భరతనాట్యం - ఒక సంభాషణ

ఈ సంభాషణ 2007 లో ఈ మెయిల్ ద్వారానూ, కూడల్ చాట్ ద్వారానూ జరిగింది. ప్రశ్నలు అడిగింది రామనాథరెడ్డి అను నామాంతరము గల రానారె. తదనంతరం పొద్దు అనే జాలపత్రికలో ప్రచురించారు. వారి గూడు కాలగర్భంలో కలిసిపోయింది, దురదృష్టవశాత్తూ.  
ఎలాగూ ఇప్పుడు ఇక్కడ నాట్య ప్రస్తావన మొదలైంది కాబట్టి ఈ సంభాషణ కూడా చదివేవారికి ఆసక్తికరంగా ఉంటుందని ఇక్కడ పెడుతున్నాను.
**   ***   ***
కథలు, కవితలు, పద్యాలు, అనువాదాలు, బ్లాగు వ్యాసాలు రాయడంతో పాటు మీరు నాట్యం కూడా చేయగలరనే సంగతి మొన్నామధ్య ఒకానొక బ్లాగుముఖంగా బయటపడింది. ఆ తరువాత ఇటీవలి మీ నాట్య బృంద ప్రదర్శన గురించి మీ బ్లాగులో చూశాం. మీరు శిక్షణ పొందినది ఏ నృత్య సంప్రదాయంలో?

---

నేను నేర్చుకున్నది, నేర్చుకుంటున్నది భరతనాట్యం. ఈనాడు భరతనాట్యమనే పేరిట ప్రదర్శించబడుతున్న నృత్యంలోనే వివిధ సాంప్రదాయ రీతులున్నాయి, పండనల్లూర్ బడి అనీ, తంజావూర్ బడి అనీ, ఇలాగ. గత వంద, నూటయాభై ఏళ్ళ కాలంలోని గురువులు ఏయే ఊళ్ళనించి వచ్చారో ఆ పేరిట ఈ సాంప్రదాయాల్ని పిలుస్తున్నారు. మా గురువుగారు నేర్పేది కళాక్షేత్ర సాంప్రదాయం.

---

మీరు అభ్యసిస్తున్న కళాక్షేత్ర సంప్రదాయపు ప్రత్యేకతలు ఏమిటి?

--

మిగతా భరతనాట్య సాంప్రదాయాలతో పోలిస్తే కళాక్షేత్ర పద్ధతి పదునుగా ఉంటుంది. ఒక భంగిమ కానీ , కదలిక గానీ శిల్పానికి జీవం పోసినట్టు ఉంటాయి, మితిమీరిన మెత్తదనం ఉండదు. ఆడపిల్లలు చేసినప్పుడు కూడా వయ్యారం కంటే ఒక మాదిరి వీరరసం కనిపిస్తుంది . అఫ్కోర్సు ఈ పద్ధతి నచ్చని వాళ్ళు మరీ మిలిటరీ కవాతులాగుంటుందని విమర్శిస్తారు :-) కళాక్షేత్ర నించి ఉత్తీర్ణులై ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నర్తకులు , గురువులు, ఆనంది, సీ. వీ. చంద్రశేఖర్, శాంత మరియు వీ.పీ . ధనంజయన్ జంట, లీలా శాంసన్, నవ్‌తేజ్ జోహార్ ప్రభృతులు కళాక్షేత్ర పద్ధతిలోని ముఖ్యాంశాలని నిలుపుకుంటూనే తమకి అనుగుణమైన మార్పులు చేసుకున్నారు . ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా సరే .. అలరిప్పు చేస్తే చాలు, అది కళాక్షేత్ర పద్ధతి అని తెలిసిపోతుంది. ఈ పద్ధతే సరైనదని ఏం లేదు. ఇది మా పద్ధతి, అంతే :-)

ఇది బృంద ప్రదర్శనలకి బాగా ఉపయోగిస్తుంది. పదిమంది ఒకే జతిని చేస్తున్నప్పుడు ఆ మాత్రం పదును లేకపోతే అది బలంగా అనిపించదు. అన్ని నాట్య సాంప్రదాయాల్లోనూ పద్ధతుల్లోనూ శిల్పాకృతికి ఒక ప్రాముఖ్యత ఉన్నాగానీ, అదెక్కడో మరుగున పడిపోతూ ఉంటుంది . కళాక్షేత్ర పద్ధతిలో ఈ శిల్పాకృతి చాలా ముఖ్యం. భంగిమలు సరేసరి, కదలికలు కూడా కదులుతున్న యోగాసనాల వలె ఉంటాయి. నీకు తెలుసో లేదో, మన సాంప్రదాయంలో యోగమూ, నాట్యమూ రెండూ పరమశివుని దగ్గర్నించే ఆవిర్భవించాయి. రెంటికీ మూలం శివుడే.

---

మునుపటి మీ మాటల్లోని అంశాన్నే నేనూ ప్రస్తావించదలిచాను. లయకారుడు శంకరుడు అందరికీ తెలిసిన సంగతే. శివతాండవం అందరికీ తెలిసిన పదమే. భారత సంస్కృతిలో నృత్యానికి ప్రతీక (Icon) ఒక పురుషుడు. పాశ్చాత్య నృత్యరీతులను నేర్చుకోవడానికి చూపే ఉత్సాహాన్ని భారతీయ యువకులు తమవైన నృత్యసంప్రదాయాలను నేర్చుకోవడానికి చూపడం లేదన్నది ఒక సాధారణ భారతీయునిగా నాకు కలిగిన అభిప్రాయం. మీరేమంటారు?

---

ముఖ్య కారణం ఉపాధి లేమి కావచ్చు. ఎంతో నిష్ఠతో ఏళ్ళతరబడి నేర్చుకుని, కళలో నిష్ణాతులై, తామే స్వయంగా కొత్త అంశాలు సృజించే స్థాయికి రావాలంటే ఎంత కృషి ఉండాలి? ఆ కృషికి తగిన ఫలమేది? మగ నృత్య కళాకారులకి అవకాశాలు రావడం కష్టమైపోతున్నదని పలు వేదికల్లో స్పష్టమైంది. మగవాడు నాట్యంలో వృత్తిపరంగా రాణించాలంటే ఒక కళాకారిణిని పెళ్ళాడి భార్యాభర్తలుగా ప్రదర్శనలివ్వటమే మార్గం.

"నేను చూసిన అతి మనోహరమైన ముగ్ధ గోపిక, బట్టతలతో ముడతలు పడ్డ మొహంతో సుమారు డెబ్భయ్యేళ్ళ ముసలాయన," అంటారు మా గురువుగారు దివంగత ఒడిస్సీ నాట్యాచార్యులు శ్రీ కేలూచరణ్ మహాపాత్రుల గురించి. అంతెందుకు, వేదాంతం సత్యనారాయణ శర్మగారి భామవేషం ఆయనకి యాభై దాటిన వయసులో చూశాను; 
శ్రియ, ఇలియానాలు పాఠం నేర్చుకోవచ్చు లావణ్యంలో వొయ్యారంలో. నవ్‌తేజ్ సింగ్ జోహార్ అని కళాక్షేత్రంలో మాగురువుగారి సహాధ్యాయి. ఆరడుగుల పొడుగు, పల్చగా రివటలా ఉంటారు, నిండైన బవిరి గడ్డం మీసాలు, కత్తెర వెయ్యని తలకట్టుతో అచ్చమైన సర్దార్జీ .. దగ్గిర దగ్గిర యాభయ్యేళ్ళ వయసుంటుంది. ముత్తుస్వామి దీక్షితుల కృతి "మీనాక్షి మేముదం దేహి" కి నాట్యం చెయ్యడం చూశాను. ఒక్కొక్క భంగిమలో తానే మీనాక్షి అయిపోయాడాయన .. అప్పుడు మనకళ్ళెదుట కనబడేది కొద్దిగా నెరిసిన వెంట్రుకలతో బవిరిగడ్డంతో ఉన్న నడివయసు సర్దార్జీ కాదు, ఒక కంట హొయలు కురిపించి సమ్మోహన పరిచే దివ్య శృంగార మూర్తి, మరో కంట కృపారసమొలుకుతూ ఆపన్నులను గాచే మాతృమూర్తి .. నీకు తెలుసో లేదో .. మన దేవతా మూర్తులందరిలోకీ మీనాక్షి అమ్మవారిది మూర్తీభవించిన శృంగార రూపం. అందుకే మంత్ర యోగనిష్ఠా గరిష్ఠుడైన దీక్షితులవారు కూడా ఆమెని అంత శృంగార భరితంగా కీర్తించారు. ఆర్.ఎస్. సుదర్శనం గారి అద్భుతమైన కథ మధుర మీనాక్షి చదివావూ? ఈ నడివయసు సర్దార్జీ తనలో అటువంటి మోహన మూర్తిని ప్రత్యక్షం చేసేశారు. అదీ కళంటే! పండిత్ దుర్గాలాల్ అని కథక్‌లో నిష్ణాతుడు. చిన్నవయసులోనే రోడ్డు ప్రమాదంలో పోయారు; గొప్ప కళాకారుడు. ఇలా కొందరు లేకపోలేదు, సోలోగా విజయం సాధించిన వాళ్ళు.
---

ఈ సంప్రదాయాన్నే ఎంచుకోవాలనే ఆసక్తి ఎప్పుడు ఎలా కలిగింది? అసలు మీరు నృత్యం చేయగలరు అనే నమ్మిక మీకెప్పుడు కలిగింది? అప్పటి నుంచి, నాట్యం నేర్చుకునే అవకాశం కోసం ఎంత కాలం పాటు వేచి వుండవలసి వచ్చింది?

---

నా విషయంలో ఇదంతా రివర్సుగా జరిగింది. నాకు చిన్నప్పణ్ణించీ సంగీతమో, మృదంగమో నేర్చుకోవాలని మహా కోరికగా ఉండేది. అది వీలుకాలేదు. విజయవాడలో కౌమార దశలో అనేక నృత్య ప్రదర్శనలు చూశాను. మా ఇంటికి దగ్గర్లోనే ఒక మంచి కూచిపూడి నాట్యాచార్యుల కుటుంబం ఉండేది (వీరి పెద్దబ్బాయి ఆనందభైరవి చిత్రంలో చూపించే ఒక నృత్య పోటీలో శివతాండవం అద్భుతంగా ప్రదర్శించారు). ఎప్పుడూ నృత్యం నేర్చుకోవాలి అనే కోరిక కలగలేదు. అంచేత, నేనూ చెయ్యగలనా అనే ప్రశ్న వచ్చే అవకాశమే లేదు. అదీ కాక, నృత్యం ఆడపిల్లలు నేర్చుకునేది అనే అపోహకూడా ఉండేది ఆ రోజుల్లో, చాలా మంది అద్భుతమైన పురుష నర్తకులని చూశాక కూడా.

ఎనార్బరులో ఉండగా ఒక స్నేహితురాలిని డాన్సు క్లాసునించి తీసుకెళ్ళడానికి మొదటిసారి మా గురువుగారింటికి వెళ్ళాను. వారింటి ముందు గదిలో నేర్పిస్తారామె. నేను కారు దిగి ఇంటి వేపు నడుస్తున్నాను. పెద్ద కిటికీ లోంచి క్లాసు కనిపిస్తోంది. ముగ్గురు అమ్మాయిలు (పెద్ద వాళ్ళే, పిల్లలు కారు) మూడు కాలాల్లో ఒక నాట్టడవు చేస్తున్నారు. ఆ దృశ్యం ఎంతో బాగుంది. అక్కడే ఆగిపోయి క్లాసు ముగిసే దాకా ఒక పది నిమిషాలు చూస్తుండి పోయాను. టీచరు గారు క్లాసు ముగించి ఇంటి తలుపు తియ్యగానే, నా మొదటి ప్రశ్న "మీరు పురుషులకి కూడా నేర్పిస్తారా?" .. ఆ క్షణంలో నా వయసూ, ఉద్యోగం, సంఘంలో నా పరువూ, ఇవేవీ నాకు గుర్తు రాలేదు. ఇది నేను చెయ్యలేనేమో అనే సందేహమే కలగలేదు. ఆ తరవాత .. సుమారు ఆరు నెలలకి కలిగింది సందేహం, ఉత్సాహంతో మొదలెట్టాను గానీ, కొనసాగించగలనా అని. ఇదిగో, చూస్తూ చూస్తూనే పదేళ్ళవుతోంది.

---

మీ నాట్యాభ్యాస ప్రవేశం చాలా ఆసక్తికరంగా వుంది. ఆరు నెలల పాటు తిరిగి చూడకుండా అంతగా మిమ్మల్ని ఆకట్టుకొన్న అంశాలేమిటి? ఆ తరువాతి ప్రస్థానం కూడా (మీ పరిధిలో లేని ఇబ్బందులను పక్కనబెడితే కేవలం మీ వరకూ) అంతే ఆసక్తికరంగా సాగుతూ వుందా? ఇక్కడ మీ గురువుగారి గురించి చెప్పవలసి వస్తే ఆ సంగతి కూడా వివరంగా చెబితే సంతోషిస్తాను.

---

ఆరు నెల్ల పాటు ఆకట్టుకున్నది ప్రత్యేకంగా ఏం లేదు. కొత్త బిచ్చగాడు పొద్దెరగడు, ఆంధ్రులు ఆరంభ శూరులు అని సామెతలున్నాయి గదా, ఆ చందమనుకో. ఆర్నెల్లు తిరిగే సరికి ఆ శూరత్వం కాస్తా కరిగి నీరవుతుంది. ఏమాట కామాట చెప్పుకోవాలి. మా గురువుగారి బోధనా పద్ధతి ఆసక్తి కలిగించేట్టే ఉంటుంది. మామూలుగా ఇండియాలో డాన్సు టీచర్లెవరైనా మొదలెట్టిన ఆర్నెల్లు అడవులు (basic steps) తప్ప ఇంకేవీ చెప్పరు. మా గురువుగారు మొదటి తరగతి నించే కొద్దిగా అభినయం, చిన్న చిన్న అడవులు కలిపి ఒక బుజ్జి జతిగా కూర్చి అలాంటి బుజ్జి జతులతో ఒక బుల్లి కీర్తన నేర్పించడం .. ఇలా చేసేవారు. వీటిని ఆమె ప్రత్యేకంగా రూపొందించుకున్నారు. అందుకని ఆసక్తి బాగానే ఉండేది.

ఆర్నెల్ల తరవాత భయం పుట్టే సంఘటన ఏవిటంటే అలరిప్పు ఎదురైంది. అలరిప్పు సాంప్రదాయ భరతనాట్యంలో మొట్టమొదటి అంశం., మూడు, మూడున్నర నిమిషాలు ఉంటుంది. చూడ్డానికి చాలా సింపుల్‌గా అనిపిస్తుంది కానీ చాలా కష్టమని వేరే చెప్పక్కర్లేదనుకుంటాను. ఒక మనిషి అలరిప్పు ఎలా చేశారో చూసి ఆ మనిషి నాట్య కౌశలం అంచనా వేసెయ్యొచ్చు. అప్పటిదాకా ఏదో ఆడుతూ పాడుతూ లాగించేశాను, కానీ అలరిప్పుతో ఆ రోజులు చెల్లిపోయాయి. ఇంక ఖచ్చితంగా సాధన చెయ్యక తప్పలేదు. అలా ఒక రెణ్ణెల్లు కష్టపడ్డాను. ప్రతి వారమూ ఇంక మానేస్తా అనుకునే వాణ్ణి. ఆ తరవాత అకస్మాత్తుగా అలరిప్పు చెయ్యడం సులభం ఐపోలేదు గానీ, కష్టపడి సాధన చెయ్యటంలోని ఆనందం అనుభమయ్యింది. అంశం పూర్తి కాగానే రొప్పుతూ కూలబడిపోకుండా అలరిప్పు ఒక మాదిరిగా చెయ్యటానికి నాకు ఆర్నెల్లు పట్టింది. పర్ఫెక్టుగా చెయ్యటం .. పదేళ్ళ తరవాత ఇంకా సాధన చేస్తూనే ఉన్నాను.

---

మీ గురువుగారికి జన్మతః భారతదేశంలో ఏ సంబంధమూ లేదు. ఆమె గురించి తెలుసుకోవాలనుంది.

--

ఆవిడ పేరు మార్సియా. మిషిగన్లో పుట్టి పెరిగారు. మొరాకోలో పీస్ కోర్ వాలంటీరుగా పనిచేస్తుండగా, తొలిసారి ఎమ్మెస్ సుబ్బలక్ష్మి పాట రికార్డు విన్నారక్కడ ఒక ఫ్రెంచి దేశస్థుని వద్ద. దానితో సమ్మోహితులయ్యారు. అప్పటికే ఆమె విశ్వవిద్యాలయంలో ఆధునిక నాట్యంలో పట్టాపొంది ఉన్నారు. ఈ సంగీతానికి సంబంధించిన నాట్యం ఏదన్నా ఉందా అని ఆ స్నేహితుణ్ణి అడిగి భరతనాట్యం గురించి తెలుసుకున్నారు. పీస్ కోర్ పని పూర్తయ్యాక అట్నుంచి అటే భూమార్గంపై వివిధ దేశాలు దాటుకుని ఢిల్లీ చేరుకున్నారు. చెన్నైలోని కళాక్షేత్ర ప్రతిష్ఠ తెలుసుకుని చెన్నై చేరారు. చేతిలో ఉన్న డబ్బులైపోయినై. మరుసటేడుకి సీటు సంపాయించుకుని ఈలోపల కొన్ని నెలలు జపానులో ఇంగ్లీషు టీచరుగా పని చేసి కాస్త డబ్బు సంపాయించుకుని కళాక్షేత్రలో నమోదయ్యారు. ఇంతలో పెళ్ళి, పిల్లలూ. సంసారం నిర్వహిస్తూనే, అభ్యాసం కొనసాగించి ఐదారేళ్ళ డిప్లొమా కోర్సు తరవాత మరో రెండేళ్ళ పాటు సీనియర్ గురువుల దగ్గిర ఉన్నత విద్య నభ్యసించారు. ఆ సమయంలోనే హిందూ మతం పట్ల ఆకర్షితులై ఆర్యసమాజం ద్వారా మతం స్వీకరించి తన పేరు మాధవి అని మార్చుకున్నారు. మిషిగన్ విశ్వవిద్యాలయంలో భరతనాట్య పాశ్చాత్య ఆధునిక నాట్యాల పై తులనాత్మక సిద్ధాంత వ్యాసం సమర్పించి ఎమ్మెస్ పట్టా పొందారు. 96 నించీ ఏనార్బరులో వృత్తి రీత్యా రియలెస్టేట్ ఏజెంటుగా పని చేస్తూ "సాధనా నాట్య పాఠశాల" నెలకొల్పి నా బోంట్లకి నేర్పిస్తున్నారు. సాంప్రదాయకమైన అంశాలతో పాటు వర్తమాన సామాజిక ఇతివృత్తాలతో నాట్యాంశాలను, రూపకాలను రూపొందించడం పట్ల ఆమెకి ఆసక్తి మెండు. స్వతహాగా పాశ్చాత్య పద్ధతిలో మంచి గాయని. అందుకని ఆంగ్ల కవిత్వానికి తానే పాశ్చాత్య బాణీలు కట్టి పాడతారు. విశ్వకవి రవీంద్రుల పద్యాలు కొన్నిటికి ఆమె చేసిన నాట్యరచనలు బహు హృద్యంగా ఉంటాయి. సృజనాత్మకత, బోధనా శక్తి, హాస్య చతురత, దయ సమపాళ్ళలో కలిసిన వ్యక్తిత్వం. మనమేమన్నా కొంచెం పొగిడితే .. నా గురువులు నాకు పెట్టిన భిక్షే మీకు పంచుతున్నాను అంటారు.

నా నాట్యాభ్యాసంలో ఆ తరవాత జరిగిన ఒక ముఖ్య పరిణామం ఏవిటంటే మా గురువుగారు నాకు మంచి స్నేహితులయ్యారు. తన దగ్గిరకి వచ్చే విద్యార్ధులందరికీ ఆమె సరి సమానంగానే ప్రేమాభిమానాలు ఇస్తూ ఉన్నా నేనంటే కొంత ప్రత్యేక అభిమానం ఉందనుకుంటున్నాను. బహుశా ఒక్కణ్ణే మగ విద్యార్ధిని, అందరికంటే వయసులో పెద్దవాణ్ణీ కావటం వల్ల కావచ్చు. ఏదేమైనా, నేను నీరస పడ్డప్పుడు తానే మరి కొంత ఓపిక వహించి, నన్ను ఉత్సాహ పరిచి మళ్ళీ లేపి నిలబెట్టారు. ఒక్క మాట చెప్పాలంటే .. ఆమె నా గురువు కాకపోయి ఉంటే నేను నాట్యంలో ఇంత దూరం కొనసాగే వాణ్ణి కాదేమో. అటువంటి గురువుగారు దొరకటం నా అదృష్టం.


బాగుంది. గురువుగారికి ప్రియశిష్యుడవటం ఒక వరం. పదేళ్లపాటు ఒక శిష్యుడు ఒకే గురువు వద్ద శిక్షణ పొందడం సాధారణ సమాజంలో చాలా అరుదు. ఈ సుదీర్ఘమైన అనుబంధంలో అపురూపమైన ఘటనలుగా మీరు భావించేవి ...?

---

అంత అరుదైన విషయమేమీ కాదు. రంగప్రవేశంతోటే విద్యార్జన పూర్తికాదు. రంగప్రవేశమంటే హైస్కూలు పూర్తయినట్టు. అప్పుడే అసలు విద్యార్జన మొదలవుతుంది. నాట్యాన్ని వృత్తిగా స్వీకరించ దలచిన వాళ్ళు అక్కణ్ణించి ఉన్నత విద్య నభ్యసిస్తారు. మాగురువుగారు తన గురువైన ఆనంది వద్ద ఇలాగే 1996 వరకూ (పదేళ్ళకి పైనే) అనేక విడతల్లో ఉన్నత విద్య కొనసాగించారు. కొంతమంది ఉన్నత విద్య కోసం వేరే గురువుల దగ్గిరికి వెళ్ళటమూ ఉంది. గురువు దగ్గిర ఎంత విద్య ఉంది, అది నేర్పాలన్న ఇఛ్ఛ గురువుకెంత ఉంది, అనేవి కూడా ముఖ్యమైన విషయాలే, శిష్యుల కుతూహలంతో పాటుగా. ఆనంది వంటి గురువుల దగ్గిర ఉన్న విద్య అపారం. పాతకాలపు గురుకుల పాఠశాల లాగా కొందరు శిష్యులు అహర్నిశలూ గురువునే అంటిపెట్టుకుని ఉండి తేనెటీగల్లా ఆ మాధుర్యాన్ని పీల్చుకుంటూ ఉంటే ఆ విద్య ఏమన్నా తరువాతి తరాలకి అందుతుందేమో. అటువంటి గురువులూ, శిష్యులూ తెరమరుగై పోతున్నారు. ఇక మనకు మిగిలేవి Made for TV అరగంట నాట్య కార్యక్రమాలే.

మేమిచ్చిన ప్రదర్శనలన్నీ అపురూపమైన అనుభూతులే. ఏడాదికొకసారి మే జూలై మధ్యలో ఆ ఏడాది శిష్యులు కొత్తగా నేర్చుకున్న అంశాలతో ఒక ప్రదర్శన ఇప్పిస్తారు. ఇస్మాయిల్ తన బ్లాగులో పెట్టిన ఫొటో 2005 కార్యక్రమానిది. ఇది కాకుండా ఆయా సందర్భాలను బట్టి కొన్ని ప్రత్యేకమైన ఆంశాలని తయారు చేస్తుంటారు. అమెరికా ఇరాక్‌ని ముట్టడించినప్పుడు యుద్ధానికి వ్యతిరేకంగా ఒక అంశాన్ని తయారు చేశారు. అరేబియా, ఇరాన్, భారత దేశాలనుండి ముగ్గురు కవయిత్రులు రాసిన పద్యాలు మూడింటిని ఏరి, వాటి ఆంగ్లానువాదాలను ఒక పాటగా కట్టి దానికి నృత్య కల్పన చేశారు. చాలా శక్తివంతమైన కవిత్వం; Shall I attack these people? అనే ఆత్మ పరిశీలనతో మొదలై .. Wherever there's a war, there are borders .. I have a torch in one hand and a bucket of water in the other .. I shall set fire to heaven and put out the flames of hell, so that voyagers to God can lift the veil and see the real destination .." ఇలా సాగుతుంది ఏడు నిమిషాల పాట. దాన్ని మొదటిసారి స్థానిక మ్యూజియం వారి ఆహ్వానంపై 2004లో నలుగురు కళాకారులతో ప్రదర్శించారు. అప్పణ్ణించి ప్రతి ప్రదర్శనలోనూ నర్తిస్తూనే ఉన్నాం, ప్రతి సారీ అది చూసినవాళ్ళు (అమెరికన్లు, భరతనాట్యం గురించి ఏమీ తెలీనివాళ్ళు) తమలో ఏదో భావ వీచిక కదిలిందని చెబుతూనే ఉన్నారు.

ఇలా సాంప్రదాయకమైన శబ్దం, వర్ణం, తిల్లానా వంటి అంశాలతో పాటు వర్తమాన సామాజిక సందర్భాలకి అనుగుణమైన కొత్త అంశాలు నేర్చుకుని ప్రదర్శించటం చాలా ఉత్తేజం కలిగిస్తూ ఉంటుంది. ఇటీవల ప్రదర్శించిన ఆనంది, మలోరాల జీవిత గాధల ప్రదర్శన కూడా పూర్తిగా ఆంగ్లంలో ఉంది. దీనిలో నాట్యంతో పాటు కథ చెప్పటం, మూకాభినయం, ఆధునిక నృత్యం వంటి ప్రక్రియలని కూడా ఉపయోగించారు. క్లాసులో ఉనంతసేపూ ఆమె గురువు, మేము శిష్యులం. ఓపిగ్గా, దయతో ప్రోత్సహిస్తూ , కొండొకచో కించిత్ కోపంతో మందలిస్తూ పాఠం చెబుతారు. కానీ ప్రదర్శన దగ్గిర పడేప్పటికి తానొక డైరెక్టర్ ఐపోతారు. మేమంతా ఇక శిష్యులం కాదు, అందరూ కలిసి కళాకారుల బృందం. ఈ స్టెప్పు ఇలా చెయ్యాలి అనే సూచనలు ఉండవు; అది అప్పటికే అందరూ నేర్చి ఉండాలి. మనం పోషించే పాత్ర రక్తి కట్టాలి, తద్వారా ప్రదర్శన రక్తి కట్టాలి. ఈ ప్రక్రియలో అందరమూ భాగస్వాముల మవుతాం.

---

ఒక బృందంలో భాగంగా కాక వ్యక్తిగత ప్రదర్శనలు కూడా చేసి వుంటారు. అవునా?

--

వ్యక్తిగతంగా చేసినవి lecture demonstrations మాత్రమే. పూర్తి స్థాయి ప్రదర్శనలు ఇచ్చినవి ఎప్పుడూ నా సహాధ్యాయ బృందంతోనే. మాతృదేశానికి వచ్చినప్పుడు మదురైలో ఒక బడిలోనూ, విజయవాడలో ఒక బడిలోనూ demonstrations ఇచ్చాను. పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు.

---

నాట్య బృందంతో ప్రదర్శనం, ఒకే వ్యక్తి చేసే నాట్య ప్రదర్శనం; రెంటిలో మీరు దేన్ని ఎక్కువగా ఆస్వాదిస్తారు?

--

రెంటిలో అనుభూతిలో తప్పకుండ తేడా ఉంటుంది, కళాకారుడికీ తేడా తెలుస్తుంది, ప్రేక్షకులకీ తేడా తెలుస్తుంది. ఒకే వ్యక్తి ప్రదర్శనలో మనోధర్మానికి ఎక్కువ వెసులుబాటు ఉంటుంది. బాధ్యత కూడ ఎక్కువే .. అంత పెద్ద స్టేజి మీద ఒక్క మనిషే ఉన్నప్పుడు అంతటా తానే అయి కనిపించాలి, ఒక కృతిని అనువదించడంలో అనేక పాత్రలు తనలోనే వ్యక్తం కావాలి. అవలంబంగా సంగీతం ఉన్నా, అది కంటికి కనబడదు గనక ప్రేక్షకుల దృష్టి అంతా తనపైనే కేంద్రీకరించి ఉంటుంది. అదొక అగ్ని పరీక్షే. 

 బృంద ప్రదర్శనల్లో రకరకాలు ఉంటాయి. కూచిపూడి సాంప్రదాయంలో బహుళ ప్రాచుర్యం పొందినది నృత్య నాటకం. కొంత కాలంగా భరతనాట్యంలో కూడా ఈ ప్రక్రియ ఉపయోగిస్తున్నారు. ఇందులో ప్రతిపాత్రకీ ప్రత్యేక వేషధారణ ఉంటుంది. ఒక నటుడు ఒక పాత్రనే పోషిస్తాడు. పాత్రకి తగిన వేషధారణ విడిగా లేకుండా అందరు నటులూ సుమారు ఒకే లాంటి వేషధారణలో ఉండి సందర్భానికి తగినట్టు వేర్వేరు పాత్రల్లో నటించడం రెండో రకం. అక్టోబరులో మేము చేసిన ప్రదర్శన ఇలాంటిది. ఉదాహరణకి ఆనంది కథలో నేను కథ చెప్పేవాడిగా, ఆనంది తండ్రిగా, మామగారిగా, గురువుగా, శిష్యుడిగా కనిపిస్తాను. అలాగే మిగతా నటులు కూడా. పాత్రకీ పాత్రకీ నడుమ వేషధారణ మారదు. హావభావాల ద్వారానే దృశ్యంలో ఎవరు ఎవరో తెలుస్తుంది.
ఇక మూడో రకంలో అందరు నటులూ ఒకే జతిని, ఒకే అభినయాన్ని చెయ్యడం. దీనివల్ల ఒక amplification effect వస్తుంది. యాభై వయొలిన్లు ఒకే సారి మోగే సింఫొనీ ఆర్కెస్ట్రా ధ్వని లాంటి ఎఫెక్టు ఇది. బృందంలో నాట్యం చేసేప్పుడు, ఈ మూడు రకాల్లో ఏదైనా, మన స్వాతిశయాన్ని కొంత అదుపులో పెట్టుకుని తోటివారితో సమైక్యత సాధించినప్పుడే ప్రదర్శన రక్తి కడుతుంది. మన వ్యక్తిగత బాధ్యత కాస్త తగ్గినా, ఇది ఇంకో రకమైన బాధ్యత. నా మట్టుకు నేను రెండిటినీ ఆస్వాదిస్తాను.

---

పదేళ్ల విద్యార్జనలో మీరు నైపుణ్యం సాధించినట్లుగా మీ గురువుగారు మెచ్చిన విభాగం ప్రత్యేకంగా ఏదైనా వుందా?

--

ఒక పలానా అంశమనీ, ఒక పలానా అడవు అని కానీ ఏం లేదు. సాధన సమయాల్లోనూ , ప్రదర్శన సమయాల్లోనూ ఏదన్నా బాగా చేస్తే ప్రశంసించి వెన్ను తడతారు. అంతవరకే. అసలు మనకే తెలుస్తుంది ఆ అంశంలో ఆ క్షణం బాగా రసం పండిందని. అది కాకుండా అసలు నాట్యం బాగా చేస్తానని ఒక మంచి అభిప్రాయమే ఉంది మా గురువుగారికి . ఇక్కడ రెండు విషయాలు గుర్తుంచుకోవాలి. మిగతా లలిత కళల మాట ఎలా ఉన్నా సంగీతంలోనూ, నాట్యంలోనూ 35% పాసు మార్కు, 50% పాసు మార్కు అనుకోవడానికి లేదు. 100% వచ్చి తీరాల్సిందే. రాగం, తాళం, జతులు అన్నీ సరిగ్గా పడవలసిందే . అది కనిష్ఠావసరం. అటుపైన కళాకారుడు ఆ కళని తనలో జీర్ణించుకుని తనదైన శక్తితో దానికి ఒక రూపమిచ్చి ఆవిష్కరిస్తాడు. అదే మనోధర్మం. మన సంగీత నాట్య సాంప్రదాయాలకి పట్టుగొమ్మ. అదే మోహన రాగం, అదే నను పాలింప కృతి ఒక బాలమురళీ కృష్ణ ఒక వోలేటి వెంకటేశ్వర్లు పాడితే వినే అనుభూతి పూర్తిగా వేరేగా ఉంటుంది. అలాగే నాట్యంలో కూడా. నేను మా గురువు గారి నించే నేర్చాను. నా సహాధ్యాయినులు మార్తా, సోనాలీ కూడా నాతో పాటే నేర్చారు. నలుగురమూ ఒకే సాంప్రదాయాన్నించి వచ్చి ఒకే కృతిని అభినయించినా .. అడవులూ ముద్రలూ ఒకలానే ఉంటాయి, కానీ కలిగే భావం వేర్వేరుగా ఉంటుంది.

రెండో విషయం: కళాకారులకి పంకాలూ విసనకర్రలూ వెర్రి తలలు వేస్తున్న రోజులివి. నిజానికి కళాకారుని ప్రతిభ క్షణికమే. ఒక అంశాన్ని చేసినప్పుడు అప్పుడు రక్తి కట్టిందా లేదా అనేదే ప్రధానం. ఈ పరీక్ష , ఈ అనుభూతి ఎప్పుడూ నిత్యనూతనమే. అందుకని కళాకారుడెప్పుడూ ఈ అంశం, ఈ కళ నా సొంతమేలే అని ఉపేక్ష వహించే వీలులేదు . కళని నిలబెట్టుకోవాలి అంటే నిరంతర సాధన కొనసాగవలసిందే.

--

మీరు ఇంత వరకూ రూపకల్పన చేసిన లేదా దర్శకత్వం వహించిన ప్రదర్శనలున్నాయా?

--

ఇదివరకు తెలుగు సమితుల్లో నాటికలు రూపకాలు వేసినప్పుడు ఉండేవి, నేనే రాసి, దర్శకత్వం వహించటం, అన్నీ. నాట్యంలో నాకింకా అంత శక్తి రాలేదు. దానికి కొంత తపస్సు అవసరం. ఏదో ఒక పాటకి, ఒక కీర్తనకి కొన్ని అడవులు, కొన్ని ముద్రలు (చేతులతో పట్టే భంగిమలు) కూర్చి నాట్య రచన చెయ్యొచ్చు; అదేం పెద్ద విషయం కాదు గానీ కృతి మొత్తంగా ఒక కళాత్మకమైన సౌందర్యానుభూతి (aesthetic fulfillment) ఉండాలి. అది సాధించటానికి కావాలి తపస్సు.

--

కుతూహలం కొద్దీ అడుగుతున్నాను; మీ ప్రదర్శనలకు ప్రేక్షకులు ఎవరు? వారి నేపథ్యాలు సాధారణంగా ఏమైవుంటాయో తెలుసుకోవాలనుంది.

--

ముఖ్య ప్రేక్షకులు మిత్ర పరివారాలే :-)

ఏనార్బర్ నగరంలో సామాజిక వాతావరణం మిగతా అమెరికన్ సమాజానికి భిన్నంగా ఉంటుంది. చిన్న ఊరు, పెద్ద విశ్వవిద్యాలయం, చుట్టూతా బాగా అభివృద్ధి చెందిన పారిశ్రామిక రంగం వలన ఆర్ధికంగా బలమైన మధ్యతరగతి వర్గం, ఇవన్నీ కలిసి కళలకాణాచిగా రూపుదిద్దాయి ఈ నగరాన్ని. జనాభా కూడా అంతర్జాతీయమే. విశ్వవిద్యాలయంలో వివిధ విభాగాలవారు దేశ విదేశాలకి సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అందుచేత ప్రజలకి కొంత అంతర్జాతీయ చైతన్యం ఉంది. తమకి అనుభవం కాని కొత్త కళారూపాల్ని ఆహ్వానించి ఆస్వాదించే తత్త్వం ఉంది.

మా గురువుగారు పాల్గొనే ఇతర కార్యక్రమాల ద్వారా ఆమెకి ఏర్పడిన స్నేహితులు మా ప్రదర్శనల గురించి తెలుసుకుని హాజరవుతుంటారు. గత మేలో జరిగిన కార్యక్రమానికి స్థానిక దినపత్రిక వర్ణ చిత్రం వేసి మరీ ప్రదర్శన వివరాలు ప్రచురించింది. అలా అమెరికను ప్రేక్షకుల నిష్పత్తి ఎక్కువే మా ప్రదర్శనల్లో. వీరిలో చాలా మందికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో భారతీయ సంస్కృతితోనో, లేక ప్రాచ్య మత, సాహిత్య, కళల సాంప్రదాయాలతోనో ఏదో కొంత పరిచయం ఉంటుంది. చాలా మంది యోగా చేస్తుంటారు. బౌద్ధ ధ్యాన అనుయాయులు కూడా ఎక్కువే. మరి కొందరు ఆచార్యులు, విద్యార్ధులు భారతదేశానికి సంబంధించిన ఏదో ఒక విషయాన్ని అధ్యయనం చేస్తున్నవారున్నారు.

ఇక మా నాట్య బృంద సభ్యుల కుటుంబాలు మిత్రులు సరేసరి. వాళ్ళ ప్రోత్సాహం మాకు శ్రీరామ రక్ష. ఇవ్వాళ్టి సినీనాయికలు

------------
రానారె భరతవాక్యం 
నాట్య కళతో పరిచయము లేని నాకు, మీతో సంభాషణ ఆ కళను అభ్యాసం చేయడంలోనూ ప్రదర్శించడంలోనూ వున్న కృషిని గురించి కొంతైనా అవగాహన కలిగించింది. కళను మరింతగా ఆస్వాదించేందుకు ఇలాంటి అవగాహన అవసరమనుకొంటాను. కళాకారుని ప్రతిభ క్షణికమేనంటున్న మీ నుండి మరిన్ని సంగతులను అడిగి తెలుసుకోవాలనుంది. త్వరలోనే ఆ అవకాశం వస్తుందని ఆశిస్తాను. ఆలోగా నేను "నను పాలింప.." కృతిని ఆ ఇద్దరి గాత్రాల్లో వినడమున్నూ, ఆర్.ఎస్. సుదర్శనం గారి మధుర మీనాక్షి కథనూ చదవడమున్నూ చేసి వుంటాను. :) నాట్యంలో మీ ప్రవేశం, మీ గురువుగారు, సహాధ్యాయ బృందం, ప్రేక్షకులు, మదురై, విజయవాడలలోని బడుల్లో మీ అనుభవాలు ఓపికగా తెలియజేశారు. ధన్యవాదాలు. నాటికలకే కాక నాట్య రూపకాలకు కూడా దర్శకత్వం వహించగల శక్తినిచ్చే తపస్సు మీకు సాధ్యం కావాలని కూడా ఆకాంక్షిస్తూ... శెలవు.

Comments

మాలతి said…
ఈరోజు తీరిగ్గా కూర్చుని చదివేను. చాలా బాగుంది ఇంటర్వ్యూ. చాలా చక్కగా చెప్పేరు. మీ కృషి అభినందనీయం.