ఆకురాలు కాలం

ఆహా ఎట్టకేలకు మా ఊరికి వసంతమొచ్చిందని మురుసుకున్నది మొన్ననే అన్నట్లుంది .. చూస్తుండగానే వేసవి కూడా ఆ దారినే వెళ్ళిపోయింది.

కార్తీక మాసపు పేరంటాలకి వెళ్ళడానికి రంగు రంగుల పట్టుచీరలు కట్టి ముస్తాబవుతున్న ముత్తైదువల్లాగా చెట్లన్నీ సింగారించుకుంటున్నాయి. ఈ క్షణంలోని అందాన్ని అనుభవించి ఆనందించలేని నేనేమో .. అయ్యో ఇంకొన్ని రోజుల్లో ఇవన్నీ మోడులైపోతాయి గదా అని విచార పడుతుంటాను.

పాశ్చాత్యులకి నాలుగే ఋతువులు .. స్ప్రింగ్, సమ్మర్, ఆటం, వింటర్ .. వెరసి ఫోర్ సీజన్స్. వివాల్డి అనే వెనీషియన్ తుంబురుడు ఆ పేరిట ఒక అద్భుత సంగీత మాలికని రచించి ప్రకృతిమాతకి అలంకరించాడు. స్ప్రింగ్ అంటే వసంతం, సమ్మరంటే గ్రీష్మం లేదా వేసవి, వింటరంటే చలి కాలం. గొడవంతా ఆటం దగ్గరే వస్తుంది. నెలల ప్రకారం చూస్తే మన ఊళ్ళలో ఇప్పుడు శరదృతువు. ప్రకృతి పరిణామాల ప్రకారం చూస్తే ఇక్కడ ఇది శిశిర ఋతువు (ఆకురాలు కాలం). విపరీతంగా చేమంతి పూలు కూడా పూస్తాయి కాబట్టి హేమంతం అనికూడ అనుకోవచ్చు. మన ఊళ్ళో చలికాలం ఐపోయాక రాబోయే వసంతానికి సూచనగా శిశిరంలో వేపలాంటి కొన్ని చెట్లు ఆకులు రాలుస్తాయి. ఇక్కడ కోనిఫర్ జాతి వృక్షాలు తప్పించి మిగతావన్నీ, ఆఖరికి మొక్కలూ పొదలూ కూడా, భయంకరమైన చలికాలానికి సన్నద్ధమయే ప్రయత్నంలో ఆకులు రాలుస్తాయి. ఈ ఆకురాలు కాలం, లోలోపలి రక్తనాళాల్ని కూడా గడ్డకట్టించే చలికి చోపుదారు, వెచ్చబరిచే వసంతానికి కాదు.

ఈ అమెరికా వాళ్ళది ఎడ్డెమంటే తెడ్డెమనే వ్యవహారం కాబట్టి ఇంగ్లీషువాళ్ళు "ఆటం" అని పెట్టుకున్న పేరుని కాదని వీళ్ళు సొంత బుర్రతో ఆలోచించి దీనికి "ఫాల్" (fall) అని నామకరణం చేశారు .. ఎందుకంటే ఆకులు రాలతాయి కాబట్టి! సంవత్సరానికి మొదలు కాదు. ఋతువుల్లోనూ మొదటిది కాదు. కానీ బడులూ విశ్వవిద్యాలయాలూ ఫాల్ సెమిస్టరుతోనే ప్రారంభమవుతాయి. అనేక కళాసంస్థల ప్రదర్శన సీజను ఫాల్‌తోనే మొదలవుతుంది.

సాధారణంగా సెప్టెంబరు చివరికల్లా చిరు చలి మొదలవుతుంది ఒక స్వెటరో పల్చటి కోటో వేసుకుంటే బాగుండు అనిపిస్తుంటుంది. చెట్ల ఆకులు మెల్లగా ఆకుపచ్చ నించి పసుపు, నారింజ, ఎరుపు రంగులు పులుముకుంటూ ఉంటాయి. ఉన్నట్టుండి ఒక రాత్రి ఉత్తరాన్నించి ఒక గాలివాన వస్తుంది. దాని విసురుకి మొదటి విడత ఆకులు రాలిపడతాయి. నిన్నటికంటే ఇవ్వాళ్ళ ఉష్ణోగ్రత ఒక ముప్ఫై డిగ్రీలు (మేం ఫారెన్ వాళ్ళం కదా, మాది ఫారెన్‌హీటు లెండి :)) పడిపోతుంది. దాంతో అధికారికంగా ఫాల్ ప్రవేశించినట్లే!

అట్లా రంగు మారటం మొదలు పెట్టిన ఆకులు నాలుగైదు వారాల పాటు వర్ణార్ణవ తరంగాలవుతాయి. తమాషా చెయ్యటానికి అన్నట్టు సృష్టికర్త ఒక కుంచె పట్టుకుని కొద్ది సేపు మోనే వేషం వేసుకుంటాడు. నేనేం తక్కువ తిన్నానా అని సర్వసాక్షి పడమటి నింగిపై సిందూరం చల్లుతుంటాడు. ప్రకృతి మొత్తం ప్రదర్శనకి సిద్ధమౌతున్న మహానటిలా అలంకారం చేసుకుంటూ ఉంటుంది. ఆ అలంకారమే అసలు ప్రదర్శన అని మనం గ్రహించే లోపలే ఒక అద్భుతమైన రంగులవల మనమీద పరుచుకుని సమ్మోహితుల్ని చేసేస్తుంది.

చూస్తూ చూస్తూ ఉండగానే .. ప్రదర్శన ముగిసిపోతుంది. రంగుల ప్రపంచం మీద ఒక తెల్లటి మంచు తెర కప్పబడుతుంది.
దాని అందాలు .. మరోమాటు .. సందర్భోచితంగా ..


***********************
(వివాల్డి వికీ పేజీ చివర ఫోర్ సీజన్స్ సంగీతపు తునకలు ఉన్నాయి వినవచ్చు.)

Comments

ఈ వారం బొమ్మ చాలా అద్భుతంగా ఉన్నది. ఇప్పుడే మ్రింగెడిది అనే పోతన గారి పద్యం చదువుతున్నాను.(పఠిస్తున్నాను). నా బ్లాగులో వ్యాఖ్య వ్రాసినందుకు ధన్యవాదాలు నా ప్రయత్నం చేస్తాను
rākeśvara said…
అసలే ఇవాళ కొద్దిగా బ్లూగా వున్నానేమో, ఇక మీ టపా చదివే సరికి, మంచు మీద చాలా దేనవారిపోయింది :(

ఒక కాలంలో నేను ఉత్తర సంయుక్త రాష్ట్రాలలోనే ఉద్యోగాలు వెదుక్కొనేవాణ్ణి!

మీకు మంచు పడ్డప్పుడు ఒక పెట్టిలో పెట్టి, మాకు పంపించి పుణ్యం కట్టుకోండి! :)
Anonymous said…
కొత్తపాళీ గారు, మీ ప్రకృతి వర్ణన అద్భుతం.సిరివెన్నెల లో మున్ మున్ సేన్, సర్వదమన్ బెనెర్జీ కి ప్రకృతి గురించి వివరించే సంఘటన గుర్తుకువచ్చింది.
-నేనుసైతం
మంచి చిత్రాలు (చూ)పెట్టారు..డిసిలో ఉన్న modern art museumలో ఒక ఫొటో ఉంది, నాలుగు ఋతువుల్లో ఒకే ప్రదేశాన్ని నాలుగు క్వాడ్రెంటుల్లో పెట్టారు, మీరు అది చూసారా?

btw, fall always reminds me of a funny drive-out day we had once..to please our visitors we had to take them to Shenendoah valley and then to the skyline drive. Skyline drive just before fall might be a beautiful one, but after fall it was very much like the location of 'blairwitch project' :)
మెచ్చి వ్యాఖ్య రాసిన మిత్రులకి థాంకులు.
బ్లాగేశ్వర - "మంగళ సూత్రమ్మునెంత మది నమ్మినదో" - ఆ పద్యమేనా?
రాకేశ్వర - ఎందుకు నాయనా "బ్లూ"? "బ్రౌను"ని మరీ రుద్దుకుంటున్నావేమో?? :-) లేకపోతే ఈ దేనవారటమేవిటి? మిషిగన్ విడిచాక రెండున్నరేళ్ళున్నాను మాతృ భారతంలో, ఒక్కసారికూడా మంచుని మిస్సవలేదు :-)
నేనుసైతం - ఆ సినిమా చిన్న చిన్న ముక్కలు చూశాను కానీ పూర్తిగా చూళ్ళేదు. నా వర్ణన నచ్చినందుకు థాంకులు.
గిరీ - మీరు చెప్పిన ఫొటో చూళ్ళేదు గానీ నా పనిప్రదేశం వెనకాతల ఒక చిన్న అడవి ఉంది. ఋతువుకి ఒక బొమ్మేం ఖర్మ, రోజుకో బొమ్మ తీసి ఒక flip book చెయ్యాలనుంది .. చేస్తానెప్పుడో. మీరు చెప్పింది నిజమే. నా మురిపెమంతా ఈ వారమే. వచ్చేవారం రాలిన ఆకుల్ని బస్తాలకెత్తేప్పుడు ఉంటుంది, బ్లేర్ విచ్చి ప్రాజెక్టు దేవుడెరుగు, బ్రేకు నీ బ్యాకు (break your back) కాకుటే చాలు :-)
Anonymous said…
"..ఆకులు రాలే కాలంతోటే చిగురులు తొడిగే ఘడియొస్తుందీ.." ఏ ఋతువు అందం/పని దానివే. ఆకులు బస్తాలకెత్తడం (raking leaves) ఫాల్ కలర్స్ అందం అనుభవించడానికి చెల్లించే చిన్న మూల్యం! :- )
Sriram said…
WOW! vasantam kannaa fall meelO ekkuva bhaavukatani kaliginchindanipistOndi. you should write this kinda stuff more!
@పద్మ - అంతేలెండి, ఒడ్డున కూర్చుని ఎన్నైనా చెప్పగలరు :-)
@శ్రీరాం - పద్మగారన్నట్టు ఏకాలపు అందం దానిదే .. రేపొక రెండడుగుల మంచు పడితే దానికీ ఇంత పులకిస్తానేమో!
పద్మగారిచ్చిన వికీ వ్యాసం చదువుతుంటే గుర్తొచ్చింది, టపాలో చెప్పడం మర్చిపోయాను. వెర్మాంట్ అనే రాష్ట్రం ఈ ఫాల్ రంగుల ప్రదర్శనకి పెట్టింది పేరు. రెండొందల మైళ్ళ దూరంలో ఉన్న బాస్టను నగరం నుండి వెర్మాంట్‌కి ఈ సమయంలో వారాంతాల్లో ప్రత్యేక రైళ్ళు నడుపుతారు, కేవలం ఈ రంగులు చూసి ఆస్వాదించడానికి. మిషిగను రాష్ట్రమంతా బల్లపరుపుగా ఉంటుంది, కానీ ఏనార్బరు నగరంలో చిన్న నది లోయ వల్ల కొద్దిగా ఎత్తుపల్లాలుంటాయి. ఫుల్లర్ అనే రోడ్డు మీద వెళుతుంటే భవనాల మధ్యలోనించి పూర్తి నగర వాతావరణంలో వెళుతుండగా, ఒక చోట రోడ్డు తొంభై డిగ్రీల మలుపు తిరుగుతుంది. ఆ చోటు కొంత ఎత్తులో ఉంటుంది. ఆ మలుపు తిరిగేప్పటికి ఎదురుగా హ్యూరాన్ నది లోయ దట్టంగా చెట్లతో నిండి కనుచూపు మేర పరుచుకుని ఉంటుంది. ఫాల్‌లో ఆ దృశ్యం అందం చెప్పనలవిగాదు.
చాలా బాగా వర్ణించారండీ! మా ఊళ్ళో అన్ని ఋతువులూ ఒకేలా ఉంటాయి :( వింటర్ ని మిస్ అవ్వకపోయినా ఫాల్ కి మాత్రం North Carolina వరకన్నా వెళ్ళి రంగులన్నీ కళ్ళల్లో నింపుకొస్తాం :)
Unknown said…
అందమయిన టపా... చాలా బాగుంది మీ వర్ణన
రాధిక said…
అహా..ఎంత చక్కగా చెప్పారో? నా కళ్ళు నింపుకున్న అందం,మనసు నింపుకున్న ఆనందం ఇక్కడ అక్షరాల రూపం లో చూస్తుంటే మరింత ఆనందం గా వుంది.అమెరికాలో ఎక్కువ ఫాల్ కలర్సు "పోర్ట్ స్మిత్" లో చూడొచ్చని అంటారు.[సుమారు 120 రంగులు].దాని తరువాత స్థానం మా దగ్గరలో వున్న "డోర్ కౌంటీ" అని [70 రంగులు] విన్నాను.ప్రతీ ఏడూ వెళుతూ వుంటాము.ఎన్ని సార్లు చూసినా కొత్త గా కనిపిస్తుంది నాకు.చిన్నపిల్లనయిపోతాను.ఈ ఏడు కూడా వెళ్ళాము.కాని మోడులే మిగిలాయి.అదీ అందం గానే కనిపించింది.
Unknown said…
ఆకులో ఆకునై పూవులో పూవునై
కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై
ఈ యడవి దాగిపోనా ఎట్లైన నిచటనే యాగిపోనా?
...

తరు వెక్కి యల నీలగిరి నెక్కి మెలమెల్ల
చద లెక్కి జలదంపు నీలంపు నిగ్గునై
ఈ యడవి దాగిపోనా ఎట్లైన నిచటనే యాగిపోనా?

మీ రాత నాతో ఓ కూని రాగం తీయించింది. నెనర్లు!
"అలంకారమే అసలు ప్రదర్శన" - చిన్న మాటలో ఒక పెద్ద సంగతి చెప్పారు. నిన్నామొన్నా (వారాతం) ఆర్కన్సా ఒక చుట్టు చుట్టి వచ్చాను. సెడర్ జలపాతం అడుగుకు చేరడానికి కొండ దిగే దారంతా అద్భుతం.
పద్మ said…
చాలా బావుందండి మీ వర్ణన. ప్రకృతి ఒక్కో కాలంలో ఒక్కో అందంతో కనువిందు చేస్తూ ఉంటుంది. ఇదే అందం అనుకున్నంత కాలం పట్టదు అంతకు మించిన అందంతో మైమరపులో ముంచెయ్యటానికి. దేవుడిని మించిన చక్కటి చిత్రకారుడు ఇంకెవరున్నారు?

// చూస్తూ చూస్తూ ఉండగానే ప్రదర్శన ముగిసిపోతుంది. రంగుల ప్రపంచం మీద ఒక తెల్లటి మంచు తెర కప్పబడుతుంది. //

జీవితమే ఒక నాటకరంగం, ప్రకృతి అందులో ఒక అంకం అన్నట్టు బాగా చెప్పారు.
Bolloju Baba said…
hai
prakruti varnana chaalabaagundi

excellent. unread recently

bolloju baba
కొత్తపాళీ గారు, చాలా అద్భుతంగా వర్ణించారు ప్రకృతిని. కవులకు కళాకారులకు ప్రకృతిని మించిన కధా వస్తువు ఏముంటుంది అనిపించింది. ఇక "వెళ్ళి మన కళ్ళల్లో ఆ రంగులన్నీ నింపుకొద్దమా" నిషిగంధ గారు అన్న మాట హృదయానికి తాకి మళ్ళీ బాల్య స్మృతులు గుర్తుకు వచ్చి మా ఊరు వెళ్ళాలని పించింది
Bolloju Baba said…
గురువుగారూ
ఆటం అను పదాన్ని అనువదించటానికి శిశిరమనాలా, లేక శరత్ ఋతువనాలా అని సందేహమొచ్చి నెట్ లో వెతుకుతూంటే మీ పోస్టు కనపడి పొగమంచు తొలగించింది. ఎందుకంటే సంస్కృత నిఘంటువులో ఆటం ని శరత్ అనీ, తెలుగు నిఘంటువులలో ఆకు రాలు కాలమనీ ఉంది.
నేను శరత్ ఋతువు గానే అనువదిస్తున్నానండి.

థాంక్సండీ
బొల్లోజు బాబా

పి.ఎస్. లోగడ కామెంటినట్టున్నాను. మందమతిని. హి.హి. హి. :-)
Anonymous said…
చాలా బాగా వర్ణించారు.
ఇందు said…
బాగుందండీ మీ 'ఫాల్ ' వర్ణన. అందంగా వర్ణించారు...ఫాల్ అందాలను....
ఫొటోలు , మీ వర్ణన చాలా బాగున్నాయండి .
ఈ టపాలో చెట్లకి ఆకులు రంగులు మారి రాలిపోయినా, టపామాత్రం "ఎవర్ గ్రీన్" అల్లే ఉంది, మూడేళ్ళ తరవాత మిత్రులు ఇంకా చదివి కామెంటుతున్నారు! :)
మాల, ఇందు, మీకు నచ్చినందుకు సంతోషం.
మీ పోస్టు చదువుతున్నంత సేపూ కళ్ళల్లో ఆ రంగురంగుల చెట్లే కనపడ్డాయి. ఎంత బావుందో మీ పోస్టు! లింక్ ఇచ్చినందుకు థాంక్స్.
రమాసుందరి said…
కళ్ళకు కట్టినట్లు రాసారు.
శ్రీ said…
మిషిగన్ దాటాక బాగా మిస్ అయిన వాటిలో ఫాల్ ఒకటి. హైన్స్ డ్రైవులో ఆఫీసుకి వెళ్తుంటే అద్భుతంగా ఉండేది, ఇక నోవైకి పడమర వైపు కూడా చాలా బాగుంటుంది. నేను ఒక పది నిముషాలు కళ్ళు మూసుకుని మిషిగన్ తిరిగేసి వస్తా...
Unknown said…
Chaalaa bavundandi mee varnana ..thanks andi manchipost link icchinamduku ..
Radhika (nani)