ఒక సంభాషణ
(వారి కోరికపై పేరు ప్రచురించడం లేదు)
నాకు
ఐదేళ్ళప్పుడు టాన్సిల్స్ ఆపరేషన్ జరిగింది. ఆ రోజుల్లో పిల్లలెవరికైనా
చీటికి మాటికి జలుబు, రొంప, పడిసం లాంటి
ఇంఫెక్షన్లు పడుతూ
ఉంటే, అంటే 1950లలో, టాన్సిల్స్ తీసెయ్యడం
సర్వధారణంగా జరుగుతుండేది. ఇప్పుడంటే టాన్సిల్స్ వల్ల శరీరానికి కొంత
రోగనిరోధక శక్తి ఏర్పడుతుందని పరిశోధన
ఫలితాల వల్ల డాక్టర్లు నమ్ముతున్నారు
గానీ, ఆ రోజుల్లో పరిస్థితి
వేరు, అప్పటి పద్ధతులు వేరు.
నన్ను
ఆపరేషన్కి
సిద్ధం చేసేందుకు మావాళ్ళు నాకో బొమ్మల పుస్తకం
తెచ్చారు. Peter Ponsil
Lost His Tonsil అని దాని పేరు. అందులో
టాన్సిల్స్ అంటే ఏంటి, ఎలా
ఉంటాయి అని రంగురంగుల బొమ్మలున్నాయి.
నా అంతవయసే ఉన్న పీటర్ అనే
పిల్లాడు, హాస్పటల్లో పీటర్ చుట్టూతా దేవదూతల్లాంటి
నర్సులూ, దేవతల్లాంటి డాక్టర్లూ ఉన్నారు. అందరూ చిర్నవ్వులు చిందిస్తున్నారు.
ఆపరేషన్ అయిపోయాక పీటర్ వాళ్ళ ఇంటికెళ్ళిపోయి,
వాళ్ళ అమ్మా నాన్నా లాలిస్తూంటే
హాయిగా అయిస్ క్రీం తింటూ,
వచ్చిన బహుమతుల్తో ఆడుకుంటూ చాలా ఆనందంగా ఉన్నట్టు
తరవాత బొమ్మల్లో చూపించారు. ఎటొచ్చీ అసలు ఆపరేషను వ్యవహారం
గురించి మట్టుకు ఏం చెప్పలేదు అందులో.
ఆపరేషన్కి
ముందు రోజు సాయంత్రం మా
వాళ్ళు నన్ను ఆసుపత్రికి తీసుకెళ్ళారు.
అక్కడ కొంతసేపుండి, నన్నొక నర్సుకి అప్పగించి వాళ్ళు ఇంటికెళ్ళిపోయారు. ఇలా జరుగుతుందని పీటర్
పుస్తకంలో ఉంది కాబట్టి నేను
కొంత సమాధానపడ్డాను. కానీ ఐదేళ్ల వయసులో
మా వాళ్ళు నన్ను ఒంటరిగా వదిలి
వెళ్ళడం వాళ్ళని నన్ను కూడా కొంతైనా
ఆందోళనకి గురిచేసే ఉంటుంది. ఆ రాత్రి ఒక
పెద్ద హాల్లో టాన్సిల్ ఆపరేషన్ కోసమే హాస్పటల్కి వచ్చిన మరికొంత
మంది పిల్లల్తో గడిపాను.
మర్నాడు
ఉదయం నర్సులు ఒక్కొక్క పిల్లాణ్ణి హాల్లోంచి చక్రాలమంచం మీద తీసుకెళ్ళడం. కొంత
సేపయ్యాక నిద్రపోతున్న పిల్లాడితో సహా మంచాన్ని దొర్లించుకుంటూ
వెనక్కి తీసుకురావడం. ఈ తతంగమంతా గమనిస్తూ
మిగతా పిల్లలమందరం మేకపోతు గాంభీర్యంతో మా వంతుకోసం చూస్తున్నాం.
నా వంతు రానే వచ్చింది.
ఆపరేషన్ చేసే గదిలోకి తీసుకెళ్ళారు.
ఎవరో ఒక పెద్ద కప్పులాంటి
దాన్ని నా మొహం మీద
బోర్లించారు. ఒక ఘాటైన తియ్యటి
వాసనతో నా ముక్కులు దిమ్మెక్కుతున్నాయి.
ఇలా జరుగుతుందని నాకెవరూ చెప్పలేదు. పీటర్ పుస్తకంలో దీన్ని
గురించి లేదు.
"ఏవండీ,
ప్లీజ్ ఈ కప్పు నా
మొహమ్మీంచి తీసెయ్యండి," అనడిగా చాలా మర్యాదగా. ఎవ్వరూ
ఏం మాట్లాడలేదు. కప్పుని తీసెయ్యలేదు. నేనే తీసేద్దామని చెయ్యి
కదిపాను. అంతే. కొన్ని బలమైన
చేతులు నా చేతుల్నీ కాళ్ళనీ
తలనీ మంచానిఖేసి అదిమిపట్టాయి. నేను గట్టిగా కేకలు
పెడుతూ విదిలించుకోడానికి ప్రయత్నించాను. కానీ ఏమీ లాభం
లేదు. ఆ తియ్యటి వాసన
నా మొహమంతా నిండి ఊపిరి తిత్తుల్లోకి
వెళ్ళిపోయింది. నాకు స్పృహ తప్పింది.
ఆపరేషన్
వల్ల మిగిలిన గొంతు నొప్పికానీ, తరవాత
మావాళ్ళు చూపించిన లాలన కానీ, ఇచ్చిన
బహుమతులుకానీ ఇన్నేళ్ళ తరవాత నాకిప్పుడు గుర్తు
లేవు. కానీ, ఆ బలమైన
చేతులు నన్ను కదలకుండా నొక్కి
పట్టి ఉంచడం - అప్పటి
నా నిస్సహాయత - అక్కడ ఎవరూ నన్ను
ఊరడించేందుకు ఒక్క మాటైనా అనక
పోవడం - నాకు ఇప్పటికీ గుర్తుంది.
ఆ రోజుల్లో పేషెంటుకి మట్టుమందు ఎక్కించేందుకు ఇది సాధారణంగా ఉపయోగిస్తుండిన
పద్ధతి. సన్నటి వైరు బుట్టమీద సర్జికల్
గాజు పరిచిందే నా మొహం మీద
కప్పిన కప్పు. అలా మొహమ్మీద బోర్లించి
ఆ గాజు గుడ్డమీద చుక్క
చుక్కగా ఈథర్ ద్రవాన్ని వదులుతారు.
ఆ ఈథర్ సులభంగా ఆవిరవుతుంది
గనక పేషెంటు పీల్చుకునే గాలితో కలిసి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి
మత్తు కలిగిస్తుంది. ఆపరేషన్లకి మత్తు పదార్ధంగా ఈథర్
వందేళ్ళకి పైగా వాడుకలో ఉంది.
కానీ ఇది అతి సులభంగా
నిప్పంటుకుంటుంది - ఇదో పెద్ద సమస్య
దీనితో. 1950లలోనే ఒక బ్రిటీషు
శాస్త్రవేత్త ఈథర్ అణువులకి క్లోరిన్,
బ్రోమిన్ వంటి హేలొజెన్ పరమాణువుల్ని
సంధించి హేలోథేన్ అనే ద్రవాన్ని తయారు
చేశాడు. ఇది అచ్చు ఈథర్లాగానే
మత్తు కలిగించేది కానీ నిప్పంటుకునేది కాదు.
కొద్ది సంవత్సరాల్లోనే చాలా ఆసుపత్రుల్లో దీన్ని
వాడ్డం మొదలు పెట్టారు మత్తుమందుగా.
ఐతే అప్పుడొక కొత్త సమస్య. హేలోథేన్
తీసుకున్న పేషెంట్సులో కొద్దిమందికి (30,000 మందిలో ఒకరు) తీవ్రమైన హెపటైటిస్
(ఒక మాదిరి కామెర్లు, కాలేయపు జబ్బు) జబ్బు చేసి చనిపోతుండేవారు.
గణాంకాలు చూస్తే హేలోథేన్ వల్ల హెపటైటిస్ వచ్చి
చనిపోయినవారికంటే ఈథర్ విస్ఫోటనల్లో చంపోయినవారు
చాలా తక్కువ. మరి ఏ విద్య
శాఖ, ఏ వైద్యాధికారి ఈ
కొత్తమందుని ఆమోదించారయ్యా అంటే? ఎవ్వరూ కాదు!
ఆసుపత్రుల్ని బీమా చేసే ఇన్సూరెన్సు
కంపెనీలు - మీరీఉ గనక ఈథర్
వాడినట్లైతే అగ్నిప్రమాదాలకి మేము బీమా చెయ్యము
- అని భీష్మించుకు కూర్చుంటే
ఆసుపత్రులు చచ్చినట్టు హేలోథేన్కి
మారక తప్పంది కాదు. ఇదంతా 1950 లనించీ
1970లవరకూ జరిగిన కథ. అటుపైన ఇంకా
కొత్త మత్తుమందులు కనిపెడుతూనే ఉన్నారు. అవి పని చేస్తూనే
ఉన్నాయి. వాటి వల్లకూడా ఏవో
కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తూనే
ఉన్నాయి. ఏవీ పెర్ఫెక్ట్ కాదు.
అద్వితీయమైన మత్తుమందు కోసం అన్వేషణ ఇంకా
జరుగుతూనే ఉంది.
సరే,
మళ్ళీ నా కథకొద్దాం. నేను
హైస్కూల్లో ఉండంగా సముద్రం మీద బోటు షికారు
వెళ్ళాను ఒకసారి నా తోటివారితో. కొంతమంది
నీళ్ళ లోతుల్లోకి డైవింగ్ చేస్తున్నారు. తలనంతా కప్పి ఉంచే హెల్మెట్
పెట్టుకుని నీళ్ళలోకి వెళ్ళడం. పైన బోటు మీదనించి
ట్యూబుద్వారా హెల్మెట్లోకి
గాలిని సరఫరా చేస్తుంటారు. అలా
డైవుచేసిన మనిషి చాలా సేపు
నిళ్ళలోతుల్లో ఉండి, అక్కడి జీవరాశుల్నీ,
వింతలు విశేషాల్నీ చూడచ్చు. నా మిత్రుల ప్రోద్బలంతో
నేనూ సిద్ధమయ్యాను. ఆ హెల్మెట్ని నా తలపైన
పెడుతూండగానే నాకు లోలోపల్నించి విపరీతమైఅన్
భయం తన్నుకొచ్చింది. హెల్మెట్ని
తీసెయ్యడానికి ప్రయత్నించాను. కానీ అది కదల్లేదు.
ఒక వందటన్నుల బరువున్నట్టుగా అనిపించింది. తీసెయ్యండి, నాకొద్దు అని గట్టిగా కేకలు
పెట్టాను. నాకు సాయం చేస్తున్న
పెద్దాయన హెల్మెట్ని
తీసేశాడు. అంతే, అక్కడే కూలబడిపోయి,
ఏదో ప్రాణాంతకమైన అనుభవం జరిగినట్టు రొప్పుతూ వొణికిపోతూ ఉండిపోయాను.
చాలా
ఏళ్ళ తరవాత నాకు అర్ధమయింది
- నా తలని కప్పే ఏ
అనుభవాన్నీ నేను తట్టుకోలేననీ, ఈ
భయానికి మూలకారణం నా చిన్నప్పుడు జరిగిన
టాన్సిల్ ఆపరేషన్లో
నా మొహమ్మీద బలవంతంగా బోర్లించిన ఆ ఈథర్ కప్పు
అనీ తెలుసుకున్నాను.
ఈ అనుభవాలూ, ఈ అవగాహనా నన్నొక
గొప్ప ఎనస్థీషియాలజిస్టుని చేశాయి, నేను నా ప్రాక్టీసులో
నా పేషెంట్లతో ఇంకా సెన్సిటివ్గా ఉంటాను, నా
చిన్నప్పుడు నాకు మత్తెక్కిచ్చిన డాక్టరుకంటే
- అని నాకు నేను భావించుకుంటూ
ఉంటాను.
కాని
అది పుర్తిగా నిజం కాదు.
కాదని
నా పేషెంట్ గెయిల్ అనే అమ్మాయి నిరూపించింది.
నా చిన్నప్పటి అనుభవం వల్ల నేను నా
పేషెంట్స్ని
ముందే కలిసి వాళ్ళ పాత
హిస్టరీ, ఇంతకు ముందేమైనా సర్జరీలు
అయినాయా, ఎలాంటి మత్తుమందు వాడారు, ఇలాంటివన్నీ కనుక్కుంటాను. వాళ్ళకేవన్నా ప్రశ్నలుంటే జవాబులు చెప్పి వాళ్ళని ఊరడించే ప్రయత్నం చేస్తుంటాను. అలాగే ఆపరేషనుకి ముందు
గెయిల్ని
కలిసి మాట్లాడాను. ఆమెని ఆమె భర్త
విపరీతంగా కొట్టేవాడు. అతని హింసలు భరించలేక
ఆమె పారిపోయి ఒక రక్షణగృహంలో తలదాచుకుంది.
అతను ఎట్లాగో ఆ ఇంటి ఎడ్రసు
సంపాదించి ఆమెని వెతుక్కుంటూ వచ్చాడు.
తనతో పాటు ఇంటికొచ్చెయ్యమని బతిమాలాడు.
ఆమె ఒప్పుకోకపోయేటప్పటికి రివాల్వర్ తీసి కాల్చాడు. గుండు
ఆమె జబ్బలోంచి దూసుకు పోయి ఎముక ముక్కలు
ముక్కలుగా చిన్నాభిన్నమయింది. నేను గెయిల్ని చూసేటప్పటికి అతన్ని
అరెస్టుచేసి విచారించి జెయిల్లో పెట్టారు.
గెయిల్
అప్పటికే ఒక ప్రాణభీతికరమైన అనుభవాన్ని
చవిచూసింది. ఇప్పుడు మళ్ళీ అటువంటి అనుభవం
(సుదీర్ఘమైన ఆపరేషన్) ని ఎదుర్కుంటున్నది. నేను
ఆమెతో చాలా మార్దవంగా మాట్లాడుతూ,
ధైర్యం చెబుతూ ఆమె ఆరోగ్యపరిస్థితినంతా తెలుసుకుంటూ అతని
శిక్ష ఎన్నాళ్ళు అని అడిగానామెని. రెండేళ్ళు
అని చెప్పింది. ఈ లోపుగా ఒక
పిస్టల్ కొనుక్కుని దాన్ని ఉపయోగించడం నేర్చుకోవాలి నువ్వు అన్నాను ఆమెతో. నాలో నాకు తెలియకుండానే
ఆమె మాజీ భర్త పట్ల
కోపం పెల్లుబికి పోతూ ఉన్నది. అంతే.
అప్పుడప్పుడే కాస్త రిలాక్స్ అవుతున్న
మనిషి కాస్తా ముడుచుకుపోయింది. అటుపైన గెయిల్ నాతో ఊ - ఆ
అని తప్ప మాట్లాడలేదు. ఆపరేషన్
జరిగేప్పుడు నేను నీ పక్కనే
ఉంటాను, అన్నీ జాగ్రత్తగా చూస్కుంటాను,
అంతా సవ్యంగా జరుగుతుంది, నీకేం భయంలేదు - ఇలా
చాలా ధైర్య వచనాలు చెప్పాను.
ఆ పూటా, ఇక ఆపరేషను
బల్లమీద స్పృహతప్పే దాకా ఆమెని హింసపెట్టే
భయభూతాలేవో వాటిని గెయిల్ ఒక్కతే ఎదుర్కుంది. నాగొంతు ఆమెకి ఎప్పుడోనే వినపడ్డం
మానేసింది.
ఎంతో
జాగ్రత్తగా పేర్చుకుంటూ వచ్చిన పేకమేడలాంటిది పేషెంట్ విశ్వాసం. అజాగ్రత్తగా అన్న ఒక్క మాటతో
ఉఫ్ అని ఊదినట్టు కూలిపోగలదు.
ఆ తరవాత మనుషుల్ని గురించి,
వాళ్ళ భయాల్ని గురించీ ఇంకొంచెం నేర్చుకున్నాను. మామూలుగా తిరిగే ఏ మనిషికైనా తన
శరీరాన్ని పూర్తిగా ఇంకొకరికి (డాక్టరుకైనా) స్వాధీనం చేసెయ్యడం ఇష్టం ఉండదు. ఆ
స్వాధీనం తప్పడం, ఆ అశక్తత కొందరికి
విపరీతమైన భీతి కలిగిస్తుంది. కొందరికి
మెల్లగా స్పృహ తప్పటం ఇష్టముండదు. కొందరికి అకస్మాత్తుగా స్వాధీనం తప్పితే భయపడతారు. కొందరికి సూది అంటే భయం.
నాలాగా కొందరికి మొహం మీద ఏదన్నా
పరిస్తే భయం. అలా నేర్చుకున్న
విషయాల్ని నా ప్రాక్టీసులో వాడుతున్నాను.
రెండేళ్ళ
రాక్సానా. ఎంతో ముద్దుగా ఉన్న
పాప. పెద్ద పెద్ద ఆకుపచ్చరంగు
కళ్ళు, పట్టులాంటి బ్లాండు జుట్టు. నా చిన్నప్పటిలాగానే పాపం
ఏదో చెవికి సంబంధించిన ఇంఫెక్షనుతో చిన్న సర్జికల్ ప్రొసీజరు
కోసం ఆసుపత్రికి తెచ్చారు. నా జేబులోంచి ఒక
బుల్లి టెడీ బేర్ని తీసి, చూడు
రాక్సానా! ఈయన మిస్టర్ బేర్.
పాపం ఈయనకి కూడా నీకు
లాగానే చెవి నొప్పంట. ఈయనక్కూడా
రేపు ఆపరేషన్ చేస్తారు. ఈయనకి భయంగా ఉందంట.
నువ్వు కొంచెం బుజ్జగిస్తావా? అనడిగా. రాక్సానా చెయ్యిచాపి బొమ్మని తీసుకుని దాని వేపు జాలిగా
చూసి, ముద్దు పెట్టుకుని చంకనేసుకుంది.
రాక్సానాని
నా డెస్కు దగ్గరికి తీసుకెళ్ళా. బేర్ గారికి ఆపరేషన్
చేసేముందు మత్తెక్కించాలి. ఏం చేస్తే బాగుంటుంది
అంటావ్? ఇంజెక్షను ఇద్దామా? ముక్కు మీద మాస్క్ పెడదాంఆ?
అనడిగా. రాక్సానా వయసు పిల్లలకి సాధారణంగా
ఇంజెక్షను సూది అంటే ఎక్కువ
భయం ఉంతుంది. నేను అనుకున్నట్టే రాక్సానా
మాస్క్ని
ఎంచుకుంది.
ఆపరేషను
గదిలో రాక్సానా పొట్ట మీద, ఆమెకి
కనబడేట్టు బేర్ బొమ్మని ఉంచాను.
బొమ్మకి కూడా ఒక చిన్న
మాస్క్ తగిలించాను. నూరు శాతం ప్యూర్
ఆక్సిజెన్ ప్రవహిస్తుండగా సర్జికల్ మాస్క్ని
రాక్సానా మొహమ్మీద మెల్లగా ఉంచాను. ఆమె భయపళ్ళేదు కానీ,
మొహమ్మీద మాస్క్ ఉండడం ఆమెకి నచ్చలేదు.
నీకు నచ్చలేదా, ఐతే తీసేస్తానులే అని
మాస్క్ని
కొంచెం పక్కకి జరిపి పూర్తిగా మత్తుమందు
(నైట్రస్ ఆక్సైడ్, లాఫింగ్ గేస్) ప్రవహింప చేశాను.
నేను మాస్క్ తీసేస్తున్నాననే రాక్సానా అనుకుంది. ఇంతలోనే ఆమె కళ్ళు మూతలు
పడినాయి. ఆమె మెల్లగా స్పృహ కోల్పోతున్నది.
సరైన వాయువుల మిశ్రమాన్ని సెట్ చేసి మాస్క్ని
మళ్ళీ రాక్సానా మొహమ్మీద అమర్చాను. ఆపరేషన్ సులభంగా జరిగిపోయింది.
అన్నేళ్ళ
క్రిందట, నాకు ఆపరేషన్ జరిగినప్పుడు
నాకు మత్తు ఇచ్చిన ఎనస్థీషియాలజిస్ట్
ఈ మాత్రం తన పేషెంట్ భయాన్ని
అర్ధం చేసుకుని ఉంటే .. .. అప్పుడప్పుడూ
ఆ ఆలోచనలో పడిపోతుంటాను.
పాలపిట్ట 2011 లో ప్రచురితం
Comments
interesting and educative.the job of an amaestheologist is risky and responsible.