Monday, February 26, 2007

మోహన రాగ మహా - 2

ఆ ట్రిప్పు నించి ఇల్లు చేరి ఇంట్లో స్టీరియో ఆన్ చేసి ఏవో పనులు చేసుకుంటున్నాను. సంజయ్ సుబ్రహ్మణ్యం పాడుతున్నాడు. ఈ తరం గాయకుల్లో నా కిష్టమైన గాయకుడీయన.
ఏవేవో పాటలు, రాగాలు జరిగిపోతున్నై. నేను కొంతవరకూ నా పనిలో మునిగిపోయి కొంత పరధ్యాసగా వింటున్నా. మోహన ఆలాపన మొదలైంది. అరే, పొద్దుటే నేదునూరి గారి మోహనం .. మళ్ళీ ఇక్కడ కూడా మోహన తటస్థించిందే అనుకుని దాంతో బుర్ర కొంచెం మెలకువ తెచ్చుకుని కాసేపు శ్రద్ధగా అతని ఆలాపన విన్నాను. ఇంతకంటే బాగా పాడచ్చే అనిపించింది. ఎందుకంటే సంజయ్ బాగా పాడటం - రికార్డుల్లోనూ ప్రత్యక్షంగానూ నేను విని ఉన్నాను. భైరవి లాంటి కష్టమైన రాగాల్ని అతను సరసంగా, రసభరితంగా పండించడం నాకు తెలుసు. పొడుగు ఆలాపనే చేసేట్టు ఉన్నాడు, ఏం పాట పాడతాడో అని కుతూహలం, కానీ ఈ ఆలాపన ఏమంత ఉత్సాహంగా అనిపించలా. నాకు ఇంట్రస్టు పోయింది. నేను నా పనిలో పడిపోయాను. స్టీరియో దాని పని అది చేసుకుపోతోంది.
నేను చేస్తున్న పని ముగించి తలెత్తి చూద్దును గదా, అప్పటికే అతను నెరవులు వేస్తున్నాడు. నెరవులు అంటే - పాటలో ఏదో ఒక లైను తీసుకుని, దాన్ని వాగ్గేయకారులు స్థిరపరిచిన స్వరంలో కాకుండా, గాయకుడు తన సృజన శక్తితో విడమరిచి విస్తరించి పాడటం. కర్ణాటక సంగీతంలోని improvisational elementsలో ఇదొకటి. మాట స్పష్టంగా అర్థం కావట్లేదు కానీ, ఏదో బాగా తెలిసిన ముక్కల్లేనే వుంది.
"తరమనూ ఝావ తారమ హిమ .."

ఓహ్హోహో, అర్థమైంది.
ధర మనుజ+అవతార మహిమ విని ..
ఇది మోహన రామా అని మొదలయ్యే త్యాగరాజ కృతి. రాముని సద్గుణాల్నీ, రామావతార పరమార్థాన్నీ మోహన రాగమనే రసాయనంలో రంగరించి ఆ రసాన్ని ఈ కృతిలో పిండాడు స్వరార్ణవాన్ని జీర్ణించుకున్న ఆ అపర నారదుడు, త్యాగరాజస్వామి. త్యాగరాజ కృతుల్లో పది గొప్పవాటిని ఎంచుకోమంటే నా లిస్టులో ఈ కృతి తప్పక ఉంటుంది.
మళ్ళీ కథకొద్దాం. పాపం మన తమిళ సోదరులకి త థ ద ధలన్నిటికీ కలిపి ఒకటే అక్షరం - దాంతో వొచ్చిన తిప్పలివి - ధర మనుజావతార కాస్తా తరమనూ అయి కూర్చుంది. అఫ్ కోర్సు, నెరవులు పాడేప్పుడు - అక్కడ ఉచ్చారణ కంటే రాగ ప్రస్తారానికే పెద్దపీట కాబట్టి కొంత మాట విరుపులు తప్పవనుకోండి.
సీడీని కాస్త వెనక్కి తోసి పాట మొదణ్ణించీ విన్నాను. మిగతా సాహిత్యమంతా బానే పాడాడు సంజయ్. నెరవుల తరవాత స్వరకల్పన కూడా బానే వుంది, "తరమనూ" ని లక్ష్యపెట్టక పోతే.
ఈ పాట అయ్యాక ఒరిత్తి మహనా పిరందు అనే తిరుప్పావాయ్, పెట్రతాయ్ తనమహన్ మరందాలుం అనే విరుత్తం రాగమాలికలో, చివరిగా ఆరాయ్ ఆశై పడాయ్ అనే శైవ భక్తి కీర్తన నాదనామక్రియ రాగంలో తమిళంలో చాలా బాగా పాడాడు. ఈ చివరి రెండు అంశాలూ ఎమ్మెస్ సుబ్బులక్ష్మి ఏదో రికార్డులో పాడింది.
ఇదేదో live recording. రెండు సీడీల సెట్టు. సంజయ్ గాత్రంలో బెస్టని చెప్పను గానీ, విన దగ్గదే.
వివరాలివిగో

http://www.charsur.com/aspx/ProductDetails.aspx?ProductId=113

మూడవ మోహనం త్వరలో ..

వాగ్భూషణం భూషణం

కేయూరాణి న భూషయంతి పురుషం హారా న చన్ద్రోజ్జ్వలా
న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః
వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతాధార్యతే
క్షీయన్తే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం


మీలో మరీ చిన్నవారికి పరిచయం ఉండక పోవచ్చు, నా తరం వాళ్ళూ, రేడియో వినటం అలవాటున్నవాళ్ళూ ఐన వారికి ఈ శ్లోకం చిర పరిచయమే.

ఆ రోజుల్లో "సంస్కృత పాఠం" అని ఒక పది పదిహేను నిమిషాల కార్యక్రమం వచ్చేది. ఈ శ్లోకం ఆ కార్యక్రమానికి "థీం సాంగ్" అన్నమాట. నాలుగైదు ఆడా మొగా గొంతులు కలిసి పాడిన బృందగానం. అలాగని నాటకాల్లో సినిమాల్లో పద్యాల్లాగా రాగాలు తియ్యరు - సస్వరమైన వేద పఠనంలా ఉంటుంది. వెనకాల కేవలం ఒక్క వీణ మాత్రమే వత్తాసు ఇచ్చేందుకు.

ఇంతకీ నేను సంస్కృతం నేర్చుకున్నది లేదు, ఆ సంస్కృత పాఠాలు విన్నదీ లేదు. అప్పటికి ఈ శ్లోకానికి అర్థమూ తెలీదు. ఇది ఫలానా అని తెలియ చెప్పిన వారూ లేరు. అసలు శ్లోకంలోని చాలా మాటలే స్పష్టంగా తెలీవు. ఎటొచ్చీ వినడానికి చాలా హాయిగా అనిపించేది. చివరి వరుసలో .. "వాగ్భూషణం భూషణం" అన్న ముక్తాయింపు మాత్రం పట్టుబడింది. ఆ రెండు మాటల్నే వాళ్ళు పాడిన బాణీలో ఒకటికి పది సార్లు అనుకునే వాణ్ణి.

తరవాతెప్పుడో తెలిసింది - ఇది భర్తృహరి నీతి శతకంలో విద్వత్పద్ధతిని చెప్పే శ్లోకాల్లో ఒకటి అని.

పురుషుని (పోనీ మనిషిని అనుకోండి) భుజకీర్తులు అలంకరించవు. భుజకీర్తులు అంటే దుర్యోధన వేషం వేసినప్పుడు NTR భుజాల మీద బంగారు తొడుగు వేసుకుంటాడు చూడండి - అది. ఇక్కడ భుజకీర్తులు అలంకరించవు అంటే అర్థం, ఒకవేళ ఆ మనిషి ధనికుడై ఉండి భుజకీర్తుల్ని అలంకరించుకున్నా కూడా అవి అతనికి నిజమైన అలంకారం కాదూ అని. అలాగే, చంద్రుడిలా తెల్లని కాంతితో ప్రకాశించే ముత్యాల హారాలు కూడా అలంకారం కాదు. స్నాన విలేపనాలు (అంటే సబ్బులూ, లోషన్లూ), పువ్వులూ, ఎంచక్కా పెంచుకున్న జుట్టూ - ఇవేవీ మనుషునికి నిజమైన అలంకారాన్ని ఇవ్వవు.

ఒక్క వాణి (వాక్కు, మాట) మాత్రమే మనిషిని అలంకరిస్తుంది. ఎటువంటి వాక్కు? యా సంస్కృతా ధార్యతే - తర్క వ్యాకరణాది శాస్త్రములచే చక్కచేయబడి ధరించిన వాక్కు - అంటే చదువు, పాండిత్యం. మిగతా అలంకారాలన్నీ క్షీణించవచ్చు, వాక్కు అనే భూషణం ఎప్పటికీ వన్నె తరగక కలకాలం అలంకరిస్తుంది.

ఇక్కడ అలంకారం అంటే - కేవలం అందం ఆకర్షణ మాత్రమే కాదు. భూషణాలు ధరించట మెందుకు? అందం ఆకర్షణ పెంచుకునే ప్రయత్నం ఎందుకు? అవి మనిషి విలువని పెంచుతాయని. ఏ ఆభరణలూ ఇవ్వని విలువ మంచి మాట ఇస్తుంది మనిషికి.

ఈ శ్లోకం శార్దూలవిక్రీడితం అనే ఛందస్సులో ఉంది. దీనిలో "న, న" అంటూ మొదలుపెట్టటాన్ని వ్యతిరేక అలంకారం అంటారుట.

ఈ శ్లోకానికి ఏనుగు లక్ష్మణ కవి గారి అనువాదం ఇదిగో -
ఉ. భూషలు గావు మర్త్యులకు భూరి మయాంగద తార హారముల్
భూషిత కేశపాశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్
భూషలు గావు పూరుషుని భూషితు జేయు పవిత్ర వాణి వాక్
భూషణమే సుభూషణము భూషణముల్ నశియించు నన్నియున్.

తా.క. రానారె వ్యాఖ్యతో శ్లోకంలో నేను గమనించిన కొన్ని చిన్న తప్పులు సవరించాను.

Sunday, February 25, 2007

మోహన రాగ మహా!

ఇరవై నాలుగ్గంటల వ్యవధిలో నాలుగు సార్లు మోహన రాగం!

అఫ్ కోర్సు (దీనికి తెలుగు సమానార్థక పదమేదన్నా ఉందా? లేకపోతే ఒకటి సృష్టించరూ!!), వంకాయ కూర లాగే మోహన రాగమున్నూ - రెండూ ఎప్పటికీ మొహం మొత్తవు - వండి వడ్డించే వాళ్ళు వాటిని మరీ ఖూనీ చేస్తే తప్ప.

Rare Krithis of Tyagaraja అనే సీడీ. సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తి గారు గానం చేసినది. ఈ సీడీ సుమారు ఏడాది క్రితం కొన్నాను, ఆ మధ్యనే రిలీజయింది. ఇన్నాళ్ళూ ఎప్పుడూ శ్రద్ధ పెట్టి విన్న పాపాన పోలేదు అని చెప్పి నిన్న ఏదో గంట దూరం డ్రైవు చెయ్యాల్సి వొచ్చి కార్లో పెట్టుకుని వింటున్నా. ఇంతకు మునుపు ఎక్కడా వినని (చూడని) కృతులు వెలికి తీసి, వాటికి స్వరరూపం కల్పించి వెలువరించారు శ్రీ నేదునూరి. వయసు బాగా పైబడింది, గొంతులో ఇదివరకటి ఖంగు తగ్గింది, ఐనా వంత పాటకి మల్లాది సోదరుల్లాంటి సమర్ధులైన శిష్యులుండగా ఏమి కొదవ?

అఠాణా, కళ్యాణి, యదుకుల కాంభోజి, పంతు వరాళి .. ఇలా ఎన్నో రాగాల్లో .. నేదునూరి గాత్ర మాధుర్యానికి తోడుగా వారి మనోధర్మం, పాటని స్వరపరచటంలో ఆ రాగ రూపాన్ని తాను ప్రత్యక్షం చేసుకుని శ్రోతకి ఆవిష్కరించే సృజన శక్తి .. ఇలా ఆశ్చర్యపోతూ వింటూ ఉండగా, ఎనిమిది కృతులయ్యాక సంస్కృతంలో ఒక శ్లోకం ఎత్తుకున్నారు - వ్యాసో నైగమ చర్చయా - అంటూ. వేదసారాన్ని చర్చించటంలో వ్యాసుడు, మృదుకవిత్వంలో వాల్మీకి, వైరాగ్యంలో శుక మహర్షి, భక్తిలో ప్రహ్లాదుడు, సాహిత్య సంగీతాల్లో బ్రహ్మా నారదులు, రామ నామామృత పానంలో శివుడు అయినటువంటి శ్రీ త్యాగరాజస్వామిని భజిస్తాను అని శ్లోకార్థం.

ఇలా శ్లోకాన్నో పద్యాన్నో ఒక్కొక్క పాదం ఒక్కొక్క రాగంలో రాగమాలికగా పాడడాన్ని "విరుత్తం" అంటారు - బహుశా వృత్తం అనే ఛందో పదానికి అపభ్రంశ రూప మనుకుంటాను. ఈ విరుత్తం పాడ్డంలో షణ్ముఖప్రియతో మొదలు పెట్టి నెమ్మదిగా కానడలోకి జారి మూడో పాదంలో చటుక్కున తారస్థాయిలో మోహనం ఎత్తుకున్నారు నేదునూరి.

ఆహాహా - ఆ మాధుర్యం ఏమని చెప్పను .. అప్పటికి నేను చేరాల్సిన చోటికి చేరినా విరుత్తం మొత్తం వినిగానీ దిగలేదు. ఇక ఆ పూటంతా ఆ మోహన రాగ పాదం మనసులో మెదుల్తూనే ఉంది.

రెండవ మోహన దర్శనం తరువాయి టపాలో.

ఈ లోపల సీడీ వివరాలివిగో:
Rare Krithis of Tyagaraja
Presented by Sangita Kalanidhi Nedunuri Krishna Murthy

Produced and Marketed by
Sri Nedunuri Krishna Murthy
2-16-27/1, Sector 6
M.V.P. Colony, Visakhapatnam - 17
Sri Nedunuri's Website

Includes 8 rare krithis plus one ragamalika viruttam and a mangalam on Sri Tyagarajasvami
The sleeve insert has all the lyrics in RTS English script!

Friday, February 23, 2007

రమ్యమైన విరామం

మొన్న చదువరి గారి తప్పటడుగులు టపా చదివి పగలబడి నవ్వుకున్నాక, వారు ఉదహరించిన "సడిసేయకో గాలి" పాట గురించి ఆలోచిస్తుండగా రేగిన ఆలోచనలివి. అంతకు ముందొక సారి ఆయన ఆ పాట ఆడియో వేశారు తన టపాలో, సాహిత్యాన్ని జతపరిచి. వారు ప్రచురించిన సాహిత్యంలో దొర్లిన ఒక చిన్న తప్పు సవరించాను ఆ పూట.
నీడ మబ్బుల దాగు నిదుర తేరాదే
ఆయనెందుకో అది "పీడ మబ్బుల" అనుకున్నారు. పీడ అనే మాటకున్న పీడార్థాన్ని కాసేపు పక్కన పెట్టండి. అసలు మాటల అర్థంతో పని లేకుండానే ఆ వరుసలో మొదటి మాట పీడ కాదని చెప్పొచ్చు - ఎలా?
ఆ చరణం మొత్తం ఒకసారి పరికిద్దాం -
పండు వెన్నెల నడిగి పాన్పు తేరాదే
-- మబ్బుల దాగు నిదుర తేరాదే
విరుల వీవెన పూని విసిరి పోరాదే సడిసేయకే

బుర్రపండులో చిరువిత్తనంలాంటి యుక్తేవన్నా తట్టిందా?ఊహూ??
సరే.
వరుస మొదణ్ణించీ ప్రతి అడుగూ (వీటిల్నే మాత్రలంటారు) లెక్కపెట్టి వేసుకోండి.
పం (2) + డు (1) = 3 మాత్రలు
వెన్ (2) +నె (1) + ల (1) = 4 మాత్రలు
న (1) +డి (1) + గి (1) = 3 మాత్రలు
అంటే 3+4+3 మొత్తం పది మాత్రలు. తరవాత వచ్చే పదకొండో మాత్ర "పా", అవునా?
అలాగే మూడో వరుస చూడండి
విరుల = 3
వీవెన = 4
పూని = 3
మళ్ళీ 3+4+3 మొత్తం పది మాత్రలు. తరవాత వచ్చే మాత్ర "వి".
ఇప్పుడు ఈ అక్షరాల్ని "బోల్డు" చేసి చూపెడతాను.
పండు వెన్నెల నడిగి పాన్పు తేరాదే
-- మబ్బుల దాగు నిదుర తేరాదే
విరుల వీవెన పూని విసిరి పోరాదే సడిసేయకే
ఇప్పుడు కనిపిస్తోందా ఒక క్రమం?
పది మాత్రల తరవాత పదకొండో స్థానంలో మళ్ళీ మొదటి అక్షరమే వొస్తోందన్న మాట.
ఇక రెండో వరసలో చదువరి గారు అనుకున్నట్టు
"పీడ మబ్బుల దాగు నిదుర తేరాదే" - అనుకుంటే
పీడ = 3
మబ్బుల = 4
దాగు = 3
మళ్ళీ 3+4+3! పదకొండో స్థానంలో "పీ" రావాలి!!
అంటే ఇక్కడ మొదటి అక్షరమన్నా తప్పు కావాలి, పదకొండోదన్నా తప్పు కావాలి.
మాట వరసకి పదకొండోదే తప్పనుకుందాం.
నిదుర లో "ని" ని పీకేసి, "పి" ని స్థాపిద్దాం.
"పీడ మబ్బుల దాగు పిదుర తేరాదే" - ఇప్పుడసలు ఉన్నది కూడా చెడింది.
దేవులపల్లి వారు ఎంత మనకి అర్థం కాకుండా రాసినా, మరీ ఇలా అర్థమే లేకుండా రాయరు గదా?
అందుకని అక్కడ "నిదుర" సరైన మాటేనన్న మాట. మొదటి మాటనే "ని"తో మొదలయ్యేట్టు వెతుక్కోవాలి మనం.
అంటే --> నీడ! voila!!
దీన్నే ఛందస్సులో యతి అంటారు. అంటే సంస్కృతంలో చిన్న విరామ స్థానం అట. దీని విశ్వరూపాన్ని గురించి మరో టపాలో మాట్లాడుకుందాం.
ఈ పాటలో ఈ రమ్యమైన విరామంతో ఎంత అందమొచ్చిందో గమనించండి!
మీ కోసం పూర్తి పాట ఇదుగో.
డి సేయకో గాలి.. డి సేయబోకే
డలి, ఒడిలో రాజు వ్వళించేనే! సడిసేయకే..
త్నపీఠికలేని రారాజు నా స్వామి
ణి కిరీటము లేని హరాజు గాకేమి
చిలిపి పరుగుల మాని కొలిచి పోరాదే.. సడిసేయకే!
టి గలగలలకే గసి లేచేనే
కు కదలికలకే దరి చూసేనే
నిదుర చెదరిందంటే నేనూరుకోనే.. సడిసేయకే
పండు వెన్నెల నడిగి పాన్పు తేరాదే
నీడ మబ్బుల దాగు నిదుర తేరాదే
విరుల వీవెన పూని విసిరి పోరాదే .. సడిసేయకో గాలి

Sunday, February 18, 2007

ఓం నమః పార్వతీ పతయే ...

... హరహర మహాదేవ.

భగవాన్ శంకర్ జీ కీ జై

మహా శివరాత్రి పర్వదినం.

భక్తుల నినాదాలు మిన్నంటుతుండగా, ముగ్గురు అర్చక స్వాములకి తోడు స్థానిక విద్వాంసులు గొంతులు కలిపి, ఓం నమశ్శివాయ అనే పంచాక్షరీ, ఓం నమో భగవతే రుద్రాయ అనే దశాక్షరీ మంత్రాలు పట్టుకొమ్మలుగా మహాన్యాసం యధావిధిగా నిర్వహించి, ఇంచుమించు ముప్ఫై గొంతులు ఒక్క వాక్కుగా ఎలుగెత్తి సస్వరంగా నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః అంటూ రుద్రాధ్యాయాన్ని (దీన్నే రుద్రం, నమకం అని కూడా అంటారు) పదకొండు సార్లు పఠించి, ఆ పరమేశ్వరుని విశ్వమూర్తిత్వాన్ని, సర్వాత్మకత్వాన్ని, శివ స్వరూపాన్ని ప్రత్యక్షం చేసుకుని పాలు, పెరుగు, తేనె, పంచామృతం, చందనం, భస్మ జలం, శుద్ధోదకాలతో అభిషేకించి తరించాము.

భారత దేశ పౌరసత్వానికంతటికీ ప్రతీక గా కూడిన ఆ భక్త మండలిలో తెలుగువారైన మా అర్చకులు బ్రహ్మశ్రీ జానకిరామ శాస్త్రి గారు "జయ జయ మహాదేవా, శంభో సదాశివా" అంటూ శ్రావ్యంగా ఘంటసాలని గుర్తుచేసుకుని - "బోలో భూకైలాస శంకర మహరాజ్ కీ జై" అని భక్తులందరితో నినదింప చెయ్యటం .. నా తెలుగు గుండె గంతులేసి పరవశించింది.
నమస్సోమాయ చ రుద్రాయ చ
నమస్తామ్రాయ చ అరుణాయ చ
నమశ్శంగాయ చ పశుపతయే చ
నమ ఉగ్రాయ చ భీమాయ చ
నమో అగ్రేవధాయ చ దూరేవధాయ చ
నమో హంత్రే చ హనీయసే చ
నమో వృక్షేభ్యో హరికేశేభ్యో
నమస్తారాయ
నమశ్శంభవే చ మయోభవే చ
నమశ్శంకరాయ చ మయస్కరాయ చ
నమశ్శివాయ చ శివతరాయ చ
నమస్తీర్థ్యాయ చ కూల్యాయ చ
నమః పార్యాయ చ వార్యాయ చ
నమః ప్రతరణాయ చ ఉత్తరణాయ చ
నమ ఆతార్యాయ చ లాద్యాయ చ
నమశ్శష్ప్యాయ చ ఫేన్యాయ చ
నమస్సికత్యాయ చ ప్రవాహ్యాయ చ.

శంకరుడైన ఆ సాంబశివుడు అందరికీ ఆనందాన్నీ, ఈ ప్రపంచానికి శాంతినీ ప్రసాదించు గాక!

Monday, February 12, 2007

పుస్తకాల పండగ

శీతాకాలంలో దక్షిణ భారత దేశంలో జరుపుకునే ముఖ్యమైన పండగ సంక్రాంతి - అటు కన్నుల పండువుగానూ, ఇటు రుచుల విందుగానూ, వెరసి మనసుకి నిండుగానూ ఉంటుంది.కొన్నేళ్ళుగా, దక్షిణభారత దేశంలోని అనేక నగరాల్లో ఇంకో పండగ జరుగుతోంది శీతాకాలంలోనే. ఇది కూడా కన్నుల పండువుగానూ ఉంటోంది. రుచుల విందూ పెడుతోంది, ఐతే, నోటికి కాదు, బుర్రకి.


అదే పుస్తకాల పండగ.హైదరాబాదు, చెన్నై, బెంగుళూరు నగరాల్లో డిశంబరు - జనవరి కాలంలో ఈ పండగలు జరుగుతున్నై. ఇవి నేను చూశాను రెండు మూడేళ్ళ క్రితం.

ఐతే ఈ మహానగరాల పండగలన్నీ అచ్చెరువొందేటట్లు, అసూయ పడేటట్లు జరుపుతున్నారు బెజవాడలో.

అవును, విజయవాడ పుస్తకాల పండగ ఈ జనవరిలో పద్ధెనిమిదో పుట్టినరోజు జరుపుకుంది. నే చూసిన ప్రతి ఏడాదీ, ఇది పరిమాణంలోనూ, వైవిధ్యంలోనూ, నిర్వహణ సామర్ధ్యంలోనూ, ముందడుగే వేస్తున్నది. చాలా చాలా సంతోషించాల్సిన విషయం.


ఈ సారి నా కంట బడ్డ కొన్ని విశేషాలు.

విశ్వనాథ వారి సమగ్ర నవలా సాహిత్యం ఒకె సెట్టుగా దొరుకుతోంది.
ఎన్నో పాత (classic) నవలలు, కావ్యాలూ పునర్ముద్రణకి నోచుకుంటున్నాయి.
విశాలంధ్ర వారు పాత తరం గొప్ప రచయితల సమగ్ర సాహిత్యాన్ని ప్రచురించే వరుసలో, దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారివి రెండు పుస్తకాలు వెలువరించారు.

అమరగాయకుడు ఘంటసాల మీద కనీసం అరడజను పుస్తకాలు కనిపించాయి. వీటిల్లో సుమారు ఎనిమిది వందల పేజీల లావున ఆయన పాడిన పాటలన్నిటి సాహిత్యాన్నీ ఒక్క తాటిన కట్టే ప్రయత్నం ప్రత్యేక ఆకర్షణ (రానారె - వింటున్నావా?)) ఘంటసాల అభిమానులకి ఇది గొప్ప వరం.

మీరు గనక ఎప్పుడైనా జనవరి మొదటి వారంలో ఆంధ్ర దేశంలో ఉండటం తటస్థిస్తే .. తప్పకుండా పనిగట్టుకునైనా విజయవాడ వెళ్ళి ఈ పండగని తిలకించండి - మీరు నిరాశ చెందరు - నాది హామీ.

నేను ఈ సంవత్సరం సుమారు పదివేల రూపాయలు ఖర్చు పెట్టాను. పుస్తకాలు ఇప్పుడిప్పుడే బయల్దేరి వస్తున్నాయి. ఆయా పుస్తకాల గురించి - చదివినప్పుడల్లా - ఈ బ్లాగులో ముచ్చటిస్తుంటాను.

పుస్తక సంగీత సినీ ప్రపంచం

సంగీతమపి సాహిత్యం సరస్వత్యాః స్తనద్వయం
ఏకమాపాతమధురం అన్యదాలోచనామృతం

ఈ శ్లోకం ఎక్కడిదో గానీ నా విషయంలో చాలా నిజం.
అంటే నేనేదో "చంటి" వాణ్ణని మీలో కొంటె పిల్లలు అనుమానించనక్కర్లేదు.
నేనంటున్నది ఏంటంటే .. నా జీవతంలో నేను పోగేసుకున్న ఆస్తులు ఈ రెండే - ఒకటి నా పుస్తకాల లైబ్రరీ, రెండోది నా కేసెట్, సీడీ ల లైబ్రరీ.

ఈ రెండూ కాక నాకింకో అభిరుచి కూడా వుంది, పోలిక పై శ్లోకంలో ఇమడక పోయినా.
అది సినిమా.

ఈ మూడింటిలోనూ .. ఈ మధ్య చదివిన/విన్న/చూసిన వాటి గురించీ, నాకు నచ్చిన/నచ్చని విషయాల గురించీ .. నాకు తోచినట్టు ఇక్కడ రాసుకుందామని ఈ ప్రయత్నం.
ఇది నలుగురూ చదివి ఆనందిస్తే ..పదిమందికి ఏవన్నా ఉపయోగ పడితే .. మంచిదే.

రసప్లావితం

రసప్లావితం

నిన్న సభలో పానుగంటి వారి సాక్షి వ్యాసాల గురించి చర్చ జరుగుతుండగా ఒక స్నేహితులు అడిగారు - 'రసప్లావితం' - అంటే ఏవిటని. నేనేదో కొద్దిగా ఆలోచించి సందర్భాన్ని బట్టి, రసంలో మునిగినది, తడిసినది, తద్వారా రసంతో నిండినది - అని వ్యాఖ్యానించాను.
ఇంటికొచ్చి ఒక పద్యకావ్యం టీకా తాత్పర్య సహితం చదువుతూ ఉంటే అందులో "సింధు లహరీ ప్లవన" అని వుంది. దానికి నదీ ప్రవాహంలో తేలినట్టి అని అర్థం చెప్పారు. అది చదవంగానో .. ఏ నాడో ఏడో క్లాసులోనో, ఎనిమిదిలోనో చదువుకున్న భౌతిక శాస్త్ర పాఠం గుర్తొచ్చింది - "ప్లవన సూత్రాలు" .. అంటే laws of flotation.
తమాషాగా ఉంది కదూ, మన భాషలో వాడుక తప్పిన భావాన్ని పాశ్చాత్య దత్తమైన భౌతిక శాస్త్రం ద్వారా గుర్తు చేసుకోవటం. నాకేవిటో గిలిగింతలు పెట్టినట్టైంది.
రసప్లావితం అంటే రసంలో తేలినది.
రసంలో మునగడానికీ తేలడానికీ చాలా తేడా వుంది. అది అనుభవైక వేద్యం.
ఆ విషయం ఇంకో మాటు .. కానీ .. అసలీ రసమంటే ఏవిటి?
లాక్షణికులు కావ్యం రసమయంగా వుండాలన్నారు. శ్లోకాలు నాకిప్పుడు గుర్తుకి లేవుగానీ, సంగీత నాట్యాల లక్ష్య లక్షణ నిర్దేశం చేసిన భరత ముని ప్రభృతులు రసానికి పెద్ద పీట వేశారు. నవరసాలన్నారు. మరి పూర్వపు విషయాల్ని వదిలి ఇటీవలికొస్తే, శ్రీశ్రీ కూడా పట్టుకుని, "కానీవోయ్ రస నిర్దేశం" అన్నాదు. ఇంకొంచెం ముందుకొస్తే శంకరాభరణం శంకరశాస్త్రి గారు (వేటూరి కలం బాలూ గళం ద్వారా) "రసికుల కనురాగమై, రస గంగలో తానమై" అన్నాడు.
అంటే మునగమనా? తేలమనా?

ఈ సమస్య ఎలా ప్లావితమౌతుంది?