పుస్తకాల పండగ

శీతాకాలంలో దక్షిణ భారత దేశంలో జరుపుకునే ముఖ్యమైన పండగ సంక్రాంతి - అటు కన్నుల పండువుగానూ, ఇటు రుచుల విందుగానూ, వెరసి మనసుకి నిండుగానూ ఉంటుంది.కొన్నేళ్ళుగా, దక్షిణభారత దేశంలోని అనేక నగరాల్లో ఇంకో పండగ జరుగుతోంది శీతాకాలంలోనే. ఇది కూడా కన్నుల పండువుగానూ ఉంటోంది. రుచుల విందూ పెడుతోంది, ఐతే, నోటికి కాదు, బుర్రకి.


అదే పుస్తకాల పండగ.హైదరాబాదు, చెన్నై, బెంగుళూరు నగరాల్లో డిశంబరు - జనవరి కాలంలో ఈ పండగలు జరుగుతున్నై. ఇవి నేను చూశాను రెండు మూడేళ్ళ క్రితం.

ఐతే ఈ మహానగరాల పండగలన్నీ అచ్చెరువొందేటట్లు, అసూయ పడేటట్లు జరుపుతున్నారు బెజవాడలో.

అవును, విజయవాడ పుస్తకాల పండగ ఈ జనవరిలో పద్ధెనిమిదో పుట్టినరోజు జరుపుకుంది. నే చూసిన ప్రతి ఏడాదీ, ఇది పరిమాణంలోనూ, వైవిధ్యంలోనూ, నిర్వహణ సామర్ధ్యంలోనూ, ముందడుగే వేస్తున్నది. చాలా చాలా సంతోషించాల్సిన విషయం.


ఈ సారి నా కంట బడ్డ కొన్ని విశేషాలు.

విశ్వనాథ వారి సమగ్ర నవలా సాహిత్యం ఒకె సెట్టుగా దొరుకుతోంది.
ఎన్నో పాత (classic) నవలలు, కావ్యాలూ పునర్ముద్రణకి నోచుకుంటున్నాయి.
విశాలంధ్ర వారు పాత తరం గొప్ప రచయితల సమగ్ర సాహిత్యాన్ని ప్రచురించే వరుసలో, దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారివి రెండు పుస్తకాలు వెలువరించారు.

అమరగాయకుడు ఘంటసాల మీద కనీసం అరడజను పుస్తకాలు కనిపించాయి. వీటిల్లో సుమారు ఎనిమిది వందల పేజీల లావున ఆయన పాడిన పాటలన్నిటి సాహిత్యాన్నీ ఒక్క తాటిన కట్టే ప్రయత్నం ప్రత్యేక ఆకర్షణ (రానారె - వింటున్నావా?)) ఘంటసాల అభిమానులకి ఇది గొప్ప వరం.

మీరు గనక ఎప్పుడైనా జనవరి మొదటి వారంలో ఆంధ్ర దేశంలో ఉండటం తటస్థిస్తే .. తప్పకుండా పనిగట్టుకునైనా విజయవాడ వెళ్ళి ఈ పండగని తిలకించండి - మీరు నిరాశ చెందరు - నాది హామీ.

నేను ఈ సంవత్సరం సుమారు పదివేల రూపాయలు ఖర్చు పెట్టాను. పుస్తకాలు ఇప్పుడిప్పుడే బయల్దేరి వస్తున్నాయి. ఆయా పుస్తకాల గురించి - చదివినప్పుడల్లా - ఈ బ్లాగులో ముచ్చటిస్తుంటాను.

Comments

పాత పాటల సాహిత్యాన్ని ప్రచురించిన ప్రయత్నాలు కొన్ని చూశాను. వాటిలో అచ్చుతప్పులు భయంకరమైనవి చాలా వుంటూవచ్చాయి. ఈ ఎనిమిదివందల పేజీల సంకలనం విశాలాంధ్రవారి ముద్రణ అయితే నమ్మకంగా కొనేయవచ్చు. నేను పుస్తకాలు చదవడం దాదాపు ఆగిపోయింది. అన్నింటికంటే ముఖ్యంగా ఈ ఇంటర్నెట్ వ్యసనం నుండి ఒక రెండు నెలలు దూరంగా వుండటం మంచిదేమోననిపిస్తూంది.