మా అమ్మ ఉత్తరాలు రాస్తానంది. నేనూ రాస్తానని చెప్పాను. బహుశా ఆవిడ కొంత దుఃఖపడుతూ ఉండి ఉంటుంది. నేనేమో గొప్ప ఉత్సాహంతో ఉన్నాను. పీస్ కోర్ వాలంటీర్ గా నేను ఇంటినించి బయలుదేరుతున్న సందర్భం అది. ఎక్కడో హిందూ మహాసముద్రం మధ్య ఉన్న సేషెల్స్ అనే చిన్న దీవి నా గమ్యం.
ఇదంతా ఇంటర్నెట్ రాక ముందు. ఆ దీవిలో మాకు ఫోన్ కూడా లేదు. బయటి ప్రపంచంతో ఉన్న ఒకే ఒక లింకు ఉత్తరాలు మాత్రమే. ద్వీపానికి దగ్గరలో ఉన్న ఆఫ్రికా ఖండ తీరం కనీసం వెయ్యి మైళ్ళ దూరం ఉంది. అమెరికా నించి ఉత్తరం రావడానికి రెండు వారాలు పట్టేది.
నేను ఆ దీవిలో దిగినప్పటినించీ అమ్మకి ఉత్తరాలు రాయడం మొదలు పెట్టాను. తాటి చెట్లు ఎంత పొడుగ్గా ఉన్నాయో, గవ్వలు ఎవరో విరజిమ్మినట్టు బీచి నిండా ఎలా పరుచుకుని ఉన్నయ్యో, సాయంత్రం పూట గబ్బిలాలు గుంపులుగా ఎగురుతూ ఆకాశాన్ని దాదాపుగా ఎలా కప్పేస్తూ ఉండేవో .. ఇవన్నీ. ఒక సాయంత్రం, మారిషస్ దేశస్తులైన మా పొరుగింటి వారు మమ్మల్ని భోజనానికి పిలిచి వడ్డించిన కూరలు మిరియాలతో నిండి ఎంత ఘాటుగా ఉన్నాయంటే మా అందరి మొహాలనించి చెమటలు ధారాపాతంగా కారుతూ ఉన్నాయి ఆ సాయంత్రమంతా. ఐనా మేం నవ్వుల్లో మునిగి పోయి ఉన్నాం, బాగా పొద్దు పోయే దాకా తాగుతూ గడిపాం. తనని మిస్సవుతున్నా అని అమ్మకి ఉత్తరం రాశాను.
ఆవిడ ఉత్తరాలు ప్రతి వారం వచ్చేవి, క్రమం తప్పకుండా. అలా రెండున్నర ఏళ్ళు సాగింది. ఓక్లహోమా సిటీలో తన చుట్టూ జరుగుతున్న విషయాలు రాసేది. తన బుక్ క్లబ్ వాళ్ళు ఎంచుకున్న పుస్తకం గురించో, తను ఎంత ప్రేమతో పెంచినా, ఆ దుర్భరమైన వేడికి వడలి పోతూ ఉండే గులాబి మొక్కల గురించో ... నేను దాదాపుగా మరిచిపోయిన ఏదో సుదూర జ్ఞాపకానికి నన్ను కట్టి ఉంచిన బంధం లాగా అనిపించేవి ఆవిడ ఉత్తరాలు.
ఆ ద్వీపానికి వెళ్ళడానికి ఆ విమానం ఎక్కినప్పుడు నా వయసు 24. మా అమ్మ తాను పుట్టి పెరిగిన ఊరు, మురిగ్గా ఉండే ఉక్కు కర్మాగారాల స్థలమైన బెత్లెహెం (పెన్సిల్వేనియా) నగరాన్ని విడిచి బయలు దేరినప్పుడు ఆవిడది కూడా అదే వయసు. అప్పటి వరకూ ఆమెకి పరిచయమైనవి తాను బడికి వెళ్ళి వచ్చే దారిలో దాటుకుని వెళ్ళే కొన్ని భవనాలు, తనకి పదిహేనేళ్ళ వయసు నించీ పని చేస్తూ వచ్చిన లోదుస్తుల ఫేక్టరీ - అంతే! ఐనా ఆ రోజున ఆమె రైలెక్కి న్యూయార్కు నగరానికి బయలుదేరింది, ఒక పక్క భయంతో వణికి పోతూ, మరో పక్క ఆశాల్లో తేలిపోతూ. అక్కడ ఒకాయన్ని కలుసుకోవడానికి ఆ రైలెక్కింది.
ఆయనతోనే డెబ్భై యేళ్ళు గడిపింది. ఆయనే మా నాన్న. ఆయనతో కలిసి ప్రపంచమంతా తిరిగింది. ఒక సైకో థెరపిస్ట్ గా తన వృత్తి నిర్వహిస్తూనే ఐదుగురు పిల్లల్ని కని పెంచింది. అందరమూ దేశ ద్రిమ్మరులమే. ఈ కొరోనా వైరస్ ఈ ప్రపంచాన్ని తలక్రిందులు చేసేందుకు కొద్ది కాలం ముందటే ఆవిడ ఈ లోకాన్నించి నిష్క్రమించింది.
ఈ విచిత్రమైన బాధాకరమైన రోజుల్లో ఆవిణ్ణించి ఇంకొక్క ఉత్తరమైనా మా అమ్మ దగ్గర్నించి అందుకో గలిగితే బాగుండు అనిపిస్తూ ఉంటుంది.
Comments