ఎవరో చెప్పిన కథలు - జ్ఞాపకార్ధం

జ్ఞాపకార్ధం
సూ జువాంగ్ చెప్పిన కథ

మొన్నామధ్యన నా కూతురు వాళ్ళ గళ్ స్కౌట్ బృందంతో కేంపుకి వెళ్ళొచ్చింది. కేంప్ బాగా జరిపినందుకు కృతజ్ఞతా సూచకంగా బృంద సభ్యులందరూ కలిసి, వాళ్ళ నాయకురాలికి ఒక చిన్న బహుమతి ఇచ్చారు. లెదర్మేన్ అనే కంపెనీ చేసినది, అనేక స్టెయిన్లెస్ స్టీల్ పనిముట్లు ఒకే పిడికి బిగించి ఉన్న పరికరం అది. అందులోనే రెండు రకాల స్క్రూ డ్రైవర్లు, ఒక కత్తి, ఒక కత్తెర, ఇలాంటివున్నాయి. అందులో ఆ బుల్లి కత్తెరని చూడగానే నా చిన్నప్పుడు నాదగ్గరుండిన ఒక మెరిసే బుల్లి కత్తెర గుర్తొచ్చింది.

మా అమ్మానాన్నలకి నేనొక్కత్తినే బిడ్డని. మేం చైనాలో ఉక్కు కర్మాగారాల నిలయమైన ఒక ఉత్తరప్రాంతపు పారిశ్రామిక నగరంలో ఉండేవాళ్ళం. మా నాన్న మాత్రం ఎక్కడో కొన్ని వందల మైళ్ళ దూరంలో ఏదో ఊళ్ళో పని చేసేవాడు. తనకి కావలసిన ఉద్యోగం ఎంచుకునే స్వేఛ్ఛ ఆయనకి లేదు. ఎప్పుడో సంవత్సరానికో సారి ఆయన మా ఊరొచ్చి, ఓ పదిరోజులు మాతో గడిపి వెళ్తూ ఉండేవాడు.

ఒకసారి ఆయన వస్తున్నాడని మా అమ్మా నేనూ రైలు స్టేషనుకి వెళ్ళాం. ఆయన రైలు పెట్టెలోంచి దిగాడు. బట్టలు నలిగిపోయీ, మొహం వడలిపోయీ, కళ్ళు ఎర్రగా వాచి ఉన్నాయి, నలభై గంటల పైబడిన రైలు ప్రయాణం వల్ల. ఐనా, మమ్మల్ని చూడంగానే చిన్నగా నవ్వి, నన్ను దగ్గరికి రమ్మన్నట్టు చేతులు చాచాడు. నేను ఎవరో కొత్తవాళ్ళని చూసినట్టు భయపడిపోయి మా అమ్మని కరుచుకుపోయాను. ఆయన చిన్నగా నిట్టూర్చి తన జేబులోనించి మెరిసే ఒక చిన్న వస్తువుని బయటికి తీసి నా వేఫు చాచాడు. జంకుతూనే వెళ్ళి తీసుకున్నాను. హేండిల్ మడత పెట్టబడే బుల్లి కత్తెర. వెండితో చేసినట్టు మెరిసిపోతోంది. దాన్ని అందుకుని నేనెంత మురిసిపోయానో. మేలు రకం వస్తువులు నాకు అందుబాటులోకి రావడం అదే మొదలు. బీజింగ్‌లో రైలు మారడంకోసం వేచి ఉన్న సమయంలో అక్కడ నాకోసం కొన్నానని నాన్న తరవాత చెప్పాడు.

అప్పటిదాకా నాకంటూ ఉన్న ఆట వస్తువులు చెయ్యి విరిగిపోయిన ప్లాస్టిక్ పాప బొమ్మఒకటి, సొట్టలు పడిన ఒక రేకు లారీ, ఓ రెండు గోళీలు - ఇవే. మా యింటో అసలు కత్తెర లేదు. ఎప్పుడన్నా మా యింటి పైన ఉండే వాళ్ళ దగ్గర్నించి మా అమ్మ అరువు తెస్తుండేది. అది నల్లటి లోహంతో చేసిన పేద్ద కత్తెర. దాంతోనే ఆయన చేపల తలకాయలు కత్తిరించేవాడు. దాంతోనే మా అమ్మ తన పాత చొక్కాని కత్తిరించి నాకు గౌనులు కుట్టేది. ఇట్లాంటి బుజ్జి ముచ్చటైన కత్తెర నేనెప్పుడూ చూళ్ళేదు.

నేనే కాదు, నా తోటి మిత్రులు కూడా ఎవరూ చూళ్ళేదు. ఆ కత్తెర ఎప్పుడూ నాతోనే ఉండేది. అందరూ దాన్ని ముట్టుకోడానికి, పట్టుకోడానికి, కాగితమో దారమో కత్తిరించుకోడానికి అడిగి తీసుకోవాలనీ నాతో స్నేహం చేశారు. ఎప్పుడైనా నా స్నేహితురాలింటికి వెళ్తే, అక్కడ వాళ్ళ నాన్న ఆ అమ్మాయితో ఆడుతుంటే, నేను నిశ్శబ్దంగా నా లాగూ జేబులో నా కత్తెరని నిమిరేదాన్ని - వెంటనే మా నాన్న నా పక్కనే ఉండి నా భుజమ్మీద చెయ్యేసినట్టుగా ఉండేది. ఎప్పుడూ జేబులో వేసుకుని తిరుగుతూ ఉండటం వల్ల ఒక్కోసారి జేబులోనే మడతపెట్టిన కత్తెర తెరుచుకుని, నా జేబుకి చిరుగు పడ్డం, నా తొడ గీరుకోవడం కూడ జరిగింది, కానీ దాన్ని నేను వదిలి పెట్టలేదు.

ఇంత ప్రాణంగా చూసుకుంటూ ఉన్నా, కొన్నేళ్ళ తరవాత నేను ఏ ఎనిమిదో తరగతి చదువుతూ ఉండగానో, ఆ కత్తెర కాస్తా పోనే పోయింది. గళ్ స్కౌట్ కార్యక్రమం ఐపోయాక, నేనిలా ఈ జ్ఞాపకాల వెల్లువలో కొట్టుకుపోయి, నాకు మా నాన్న ఇచ్చిన కత్తెర గుర్తుగా అలాంటిదే ఒకటి కొని నా కూతురికి ఇచ్చాను. నానించి ఇంకో కానుక అనుకోకుండా వచ్చినందుకు అది సంతోషించినట్టే కనబడింది కానీ ఆ కత్తెరని కూడా తనదగ్గర ఇప్పటికే కుప్పలకొద్దీ పేరుకుని ఉన్నఆటవస్తువుల్లో పడేసింది.

మా నాన్నకిప్పుడు తొంభయ్యేళ్ళు. ఆ రోజున అకస్మాత్తుగా నాకోసం ఆ కత్తెర కొనాలని ఆయనకి ఎందుకు అనిపించిందో, అసలది నాకోసం కొన్నాడో, ఇంకెందుకన్నా కొన్నాడో - ఆ కత్తెర వెనక ఏమన్నా కథ ఉన్నదో - మా నాన్ననెప్పుడూ అడగలేదు. బహుశా ఎప్పుడైనా అడుగుతానని ఆయన ఎదురు చూస్తున్నాడేమో?

Comments

Raj said…
మంచి జ్ఞాపకం... అసలు జ్ఞాపకం ఎప్పుడూ మంచిదేలెండి.. నా చిన్నప్పుడు కోడిగుడ్డు ఆకారంలో ఉన్న కంచం, నాన్నగారు నాకు ఇచ్చిన పులి డిజైన్ స్వెటరు... ఇవీ గొప్ప జ్ఞాపకాలు. ఎండాకాలంలో కూడా ఆ స్వెటరుని వొదిలేవాణ్ణి కాదు... Good One Sir..
మంచి కధ. అవసరానికి మించి ఉండే వస్తువుల వల్ల అలవాటయ్యే నిర్లక్ష్యం కదా. నేను ఐదో తరగతి చేదివేటప్పుడు. గుండు సూది కూడా అరుదైన వస్తువే, అది గాని దొరికిందా కుంచె చీపురు పుల్ల కాగితం తో గాలికి తిరిగే ఫ్యాన్ చేసి రోజంతా ఆడేవాడిని. అలాగే రబ్బర్ బ్యాండ్ దొరికేతే దారం కట్టి కాగితం రాకెట్ లాంచర్ చేసేవాడిని. అరుదుగా దొరికే ఏదైనా అత్యంత విలువైనదే. ఇప్పటి పిల్లలకి ఏమి కొనిచ్చిన గంట మించి మోజు ఉండదు. అవసరానికి మించి దొరికితే వచ్చే నిర్లక్షం !! ఇంకొన్ని కధా జ్ఞాపకాలు అనువదించండి స్వామి గారు !! ధన్యవాదములు.
Madhu Pemmaraju said…
'Nanna naa pakkanundi bhujam thadiminattundedhi' - intha China kadhalo pedda papanchanni chooparu.
Kottapali said…
కామెంటిన అందరికీ నెనర్లు.

ఇక్కడ Sun అని ఒక పత్రిక వస్తుంది. అందులో ప్రతి సంచికలోనూ పాఠకులు రాసిన కొన్ని నిజజీవిత కథనాలు ఉంటాయి. ఇది అందులో ఒకటి.
నాకు నచ్చిన మరి కొన్ని కథనాలను తెలుగులో రాసి ఇక్కడ పెడతాను.
అవన్నీ ఇలాగే "ఎవరో చెప్పిన కథలు" శీర్షిక కింద ఉంటాయి.
జ్ఞాపకాలెప్పుడూ జీవితాన్ని చూపిస్తూ ఉంటాయి. మంచి ప్రయత్నం నారాయణ స్వామి గారు. మొన్నామధ్య రీడర్స్ డైజెస్ట్ ఓ ఒక వ్యాసం చదివాక నాకూ ఇలా తెలుగులో అనువదించి బ్లాగులో పంచుకోవాలని అనిపించింది.
Sanath Sripathi said…
chaalaa baagundi narayana swamy garu. :-)