Monday, March 31, 2008

కల్తీ లేని చెత్త

ఈ మధ్యన ఇంటలెక్చువల్ పుస్తకాలు చదవడమూ ఇంటలెక్చువల్ సినిమాలు చూడడమూ ఎక్కువై పోయింది, బుర్రలో కాస్త సమతుల్యత సాధించాలని చెప్పి వరస బెట్టి నాలుగు కొత్త తెలుగు సినిమాలు చూశా.

వార్నాయనో .. సమతుల్యత మాట దేవుడెరుగు, బుర్ర వాచి పోయింది!
ఈ చిత్ర రాజమ్ములు థియేటర్లలో రిలీజై చాన్నాళ్ళై పోయింది గాబట్టి అక్కడే బలై పోయిన వాళ్ళకి ఈ టపా ఏం చెయ్యలేదు, సంతాపం వెలిబుచ్చడం తప్ప. ఎప్పుడన్నా డిస్కులో చూద్దాం అని వాయిదా వేసుంటే .. ఈ టపా మీ ప్రాణాల్ని రక్షించే హెచ్చరిక అని గ్రహించండి.

యమగోల మళ్ళీ మొదలైంది
సుత్తి చెత్త! ఈ సినిమా ఎంత చెత్తంటే .. ఖాళీ బుర్ర జీవి గారు కూడా దీన్ని సమీక్షించడానికి సాహసించ లేదు.
కానీ ఒక్క మాట చెప్పాలి. ఇన్నాళ్ళూ తొట్టెంపూడి వేణుని చూసి అపహాస్యంగా నవ్వుకుంటూ ఉన్నా. వొట్టి బోరు గాడు, ఏమీ టేలెంట్ లేనోడూ అనే అర్ధంలో పాపం ఈ అబ్బాయి పేరుని విశేషణంగా కూడా ఉపయోగించా. కానీ ఈ అబ్బాయికి మన తెలుగుహీరోలకి చాలా మందికి లేని గొప్ప టేలెంట్ ఉంది - తెలుగు, వొత్తుల్తో సహా, చక్ఖగా మాట్లాడతాడు. నటన మానేసి, వొత్తులు పలకలేని వెధవాయలందరికీ సుబ్భరంగా డబ్బింగ్ చెప్పుకుంటే బెటర్. ఇహ నించీ అతని పేరుని పైన చెప్పిన అర్ధంలో ఉపయోగించనని ప్రమాణం చేస్తున్నా.

సీమ శాస్త్రి
బోరు చెత్త! ఒకడు కాదు, ఇద్దరు కాదు, తెలుగు సినిమాలో కామెడీ యాక్టర్లని పేరు పడ్డ మహామహులంధరూ ఉన్నారు. నాకు మాత్రం చక్కిలిగిలి పెట్టుకున్నా కొంచెం కూడా నవ్వు రాలేదు మూడు గంటల సినిమాలోనూ. అల్లరి నరేష్ పిల్లాడు పాపం ఏదో కష్ట పడ్డాడు కానీ ఈ బోరు హోరులో కొట్టుకుపోయాడు గోదారి వరదలో గడ్డిపోచలాగా.

చందమామ
చెయ్యి తిరిగిన దర్శకుడు తీసిన సినిమా కాబట్టి ఇది వీర చెత్త కేటగిరీలోకి వస్తుంది. రొయ్య మీసాల హీరో ఒహడు, పిల్లకళ్ళ హీరో ఒహడు. ఎనీమియాతో ఈ క్షణమో మరుక్షణమో సొమ్మసిల్లి పడిపోయేట్టున్న హీరోయిన్‌ ఒహత్తి. రెండో హీరోయిన్‌ సింధూ మీనన్‌ అట, పర్లేదు బానే ఉంది, ఏదో చేద్దామని ప్రయత్నించీంది, కథా, దర్శకుడూ చెయ్యనిస్తేగా. మొన్న ఆసిన్‌, నిన్న ప్రియమణి .. ఏదో పరశురామ క్షేత్రాంగనలే మన తెలుగు తెరకి కాస్త వెలుగిస్తారల్లే ఉంది. ఈ పిల్ల ఇంకేదన్నా మంచి సినిమాలో కనిపిస్తుందని ఆశిద్దాం. ఆహుతి ప్రసాద్ బానే చేశాడు గానీ ముత్యాలముగ్గు రావు గోపాలరావు ఇమిటేషన్‌ చాలా తీవ్రంగా ఉంది. నాకు తెలీకడుగుతానూ, నాగబాబుకి తాను నటించగలనని భ్రమపెట్టిన వాళ్ళెవరో? పోలీస్ ఇన్స్పెక్టరుగా సినిమా మొదట్లో ఒక పది నిమిషాలు కనబడే జీవా నటన ఒక్కటే ఇందులో ప్లస్ పాయింట్. అతగాడీ నటనా జీవితం ముగిసే లోపు అతని ప్రతిభకి తగిన పాత్ర ఎవరన్నా చేయిస్తే చూడాలని ఉంది. అన్నట్టు కొన్ని నెలల క్రితం నేను సమీక్షించిన గౌతమ్‌ ఘోష్ చిత్రం యాత్రా లో అతను గొప్ప ప్రతిభ కనబరిచాడు.
తుదిపలుకు: కృష్ణవంశీ ఇంక సినిమాలు తియ్యడం మానేస్తే మంచిది.

మంత్ర
ఇదసలు ఏ మాత్రం కల్తీలేని ప్యూరెస్టు చెత్త. ఎంత ప్యూర్ చెత్తంటే, ఎవరన్నా సినిమా తీస్తూ, అబ్భే మరీ బొత్తిగా చెత్తలేదు మన సినిమాలో, కొద్దిగా చెత్త ఉంటే బాగుంటుంది దిష్టి చుక్కలాగా అనుకుంటే, ఈ సినిమాని కొద్దిగా గిల్లి తమ సినిమాలో కలుపుకోవచ్చు. ఐనా అదే ఘాటెక్కి పోతుంది. అంత ప్యూర్ కాన్సన్‌ట్రేటెడ్ చెత్తన్న మాట.
తుదిపలుకు: ఛార్మీని తెలుగు సినిమాల్లో హీరోయిన్‌ చేసిన వాణ్ణి ఆర్టీసీ చౌరాస్తా నడిబొడ్డున కొరత వెయ్యాలి!

కంప్యూటర్ ఎరా చాట్ ద్వారా సాంకేతిక సహాయం

ముఖ్య గమనిక .. ఏప్రిల్ 1 న ప్రచురిస్తున్నాను కాబట్టి ఇదేదో తమాషా టపా అనుకునేరు. కాదు, కాదు .. యమా సీరియస్ పోస్టు!

మనం ఇంకోళ్ళకి సహాయం చెయ్యాలి అని అనుకోవడమే గొప్ప విషయం.
అరే, మనం చెయ్యగలిగినంత చెయ్య లేకపోతున్నామే, సహాయం అవసరమైన వారికి, వారు కోరినంతనే సహాయం అందజెయ్యాలి మనం అందుబాటులో లేకపోయినా అని తపన పడటం ఇంకా గొప్ప విషయం.
మొదటి సూత్రాన్ని నమ్మి పని చేసే వాళ్ళు చాలా మందే ఉంటారు గానీ, రెండో సూత్రాన్ని మనస్ఫూర్తిగా నమ్మి ఆచరణలోకి పెట్ట గలవాళ్ళు బహు కొద్దిమంది.

ఆ బహు కొద్దిమందిలో విశిష్ఠమైన వాడు మన కంప్యూటర్ ఎరా సంపాదకుడు నల్లమోతు శ్రీధర్.

కంప్యూటర్ ఎరా తెలుగు మాస పత్రిక ద్వారానూ, తన సాంకేతికాల బ్లాగు ద్వారానూ తెలుగు కంప్యూటర్ వాడుక దారులకి అందిస్తున్న సేవలతో తృప్తి పడక కొంత కాలం క్రితం చాట్ సహాయ కార్యక్రమం మొదలు పెట్టాడు శ్రీధర్.

ఆ చాట్ గదిలో http://computerera.co.in/chat/ద్వారా ప్రవేశించ వచ్చు.

కంప్యూటర్ ఎరా తెలుగు మాస పత్రిక సంపాదకుడిగా పత్రికలో తన వ్యక్తిగత మొబైల్ నెంబరు ఇచ్చి, ఎప్పుడు మీకు ఏ సందేహం వచ్చినా నన్ను పిలవచ్చు అని ప్రకటించిన సేవా నిరతి శ్రీధర్‌ది. ఐతే రోజుకి యాభై అరవై కాల్స్ వచ్చేవి. తన పనులు చేసుకోడానికి అడ్డం వచ్చేవి. ఇంతలో అనారోగ్యం వచ్చి ఆ మాత్రం సహాయం కూడా చెయ్యలేని పరిస్థ్తితి ఏర్పడింది. ఇదిలా ఉండగా, శ్రీధర్ పట్టుదలనీ, సేవాగుణాన్నీ చూసి ప్రభావితులైన నిపుణులు కొందరు మేమూ సహాయం చేస్తామని ముందుకొచ్చారు. ఎలా వీటన్నిటినీ సమన్వయ పరచడమా అని అబ్బుర పడుతున్న తరుణంలో ..

.. కూడలికి అనుబంధంగా వీవెన్‌ గారు కూడలి కబుర్లు మొదలు పెట్టారు, బ్లాగర్లు ఒక చోట చేరి కబుర్లు చెప్పుకోడానికి. అక్కణ్ణించే చాట్ గది ద్వారా అవసరమైన వారికి సహాయం అందించవచ్చుననే నిర్ణయం స్థిరపడింది. మొదట 2007 డిసెంబరు 26 న వీవెన్‌ సౌజన్యంతో కూడలి కబుర్లకి అనుబంధంగానే కంప్యూటర్ ఎరా చాట్ గది కొన్నాళ్ళు నడిచింది. అనతి కాలంలోనే దీనికి డిమాండ్, ట్రాఫిక్ రెండూ పెరిగి పైన ఇచ్చిన సొంత గూటికి మకాం మార్చారు.

సగటున రోజుకి 30 - 35 మంది ఈ చాట్ గదిని దర్శించి అనేక సాంకేతిక విషయాల్లో సహాయం పొందుతున్నారు. రోజులోని 24 గంటల్లో ఎవరో ఒకరు చాట్ గదిని కనిపెట్టుకుని ఉండి, కోరిన వారికి సహాయం అందించే విధంగా సుమారు 25 మంది ఔత్సాహిక నిపుణుల బృందం తయారైంది. ఈనాడు లో వ్యాసం వచ్చిన ఒక వారం రోజుల పాటైతే .. కంప్యూటర్లో తెలుగు రాయడానికి సాయం చేయండంటూ వెల్లువెత్తారట! అన్నట్టు ఒక ప్రముఖ మహిళాబ్లాగర్ కూడా ఈ బృందంలో యధోచిత సేవలందిస్తున్నారు, ఎవరో చెప్పుకోండి చూద్దాం?

శ్రీధర్ మాటల్లోనే .. "ఒక్కొకరిలో ఒక్కో టాలెంట్ ఉంటుంది కదా అందరి టాలెంట్ అందరికీ ఉపయోగపడేలా ఏదైనా ప్రాజెక్ట్ ప్రారంభిస్తే బాగుంటుంది ఎటూ నేను ఒక్కడినే అందరికీ ఫోన్ లో డౌట్లు క్లారిఫై చెయ్యలేకపోతున్నాను కదా అందరూ అందరికీ హెల్ప్ చేసుకుంటే దీనిని చూసి మరింత మంచి దీనిలో భాగస్వాములు అవుతారని భావించి దీనిని ప్రారంభించడం జరిగింది."

ఇంతకు మునుపెన్నడూ చాట్ గదుల అనుభవం లేని కొత్త వారు వస్తే, వారిని మర్యాదగా ఆహ్వానించడం, ఈ చాట్ ద్వారా వారికి ఎటువంటి సహాయం అందుతుందో అర్ధమయ్యేట్టు వివరించడం, తరచూ అడిగే ప్రశ్నలకి ముందే చక్కటి జవాబులు సిద్ధం చేసుకుని తెరపట్టులతో సహా అందుబాటులో ఉంచుకుని అడగంగానే సమాధానాలివ్వడం - ఈ విషయాల్లో సభ్యులందరూ తర్ఫీదు పొంది ఉన్నారు. చాట్ కదా అని అక్కడ పోచికోలు కబుర్లకి స్థానం లేదు. అంతా పకడ్బందీగా ఒక ఎఫిషియెంట్ ప్రొఫెషనల్ వాతావరణంలో జరుగుతుంది. పెద్ద పెద్ద కంపెనీల కస్టమర్ సర్వీసు కూడా ఈ స్థాయిలో పని చెయ్యడం లేదని నేను ఘంటాపథంగా చెప్పగలను. డబ్బుకి చేసే సేవకీ, మనసు తృప్తికి చేసే సేవకీ అదే తేడా!

ప్రస్తుతానికి బృందంలో సభ్యులందరూ తమ బ్లాగుల్లో దీని లంకె ఇవ్వడం, తమకి సభ్యత్వం ఉన్న యాహూ, గూగుల్ గుంపుల్లో దీన్ని గురించి మాట్లాడడం ద్వారా ప్రాచుర్యం కల్పిస్తున్నారు. త్వరలో స్థానిక సాంకేతిక కళాశాలల్లో చిన్న చిన్న సెమినార్లు నిర్వహించి సహాయం పొందడానికి గానీ అందించడానికి గానీ యువత పాత్ర పెంచాలని శ్రీధర్ ముందు చూపుని మనసారా అభినందిస్తున్నాను. పనిలో పనిగా శ్రీధర్ సంకల్పానికి పుష్టి కూర్చి ఈ సేవాయజ్ఞం నిరాఘాటంగా కొనసాగటానికి కంకణం కట్టుకున్న బృంద సభ్యులందర్నీ కూడా పేరు పేరునా ప్రశంసిస్తున్నాను.
ఈ ప్రయత్నం ఇంతింతై వటుడింతయై అన్నట్లు యెదిగి మరిన్ని విజయాలకి సోపాన మార్గం కావాలని అభిలషిస్తున్నాను.

Wednesday, March 19, 2008

బహుమతి ఎవరికంటే ..

... నివేదన రమ్యగారికి.

కథకి బలాన్నిచ్చిన విషయాలు


ఇచ్చిన విషయానికి తగినట్టు కథా వాతావరణాన్ని కల్పించుకోవడం, కల్పించుకున్న వాతావరణానికి తగినట్టే కథలోని సంఘర్షణ, క్లైమాక్సు .. అన్నీ పరస్పరం దోహదం చేసుకుంటూ ఒక సంపూర్ణమైన కథ చదివాము అన్న తృప్తి కలిగించాయి.
కథని పదేళ్ళ శివ గొంతులో చెప్పటం. తెలిసీ తెలీని వయసు. ఆ వయసులో తలిదండ్రులో టీచర్లో ఏవన్నా చెబితే నమ్మేసే వయసు. అలాగని పూర్తి అమాయకత్వమూ కాదు, అప్పటికే ఎన్నో జీవిత పాఠాలు అనుభవంలోకి వచ్చున్నాయి. ఈ గొంతుని పట్టుకోవడం అంత సులభం కాదు. ఈ ప్రయత్నంలో రచయిత్రి చాలా వరకూ సఫలమయ్యారు.
కథ గమనం, వడి. ఎక్కడా తాత్సారం లేదు, అలాగని కప్పగంతులూ లేవు. సాఫీగా నడుస్తుంది.
కథలో అడుగడుగునా కనబడే వాస్తవికత (realism). వాస్తవికత అంటే కేవలం పాత్రలూ సంఘటనలూ నమ్మదగినట్టు ఉన్నాయా లేదా అని కాదు. రచనలో అదొక తాత్విక దృక్పథం. కొంత వివరణకి ఈ వికీ పేజి చూడండి.
క్లైమాక్సు కి ఎంచుకున్న నమూనా, నమ్మ దగినట్టుగా, పాత్రల స్థాయికి తగినట్టుగా, సందర్భోచితంగా ఉంది.
నాకు గొప్పగా నచ్చిన విషయం .. ఎక్కడా పేదరికాన్ని గానీ, పిల్లాడి ఆశల్ని గానీ, స్థాయికి మించి రొమాంటిసైజ్ (romanticise) చెయ్యలేదు. ఈ విషయం మీద వచ్చిన ఇతర కథలు కొన్నిట్లో ఈ రొమాంటిసైజేషన్‌ బలంగా కనిపిస్తుంది.

ఇంకొంచెం శ్రద్ధ పెట్టవలసిన విషయాలు.
భాషలో సమతుల్యత. గణితం మేస్టారు లాంటి ప్రయోగాలు పలుకుల్లా ఉన్నై.
పిల్లాడి గొంతులో కథ చెప్పినప్పుడు వాడికి అందవు అనుకున్న విషయాలు (విపణి ఆర్ధిక సూత్రాలు, కుట్రలు, నిజాలు) ఎలా చెప్పించాలా అనేది ఇంకొంచెం ఆలోచిస్తే బావుంటుంది .. దీనికి కొన్ని చిత్రమైన ఊహలు చెయ్యొచ్చు.
ఉత్తమ పురుషలో కథ చెప్పేప్పుడు కొంచెం జాగర్తగా ఉండాలి. ఉదాహరణకి శివ తనకి తెల్లకాగితం దొరికిన రోజున ఇలా అంటాడు - "శీను గాడి నోటు పుస్తకం సంగతి పూర్తి గా మర్చి పోయాను." వాడు గనక నిజంగా మర్చిపోతే .. పని గట్టుకుని ఆ విషయం చెప్పలేడు. ఇది పేరడాక్స్.
సరే పంక్చువేషన్‌ మార్కుల గురించి విజయకుమార్ గారు ఆల్రెడీ సెలవిచ్చారు.

రచయిత్రికి అభినందనలు.
రమ్య గారూ ఈ కింది పుస్తకాల్లో మీకు నచ్చినది ఎంచుకుని మెయిల్లో నాకు తెలియ జేస్తే మీకది అందే ఏర్పాట్లు చేస్తాను.
సతీష్ చందర్ చంద్రహాసం
కథ 2006
పి. సత్యవతి మంత్ర నగరి
నల్లూరి రుక్మిణి జీవన స్పర్శ

కొత్త కథా విషయం


హైదరబాదులో కొన్ని దూరప్రాంతాల రూట్లలో 8 మంది కూర్చునే షేర్ ఆటోలు నడుస్తుంటాయి. రాజేంద్ర నగర్ ఏజీ విశ్వ విద్యాలయం నించీ మెహ్దీపట్నం చౌరస్తాకి సుమారు ముప్పావు గంట ప్రయాణం. ఒక మిట్ట మధ్యాన్నం ప్రయాణంలో డ్రైవరు కాక ఐదుగురు ఉన్నారు. 20-22 ఏళ్ళ గ్రేడ్యువేటు యువకుడు, బహుశా విశ్వవిద్యాలయంలో కొత్త విద్యార్ధి, హైదరాబాదుకి కొత్త. 40-45 ఏళ్ళ ఆఫీసరు లాంటి ఒకాయన. సఫారీ సూటు, బ్రీఫ్ కేసు. సొంత కారు పాడైతే విధిలేక ఇలా వెళ్ళాల్సి వచ్చినట్టుంది. 30-35 ఏళ్ళ పల్లె స్త్రీ. కాయకష్టం చేసుకునే మనిషిలా కనిపిస్తోంది. కానీ ఏదో ప్రత్యేక పరిస్థితి కోసం ముస్తాబైనట్టు ఉంది. ఆమెతో పాటు 13-15 ఏళ్ళ కూతురు. కొత్తగా యవ్వనం ప్రవేశిస్తున్న శరీరం, ఆమె కూడా తల్లిలాగే ముస్తాబైంది. తరచూ సిటీలోకి వెళ్ళే అవకాశం రాదు గనక కొంత ఉత్సాహంగా ఉంది. వీళ్ళందరూ కాక ఒక 30-35 ఏళ్ళ మగవాడు. బట్టలూ వాలకం చూస్తే రైతో, రైతు కూలీనో అన్నట్టున్నాడు. చేతిలో ఎరువుల గోతం గుడ్డని చించి కుట్టిన సంచీ బాగా బరువుగా ఉన్నట్టుంది. సంచీ లో పైన కొడవలి పిడి బయటికి తొంగి చూస్తోంది.

ఆ ప్రయాణంలో ఏం జరిగింది ఈ పాత్రల మధ్య?

గమనికలు
ప్రయాణం హైదరాబాదులోనే జరగనక్కర్లేదు. మీకు బాగా పరిచయమైన ఏ సిటీలోనైనా జరగచ్చు.
సబర్బన్‌ బస్సు రైలు లాంటీ వాహనాల్లోనైనా జరగ వచ్చు కానీ షేర్ ఆటోలో జరగడంలో ఒక నిశ్చితమైన ప్రయోజనం ఉంది.
ఇతర పాత్రలని కావాలంటే ఉపయోగించుకోవచ్చు.
కథ విద్యార్ధి యువకుడి దృష్టి నించి చెబితే బలంగా ఉంటుందని నా అభిప్రాయం. అలాగే చెప్పాలని ఏం లేదు.

గడువు ఏప్రిల్ 20ఒక విన్నపం. తమ కథని ఈ మాట పత్రికకి ప్రచురణార్ధం పంపాలి అనుకునే వారు కథని బ్లాగుల్లో ప్రచురించకుండా నేరుగా నాకు పంపవలసింది.

Sunday, March 16, 2008

తెల్లకాగితం - కథా కమామిషు

సుమారు నెలరోజుల క్రితం కథ రాయండి అని పిలిచిన పిలుపు విని మొత్తం పన్నెండు మంది తమ కీబోర్డులకి పని చెప్పారు. చాలా సంతోషం.
ఈ బ్లాగర్లు తమ తమ బ్లాగుల్లోనే కథల్ని ప్రచురించారు.
03/04 మనలో మాట రమ

03/05 నివేదన రమ్య

03/05 ఓనమాల లలిత

03/08 స్నేహమా రాధిక

03/10 సృజన అనుసృజన సోమశంకర్

03/15 వాగ్దేవి లలితాస్రవంతి

03/16 జ్యోతి

వీరు కాక సిరి, శ్వేత, సౌమ్య, రానారె, దంతుర్తి శర్మ గారలు నాకు వ్యక్తిగత వేగు పంపారు. వారి వారి కారణాల వల్ల తమ రచనలు బ్లాగుల్లో పెట్టలేదు. నాకు తెలిసి దంతుర్తి శర్మగారు ఇంకా బ్లాగు మొదలు పెట్ట లేదు, ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని వారు బ్లాగృహ ప్రవేశం జరిపిస్తే మరీ బ్లాగు!

ఇప్పటిదాకా కథలు రాయని, రాయాలని అనుకోని వారూ, రాయగల్నో లేదో అని మథన పడినవారూ ధైర్యం చేసి ముందుకు రావడం బహు ముచ్చటగా ఉంది. పనిలో పనిగా రమ్య, సౌమ్య, రానారె, సోమశేఖర్ వంటి వర్ధమాన రచయితలు కూడా ఒక చెయ్యి వెయ్యడం మరీ బావుంది. ఆ దృష్ట్యా కథలు రాయడం పట్ల జనాల ఆసక్తిని కదిలించాలని తలపెట్టిన ఈ ప్రయత్నం సఫల మైనట్లే అనుకుంటున్నాను.

ఇచ్చిన విషయాన్ని కథగా మలచటంలో అందరూ వేర్వేరు దారులు పట్టారు, విచిత్రమైన ఊహలు చేశారు - ఇది కూడా నాకు చాలా సంతోషం కలిగించింది. అందరికీ చక్కటి భాషా, పదునైన అభివ్యక్తీ ఉన్నాయి. ఇది సామాన్యమైన విషయం కాదు. ఐతే కథా రచన మీదనూ, కథ రూపం ఎలా ఉండాలనే విషయమ్మీదనూ అవగాహన లేకపోవటం వల్ల ఔత్సాహిక రచయిత కథలు స్కెచ్ ల లాగానే మిగిలాయి, పూర్తి కథలుగా ప్రాణం పోసుకోలేదు. ఒక ఉపమానం చెప్పాలంటే .. పక్కింటి పిన్నిగారు తెల్లకాగితం అనే సినిమా చూసొస్తే, మనం ఆవిణ్ణి ఓహో, సినిమా చూసొచ్చారా? ఏవిటీ కథ? అనడిగితే ఆవిడ సినిమా కథ చెప్పినట్టుగా ఉందన్న మాట.

కథ ఇంకా బాగా ఎలా రాయాలి అని కుతూహలం చూపిన వారికి, సూచనలు కోరిన వారికి వ్యక్తిగతంగా నేను ఇప్పటికే కొన్ని సూచనలు చెప్పాను. థామస్ ఎడిసనో ఎవరో అన్నారు Success is 10% inspiration and 90% perspiration అని. మీరంతా మొదటి అడుగు వేశారు. ఇంస్పిరేషన్‌ మీలో ఉన్నదని మీకు మీరే నిరూపించుకున్నారు. బ్లాగుల్లో ప్రకటించిన కథలన్నిటికీ వచ్చిన వ్యాఖ్యలు కూడా దీనికి అద్దం పడుతున్నై. ఇక మిగిలింది శ్రమ .. ఈ సాహితీ వ్యవసాయంలో విజయం సాధించాలంటే అది తప్పదు. శిక్షణ కష్టంగానే ఉంటుంది. మాత్ర చేదుగానే ఉంటుంది.

కథల బాగోగులు తెలిసిన కొందరు మిత్రులకి కొన్ని కథలు చూపించాను. వాళ్ళు పలు విషయాలు చెప్పారు. కొన్ని మాటలు మీకు కటువుగా అనిపించొచ్చు. ఒక్క విషయం గమనించండి. మీరెవరో వాళ్ళకి తెలీదు. ఈ వ్యాఖ్యలేవీ వ్యక్తిగత విమర్శలు కావు. కథ మీదనే వాళ్ళ దృష్టి. కాబట్టి వాళ్ళు చెప్పిన విషయాల్నిగమనించండి, మీ మీ రచనలకి అన్వయించుకుని చూడండి. దాని నుంచి పాఠాలు నేర్చుకుని ఇంకా మంచి కథలు రాసే రచయితలుగా ఎదుగుతారని నా ఆకాంక్షా, నమ్మకమూనూ.

"అక్కడక్కడా ఉన్న inconsistencies సరిచేసుకుంటే బాగుండేది. మొదటి పేరాలోనే ఆ అజాగ్రత్త కనిపిస్తుంది. First person narration వల్ల అక్కడక్కడా కొంత అసహజత్వం కనిపించినా, ఇంకోసారి చదువుకుని సరిచేసుకుంటే ఇంకా మంచి కథ అయ్యుండేది."

"అసహజత్వం కనబడుతోంది. నూకల జావలో పచ్చికారం నంజుకుని తినాల్సిన స్థితిలో ఉన్న కుటుంబానికి మధ్యాహ్నం ఉపాహారానికి బఠానీలు, పాలు సమకూర్చుకోగల పరిస్థితి ఉంటుందనిపించదు. పైగా ఒక తెల్ల కాగితం కూడా కొనలేని స్థితిలో ఉన్న కుటుంబంలో! తన దగ్గర ఉన్న తెల్లకాగితాన్ని ఇంకొక కుర్రాడికి దానం చెయ్యటం, దానికిచ్చిన వివరణా కూడా చాలా అసహజంగా ఉన్నాయి. తెల్ల కాగితం తెచ్చుకోనందుకే వీపు పగలేసిన మాష్టారు, చిత్తు పుస్తకమైనా లేకపోతే బళ్ళోనే ఉండనిస్తారా?"

"నేపథ్యం బాగానే ఉంది కానీ, ఎక్సిక్యూషనే బావులేదు. punctuation errors, typo-ల మధ్యలో అసలు కథ విడదీసి చదవడానికి మరాళం కావాలి. భాష చాలా inconsistent గా ఉంది."

బహుమతి విజేతని ప్రకటించడానికీ, కొత్త కథా విషయం ఇవ్వడానికీ నాకింకొంచెం వ్యవధి కావాలి. ఒకటి రెండు రోజుల్లో పూర్తి చేస్తాను.

Tuesday, March 4, 2008

శ్రీపాద

ఓ కథక చక్రవర్తీ
ఓ తెలుగు వచన రచనకి రారాజా
ఆచంద్రతారార్కమూ తెలుగు సుధావృష్టి కురిపించే శరన్మేఘమా
దండాలు స్వామీ దండాలు

తెలుగు సరస్వతికి ముద్దుబిడ్డవి కాదుటయ్యా
నీ పాదాలు తాకి కళ్ళకద్దుకునే అదృష్టం లేకపోయింది, కానీ
నీ కథల్ని చదివి మనసుకు హత్తుకునే అదృష్టం .. అంతకన్నా గొప్పది కదూ!

తెలుగువాడిగా పుట్టినందుకు, నాలుగు అక్షరాలు చదవ నేర్చినందుకు .. జన్మ ధన్యమైంది!
***
శ్రీపాద వారి కథలు విని ఉండకపోతే తెలుగుల ఉనికి అయోమయం. చదువరులకే చదువు చెప్పగలిగినది ఆయన రచన. తీయందనపు తీయందనము చవులిచ్చినదాయన శైలి. ఆయన రచనలు మరో భాషకు లొంగవు. తెలుగువారైన వారికే శ్రీ శాస్త్రిగారి కథలు చదివి ఆనందించే అదృష్టము .. అన్నది మల్లాది రామకృష్ణ శాస్త్రిగారి అంచనా.

ఫ్యూడల్ సంస్కృతి నుంచి వచ్చిన శాస్త్రిగారు ఆ సంస్కృతి పాత్రల చేత ఫ్యూడల్ సంస్కృతి భాషను మాట్లాడించినట్లు మరెవరూ మాట్లాడించ లేరన్నది శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారి కథల గురించి కొడవటిగంటి కుటుంబరావుగారి అభిప్రాయము.
అచ్చమయిన వ్యావహారికాంధ్రం వ్రాసిన వారిలో ప్రథమ గణ్యులు శ్రీపాద వారు .. అన్నది పిలకా గణపతిశాస్త్రిగారి బేరీజు.
సర్వదా తమరీనాటి యాంధ్ర వ్యావహారిక భాషా నిర్మాతృగణ ప్రథమ గణనీయులు అన్నారు విశ్వనాథ సత్యనారాయణగారు.
***

తీరా చూస్తే ఇందులో ఏమీ కథ లేదు. అంటే, ప్లాటూ, ట్విస్టులూ, సస్పెన్సూ .. ఇలాంటివి. అసలు నిజానికి జరిగే పెద్ద సంఘటనా ఏవ్హీ లేదు.

అట్లాంటి దాన్ని 50 పేజీల కథ రాశారా? అయితే పరమ బోరు కొడ్తుందన్న మాట. ఈటీవీ వాళ్ళా డెయిలీ సీరియల్లాగా సాగదీసి వొదిలి పెట్టుంటారు.

ఏవిటీ, అస్సలు బోరు కొట్టదా? పైగా కథ పూర్తయ్యే దాకా కింద పెట్టబుద్ధి కాదంటారా? విచిత్రంగా ఉందే?
***

పదహారేళ్ళొచ్చిన నరసమ్మ తొలిమాటుగా కాపరానికి వెళ్ళింది రాజమహేంద్రవరానికి. ఆమె అలా వెళ్ళి ఇంకా పక్షం రోజులు కూడా కాలేదు, ఇక్కడ మహేంద్రవాడలో తల్లి రాజమ్మకీ తండ్రి సోమసుందరానికీ మనసు మనసులో లేదు, వొంట్లో అసలే లేదు. ఇది లాభం లేదని తెల్లారు జాము బండి పట్టుకుని ఇద్దరూ రాజమహేంద్రవరం చేరుకున్నారు. అల్లుడు ఆశ్చర్య పడుతూనే సాదరంగా ఆహ్వానించాడు. ఒంటి చేత్తో చాకచక్యంగా సంసారం దిద్దుకుంటూన్న కూతురి సామర్ధ్యం చూసి మురిసిపోయినారా దంపతులు. ఇహ ఇంటికి తిరిగి వెళదామనుకునేప్పటికి మళ్ళీ కూతుర్ని వదల్లేక ఒక్క నాలుగు రోజులు కూతుర్ని కూడ తమతో పాటు తీసుకెళ్ళాలని ఉంది. అల్లుణ్ణడిగితే ఏమనుకుంటాడో. నరసమ్మకీ వెళ్ళాలనే ఉంది కానీ మొగుణ్ణి విడిచి వెళ్ళడమంటే ఏమీ బావులేదు మళ్ళీ. తీరా ఇటుతిరిగి చూస్తే మరునాడు ఆదివారం శలవే అతని ఆఫీసుకి. అయినా అత్తారింటికి అల్లుడు పిలవకుండా రాడు కదా. అంటే తన తల్లిదండ్రులతో ఇప్పుడు తన మొగుణ్ణి ఆహ్వానింప చెయ్యాలి. అదీ తన కోరిక మీద కాక, ఆ ఆలోచన వారికే పుట్టినట్టు భ్రమింప చెయ్యాలి. చతురమైన గడుసు సంభాషణని కోనసీమ గాలితోనే తనలో నింపుకున్న నరసమ్మకి ఇది అరచేతిలోంచి తీర్ధం పుచ్చుకున్నట్టు కాదూ. మహేంద్రవాడ వచ్చారు. ఆ ఆదివారమంతా అక్కడి సకల భోగాలూ, మధ్యలో కొన్ని గంటల విరహమూ అనుభవించారు. మళ్ళీ సోమవారం పొద్దు పొడిచేటప్పటికి పల్లకీ ఎక్కి మొగుడి వెంట రాజమహేంద్రవరానికి తిరుగు ప్రయాణమైంది నరసమ్మ.
***

ఆహా, ఏవిటా సంభాషణల చాతుర్యం, ఆ గడుసు పోకడలు, ఆ సన్నాయి నొక్కులు, ఆ వయ్యారాలు.

ఆహా ఏవిటా తలిదండ్రుల ఆప్యాయత, ఆ దాంపత్యంలో నిండైన శృంగారం, అనురాగం, ఇరుగు పొరుగువారి ప్రేమలేవిటి, ఆ హాస్యాలేవిటి, ఎత్తిపొడుపులేవిటి.

ఆ పాత్రల మనోభావాల చిత్రణేవిటి? ఒక్కొక్కరినీ ఒక నిల్వెత్తు బొమ్మగా చెక్కి ప్రాణం పోసి మనముందు నిలబెట్టినట్లున్నాయి కదా .. ముఖ్య పాత్రలే కాదు, పాలికాపు సూరిగాడు, పక్కింటి లచ్చమ్మ పిన్నీ, వారు వీరు అననేల?

శ్రీపాద వారి మాటల్లోనే .. భర్త వెనక పల్లకిలో వెళ్తున్న నరసమ్మ ..

ఇటు సిగ్గు, అటు బిడియం; ఇటు మురిపెం, అటు ముచ్చట; ఇటు వుత్సాహం, అటు వుల్లాసం; ఇటు దిటవు, అటు సాహసమున్నూ అయి, తెరమీద ఫిలింరీలు నడుస్తున్నట్టు తమ అంతఃపురిక విలాసాలున్నూ స్ఫురించాయి, వెంటనే. ముగ్ధమోహనమైన ఆమె మొగం ఆనంద ముగ్ధం అయిపోయింది దీంతో.
***

గూడు మారిన కొత్తరికం - కథ
శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రి కథలు .. మొదటి సంపుటం
విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్.

Sunday, March 2, 2008

వృద్ధులు వైదొలగండి

ఉత్తమ చిత్రంగా మొన్ననే సరికొత్త ఆస్కారుని గెలుచుకున్న నో కంట్రీ ఫర్ ఓల్డ్ మెన్‌ చూసి వస్తున్నా.
పుస్తకాన్నించి తెరకు అనువదించిన స్క్రీన్‌ప్లేకూ, ఉత్తమ దర్శకత్వానికీ, సహాయ పాత్రలో నటనకూ కూడా మరో మూడు ఆస్కార్లని బుట్టలో వేసుకుందిది.
అంతే కాక ఇంతట్లోనే IMDB వాళ్ళ చూసి తీరాల్సిన చిత్రాల పట్టికలో 39 వ స్థానాన్ని ఆక్రమించింది.
కొంచెం అయోమయమూ కొంత అలజడీ ప్రస్తుతం నా మనస్థితి. అవునది సినిమాయే, అదొక కల్పిత కథే .. అయినా .. ఈ అలజడి.

అదే కదా గొప్ప సినిమా పనితనం!

మీకు లాగానే ఇంకా చాలా మంది ఈ సినిమా చూసే ఉద్దేశంతో ఉండొచ్చు, పైగా ఇదొక క్రైం థ్రిల్లర్ కాబట్టి ఏంజరుగుతుందో నేను చెప్పను, చెప్పి మీ అనుభూతిని పాడు చెయ్యను. కాకపోతే సినిమా బాగోగుల్ని మాట్లాడుకోటానికి కొద్దిగా నేపథ్యమైనా తెలియాలి కాబట్టి ఆ నేపథ్యం మాత్రం ఇస్తాను.

టెక్సస్ రాష్ట్రంలో మెక్సికో సరిహద్దు దగ్గర్లో ఒక చిన్న వూళ్ళో లెవెలిన్‌ (జాష్ బ్రాలిన్‌) ఏదో చిన్న ఉద్యోగం చేస్తూ బతుకుతున్నాడు. పెళ్ళాం కార్లా జీన్‌ (కెల్లీ మెక్డానల్డ్) ఒక్కత్తే, ఇంకా పిల్లలు లేరు. వీడు ఉద్యోగానికి పోకుండా చెట్లూ పుట్టలూ పట్టుకుని తిరుగుతూ, వేటాడ్డానికి ఏవన్నా దొరుకుతుందేమో అని చూస్తుంటాడు. ఒక మధ్యాన్నం పూట ఆలాగే విశాల మైదానంలో తుప్పలెంబడి పడి తిరుగుతుండగా వాడికి బైనాక్యులర్స్ లో ఒక వింత దృశ్యం కనిపిస్తుంది. నాలుగైదు చిన్న లారీలు (ఇక్కడ పికప్ ట్రక్కులంటారు) ఆగి ఉన్నాయి. చుట్టూ ఒక పది మంది దాకా జనం చచ్చినట్టు పడున్నారు. వీడు అతి జాగ్రత్తగా అక్కడకెళ్ళి చూస్తాడు. ఒక ట్రక్కు వెనక నిండా నీట్ గా పేక్ చేసిన మాదక ద్రవ్యం పేకెట్లు. అంటే .. చుట్టు పక్కలెక్కడో డబ్బు కూడ ఉంటుంది. కాస్త వెదికితే ఒక నల్ల సూట్‌కేసులో అదీ దొరికింది. సంతోషంగా అక్కడ దొరికిన కొన్ని తుపాకుల్నీ మొలలో దోపుకుని ఆ సూట్‌కేసు పట్టుకుని ఇంటికెళ్ళిపోయాడు వాడు. త్వరలోనే వాడికి అర్ధమవుతుంది ఆ డబ్బుల సోంత దారులు అతి భయంకరమైన హంతకుణ్ణి (హావియే బార్దెం) వీణ్ణి పట్టుకోడానికి నియోగించారని. కథలో మూడో కోణం ఆ చిన్న పల్లెకి పోలీసధికారి షెరిఫ్ టాం బెల్ (టామీ లీ జోన్స్). లెవెలిన్‌ సూట్‌కేసు పుచ్చుకుని పారిపోయినాక, హంతకుడు వాణ్ణి వెంటాడూతున్నప్పుడు, అంత ఆలస్యంగా ఈయనకి అసలు విషయం తెలుస్తుంది. లెవెలిన్‌ గెలుస్తాడా, హంతకుడు గెలుస్తాడా, షెరిఫ్ బెల్ గెలుస్తాడా అనేది మన ఫ్రెండు జీవి అన్నట్టు .. దట్ ఈజ్ ద రెస్ట్ ఆఫ్ద స్టోరీ.

కథంతా టెక్సస్ లో మెక్సికో సరిహద్దుకి దగ్గర్లో జరుగుతుంది. ఆ ఎండి వడలిపోయిన నేల తత్వాన్ని సినిమా పొడుగునా స్టేజి వెనక వేలాడే తెరలాగా అద్భుతంగా ఉపయోగించారు. అలాగే శబ్దాన్ని కూడా చాలా ఎఫెక్టివ్ గా ఉపయోగించారు. నటనలో అందరూ బాగా రాణించారు. వెటరన్నటుడు జోన్స్ కి ఇది చాలా సూక్ష్మమైన విశేషాలతో నిండిన పాత్ర, చాలా సమర్ధవంతంగా పోషించాడాయన. ఇక ముఖ్య పాత్రల్లో బ్రాలిన్‌, బార్దెం అద్భుతంగా నటించారు. మనస్తాపం, పశ్చాత్తాపం లాంటీ ఇమోషన్లు ఏమాత్రం లేని హంతకుడిగా బార్దెం ఇదివరలో ఇటువంటి పాత్రలో మహా నటుడు ఏంథనీ హాప్కిన్స్ ని తలపించాడు. ఇప్పటికీ ఆ పాత్రని తలుచుకుంటే వెన్నులో ఒక జలదరింపు పుడుతుంది. కెల్లీ కూడా పాత్రోచితంగా చేసిందనే చెప్పాలి. అమెరికాలో టెక్సస్ లో జరుగుతున్న ఈ కథలో ఆ ప్రాంతపు పాత్రలుగా స్పేనిష్ నటుడు బార్దెం, ఆంగ్లేయ నటి కెల్లీ మెక్డానల్డ్ పరమ సహజమైన టెక్సస్ యాసతో మాట్లాడి రక్తి కట్టించారు.

నన్ను కలచి వేస్తున్న అలజడి అసలు కథలోనే .. లేదా స్క్రీన్ ప్లే లోనే ఉంది. కోయెన్‌ సోదరుల సినిమాలు ఇదివరకు కొన్ని చూశాను. వాళ్ళ సినిమాలన్నా, దర్శకత్వపు పద్ధతీ, కథనపు శైలీ అన్నా నాకొక కుతూహలమూ, కొంత అభిమానమూ. నేను చూశిన అన్ని సినిమాల్లోనూ .. ఇదంతా ఒక తమాషా సుమా .. అనేలాంటి ఒక హాస్యపు వీచిక అంతర్గతంగా ఉంటూ వస్తోంది. ఎంతో భయంకరమైన సంఘటనలు జరుగుతూ ఉన్నా, కసాయి పాత్రలున్నా వాటన్నిటి వెనకా దాగీ దాగని ఒక కొంటె నవ్వు మనకి కనిపిస్తూనే ఉంటుంది. ఐతే ఈ సినిమాలో ఆ కొంటె నవ్వు లేదు. ఆ హాస్యం లేదు. అంతా పరమ సీరియస్. ఇది కేవలం ఆట కాదు. గెలిపూ ఓటమిల మధ్య తేడా, చావు బతుకుల మధ్య తేడా, నేరానికీ చట్టానికీ మధ్య తేడా, ఆశకీ క్రౌర్యానికీ తెలివికీ మధ్య తేడా, యవ్వనానికీ వృద్ధాప్యానికీ మధ్య తేడా - అందుకే .. ఈ దేశంలో ఇక వృద్ధులు వైదొలగాలి.

మనసులో అలజడి .. ప్రస్తుతానికి స్టీరియోలో మహానుభావుడు, చచ్చి ఏ లోకానున్నాడో, రామనాథన్‌ గారి గొంతులో శహన రాగం వింటూంటే కొంత ఊరట.

Saturday, March 1, 2008

ఈమాట కొత్త సంచిక విడుదలైంది

ఈమాట జాల పత్రిక కొత్త సంచిక విడుదలైంది.

ఈ సంచికలో మన బ్లాగరులు ఇద్దరి రచనలు ఉండటం ఒక విశేషం. సోమశంకర్ అనువాద కథ వెచ్చని మనసులు, జ్యోతిషం లోపలి సంగతుల గురించి నాగమురళీ కృష్ణ గారి వ్యాసంలో మొదటి భాగం ఈ సంచికలో వచ్చాయి.

అంతకంటే విశేషం ఏవిటంటే వేలూరి వారి రాసిన సంపాదకీయం బ్లాగుల గురించి.

ఇంకా ఎన్నో కథలూ కవితలూ వ్యాసాలూ కలిసి అందాలు సంతరించుకుని మీ ముందుకొచ్చింది ఈమాట.
ఒక లుక్కెయ్యండి.