ఒక భోపాల్ కథ

హెచ్చరిక: ఇదొక హృదయభాను టపా!

మొన్న బాంబు పేలుళ్ళు. నిన్న ఫ్లయ్యోవర్ కూలుడు. ఈ మధ్యనే హరికేన్ కత్రీనా వార్షికం, సెప్టెంబరు పదకొండు ఆరో వార్షికం. ఇరాకులో ఎడతెగని మారణహోమం .. ఎటుచూసినా ద్వేషం, అవినీతి, నిర్లక్ష్యం, చావులు, దుఃఖం .. మనసంతా దిగులు. ఇలాంటి విషాదపు ముసురు నా మనస్తత్వానికి విరుద్ధం, కానీ చూస్తూ చూస్తూ ఈ విషాద వాతావరణంలో సరదా టపాలు రాయలేను. ఇలాంటి పరిస్థితిలో భోపాల్ నించి ఒక లేఖ వచ్చింది. ఉత్తేజం కలిగించే ఎన్నో జ్ఞాపకాల్ని తీసుకొచ్చింది. బాహ్యాంతర శత్రువుల్ని ఆత్మస్థైర్యంతో జయించిన యువకుడి కథ చెప్పి జ్యోతిగారు మనబ్లాగుల్లో ఒక ఆశా దీపం వెలిగించారు. నేనొక అసాధారణ యువతి కథ చెబుతాను.

రచన తన తల్లితో పదహారేళ్ళ వయసులో ఢిల్లీ నుంచి అమెరికాకి వలస వచ్చింది. అలవాటైన కుటుంబ సాంఘిక వాతావరణాన్ని విడిచి వచ్చి డిట్రాయిట్ శివార్లలో హైస్కూలు పూర్తి చేసి మిషిగన్ విశ్వవిద్యాలయంలో బిబియే చదివింది. స్వతహాగా స్నేహశీలి, సాహసి కావడంతో తన చొరవతో మంచి స్నేహితుల్ని సంపాయించుకుంది. హైస్కూలు పూర్తైనప్పటినించీ ఉద్యోగం సంపాయించుకుని తన ఫీజులు తానే కట్టుకుంటూ స్వతంత్రంగా ఉంటోంది.

భారత అభివృద్ధి సమితి (Association for India's Development, AID)కి మిషిగన్లో ఒక ఛాప్టర్ మొదలు పెట్టి కొంతమందిమి కృషిచేస్తూ ఉన్నాం. విశ్వవిద్యాలయంలో భారతీయ వారసత్వ విద్యార్ధుల సమితి (ఇది భారతీయ విద్యార్ధుల సమితి కాదు, ఇది వేరు) వాళ్ళు ఒక రోజంతా పలు చర్చా వేదికలతో ఒక సమావేశం నిర్వహించారు. అందులో సమాజసేవ గురించిన చర్చలో నేను ఎయిడ్ గురించి మాట్లాడాను. సుమారు వెయ్యిమంది సభ్యులుగా నమోదైన ఆ సమావేశంలో ఈ చర్చలో కూర్చున్నది (వక్తలు కాక) ముగ్గురు. వాళ్ళలో రచన ఒకరు. త్వరలోనే రచన మా ఎయిడ్ ఛాప్టర్లో క్రియాశీలక పాత్ర వహించింది. తన ప్రోద్బలంతో కనీసం ఇంకొక పదిమంది విద్యార్ధులు మా గుంపులో కలిశారు. ఏడాది తిరిగేప్పటికి, ఇరవై రెండేళ్ళు నిండని వయసులో మా ఛాప్టర్‌కి అధ్యక్షురాలుగా పగ్గాలు చేపట్టింది. తన నాయకత్వంలో మా ఛాప్టర్ ఎన్నో కొత్త కార్యక్రమాలు చేపట్టి దేశం మొత్తమ్మీద తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది.

ఈ సమయంలోనే రచన చదువు ముగించి ఏక్సెంచర్ లో కన్సల్టెంట్‌గా ఉద్యోగం మొదలు పెట్టింది. ఎయిడ్ సంస్థాగతంగా భోపాల్‌లో విషవాయు పీడితులకి సహాయసహకారాలు అందించే ప్రాజెక్టులు చేపడుతూ ఉండేది. అప్పటికే యూనియన్ కార్బైడ్‌ని డౌ కంపెనీ కొనుగోలు చేసింది. డౌ కంపెనీ వార్షిక భాగస్వామ్య సమావేశాలకి దేశం నలుమూలల్నించీ ఒక ఇరవై ముప్ఫై మంది కార్యకర్తలు, వివిధ దేశాల వారు, మా ఊళ్ళో దిగారు, డౌ కంపెనీ పద్ధతులగురించి, నడవడి గురించి నిరసన ప్రదర్శన లిచ్చేందుకు. భోపాల్ నించి కూడా ఒక ముగ్గురు నలుగురు వచ్చారు. వారిలో సతీనాథ్ సారంగీ ఒకరు. మేము కూడా కొంత మందిమి కలిసి మొత్తం గుంపంతా ఇక్కణ్ణించి ఒక రెండు గంటలు డ్రైవు చేసుకుని మిడ్లండ్ అనే ఊర్లో డౌ కేంద్ర కార్యాలయాలకి చేరుకుని బయట బోర్డులు పట్టుకుని మార్చ్ చేస్తూ సమావేశము జరిగినంత సేపూ నిరసన ప్రదర్శన జరిపాము. అదొక వింత అనుభవం.

అప్పుడప్పుడూ మా ఛాప్టర్ సమావేశాల్లో ఇటువంటి ఉద్యమాల గురించి కూడా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం, కానీ ఉద్యమాలని నడిపించడం మా పని కాదు అనే నిర్ణయానికి వచ్చాం. ఆ నిర్ణయం రచనకి తృప్తి కలిగించ లేదు. ఆ తరవాత రెండేళ్ళు డౌ సమావేశాలకి నిరసన గుంపుతో తనొక్కతే వెళ్ళి వచ్చేది. ఈ మధ్య ఒకసారి ఉద్యోగం నించి ఒక నెల సెలవు తీసుకుని మాతృదేశం పర్యటిస్తూ ఒక వారం భోపాల్‌లో గడిపి వచ్చింది. ఇంతలో ఉద్యోగంలో తనని డౌ కంఫెనీ ప్రాజెక్టుకి వేశారు. అంత పెద్ద కంపెనీ కార్యకలాపాల్లో తను పోషించే పాత్ర అతి చిన్నదే .. ఐనా తన శక్తి సామర్ధ్యాల్ని అవసరమైన చోట కాకుండా ఇటువంటి నిజాయితీ లేని కంపెనీలకి ఉపయోగపడేందుకు వినియోగిస్తున్నానే అని చాలా మధన పడింది .. ఒక్క నెల పాటు.

2002లో ఉద్యోగానికి రాజీనామా చేసి భోపాల్ చేరుకుంది. ఇదీ అదీ అని తేడా లేకుండా భోపాల్ విషవాయు పీడితుల సహాయానికి జరుగుతున్న కార్యక్రమాలన్నిటిలోనూ పాల్గొనసాగింది. త్వరలోనే తన సహజ సిద్ధమైన నాయకత్వ లక్షణాలు తోటి వారికి తెలిసి వచ్చి రచనకి పై ఎత్తు బాధ్యతలు కట్టబెట్టారు. ఎయిడ్ రచనకి జీవనసాథీ అనే ఫెలోషిప్ ఇచ్చి తన పని నిర్విఘ్నంగా కొనసాగించేందుకు సహాయం చేస్తోంది. నేను మాతృదేశంలో ఉన్నకాలంలో భోపాల్లో తమ కార్యక్రమాలు చూడడానికి రమ్మని రచన చాలాసార్లు పిలిచింది గానీ నా పనుల హడావుడి వల్ల వెళ్ళటం కుదరలేదు. భోపాల్ ప్రస్తుత పరిస్థితుల గురించి ఇటీవల బ్రిటిష్ పత్రిక గార్డియన్ ఒక వ్యాసాన్ని ప్రచురించింది. తను పని చేస్తున్న సంస్థ ఎక్కువగా వాయు పీడితుల ఆరోగ్య రక్షణకి అనేక ప్రత్యామ్నాయ సేవలు అందించడం, స్వయం ఉపాధి పనులలో వారికి అవసరమైన అవలంబం అందించడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంది. భోపాల్ వాసులకి జరిగిన జరుగుతున్న అన్యాయాన్ని గురించి ప్రపంచానికి చాటి చెబుతుంటుంది. అప్పుడప్పుడూ అవసరాన్ని బట్టి నిరసన ఉద్యమ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. హోలీ సమయంలో భోపాల్ నించి ఢిల్లీ కి పాదయాత్రగా వెళ్ళి కేంద్ర సచివాలయం ముందు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. వారితో పాటు రచన ముందే ఉంది. భోపాల్ ముఖ్యమంత్రి కార్యాలయం ముందు చేసిన ధర్నాలో అరెస్టయింది.

న్యాయం కోసం ఇంకా కొనసాగుతున్న ఈ సుదీర్ఘ పోరాటంలో భోపాల్ వాసులకి చిన్న చిన్న విజయాలు లభించినప్పుడు వాళ్ళతో కలిసి వారి విజయాలు తనవిగా ఆనందించింది. కోర్టులు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు, రాజకీయులు కుహనా సిద్ధాంతాల నీడన భోపాల్‌సంక్షేమాన్ని విస్మరించినప్పుడు సత్యాగ్రహంతో ఉద్యమించింది .. ఒకప్పటి నా సహోద్యోగి, ఎప్పటికీ నా స్నేహితురాలు రచన అంటే నాకెంతో గర్వంగా అనిపిస్తుంది.

Comments

cbrao said…
రచన ఆశయాలు,పీడితులకు సహాయం చేయాలనే తపన, హైదరాబాదులోని ప్రశాంతిని(http://groups.yahoo.com/group/tomakeadifference/) గుర్తుకు తెచ్చింది.ఇలాంటి కథలు,ఈనాటి యువతరానికి మార్గదర్శకంగా ఉంటాయి.
ఇలాంటి మంచి "రచన" లు చాలా కావాలి!ఈ దేశం బాగుపడాలంటే.
Anonymous said…
ఇటువంటి మంచి వ్యక్తిత్వమున్న రచనగారి గురించి మీ రచనలో మా అందరికీ తెలియచేసినందుకు మీకూ, మంచి ఆశయాలతో ముందుకుపోతున్న రచన గారికి వందనాలు.
Ramani Rao said…
మీ హృదయభాను చదివిన తరువాత నా మనసంతా తెలియని భావంతో నిండిపోయింది..ఏమని వ్యాఖ్యానించాలో కూడా తెలియడం లేదు.. చాలా సహృదయత కల స్నెహుతురాలు .. మీ స్నెహుతురాలు రచన.
Anonymous said…
మంచి విషయం చెప్పారు. మనసులో ఓ తపన ఉంటే తప్ప అందరివల్లా అయ్యే పనికాదు. రచన కు అభినందనలు.
Unknown said…
ఇలాంటి వాళ్ళు ఉండటం వళ్ళే మంచి అన్నది ఉన్నదని జనాలకు తెలుస్తుంది. రచనకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారని తెలియజేయండి.
S said…
inspiring story!!
lalithag said…
చాలా మంచి విషయాలు తెలియ చేస్తున్నారు ఈ టపాలో. చదివే వారిలో దాగి ఉన్న సేవా దృక్పథం ఇటువంటి టపాల వల్ల బిడియం తగ్గించుకుని బయటకు వచ్చి మన పరిసరాలని చైతన్యవంతం చేస్తుందని ఆశిద్దాం. ఏమి చెయ్యాలి అనేది, ఎంతో కొంత చేస్తూ ఉంటేనే తెలుస్తుంటుంది.

ప్రశాంతి లాంటి వారు కోరుకునేదీ అదే.
Dr.Pen said…
ఒక ప్రశాంతి, ఒక రచన, ఓ శ్రీధర్...వీరందరూ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిచ్చే మంచి మనుషులు. CNN Hero http://www.cnn.com/SPECIALS/2007/cnn.heroes/ విభాగానికి ఇలాంటి వారిని ప్రతిపాదిస్తే నేటి కాలపు పిల్లలకు కొత్త ఉత్తేజాన్నిచ్చిన వాళ్లవుతాం!
lalithag said…
Ismail గారు,
మంచి మాట చెప్పారు.

ఉచిత సలహానే అనుకోండి, చదువరులు కాస్త ఆలకించండి. ఫ్రశాంతితో కొంత communication ఇంతకు ముందు జరిపి ఉండడం వల్ల, వారితో చేయి కలిపినా, నామ మాత్ర ధన సహాయం తప్పితే వేరే రకంగా ఇప్పటి వరకూ ఉపయోగపడలేకపోయినందునా, మాతృభూమికి దూరంగా ఉంటూ మనసు అక్కడే ఉన్నా ఇక్కడినుండి ఏమి చెయ్యగలను అని ఆలోచిస్తున్నందువల్లా ఈ మాటలు చెప్తున్నాను.

శ్రీధర్ గారు, రచన, ఫ్రశాంతి స్ఫూర్తిగా, భారతదేశంలో ఉన్న చదువరులంతా వీలు కల్పించుకుని కొంత స్వచ్చంద సేవ చెయ్యండి.ధన సహాయం తక్కువ కాదు. తప్పని సరికూడాను. అయితే ప్రాంతీయంగా స్వయంగా సేవా కార్యక్రమాలలో పాల్గోనే అదృష్టం ఉన్న వారు దయ చేసి జంకు వదిలి ఎంత వీలైతే అంత participate చెయ్యండి. ఒకరికి చదువు చెప్పండి. వీధులు శుభ్ర పరచడం గురించి ఆలోచించండి, ఎక్కడో అక్కడ మొదలు పెట్టండి. traffic కి ఏ విధంగా సహాయం చెయ్య గలరో ఆలోచిస్తూ ఉండండి. ఆలోచనలు పంచుకోండి. సేవా దృక్పథాన్ని మీ చుట్టు ప్రక్కల మేల్కొల్పండి. అది హీరోల వంటి వారికి మనం చెయ్య గల ఆరాధన.
మీ అందరి శుభాభినందనలు రచనకి అందజేశాను. తను సవినయంగా ధన్యవాదాలు చెపుతోంది.
సంకల్పం ఉండాలే కానీ ఏదైనా చెయ్యవచ్చు. మన కంటే దీనస్థితిలో ఉన్నవారికి సహాయం చెయ్యాలి అనుకున్నప్పుడు, ఎవరికైనా డైరెక్టుగా సహాయ పడాలి అనిపిస్తుంది మనలో చాలా మందికి. ఒక ఆకలిగొన్న వానికి అన్నం పెట్టినప్పుడు ఆ మనిషి కళ్ళలో కనిపించే తృప్తే వేరు - దాని విలువ దానికుంది. కానీ వ్యక్తి సహాయం కంటే సమిష్టిగా, సంస్థాగతంగా చేసే పనులు హెచ్చు ఫలితాలనిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. వీటిల్లోనూ ఆకలి తీర్చే సంస్థల కంటే ఉపాధి పధకాల్ని అమలు పరిచి పేదరికం నిర్మూలించడానికి పనిచేసే సంస్థలు మరింత గొప్ప ఫలితాల్ని సాధిస్తున్నాయి.
ఉదాహరణకి AID, ASHA, CRY వంటి సంస్థల వెబ్ సైట్లు చూడండి. మిలీనియం డెవలెప్మెంట్ గోల్స్ (UNMDG) గురించి తెలుసుకోండి.
Ramani Rao said…
ఈ సేవా ధృక్పదం నాకు చాలా నచ్చింది... సహాయం ధన రూపేణా గాని, వస్తు రూపేణా గాని.. శ్రమ రూపేణా గాని ఇవ్వాలని.... ఎప్పటినుండో నా తాపత్రయం .. కాని అవకాశం నాకు రావట్లేదో లేదా అవకాశాన్ని నేను అందుకోలేకపొయానో.. ఇప్పటివరకు "రక్త దానాలు" తప్పితే ఏమి చెయ్యలేకపొయాను... ఆ తపన అలాగే వుండిపోయింది... ఒక్కొసారి అసలు అనుకొంటున్నాము గాని చెయ్యగలమా అనిపిస్తుంది... కాని ఇక్కడ రచన.. ప్రశాంతి వాళ్ళు చేస్తుంటే ... మనమెందుకు చెయ్యలేము అనిపిస్తుంది.. వాళ్ళని స్పుర్తిగా తీసుకొవలనిపిస్తుంది... వివరాలు చెప్తే నాకు తొచిన సహాయం అందజెద్దామని అలోచన..
spandana said…
రమా గారు,
ప్రశాంతి మొదలగు వారితో మీరూ చేయి కలపాలనుకుంటే ఇదిగో ఇక్కడ (http://groups.yahoo.com/group/tomakeadifference/) చేరండి.


--ప్రసాద్
http://blog.charasala.com
rākeśvara said…
చెయ్యాలని అందరికీ వుంటుంది.
కాని చెయ్యకపోతే జీవితం వృదా అని భావించి పడవ దూకి నదికెదురీదే సాహసం వున్నవారు చాలా అఱుదు.