From Navya Magazine
అహిగా
-సాయి బ్రహ్మానందం గొర్తి
ఒక భారతీయ స్త్రీ చిన్న నేలబారు పీట మీద కూర్చొని స్నానం చేస్తున్న చిత్రం. గోడకి ఉన్న అద్దంలో అస్పష్టంగా ఆమె ముఖం; ముఖం కన్నా నుదిటి పైన మెరుస్తూ ఎర్రటి బొట్టు. వీపు మీద తడిసిన తెల్లటి వస్త్రంలో ఆమె వెనుక భాగం స్పష్టంగా ఉంది. పొడవాటి నల్లటి శిరోజాల అంచున ముత్యాల్లా రాలుతున్న నీటి చుక్కలు. ఓ మూలగా ఒక రంగుల సంతకం ! - ఆమె తదేకంగా ఆ చిత్రం వైపే చూస్తోంది. ప్రతీ చిన్న వస్తువూ చాలా వివరంగా కనిపిస్తున్నాయి. ఒక సజీవ దృశ్యంలా మలచబడ్డ ఆ చిత్రాన్ని ఆమె రెప్ప వాల్చకుండా చూస్తూనే ఉంది. ఎంత భావుకతతో చిత్రీకరించాడు? ముఖ్యంగా ఎంచుకున్న రంగులు! ఒక్కసారి ఆ చిత్రకారుడి సంతకం వైపు చూసింది. అప్రయత్నంగా "అహిగా" అంటూ మెల్లగా అంది.
"ఏంటి అంత తదేకంగా చూస్తున్నావు, సరూ?" అంటూ జాన్ వెనుకనుండి ఆమె భుజం తట్టే సరికి ఒక్కసారి ఉలిక్కిపడింది.
"రోజూ చూస్తున్నదయినా, ప్రతీ రోజూ ఆ పెయింటింగ్ చూస్తుంటే కొత్తగా కనిపిస్తూనే ఉంటుంది," నవ్వ్వుతూ అంది సరూ.
సరూ కి ఇష్టమయిన ఆ పెయింటింగ్‌ని తన పడకగదిలో గోడకి పెట్టుకుంది. పాతికేళ్ళ క్రితం స్నేహితులతో కలిసి మొహావీ వేలీ వెళ్ళినప్పుడు అహిగా అనే ఒక చిత్రకారుడు తనకీ చిత్రాన్ని బహుమానంగా ఇచ్చాడు. అప్పటినుండీ ఆ చిత్రాన్ని ఎంతో భద్రంగా దాచుకుంది.
"ప్రతీ రోజూ, ఈ పెయింటింగులు చూసి చూసి నీకలా అనిపిస్తూ ఉంటుంది. అంతే!" అంటూ జాన్ కొట్టి పారేసి సంభాషణ తన ఆఫీసు గొడవల గురించి మార్చేసాడు.
ఇంతలో సరూ మేనేజరు కెవిన్ నుండి ఫోనొచ్చింది. అక్కడనుండి వేరే గదిలోకి వెళ్ళి మాట్లాడింది సరూ. కెవిన్ అంటే జాన్కి గిట్టదు. అతనికి ఆడవాళ్ళ పిచ్చి అని అందరూ చెప్పుకుంటూండగా విన్నాడు. ఆర్టు గ్యాలరీ ఉద్యోగం మానేయమని ఎన్నోసార్లు సరూకి చెప్పాడు. ‘అతను మిగతా స్త్రీలతో ఎలా వుంటాడో నకనవసరం, నా దగ్గర అతని ప్రవర్తన ఎప్పుడూ హద్దులు దాటలేదని’ చెప్పింది. కానీ అతని అనుమానాలు అతనివి. సరూ తిడుతుందని పైకి అనడు.
"ఏవిటంటాడు, మీ మేనేజరు?" సరూ వస్తూండగానే అడిగాడు.
"ఏం లేదు. ఆ గోడకున్న పెయింటింగ్ పట్టుకురమ్మనమని చెప్పాడు," అంతకు మించి పొడిగించలేదు సరూ.
"నువ్వేం చెప్పావు?"
"ఇవాళ శాన్ఫ్రాన్సిస్కోలో చిత్రకారుల ఆర్ట్ ఎగ్జిబిషన్ ఉంది. ఇది పాతికేళ్ళ క్రితం నాటి పెయింటింగ్. అప్పట్లో మొహావీ లోయకి వెళ్ళినప్పుడు కొన్నాను. కెవిన్‌కి ఈ పెయింటింగ్ అంటే చాలా ఇష్టం. మా గ్యాలరీ తరపున పెడదాం తీసుకురమ్మన్నాడు," గోడ మీదున్న చిత్రపటం కేసి చూస్తూ అంది. కెవిన్ ఈ పెయింటింగ్ అమ్ముదామని చెప్పాడనీ, తనకి ఇది ప్రాణం, అమ్మనని చెప్పానంది.
సరూ శాన్ఫ్రాన్సిస్కోలో ఒక ఆర్టు గ్యాలరీలో పనిచేస్తుంది. బర్కిలీ యూనివర్శిటీలో ఆర్ట్స్ డిగ్రీ చేసింది. చిత్రలేఖనం అంటే ఆమెకు ఇష్టం. రానూ, పోనూ అరవైమైళ్ళ దూరం డ్రైవ్ అయినా శాన్ఫ్రాన్సిస్కో వెళ్ళొస్తూ ఉంటుంది. తనకి ఆలస్యం అవుతోందని బయల్దేరబోతూండగా జాన్ కారు వరకూ వచ్చాడు.
కారు రివర్స్ చేద్దామని గేరు మారుస్తూండగా - "చెప్పడం మర్చాను.సాయత్రం ఒక సర్జరీ వుంది. డిన్నరికి నాకోసం చూడద్దు. ఇంకో విషయం. నిజంగా ఆ డైమండ్స్ సెట్ ఆర్డరు కేన్సిల్ చెయ్యా...?" అని మధ్యలో ఆగిపోయాడు.
పెళ్ళయ్యి ఇరవయ్యేళ్ళయిన సందర్భంగా సరూకి జాన్ డైమండ్ నక్లెస్ కొన్నాడు. పిల్లలు లేరన్న దిగులు తప్ప సరూకి ఏ లోటూ లేదు. జాన్ ఎంతో ప్రేమగా చూసుకుంటాడు.
"జాన్! పాతిక వేల డారర్లు పెట్టి కొనడం నాకిష్టం లేదు, కావాలంటే వెకేషన్కి హవాయి వెళదాం!" అనేసి జాన్ సమాధానం కోసం ఏమాత్రం ఎదురుచూడకుండా కారు రివర్స్ చేసింది సరూ. చెయ్యూపుతూ ఆమె వెళ్ళిన వైపే చూస్తూ ఉండి పోయాడు జాన్.
0000000000000
సరూ శాన్ఫ్రాన్సిస్కో ఆర్ట్ ఎగ్జిబిషన్కి వెళ్ళేసరికి తొమ్మిదయ్యింది. ప్రతీ రూమునీ రకరకాల విభాగాలకి కేటాయించారు. నైరూప్య చిత్ర కళ మొదలుకొని ఇంప్రెషనిజం, ఆఫ్రికన్ ఆర్ట్, సర్రియలిజం ఆర్టు అంటూ ఎన్నో విభాగాలలో ప్రపంచం నలుమూలలా పెయింటింగ్స్ వచ్చాయి. నలుపు, తెలుపు చిత్రకళకంటూ ఒక విభాగం కూడా వుంది. ఇలాంటి ఎగ్జిబిషన్లకి తండోపతండాలుగా జనం వస్తారు. పెయింటింగ్స్ నచ్చితే వేలకి వేలు డాలర్లు పోసి మరీ కొనుక్కుంటారు. ఇందులో ప్రదర్శింపబడ్డ చిత్రాలు కనుక అమ్ముడుపోతే నిర్వాహకులక్కూడా కొంత కమీషన్ వస్తుంది. ఏడాదికొకసారి జరిగే ఈ ఎగ్జిబిషన్‌లో చిత్రకారులకీ పేరూ, డబ్బూ రెండూ వస్తాయి.
అన్ని పెయింటింగ్సూ చూద్దామని బయల్దేరింది సరూ. నలుపూ, తెలుపూ విభాగం దగ్గర కొన్ని చిత్రాలు అద్భుతంగా కనిపించాయి. కన్నార్పకుండా చూస్తూనే ఉండిపోయింది ఒక చిత్రాన్ని. ఒక చీకటి గదిలోకి కిటికీలోంచి వెన్నెల పడుతూన్న దృశ్యం. ఆ వెన్నెల కాంతిలో ఆ గది నేలమీద పడున్న అనే చిన్న వస్తువులు మెరుస్తున్నాయి. ఆ వస్తువుల మీద కాంతి పరావర్తనాన్ని చక్కగా చిత్రీకరించాడు. ముఖ్యంగా నీడలని. ఆర్టిస్ట్ పేరు చూసి ఒక్కసారి అవాక్కయింది సరూ. "అహిగా" మెల్లగా తనలో తనే గొణుక్కుంది. పాతికేళ్ళ క్రితం తనకి పెయింటిగ్ వేసిచ్చినతను ఇంకా బ్రతికే ఉన్నాడా? లేక తన లాగే మరెవరయినా ఇక్కడ పెట్టారా? అహిగా పేరుతో అక్కడ నాలుగైదు చిత్రాలు కనిపించాయి. చిత్రంగా అన్నీ నలుపూ, తెలుపు చిత్రాలే!
ఎలాగయినా అహిగా అన్న ఆర్టిస్టుని కలవాలనుకుంది సరూ! తనకి తెలుసున్న వాళ్ళని సంప్రదించి వివరాలు రాబట్టుకుంది. అహిగా అన్న అతను ఈ ప్రదర్శనకి రాలేదని తెలిసుకుంది. అంతకు మించి వివరాలు దొరకలేదు. వివరాలు కావాలంటే లాసేంజిలిస్ లో ఉన్న ఒక ఏజంటుకి తెలుసుస్తుందని ఒక కొలీగ్ ఫోన్ నంబరిచ్చాడు సరూకి. వేంటనే కాల్ చేస్తే ఎవరూ ఫోన్ ఎత్త లేదు. మెసేజ్ పెట్టింది.
తను కాలేజీలో చదువుతూండగా ఫ్రెండ్సుతో కలిసి మొహావీ వెళ్ళినప్పుడు ఒక ముప్పయ్యేళ్ళ చిత్ర కారుడు బొమ్మలు గీస్తూ కనిపించాడు. చాలామంది చిత్రకారుల బొమ్మలు చూసింది తను. కానీ అహిగా ఎన్నుకునే రంగుల తీరే వేరు. అతని చిత్రాల్లో రంగుల కలయిక ప్రత్యేకంగా ఉంటుంది. అతను వేసిన చిత్రమే తను ఇన్నాళ్ళూ దాచుకుంది. అప్పట్లో అతనికోసం వెతికినా మరలా అతని పేరు వినబడ లేదు. కాలేజీలో ఉండగా కొన్ని ఎగ్జిబిషన్లో అతని పెయింటింగ్స్ చూసిన గుర్తు. పాతికేళ్ళ తరువాత మళ్ళీ ఇప్పుడే అతని పేరు చూసింది తను.
అహిగా వివరాల కోసం సరూ లాసేంజిలిస్లో ఉన్న ఏజెంట్కి మరోసారి కాల్ చేసింది. అదృష్టం కొద్దీ అతను దొరికాడు. తనెందుకు కాల్ చేసిందో చెప్పాక అతనే అన్నాడు.
"నేనెప్పుడూ అహిగా అనే చిత్రకారుణ్ణి చూళ్ళేదు. అతని తరపు బంధువులెవరో వచ్చి అతని పెయింటిగ్స్ ఇచ్చి వెళతారు. అతని అడ్రసు నాకు తెలియదు. అయినా ఈ వివరాలెందుకు?" అంటూ ఆ ఏజంటు ప్రశ్నించాడు. తన క్లయింటుని సరూ ఎక్కడ ఎగరేసుకుపోతుందోనన్న భయం అతని మాటల్లో కనిపించింది సరూకి. సాధారణంగా పెయింటింగ్స్ అమ్ముడయితే ఈ ఏజంట్లకీ బాగానే గిట్టుబాటవుతుంది. చూస్తూ చూస్తూ ఏ ఏజంటూ చేతిలో ఉన్న చిత్రకారుణ్ణి వదులుకోరు.
అహిగాని చూళ్ళేదనేసరికి ఒక్కసారి నిరుత్సాహపడిపోయింది సరూ. ఒక్కసారి ఆమెకి పాతికేళ్ళ క్రితం అహిగా రూపం గుర్తుకొచ్చింది. పొడుగ్గా, జులపాల జుట్టుతో గోధుమ రంగులో ఉన్న అహిగా కళ్ళలో ఏదో తెలియని ఆకర్షణ. అంతకంటే అతని చేతిలో నాట్యమాడే కుంచె. అలవోకగా రంగుల చిత్రాలేయడం చూసి ఆశ్చర్యపోయింది. అదోరకమయిన ఇంగ్లీషు యాసలో తనతో మాట్లాడడం గుర్తొచ్చింది. తనకి గుర్తుంది కానీ, అహిగా ఎప్పుడో మర్చిపోయుంటాడు. పైగా ఇది జరిగి పాతికేళ్ళు పైనే అవుతోంది. సరూ అతన్ని ఒక్కసారి చూడాలని, తను ఆ ఏజంటు వ్యాపారానికి దెబ్బకొట్టననీ ఒట్టు పెట్టి మరీ చెప్పింది. అయితే లాసేంజిలిస్ వచ్చి, కాగితమ్మీదం రాసిస్తేనే అహిగా అడ్రసు ఇస్తానని చెప్పాడు. సరేనంది సరూ.
"ఇంతకీ అహిగా బ్రతికే ఉన్నాడంటావా? లేక ఎప్పుడో వేసిన ఈ పెయింటింగ్స్ అతని బంధువులు అమ్ముతున్నారంటావా?"
"వాళ్ళ మాటల ద్వారా బ్రతికే ఉన్నాడని మాత్రం చెప్పగలను. బహుశా వయసు మీద పడి ప్రయాణాలు చేయలేకపోయుండచ్చు. నువ్వు కలవాలనుకుంటున్నావు కాబట్టి ట్రై చెయ్యచ్చు!" అన్నాడా ఏజంటు.
అహిగా చిరునామా తనకి ఈ-మెయిల్ చెయ్యమని తన వివరాలు చెప్పి, సరూ వాళ్ళ నంబరు తీసుకుంది. ఇంటికొచ్చాక ఇదే విషయాన్ని భర్తకి చెప్పింది.
“నేను ఎల్లుండి లాసేంజిలిస్ వెళదామనుకుంటున్నాను. అక్కడనుండి కుదిరితే అహిగా అన్న పెయింటర్ని కలిస్తాను!"
వెళ్ళి తీరాలా అని అడుగుదామనుకున్నాడు. కానీ సరూ మాట వినదన్నది అతనికి అనుభవమే! ప్రస్తుతం ఆమె మనసులో ఉన్నది ఒకటే - అది అహిగాని కలవడం.
0000000
“అతను ఉదయానే లేచి సూర్యోదయాన్ని చూడ్డానికి చిన్న పిల్లాడిలా పరిగెత్తేవాడు.
సూర్యోదయం చుట్టూ అలుముకున్న రంగుల్లో అతను తడిసి ముద్దయ్యేవాడు. చీకటి పడుతూన్నప్పుడూ అదే ధోరణి. అంతెందుకు వర్షపు జల్లు మొదటి చినుకు ధూళి రేణువుల్ని తాకితే ఆ వాసనలో అతను రంగుల్ని వెతుక్కునేవాడు.
ఈ గ్రాండ్ కాన్యన్లో ఒక కొండ మీదనుండి మరొక కొండమీదుగా ఇంధ్రదనస్సు వంగితే చాలు అతని ఆనందానికి అవధుల్లేవు. విప్పారిన నేత్రాలతో ఆ హరివిల్లు వంపులో రంగుల్ని వెతుక్కునేవాడు. ఈ అడవి చుట్టూ ఉన్న తుమ్మ పువ్వుల్ని చూస్తే అడుగు ముందు పడేది కాదతనికి. అతను ఈ ప్రకృతిలో మమేకం అయ్యేవాడు. ఎంతలా అంటే తన కళ్ళల్లో నింపుకున్న రంగుల్ని ఈ గుడ్డ మీద ఒంపే వరకూ నిద్రపోయేవాడే కాదు. రంగులే అతని ప్రపంచం. రంగులే అతని శ్వాస. అదే అతని జీవితం.
అలాంటిది ఓ కాళరాత్రి అతని జీవితాన్ని మార్చేసింది. అప్పట్లో మొహావీ వేలీలో ఉండేవాళ్ళం. ఎప్పటి లాగే అతను తను వేసిన రంగుల చిత్రాలన్నీ లాసేంజిలిస్ ఆర్టు ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళడానికి ఒక్కడే వెళ్ళాడు. ప్రతీసారీ నేనూ వెళ్ళేదాన్ని. అప్పుడు నేను రెండో వాణ్ణి కడుపుతూ ఉన్నాను. అందువల్ల తనొక్కడే వెళ్ళొస్తానని చెప్పాడు. సరే నన్నాను. ఆ మర్నాడు రాత్రి చాలా ఆలస్యంగా వచ్చాడు. వస్తూనే ఏమీ మాట్లాడ లేదు. తలంతా దిమ్ముగా ఉందని స్నానం చేసి పడుక్కున్నాడు. ఆ మర్నాడు సాయంత్రం పొద్దుపోయేవరకూ లేవ లేదు. అంత దూరం కారు నడపడం వల్ల అలసిపోయుంటాడని అనుకున్నాను. నిద్ర లేస్తూనే అయోమయంగా కనిపించాడు. ఏమిటలావున్నావని అడిగితే ముద్ద ముద్దగా మాట్లాడ్డం మొదలు పెట్టాడు. ఒక్కసారి ఒళ్ళు గగుర్పొడిచింది. భయంతో మా వాళ్ళని పిలుచుకొచ్చాను. అప్పుడు వాళ్ళు చెబితే తెలిసింది కారు వెనుక భాగం పిప్పి పిప్పి అయ్యిందనీ. అప్పుడు అర్థమయ్యింది. ఇతని కారుని వెనుక నుండి ఎవరో గుద్దేసారని. ఓ వారం రోజులు మనిషి మనలో లేడు. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ శూన్యంలోకి చూసేవాడు. తిండీ, నిద్రా వేళకి ఉండేవి కావు. ఎప్పుడూ రంగుల మధ్య మునిగి తేలే అతను కనీసం కాన్వాసు వైపు కూడా చూడ లేదు. మా దేవుడు నిషనూని ఎంతో ప్రార్థించాను. అతన్ని చూస్తే కడుపు తరుక్కుపోయేది. భయం వేసి ఓ వారం తరువాత ఒక వైద్యుడి దగ్గరకి తీసుకెళితే యాక్సిడెంటులో మెదడుకి దెబ్బ తగిలి అతనికి మతి తప్పిందనీ, అది మెల్లగా తగ్గుతూ వస్తుందని చెప్పారు. ఆ తరువాత ఓ రెండేళ్ళు మతి స్థిమితం లేదతనికి. ఒక్కోసారి మనలో ఉండేవాడు. ఇంకోసారి ఒంటరిగా తనలో తనే గొణుక్కునేవాడు. కొన్నాళ్ళకి మామూలు మనిషి అయినా, అతనికి చూపు మందగించింది. ప్రపంచం బూడిద రంగు ముద్దలా కనిపిస్తోందని బావురుమన్నాడు. అంతే అతని రంగుల ప్రప్రంచం తలక్రిందులయ్యింది. మా బ్రతుకులో చీకటి మిగిలింది... అహిగా అంటె మా భాషలో ధీరుడు, పోరాడేవాడు. వాళ్ళ అమ్మా, నాన్నా ఏమనుకుని ఈ పేరు పెట్టారో తెలీదు. అతను శేషజీవితమంతా ఇంకా పోరాడుతూనే ఉన్నాడు…" అంటూ అమితోలా వెక్కి వెక్కి ఏడుస్తూ కుప్పకూలి పోయింది.
అమితోలా చెప్పినదంతా శ్రద్ధగా వింటూన్న సరూ ఈ హఠాత్పరిణామానికి ఉలిక్కిపడింది. కంగారుగా కూర్చున్న చోటు నుండి లేచి అమితోలా దగ్గరగా వెళ్ళింది. కొద్ది సేపటికి అమితోలా సర్దుకుంది.
అమితోలా అహిగా భార్య. గోధుమవర్ణ చాయలో ఉన్న ఆమె వయసు ఏభై దాటే ఉండచ్చు. నేటివ్ అమెరికన్ అవడం వలన చాలా యాసతో ఇంగ్లీషు మాట్లాడుతోంది. అక్కడే ఉన్న ఆమె కొడుకులకీ అమితోలా పోలికలు కనిపిస్తున్నాయి.
"అమితోలా! నీ బాధని మేమూ మేం అరథం చేసుకోగలం. అహిగా లాంటి చిత్రకారుడికి ఇలా జరగడం నిజంగా దురదృష్టకరం. ఎంతో పేరు ప్రఖ్యాతులూ, సంపదా ఆర్జించుకోవాల్సిన వ్యక్తి ఇలా నిర్జీవంగా ఉండడం ఎంతో బాధాకరమయిన విషయం. నేను ఎంతో దూరం నుండి ఇక్కడికి వచ్చాను. ఒక్క సారి అహిగాని చూడాలనుంది, " అంటూ తన చేతి సంచీలోంచి తన దగ్గరున్న చిత్ర పటం నకలు బయటకి తీసి వాళ్ళకు చూపించింది.
"ఈ పెయింటింగ్ పాతికేళ్ళ క్రితం నాకు అహిగా స్వయంగా ఇచ్చాడు. ఇది ఇప్పటికీ నా వద్ద ఉంది. వారం క్రితం శాన్ ఫ్రాన్శిస్కో ఆర్ట్ ఎగ్జిబిషన్‌లో ఎగ్జిబిషన్లో అహిగావి మరి కొన్ని చిత్రాలు చూసాను..."
అక్కడే ఉన్న అహిగా కొడుకు పాతికేళ్ళ వాడు తనే తీసుకొచ్చి లాసేంజిలిస్ లో ఇచ్చానని చెప్పాడు. ఒకసారి అహిగాని ప్రత్యక్షంగా చూడాలని ఉందని బ్రతిమాలింది సరూ!
"సాధారణంగా ఎవర్నీ కలవడానికి ఇష్టపడడు. నేనూ, నా కొడుకూ తప్ప ఎవరమూ అతన్ని కలవం. అపరిచితులతో మాట్లాడడానికి ఒప్పుకోడు. రేపు రండి, మీరు. ఈలోగా అతనికి ఈ విషయం చెప్పి కనుక్కుంటాను," అమితోలా చెప్పింది.
"అహిగా ఎక్కడుంటాడు?" సరూ అనుమానంగా అడిగింది. అతను ఈ లోయ దక్షిణాన ఉన్న సుపయ్ గ్రామంలో ఉంటాడని అమితోలా చెప్పింది. కొంత సేపయ్యాక మర్నాడు వస్తానని చెప్పి బయల్దేరింది సరూ.
వెళుతూండగా - "అన్నట్లు చెప్పడం మరిచాను. మీరు రేపొచ్చేటప్పుడు తెలుపూ, నలుపూ దుస్తులు ధరించి రండి," అనంది, అమితోలా. కనుబొమ్మలు ముడేస్తూ చూసింది సరూ!
"అహిగాకి ఆ రంగులంటే ఇష్టం!" చిన్నగా నవ్వుతూ చెప్పింది అమితోలా. సరేనని నవ్వుతూ శలవు తీసుకుంది సరూ!
దారి పొడూవునా అహిగా గురించే ఎడతెరిపిలేని ఆలోచనలు!
యాక్సిడెంటులో తలకి గాయం తగలడం వలన అతని మెదడు దెబ్బతిని వుంటుంది. పాపం సరైన వైద్య పరీక్షలు జరగకపోవడం వల్ల మతి స్థిమితం కోల్పోయి ఉంటాడు. సరూకి జాన్ గుర్తుకొచ్చాడు. వేంటనే కాల్ చేసి, జరిగినదంతా పూసగుచ్చినట్లు చెప్పింది.
“లాసేంజిలిస్లో నాకు బాగా పరిచయమున్న డాక్టర్ డేవిడ్ అని న్యూరో సర్జన్ ఉన్నాడు. కనుక్కొని చెబుతాను,” అని ఫోను పెట్టేశాడు.
0000000000000000000000
“ఒక్కసారి నా ప్రపంచం అంతా తలక్రిందులయి పోయింది. తలకి గాయం తగిలిందని తెలుసు కానీ అదెలా జరింగిందో నేను ఎక్కడకి వెళ్ళానో, ఎందుకు వెళ్ళానో ఏమీ గుర్తు లేవు. అసలు ఇంటికెలా వచ్చానో కూడా గుర్తు లేదు. తలంతా మొద్దు బారిపోయినట్లుగా ఉంది. ఎంత ప్రయత్నించినా ఏమీ గుర్తుకు రావడం లేదు. ఇంటికొచ్చినా ఇదే పరిస్థితి. మాట కూడ సరిగ్గా రాలేదు. వారాలు తరబడి తిండీ, నిద్రా లేకుండా ఒళ్ళు తెలియకుండా నిద్రపోయేవాణ్ణని తరువాత తెలిసింది. నాకు మెల్లగా జ్ఞాపక శక్తి వచ్చేసరికి ఒక భీకరమయిన పరిణామం నాకు జరిగింది. ఏ రంగుల్లో నా జీవితం మునిగి ఉందో ఆ రంగుల్ని నేను గుర్తుపట్టలేని పరిస్థితి దాపురించింది. నా ముందున్న అందరి రూపాలు అలుక్కుపోయినట్లు కనిపించడం మొదలు పెట్టాయి. అదే కాదు అంత బూడిద రంగులో కనిపించ సాగాయి. నేను వెలుతుర్ని చూడలేకపోయేవాణ్ణి. ఒక వేళ చూసినా అంతా బూడిద రంగులో అలుక్కుపోయి నట్లుగా ఉండేది. రాత్రి పూటా కాస్త నయం. చిమ్మ చీకట్లో ఆకాశంలో నక్షత్రాలొక్కటే కనిపించేవి. మిగతా ప్రకృతంతా అలుక్కుపోయిన దృశ్యమే నా కళ్ళకి. అమితోలానీ, నా పిల్లల్నీ గొంతు బట్టి గుర్తుబట్టే వాణ్ణి. వాళ్ళందరూ బూడిద రంగులో అలుక్కుపోయినట్లు కనిపించేవారు. నాకు మతే కాదు, చూపు కూడా పోయిందన్న నిర్ద్ధారణకి వచ్చేసాను. వెలుతుర్ని మాత్రం అస్సలు చూడలేకపోయేవాణ్ణి. ఓ ఏడాది పాటు గది విడిచి బయటకు రాలేదు.
గంటలకొద్దీ రంగుల్ని మిశ్రమం చేస్తూ, కొత్త రంగుల్ని సృష్టించిన నేను ఏ రంగునీ గుర్తించలేని పరిస్థితి దాపురించింది. జీవితం దుర్భరంగా మారింది. వేరొకరి సాయం లేకుండా ఏ పనీ నడిచేది కాదు. కానీ ఒకటి మాత్రం స్పష్టంగా కనిపించేది. నలుపు, తెలుపు రంగుల్ని మాత్రం స్పష్టంగా గుర్తించేవాణ్ణి. మిగతా రంగులన్నీ బూడిద రంగులే! ఆ రంగులు కూడా పక్క పక్కనున్నప్పుడే స్పష్టంగా కనిపించేది. అప్పుడొక ఆలోచన వచ్చింది. నేను గుర్తించేలా వస్తువులన్న్నింటినీ అమితోలా తెల్లగా మార్చేసింది. నేను ఉండే గదికి నల్లటి రంగు వేయించి, నేను వాడే వస్తువులన్నీ, తెల్ల రంగులోకి మార్చేసింది. అప్పుడు నాకు అన్నీ స్పష్టంగా కనిపించడం మొదలు పెట్ట సాగాయి. నోరు విప్పి చెప్పుకోలేని పరిస్థితి. ఎవరికీ చెప్పుకోలేని వ్యధ. చెప్పినా అర్థం కాని బాధ. అందుకే మనుషులకి దూరంగా ఈ ఇంట్లో బందీగా జీవిస్తున్నాను. నేను సూర్యోదయం చూసి పాతికేళ్ళు దాటింది. ఎప్పుడైనా అమావాస్య నాడు రాత్రి బయటకొస్తాను. వచ్చినా పాతవి గుర్తుకొచ్చి మనసు కకావికలం అవుతుంది. గత పదేళ్ళుగా రాత్రీ బయటకు రావడం మానేసాను. నా రంగుల ప్రపంచం కాస్తా నలుపు, తెలుపుల్లోకి కుదించుకుపోయింది. నిజం చెప్పద్దూ, ప్రతీ క్షణం కుంచెని పట్టుండే వేళ్ళు కొంతకాలానికి పట్టు కోల్పోయాయి. పుస్తకాలని చదువుదామంటే కొత్తలో అక్షరాలు అలుక్కు పోయినట్లు కనిపించేవి. ఇప్పుడు చదవగలను కానీ కళ్ళు లాగేస్తాయి. ఇదొక నరక ప్రాయమయిన జీవితం. మానసికంగా చాలా కాలం కృంగిపోయాను. నాకు ధైర్యం చెప్పి, నన్ను ఓదార్చి నాకు మళ్ళీ జీవితాన్నిచ్చింది అమితోలా. మరలా నా వేళ్ళకి కుంచెని అలవాటు చేసింది. అలా మెల్ల మెల్లగా నలుపు తెలుపు చిత్రాలు వేయడం మొదలు పెట్టాను. కొంత కాలానికి చిత్ర కళలో నా పూర్వపు పట్టు వచ్చింది...ఇప్పుడు నాకు ఈ చిత్ర కళే లోకం. ఈ కుంచెలే నా నేస్తాలు. ఈ తెలుపు నలుపు చిత్ర పటాలే నా రంగుల ప్రపంచం..." చెబుతూ ఒక్కసారి ఆగిపోయాడు అహిగా. దుఃఖం తో గొంతు పూడుకు పోయి, ఒక్కసారి వెక్కి వెక్కి ఏడ్వడం మొదలుపెట్టాడు. ఆ గదంతా నిశ్శబ్దం ఆవరించుకుంది. అందరూ కన్నార్పకుండా అతనికేసే చూస్తున్నారు.
చింపిరి జుట్టుతోనూ, బవిరి గడ్డంతోనూ ఉన్నతని శరీరంలో ముడతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతని కళ్ళు గాజు గోళాల్లా ఉన్నాయి. ఎక్కడా జీవం కనిపించలేదు. చెబుతూన్నంత సేపూ అతని చేతులు వణుకుతూనే ఉన్నాయి. అక్కడున్న బల్లనిండా సిగరెట్టు పీలికలు గుట్టలా కనిపించాయి.
ఎన్నో ఏళ్ళుగా పేరుకున్న దుఃఖం బద్దలయ్యిందని సరూ, డాక్టర్ డేవిడ్, అమితోలా, ఆమె కొడుకులూ గ్రహించారు. కానీ ఎవ్వరూ అతన్ని ఆపలేదు. గదంతా చుట్టూ కలయ జాసారు. నల్లని గోడల మధ్య వస్తువులన్నీ తెల్లటి రంగులో ఉన్నాయి. ఆ గది ఒక్క కిటికీ కూడా లేదు. అహిగా గది కూడా నేల అడుగుమట్టంలో ఉంది. వెలుతురు పొడసూపే అవకాశమే లేదు. గదిలో మాత్రం తెల్లటి ట్యూబ్లైట్ ఉంది. అంతా నలుపూ, తెలుపే! ఒక్కసారి వాళ్ళ బట్టలకేసి కూడా చూసుకున్నారు. ఎందుకు నలుపు, తెలుపు రంగు బట్టల్లోనే రమ్మనమని అమితోలా అడిగిందో అప్పుడర్థమయ్యింది సరూకీ, డేవిడ్ కీ.
కొంతసేపయ్యాక అహిగా మామూలు స్థికి వచ్చి మరలా తనగురించి చెప్పడడం మొదలుపెట్టాడు. చెప్పినదంతా వింటున్నారు. ఒక్క మాటా పెగల్లేదు ఎవరి గొంతునుండీ!
00000000000000
"పాతికేళ్ళ క్రితం అతన్ని కలిసిన సంగతి గుర్తు చేసినా అతనికి అస్సలు జ్ఞాపకం రావడం లేదన్నాడు. చాలా చిత్రంగా ఉంది డాక్టర్ డేవిడ్! అహిగా లాంటివాళ్ళని ఎక్కడా చూళ్ళేదు. అతని కళ్ళు రంగులు గుర్తించే శక్తిని కోల్పోయేయేమో? ఐ మీన్, హీ ఈజ్ కలర్ బ్లైండ్! " కుర్చీ లాక్కుంటూ అంది సరూ. ఆమెకెదురుగా ప్రపంచ ప్రఖ్యాత న్యూరో సర్జన్ డేవిడ్ కూర్చున్నాడు. జాన్ అతనూ జాన్ హాప్కిన్స్లో కలిసి చదువుకున్నారు.
"అతని కళ్ళు చెక్ చేసాను. అతని చూపు బాగానే ఉంది. కళ్ళు బాగానే పనిచేస్తున్నాయి. కలర్ బ్లైండ్ అయితే ఒకటో రెండో రంగులు గుర్తించ లేకుండా ఉంటుంది. కానీ ఇలా ఏ రంగునీ గుర్తించలేకపోవడం ఉండదు. నాకు తెలుసున్నంత వరకూ మెదడే రంగుల్ని గుర్తించ లేకపోతోంది...ఇలాంటి కేసు నేనూ ఎప్పుడూ విన లేదు," జాన్ నెమ్మదిగా అన్నాడు.
"బహుశా మెదడులో అతని వి4 ఏరియా దెబ్బతినుండాలి! అయితే వీ4 ఒక్కటే కాదు. దాని చుట్టూ ఉన్న మిగతావి అంటే వి1, వి2 కూడా దెబ్బతినుండాలి. కేవలం వి4 ఒక్కటే పనిచేయకపోవడం ఆశ్చర్యంగా ఉంది..." మరలా అతనే అన్నాడు.
"జాన్! నీ న్యూరో టెర్మినాలజీ నాకు అర్థం కాదు. ఏదో గ్రీకో, లాటినో మాట్లాడుతున్నట్లుగా ఉంది," నవ్వుతూ అంది సరూ.
"నీ కర్థమయ్యే భాషలో చెబుతాను, విను. ప్రతీ మనిషి కంట్లోనూ ఒక లెన్స్ ఉంటుంది. ఏదైనా ఒక వస్తువుని చూస్తున్నప్పుడు ఆ లెన్స్ దాని పరిధిలో ఉన్న దృశ్యాన్ని సంగ్రహిస్తుంది. ఆ దృశ్యం కంటిలో ఉన్న ఒక కణజాల తెరపై ప్రసరిస్తుంది. ఆ కణజాలాన్నే మనం రెటినా అంటాం.అది సంగ్రహించిన దృశ్య వివరాలన్నీ మెదడుకి చేరేస్తుంది.. ఇక్కడ వివరాలూ అంటే, వస్తువు ఆకారం, పరిమాణం, రంగూ, కదలికా వంటివి. ఈ సమాచారం మెదడు సంగ్రహణ చేసి విశదీకరిస్తుంది. తద్వారా మనం వస్తువుల్ని చూసి, గుర్తించగలుగుతున్నాం. ఇదంతా ఊహకందనంత వేగంగా జరుగుతుంది. మెదడులో ఈ సంగ్రహణ, ప్రైమరీ విజువల్ కార్టెక్స్ అనే చోట జరుగుతుంది. ఈ విజువల్ కార్టెక్స్ నే వి1 అంటారు. ఇది కన్ను రెటీనా అందించిన దృశ్యాన్ని ఈ వి1 కి అందజేస్తుంది. ఈ వి1 నుండి వి2, వి3, వి4 ఏరియాలకి సిగ్నల్స్ వెళతాయి. ఇవి ఒక్కొక్కటీ ఒక పని చేస్తాయి. చివర్లో ఉన్న వి4కి మాత్రమే రంగుని గుర్తించే శక్తి ఉంటుంది. ఇక్కడే మనం చూసే రంగుల విశ్లేషణ జరిగాక, అది MT అనే దానికీ, వి1కి తిరిగి అందజేస్తుంది. దీనిమీద సైన్సులో చాలా పరిశోధనే జరిగింది. అది నీకు చెప్పినా అర్థం కాదు. అహిగాకి ఈ వి4 ఏరియా బాగా దెబ్బతినుండాలి. అందుకే అతను నలుపూ, తెలుపూ తప్ప మిగతా ఏ రంగునీ గుర్తించలేకపోతున్నాడు. ఏమయినా మా డిపార్ట్మెంట్ హెడ్డుకి కాల్ చేసి కనుక్కుంటాను," అంటూ అర్థమయ్యిందా అన్నట్లు చూసాడు. కొంచెం కొంచెం అని చెప్పింది సరూ.
" దీనికి మీ న్యూరాలజీలో ఏదైనా ట్రీట్మెంట్ ఉందా?" ప్రశ్నించింది.
"నాకు తెలిసి నికార్సయిన వైద్యం అంటూ లేదు. కానీ మేగ్నెటిక్ స్టిములేషన్ ద్వారా తగ్గించే అవకాశాలున్నాయి. మెదడులో వి4 ఏరియాలో సర్జరీ చేస్తే బాగయ్యే అవకాశం ఉంది. చూద్దాం. అహిగా కథ వింటే నాకు మతి పోయింది. ఇన్నేళ్ళుగా ఆ గదిలోనే ఎలా ఉండగలిగాడాని ఆశ్చర్యపోయాను. కానీ ఒకటి మాత్రం చెప్పగలను. అతని చూపు మాత్రం బ్రహ్మాండంగా ఉంది. దానికి తార్కాణం అతను వేసిన నలుపు, తెలుపు చిత్రాలే. ఆ గదినిండా ఉన్న చిత్రాలు చూస్తే నాకే మతిపోయింది. నిజం చెప్పొద్దూ! అదొక రెండు రంగుల ప్రపంచం!"
"డేవిడ్ ! పుట్టినప్పటినుండీ ఎన్నో రంగుల్ని చూస్తున్న మనకి ఒక్కసారి రంగులన్నీ మాయమయిపోతే అన్న ఆలోచనే రాదు. వచ్చినా మొత్తం ప్రపంచమంతా ఇలా రెండు రంగులు ఊహించుకోవడమే కష్టం. అహిగా చెబుతూన్నంత సేపూ ఒళ్ళు గగుర్పొడిచి, రోమాలు నిక్కబొడుచుకున్నాయి. డేవిడ్! అహిగాని చూస్తే బాధా, జాలీ కలుగుతున్నాయి. ఎంత ఖర్చయినా పరవా లేదు. ఎలాగయినా అతనికి మరలా రంగుల ప్రపంచాన్ని ప్రసాదించు. ఒక చిత్రకారుణ్ణి బ్రతికించు!" అలా అంటూంటే సరూ గొంతు బొంగురుపోయింది.
"నాలాంటి న్యూరో సర్జన్లకీ ఇలాంటివి చాలెంజే! అతను ఒప్పుకోవాలే కానీ, మేగ్నెటిక్ థెరపీ చేయించడానికి అన్ని ఏర్పాట్లూ చేయించగలను. బ్రెయిన్కి చిన్న సర్జరీ చేస్తే తిరిగి రంగులు కనిపించే అవకాశం ఉంది. ఇది సక్సెస్ అయితే వైద్య రంగానికీ పెద్ద మలుపే! నువ్వు కూడా ఈలోగా అహిగాతో మాట్లాడు!" చెప్పాడు డేవిడ్.
అహిగానీ, అతని కుటుంబాన్నీ ఒప్పించడానికి మానసికంగా సిద్ధమయ్యింది సరూ. తనకున్న ధ్యేయం ఒకటే అహిగా మరలా రంగులతో చిత్రాలు వెయ్యాలి. తను కేవలం అహిగా పెయింటింగ్స్ తోనే ఒక పెద్ద ఆర్ట్ ఎగ్జిబిషన్ పెట్టించాలి. అహిగా రంగుల్లో ఏదో తెలియని మాంత్రిక శక్తి ఉంది. అవే అతని చిత్రాలకి ప్రాణం! అందుకే ఆ రంగులకే ప్రాణం పొయ్యాలి.
అహిగాని కలిసి వెళిపోదామనుకున్న తనకి అతని వెనుక ఇంత కథుందన్నది అసలు ఊహకే తట్ట లేదు.
0000000000000
అహిగా కుటుంబానికి డేవిడ్ వైద్యం గురించి చెప్పింది. అమితోలా, కొడుకులూ ఒప్పుకున్నారు. అహిగా మాత్రం మొదట్లో ఏమీ చెప్ప లేదు. ఒకటి రెండు రోజులు సమయం కావాలని అడిగాడు. డేవిడ్ కి మాత్రం అహిగా ఒప్పుకున్నట్లుగానే చెప్పి, లాసేంజిల్స్లో మేగ్నటిక్ స్టిములేషన్, సర్జరీ ఏర్పాట్లు చెయ్యమని చెప్పింది. అలాగే అహిగా గురించి ఆర్ట్ గేలరీ ఓనర్ల సహాయం తీసుకొని కొంత సొమ్ము విరాళంగా సంపాదించడానికి ఏర్పాట్లు చేసింది.
మొత్తానికి అమితోలా, కొడుకుల ఒత్తిడితో అహిగా వైద్యానికి ఒప్పుకున్నాడు. వైద్యానికి అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి.
యూ.సీఎ.ఎల్.యేలో తనకి బాగా పరిచయమున్న మరో న్యూరో సర్జన్ సహాయంతో లాసేంజిలిస్లో సర్జీరీ ఏర్పాట్లు చేసాడు డేవిడ్. అహిగా కుటుంబాన్ని విమానంలో రప్పించాడు. పాతికేళ్ళ తరవాత మొట్టమొదటి సారి ఊరి వదిలి బయటకొచ్చాడు అహిగా.
సర్జరీకి రెండు వారాలు ముందుగా అహిగా కుటుంబం అంతా లాసేంజిలిస్ ఆసుపత్రికొచ్చారు. కొన్ని పరీక్షల నిమిత్తమై ముందుగా రమ్మన్నాడు డేవిడ్. అతి కొద్ది రోజుల్లోనే అహిగా కుటుంబంతో అనుబంధం ఏర్పడింది డేవిడ్కి. సర్జరీ సమయానికి జాన్ కూడా వచ్చాడు. అహిగా విషయంలో సరూకి ఇంత శ్రద్ధ ఎందుకో బుర్ర ఎంత చించుకున్నా అర్థం కావడం లేదతనికి. సరూ పోరు పడలేక వచ్చాడు. సర్జరీ రేపనగా భయమేసింది సరూకి. అనవసరంగా కంగారు వద్దనీ అన్నీ సక్రమంగా జరుగుతాయనీ భరోసా ఇచ్చాడు డేవిడ్. అమితోలా, కొడుకులూ అహిగా మళ్ళీ మామూలు మనిషవుతాడని పైకి సంతోషం వ్యక్తపరుస్తున్నా లోపల పేరుకున్న దిగులు కళ్ళల్లో కనిపిస్తూనే ఉంది.
సర్జరీకి వెళ్ళేముందు అందరికేసి చూసి కన్నీళ్ళు పెట్టుకున్నాడు అహిగా! అతనికి ఎవరి ముఖాలూ కనిపించలేదు. అందరూ బూడిద రంగులోనే కనిపించారు, అమితోలాతో సహా! వెళుతూ మాత్రం ఒక మాటన్నాడు:
" మీ అందమైన ముఖాలని రంగుల్లో చూస్తానన్న నమ్మకం నాకుంది! దేవుడు నా తరపున ఉన్నాడు!"
అది విని అమితోలా, కొడుకులూ వచ్చే కన్నీళ్ళని ఆపుకున్నారు. సరూ సంగతయితే చెప్పనవసరం లేదు.
సర్జరీ గది బయట అందరూ అక్కడే కూర్చున్నారు. సర్జరీ రెండు మూడు గంటలు పడుతుందని చెప్పాడు డేవిడ్. సర్జరీ సన్నాహానికే చాలా సమయం పట్టింది. ఓ రెండు గంటల తరువాత డేవిడ్ బయటకి వచ్చాడు. ఆపరేషన్ బాగా జరిగిందని అతని మొహంలో చిరునవ్వే చెబుతోంది.
"ఆపరేషన్ సక్సెస్! అంతా బాగా జరిగింది. అహిగాకి మెలుకువ రావడానికి ఇంకో రెండు మూడు గంటలు పడుతుంది," అంటూ డేవిడ్ చెప్పడంతో అక్కడున్న వారి ఆనందానికి హద్దుల్లేవు.
అమితోలా కొడుకుల సంగతయితే చెప్పనలవి కాదు. ఓ రెండు గంటల తరువాత అహిగా స్పృహలోకి వచ్చాడు. అందరికేసీ తేరపార చూసాడు. అక్కడున్న ముఖాలన్నీ బూడిద రంగులో అలుక్కుపోయినట్లుగానే కనిపించాయి.
అదే విషయం మెల్లగా చెప్పాడు. అక్కడున్న వారందరూ ఒక్కసారి అవాక్కయ్యారు. ఎవరికీ నోట మాట రాలేదు. ముఖ్యంగా అమితోలాకీ, సరూకి.
000000000000000
అహిగా మామూలు మనిషి కాకపోవడం సరూకి పెద్ద షాక్. ఓ రెండ్రోజులు డిప్రషన్లోకి వెళిపోయింది. జాన్ చాలా కంగారు పడ్డాడు. సరూ కాస్త తేరుకున్నాక ఇద్దరూ ఇంటికి బయల్దేరారు., రెండు మూడు రోజుల్లో అహిగాని వాళ్ళూరు పంపించేస్తానని డెవిడ్ చెప్పాడు.
"సరూ నువ్వు అనవసరంగా టెన్షన్ పడి నీ ఆరోగ్యం మీదకి తెచ్చుకున్నావు. ఇంతగా ఆందోళన చెందడం అవసరమా? అహిగా ఒక చిత్రకారుడు అంతే! కళని ప్రేమించచ్చు కానీ కళాకారుల్ని కాదు! యూ ట్రైడ్ యువర్ బెస్ట్!"
"నా జీవితంలో అహిగా స్థానం చాలా ఎక్కువే జాన్! అది చెబితే అర్థం కాదు,” మెల్లగా అంది సరూ. జాన్ ఇహ రెట్టించలేదు. అతనికి అహిగా పేరు చెబితేనే లోలోపల వుడికిపోతొంది.
00000000000000000
చూస్తూండగా ఆర్నెల్లు గడిచి పోయాయి. అహిగా కూడా డిప్రెషన్లోకి వెళిపోయాడనీ, తేరుకోవడానికి ఓ రెణ్ణెల్లు పట్టిందని అమితోలా చెప్పింది. అహిగా ఎవరితోనూ మాట్లడడం లేదనీ చెప్పింది. అహిగా కోలుకోవడానికి రెణ్ణెల్లు పైగానే పట్టింది. మెల్లగా తన పెయింటింగ్ జీవితంలోకి వచ్చాడు. అతని పెయింటింగ్స్ బాగా అమ్ముడుపోవడానికి చాలా ప్రయత్నించింది సరూ!
ఓ ఏడాది తర్వాత అనుకోకుండా ఓ సారి డాక్టర్ డేవిడ్ శాన్ఫ్రాన్సిస్కో వచ్చాడు. జాన్, సరూ వాళ్ళింటికి విందుకి పిలిచారు. మాటల మధ్యలో అహిగా ప్రస్తావన వచ్చింది. అహిగా మామూలుగానే ఉన్నాడనీ, ఇప్పటికీ ఇంకా పెయింటింగ్ వేస్తున్నాడనీ, ఈ మధ్యలో అవి బాగా అమ్ముడయిపోయాయనీ చెప్పింది సరూ. జాన్కి మాత్రం అహిగా పేరు చెబితేనే చికాకు. సరూ అనవసరంగా అత్యుత్సాహం చూపించిందన్నది అతని అభిప్రాయం. అహిగా గురించి ఇద్దరూ చాలాసార్లు తగవులాడుకున్నారు కూడా!
"అహిగా మాటెలా ఉన్నా, అమితోలా డిప్రెషన్కి గురయ్యి కోలుకోవడానికి ఆర్నెల్లు పట్టిందని విన్నాను. నాక్కూడా ఈ విషయం తలుచుకున్నప్పుడల్లా చాలా స్థబ్ధుగా అయిపోతుంది మనసు. మధ్యలో ఒకసారి చూడ్డానికి వెళదామనుకున్నాను కానీ జాన్ ససేమిరా వద్దన్నాడు."
అది విని చిన్నగా నవ్వి, కొంతసేపు మౌనంగా ఉండిపోయాడు డేవిడ్.
"జాన్! సరూ! మీరిద్దరూ నన్ను క్షమించాలి. నేను మీ అందరికీ ఒక అబద్ధం చెప్పాను. అహిగాకి నేను సర్జరీ చెయ్యలేదు!" తలదించుకునే అన్నాడు. ఇద్దరూ అయోమయంగా చూస్తూ, ఆశ్చర్యపోయారు.
“సర్జరీకోసం మత్తు ఇచ్చే ముందు - ఈ సర్జరీ సక్సెస్ కాకుండా తనకి ఉన్న చూపుకూడా పోతే అమితోలా తట్టుకోలేదని అహిగా కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు. తట్టుకోలేకపోయాను! ఇంతవరకూ అహిగాకి కనీసం తెలుపు-నలుపు జీవితమయినా ఉంది. ఈ సర్జరీ సక్సెస్ కాకుండా పొతే? ఉన్న ఆ రెండు రంగులు కూడా దూరమయితే? తలుచుకుంటేనే బాధ కలిగింది. మూడు వారాల్లో అహిగాతో ఏర్పడ్డ స్నేహాన్ని నా చేత్తో నేను తుంచేయలేకపోయాను. నా వృత్తిమీదున్న నమ్మకంకంటే ఒక చిత్రకారుడి సంవేదనే ముఖ్యమని అనిపించింది. ఐ యాం సారీ!" అంటూ కళ్ళుతుడుచుకున్నాడు.
సరూకి నోట మాట రాలేదు. అందరూ కాసేపు మౌనంగా ఉండిపోయారు. కొంతసేపటికి తేరుకుంది సరూ! డేవిడ్ నిర్ణయమే సరైందని అనుకుంది. జాన్ ఉలుకూ, పలుకూ లేదు. ఈ విషయం ఎవరికీ తెలియదనీ, అహిగాకీ చెప్పొద్దనీ అర్థించాడు డేవిడ్.
“అహిగాని తలుచుకున్నప్పుడల్లా ఆశ్చర్యం కలుగుతుంది. మన చుట్టూ ఉన్న రంగుల ప్రపంచంలో కేవలం రెండే రంగులతో ప్రపంచాన్ని చూడ్డం ఊహక్కూడా అందదు. చదువుకున్న మనకే ఇంత ఆశ్చర్యంగా ఉంటే, ఎక్కడో గ్రాండ్కాన్యన్ లోపల నివసించే నేటివ్ అమెరికన్ పరిస్థితి ఎలావుంటుందో కదా? అన్నిటికంటే ఆశ్చర్య పరిచిన విషయం ఇంకొకటుంది. ఈ పెద్ద సమస్యనుండి అహిగా సృష్టించుకున్న తెలుపునలుపుల గది. అందులోనే తన రంగుల ప్రపంచాన్ని కుంచెతో చిత్రీకరించుకోవడం. నిజం చెప్పద్దూ - యిట్ ఈజ్ జస్ట్ బ్రిలియంట్!" డేవిడ్ మెచ్చుకోలు అతని మాటల్లోనే కాదు, కళ్ళల్లో కూడా మెరవడం గమనించారిద్దరూ.
కొంతసేపయ్యక -"జాన్! నీకిన్నాళ్ళు ఒక నిజం చెప్పకుండా దాచాను. మనింట్లో ఉన్న చిత్ర పటంలో స్త్రీ ఎవరో కాదు. అది నేనే!" తలదించుకునే చెప్పింది.
ఆశ్చర్యంగా చూసాడు జాన్! ఆ చిత్రపటం ఒక్కసారి మదిలో మెదిలింది.
ఒక భారతీయ స్త్రీ చిన్న నేలబారు పీట మీద కూర్చొని స్నానం చేస్తున్న చిత్రం.
ఆ చిత్రంలో ఆ స్త్రీ ముఖం కనిపించదు.
ఓ మూలగా ఒక రంగుల సంతకం !
Comments