మగ నర్తకులు - 1

మొన్న ఫేస్బుక్కులో నిడదవోలు మాలతిగారి కబుర్లతో ఈ ఆలోచనల తుట్ట కదిలింది. పైగా ఆవిడ ఒక బ్లాగు టపా రాసేశారు కూడానూ. ఇక నాకు రాయక తప్పడం లేదు.

తప్పడం లేదంటే నాకు ఇష్టం లేని విషయ మనుకునేరు. నాకు చాలా ఇష్టమైన విషయం, నేను స్వయంగా భరతనాట్యం అభ్యసించినవాణ్ణి. మా చుట్టుపక్కల నన్ను తెలిసినవారిలో - పరవాలేదు, నాట్యం బాగానే చేస్తాడు అన్నంత పేరు కూడా తెచ్చుకున్న వాణ్ణి. అటుపైన వివిధ సందర్భాల్లో కొందరు గొప్ప నర్తకులతో కొంత సన్నిహితంగా మెలిగే అవకాశం కూడా తటస్థించింది. ఆ అనుభవాలు పంచుకుంటే బావుంటుంది అనిపించింది.

అర్జున్ రైనా అని ఇతను పంజాబీ అబ్బాయి. ఢిల్లీ లో పుట్టి పెరిగాడు. నాకు కనీసం చిన్నప్పటి నించీ నాట్య ప్రదర్శనలు చూసిన అనుభవమైనా ఉంది. ఇతగాడికి అది కూడా లేదు. మొత్తానికి ఇతను ఎలాగో ఇంగ్లీషు సబ్జక్టుగా చదివి థియేటర్ ఆర్ట్స్ లో పట్టా పుచ్చుకున్నాడు. బాగా ఉత్సాహం ఉన్నవాడు, ప్రతిభావంతుడూ కావడంతో ఏదో విద్యార్ధి వేతనం సంపాయించి ఇంగ్లాండు వెళ్ళి అక్కడ ఏదో షేక్స్‌పియరు నాటక కంపెనీ బడిలో ఉన్నత శిక్షణ పొంది ఢిల్లీ తిరిగి వచ్చాడు.

అడపా దడపా నాటకాలు వేస్తున్నాడు ఢిల్లీలో. అతనికి సుమారు ముప్పయ్యేళ్ళ వయసప్పుడు కథాకళి ఎదురయింది.  తాను కూడా నేర్చుకుంటానంటే ఆ మాస్టరుగారు ఎకసెక్కెంగా నవ్వకుండా (ఎందుకంటే, సాంప్రదాయబద్ధంగా కథాకళి నేర్చుకునేవాళ్ళు చాలా చిన్న వయసులో మొదలు పెడతారు), ఇతనిని తీసుకుని కళ నేర్పించాడు.

అర్జున్ అయినా సామాన్యుడు కాదు. సుమారు అయిదేళ్ళ కాలంలోనే మంచి విద్య నేర్చుకున్నాడు. తాను మునుపు నేర్చుకున్న షేక్స్‌పియరియన్ థియెటరుని కథాకళికి అనుసంధించి అనేక షేక్స్‌పియరు నాటకాలను కథాకళి ప్రదర్శనలుగా తయారు చేయించాడు. కథకు డయలాగులకు తగినట్టుగా మలయాళంలో పాటలు రాయించడం, సంగీతం కట్టించడం. దేశ విదేశాల్లో పలు ప్రదర్శనలు ఇచ్చి మన్ననలు పొందాయి అతని నట బృందాలు. ముఖ్యంగా మెక్బెత్, ఒథెల్లో నాటకాలు చాలా పేరు తెచ్చి పెట్టాయి.

నేను ఏనార్బర్ లో, ఎసోసియేషన్ ఫర్ ఇండియాస్ డెవలప్మెంట్ (ఎయిడ్) అనే స్వచ్చంద సంస్థతో పని చేస్తున్న కాలంలో గాంధీగారి జన్మదినానికి దగ్గరలోని ఒక శుక్రవారం నాడు ఇండియా డే అనే పేరిట ఒక బహిరంగ ఉత్సవం జరిపే వాళ్ళం. మిషిగన్ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ముఖ్య గ్రంధాలయానికి ముందు డయాగ్ అని పిలువబడే విశాలమైన గచ్చు చేసిన చావిడి ఉంది. ఆ చావిట్లో మాకు చేతనైన ఒక సాంస్కృతిక ప్రదర్శన ఒకటి జరిపించే వాళ్ళం. ఆ డయాగ్ గుండా వచ్చే పోయే వాళ్ళకి మా సంస్థ గురించిన కరపత్రాలు పంచుతూ మా కార్యకలాపాల గురించి చెప్పే వాళ్ళం. చేతులకి గోరింటాకు పెట్టడం, గచ్చు మీద రంగు సుద్దముక్కలతో ముగ్గులు వెయ్యడం - ఇలాంటివి ఏవేవో చాలా చేసేవాళ్ళం.

మొత్తానికి ఒకసారి ఎలాగో మాకు ఈ అర్జున్ రైనా తగిలాడు. ఆయన ఊళ్ళో ఎవరో వారి బంధువుల్ని చూడ్డానికి వచ్చాడు. అమెరికా దేశంలో కొన్ని వూళ్ళల్లో కథాకళి సోలో ప్రదర్శనలు ఇచ్చాడు, కానీ ఏనార్బరుకి అతను ప్రదర్శనలు ఇవ్వడానికి రాలేదు. అయినా ఎలా మా కాంటాక్టులోకి వచ్చాడొ నాకిప్పుడు గుర్తు లేదు కానీ తనంత తనే వచ్చి, మీరు నాకేం డబ్బులివ్వక్కర్లేదు. గాంధీ పేరిట మీరు ఈ దేశంలో ఈ పని చేస్తున్నారంటే అది నాకు గర్వకారణం. మీ స్టేజి మీద ఒక అరగంట టైం ఇవ్వండి చాలు, అన్నాడు. డబ్బులక్కర్లేదు అన్న వాడు మాకు పరమాప్తుడు. వెంటనే ఒప్పేసుకున్నాం.

మా మిషిగన్లో అక్టోబరు మొదటి వారం అంటే వాతావరణం ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. అబ్బా సమ్మరింకా అయిపోలేదూ అనిపించేటంత ఎండగానూ ఉండొచ్చు. హమ్మయ్యో అప్పుడే వింటరా అనిపించేట్టు మంచు వాన కురిసినా కురవచ్చు. రెండూ నాకు అనుభవమే. సరే, ఆ రోజు రానే వచ్చింది. ఒక మాదిరి తీక్షణమైన సూర్యకాంతితో తెల్లారింది. గాలి చల్లగా ఉంది కానీ మా కార్యక్రమ మంతా ఆరుబయట నిండు సూర్యకాంతిలో చేస్తున్నాం కాబట్టి కొంచెం బానే ఉన్నదనిపించింది. సుమారు పదవుతుండగా రైనా గారొచ్చేశారు, ఒక పెద్ద సూట్కేసు తోసుకుంటూ. ఆయన కోసం కొంచెం పక్కగా ఉన్న చెట్టు కింద బల్ల ఏర్పాటు చేశాం. అక్కడ ఆయన బోషాణం తెరిచి మెల్లగా కథాకళి పాత్రగా రూపాంతరం చెందటం మొదలెట్టాడు. పదకొండు కావొస్తుండగా పడమటి దిక్కు నించి నల్ల మేఘాలు కమ్ముకొచ్చినై. చూస్తూ చూస్తూ ఉండగానే ఉష్ణోగ్రత అథః పాతాళానికి పడిపోయింది. గాలి మొదలైంది. మా వాళ్ళు తొందర తొందరగా తమ తమ కార్యక్రమాలన్నీ చుట్టచుట్టేశారు.

నేను హడావుడిగా రైనా గారి దగ్గరికెళ్ళి - అప్పటికే ఆయన మేకప్ 90 శాతం పూర్తయింది. ఏవండీ, వాతావరణం బావుండలేదు, పోనీ కేన్సిల్ చేసేద్దాం, అన్నా. ఆయన తాపీగా ఒక సారి ఆకాశం వేపు చూసి, ఎలాగూ మేకప్పంతా వేసుకున్నాగా! మీకు అభ్యంతరం లేకపోతే నేను ప్రదర్శించ దల్చుకున్నది ప్రదర్శిస్తాను, అన్నారు. నేను నిర్ఘాంత పోయాను. కానీ కాదని ఎలా అనగలను? మా బృందం చిన్న అత్యవసర సమావేశం పెట్టుకుని ముందుకు పోవడానికే తీర్మానించాం. ఇంతలో సన్నగా మంచు వాన మొదలైంది. అంటే స్నో ఫ్లేక్స్ కాదు. నీటి బిందువులు గడ్డ కట్టేసి ఐసు తుపరలాగా పడుతుంది. మా వాడొకడు దగ్గర్లో ఉన్న తన లాబ్ కి పరిగెత్తి ఒక పెద్ద సైజు టార్పాలిన్ తెచ్చాడు. ఇంతలో రైనా గారి మేకప్ పూర్తయింది. మా కళ్ళ ముందు ఒక సంపూర్ణమైన కథాకళి పాత్ర (పచ్చై వేషం) ప్రత్యక్షమైంది.


నలుగురం టార్పాలిన్ ని విప్పి, నాలుగు కర్రలకి తగిలించి ఒక పందిరిలాగా ఎత్తి పట్టుకున్నాం. తెచ్చుకున్న లౌడ్ స్పీకర్ లో కథాకళి సంగీతం మొదలైంది. భారతీయ సాంప్రదాయ నృత్యం ఏదైనా వట్టి పాదాలతో, పాదరక్షలేవీ లేకుండా చెయ్యాలని వేరే చెప్పక్కర్లేదనుకుంటా. వేషధారణలో భాగంగా వొంటి పై భాగం మీద పొరలు పొరలుగా చాలా చొక్కాలు వేసుకున్నాడు కాబట్టి అంతవరకూ పరవాలేదేమో గాని, మంచు వానకి గురై గడ్డ కట్టేంత చల్లగా ఉన్న ఆ గచ్చు నేల మీద ఆయన నాట్యం మొదలు పెట్టారు. భరతనాట్యం, కూచిపూడిలాగా వేగవంతమైన జతులు అవీ ఉండవు కాబట్టి అది కొంత నయం. కానీ అదే శాపం కూడా - ఒక్కొక్క తీవ్రమైన భావ ప్రకటన చెయ్యాల్సినప్పుడల్లా రెండు పాదాలూ కదలకుండా స్థిరంగా నేల మీద ఉంచి కేవలం చేతుల కదలిక, ముఖ కవళికల కదలికతో నటించాలి. అస్సలు ఏ మాత్రం హడావిడి లేకుండా, తాను చేస్తున్నదాన్ని పూర్తిగా ఆస్వాదిస్తూ, తన కళకి పూర్తి న్యాయం చేకూరుస్తూ సుమారొక నలభై నిమిషాలు నాట్యం చేశారాయన. తాను రూపొందించిన మేక్బెత్ నాటకం నుంచి ఒక ఏకపాత్రాభినయం, ఊరుభంగ నాటకంలో భీముని పాత్ర చేశారు.

అది మధ్యాన్న భోజన సమయం గనక, వాతావరణం బాగు లేకపోయిన కొన్ని వందల మంది ఆ డయాగ్ లో అటూ ఇటూ తిరుగుతూ ఉన్నారు. అందులో సుమారు ఓ ఇరవై మందయినా నిలుచుండి పోయి ఆ ప్రదర్శన చూశారు, మా బృందం కాక. కచేరీ పెడితే, అక్కడ హాల్లో పట్టుమని పదిమంది ప్రేక్షక శ్రోతలు లేకపోయినా కళాకారులు హాలు పూటుగా ఉన్నట్టే భావించుకుని పూర్తి స్థాయి ప్రదర్శన ఇవ్వడం నాకు అనుభవమే. కానీ - దేశం కాని దేశంలో, ఆరు బయట, ఒక పక్కన మంచు కురుస్తుంటే, గడ్డ కట్టేంత చల్లగా ఉన్న నేల మీద నాట్యం మాత్రం - నేను చూడ్డం అదే మొదలూ ఆఖరూనూ.

Here is Sri Arjuna Raina's personal website.

An interview in Outlook Magazine

Here's a short video



Comments

Cdr GV Rama Rao said…
It's heartening to hear some artists are dedicated to our arts and ready to brave any weather or impediments. Bravo to Mr. Raina and your whole team. You're made of different stuff, stern and gentle.
GV Rama Rao.