(అ)సాధారణ నాయికలు

నాయికలు అనంగానే మనకి ప్రబంధాల్లో అష్టవిధ నాయికలు గుర్తొస్తారు. లేకపోతే .. సినిమా నాయికలు గుర్తొస్తారు. అంతేగాని నాయిక అంటే, నాయకుడికి స్త్రీలింగ రూపంగా, నాయకత్వ లక్షణాలు కనబరిచి తమ చుట్టూ ఉన్నవాళ్ళని ఉత్తేజపరిచి, కూడగట్టి ఘనకార్యాలు సాధించిన వాళ్ళుకూడా కావచ్చని మనకి గబుక్కున తట్టదు.

మన చరిత్రలో నాయకురాలు నాగమ్మ, రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి వంటి వీరనారీమణులెందరో వాసికెక్కారు. కానీ నా దృష్టిలో నాయకత్వ లక్షణమంటే .. కత్తి పట్టుకుని సేనలని నడిపించటమే కాదు .. అన్యాయ భూయిష్టమైన ప్రస్తుత పరిస్థితి (status quo)ని ఎదిరించడం. బేనర్లు పట్టుకుని ఊరేగింపులు తీసి, విలేఖరుల సమావేశాలు పెట్టి బహిరంగ యుద్ధం ప్రకటించవచ్చు - ఇటువంటి ఒక వీరనారిని ఇదివరకు పరిచయం చేశాను. లేదా నిశ్శబ్దంగా తమ గృహ వాతావరణంతో మొదలుపెట్టి తమ చుట్టూ ఉన్న వారిని ప్రభావితం చేస్తూ, తాము నమ్మిన విశ్వాసాలను కోల్పోకుండా, ఎప్పటికప్పుడు తమ ఆలోచనా పరిధిని విస్తృతం చేసుకుంటూ, సాంప్రదాయాలను గౌరవిస్తూనే కొత్త ఆలోచనలకు తావిస్తూ .. తద్వారా తాము నిష్క్రమించేటప్పుడు ఈ భూమిని కొద్దిగా మెరుగు పరిచిన స్థితిలో వదిలి వేళ్ళేవారు .. (అ)సాధారణ నాయికలు.

ప్రసిద్ధ తమిళ రచయిత, స్వాతంత్ర సమరయోధుడు, సంఘసంస్కరణాభిలాషి ఐన కల్కి కృష్ణమూర్తిగారి ఏక పుత్రిక ఆనంది. సభ్యసమాజంలో నాట్యం అంటే ప్రబలి ఉన్న అసహ్యాన్ని తిరస్కరించి ఒక దేవదాసి వద్ద కూతురికి భరతనాట్యం నేర్పించారు కల్కి. పదహారవ ఏట ఎమ్మెస్ సుబ్బులక్ష్మిగారి దత్తపుత్రుడైన రామచంద్రన్‌తో వివాహం కాగానే ఆనంది నాట్య ప్రదర్శనలకు, కాలేజీ చదువుల ఆశలకు కళ్ళెం పడింది. ఇంతలో పిల్లలు. ప్రదర్శనలు ఇవ్వను అనే ఒప్పందం మీద రుక్మిణీదేవి అప్పుడే స్థాపించిన కళాక్షేత్రములో చేరి ఆనంది అప్పటికింకా మిగిలి ఉన్న గొప్ప నాట్యాచార్యుల వద్ద భరతశాస్త్రాన్ని అభ్యసించింది. విద్యార్జన ముగిసిన తరువాత అక్కడే నాట్యాచార్యులుగా స్థిరపడి సుమారు యాభై ఏళ్ళ పాటు ప్రపంచం నలుమూలలనించీ వచ్చిన విద్యార్ధులకు భరతనాట్యం నేర్పారు. ఆనంది రిటైరైనాక పలుమార్లు ప్రపంచ దేశాల్ని పర్యటించి, ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ, శిష్య ప్రశిష్యులకి ఉత్తమ శిక్షణ ఇచ్చి ప్రదర్శనలిప్పిస్తూ, వెళ్ళిన చోటనల్లా న్యాయాన్నీ ధర్మాన్నీ ప్రవచిస్తూ మనకి (అ)సాధారణ నాయిక అయ్యారు.

అమెరికాలో మిడ్‌వెస్ట్ అంటే కరుడు గట్టిన కన్సర్వేటిజం. ఆడపిల్ల అణిగిమణిగి ఉండాలి. తొందరగా పెళ్ళి చేసుకుని పిల్లల్ని కని ఇల్లు చూసుకోవాలి. బైబులునీ దేవుణ్ణీ దేవుడి పుత్రుడైన ఏసునీ నమ్మాలి. ఇదీ ఇక్కడి ఆలోచనా పద్ధతి ఇప్పటికీ. ఇంక 1930ల్లో ఎలా ఉండేదో ఆలోచించండి. అలాంటి కుటుంబంలో పుట్టిన బెట్టీ పెళ్ళిచేసుకుని పిల్లల్ని కని సెటిలైపోయింది. మొదటగా "మాక్రోబయాటిక్" ఆహారం ఆరోగ్యాన్ని ఎలా పెంపొందిస్తుందో తెలుసుకోవడంతో ఆమె అన్వేషణ మొదలైంది. చుట్టూ ప్రబలి ఉన్న ఆహారపు అలవాట్లని కాలదన్ని ఆమె తన ఇంట్లో మాక్రోబయాటిక్ దినుసుల వాడకం మొదలు పెట్టింది. ఈ ప్రయత్నంలో కుటుంబం నించీ సాంఘిక వర్గం నించీ ఎంతో ప్రతిఘటనని ఎదుర్కుంది. ఐనా తన నమ్మకాన్ని వదులుకోలేదు. అక్కణ్ణించి ఫెమినిస్టు ఉద్యమాన్ని అర్ధం చేసుకుని, ఊరికే పైపైన కాకుండా, స్త్రీ వ్యక్తిత్వపు లోలోతుల్నించి ఈ సాధికారత రావాలని బలంగా నమ్మి దానికోసం అన్వేషణ ప్రారంభించింది. ఈ ప్రయాణంలో ఆమె యోగ, ధ్యానము వంటి పద్ధతులు నేర్చుకుంది. ఆ తపస్సులో ఆమె "నేనే దేవత అవతారాన్ని" అనే సిద్ధి పొందింది, మనవాళ్ళు "అహం బ్రహ్మాస్మి" అనుకున్నట్టు. తనకి తాను "మలోరా" అని కొత్త పేరు పెట్టుకుంది. యాభై పైబడిన వయసులో యూనివర్సిటీకి వెళ్ళి సైకాలజీలో ఉన్నత విద్య నభ్యసించి గృహహింస పాలైన స్త్రీలకి థెరపిస్టుగా పని చేస్తూ తాను నమ్మి ఆచరించిన పద్ధతులని వారికి నేర్పి తాను తనలో మేల్కొల్పిన నిద్రాణమైన శక్తిని వారిలోనూ మేల్కొల్పుతూ గడిపింది. చివరి శ్వాస వరకూ తాను నమ్మిన దాన్నే ఆచరించి, తను ఆచరించినవి ఇతరులకి నేర్పి తన చిన్ని ప్రపంచంలో ఆత్మ విశ్వాసమూ, ప్రేమా నింపిన మలోరా ఇంకొక (అ)సాధారణ నాయిక.

గమనించాల్సిన ముఖ్యమైన మరో విషయం - ఈ ఇద్దరు (అ)సాధారణ నాయికలూ భార్యగా తల్లిగా తమ బాధ్యతల్ని నిర్వర్తిస్తూనే ఈ విజయాలు సాధించారు. ఇద్దరూ తమ భర్తలతో యాభయ్యేళ్ళ పైబడిన ఆనందమయ వైవాహిక జీవితాలు గడిపారు. ఆ విధంగా కూడా వీళ్ళు మనకి ఆదర్శప్రాయులైనారు.

ఈ (అ)సాధారణ నాయికల స్మృతికి మా "సాధన" నాట్యాలయం నాట్యాంజలిని సమర్పిస్తోంది.

మా నాట్యాచార్యులు "మాధవి మై" రూపకల్పన, నాట్యరచన చేయగా పదిమంది కళాకారులతో ప్రదర్శిస్తున్నాము. అక్కడక్కడా భారతీయ సాంప్రదాయ గాత్రం తప్పించి ప్రదర్శన పూర్తిగా ఆంగ్లంలో ఉంటుంది. కథనానికి ఉపయోగించిన పద్ధతుల్లో భరతనాట్యానికి పెద్దపీట వేసినా, కథ చెప్పటం (narration), మూకాభినయం (mime), ఆధునిక నాట్యం (modern dance) మొదలైన ప్రక్రియల్ని కూడా ఉపయోగించారు.

అక్టోబరు 20, సాయంత్రం ఎనిమిది గంటలకు.
ఏనార్బర్ నగరం మిషిగన్ విశ్వవిద్యాలయం ఉత్తర ప్రాంగణం వాల్‌గ్రీన్ ప్రదర్శనాస్థలిలో.
అందరికీ ఇదే ఆహ్వానము.

Comments

ramya said…
ఇద్దరు గొప్ప నాయికలని పరిచయం చేసినందుకు దన్యవాదాలు .వుద్యమం చేయటం అంటే కొన్నిటిని,కొందరిని దూరం చేసుకోవటం కాదు అందరిని కలుపుకోవటమే ననేది నాకు చాలా నచ్చింది.
ఇంతకీ నాయిక నాయకురాలు రెండూ ఒకటేనన్న మాట .ఇంతకాలం నేను ఈరెండు పదాల అర్దాలు వేరువేరు అనుకున్నాను.
cbrao said…
వి.ఎ.కె.రంగారావు (చూడండి:http://deeptidhaara.blogspot.com/2007/10/8.html) గారికి, మీకు సామ్యం కనిపిస్తుంది.ఇద్దరూ సంగీత సాహిత్యాభిమానులే. వారు, మీరు ఇద్దరూ నాట్యం చేసే వారే; సంగీత,సాహిత్యాలపై రచనలు చేసేవారే. ఈ అసాధారణ నాయికలగురించి మన తెలుగు బ్లాగరులలో ఎరిగినవారు తక్కువ. మంచి ఆలొచనలకు ప్రేరణ కలిగించే ఇలాంటి వారి గురించి పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.
Anonymous said…
మీరు పరిచయం బాగా రాశారు. ప్రేరణ ఇచ్చేదిగా ఉంది.
మీ ప్రదర్శనకు Best wishes.
@ రమ్య - ఈ టపా రాస్తుండగానే నాయకురాలు నాగమ్మని ప్రస్తావించినప్పుడు నాకూ ఇదే సందేహం వచ్చింది. ఈ ప్రదర్శనకి మా గురువుగారు నిర్ణయించిన పేరు Everyday Heroines - టపాలో చూపిన కరపత్రంలో చూసే ఉంటారు. నాయిక అంటే నాయకుడి ప్రేయసిగా మాత్రమే ఎందుకుండాలి, స్వయంప్రతిపత్తి కలిగిన వ్యక్తి ఎందుకు కాకూడదు అనిపించి వీరిని "నాయికలు" అనే పిలిచాను.

@రావుగారు - రంగారావు గారి గురించి మిత్రులు పరుచూరి శ్రీనివాసు ద్వారా చాలా సార్లు విన్నాను. చాలా కుతూహలంగా ఉండేది. 2002లో చెన్నైలో ఒక నెలరోజుల పాటు మకాం వేసి నాట్య ప్రదర్శనలకీ, కచ్చేరీలకి వెళుతున్న సమయంలో రంగారావుగారిని చాలాసార్లు సభల్లో కలిశాను. వారు ఇంటికి రమ్మని పిలిచారు గానీ విడిగా కలిసేందుకు కుదరలేదు. ఒక అద్భుతమైన వ్యక్తి ఆయన.

@లలిత - ఈ ప్రదర్శనకి తయారవుతుండగా ఈ ప్రేరణ చాలా ఉత్తేజం కలిగించింది. పంచుకోవాలనిపించింది.
ఆనంది గురించి ఆ మద్య ఎక్కడో చదివాను. సాధారణంగా ఉంటూ కనపడకుండా అసాధరణమైన పనులు చేసేవాళ్ళూ మన చుట్టుపక్కల చాలామందే ఉంటుంటారు, అలాంటి వారి గురించి పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్.
Unknown said…
గొప్ప వ్యక్తులను పరిచయం చేసినందుకు నెనర్లు. మిషిగన్ రాలేని మాలాంటి వాళ్ళకోసం ప్రదర్శన తర్వాత కొన్ని ఫోటోలు. వీలైతే చిన్న వీడియో బ్లాగులో పెట్టమని మనవి.
Anonymous said…
మీ కార్యక్రమాన్ని తప్పక చిత్రీకరించి, అంతర్జాలంలో పెట్టగలరు. కార్యక్రమము దిగ్విజయోస్తు కావాలని ఆశిస్తున్నాను.
మీ కార్యక్రమం సక్రమంగా సాగి విజయవంతం కావాలని ఆకాంక్ష
ఓహో ఈ రోజే నన్నమాట మీ కార్యక్రమం! మీ ప్రదర్శన జయప్రదంగా జరగాలని ఆశిస్తున్నాను. కార్యక్రమ కబుర్ల కోసం ఎదురుచూస్తాను.
Anonymous said…
ఇంతకు మునుపొక టపా ఇక్కడ రాసినట్లు గుర్తు. ఏమైనా, మీ కార్యక్రమం విజయవంతమవ్వాలని కోరుతున్నాను.
కార్యక్రమం బాగా జరిగింది. సుమారు 70 మంది దాకా వచ్చారు. ఎక్కువమంది అమెరికన్లే. నేను ఆహ్వానించిన మిత్రులు ఐదు కుటుంబాల వారు చాలా దూరాల్నించి వచ్చారు. వారి అభిమానానికి మీ అందరి అభిమానానికి కృతజ్ఞుణ్ణి. శ్రీరాముడి అభిమానానికి ప్రత్యేకంగా. ఫొటోలు విడియో ఎవరో తీశారు. నెమ్మది మీద ..
teresa said…
arthur miller theater లో కొత్తపాళిగారి Dance dramA చాలా బావుంది,balcony seatingతో కలిపి దాదాపు ఓ 100 మంది అటెండయ్యారు.
పాళీగారు bharatanATyaMతోబాటు waltz, modern dance కూడా అవలీలలగా లాగించేశారు. శనివారం డిన్నెర్ ఎంగేజిమెంట్స్ వల్లో, జనెరల్ అడ్మిషన్స్ టికెట్టే 20 డాలర్లుండటం వల్లో ఇండియన్స్ ఎక్కువ రాలేదు.
నాశీగారు,

మీ ప్రదర్శన గురించి ఇంతమంది చెప్తుంటే మాకు ఆసక్తి పెరిగిపోతుంది. నెమ్మదిమీద కాదు చాలా...తొందరగా వీడియో పెట్టండి. అందాక ఫోటోలతో సర్దుకుంటాము.