త్యాగరాజస్వామి వారు రామభక్తి పరాయణులని అందరికీ తెలిసిన
విషయమే. ఎందుకు రాముడి పట్లనే భక్తి అని ప్రశ్నవేసుకుంటే సమాధానం చెప్పడం కష్టం.
ఆయన నివాసమున్నది ప్రసిద్ధమైన శివక్షేత్రం తిరువయ్యారు. తిరువయ్యారులో వెలసినది
పంచనదీశ్వర స్వామి. అమ్మవారు ధర్మసంవర్ధిని. ఇది కాక తంజావూరు సీమ అంతటాకూడా,
బృహదీశ్వరాలయంతో మొదలు పెట్టి ఎన్నో గొప్ప శివాలయాలు వెలసి ఉన్నాయి. పైగా ఆయన
జన్మించినది ములకనాటి వైదిక కుటుంబం. అందుచేత చుట్టూతా ప్రబలంగా ఉన్న సంస్కృతి
వల్లనో, లేక ఇంటి ఆచారం వల్లనో ఈ భక్తి అబ్బింది అనుకోవడానికి ఆస్కారం లేదు.
త్యాగరాజుకి చిన్న వయసులోనే ఒక యతీంద్రులు తారసపడి, శ్రీరామ మంత్రాన్ని
ఉపదేశించారని, తద్వారా త్యాగరాజుకి రామభక్తి అబ్బిందనీ త్యాగరాజు జీవిత చరిత్రని
రాసిన చాలా మంది సెలవిచ్చారు. ఇదికాక త్యాగరాజు తండ్రి రామబ్రహ్మం గారివద్ద ఒక శ్రీరామ
పంచాయతన విగ్రహం ఉండేదని, ఆయన దానికి నిత్యపూజలు చేసేవారని, పెద్దకొడుకు సరిగ్గా
చెయ్యడనే ఉద్దేశంతో ఆ రామ పంచాయతనాన్ని చిన్నకొడుకు త్యాగబ్రహ్మానికి ఇచ్చి
నిత్యపూజలు కొనసాగించమని కోరారని ఒక కథ ఉన్నది. ఈ రామపంచాయతనం కొలువు ఇప్పటికీ
త్యాగరాజు సంతతి వారి వద్ద ఉన్నది. ఇవన్నీ కాక, హైందవ సాంప్రదాయంలో
ఇష్టదైవము అనే భావన ఎప్పుడూ ఉన్నదే. శ్రీరాముడి పట్లనే భక్తి యెందుకూ అనడిగితే,
ఎందుకు కూడదూ అని ఎదురు ప్రశ్నయే సమాధానమవుతుంది. ఏదేమైనా, మనకి కావలసిన విషయం
త్యాగరాజుకి శ్రీరాముడి పట్ల అపారమైన భక్తి.
ఈ భక్తి ఎట్లా ఉండేదంటే ఆ శ్రీరాముని దివ్యమంగళ విగ్రహాన్ని
తాను స్వయంగా దర్శించి, ఆ అందాన్ని, ఠీవిని, వైభవాన్ని తన కృతులలో గానం చేశారు
త్యాగరాజస్వామి. రాముడి దర్శనం అంటే ఏవిటి? నిజంగా దేవుడు రాముడి వేషం వేసుకుని
త్యాగరాజు ముందు ప్రత్యక్షమయ్యాడా? లేక త్యాగరాజు తన మనసులో ఊహించి రాశారా?
ఇటువంటి తార్కికమైన ప్రశ్నల్ని కాసేపు పక్కన పెట్టి, కృతుల సాహిత్యాన్ని
పరిశీలిద్దాము. మోహన రాగంలో ఉన్న ఈ కృతి శ్రీరామ దర్శన వైభవాన్ని వర్ణించే కృతులలో
తలమానికంగా ఉన్నది.
పల్లవి|| నను పాలింప నడచి వచ్చితివో
నా ప్రాణనాథా
అనుపల్లవి|| వనజ నయన, నీ మోము జూచుటే
జీవనమని
నెనరున మనసు మర్మము దెలిసి
చరణం|| సురపతి నీలమణి నిభ తనువుతో,
ఉరమున ముత్యపు సరుల చయముతో
కరమున శర కోదండ కాంతితో
ధరణితనయతో త్యాగరాజార్చిత
సులభమైన, లలితమైన పదాలతో హాయిగా ఉన్నట్టు ఉన్నది గదా? పల్లవి
చివర నా ప్రాణనాథా అన్న సంబోధనలోఉన్నది ఈ కృతి కీలకం అంతా. జీవుడైన వాడికి ప్రాణం
మూలం. ప్రాణం లేక జీవం లేదు. ఆ ప్రాణానికి నాథుడు పరమాత్మ. ఈ పరమాత్మ అంటే ఎవరో
కాదు, ప్రాణరూపంగా జీవుడిని నడిపిస్తుండే చైతన్యమే. అంటే అన్ని జీవులలో లోపలి
చాఇతన్యంగా అదృశ్యంగా నిరాకారంగా ఉన్న ఆ ప్రాణనాథుడు ఇవ్వాళ్ళ త్యాగరాజుని
పాలించడానికి నడిచి వచ్చాడు. పురాణాల్లో ప్రాణహాని భయంతో ఉన్న గజరాజునో, మానహాని
జరగబోతున్న ద్రౌపదినో రక్షించడానికి వచ్చినట్టుగా హడావుడిగా రాలేదు. మెల్లగా,
నింపాదిగా "నడచి" వచ్చాడు. దీని సంగతేవిటో అనుపల్లవిలో తెలుస్తుంది.
అనుపల్లవి యెత్తుగడ, త్యాగరాజు ఆ ప్రాణనాథుణ్ణి వనజనయనా అని
సంబోధించడంతో, నిరాకారుడైన పరమాత్మని సాకారుడైన శ్రీమహావిష్ణువు అవతారంగా
గుర్తిస్తున్నారు. వెంటనే "నీ మోము" అనడం ఈ సాకార రూపానికి ఒక
స్ఫుటత్వాన్నిచ్చి ముందటి చరణానికి పునాది వేస్తున్నది. ఆ దివ్యమైన ముఖాన్ని
చూడాలనే త్యాగరాజు మనసులోని గాఢమైన కోరికని తెలుసుకుని, గుర్తించి, ఆమోదించి, ఆ
కోరిక తీర్చడానికి కదిలి వచ్చాడు స్వామి. అది కూడా "నెనరున" .. అంటే
ప్రేమతో, అభిమానంతో. త్యాగరాజుకి, ఒక మహాభక్తునిగా, తన ఇష్టదైవాన్ని కన్నులారా
చూడాలని గాఢమైన కోరిక ఉన్నది నిజమే. కానీ, ఆయన ఎటువంటి ప్రమాదంలోనూ లేరు స్వామి
వచ్చి కాపాడడానికి. ఇది చాలా ముఖ్యం. మనసు మర్మము తెలిసిన ప్రాణనాథుడు వచ్చాడంతే,
అది ఆయన భక్తితో కూడిన అంతర్ముఖమైన ఉపాసనకి ఫలితమన్నమాట.
పల్లవిలో ప్రాణనాథా అని సూచనప్రాయంగా చెప్పి, అనుపల్లవిలో
వనజనయనా అని మరికాస్త స్పష్టమైన రూపాన్ని చూపి చరణంలో పూర్తిగా
సాక్షాత్కరింపజేస్తున్నారు త్యాగరాజు. ఆ వచ్చినవాడు సురపతి, దేవాధి దేవుడు.
ఇంద్రనీలమణితో సరితూగే శరీరకాంతితో వెలుగుతున్నాడు. ముత్యాలహారాలు విశాలమైన ఛాతీని
అలంకరించి ఉన్నాయి. చేతిలో ధనుర్బాణాలు మెరుస్తున్నాయి. పక్కనే అవనీ తనయ సీతాదేవి
అంటి పెట్టుకుని ఉన్నది. విల్లమ్ములు ఆ వచ్చినవాడు మహావీరుడని చెప్పడమే కాదు, ఆయన
రక్షకుడు, రక్షించడానికి వచ్చాడు అని చెబుతుంటే, స్వామివారి వెంటనే అమ్మవారు ఉండడం
ఒక మెత్తదనాన్ని ఆపాదిస్తున్నది. ఈ సందర్భం యుద్ధ సందర్భం కాదు, వచ్చినది
ఉపాసకుడైన ఒక మహాభక్తుణ్ణి అనుగ్రహించడానికి, పల్లవిలో చెప్పినట్టు పాలించడానికి
వచ్చారనే మృదువైన శాంతభావాన్ని సూచిస్తున్నది.
నారదమహర్షి ప్రవచించిన భక్తిసూత్రాలలో
స్వామి గుణగణాల పట్లనూ, స్వామి రూప సౌందర్యం పట్లనూ బలమైన అనురక్తి కలిగి ఉండడం
భక్తి మార్గంలో మొదటి మెట్లుగా చెప్పారు. ఆదిశంకరులు మొదలుకొని మహాభక్తులెందరో
తమతమ ఇష్ట దైవ స్వరూపాల గుణగణ రూప సౌందర్యాలను కీర్తించారు. త్యాగరాజు తనలో సహజంగా
ఉత్పన్నమయిన భక్తికి తోడుగా వేదశాస్త్రాలనూ, పురాణాలనూ క్షుణ్ణంగా అభ్యసించారు.
భక్తికి పెద్దపీట వేసిన భాగవతపురాణాన్ని ప్రత్యేకంగా అభిమానించారు. నారదమునినీ,
భక్త రామదాసునీ తన ఆధ్యాత్మిక గురువులుగా భావించి పూజించారు. వారి మార్గమే తన
మార్గమని చెప్పుకున్నారు. ఈ ప్రస్తావన అనేక కృతులలో వినిపిస్తుంటుంది. అలా గురువుల
నించి అలవరుచుకున్న భక్తిని తన ఉపాసనతో బలోపేతం చేసి, అలౌకికమైన తన సంగీతంలో
రంగులద్ది పరమాద్భుతమైన ఆవిష్కరించారు. శ్రీరామ దివ్యవిగ్రహాన్ని అభివర్ణించే
త్యాగరాజ కృతులన్నిటిలోనూ ఈ లక్షణం కనిపిస్తుంది.
మోహనరాగం సహజంగానే సమ్మోహన
పరిచేటట్లుగా ఉంటుంది. సంగీతం పెద్దగా పరిచయంలేనివారయినా ఆ రాగమాధుర్యానికి
ముగ్ధులవుతారు. త్యాగరాజస్వామి మోహనరాగంలో ఎన్నో కృతులు రచించారు, అన్నీ
సమ్మోహనంగా ఉంటాయి కానీ ఈ కృతిలో ఆ సమ్మోహనంతో పాటు ఒక మృదు గంభీరమైన ఠీవి ఒకటి
ధ్వనిస్తుంది. విని చూడండి.
ఎస్. నారాయణస్వామి, డిట్రాయిట్, యూ
ఎస్ ఏ.
kottapali@gmail.com
Comments