తప్పులెన్నువారు తండోపతండంబు

గమనిక: ఇది ఒక అమెరికా పాస్టరు గారు రాసిన స్వీయ కథనం. ఇది కేవలం నా తర్జుమా.

నాకున్న చెడు అలవాట్లన్నిటినీ నేనిక్కడ ఏకరువు పెట్టను. ఉన్నవాటిని ఒప్పుకోలేకపోవడం కూడా వాటిల్లో ఒకటనుకోండి. ఐనా అన్నిటికంటే ముఖ్యమైన చెడు అలవాటుని ఇక్కడ ప్రస్తావిస్తాను. అది నా కపటం. హిపోక్రిసి.

నాకు లేని, (నిజానికి అవసరం కూడా కాని) ఎన్నో సుగుణాలని నాకు నేను ఆపాదించుకుంటూ ఉంటాను. ఈ సుగుణాలేవీ లేనందుకు నా స్నేహితుల్ని తప్పు పడుతుంటాను. నా లోపాలని ఎప్పుడూ ఒప్పుకోను కానీ వాళ్ళలో (నాకు మాత్రం) తరచూ కనబడే బలహీనతలపై, తీవ్రమైన చెడు అలవాట్లపై వాళ్ళకి నచ్చజెబుతుంటాను. నిజంగా నీతిపరులైన వాళ్ళుంటారే, వాళ్ళంటే నాకు వొళ్ళు మంట!

కపటాలన్నిటిలోకీ తీవ్రమైనది ఇతరుల కపటాన్ని ద్వేషించడం. నేను నా తోటివారి కపట ప్రవర్తనని దుయ్యబట్టడానికి ఏమాత్రం వెనుకాడను. నియుక్తుడైన ఒక మతాచార్యుడు (పాస్టరు) గా, క్రైస్తవ మత సిద్ధాంతంలో ఉన్నత పట్టాలు పొందిన పండితుడిగా, మా దక్షిణామ్నాయ ప్రొటెస్టెంటు మతాచార్యుల కపటత్వం గురించి నాకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. అమెరికా అంతర్యుద్ధానికి ముందు మావాళ్ళు బానిసత్వాన్ని గట్టిగా సమర్ధించడమే గాక బైబుల్లో నించి దానికి వత్తాసుగా సూత్రీకరణలు తీశారు. బానిసత్వం రద్దైన పిమ్మట జిం క్రో చట్టాలు (నల్లజాతి వారిని అణిచి ఉంచే ప్రభుత్వ చట్టాలు) అన్నిటికీ మా దక్షిణ ప్రొటెస్టంటు పాస్టర్ల మద్దతు ఉండేది.

మా వాళ్ళలో చాలా మంది స్త్రీలని అణిచి ఉంచడాన్ని కూడా సమర్ధించారు. స్త్రీలు ఉద్యోగం అనే ప్రవాహంలో మునిగి అభిషిక్తులయ్యి చర్చిలకి చందాలు కట్టే సంపాదన పరులయ్యే దాకా ఇది కొనసాగింది. మావాళ్ళు చాలా మంది ఎప్పుడూ చూసినా దేవుని ప్రేమ అపరిమితం అని ప్రవచిస్తుంటారు, కానీ ఆ ప్రేమ హోమోసెక్సువల్ వారికి వర్తించదని నొక్కి వక్కాణిస్తారు అవే నోళ్ళతో. క్రైస్తవులు నిరంతర కాందిశీకులు అని ప్రవచిస్తూనే, మా దేశంలోకి ఇతర కాందిశీకులు రాకుండా ఉండడానికి గోడలు కట్టమంటారు. అన్ని రుగ్మతలూ తీర్చేవాడు ప్రభువే అని చాటి చెబుతూ, పేద వారికి ఆరోగ్య బీమా ఇవ్వడాన్ని నిరశిస్తారు. జీసస్ శాంతిదూత అని ప్రవచిస్తూ ఈ దేశం మొదలెట్టే ప్రతీ యుద్ధాన్నీ సమర్ధిస్తారు. సువార్తలో చెప్పబడిన "రొట్టెలు-చేపలు" మహిమని వేనేళ్ళ కీర్తిస్తారు కాని ప్రత్యక్షంలో అలమటిస్తున్న అమెరికను పిల్లల ఆకలి కేకలను వినిపించుకోరు.

ఎవరు మావాళ్ళని తప్పు పట్టగలరు? మాకందరికీ మా చర్చి పదవులు భద్రంగా ఉండాలి. మా ఆరోగ్య బీమా, పింఛను పథకాలు సురక్షితంగా ఉండాలి. అలనాడు జీసస్ "బీదవారు పవిత్రులు" అంటే అన్నాడు గానీ మావాళ్ళు మాత్రం ఆ పవిత్రుల జాబితాలో చేరడానికి సిద్ధంగా లేరు. తన సొంత ఆస్తుల్ని అమ్మేసి అయినా దీనుల సేవ చెయ్యాలని సువార్త బోధిస్తే బోధించవచ్చుగాక, కత్తిని వదిలి ప్రేమతో సామ్రాజ్యాలను గెలవమనీ, కుష్టురోగిని ఆదరంతో తాకమనీ, ఇల్లులేని వారికి నీ ఇంట్లో ఆశ్రయ మివ్వమనీ బోధించి ఉండవచ్చు గాని - నిజంగా ఒక పాస్టరు కొత్త నిబంధన గ్రంధంలో చెప్పిన సువార్తని యథాతథంగా ప్రవచిస్తే తక్షణం అతని ఉద్యోగం ఊడడం ఖాయం. సొంత బాగు ఏ కొంచెం తెలిసినవారైనా, పాస్టర్లకి కపటత్వం తప్ప మరో మార్గం లేదు.

నా కపటత్వాన్ని నేనొక కవచంలా ధరిస్తాను. అది నన్ను ఇతరుల విమర్శ నించి రక్షిస్తుంది. నా పశ్చాత్తాపం నించి నన్ను రక్షిస్తుంది. పైకి నవ్వుతూ లోలోపల కుమిలిపోయే సర్కసు బఫూన్ని నేను. శ్రద్ధ అనే ముసుగు పైన వేసుకున్నా గానీ లోపల నిర్లక్ష్యాన్ని తోసిపుచ్చలేను. సమాజాన్ని అట్టుడికిస్తున్న సమస్యల పట్ల ఉద్రేకంగా ఉపన్యాసాలు దంచుతాను, కానీ వాటిల్లో దేన్ని గురించీ వీసమెత్తు మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చెయ్యను. బయటి ప్రపంచానికి ఎలా కనిపించే ప్రయత్నం చేస్తుంటానో, నిజంగా అలాంటి మనిషిని ఐతే బాగుండునని లోలోపల చిన్న ఆశ మినుకుమినుకు మంటూంది. కానీ ఆ దీపం ఎప్పటికీ ప్రజ్వరిల్లదని నాకు తెలుసు. నిజానికి అలాంటి మనిషెవడైనా నాకు తటస్థపడితే నాకు వొళ్ళు మండి పోతుంది.

Appeared in The Sun, a monthly magazine (January 2018)


Comments

Anonymous said…
Homo transgender.. is disgusting community. అసలు మనుషులు మానసికంగా చేసే పాపాలు లైవ్ రిలే చేస్తే ఇతరులకు తెలుస్తే బుచికోయమ్మ బుచికి. On judgement day all the thoughts of a person in his lifetime should be screened on IMAX in hell. Audience will be the affected persons. After the show all should face each other. Then the real బుచికి starts.
Anonymous said…
excellent