గోపుఛ్ఛ యతి

ముత్తుస్వామి దీక్షితుల వారి కృతులు అనేక శబ్ద చమత్కారాలతో అలరారుతుంటాయి. చిన్నప్పణ్ణించీ ఘంటసాల వారి గొంతులో వాతాపి గణపతింభజే కృతి వింటూనే వున్నా, ఆ కృతిలోని అంత్యప్రాసలకి - అవేవిటో తెలియని స్థితిలో కూడా - ముగ్ధుణ్ణి అవుతూనే ఉన్నాను. కొంచెం రాగాల గురించి తెలుసుకుని వాటిని గుర్తుపట్టటం నేర్చుకుని దాంతోబాటుగా సాహిత్యం మీద కూడా కాస్తంత శ్రద్ధపెట్టి వినడం అలవాటు చేసుకుంటున్న స్థాయిలో .. ఈ కృతి హంసధ్వని రాగమనీ, ఆ రాగం పేరు కృతి సాహిత్యంలో ఇమిడి ఉందనీ గమనించినప్పుడు.. ఎంత ఆనంద పడిపోయానో చెప్పలేను. గట్టిగా అరిచి మా అమ్మకి చెప్పాను. మా అమ్మ నవ్వి, ఔను, మనలాంటి వాళ్ళం ఆయనరాగాలు గుర్తుపట్టలేమేమోనని మహానుభావుడు చక్కగా పాటలోనే రాగం పేర్లు వచ్చేట్టు రాశాడు అంది.

నాకు సుమారు పధ్నాలుగేళ్ళప్పుడు అనుకుంటా మా అమ్మ మదురై మణి అయ్యరుగారి రికార్డొకటి కొనుక్కొచ్చింది. అందులో ఆయన "మాయే త్వం యాహి" అనే కృతి పాడారు. మణి అయ్యరుగారి ఉచ్చారణ అర్థం చేసుకోవటం ఒక బ్రహ్మ ప్రయత్నం. ఐనా ఆ కృతిలోని శబ్ద చమత్కారం నన్ను ఇట్టే ఆకట్టుకుంది. ఆ సాయంత్రమే ఆ కృతిని ఒక పది సార్లు వినివుంటాను. మరునాడు లేవంగానే మళ్ళీ. మా అమ్మ గొడవ - రికార్డు అరిగి పోతుందిరా - అని.

నన్నింతగా ఆకట్టుకున్నది ఆ కృతిలో ఒక వరుస - ఇలా వస్తుంది.
సరసకాయె రసకాయె సకాయె ఆయె.. మాయే త్వం యాహి..
ఈ మాటల మాయాజాలం ఏవిటో అర్థం చేసుకోవడానికైనా సంస్కృతం నేర్చేసుకోవాలన్నంత హడావుడి పడిపోయాను.

ఈ చమత్కారాన్నే గోపుఛ్ఛయతి అంటారుట - నిన్న కృష్ణమోహనరావుగారి వ్యాఖ్యతో తెలిసింది.

నెమ్మదిమీద దీక్షితుల కృతులు వినగా వినగా మరికొన్ని ఉదాహరణలు ఎదురయ్యాయి. ఇవి కేవలం నాకు గుర్తున్నట్టు రాస్తున్నాను - తప్పులుంటే క్షమించండి.

ఆనందభైరవి - త్యాగరాజ యోగ వైభవం
త్యాగరాజ యోగ వైభవం, అగరాజ యోగవైభవం, రాజయోగ వైభవం, యోగ వైభవం, వైభవం, భవం, వం.

ఈ కృతిలోనే చరణంలో వ్యతిరేక శ్రేణిలో ప్రయోగం కూడా ఉంది.
ప్రకాశం, సంప్రకాశం, స్వరూప ప్రకాశం, తత్త్వ స్వరూప ప్రకాశం, సకల తత్త్వ స్వరూప ప్రకాశం, శివశక్త్యాది సకల తత్త్వ స్వరూప ప్రకాశం

ఈ వ్యతిరేక శ్రేణిని స్రోతోవాహ యతి అని పిలుస్తారుట, కృష్ణమోహన రావుగారు ఇప్పుడే చెప్పారు.

తరంగిణి - మాయే త్వం యాహి
సరసకాయె రసకాయె సకాయె ఆయె

శ్రీ - శ్రీ వరలక్ష్మీ నమస్తుభ్యం
శ్రీ సారసపదే రసపదే సపదే పదే పదే

ఇప్పటికింతే గుర్తున్నాయి. మీక్కూడా ఏవైనా గుర్తొస్తే చెప్పండి.

దీక్షితుల కృతుల సాహిత్యం శ్రీ టాడ్ మెక్కోంబ్ గారి కృషి ఫలితం RTS లో మేళకర్త రాగపు వరుసలో ఇక్కడ చూడొచ్చు. సాహిత్యం వెంటనే ఆంగ్ల అనువాదాలు కూడా ఉన్నాయి.

Comments

సంగీతానికి సంబంధించి చక్కటి విషయాలను తెలియజేస్తున్నారు. కృతజ్ఞతలు.

గమనిక:
వ్యాఖ్యలు వ్రాయాలంటే బ్లాగరు అకౌంటు అడుగుతుంది. అకౌంటు లేని వారు కూడా వ్యాఖ్యలు వ్రాయగలిగేలా మార్చగలరు.
Sriram said…
గోపుచ్ఛ యతి గురించి నాకూ ఇప్పుడే తెలిసిందండీ...
స్మరవారం వారం...అని ఒక తరంగం ఉంది...మరి రెండుసార్లె కదా ఇది క్వాలిఫై ఔతుందో లేదో...
@Nagaraja - thanks for your appreciation. Changed the settigns for comments.

@Sriram - Samskrtam is the ideal playground for such exercises. I remember one cATu SlOka that ends - kavayAmi, vayAmi, yAmi. Mathematically one needs at least three terms to establish a progression :) THis double repetition has some other name - vRtyanuprAsa something like that.
నా దగ్గర వున్న "దీక్షిత కృతిరచనా దక్షత" అనే పుస్తకంలోని 300 పైచిలుకు కృతుల సాహిత్యాన్ని పరిశీలించాను.
ఇలాంటి చమత్కారం ఉన్నవి ఈ మూడే కనిపించాయి.
త్యాగరాజ యోగ వైభవం కృతి వద్ద ఆ పుస్తక రచయిత ఈ విన్యాసం గురించి చాలా పెద్ద వివరణే ఇచ్చారు.
ఆ విశేషాలు మరోమాటు ఎప్పుడైనా ..
Sriram said…
"త్యాగరాజ యోగ వైభవం, అగరాజ యోగవైభవం, రాజయోగ వైభవం, యోగ వైభవం, వైభవం, భవం, వం." దీని అర్ధం గురించి త్వరలో రాస్తారని ఆశిస్తున్నాను.