తెలుగు కథల్లో క్లిషేలు - 2

పాత్ర చిత్రణలో ఇంకో రకం క్లిషే అస్తిత్వవాదాలకి సంబంధించిన కథల్లో కనిపిస్తుంది. స్త్రీవాద కథల్లో మగ పాత్రలన్నీ ఒక్కలాగానే ఉంటాయి. ఈ కథల్లో మగవాడైన వాడు ఎప్పుడూ ఒక్క సున్నితమైన ఆలోచన, ఒక్క మంచి పని కూడా చెయ్యలేడు - తండ్రి కానీ, అన్నదమ్ములు కానీ, మొగుడు కానీ, ఆఫీసులో సహోద్యోగి కానీ, ఆఖరికి కొడుకు కానీ - మగాళ్ళంతా ఇంతే అన్న ధోరణిలో ఉంటాయి. దళిత కథల్లో దళితేతర కులాల పాత్రలూ, ముస్లిము కథల్లో ఇతర మతాలవారూ కూడా ఇదే బాపతు. అలాంటి మనుషులు లేరని నేనూ అనను. ఉన్నారు. అట్లాంటి పాత్రల చిత్రణ, విమర్శ జరగాలి, తప్పకుండా, ఆయా పాత్రల ఆధిపత్య స్వభావాల్ని, కాలం చెల్లిన భావాల్ని కడిగి ఎండయ్యాలి - నిజమే. ఐతే, ప్రతీ మనిషికీ ఎన్నో కోణాలు ఉంటాయి. పరస్పర మానవ సంబంధాల్లో ఎన్నో పార్శ్వాలు ఉంటాయి. కథ స్వతహాగా క్లుప్తమైన ప్రక్రియ కాబట్టి రచయిత ఆయా కోణాలని, ఆయా పార్శ్వాలని కథకి అవసరమైనంత వరకే ఆవిష్కరిస్తాడు. ఆ లిమిటెడ్ ఫోకస్‌ని అంగీకరించినప్పుడు కూడా, పాత్ర అంటూ సృష్టించాక ఆ పాత్రకి కొంత స్వతంత్ర ప్రతిపత్తి ఉంటుంది. ఇవేమీ పట్టించుకోకుండా తయారు చేసే మూస పాత్రలు మూసలోంచి వచ్చినట్టుగానే ఉంటాయి తప్ప సజీవంగా ఉండవు. కథ రాయడంలో రచయిత చెప్ప దల్చుకున్న విషయమేవిటి అనేది పూర్తిగా మరుగున పడిపోతుంది ఇటువంటి విపరీతమైన చిత్రణలతో. లేదా పాఠకుడికి మొహమ్మొత్తి వెగటు పుడుతుంది.

ఆలోచనలకి సంబంధించిన క్లిషేలు ఇంకో రకం. నిజానికి ఇవి మిగతా రకాల కంటే భయంకరమైనవి. ఎందుకంటే రచయిత తాను అభ్యుదయభావంతో రాస్తున్నాను అనుకుంటూ వెలిబుచ్చే కొన్ని అభిప్రాయాలు, చేసే తీర్మానాలు నిజానికి తిరోగమన భావాలతో నిండి ఉంటాయి - లేదా, ఒక తప్పు దృక్పథాన్ని పాఠకుడిలో నెలకొల్పుతాయి. ఆర్ధిక సంస్కరణలు అమలైన నాటి నుండీ గ్లోబలైజేషన్ వలన కీడే తప్ప మేలు జరగదు అనే ఇతివృత్తంతో టన్నుల కొద్దీ కథలు వచ్చాయి. కోకకోలాని దేశంలోకి తిరిగి అనుమతించారు కాబట్టి మా వూళ్ళో స్థానిక సోడా వ్యాపారం మూతపడింది. జన్యుమార్పిడి విత్తనాలూ, కొత్త ఎరువులూ, పురుగు మందులూ (ఇవన్నీ బహుళజాతి కంపెనీల తయారీలు) రావడం వల్ల రైతులు స్వేఛ్ఛ కోల్పోతున్నారు, మోసపోతున్నారు, అప్పుల పాలై పోతున్నారు. తుదకి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సిటీల్లో షాపింగ్ మాల్సూ, పబ్బులూ రావడంతో, కాల్ సెంటర్ వంటి వృత్తులు పెరగడంతో యువత అంతా బరి తెగించి తప్పు దారిన పడిపోతున్నారు. నిజమే, ఇవన్నీ జరిగాయి, జరుగుతున్నాయి. కాదనడం లేదు. ఐతే ఈ కథల్లో అమెరికా అధ్యక్షుడు తుమ్మాడు, ఆంధ్ర ప్రదేశ్‌లో తుపాను చెలరేగింది అన్నట్టుగా ఉంటుంది లాజిక్. ఆర్ధిక సంస్కరణలు ఎందుకు అమలు జరిగాయి, ఆ అమలు జరగడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర ఏమిటి? అప్పుడు రాజ్యాధికారంలో ఉన్న వ్యక్తుల దృష్టి ఏంటి? కోకకోలాకీ మా యింటిపక్కన సోడా షాపుకీ ఏవిటి సంబంధం? మాన్‌శాంటోకీ తెలుగు రైతుల ఆత్మహత్యలకీ ఏవిటి సంబంధం? అసలు తెలుగు రైతు ఎటువంటి మార్కెట్ పరిస్థితుల్లో వ్యవసాయం చేస్తున్నాడు ఈ రోజున? వ్యవసాయం చేసి లాభ పడినవాడే లేడా? లాభం తీసిన వాళ్ళు ఏం చేసి విజయం సాధిస్తున్నారు? ఇరుక్కుపోయినవాడు ఎటువంటి తప్పు నిర్ణయాల వల్ల ఇరుక్కు పోతున్నాడు? వీటన్నటికీ అంతర్గతంగా ఉన్న ఆర్ధిక, రాజకీయ, సామాజిక అంశాలేవిటి? ఇవేవీ పరిశోధించే తీరిక, పరిశోధించిన విషయాల్ని విశ్లేషించే ఓపిక ఎవరికీ లేవు. దినపత్రికలో వార్త చూడ్డం, కథ రాసెయ్యడం. బాగు పడేవాడు ఎందుకు బాగు పడుతున్నాడు? ఆరిపోయేవాడు ఏయే బలహీనతలవల్ల ఆరిపోతున్నాడు? అబ్బే - బాగుపడేదే లేదు. నో ఛాన్స్! అలా ఉంటే మరిప్పుడు మధ్యతరగతి భారతీయులు కారు, ఇతర ఆధునిక హంగులు సమకూర్చుకోవడం, ఫారిన్ వెకేషన్లకి వెళ్లడం విరివిగా ఎలా సాధ్యపడుతున్నాయో? ఇరవయ్యేళ్ళ కిందట యువతీ యువకులు - ఇంజనీరింగ్ లేక మెడిసిన్ కాకుండా సాధారణ డిగ్రీ చదివితే - అర్ధపావలా జీతంతో ఏదో ఒక అత్తెసరు ఉద్యోగంలో కూరుకుని ఉసూరుమనిపించే బతుకులీడ్చడమే కద! మరి తొంభైలనించీ లక్షలమంది తెలుగు యువతీ యువకులు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా ఎలా తయారయ్యారు? ఎలా ఆర్జిస్తున్నారు? ఏవిటీ పరిణామాలు? ఇవేమీ కనబడవు. సాఫ్టు వేరు జీవితాలది అది ఇంకో కథలేండి. దీని దగ్గరికి మళ్ళి వస్తాను తరువాయి టపాలో.

ఈ గ్లోబలైజేషన్ కథల్లో సెజ్‌లు, రియలెస్టేట్ కి సంబంధించినవి కొన్ని. వీటిల్లో నేపథ్యం ఎలా ఉంటుందంటే ఏదో పెద్ద కంపెనీ - బహుళజాతిదైతే మరీ మంచిది, డాలర్లతో స్థానిక ప్రభుత్వాన్నీ పోలీసునీ కొనేసి పేద ప్రజల భూమిని స్వాహా చెయ్యడానికి భూతంలా విరుచుకు పడుతుంది. నిజమే - భూమి వాళ్ళది. దాని మీద సర్వ హక్కులు వాళ్ళకి ఉన్నాయి. కాదనను. కానీ దేశాభివృద్ధి జరగాలి అంటే పారిశ్రామికీకరణ కూడా జరగాలి. దానికి భూమి కావాలి. ఎప్పుడో అరవైలలో జరిగిన కమ్యూనిస్టు ఉద్యమాల స్లోగన్లు ఒక పక్కనా, రైతు ప్రాణం భూమిలోనే ఉంది, తన రక్తంతో భూమిని తడిపి పండిస్తున్నాడు లాంటి పనికిరాని సెంటిమెంట్లు మరో పక్కనా పెట్టుకుని ఈ సెఝ్ కథలు రాసేస్తుంటారు. ఈ ప్రజలు అసలే పేద వాళ్ళు. ఒక్కొక్కళ్ళకీ ఉన్నది ఒక ఎకరం, అరెకరం బాపతు. ఏం చేసుకుంటారు ఆ కొద్ది భూమిని? వాళ్ళకి సేద్యం చెయ్యడానికి ఏమేమి వసతులున్నాయి? ఒకేళ సేద్యం సరిగ్గా జరిగి పంట చేతికొచ్చినా మార్కెట్ ఏది వాళ్ళ ఉత్పత్తికి? వాళ్ళకి జరుగుబాటు ఎట్లా? చిన్న కమతాలవల్ల బాగు పడిన వాడెవడూ లేడు. ప్రపంచవ్యాప్తంగానే కాదు, స్థానికంగా కూడా అన్ని పరిస్థితులూ మారుతున్నాయి. ఆ మారుతున్న పరిస్థితులకి తగినట్టుగా ప్రజలు చైతన్యవంతులు కావాలి, బాగు పడాలి, దానికి తగిన ప్రయత్నాలు సర్వత్రా జరగాలి. అంతే కాని కాలం చెల్లిన స్లోగన్లతో సెంటిమెంట్లతో ప్రజల జీవితాలు బాగుపడవు. అలాంటి భావాలు అభ్యుదయ భావాలు కాదు సరికదా, తిరోగమన భావాలు.

ఇంకా ఉంది వడ్డన. కొనసాగుతుంది నా వీలెంబడి.

Comments

teresa said…
Very good write-up on chosen topic !
చకాచకా వ్రాసేస్తున్నారు.

బావుంది.

కొన్ని ఉదాహరణలు ఇస్తూ వెళితే ఇంకా రుచిపెంచడానికి చిటికెడు కారంజల్లినట్టు ఉంటుంది.
Zilebi said…
కొత్త పాళీ గారు,

బాగా చెప్పారు!

కోకో కోలా కీ యింటిపక్కన సోడా షాపుకీ సంబంధం!

ఈ ట్రెండు మనం బ్లాగు కామెంట్లలో కూడా గమనించ వచ్చు. !

చీర్స్
జిలేబి.
Indian Minerva said…
సత్యము వచించింతిరి. ఈ వాద కధల్లో అన్నికోణాలు హీరో/హీరోయినేతరుల ఇతరకోణాలు చర్చించకపోవడమనేది, ఆ ఇతరులను పరమ కౄరులుగా చిత్రించడమనేది నాకున్న అతి పెద్ద ఫిర్యాదు.

ఇక కమతాలు అవీ దగ్గరకొస్తే మనదేశంలో పొలం అనేది ఒక ఆస్తి (ఇప్పుడు కాదేమో). చిన్నదైనా దాన్ని కలిగుండటం చాలా మంది ప్రతిష్టగా భావిస్తారు. రక్తాలతో పండించకపోయినా అది వాళ్ళదగ్గరనుంచి లాక్కోవడాన్ని నేను సమర్ధించనండీ. Let that be an option for them to fall back to when everything fails. అమెరికాలోలాగా రాంచీల్లో వందల హెక్టార్లలో సాగుచేస్తే యంత్రాలను వాడి, ఖర్చుతగ్గించుకొని, లాభాలు పొందవచ్చు నిజమే కానీ భూములు లాక్కోవడం మాత్రం too much. వాళ్ళు తమంతటతాముగా వ్యవసాయాన్ని వదిలేస్తే అదివేరేవిషయం. హా... అంతగా కావాలంటే ప్రభుత్వం ఈ చిన్నకమ్నతాలనూ "నిరుత్సాహ పరిచడం" (చైతన్యవంతం చెయ్యడంద్వారా) మాత్రం నాకు ఓకే.
s said…
మీరు చెప్పింది నిజమే,, కోకోకోలా మన ఇంటి పక్క సోడా మూత పడటానికి కారణం దానిలో ఉన్న ఆకర్షణ మన సోడా లో లేకపోవటమే, దానికి కారణం మనకు మెళుకువలు తెలియకపోవటం, ఆ మెళుకువలు నేర్చుకొనే ప్రయత్నం చేయకపోవటం, ప్రభుత్వం కూడా మెళుకువలు నేర్పే ప్రయత్నం చేయకుండా వాటిని నేరుగా ప్రవేశ పెట్టటం, మనకు కొన్ని మెళుకువలు తెలియచెప్పి వాటిని అనుమంతిచినట్లయితే కొంతవరకు బాగుండేది, అయినప్పటికీ గ్లోబలైజెషన్ ని విమర్శించటంలో కూడా అర్ధం లేదు, మనము వాటి స్థాయి కి ఎదగాలి
Interesting points...quite true!
ముఖ్యంగా స్త్రీవాద రచనలు, దళిత, ముస్లిం రచనల్లో ఇంత పార్శ్వాలను చూపకపోవడం గురించి. కానీ ఒక చిన్న కథలో ఎంతవరకూ అన్ని పార్శ్వాలను చూపించగలరు అని?

Waiting for next part!
Anonymous said…
మిగతా వాదాల మాటెలా ఉన్నా ......
ఎకరమో అరకెరమో , భూమంటూ ఉంటే చెయ్యడానికి అతనికి పని ఉంటుంది, అవసరానికి అప్పు దొరుకుతుంది , అతని ఇంట్లో పిల్లలికి పెళ్ళవుతుంది , తనకంటూ ఒక ఆస్తి ఉందనే ధైర్యం , భరోసా వుంటాయి. తరువాతి తరాలవారికి తానేదో మిగుల్చి ఇచ్చాననే సతృప్తి దొరుకుతుంది . రైతుకి ఆ సెంటు నేలతో ముడిపడ్డ అనేక సెంటిమెంట్స్ ఉంటాయి . అవన్నీ కేవలం రూపాయిలుగా మారిపోయి కాలంతోపాటూ ఖర్చయిపోతాయంటే ఎవరికయినా బాధగానే వుంటుంది . అది మీరు అర్ధం చేసుకోవాలి . ప్రాణం పోవడమనేది జీవితంలో చిట్టచివరి దశ ఎలానో భూమిని వదులుకోవటమనేదీ రైతుకి చిట్టచివరి నిర్ణయం అవుతుంది . ( బినామీ పేర్లతో వందల ఎకరాలు ఉన్నవారికి ఇది వర్తించదు లెండి. మీరు చెపినట్టూ ఎకరమో అరెకరమో ఉన్నవాళ్ళకే ఆ భూమితో అనుబంధం ఎక్కువుంటుంది )
బాగా చెప్పారు. నేనూ ఇలాగే అనుకున్నాను చాలా సార్లు.
Ennela said…
waiting for the next post..
మాలతి said…
మంచి అంశం తీసుకుని సూక్ష్మదృష్టితో మంచి ప్రశ్నలు కురిపిస్తున్నారు, చర్చిస్తున్నారు. కేవలం కథలకే పరిమితం చేసి (అంటే కథాంశాలు రైతులకి పొలాలు ఉండాలా అన్నమాట ప్రస్తుతానికి పక్కన పెట్టి) అడుగుతున్నా. మీ రానున్న టపాల్లో ఇలాటి కథలని మాత్రమే సంపాదకులూ, పోటీలు నడిపేవారూ ప్రోత్సహిస్తున్నారు అన్నది కూడా చర్చిస్తారా?
Kottapali said…
teresa, గిరి, నెనర్లు. ఇంకొన్ని అంశాలు ఉన్నాయి ఈ వరుసలో మాట్లాడాల్సినవి ఇంకా. త్వరలోనే.

Zilebi, నచ్చినందుకు సంతోషం. బ్లాగు వ్యాఖ్యలు - ఏమో మరి, మీకే తెలియాలి.

Indyan Minerva, నా వాదనకి ప్రతివాదన లేవనెత్తినందుకు నెనర్లు. తరువాతి టపాలో సమాధానమిస్తాను.

rvmohan, నా ఉద్దేశాన్ని బాగా అర్ధం చేసుకున్నారు. నెనర్లు.

ఆ. సౌమ్య, నిజమే, కథలో ప్రతీ పాత్రకీ పూర్తి స్వరూపాన్ని చూపించలేరు. కానీ ఆ చూపించే కొద్ది భాగమూ క్లిషే కాకుండా ఉండాలని నా తపన.

లలిత, కాదనను. కానీ సృజనాత్మక రచన, అభ్యుదయ వాదాన్ని తలెత్తుకునే రచన ఇటువంటి సెంటిమెంట్సుని అధిగమించాలి గదా.
Kottapali said…
మనోజ్ఞ, that's right. great minds think alike :)

Ennela, thank you.

మాలతి గారు, మంచి ప్రశ్నలే లేవనెత్తారు. ప్రస్తుతానికైతే ఈ వరుసలో సంపాదకుల, పోటీల జోలికి నేను వెళ్ళబోవటం లేదు. ఈ మధ్య కాలంలో పరిశీలించలేదు - అందువల్ల కూడా దాన్ని గురించి ఏమీ చెప్పలేను. కానీ అది అధ్యయనం చెయ్యాల్సిన అంశం. ఈ మధ్యనే విడుదలయిన కొత్త కథా సంకలనాలు కొన్ని చేతికి అందినయ్యి. చదువుతున్నాను. సంపాదకుల మెప్పు ట్రెండు గురించి త్వరలోనే వ్యాఖ్యానిస్తాను. పోటీల సంగతి బొత్తిగా తెలియదు.
Kottapali said…
Indyan Minerva - read your comment again. Please note that my point is not about government policy or the nature of SEZ or behavior of MNCs. It is only about what is depicted in our stories, and how it is depicted.
సూపరో సూపర్....సాఫ్ట్వేర్ వెర్షన్ కోసం వెయిట్ చేస్తూ....
తెలుగు కథలు అంటేనే నేను పాతిక్కిలోమీటర్లు పారిపోతాను. ఎసుపెసెల్లీ ఘొప్ప సాహిత్యంగా చెప్పబడేవీ అనగా మీరు చెప్పిన తరహావన్నమాట. ఏ మాత్రం పరిశోధనా, సాధ్యాసాధ్యాల పరిశీలనా లేకుండా పడక్కుర్చీలో ప్రపంచ యాత్ర చేసిన మాదిరి వ్రాయబడే వాటిని చదవాలంటేనే భయం. మంచి కథంటే వేటికైనా రిఫరెన్స్ గా ఉపయోగించుకునేలా ఉండాలి. అన్నీ అని కాదు, ఆ సదరు వాస్తవిక కథలు అనేవి. నా బాధను మీరు చురకల రూపంలో వేశారు కదా! ధన్యవాదాలు. నామోవాకాలు.

సెలవ్ :-)
Bolloju Baba said…
గురువుగారూ
కవిత్వంలో క్లిషే ల గురించి ఎప్పుడు రాస్తారు సార్
మీ తెలుగు కథల్లో క్లిషేలు రెండు పోస్టులూ ఇప్పుడే చదివాను.మంచి కథలు వ్రాస్తున్నామనుకునే వారందరూ చదివి ఆలోచించవలసిన విషయాలివి. పాతసినిమాల్లో రాజనాల కనిపించగానే విలనెవరో మనకి తెలిసి పోయినట్లు ఈ కమిటెడ్ రైటర్స్ రచనలన్నీ మూసలో పోసినట్లే ఉంటాయి.సెజ్ కథలగురించి- నిజమే-రైతులనుంచి బలవంతంగా భూమి లాక్కుంటే వారికి కలిగే బాధ ఆలోచించి తీరాల్సిన విషయమే. అవసరమైతే చిన్న కమతాలవారికి more than adequate compensation తో పాటు alternate tillable land కూడా ఇవ్వాలి . ఈ విషయమై ఎన్ని agitations అయినా చెయ్యవచ్చు. అంతే కాని అసలు సెజ్ లే వద్దనడం, డాములు కట్టవద్దనడం పరిష్కారం కాదు కదా? ఈ విషయంలో సరైన అవగాహన మన కథకులకీ లేదు, కమ్యూనిష్లులకీ లేదు. ఇప్పుడు రష్యా ఎలాగూ మనకి రోల్మోడల్ కాదు. అందరూ అమెరికా సాధించిన అభివృధ్దిగురించి మాట్లాడే వాళ్లే. అటువంటి అభివృధ్ధి కావాలా వద్దా అన్నది వేరే విషయం. కానీ కావానుకుంటే, చిన్న రైతుల భూములను తీసుకోకుండా వారినక్కడనే సేద్యం చేసుకోమంటూ దాని కోసం ఏదో కొంత సాయం చేస్తూ ఎన్నాళ్లు గడిపినా ఇండియా అమెరికా మాదిరి తయారవుతుందా? విమర్శిస్తూ కథలు రాసే వారికి పరిష్కారా లేమిటో సూచించవలసిన బాధ్యత కడా ఉందని నేననుకుంటున్నాను. మీ చురకలు కొన సాగించండి.ప్రయోజనం ఉంటుందని నేననుకోవడం లేదు కానీ మన పని మనం చేయాలికదా? ఎప్పుడూ ఆలోచింపజేసే thought provoking పోస్టులు రాస్తున్నందుకు మీకు నా అభినందనలు.అన్నీ చదువుతున్నా వాటి మీద వచ్చే కామెంట్ల మధ్యలో దూర లేక దూరంగా ఉంటుంటాను.Carry on your crusade...
Kottapali said…
ప్రవీణ, నెనర్లు. పని వత్తిడిలో ఇది వెనకబడింది. త్వరలో వెలువరిస్తాను.

గీతాచార్య, ఈ విషయంలో నా దృష్టి మీ దృష్టికి వ్యతిరేకం కాదేమోగానీ భిన్నం మాత్రం అవును. సృజనాత్మక రచన factual reference కాకపోవచ్చు కానీ అందులో మానవోన్నతికి అవసరమైన దినుసులు చాలా ఉండాలని నా అభిప్రాయమూ ఆశా.

బొల్లోజు బాబా, కవిత్వ క్లిషేల్ని గురించి రాసే కెపాసిటీ నాకున్నదని అనుకోను. పైగా, ఆ చర్చ ఇప్పటికే కొన్ని చోట్ల జరుగుతూ ఉన్నట్టు చూశాను.

గోపాలకృష్ణగారు, నమస్కారం. మీ ప్రోత్సాహానికి నెనర్లు.
ఒక రచన/రచయితని మరొక రచయిత, విమర్శకుడు, సమీక్షకుడు, చదువరి వివిధ కోణాల్లో చూపుతారు/చూస్తారు. మీ ఈ 2 వ్యాసాల్లో సాటి రచయితగా నిరసన, విమర్శకుడిగా అసహనం, సమీక్షకుడిగా నిరాశ, చదువరిగా అసంతృప్తి కనిపించాయి నా వరకు. కొందరు రచయితలవి ఫ్రీజర్లో దాచిన కలాలు. ఎప్పుడు తీసినా పాత సిరా నే కక్కుతాయి.

మీరు చదివి ఉండకపోతే ఇది చూడండి ఓ సారి: http://www.navyaweekly.com/2012/feb/29/page48.asp

అపుడపుడూ ఇలా ఎండలో నిమ్మమజ్జిగలా ఒక రచన దొరికినా చాలు. తొలికథ అని తెలియకపోతే చాలా అనుభవం ఉన్న రచయితలా, కొత్త దారిని పరుచుకున్న మనిషిలా ఉంటాడతను. కథలోకి ముందు నడిచి, తర్వాత చొచ్చుకుని రచయిత భావాలన్ని అనుభవించినట్టు అనిపించింది.
Anonymous said…
ఏకేశారు. మరి ముసలివాళ్లని ఇంట్లోవాళ్లు వదిలేస్తే తమ స్నేహితులతో ఓ ఓల్డ్ ఏజ్ హోం పెట్టుకునే కథలు వదిలేశారే? ఈనాడు ఆదివారం సంచికకి అదేం పోయేకాలం వచ్చిందో కానీ సంవత్సరన్నర పాటు ఇవే కథలు. ఏ కథ చదివినా పొడిపొడిగా ఇంటర్వ్యూ చేసొచ్చి రాసిపారేసినట్టుగా అనిపించేది ఆ కథలు చదివితే.