మోహన రామా - రామావతార యోగ రహస్యము



త్యాగరాజస్వామివారు వాల్మీకి మహర్షి అవతారమని చాలా మంది భావిస్తుంటారు. రామాయణం మొత్తాన్ని తన కృతులలో తిరిగి రచించారని చెబుతుంటారు. మనకి లభిస్తున్న కృతులలోనే చూస్తే ఎన్నో రామాయణ ఘట్టాలు కనిపించడం వాదనకి కొంత బలం చేకూరుస్తున్నది. రామాయణం సంగతేమోగాని, ఒక్క కృతిలో మాత్రం స్వామివారు రామావతారం జరగడానికి వెనుక కథని అతి మనోహరంగా చెప్పారు. అదే మోహనరాగంలో చేసిన మోహనరామా అనే కృతి.
మోహన రామా, చంద్రుణ్ణి కూడా జయించే అందమైన ముఖం కల రామా, మాతో ముద్దుగా పలకవయ్యా. మొదటి దైవమైన రామయ్యా, నువ్వే కావాలి అనే కోరిక మొలకెత్తినదయ్యా!
భూమిపై నీవు అవతారమెత్త బోయే శుభసందర్భం ఆసన్నమైనదని తెలిసి, కిన్నర కింపురుషాదిగా గల తేజోమూర్తులు, ఇంద్రుడు, బ్రహ్మ, సూర్యుడు, చంద్రుడు మొదలైన దేవతలు అందరూ వివిధ రూపాలతో పక్షులుగా, మృగాలుగా, వానరులుగా, తాముకూడా భూమిపై పుట్టి, నీపై ప్రేమలో కరగి పోతూ చాలా కాలం పాటు మైమరచి నిన్ను సేవిస్తూ ఉండిపోయారయ్యా! కొండ మీద కొలువయ్యున్న సీతాపతే, ధన్యుడైన త్యాగరాజునికి వరములిచ్చేవాడా! సకల సృష్టినీ మోహింపజేసే రామయ్యా!
స్థూలంగా చెప్పుకుంటే, కృతి అర్ధం ఇది. భక్తిభావంతో కొంచెం లోతుగా చూస్తే త్యాగరాజస్వామికి మాత్రమే సాధ్యమయ్యే ఒక భావసుందరమైన చమత్కారం కనబడుతుంది. రావణ సంహారం మానవరూపంలోనే జరగాలి, అందుకు శ్రీమన్నారాయణుడు మనిషిగా భూమి మీద జన్మించాలి అని పురాణ కథ. దేవతలంతా కూడా భూమి మీద జటాయువు, జాంబవంతుడు, సుగ్రీవుడు ఇలా వివిధ రూపాలలో పుట్టారు స్వామికి సహాయంగా. వాళ్ళ పిచ్చికానీ, ఎంత మానవ రూపం ఎత్తినా, దేవదేవునికి వీళ్ళ సహాయం కావాలా? వాళ్ళకి చేతగాకనే కదా ఆయన్ను శరణు జొచ్చింది! మొదటిదైవమా అని సంబోధించి ఆయన ఈశ్వరత్వాన్ని సుస్థిరం చేశారు త్యాగరాజు. అసలు విషయం ఏవిటంటే ఆయన వైకుంఠంలో పాలసముద్రంలో శేషతల్పశాయిగా పవళించి ఉన్నప్పుడు వీళ్ళందరూ ఆయన చుట్టూ ఉండి, ఆయన్ను కీర్తిస్తూ, ఆయన కరుణా కటాక్షపు జల్లుల్లో తడుస్తూ హాయిగా ఉండేవాళ్ళు. ఇప్పుడాయన వైకుంఠాన్ని వదిలి భూమి మీదికి వెళ్ళాలంటే మరి వీళ్ళగతేమి కాను! దేవుళ్ళ కాలమానం ప్రకారం మానవ జన్మ కాలపరిమితి చాలా చిన్నదే అయినా, కాస్త వ్యవధి కూడా వాళ్ళెవరూ స్వామిని విడిచి ఉండడానికి ఇష్టపడక వాళ్ళందరూ కూడా భూమి మీద వివిధ రూపాలలో పుట్టారు, స్వామిని సేవించుకుందామని.
పైగా ఆయన మోహన రాముడు. పుంసాం మోహన రూపాయ అని వర్ణించాడు వాల్మీకి మహర్షి శ్రీరాముణ్ణి. సమ్మోహన పరచడం శ్రీరాముడి ముఖ్యమైన లక్షణాల్లో ఒకటి. అది కేవలమూ భౌతికమైన అందం గురించి కాదు. తన మాటలతో, చేతలతో, ప్రవర్తనతో మొత్తంగా ఆయన మనల్ని ముగ్ధుల్ని చేసేస్తుంటాడు. సమ్మోహన లక్షణానికి దేవతలు కూడా అతీతులు కారని త్యాగరాజస్వామివారి భావం. ఇంకో వేదాంత పరమైన విషయం ఏవిటంటే విష్ణువు అంటే సర్వాంతర్యామియైన పరమేశ్వర భావం. ఇందుగల డందులేడని సందేహము వలదు! అట్లాంటి నిరాకార నిర్గుణ తత్త్వం ఇప్పుడు భూమి మీద సగుణ సాకార రూపమై శ్రీరామునిగా వెలిసింది. సగుణ రూపం అనగానే దాంట్లో ఏదో ఒక వంక, ఒక లోపం ఉండకుండా ఉండదు. కానీ ఈయన మాత్రం సగుణ రూపం ధరించినా అటువంటి వంకలూ శంకలూ ఏవీ లేకుండా మోహన రాముడై వెలుగొందడం ఆయన సాక్షాత్తూ పరమాత్మ కావడం వల్లనే చెల్లింది. అలా అనుపల్లవిలో ముందు మోహన రామా అని పిలిచి, వెంటనే మొదటి దైవమా అనటం శోభించింది.
ఇదంతా ఇలా ఉండగా, ఇందులోనే యోగ విద్య గూఢార్ధముగా ఉన్నది.
సృష్టినంతటినీ నడుపుతున్న చేతనా శక్తి మానవుడిలో వెన్నెముక కింది చివర కుండలినీ రూపములో నిద్రాణమై ఉన్నది. ఇది మూలాధార చక్రం. పంచ భూతములలో భూమి దీనికి ఆశ్రయమైనది. చేతనా శక్తియే సర్వాంతర్యామి కూడా కాబట్టి ఇదే మొదటి దైవం. మానవుడు సాధకుడైనప్పుడు మూలాధారమనే సారవంతమైన భూమిలో మొదటి దైవము పైన ప్రేమ నాటుకుని మొలకెత్తుతుంది. పైకి ఎదుగుతున్న మొలక వివిధ చక్రాలను దాటుతూ పయనిస్తుంది. బ్రహ్మ, సూర్య, చంద్రాది దేవతలు ఆయా చక్రాలకు అధిష్ఠాన దేవతలు. వారూ ఎదుగుతున్న, పైకి పాకుతున్న ప్రేమ అనే మొలకను వృద్ధి చేస్తూ ఉన్నారు. అలా దేవతల సహాయంతో ఆరు చక్రాలలోనూ జాగృతమైన కుండలినియే శక్తి స్వరూపిణియైన సీత. సీతావరుడైన శ్రీరామచంద్రుడు గిరిపై కొలువున్నాడు అంటే సహస్రార కమలం వికసించింది అన్నమాట. పరమ పదాన్ని చేరే ప్రయత్నంలో సాధకుడే కాదు, ఆయా చక్రాలను ఆశ్రయించి ఉన్న దేవతలు కూడా కరగి పోయి పరమాత్మ తత్త్వంలో లీనమై పోతున్నారు. ఇదంతా ముందు మూలాధారములో ప్రేమ బీజం పడి మొలకెత్తి, దాన్ని అత్యంత శ్రద్ధతో చిరకాలం పోషించినప్పుడే సాధ్యపడుతుంది సుమా! మనలను మన మానానికి వదిలివెయ్యకుండా ఎప్పటికప్పుడు "నీవు చెయ్యవలసిన పని ఇది" అని మనలను ప్రేరేపించే ఆకర్షణే మోహన రాముడు.

విధంగా పైకి పురాణకథను చెబుతున్నట్టు కనబడుతూ త్యాగరాజస్వామి యోగమార్గము కూడా భక్తి మార్గము తోటిదేకాని దానికి భిన్నమైనది కాదని మనకి కృతిద్వారా బోధిస్తున్నారని నాకు తోచినది.

Comments

తృష్ణ said…
బావుందండి.
Anonymous said…
Very nice delineation Narayanswamy garu. Thoroughly enjoyed reading your interpretation of this beautiful composition. - Mukthesh Nandigama
Narayana Swamy garu, very nice and beautiful explanation of the keertana from various view points. Thoroughly enjoyed reading.


Murali Lanka
chavera said…
చాలా బాగుంది
Anonymous said…
అద్భుతంగా ఉంది మాటల్లేవంతే.

..అయినా సరే, రామాయణంలో అన్నీ భూతులే. చన్నులూ తొడలే. కావాలంటే మా మూర్ఖాళ్ల రంగునాయకక్కని అడగండి :)
durgeswara said…
చాలా చక్కగాఉంది పరిశీలన

జైశ్రీరాం
FourthEstate said…
Tyagaraya Yoga Vaibhavam annamaata!

Ento baaundi.

Meeto matladalani chala yella korika.Abhyantaram lekapote email cheyyandi dayachesi.

Namassulu
sreedevi
Kottapali said…
Fourth Estate Sreedevi garu,
Where am I supposed to email?
murali said…
very interesting