కథా చర్చ: విండో షాపింగ్

   విండో షాపింగ్
విజయ కర్రా


 
తప్పటడుగులనాటి అలవాటు అమ్మతో షాప్పింగ్ అంటూ మాల్సులో తిరగడం. అమ్మ ఇప్పుడు మానేసింది. నేను మాత్రం చేస్తూనేవున్నాను మాల్ బయట పార్కింగ్ ఏరియాలో - విండో షాపింగ్.
 
టీషర్టులోంచి తలదూరుస్తూ అద్దంలో చూసుకుంటే "నీ వయసు ఇరవై సంవత్సరాలంటే ఎవరు నమ్మరు శామ్! దోస్ లార్జ్ ఇన్నోసెంట్ ఐస్ అండ్ దట్ కిడ్ కైండ్ ఆఫ్ లుక్... యు నో!  అవే నీ అడ్వంటేజ్" అనే టోనీ మాటలు గుర్తుకొచ్చాయి.
 
ఒత్తైన జుట్టుని రెండు చేతులతో పైకి ఎత్తిపట్టి రబ్బరు‌బ్యాండుతో బిగించాను. స్నీకర్స్ లేసులు ముడివేస్తుంటే గుర్తుకువచ్చింది. ఇవీ టోనీ సలహతో కొన్నవే. వేగంగా నడిచినా - పరిగెత్తినా - గాలిని కోస్తున్నట్లుందే కాని మరో చప్పుడే వినిపించదు. అందుకే ఆ మధ్య ట్రంకులో బ్యాగులు సద్దుకుంటున్న ఓ పెద్దావిడకి నేను పక్కనుండి హ్యాండుబ్యాగ్ తీసుకెళ్ళిపోయినా తెలియలేదు.
 
అమ్మ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని పోస్ట్‌లో వచ్చిన ఫ్రీ కూపన్లనుండి తనకి కావలసినవి వేరుచేసుకుంటోంది. హాల్లోకొచ్చి జాకెట్ వేసుకుంటుంటే అడిగింది "ఎక్కడికెళ్తున్నావ్ ప్రశాంత్?". దగ్గరికి వెళ్ళాను. టేబుల్ పైన అమ్మ తయారు చేసి పెట్టిన కేక్ డెలివరీకి రెడీగా వుంది. ఒంగి మెడ చుట్టూ చేతులు వేసి "అంత పెద్ద కేక్ ట్వెంటీ ఫైవ్ డాలర్సేనా? బయట ఫిఫ్టీ అయినా వుంటుంది" అన్నాను. అమ్మ నవ్వి "మాట మార్చకు. ముందు అడిగిందానికి జవాబు చెప్పు" అంది. "ఇక్కడికే - జస్ట్ - ఫ్రెష్ ఎయిర్ కోసం" అంటూ బయటకి నడిచాను. ఇట్స్ టైం టూ గో షాపింగ్!
 
***** ***** *****
 
నవంబర్ నెల చలికి గాలి తోడైంది. జాకెట్ హుడ్ తలపైనుండి లాగి కారు పైన రాలిపడ్డ ఆకులన్నీ తుడిచి బయలుదేరాను. కారు నాన్నది. నైన్‌టీన్ నైంటీఫోర్‌ టొయోటా కరోలా. లైట్ ఫేడెడ్ బ్లూ కలర్, రూఫ్ పైన, పక్కలా అక్కడక్కడా పెయింట్ కూడా పోయింది. అదీ ఒకందుకు మంచిదే. జనాలని ఎరుపు, తెలుపు కార్లు, కొత్త కార్లు ఆకట్టుకున్నట్లు ఇలాంటి కార్లు ఆకర్షించవు.
 
నేనుండే పరిసరాలు దాటి ఇప్పుడు చదువుతున్న కాలేజ్ పక్కనుండి కారు దూసుకుపోతోంది. కాలేజ్ అడ్మిషన్ అప్లికేషన్లతో మిగిలిన స్టూడెంట్స్ అందరం సతమతమయ్యే రోజుల్లో "ఐ వాంట్  టు బి ఏ హ్యాకర్, దానికి డిగ్రీతో పనిలేదు" అన్నాడు టోనీ. ఆ రోజునే వైట్, బ్లాక్, గ్రే అంటూ హ్యాకర్లలో వున్న రకాలు - వారి హ్యాకింగ్లో తేడాలు చెప్పి ఓ కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసాడు. నాన్న వుండి వుంటే ఆయన కోరిక ప్రకారం నేను ఇంజనీరింగ్ చదవాల్సి వచ్చేదేమో. ఇప్పుడింక నన్ను ఫోర్స్ చేసేవాళ్ళు లేరు. అందుకే తక్కువ ఖర్చుతో రెండేళ్ళ అసోసియేట్ డిగ్రీతో బయట పడదామని కమ్యూనిటీ కాలేజ్‌లో చేరాను. అమ్మ మాత్రం ఆ తరువాత రెండేళ్ళ యూనివర్సిటీ చదువు కోసం పెన్నీ పెన్నీ సేవ్ చేస్తోంది.
 
తల్లితండ్రులని ఎంచుకోలేము కానీ స్నేహితుల ఎంపిక మన చేతుల్లోనే వుందనేవాడు నాన్న. నాకయితే స్నేహాలు వాటితో ముడిపడిన సంఘటనలు అన్నీ కూడా డెస్టినీ అనిపిస్తాయి. ఇప్పుడు నే వెళ్తున్న ఈ దారిలో ఎదురయ్యే ప్రదేశాలు వాటి చుట్టూ అల్లుకున్న నా అనుభవాలే అందుకు నిదర్శనం.
ఇదిగో ఈ హైస్కూల్లోనే టోనితో మొదటిసారి పరిచయం. టెంత్ గ్రేడులో వుండగా నాన్న జాబ్ పోయి మరో దాంట్లో చేరడంతో వుండే సిటీ మారి దాంతో స్కూల్ కూడా మారాల్సివచ్చింది. తెలిసిన స్నేహితులెవరూ లేరు. లంచులో ఒంటరిగా కూర్చున్న నా దగ్గరికి టోనీ వచ్చి పరిచయం చేసుకున్నాడు. చెవికి రింగు, కుడి మోచేతికి పైన డ్రాగన్ టాట్టూ, ఫంకీ హెయిర్ స్టైల్ - అంతకు మించి చురుకైన ఆ కళ్ళు - అలా మొదటి పరిచయంలోనే విపరీతంగా నచ్చేసాడు. టోనీ పక్కన చేరాక అంతవరకూ నన్ను ఏడిపించడానికి ప్రయత్నించే బుల్లీస్ అందరూ వెనక్కి తగ్గారు. దాంతో తను నా పాలిటి హీరో అయ్యాడు.
 
స్కూల్ నుండి అరమైలు దూరంలో వున్న ఈ సూపర్ మార్కెటులోనే ఓ రోజున షాప్ లిఫ్టింగ్ చేసారన్న అనుమానంతో తలుపులు వేసి అందరినీ తనిఖీ చేసారు. నోటుబుక్స్ కొందామని వచ్చిన నేను టోనీ కూడా అక్కడే వున్నాం. సెక్యూరిటీ అతను వివరాలు అడగక ముందే ఆ షాప్ తాలుకు వ్యక్తి "ఇండియన్ కిడ్స్ అలాంటి పనులు చెయ్యరు. వాళ్ళని వెళ్ళనీ!" అన్నాడు.
 
బ్రవున్ స్కిన్ కలర్, డార్క్ హెయిర్, పెద్ద కళ్ళు, ఒత్తయిన కనుబొమ్మలు - లాటినొస్‌కి, ఇండియన్స్‌కి ఎతినిక్ ఫీచర్సులో వుండే కామన్ లక్షణాలు. నాతో వుండటంతో వీళ్ళు టోనీని ఇండియన్ అనుకున్నారేమో కాని సాధారణంగా ఇండియన్స్‌ని లాటినోస్ అనుకుంటారు. బయటకి వచ్చాక అదే అంటే "అమ్మ లాటినో. నాన్న బహుశా ఇండియనేమో?" అంటూ జోక్ చేసి నువ్వీరోజు మా ఇంటికి రావాలి అంటూ తీసుకెళ్ళాడు.
 
వెళ్ళాక ‘మీట్ మై మామ్ సూసన్, అండ్ డాడ్ ఎరిక్’ అంటూ తన పేరెంట్స్‌ని పరిచయం చేసాడు. ఇద్దరూ తెల్లవాళ్ళే. నా మొహంలో ప్రశ్న చదివినట్లు రూంలోకి వెళ్ళగానే చెప్పాడు వాళ్ళు తన ఫాస్టర్ పేరెంట్స్ అని. వాళ్ళ ఒక్కగానొక్క కొడుకు గల్ఫ్‌ వార్‌లో పోయాక నాలుగేళ్ళ టోనీని చేరదీసారు. ఫాస్టర్ కేర్‌లో టోనీని అప్పచెప్పే టైంకి అతని తల్లి ఇంకా కాలేజ్ స్టుడెంట్ అని మాత్రం ఎరిక్ వాళ్ళకి తెలుసు.
 
ఓ రెండు రోజుల తరువాత లాస్ట్ క్లాస్ అవగానే బయట కలిసి తనతో రమ్మన్నాడు. వెళ్తుండగా చెప్పాడు “నీకు తెలుసా షాప్ లిఫ్టింగ్ చేసి పట్టుబడిన వాళ్ళలో సెలబ్రెటీస్ కూడా వున్నారు. కొంత మంది అవసరం కోసం చేస్తే, కొందరికి అది బలహీనత మరి కొందరికి అది థ్రిల్".
 
"ఎవరా సెలబ్రెటీస్?" అంటూ నా ప్రశ్న పూర్తికాకముందే "తరువాత చెపుతాను కాని" అంటూ నవ్వి "మనని అనుమానించే అవకాశాలు తక్కువైనప్పుడు ఓసారి ప్రయత్నిస్తేనేం?" అన్నాడు. పది నిమిషాల్లో మేమో బట్టల షాపులో వున్నాం. వెళ్ళి బయటకి వచ్చాక జేబులోనుండి కొత్త టై తీసి చూపించాను. టోనీ నవ్వి షర్ట్ పైకెత్తి లేటెస్ట్ స్టైల్ కొత్త హుడ్డీని బయటకి తీసాడు. ఇద్దరం గొప్ప ఎడ్వంచర్ చేసిన వాళ్ళలా ఫీల్ అయ్యాం. తరువాతరువాత మా ఇద్దరికి అదో ఛాలెజింగ్ ఆటగా మారింది. ఊహకే భయపెట్టే పనులెన్నో టోనీతో కలిసి చేసినప్పుడు చాలా నార్మల్ అనిపించేవి.
 
ఆ తరువాత మా ఇద్దరి మధ్య స్నేహం మరింత పెరిగింది. ఇద్దరం కలిసి ఒకేసారి అప్లై చేసి లెవెంత్ గ్రేడ్ అయ్యాక ఒకేచోట సమ్మర్ జాబులోచేరాం. చేరిన కొద్ది వారాల తరువాత నేను టోనీ ఓ సాయంత్రం బయటకి వస్తుండగా కనిపించింది. పార్కింగ్ లాట్‌లో ఓ కారు వెనుక సీట్లో వున్న బ్యాగ్. విండో మూడు వంతులు మాత్రమే వేసివుంది. ఇద్దరం అక్కడ ఆగిపొయి చుట్టూ చూసాం. నిర్మానుష్యంగా వుంది. కారులో అలారం తాలుకూ ఎలాంటి బ్లింకింగ్ లేదు. అద్దం పైన వున్న గ్యాప్‌లోనుండి టోనీ చెయ్యి దూర్చి బ్యాగ్ బయటకిలాగాడు. వ్యాలెట్ తీసి జేబులో పెట్టుకుని బ్యాగు మళ్ళీ కారులో పడేసాడు. ఆ మర్నాడు దొరికిన డబ్బులతో వీడియో గేమ్స్ రెంటుకి తీసుకొచ్చి వుంచాడు. ఆ జూలై ఫోర్త్ వీకెండ్ మూడు రోజులు - కాల్ ఆఫ్ డ్యూటీ,  హేలో, వరల్డ్ ఆఫ్ వార్‌క్రాఫ్ట్ లాంటి పాపులర్ గేమ్స్ కొన్ని తనివితీరా ఆడాం.
 
ఓ ఇరవై నిమిషాల తరువాత వించెస్టర్ మాల్ వెనుక వైపున్న పార్కింగ్ ఏరియాలోకి తిరిగింది నా కారు. కాస్త దూరంగా ఓ చెట్టుక్రింద పార్క్ చేసి టోనీకి మెసేజ్ పెట్టాను.
 
నెమ్మదిగా నడవసాగాను. ఇంకో రెండు వారాల్లో థ్యాంక్స్ గివింగ్ వీకెండ్. ఇప్పటి నుండి క్రిస్మస్ వరకు హాలిడే స్పిరిట్‌తో మాల్స్ అన్నీ కళకళలాడుతుంటాయి. వస్తూ వెళ్తున్న కార్లు. వంటరిగా, జంటలుగా, గుంపులుగా, వొచ్చే వాళ్ళు, వెళ్ళే వాళ్ళు, ఎటు చూసినా జనం. సెల్ ఫొన్ బీప్ విని చూస్తే టోనీ నుండి మెసేజ్ "ఓసారి రాగలవా? ఐ హవ్ సమ్ ఇంట్రెస్టింగ్ న్యూస్" అంటూ. రిప్లై ఇచ్చి కారుకేసి నడిచాను.
 
***** ***** *****
 
యూనివర్శిటీ స్టూడెంట్స్ డోర్మెటరీ బిల్డింగ్స్ పక్కనుండి వెళ్తుంటే  ఐదు నెలల క్రితం టోనీతో కలిసి అక్కడికి వచ్చిన మొదటి రాత్రి గుర్తుకి వచ్చింది. రాత్రి రెండు గంటల వేళ ఇంటి వెనుక తలుపులు దగ్గరగా వేసి కారులో ఎదురు చూస్తున్న టోనీని కలిసాను. చీకట్లో  చెట్ల మధ్య వున్న ఓ బిల్డింగ్ వెనుక ఆపి చెప్పాడు. "ఎవరెక్కి వస్తారులే అని పైన ఫ్లోర్ల వాళ్ళే అజాగ్రత్తగా వుంటారు. ఆఫ్కోర్స్ ఏ ఫ్లోరయినా ట్రై చేసుకోవచ్చనుకో. రూల్ ఆఫ్ థంబ్! వెళ్ళడానికి మూడు నిమిషాలకన్నా పట్టకూడదు. ఏ గదిలోను ఒక్క నిమిషంకన్నా వుండకూడదు.
అవసరమైతే చిన్నగా విజిల్ వెయ్యి" అంటూ వెళ్ళాడు.
 
చేతులు చాచి ఎగిరి మొదటి బాల్కనీ గ్రిల్ అంచులు పట్టుకుని పైకి పాకి, అక్కడినుండి రెండో బాల్కనీలోకి పాకి మాయమయ్యడు. టోనీ తిరిగి వచ్చేవరకూ నా గుండె చప్పుడు పదింతలై వినిపించింది. ఓ పది నిమిషాలు కాకముందే ఓ ల్యాప్‌టాప్, ఐప్యాడ్‌లతో తిరిగి వచ్చి కారు స్టార్ట్ చేసాడు.
 
అలా గోడలు మిద్దెలు ఎక్కడం నాకు కష్టం. అదీ కాకుండా చిన్నపాటి చప్పుడికి కూడా మెళుకువవొచ్చే అమ్మకి తెలియకుండా రాత్రి పూట బయటకి రావడం కుదరదు. కారు దిగి ఇంట్లోకి వచ్చే ముందు అదే చెప్పాను. "ఇట్స్ ఓకే!" అంటూ నవ్వి "ఎప్పుడో కాని దొరకని వాటికోసం ఎన్నాళ్ళని ఆ మాల్స్ చుట్టూ తిరుగుతాం!" అంటూ వెళ్ళిపోయాడు.
 
నేను వెళ్ళిన సమయానికి టోనీ పేరెంట్స్ ఇంటిముందు రాలిన ఆకులని తుడుస్తున్నారు. సాధారణంగా ఇలాంటి క్లీనింగ్ పనులు టోనీయే చేస్తుంటాడు. ఇద్దరిని విష్ చేసి అదే ఆడిగితే "మెట్లపైనుండి పడి పాపం కాలు బెణికిందిగా! లోపలున్నాడు వెళ్ళు" అన్నాడు ఎరిక్.
 
డోర్ పైన నాక్ చేసి లోపలికి వెళ్ళను. కట్టుతో వున్న ఎడమ కాలుని ఓ స్టూల్ పైన వుంచి కంప్యూటర్‌లో పనిచేస్తూ కనిపించాడు. నాకేసి ఓసారి చూసి "కూర్చో ఓ ఐదు నిమిషాలు. అయిపోవచ్చింది" అన్నాడు. టోనీనే చూస్తూ కూర్చున్నాను. అతి చిన్నగా కట్ చెయ్యబడిన క్రాఫ్ - ఇంతకు ముందు రింగు పెట్టుకునే చెవికి ఇప్పుడు వైట్ స్టడ్ - విపరీతంగా వర్కవుట్ చేస్తున్నాడేమో శరీరం కడ్డీలా తయారైంది.
 
 చేసే పని ఆపి నాకేసి చూసాక అడిగాను "ఎలా జరిగింది?".
"దురదృష్టం కొద్ది మొన్న రాత్రి ఓ బాల్కనీ మిస్ అయ్యాను. అదృష్టం కొద్ది బెణికింది ఎడమ కాలు. దాంతో డ్రైవ్ చేసుకుని ఇంటికి రాగలిగాను".
"నొప్పి వుందా?"
 "పెయిన్ కిల్లర్స్ వేసుకోవడంతో తెలియటం లేదు. కాని తగ్గడానికి టైం పట్టేలావుంది".
 
నేను నవ్వి "యాక్షన్ మ్యాన్ టోనీకి ఇలా ఇంట్లో కూర్చోడం కష్టమే మరి" అన్నాను.
 
"అందుకేగా కుదురుగా కూర్చుని ఏంచెయ్యగలమో తేల్చుకుని నిన్ను పిలిచింది" అంటూ తమాషాగా నవ్వి అడిగాడు "జనం ఇంటి నుండి కదలకుండా షాప్పింగ్ చేస్తున్నప్పుడు మనం ఇంటినుండి కదలకుండా విండో షాప్పింగ్ చెయ్యలేమా?!".
"అంటే?" 
"విర్చువల్ విండో షాప్పింగ్! ఆన్‌లైన్ షాప్పింగ్‌లో ఎంటర్ చేసే క్రెడిట్ కార్డుల సమాచారం సైలెంటుగా దారి మళ్ళించడమే! ".
 
ఉలిక్కిపడ్డాను. విపరీతమైన భయం దానిని మించిన ఉత్సాహం ఒకేసారి పెద్ద కుదుపు కుదిపాయి నన్ను. టోనీ మొహంలో మెరుపు. సిస్టంని బ్రేక్ చేసిన ఎక్సైట్‌మెంటుతో వచ్చిన థ్రిల్ తాలుకు మెరుపు. భయం అన్నది ఇంతవరకు చూడలేదు ఆ మొహంలో.
 
నేను విన్నది పూర్తిగా జీర్ణం చేసుకోకముందే అడిగాడు " ఈసారి వింటర్ తీవ్రంగానే వుండేలావుంది. మామ్, డాడ్ ఇప్పుడే చలి తట్టుకోలేకుండా వున్నారు. కిటికీలు, తలుపులు కాస్త బాగుచెయ్యాలి. థ్యాంక్స్ గివింగ్
వీకెండుకి రాగలవా? ఈ కుంటివాడికి కాస్త సాయం చేద్దువుగాని". నేను నవ్వి వస్తానని ఓప్పుకున్నాక చెప్పాడు. "ఫ్రైడే నుండి మండే వరకూ రోజుకో ఐదారు గంటలు వుండేలా రా! నువ్వొస్తే ఆ పనితో పాటు మన విర్చువల్ షాప్పింగ్ కూడా చేసుకోవచ్చు. సైబర్ మండే మనకి మరీ ముఖ్యం. గుర్తు పెట్టుకో!".
 
***** ***** *****
 
టోనీ చెప్పిన విషయం నా మనసు ఇంకా పూర్తిగా స్వీకరించే స్థితిలో లేదు. క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్ మాములు నేరంకాదు. ఆ విషయం టోనీకి తెలియదనీ కాదు. అందులో రిస్క్ గురించి అంచనా వేస్తూ డ్రైవ్ చేస్తున్నాను. విలువైన వస్తువులో, క్యాషో  తీసుకోవడం తప్ప దొరికిన క్రెడిట్ కార్డుల జోలికి నేనెప్పుడూ వెళ్లలేదు. అలవాటైన పనిలో వున్న సౌకర్యమేదో నాకు తెలియకుండానే తిరిగి వచ్చే దారిలో మాల్ కేసి నడిపింది.
 
సాయంత్రం వేళ. నే పార్క్ చేసిన చోట చిక్కనవుతున్న చీకటి - నడిచే నాతో వస్తూ, పలచబడుతూ మాల్ దగ్గర లైట్ల కాంతిలో చెదిరి పోతోంది. పార్కింగ్ లాట్‌లో ఒక్కొక సందులో మాలుకి దగ్గరవుతూ దూరమవుతూ గమనిస్తూ నడుస్తున్నాను. ఆమె ఎవరో ఎదురుగా ఇటే వస్తూ... హ్యాండుబ్యాగ్ బుజానికి చేతికి మధ్య వత్తిపట్టి, అటూఇటూ పరీక్షగా చూస్తూ... ఈ జన్మలో నేను మనిషన్నవాడిని నమ్మనూ అన్నట్లు నా కళ్ళలోకి ఓ సారి చూసి ముందుకు సాగిపోయింది.     
 
ఆ సందు చివరికంటా నడిచి తిరిగి వస్తుంటే కనిపించింది కారు వెనుక సీటులో. విండోకి నాలుగు వేళ్ళు పట్టేంత సందు. జేబులో నుండి యాంటెన్నా కడ్డీ పైకి తీసి సాగదీసాను. విండోకి వున్న గ్యాప్ లోనుండి పోనిచ్చి...
యాంటెన్నా చివర అమర్చిన హుక్ బ్యాగు కొసకి తగిలించి బయటకి లాగాను. మెత్తటి బ్యాగ్. సుళువుగానే బయటికి వచ్చింది. ఓపెన్ చేసి గబగబా వెతికాను. మేకప్ సామాన్లు, బిల్లులు, పేపర్లు. 
 
చేతిలోకి వచ్చిన నాలుగు క్షణాలలో కావలసినవి తీసుకుని ఆ వ్యాలెట్టో, బ్యాగో వెంటనే వదిలించుకోవాలి. అది టోనీ చెప్పకుండా నా అంతట నేను తెలుసుకున్న సత్యం. తొలి రోజుల్లో తీరికగా వెతికి తరువాత పారేద్దామని  బ్యాకుపాక్‌లో వుంచేసిన పర్సులు నాన్న ఓరోజు చూసేసాడు. బెల్ట్ ఎప్పుడు చేతిలోకి తీసుకున్నడో కూడా తెలియదు. పిచ్చి కోపంతో తిడుతూ దెబ్బల వర్షం కురిపించాడు. ఇంట్లో అమ్మ లేదు. ఆపే వాళ్ళు లేరు. వున్నట్లుండి కొట్టడం ఆగిపోయింది. కళ్ళకి అడ్డుపెట్టుకున్న చేతులు తీసి ఏడుస్తూనే తలెత్తి చూసాను.
 
విపరీతమైన ఆయాసంతో నాన్న రొప్పుతున్నాడు. మనిషి నిలువెళ్ళా ఒణికి పోతున్నాడు. ఇందాకలాగే తిడుతున్నాడు. కాని అందులో స్పష్టత లేదు. మాట ముద్దగా వొస్తోంది. బెల్టు నేలకి జారిపోయింది. ఎడమ చేతితో గోడని పట్టుకుని నిలదొక్కుకోడానికి ప్రయత్నిస్తున్నాడు. నాన్నకేదో అవుతోందని తెలుస్తోంది. కాని ఒళ్ళంతా మంటల్లో పెట్టినట్లు దెబ్బల నొప్పి... కొట్టాడన్న కోపం... లేచి తిరిగి చూడకుండా నా రూంకి వెళ్ళి తలుపేసుకున్నాను. ఓ నాలుగు నిమిషాల తరువాత గుర్తుకొచ్చింది. హెల్త్ క్లాసులో స్ట్రోక్ లక్షణాల గురించి చెప్పిన పాఠం. తలుపుతీసి వేగంగా పరిగెత్తుకొని వచ్చి నైన్ వన్ వన్‌కి కాల్ చేసాను. కాని అప్పటికే ఆలశ్యం అయిపోయింది.
 
దొరికిన కొద్ది క్యాష్ తీసి జేబులో పెట్టుకుని బ్యాగు కారు క్రింద పడేద్దామా అనుకుంటుండగా " హే! ఎవరు నువ్వు? ఎవరిదా బ్యాగు? ఏంచేస్తున్నావిక్కడా?" అన్న అరుపులు విని ఉలిక్కిపడి తలెత్తి చూసాను. ఇందాక నాకేసి అనుమానంగా చూస్తూ మాల్ వైపు వెళ్ళిన ఆమె! నా ముందు నిల్చుని గట్టిగా అరుస్తోంది. నా కంగారు చూసి వెంటనే " ఎనీబడీ? హెల్ప్! హెల్ప్! ఇదిగో ఇక్కడ... దొంగ. పట్టుకోండి! పట్టుకోండి!"అంటూ మరింత గట్టిగా అరవసాగింది.
 
నాలో కంగారు. ఆమెలో భయం. ఇద్దరిలో ఏదో తెగువ... సరిగ్గా నేను చేతిలో బ్యాగు ఆమె పైకి విసురుతున్నప్పుడే ఆమె పెప్పర్ స్ప్రే గన్ తీసి నాకేసి షూట్ చేసింది. ఒకరినుండి ఒకరం దూరంగా పరిగెత్తాం. అలా వెనక్కి తగ్గి మొహం తిప్పుకునేలోగా అప్పటికే గాలిలో దూసుకొచ్చిన పెప్పర్ పౌడర్ నా కుడి కంట్లోకి, గొంతులోకి, ముక్కులోకి వెళ్ళి బగ్గున మండిస్తూ ఉక్కిరిబిక్కిరి చేసింది. అయినా ఆగే పరిస్థితి కాదు. అప్పటికే మాల్ వైపునుండి ఓ నలుగురు ఇటువైపే పరిగెత్తుకు రాసాగారు.
 
పార్కింగ్ ‌లాట్ అణువణువు తెలుసు కాబట్టి ఆగకుండా పరిగెత్తాను. పక్కకి తిరిగి పార్కింగ్ స్థలాన్ని డివైడ్ చేసే చిన్న చెట్ల గుంపు పైనుండి దూకి లోపలికి దూసుకు వొస్తున్న ఓ కారుని అమాంతం ఎగిరిదాటి మరో చెట్ల గుంపు పైనుండి అవతలకి దూకాను. మోచేతులు మోకాళ్ళు వెళ్ళి ధడ్‌మని రాళ్ళకి కొట్టుకున్నాయి. ‘అమ్మ్’ అంటూ వస్తున్న శబ్ధాన్ని గొంతులోనే నొక్కేసి... మరో చిన్న పరుగు తీసి పార్కింగ్‌లో ఉన్న రెండు వ్యాన్ల మధ్య ఆగాను. కారు హారన్లు - అరుపులు - దగ్గరలో పరిగెడుతున్న శబ్ధాలు. గుండె చిక్కబట్టుకుని తలమీంచి హుడ్ తీసి, చకచకా జాకెట్ విప్పేసి వ్యాన్ క్రింద పడేసాను. తలకివున్న రబ్బరు బ్యాండ్ తీసి విసిరేసి జుట్టుని బుజాలంతా పరుచుకునేలా విదిలించాను. మళ్ళీ ఓ సారి గట్టిగా ఊపిరి తీసుకుని కార్ల మధ్య ఒంగి నా కారుకేసి పరిగెట్టసాగాను.
 
పట్టుబడకూడదు. ఒకవేళ అదే జరిగి విషయం తెలిసి నాన్నలాగా అమ్మకి కూడా... నో!... నో!... నో!... అలా జరగకూడదు. ఓ గాడ్! ప్లీజ్! ఈ ఒక్కసారికి నన్ను పట్టుబడకుండా చూడు. ప్లీజ్!...
 
***** ***** *****
 
రాయి తట్టుకుని మళ్ళీ క్రింద పడిపోయాను. లేచి పరిగెడదామంటే కాళ్ళు సహకరించటంలేదు. కార్ల మధ్య పాకుతూ పారిపోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఒక్కసారిగా ఎన్నో వేల చేతులు నన్ను క్రిందకి తోసేసి నేలకి నొక్కిపట్టాయి. కళ్ళు విడిపడవు, గొంతులోనుంచి అరుపు బయటకి రాదు. విపరీతమైన ఆందోళనతో, భయంతో నిద్రలోంచి లేచి కూర్చున్నాను. ఒళ్ళంతా చెమటలు పట్టేసాయి. ఆ చీకట్లోకి అలా చూస్తుండగానే డిజిటల్ క్లాక్‌లో నంబర్ మారింది. థ్యాంక్స్ గివింగ్ లేబుల్ వదిలించుకుని రోజు బ్లాక్ ఫ్రైడేలోకి ఎంటర్ అయింది. ఈ రెండు వారాల్లో ఇదే తరహా పీడకల ఎన్నిసార్లు వచ్చిందో గుర్తులేదు.
 
కొన్ని గంటల తరువాత  టోనీ నుండి మెసేజ్ 'సీ యూ ఎట్ టెన్' అంటూ. ఏమని రిప్లై ఇవ్వడం? వచ్చి సహాయమైతే చేస్తాను కాని, విర్చువల్ షాప్పింగ్ మాత్రం చెయ్యనూ అంటే? - వినడు. ఎప్పటిలానే కన్విన్స్ చెయ్యడానికి ప్రయత్నిస్తాడు. 'నువ్వేం చెయ్యక్కరలేదు. జస్ట్ వెనుక కూర్చుని చూడు' అంటాడు.
 
ఓ నిర్ణయానికి వచ్చి సెల్ ఫోన్ తీసుకుని మెసేజ్ టైప్ చేస్తుండగా తెరలు తెరలుగా దగ్గొచ్చింది. లేచి నీళ్ళు తాగాను. అప్పుడే "కాఫ్ సిరప్ వేసుకున్నావా?" అంటూ అమ్మ నా బెడ్‌రూంలోకి వచ్చింది. పక్కనే కూర్చుని నుదిటి పైనుండి జుట్టుని పైకి తోసి చెంపలు మెడ తాకి చూసింది. ఛాతి పైన నెమ్మదిగా వేళ్ళతో రాస్తూ " ఏంటో నాన్నా!  ఇంతలా ఎలర్జీస్ నీకెప్పుడూ రాలేదు. ఈ లాంగ్ వీకెండ్‌ పూర్తిగా రెస్ట్ తీసుకో! తగ్గిపోతుందిలే! లేకపోతే డాక్టర్‌ని చూద్దాం! " అంది.
 
వస్తున్న దుఃఖాన్ని - చెప్పాలనిపించిన మాటలని - తాగే నీళ్ళతో పాటు గొంతులోకి తోసేసి సరే అన్నట్లు తల ఊపాను. నా చేతిలో గ్లాస్ తీసుకుని టేబుల్ పైన పెట్టి "ఏదయినా కావలంటే పిలు" అంటూ వెళ్లిపోయింది. సెల్ చేతిలోకి తీసుకుని ఇందాక టైప్ చేస్తున్న మెసేజ్ డిలీట్ చేసి రిప్లై ఇచ్చాను - ‘ఐ యామ్ సిక్ విత్ సివియర్ ఎలర్జీస్. సారీ మ్యాన్! రాలేను’.
 
***** ***** *****

Comments