ఒక రామ కథ

వారాంతపు బ్లాగు విహారంలో గిరి గారి "అనుకుంటా" తీగె కాలికి తగిలింది. ఆ తీగె లాగితే పెద్ద డొంకే కదిలింది.
భూకైలాస్ సినిమాలో నారదుడు పాడే రామాయణ గాథ పాటలో కపటనాటకుడని ఎవర్ని అన్నారని గిరిగారికి సందేహం.
ఆ పాటని అర్థం చేసుకోవడానికి నాకు తోచిన విషయాలు ఇవి.
1. అసలు సినిమా కథ రావణుడి గురించి - అందులో కథా నాయకుడు రావణుడు.
2. రావణుడు పరమ శివభక్తుడు. దీనికి counter point గా నారదుని విష్ణుభక్తి ఈ సినిమాలో ఈ రెండు పాత్రలు తారసిల్లిన ప్రతి సారీ ప్రత్యక్షమవుతూనే ఉంటుంది. రాధిక గారు ఉదహరించిన దేవ దేవ ధవళాచల మందిర పాటలోనే ద్వితీయార్ధం నారదుడి చేసే విష్ణు స్తుతి.
3. శివుని వర మహిమ వలన రావణుడి చేతిలో బందీగా ఉన్న పార్వతీ దేవిని అనునయించడానికి నారదుడు ఈ కథ చెబుతున్నాడు. ఈ కథ మామూలుగా చెప్పిన రామాయణ కథ కాదు. ఒక ప్రయోజనం కోసం ఒక దృక్కోణం నించి ఒక లాంటి మనోభావాలున్న పాత్ర తన వ్యాఖ్యానంతో సహా చెబుతున్న కథ.
నారదుడి వైష్ణవం ప్రసక్తి ఎందుకు తెచ్చానంటే ఆయన దృష్టిలో విష్ణువే పరమాత్ముడు. ఈ భక్తుడి గొంతు పాట మొదటినించీ చివరి దాకా స్పష్టంగా వినబడుతుంది.
"ద్వార పాలుర మరల దరిదీయు కృపయో
ధరలోన ధర్మము నెలకొల్పు నెపమో .. రాముని అవతారం .. రవికుల సోముని అవతారం"
ఇలా ఎత్తుగడ దగ్గర్నించీ ప్రతి ఘట్టంలో, ప్రతి చరణంలో నారదుడు తన వ్యాఖ్యానంతో పరమాత్మ రూపంగానే చెపుతాడు కానీ తిన్నగా కథ చెప్పడు.
దీనికి తులనాత్మకంగా "అహో రామ కథ", "ఏమి రామ కథ శబరీ శబరీ", లవకుశ సినిమాలోని మూడు రామాయణం పాటలనీ గమనించండి. అవన్నీ రాముణ్ణి మనిషిగా, కథానాయకుడిగా చూస్తాయి. పాడిన వారు రామ భక్తులే గానీ పరమ వైష్ణవ తత్వాన్ని తెలుసుకున్నవారు కాదు. అదీ నారదుడి వైష్ణవత్వం విశేషం. కవి సముద్రాల గారు వైష్ణవులు కావటం కూడా దీనికి దోహదం చేసి ఉండవచ్చు.
ఇంకో కథా సూక్ష్మం ఏవిటంటే - రావణుడు హీరోగా ఉన్న సినిమాలో "వాడుత్త వెధవ, రాముడు పుట్టి వాణ్ణి చంపుతాడులే" అన్నట్టు రామకథ చెప్పటం కథా మర్యాదకి వ్యతిరేకం - మన హీరోని మనమే విలన్ గా చేసుకోవటం కూడదు. అందుకని రావణుడికి counter point గా నారదుణ్ణి పెట్టి ఆయన గొంతుతో రామ కథ చెప్పించారు.
ఇదేం మల్లాది చన్ద్రశేఖరశాస్త్రి గారి పురాణకాలక్షేపం కాదు, ఏదో నాకు తోచిన నాలుగు ముక్కలు మీతో పంచుకోవాలని, తద్వారా మీరు ఆ పాటని ఇంకొంచెం ఎక్కువ ఆస్వాదిస్తారేమోనని.

శ్రీనాథ్ గారు కూర్చిన ఘంటసాల పాటల ఖజానాలో ఈ పాట వినచ్చు.

పాట పూర్తి పాఠం ఇదుగో.

ద్వారపాలుర మరల దరిదీయు కృపయో
ధరలోన ధర్మము నెలకొల్పు నెపమో
రాముని అవతారం, రవికుల సోముని అవతారం
సుజన జనావన ధర్మాకారం
దుర్జన హృదయ విదారం

దాశరధిగ శ్రీకాంతుడు వెలయు
కౌసల్యా సతి తపము ఫలించు
జన్మింతురు సహజాతులు మువ్వురు
లక్ష్మణ శతృఘ్న భరతా

చదువులు నేరుచు మిషచేత
చాపము దాలిచి చేతా
విశ్వామిత్రుని వెనువెంట
యాగము కావగ చనునంట
అంతము జేయు నహల్యకి శాపము
ఒసగును సుందర రూపం

ధనువో జనకుని మనసున భయమో
ధారుణి కన్యా సంశయమో
దనుజులు కలగను సుఖగోపురమో
విరిగెను మిథిలా నగరమున

కపటనాటకుని పట్టాభిషేకం
కలుగును తాత్కాలిక శోకం
భీకర కానన వాసారంభం
లోకోద్ధరణకు ప్రారంభం

భరతుని కోరిక తీరుచుకోసం
పాదుకలొసగే ప్రేమావేశం
నరజాతికి నవనవ సంతోషం
గురుజన సేవకు ఆదేశం

అదిగో చూడుము బంగరు జింక
మన్నై చనునయ్యో లంకా
హరనయనాగ్ని పరాంగన వంకా
అరిగిన మరణమె నీకింక

రమ్ము రమ్ము హే భాగవతోత్తమ
వానర కులపుంగవ హనుమ
ముద్రిక కాదిది భువన నిదానం
జీవన్ముక్తికి సోపానం

రామ రామ జయ రామ రామ
జయ రామ రామ రఘుకుల సోమ
సీతా శోక వినాశన కారి
లంకా వైభవ సంహారి

అయ్యో రావణ భక్తాగ్రేసర
అమరంబౌనిక నీ చరిత
సమయును పరసతి పై మమకారం
వెలయును ధర్మ విచారం.

Comments

Anonymous said…
కొత్త పాళీ గారూ,
మీరు చెప్పిందంతా చాలా బాగుంది.
మీరు ఓపికగా, వివరంగా చెప్పారు.

It was a pleasure reading the explanation. I did not mean to lessen its value by my question.

I would like to think that I explained my doubts clearly, all my comments on Giri gari's blog put together. But in reality it doesn't seem so.

I am glad though, they propmted an even more interesting explanation followed by the entire lyric of the song. Thanks.

Regrards,
lalitha.
లలిత గారు, మీ సందేహం (గిరి గారి బ్లాగులో రాసినది) అర్థమయ్యేటట్టే అడిగారు. ఇప్పుడు సందేహం తీరిందని ఆశిస్తాను.
Sriram said…
ధనువో జనకుని మనసున భయమో
ధారుణి కన్యా సంశయమో
దనుజులు కలగను సుఖగోపురమో
విరిగెను మిథిలా నగరమున

ఈ చరణానికి ఏదైనా పద్యం ఆధారమా? ఏదో ఉండాలని గుర్తు. సముద్రాల వారికి ఇంత గొప్ప సాహిత్యం రాసే శక్తి తప్పకుండా ఉంది. ఆయన ప్రతిభే ఐనా నేను ఆశ్చర్యపోను.

మంచి విషయాలు చెప్పినందుకు కొత్తపాళీవారికి ధన్యవాదాలు. శ్రీరామనవమి పూట రామకధ పాడుకోవడం జరిగింది.
ఇది కాదు, వాగ్దానం సినిమాలో వచ్చే సీతాకళ్యాణం హరికథలో
పెళ్ళుమనె విల్లు గంటలు ఘల్లుమనె - అన్న పద్యం (?) ఏదో తెలుగు రామాయణం లోదని విన్నాను.
తమాషాగా ఆ హరికథని రాసింది శ్రీశ్రీ!

ఈ పాటలో "దనుజులు కలగను సుఖగోపురమో" అన్న లైను మన బుర్రని ఒక్క గంతు వేయిస్తుంది.
కొత్త పాళి గారు,
మీరు రాసే వివరణల కోసమైనా ఓ చిక్కు ముడి పాటని కనిపెట్టి ప్రశ్నించాలని ఉంది :)

గిరి
తప్పకుండా. ఆ మాత్రం చిక్కదనం లేనిది కవిత్వం కాదు నా దృష్టిలో. నాకేదో గొప్పగా తెలుసని కాదు కాని, తెలిసింది తప్పక పంచుకుంటాను.
భలే! నేనుకూడా "దనుజులు కలగను సుఖగోపురమో" అన్న పంక్తి దగ్గర ఆగిపోయాను. బుర్ర ఒక్క గంతుకాదు, రెండుమూడు వేసింది. ఆలోచిస్తే దీనికి చాలానే తాత్పర్యాలు చెప్పుకోవచ్చేమో.
అభిజ్ఞాన said…
పాటకు మీరిచ్చిన దౄక్కోణం చాలా బాగుందండి..చాలా విషయాలు తెలిసాయి. థాంక్యూ.
Vasu said…
"కపటనాటకుని పట్టాభిషేకం"
ఒక వేల రాముడే అనుకున్నా,రాముడికి పట్టాబిషేకం ఎక్కడ జరిగింది వనవాసం కెళ్ళే ముందు ?