కబుర్లు - డిశంబరు 1

సుమారు ఆగస్టు నెలనించీ ఎడతెరిపి లేని పని. మధ్యలో వారాంతాల విశ్రాంతి దొరుకుతూ ఉన్నా, సర్వాంతర్యామి లాగా పని వత్తిడి నొక్కుతూనే ఉంది, పూర్తిగా విశ్రాంతి తీసుకోనీకుండా. మొత్తానికి ఆ పని ఒక కొలిక్కి చేరింది. పూర్తిగా సఫలమయిందో లేదో అప్పూడే తెలియదు గానీ .. కర్మణ్యేవాధి కారస్తే అన్నట్టు .. నేను చెయ్యగల భాగం పూర్తయింది. సరిగ్గా ఆ సమయానికే ఈ ప్రత్యేక శలవుదినాలూ కూడుకుని, కాస్త మనసుకీ శరీరానికీ ఆరాం దొరికింది.

థేంక్సు గివింగ్ పండక్కి అమెరికను చరిత్రలో సంస్కృతిలోఒక ప్రత్యేక స్థానం ఉంది. దీని చారిత్రక నేపథ్యం తెలుసుకో దలచిన వారు వికీలో చదువుకోవచ్చు. నేను చూసినంతలో ఇది కుటుంబం అందరూ కలిసి జరుపుకునే పండుగ. అమెరికను ప్రజలకి కుటుంబం అంటే లెక్ఖ లేదు అనే భ్రమ ఒకటి మనవాళ్ళల్లో కనిపిస్తుంది. ఇది నిజం కాదు. ఎక్కువ శాతం అమెరికన్లు కుటుంబానికి చాలా ప్రాధాన్యత నిస్తారు. ఈ థేంక్సుగివింగ్ పండగ కోసం వందల వేల మైళ్ళయినా ప్రయాణం చేసి అమ్మమ్మ తాతయ్యల ఇంటికో, మామ్మ తాతయ్యల ఇంటికో చేరుకుంటారు. పొద్దుటినించీ రకరకాల వంటలు చేస్తారు. భోజనానికి ముందు కుటుంబ సభ్యులందరూ ఒకరి తరవాత ఒకరు, ఆ పరమాత్మునికి కృతజ్ఞతలు విన్నవించుకుంటారు, తమ తమ జీవితాల్లో వివిధ వరాలు పొందినందుకు. పేరుకి దీన్ని థేంక్సు గివింగ్ డిన్నరు అంటారు గానీ తిండి సంరంభం మధ్యాన్నం ఏ మూడింటికో మొదలవుతుంది. ఇహ రాత్రి జనాలకి ఓపిక ఉన్నంతవరకూ తినడం తాగడం కొనసాగుతుంది. టర్కీ కోడి, మంచి గుమ్మడికాయతో పై, క్రాంబెర్రీ (మన వాక్కాయల్లాగా ఉంటాయివి .. అన్నట్టు మన భాస్కర్ తమ్ముడు వాక్కాయ పప్పు చెయ్యడం రాయొచ్చు నలభీమపాకంలో) రెలిష్, బ్రెడ్డు ముక్కల్లో రకరకాల దినుసులు కలిపి చేసే స్టఫ్ఫింగ్ .. ఇవి థేంక్సు గివింగ్ భోజనంలో తప్పని సరిగా ఉండే సాంప్రదాయకమైన వంటకాలు.

మా యింటో థేంక్సుగివింగు కోసం ప్రత్యేకంగా చేసినదేం లేదు. అంతకు ముందు రాత్రి రేడియోలో ముంబాయి దాడి వార్తలు తెలుసుకున్న దగ్గర్నించీ మనసు మనసులో లేక ఆ రోజంతా అలజడిగానే గడిచింది. ఇహ ఇలా లాభం లేదని, కొంచెం చైతన్యం కావాలని ఒక అయిదారు స్నేహితుల కుటుంబాలని శనివారం రమ్మని ఆహ్వానించాము. శుక్రవారం అంతా పడి పడి వంటలు చేశాం. ఇక్కడ ఇంకో సదుపాయం వచ్చే పాట్లక్ అని వచ్చే అతిథులు కూడా ఒక్కో వంటకం తీసుకొస్తారు, గృహస్తులే మొత్తం వంట బాధ్యత తీసుకోకుండా. పిల్లాజెల్లాతో ఏడింటికల్లా అందరూ వచ్చేశారు. రెండేళ్ళ నించీ పదేళ్ళ వయసు మధ్య అరడజను మంది పిల్లలు చేరేప్పటికి ఇంట్లోనే ఒక పార్కు వాతావరణం వచ్చేసింది. పరిచయాలు, కబుర్లు, ఇక్కడ ఎకానమీ గురించీ, ముంబాయి దాడి గురించీ పరామర్శలు .. షడ్రుచులతో బ్రహ్మాండమైన భోజనం .. అటుపైన సుమారు గంట సేపు పెద్దలందరూ కూడా పిల్లలై పోయారు .. తెలుగు మూకాభినయ పోటీలు. Dumb Charades .. ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే, వెన్నుపూస ఘల్లు ఘల్లు మన్నదే ఇత్యాది సాహిత్యసుమాల్ని తమ టీం మేట్లకి అభినయం ద్వారా జనాలు చూపించడం .. మిగతా వారంతా పడి పడి నవ్వడం .. మధ్య మధ్య .. పెదవులు కదుపుతున్నారు, టైమైపోతోంది అనే ఆరోపణలు. మొత్తానికి మంచి సందడిగా గడిచింది. ఆట ముగిసి అందరం మళ్ళీ పెద్దతనపు హందా ముసుగులు తొడుక్కుని మర్యాదగా శలవు పుచ్చుకున్నాం.

పాపినేని శివశంకర్ గారు ఒక పద్యంలో చెప్పినట్టు అప్పుడప్పుడూ ఇంకోళ్ళు మనలోకీ మనం ఇంకోళ్ళలోకీ ప్రవహించడం ఎంత అద్భుతంగా ఉంటుంది కదా!

Comments

నిజమేనండి. అప్పుడప్పుడు పెద్దరికపు ముసుగులు తీసి పరకాయ ప్రవేశం చేయాలి..
దేవన said…
guruvu gaaru,

its 100% true that Americans value family system.

its good to hear that you had a nice weekend.
Bolloju Baba said…
పాపినేని శివశంకర్ గారు ఒక పద్యంలో చెప్పినట్టు అప్పుడప్పుడూ ఇంకోళ్ళు మనలోకీ మనం ఇంకోళ్ళలోకీ ప్రవహించడం ఎంత అద్భుతంగా ఉంటుంది కదా!

yes exactly so sir
శ్రీ said…
పాట్లాక్ చాలా సరదాగా జరిగింది కొత్తపాళీ గారు. Dumb Charades నిజంగా కేక! ఇటువంటివి ఆటలు మంచి "మంచు పగుళ్ళు! (ice brakers!)".
Anonymous said…
బాగున్నయండి మీ కబుర్లు.అయితే మేము చాలా మిస్ అయ్యామనమాట
KumarN said…
హ్మ్ ఇంట్రస్టింగ్.

సరిగ్గా ఇలాగే నా థాంక్స్ గివింగ్ గడచింది. కాపోతే నేను తెలివిగా, హోస్ట్ పాత్ర కాకుండా, గెస్ట్ పాత్ర పోషించా. మా ఆవిడ పట్టుకెళ్ళిన చిల్లీ చికెన్, జనాల్లో మంట రేపింది .

మూకాభినయంలో "మాయదారి మల్లిగాడు" సినిమా పేరుకు నేను ప్రదర్శించిన నటనా కౌశలం నభూతో నవిష్యత్ అని జనాలు పొగిడారు (తర్జుమా: బండ బూతులు తిట్టారు). కాని చిట్ట చివరి రెండు సెకన్లల్లో మా సినిమా పండిట్ గాడు ఆ పేరుని కనిపెట్టడం నాకు షాకే కాకుండా, భలే కిక్ ని ఇచ్చింది.

ఇంకో వెరైటీ ఏంటంటే, మా కిరణ్ మా అందర్నీ ఓ లోకి నెట్టాడు. మధ్యలో ఓ హాట్ సీట్ ఒకటి పెట్టి, చిట్టీలు తీసి, పేరు వచ్చిన వాళ్ళు దాని మీద కూర్చుని, వాళ్ళ ఆవిడకి థాంక్స్ చెప్పడమే కాకుండా, ఎందుకు చెపుతున్నారో కూడా సోదాహరణంగా ఒక రెండు నిమిషాల లోపల వివరించాలని అందరి ముందు ప్రకటించాడు.

వెంటనే మా అందరికీ బాత్ రూం అవసరమొచ్చింది. దాక్కున్నాం కాని వెధవ వదల్లేదు.

మా ఉమా గాడి వైఫ్ మా ఆయన నాకు థాంక్స్ చెప్పక్కర్లేదు కాని, "సారీ" అనే పదానికి స్పెల్లింగ్ చెపితే చాలు అనడం మా అందరికీ కిక్ నిచ్చింది. అయినా చెప్పలేదు లెండి ఆ సన్నాసి.

నేనేమో సిరివెన్నెల గారి "ఆది భిక్షువు" టైప్ లో ఓ నిందా స్తుతి, పద్యం లాంటి గద్యం ఎత్తుకున్నా.

అలాంటి ఇంటెలిజెంట్ టెక్నిక్స్ సినిమాల్లో బావుంటాయి కాని, ఇంట్లో పనిచేయవు అని గత మూడు రోజులుగా తెలుసుకుంటున్నా :-).

మా కమ్యూనిటీ పక్కనుండే సబ్ వే నే సాక్షం.
KumarN said…
oops.. I meant
మా కిరణ్ మా అందర్నీ ఓ ambush లోకి నెట్టాడు..
Unknown said…
మీ బ్లాగ్ మీ వ్యక్తిగత పరిచయస్తూల కోసమేనా నాలాంటి బయటివారు కూడా కామెంట్స్ రాయచ్చా? మీ ఈమైల్ ఎక్కడా ఇవ్వలేదూ? బ్లాగ్ లో కాకుండా మిమ్మల్ని కాంటాక్ట్ చెయ్యడం వీలవదా? మీ లేఖిని చదువుతుంటె హాయిగా అనిపిస్తుంది.
"Through The Looking Glass" సాధారణమైన ఫోటో ని కూద ఎంతబాగ ఎంజాయ్ చెయ్యచ్చో కదా అనిపించేలా చెస్తుంది.
మొగల్రాజపురం 5 విజయవాడ లో ఎక్కద తీసారు? ఎలా వెళ్ళాలి?
visalakshi said…
thank you sir, giving information for thanks giving festival. congrats sir you enjoyed very nice weekend.
@kumar .. Hot Seat concept బాగుంది. ఈ సారి ప్రయోగిస్తా. :)

@ramadevi .. నా బ్లాగుకి ఆహ్వానం. ఎవరైనా వ్యాఖ్యలు రాయొచ్చు. గుహల ఫొటోలన్నీ విజయవాడ మొగల్రాజపురంలో తీసినవి. సిద్ధార్ధ ఆర్ట్స్ కాలేజి నించి ఎడామవేపుకి వెళ్ళే రోడ్డు మీద వెళ్తే ఈ గుహలు వస్తాయి. ఏలూరు రోడ్డు మీదినించి విశాలాంధ్ర రోడ్డు మీద కొండ చుట్టి వెళ్ళినా ఇక్కడ చేరుకోవచ్చు.
Ramani Rao said…
పెద్దవాళ్ళు చిన్నవాళ్ళుగా మారిన ప్రకాయ ప్రేవేశ ప్రహసనం బాగుంది. ఆ తరువాత పెద్దరికపు ముసుగు... మీదైన శైలిలో బాగా రాశారు.

ఇచ్చినందుకు కృతజ్ఞతలు.. దీనిని పండగగా చేసుకోడం వినడానికి కొత్తగా,మరింత సున్నితంగా
ఉంది. నాకు ఇలా పండగ చేస్తారని తెలీదు
Anonymous said…
ఈ "డే "ఏదో బావుందండీ
ఈ మద్య మూకాభినయం బాగా ఆడుతున్నారు అన్నిచోట్లా
ఒక పెళ్ళిలో "సివమెత్తిన సత్యం " అబినయం ని వీడియో తీసి
అది చేసినవారిని మేం ఇప్పటికీ బ్లేక్ మైల్ చేస్తున్నాం
ఆట-3 కి పంపిస్తామని
రాధిక said…
భలే గడిచినట్టుంది కదా మీకు.మా థాంక్సు గివింగ్ కూడా ఇలానే జరిగింది.నాలుగు రోజులూ నలుగురి ఇంట్లో.మధ్యాహ్నం వెళ్ళడం.మళ్ళా మర్నాడు పొద్దన్నకి ఇళ్ళు చేరడం. మేము మోనోపోలీ,పేకలు ఆడాము.నీది రాంగ్ షో అని,దొంగాట అని,అలా కుదరదు ఇలా కుదరదని గోల గోల గా అల్లరి చేస్తుంటే పిల్లలొచ్చి ష్..ష్...క్వైట్ అంటే గానీ గోల తగ్గేది కాదు.మళ్ళా రెండు నిమిషాలకి మామూలే.మా గేంగ్ లో అన్ని భాషల వాళ్ళూ వుండడం వల్ల అంత్యాక్షరి,సినిమా పేర్ల ఆటలు కుదరలేదు.
రాధిక said…
అమెరికన్ ఫేమిలీల విషయం లో నేనూ ఇదే చెపుతాను.వీళ్ళు ఫేమిలీకి ఇచ్చే ఇంపార్టెన్స్ మనం ఎప్పటికీ ఇవ్వలేము.ఇది అమెరికనులందరికీ వర్తించకపోవచ్చుగానీ నాకు తెలిసిన/కనపడే ఫేమిలీలలో వారు కుటుంబానికి ప్రత్యేకంగా టైము కేటాయించడం,ఒకరి మీద ఒకరు అభిమానాన్ని వ్యక్తఓరచుకోవడం...ఇవన్నీ చాలా అద్భుతం గా అనిపిస్తాయి.
మాది నానాజాతి సమ్మేళనం కాబట్టి తెలుగులో కాదు గానీ ఇంగ్లీషు సినిమాల డంబ్ చరాడ్స్ ఆడాము. ఒక తమిళ స్నేహితుడు నేనిచ్చిన సినిమా "GATTACA"ను గాట్‌‌"అక్క" అని అభినయం చేయడం అందరికీ నవ్వుతెప్పించింది. భారతీయ భాషలు రానివాళ్ళకు దాని చతురత చెప్పి నవ్వుకున్నాం.