అమ్మ కోసం ఒక క్రిస్మస్ కార్డు

 పెళ్ళీ పెటాకులూ లేకుండా ఒక్కత్తినే ఉన్నందుకూ, నాకంటూ పిల్లలూ లేనందు వల్లనూ నేనెప్పుడూ ఎవరికీ క్రిస్మస్ కార్డులు పంపేదాన్ని కాను. ఏం ప్రయోజనం? అనుకునే దాన్ని. కానీ నా ఇతర కుటుంబ సభ్యులూ స్నేహితులూ నాకు పంపిన కార్డులు మాత్రం చక్కగా నా ఫ్రిజ్ మీద టేప్ పెట్టి అతికించి పెట్టేదాన్ని. చాలా రోజులు వాటన్నిటినీ మురిపెంగా చూస్తూ,  వాటిల్లో కనిపిస్తున్న ఆనంద భరితమైన ఆ కుటుంబాల్లో నేనూ ఒకతెను అయి ఉండకూడదా అని పగటి కలలు కంటూ ఉండేదాన్ని. 

ఒకేడు ఒక నర్స్ అమ్మాయి నించి నాకు కార్డ్ వచ్చింది. అంతకు మునుపు వేసవిలో ఆమె నా యింట్లో ఒక గది అద్దెకి తీసుకుని ఉంది. ఆ కార్డు మీద ఫొటోల్లో - కొలరాడో రాష్ట్రంలోని పర్వతాల మధ్యలో, హవాయి ద్వీపాలలో మహాసముద్ర తీరంలో - తాను ఒక్కత్తే ఉన్న ఫొటోలు. జంటగా ఎవరూ లేరు. పిల్లలూ లేరు. "ఆనందాన్ని పంచి పెట్టు" అని కార్డు మీద సందేశం!

దాంతో స్ఫూర్తి పొంది నేను నా మొట్ట మొదటి క్రిస్మస్ కార్డు తయారు చేశాను. నా పిల్లులు, నేను చేసిన కొన్ని ప్రయాణాలు, నా మిత్రులతో గడిపిన కొన్ని సందర్భాలు - ఈ ఫొటోలతో కార్డు తయారు చేసి, కార్డు వెనకాల సందేశంగా ఒక రూమీ కవితని ఉంచాను. ముందొక ఇరవై మాత్రం ముద్రించి ఇరవై మందికి పంపాను. ఇంతలో మరో ఇరవై మంది గుర్తొచ్చారు. అలా పంపుతూ మొత్తం 99 కార్డులు పంపాను ఆ క్రిస్మస్ కి. నేను పంపకుండా ఉండిపోయిన ఒక్క వ్యక్తి మా అమ్మ - ఎందుకంటే, ఆ సెప్టెంబర్ నెల్లోనే ఆవిడ అకస్మాత్తుగా మరణించింది. 

కలిసి జరుపుకోవడానికి నాకు తోడుగా నాకంటూ ఒక కుటుంబం లేకపోయినా, నేనిలా అందరికీ క్రిస్మస్ కార్డులు పంపానని ఆవిడకి తెలిస్తే సంతోషించేది అనిపించింది. అలా ఆవిణ్ణి మిస్సవుతున్నాను. ఆవిడతో మాట్లాడినప్పుడల్లా ఆవిడకి చెప్పడం కోసం నా మాటల్లో నేను మూటగట్టుకునే ధైర్యం - ఆ క్షణానికి నాకు నేను ఏ మాత్రం ధైర్యం ఫీలవక పోయినా - ఆ ధైర్యాన్ని మిస్సవుతున్నాను.

ఇక లాభం లేదని, మా అమ్మ చివరిగా నివసించిన ఎడ్రసుకి ఒక కార్డు పోస్ట్ చేశాను. అది పుచ్చుకోవడానికి ఆవిడ అక్కడ లేదు, లేక పోయినా పరవాలేదు అనిపించింది.

రెణ్ణెల్ల తరవాత డోరతి అనే ఆవిడ దగ్గర్నించి నాకో ఉత్తరం వచ్చింది.  మా అమ్మ చనిపోగా ఖాళీ అయిన అపార్ట్ మెంటులోకి ఈవిడ చేరిందిట. ఆ ఉత్తరంలో ఆమె రాసిన ప్రకారం ఆవిడకి డెబ్భై దాటాయి, తన కుటుంబం అంటూ చెప్పుకోడానికి పెద్దగా ఎవరూ లేరు. ఆ యేడు ఆమెకి అందిన ఒకే ఒక క్రిస్మస్ కార్డు నేను మా అమ్మకోసం పంపినదే. ఆశగా, ఆవిడ ఆ కార్డుని వదులుకోలేక తెరిచి చదివింది. ఫొటోలు చూసుకుంది.

"ఆ కార్డు, ఆ ఫొటోల్లోనించి ధైర్యంగా స్థిరంగా నవ్వుతున్న యువతిని చూడ్డం అ క్రిస్మసు పండుగకు నాఖు దొరికిన గొప్ప అనుభూతి," అని తన ఉత్తరంలో రాసిందావిడ.

"ఆ ఫొటోల్లో ఉన్న అమ్మాయివి నువ్వేనా? మీ అమ్మ నిన్ను చూసుకుని చాలా గర్వపడి ఉంటుంది," అని ముగిసింది ఆవిడ ఉత్తరం. 


Comments