నలుగురం కలిసిన వేళ .. పాపినేని శివశంకర్

నలుగురం కలిసిన వేళ

దూరం నించి స్నేహనయనాలతో చిరునవ్వుల్తో
ఆరోగ్యంగా మీరు నడిచివస్తారు
మన చేతులు మృదుగాఢంగా పలకరించుకుంటాయి
అందరం టీపాయ్ చుట్టూనో చాప మీదో
బయట పచ్చిక పైనో విశ్రాంతి భంగిమల మవుతాం
మా పాప పరిగెత్తుకొచ్చి మీ ఒళ్ళో వాలుతుంది
సాయంత్రం చల్లని గాలిలా వీస్తుంటుంది
గూళ్ళు పక్షుల్ని పిలుస్తుంటాయి

మనలో ఒకళ్ళు రాత్రి సినిమా గురించో
కురవక కురిసిన వాన గురించో ప్రస్తావన చేస్తారు
అంతలో మరొకళ్ళు సగం చదివిన లిటిల్ ప్రిన్స్ మీద
సందేహాలు రేపుతారు
ఎంతకీ తెగని చిక్కుముళ్ళవుతాయి చర్చలు
ఇంట్లోంచి టీ వస్తుంది
టీ పొగల మధ్య మిత్రుడి గొంతు విప్పుకొని
ఒక కవిత వానకాలవలా జాలువారుతుంది
మనలో ప్రాణతరంగాలు చెలరేగుతాయి
మెరిసే కళ్ళతో పాప మన వంకే
మార్చి మార్చి చూస్తుంటుంది
ఆ పైన - మనుషుల డబ్బు వాసనో మత శిలోన్మాదమో
దేశమాత గాయాలో వాదానికొస్తాయి
మాటలు ముక్కుల్తో పరస్పరం రాసుకుంటాయి
ఘర్షించి ఘర్షించి మనం
జీవనలయని గట్టిపరుచుకుంటాం
ప్రస్తావన మారిపోయి
ఈసారి మనం పియానో మెట్లమీదగా
బీథోవెన్ ఐదో సింఫొనీలోకి
ఒక పులకరింతతో ప్రయాణిస్తాం
హృదయాలు పిట్టలై ప్రపంచమంతా తిరిగొస్తాయి
సాయంత్రం చీకటిగా చిక్కపడుతుంది
మనలో అదృశ్యదీపాలు వెలుగుతాయి

నలుగురం కలిసిన వేళ
మనం మరొకళ్ళలోకీ మరొకళ్ళు మనలోకీ
ప్రవహించటం ఎంత బావుంటుంది
*** *** ***

"ఒక సారాంశం కోసం" కవితా సంపుటినించి
కవి .. పాపినేని శివశంకర్
1990 లో ముద్రితం

Comments

మనలో ప్రాణతరంగాలు చెలరేగుతాయి
avunu adi ippudu jarigiMdi
Purnima said…
Thank you, a ton!
KumarN said…
Wow.. Simply Suberb!!
చాలా బాగుందండి.
మీ ఇంట్లో స్నేహితుల సమావేశంలాగా బాగుంది.
బాగుంది.

ఈ లైను ఇంకా బాగుంది.

"మాటలు ముక్కుల్తో పరస్పరం రాసుకుంటాయి"
రమణి said…
"హృదయాలు పిట్టలై ప్రపంచమంతా తిరిగొస్తాయి
సాయంత్రం చీకటిగా చిక్కపడుతుంది
మనలో అదృశ్యదీపాలు వెలుగుతాయి"

నెలకోసారన్నా ఇలా నలుగురు కలిసి కబుర్లు కలబొసుకొంటే ఎంత బాగుంటుందో అనేంత బాగుంది.
బానే ఉంది గానీ, I wonder where's poetry in it. No, Really! Even my (so called) "సహృదయత" can't find anything poetical in it. (Or, may be I am not being "సహృదయ్" enough; Hmm, that must be the case.)

By the way, ఇందులో కవి కాస్త కవిత్వం చెప్పడానికి ప్రయత్నించిన ఒక్క వాక్యంలో కూడా ఫెయిలయ్యాడనిపించింది. స్నేహితుల మధ్య వాదనని సూచిస్తూ "మాటలు ముక్కుల్తో పరస్పరం రాసుకుంటాయి" అన్న వాక్యం ఉంది. పక్షులు (చిలకలు) ఎందుకు ముక్కులు రాపాడించుకున్నా అందరూ అందులో ముద్దు మురిపాల్నే చూస్తారు గానీ ఘర్షణని చూడరు. ఇక్కడేదో "మనుషుల డబ్బు వాసనో మత శిలోన్మాదమో దేశమాత గాయాలో వాదానికొస్తా"యంటున్నారు కాబట్టి, "మాటలు ముక్కుల్తో పొడుచుకుంటాయ"నో, మరోటో రాస్తే బాగుంటుందనిపించింది. (A fleeting observation actually.)
ఫణీంద్ర .. మీకు ఇందులో కవిత్వం ఏమీ కనబడకపోతే వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు, కనీసం నాకు (కవి గారికి బహుశా ఉంటే ఉండొచ్చు). రచనలోని ఆస్వాదించ దగిన భాగాన్ని, ముఖ్యంగా కవిత్వంలో .. పాఠకుడే సృష్టించుకుంటాడని మీకు తెలియనిది కాదు. ఇందులో సహృదయత ప్రసక్తి ఏముందో నాకు అర్ధం కాలేదు.
మేధ said…
చాలా బావుందండీ..
Thanks SO much for sharing a wonderful poem with us!!

రమణి గారికి నచ్చిన పదాలే నాకూ చాలా నచ్చాయి. :-)
చాలా బాగుంది పద్యం. ఒక రకమైన పాత కాలపుటందం వుంది.

ఫణీంద్ర గారి వ్యాఖ్య గుఱించి,
ఈ కవితని ఆస్వాదించడానికి కొంత నేపథ్యం వుంటే ఉపకరిస్తుందనుకుంట. మొన్ననే మేము, మా చెల్లికి కుదిరిన సంబంధం తాలూక కొత్త చుట్టాలని, పరిచయం చేసుకోవడానికి వెళ్ళాం. చాలా సందడిగా జరిగింది. అంటే నాగరికత అంటారు కద, దానికి అద్దం అన్నమట. మావయ్యలూ పెద్దనాన్నలు చాలా వఱకూ వ్యవసాయదారులే కాబట్టి చాలా మంది రాగలిగారు, అలా వెళ్ళి వస్తూంటే అనుకున్నాం, ఎక్కడో సుదూర పట్టణాల్లో ఇలాంటివి కుదరవుకదా అని (అంత మంది రాగలగడం, అలా మన కుటుంబాన్ని పెద్దది చేసుకోవడం వంటివి).

ఈ కవిత అలాంటి అనుభూతిని అట్టే కాగితం మీద దింపుతుంది. ఆ సంఘటనలో లేని అందాన్ని ఆర్భాటమైన పదాలతో, అలంకారాలతో చూపించడానికి ప్రయత్నించలేదు. ఆ విషయం నాకు బాగా నచ్చింది.
"గుర్తుందా రాకేశ్ ఎలా ఆ రోజు అందరితో చేసిన ముచ్చట్లు?" అన్నట్టుంది కవిత.

-
ఎవరు వ్రాసిన కవితైనా, అందులో ఎన్ని 'లోపాలు' వున్నా, అందులో అందం చూడగలిగిన వారిదిగా భాగ్యము.

రాకేశ్వర రావు