బుల్లి సీసాల కోసం వెతకండి :-)
ఇలా అనుసరించాల్సిన ఫేషన్లన్నీ అనుసరించాక .. ఇన్నాళ్ళకి .. ఇవ్వాళ్ళ పొద్దున మొహం కడుక్కుంటూ అద్దంలో చూసుకుంటే ... నల్లగా తుమ్మెద రెక్కల్లాగా కాటుక చారలాగా నిగనిగ లాడాల్సిన మీసకట్టులో డజనుకి తక్కువకాకుండా వెండి తీగలు మెరిశాయి. కళ్ళు బైర్లు కమ్మాయి. మా ఆవిడ ఏ అలమార్లోనన్నా ఏ మూలన్నా ఐటెక్స్ కాటుక డబ్బా దాచి ఉంచిందేమోనని పొద్దున్నుంచీ వెతుకుతున్నా!

సూపర్...

ఐటెక్స్ కంటే ఐబ్రో పెన్సిల్ బెటర్ కదా సార్..
బాగుంది గురువు గారూ.. మీ 'మీసమోపాఖ్యానం'..!
Anonymous said…
అదిరిందండీ మీ టపా. మేం కూడా చిన్నప్పుడు పౌరాణిక సినిమాలు చూసొచ్చి ఇంట్లో బాణాలు తయారు చేసి చీపురు కట్టలు అవగొట్టేసేవాళ్ళం. కానీ మీసాల జోలికి ఎప్పుడూ పోలేదు లెండి.
Chari Dingari said…
టపా...అమోఘం ......
మీసము దిద్దరుగా.....ఐటెక్సు మీసము దిద్దరుగా

బాగుంది.
Anil Dasari said…
టీనేజిలోనూ, కాలేజిలోనూ 'మీసము పోయిన మాసమున మొలుచును, తీసెయ్‌రా' అని స్నేహితులు ఎన్నిసార్లు పోరినా నా మీసమ్మీద బ్లేడు పడనీలేదు. నెలపాటు రోషం లేకుండా బ్రతకటమా? నెవర్. ఇప్పటికీ, నావి 'పుట్టు మీసాలే'.

మీ మీసోపాఖ్యానం సీసమంత అందంగా ఉంది.
మీస మంటె జుట్టు కాదోయ్‌
మీసమంటే పురుషుడొయ్‌
తెల్ల దైతే బాధ లేదోయ్‌
కళ్ళ కాటుక వాడవోయ్‌
కొత్త పాళీ బాట మనదోయ్‌
బాధ వెనకకి నెట్టవోయ్‌

హ్హ హ్హ హ్హ బాగా చెప్పారు
Padmarpita said…
మీ కధకి మెచ్చి మీ మీసాలు దిద్దుకోడానికి నాతరపు నుండి ఓ డజను ఐబ్రోపెన్సిళ్ళన్ని పార్శిల్ పంపుతున్నాను స్వీకరించ ప్రార్ధన.
చాల బాగుంది. హస్యభరితంగా ఉంది.

కం. మీసము గురించి చెప్పగ
మీ సములు గలరె? చదివితి మీసపు పాట్లన్!
వేసములన్నియు చూడగ
మీ సంబంధము చకితము మీసము తోడన్!!
చాలా బాగా రాసారు అండి :)
కం//
ఝూటా మీసం కోసం
'బాటా' పోలిష్‌ని వాడు పైగా రోజూ
'రీటా' నూనెను రాసిన
నీటుగ మీసం నలుపుగ నిగనిగ లాడున్ :-)
మెచ్చిన మిత్రులందరికీ థాంకులు.
ఐలైనర్లు, ఐబ్రో పెన్సిళ్ళు .. నేను కనీ వినీ ఎరుగని మేకప్ప్రపంచాన్ని ఆవిష్కరిస్తున్నారుగా! :)
@ అబ్రకదబ్ర .. పుట్టుమీసములా? :)
@ ఆత్రేయ .. మీకు ముత్యాల సరాలు బాగా పట్టుబడుతున్నాయని మీ బ్లాగులోనే ఒకసారి కామెంటినట్టు గుర్తు. సరాల సూత్రాల్ని పట్టేసినట్టున్నారే?
@సత్యనారాయణ గారు .. మీ విరుపులు బాగున్నాయి.
@పుష్యం .. "బాటా" పద్యంలో ప్రాసకి కుదిరింది గానీ నల్ల పాలిష్ కి ఛెర్రీ బ్లాసందే పెట్టింది పేరు. ఈ ప్రయోగం .. అనుభవంతో చెబుతున్నారేంటి? :)
మేధ said…
టపా మరియు సిరిసిరిమువ్వ గారి కామెంట్ సూపర్ :))
హ హ హ :) భలే ఉందండీ మీ మీసమోపాఖ్యానం.
Unknown said…
గురువు గారు.. ఎంత నవ్వించేశారండీ. పడీ పడీ నవ్వేశాను.
@కొత్తపాళీ.. నా ఓటు కూడా చెర్రీ బ్లాసమ్‌కే..
@అబ్రకదబ్ర....

ఆ.వె//
మీసమూడినంత రోసము పోదయా
జుట్టు నెరసినంత పట్టు పోదు
తోక లేని పులికి తేకువ తక్కువా
తరచి చూచినంత ధరణి లోన!!
రాఘవ said…
మీరు జులపాల గురించి చెప్తూంటే నాకు చిలకమర్తివారి గణపతి గుర్తొచ్చింది. మీరు అప్పటికి గణపతిని చదవలేదేమో అని కూడ నిర్ధారించేసుకున్నాను. లేకపోతే ఆముదపు డబ్బా ఖాళీ అయ్యికూర్చునేది.

***

నాగమురళిగారిలాగే మేం కూడా చిన్నప్పుడు ధనుర్బాణాలు చీపురుపుల్లలతో చేసి పుస్తకాల ముఖపత్రాలపై చక్కగా సున్నాలు చుట్టి చీపురు అనే అక్షయబాణతూణీరం నుండి బాణాలు సంధించి వినోదించేవాళ్లం. బాణం గమ్యాన్ని ఛేదించిందా లేదా అన్నది అనవసరం. కానీ మరీ మీ ఇంత సృజనాత్మకత లేదు లెండి.

***

వ్యాఖ్యల్లో ఒకరిద్దరు పద్యాలు పట్టేవరకూ నాకు చెప్పేవిషయం ఛందస్సులో చెప్పచ్చని తోచనేలేదు. ప్చ్... ఐతేనేం? కాస్కోండి మరి --

జులపాల కోసమై జుట్టుకు ఆముదం పామాడు గణపతి బాల్యమందు
చిలుకమర్తిని మీరు చిననాట చదువక తెలియకుండినదేమొ దీని గూర్చి
మురళిగారికిమల్లె మురియంగ చీపురు పుల్లల బాణాలు పుల్లవిల్లు
అడ్డు అదుపులేక ఆడిపాడి తిరిగి అలసి సొలసి తిరిగి కిలకిలమని

నవ్వుతూ తుళ్ళి గెంతుతూ నాట్యమాడి
సంబరాలను వీథిలో చాల చేసి
హాయినుంటిమి గాని మీయంత కాదు
మేమెపుడు తలుపగలేదు మీసములను

ఇప్పుడు ఇది కూడా సీసమై కూర్చుంది ;)
కొత్తపాళీ గారూ,
"పువ్వు పుట్టగనే పరిమళించును అన్నారు.
మనం కూడా అదే టైపు."
మేము కూడా అదే టైపు. :-)

మీ టపా చదువుతుంటే మేము చిన్నప్పుడు ఆడుకొన్న ఆటలు గుర్తొచ్చాయి. ఒక సారి ఇలాగే బాణాలతో ఆడుకొంటున్నప్పడు మా అన్న పుల్ల బాణం తో నా పొట్టకి కొట్టాలని సరదాపడ్డాడు. నాభి, నేత్రం ఒకేలాగ కనబడ్డాయి మా వెధవాయికి.....
కట్ చేస్తే............,, నేను ఐ హాస్పిటల్ లో ఉన్నాను
మాలతి said…
:):) మీసము గూర్చి చెప్ప మీ సములు మీరే, మీసరి లేరు వేరెవరూ ...
బాగుందండి. మా నానమ్మ + అమ్మమ్మా ఇద్దరూ కట్టకట్టుకుని చెప్పేవారు - మీసం, మొలతాడు లేనివాడు మగవాడే కాదని :) కనుక సార్ల్, అందరూ ఒకసారి సరి చూసుకుని ఎవరి మార్కులు వారే వేసుకోండి. హహహ్హా పోతే ఇకా వెండికి నలుపులద్దటం పాత రోజుల్లో. ఎరుపులడ్డటం నేటి మోజు. కాసినన్ని గోరింట పొడి పొట్లాలు పంపేదా మరి ;) ;) మళ్ళీ అదే నవ్వుని copy & paste చేయండిక్కడ.
Unknown said…
అయితే మీరు కూడా మీసంలో పలితకేశం బారిన పడ్డారన్నమాట! అయినా మీసమున్న మగాడికి ఎప్పుడైనా తప్పని అవస్థే యిది :-) ఇది చదివాక మరో కవిగారు ఇలాటి అవస్థే పడిన విషయం గుర్తుకువచ్చింది. ఆ కవి ఎవరో, ఆ కథేమిటో కేశంతో క్లేశంలో చదవండి!
Ramani Rao said…
బాగుందీ మీసాల జోరు. ఈ టపా +వ్యాఖ్యలు ఇక్కడ కాలేజ్ కుఱ్ఱకారు చదివితే బాగుండును. లేకపోతే నేనే ప్రింట్ చేసి కరపత్రాలు పంచేద్దామనుకొంటున్నా అనుమతిస్తారా కొ. పా గారు! ఈమధ్య కాలేజ్ దగ్గిర కుఱ్ఱకారుని ఎవరిని చూసినా మీసాల్లేకుండా జుట్లు పెంచేసి తిరుగుతున్నారు ఇప్పటి ఫాషనిదే అంటూ. ఇలా చెయ్యడమేమో కాని, ఎవరు అమ్మాయో? ఎవరు అబ్బాయే కనుక్కోడం కాస్త కష్టంగా ఉంది. ఏదేమైనా మీ మీసాలకి మీరు పడ్డ కష్టాలు కడుపుబ్బా నవ్వించేసాయి. నన్ను కూడా లెక్కేసుకొండి ఉడతా భక్తిగా ఓ ఐటెక్స్ కి, ఐలైనర్ కి ఇవేవి వద్దంటే మా ఇంటి పక్కనే సింగరేణీ బ్రాంచ్ ఉంది, నాణ్యమైన నల్ల బంగారం దొరుకుతుంది. ఓ బస్తా చాలా? పర్లేదు మీసాలకోసం అంటే అర్థం చేసుకొంటారు. మరెప్పుడు పంపాలో వివరాలు గట్రా మాట్లాడేసుకొందాము. తోటి బ్లాగరుగా అమాత్రం మీ బాధని అర్థం చేసుకొలేమా ఏంటి.. :-)

"మీసములు గురించి మీ సములు మీరే....." మాలతి గారు సుపర్బ్ గా ఉంది
This comment has been removed by the author.
Unknown said…
అద్భుతం, చీపురు పుల్లల భాణాలు, కత్తులు కళ్ళకి కట్టినట్టు కనిపించెయించెశావు!
బాగుంది శ్రీ నారాయణ స్వామి గారు. మీసాల గురించి ఇంత బాధ పడాలని తెలియదు. ఓ సారి మీసాల మీద నిమ్మకాయల ఫోటో చూసి, పెంచటం మొదలు పెట్టా. నిమ్మకాయలు కాదు కానీ, తినటం జాగ్రత్తగా లేకపోతె మనవరాళ్ళు వెక్కిరిస్తున్నారు. మీ భావాలు బాగున్నాయి.