మరో పండుటాకు రాలిపోయింది - ఓ తరం ముగిసిపోయింది

మా పెద్దమ్మ శంకగిరి సీతాలక్ష్మి ఫాల్గుణ శుద్ధ పాడ్యమి నాడు శివసాయుజ్యం పొందారు.

మా పెద్దనాన్నగారి వివాహం ఎప్పుడు జరిగిందో నాకు స్పష్టంగా తెలియదు, కానీ సుమారు 1950 ప్రాంతాల్లో జరిగి ఉండవచ్చు. పెళ్ళై కాపురానికి వచ్చినప్పటినించీ, తన తుది శ్వాస వరకూ అరవయ్యేళ్ళకి పైగా శంకగిరి కుటుంబానికి మూలస్తంభంగా నిలబడ్డారు. ఐదుతరాలకి సేవచేశారు. ఆమె ప్రేమని కన్నీటితో గుర్తు చేసుకుంటున్నాను ఈ వేళ.

వాళ్ళ నాన్నగారు బాగా చదువుకున్నవారు, ఆ రోజుల్లో కోయంబత్తూరులో హైస్కూలు హెడ్ మాస్టరుగా పని చేసేవారు. సీతాలక్ష్మి స్కూలు ఫైనలు చదువుకుని సంగీతం బాగా నేర్చుకున్నారు. మా పెద్దనాన్నగారు, గణపతిగారితో వివాహమయ్యాక అత్తవారింటికి సేలం వచ్చారు కాపురానికి. సేలం రెండవ అగ్రహారం ముఖ్య వీధిలో వంశపారంపర్యంగా వస్తూ ఉండిన మండువా ఇల్లు. మా నాయనగారి నాయనమ్మ ఇంటికి ముఖ్య అధికారిణి (ఆవిడ పేరు కూడా సీతాలక్ష్మియే). ఆ పెద్దావిడ అజమాయిషీ కింద ఈ కొత్తకోడలు ఇంటిపని, వంటపని, మడి, ఆచారం అన్నీ నేర్చుకున్నది. తరవాత తరాలు మారినా, అలవాట్లు మారినా, ఆవిడ తన పద్ధతులు మాత్రం మార్చుకోలేదు. తనకి చేతనైనంతలో పాత పద్ధతుల్లోనే పనులు చేసుకునేవారామె. అలాగే నాయనమ్మగారినీ, తన అత్తమామలనీ కడతేర్చారు ఆ ఇంటిలోనే.

దురదృష్టవశాత్తూ, ఆ దంపతులకి సంతానం కలుగలేదు. అందుకని మమ్మల్ని, ఇతర కజిన్ల పిల్లలనే సొంత పిల్లలుగా చూసుకునే వారు. నా చిన్నప్పుడు ఏ రెండు మూడేళ్ళకో ఒకసారి వేసవి సెలవలకి సేలం పోయి ఒక నెలరోజులు ఉండి వచ్చేవాళ్ళం. చుట్టుపక్కల ఊళ్ళనించి చాలా మంది కజిన్సు వచ్చి వాలేవాళ్ళు. ఆవిడకి తెలుగు బొత్తిగా రాదు. నాకు అరవం అంతంత మాత్రంగా వచ్చేది. తెలుగు, అరవం, ఇంగ్లీషు కలిపి కొట్టిన ఒక వింత మిశ్రమంతోటే మేం సంభాషించేవాళ్ళం.

ఆవిడ ఇంట్లో సంగీత పాఠం చెప్పేవాళ్ళు. అప్పుడప్పుడే సంగీతం రుచి తెలుసుకుంటున్న నాకు ఇది చాలా బాగుండేది. క్లాసు జరిగే గది బయటనే తచ్చాడుతూ ఉండేవాణ్ణి. విద్యార్ధులు వెళ్ళిపోయాక నాకు నచ్చిన వరుస యేదో గట్టిగా పాడేవాణ్ణి అప్పుడప్పుడూ. నేను పద్ధతిగా నేర్చుకోక పోవడం వల్ల శ్రుతి నిలిచేది కాదు, అపస్వరంగా పలికేది. వేంటనే వంటింట్లోంచి పెద్దమ్మ అరిచేవాళ్ళు. పోనీ ఆ ఉన్న నెలరోజులైనా నేర్పుతాను నేర్చుకో అనే వాళ్ళు కానీ అదేమిటో జంకు. ఎప్పుడూ ఆవిడ దగ్గర కూర్చుని నేర్చుకోలేదు.

తిరుచిరాపల్లి రేడియో స్టేషనుకి గ్రేడెడ్ ఆర్టిస్టు. అప్పుడప్పుడూ ఆవిడ కచేరీలు ప్రసారమయ్యేవి. అంతే కాక మా పెదనాన్నగారి మిత్రులైన కొందరు భాగ్యవంతుల కూతుళ్ళకి భరతనాట్య ప్రదర్శనలకి కూడా గాత్ర సహకారం అందించేవారు. సన్నగా తీగలాంటి గొంతు. పాత పద్ధతిలో నేర్చుకోవటం వల్ల, బాగా లోపలినించి బలంగా వచ్చేది ఆవిడ కంఠం. అందుకని ఆవిడ పాటలో ఒకే సమయంలో మాధుర్యమూ, శక్తీ రెండు కలిసి ఉండేవి. మా యింటికి విజయవాడ వచ్చినప్పుడూ మా నాయన గారు ఒక బహిరంగ కచేరి చేయించారు 1970లలో. మనోరమ హోటలు యజమాని గారు ఆమెకి మృదంగ సహకారం ఇచ్చారు ఆ రోజున వచ్చినవారంతా బాగా ప్రశంసింఆరు.

మా నాయనగారి అకాల మరణంతో మా పెద్దనాన్న పెద్దమ్మ మా అమ్మగారికి అండగా ఉన్నారు మేం పెద్దవాళ్ళమయ్యే వరకూ. ఉన్న ఊళ్ళు దూరమైనా, ఉత్తరాల ద్వారానే మా కుటుంబానికి ఎంతో ధైర్యం ఇచ్చారు ఆ దంపతులు. మేమందరం పెద్దవాళ్ళమైన తరవాత పెళ్ళిళ్ళు ఇతర శుభకార్యాలన్నీ వాళ్ళ చేతుల మీదుగానే జరిగాయి. నేను సంపాదన పరుణ్ణయిన తరవాత ఒకటి రెండు సార్లు సేలం వెళ్ళి, వాళ్ళిద్దర్నీ సినిమాకి తీసుకు వెళ్ళి, వస్తూ వస్తూ ఆనందవిలాస్ హోటల్లో బటర్ రోస్టు ఊతప్పం భోజనం ట్రీట్ ఇప్పించి ఇంటికి రావడం నాకో మధురమైన జ్ఞాపకం.

1992లో పెద్దనాన్నగారు పోయిన తరువాత పెద్దమ్మ కోయంబత్తూరు వెళ్ళిపోయారు. అప్పటికీ నేను వెళ్ళినప్పుడల్లా పాత పద్ధతిలోనో భోజనం వడ్డించేవాళ్ళు, విస్తరి తియ్యనిచ్చే వాళ్ళు కాదు. ఎందుకు పెరియమ్మా ఇంకా ఈ మడీ ఆచారం అంటే నవ్వేసే వాళ్ళు. పోయినేడు ఆరోగ్యం బాగా దెబ్బ తినడంతో, మా అన్నయ్య వదినల బలవంతం మీద ముంబాయి అన్నయ్య వాళ్ళింటికి వచ్చేశారు. అన్నయ్య కూడా మంచి సంగీత ప్రియుడు కావడంతో అప్పుడప్పుడూ సంగీతం వింటూ, తమిళ దినపత్రికని ఒక రోజు ఆలస్యంగా చదువుతూ కాలక్షేపం చేస్తూ వచ్చారు. పుట్టినింటికీ మెట్టినింటికీ ఆలంబనగా నిలిచి ప్రేమమూర్తిగా నిండైన జీవితం గడిపారు. ఎప్పుడూ ఎవరినీ పల్లెత్తు మాట అనగా చూడలేదు. మహాశివరాత్రి గడిచాక శుద్ధ పాడ్యమి ఘడియల్లో శివుడి శలవైందని ఆ నాదస్వరూపుడిలో ఐక్యమయ్యారు.

మా అన్న వదినల కర్తృత్వంలో పెద్ద కర్మలు జరుగుతున్న సందర్భంగా మాకందరికీ ఆత్మీయురాలు గౌరవనీయురాలైన పెరియమ్మని తలుచుకుని ఆమె జీవితాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాము.

Comments

తృష్ణ said…
Last sentence was great! Right tribute sir!
మాలతి said…
నాశీ, పెరియమ్మగారి ఆత్మశాంతికోసం ప్రార్థిస్తూ
కాజ సురేశ్ said…
ఆ నాదస్వరూపుని సన్నిధిలోన మీ పెరియమ్మ ఆత్మకు శాంతి కలగాలని ఆశిస్తున్నాను.
ఒకోసారి నాకనిపిస్తుంది ..ఇలా ఎంతో ఆప్తులైన పెద్ద వాళ్ళు పైకెళ్ళిపోతే బాధ పడుతుంటాం కదా ..
మనమే యాభై దగ్గర పడుతూంటే బాధ ని భాద్యత కప్పెస్తుందేమో ...
పెరియమ్మ ఆత్మ శాంతి కలగాలని ప్రార్ధిస్తూ !!
Prasanna said…
My mother read this blog and said it is wonderful .

I remember the days when she used to come for thatha devasam which was done in krishnagiri .

She was a PERFECTIONIST in every work she did . Either be Sangeetham or Samayal (Cookery) .

Your write-up sounded to me like a nearing-kushvant-type-novel .

He is one of the best when he narrates about the past . You can write this in a lengthy manner when you have time .

Prasanna
Ennela said…
పెరియమ్మగారి ఆత్మశాంతికోసం ప్రార్థిస్తూ
శ్రీ said…
పెరియమ్మ గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందామండి.
పెద్దవాళ్ళు ఎక్కడికీ పోరు.. మన జ్ఞాపకాల్లో స్వరంలో లయ లా మమేకమై పోతారు. మనమే వాళ్ళల్లా అయిపోతాం.. మీ పెరియమ్మ పెరియ మనసుకి శాంతి కలగాలని ఆశిస్తూ..
Uma Jiji said…
Sorry for your loss. May they rest in peace.
Sanath Sripathi said…
వారి ఆశీస్సులు మీ ఇంటిల్లిపాది అందరికీ సదా అందుతూనే ఉంటాయి. మీరెంతో అదృష్టవంతులు మొన్న ముంబాయి మీదుగా వచ్చి వెళ్ళారు కనక ఆఖరి చూపుకు మీరు నోచుకున్నట్టే...
narayana swamy
aame uttam illaalani aame mukham cheppaka chepputondi. pandutaakayinaa raalipoyina khaalee bharinchalemu.
Anonymous said…
పోయినోళ్ళు అందరూ తీపి గురుతులే...