పౌర్ణమి నించీ అమావాస్య దాకా - ఆఖరు

రాజమహేంద్రి షెల్టన్ హోటల్ లాబీలో, అధినేత సుధాకర్‌తో
ముందటి పోస్టులో రాజమహేంద్రిలో కలుసుకున్న ఒక విశిష్టమైన వ్యక్తిని గురించి రాయడం మరిచాను. డా కర్రి రామారెడ్డిగారు పేరెన్నిక గన్న మానసికవైద్య నిపుణులు. ఫేసుబుక్కులో వారు ప్రతిరోజూ పోస్టుచేసే హాస్యభరితమైన డిజిటల్ కార్టూనులద్వారా పరిచయమయ్యారు. నేనే కోరి పరిచయం చేసుకున్నాను. తరువాత తెలిసింది డిగ్రీలు సంపాదించడంలో రామారెడ్డిగారి ప్రతిభ. ఆయన అకుంఠిత దీక్షకి నమోన్నమహ అనకుండా ఉండలేం.
డా. రామారెడ్డిగారితో


సోమవారం సాయంత్రం తమ క్లినిక్ దగ్గరనే కలవడానికి ఎపాయింట్‌మెంట్ ఇచ్చారు. సుమారు అరగంట పైగా మాతో గడిపారు. చాలా మృదుభాషియే కాక, చతుర సంభాషణ శీలి. డాక్టరుగా ప్రాక్టీసు పెట్టిన తరవాత, ఇంగ్లీషుబాగా రాదే అనే బాధ మిగిలిపోయిందనీ, అలా తొలిప్రయత్నంగా ఇంగ్లీషు లిటరేచరు ఎమ్మే పరిక్షకి చదివానని, ఇంతాచేసి డిగ్రీ వచ్చింది కానీ ఇంగ్లీషు రాలేదని గట్టిగా నవ్వారు. అలా మొదలైన ప్రస్థానం .. ఇప్పటికి ఎన్ని డిగ్రీలు సంపాదించారో, ఎన్ని వైవిధ్య భరితమైన అంశాలలో డిగ్రీలు పొందారో, ఊహకందని విషయం. ఆయన చదివిన విషయాల్లో న్యాయశాస్త్రం, కంప్యూటర్ సైన్సు, లైబ్రరీ సైన్సు కూడా ఉన్నాయి. పట్టుదల ఉంటే మనిషి ఏదైనా సాధించవచ్చు అనడానికి రామారెడ్డిగారు నిలువెత్తు నిర్వచనం.


విజయవాడలో ఏలూర్రోడ్డుమీద, రామవరప్పాడు రింగ్ రోడ్ క్రాసింగ్ దగ్గరున్న కే హోటల్లో బస చేశాము. హోటలు చాలా బావుంది. గదిలో వసతులు సౌకర్యంగా ఉన్నాయి. వైఫై ఇంటర్నెట్ చక్కగా పనిచేసింది. కిందిఫ్లోరులో ఉన్న రెస్టారెంటులోనే చాలా సార్లు భోజనం చేశాము. భోజనం పరవాలేదు.

బుధవారం పొద్దునపూట టిఫిను తింటుండగా అక్కడ వినాయకప్రసాద్ గారు పరిచయమయ్యారు. ఈయన నాగార్జునా విశ్వవిద్యాలయంలో అథ్లెటిక్స్ కోచ్. అంతేకాక, ఈ ప్రాంతపు గ్రామీణ యువతీయువకులతో వివిధ
శిక్షణ పొందుతున్న కొందరు విద్యార్ధులు
క్రీడలలో జాతీయ పోటీల స్థాయి టీములను తయారు చెయ్యడానికి కంకణం కట్టుకున్నారు. ఆయన సంకల్పానికి చలసాని బలరామయ్యగారి ఆర్ధిక బలం పుష్టినిచ్చింది. హైదరాబాదు వెళ్ళేరోడ్డులో ఇబ్రహీంపట్నం దాటాక, విశాలమైన ఆవరణలో ఒక రెసిడెన్షియల్ క్రీడా ప్రాంగణం రూపు దిద్దుకుంటున్నది. పది పన్నెండేళ్ళ వయసునుండీ గ్రామీణ బాలబాలికలను ఇక్కడ చేర్చుకుని, వారికి ఉచిత భోజన నివాస వసతులత్ పాటు తగిన క్రీడల శిక్షణ ఇస్తున్నారు. వెయిట్ లిఫ్టింగ్, షాట్‌పుట్, డిస్కస్, జావెలిన్, ఇటువంటి క్రీడల్లో శిక్షణ సాగుతున్నది. నన్ను కారులో తీసుకువెళ్ళి, ఈ విశేషాలన్నీ స్వయంగా చూపించి, మళ్ళీ
క్రీడా ప్రాంగణంలో ఉత్టేజకరమైన మ్యూరల్,
వినాయక ప్రసాద్ గారితో
హోటలు దగ్గర దిగబెట్టారు. సరైన యువక్రీడాకారులు లభించి, వారు తగినంత కాలం శిక్షణకు కట్టుబడి ఉంటే, వారిని ఒలింపిక్ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దాలన్నది వినాయక ప్రసాదుగారి ఆశయం. నాకైతే .. ఏదో ఒక అద్భుతమైన ప్రపంచంలోకి వెళ్ళొచ్చినట్లుగా అనిపించింది.

నా చిన్నప్పటి స్నేహితుడు రామకృష్ణ ఆ మధ్యాహ్నమే వచ్చి కలిశాడు. మేం ఒకర్నొకరము చూసుకుని ముప్పయ్యేళ్ళయింది. నాలుగో తరగతి నించీ ఇంటరు దాకా నా
రామకృష్ణతో
క్లాస్మేటు, చాలా తరగతుల్లో నా బెంచిమేటుకూడా. సుమారు ఏడాది కిందట ఫేస్బుక్కు మమ్మల్ని మళ్ళీ కలిపింది. పాండిచ్చేరీనించల్లా నన్ను చూడ్డానికి వచ్చాడు. విజయవాడలో ఉన్న రెండు రోజులూ నాతోనే గడిపాడు. భోజనాలయ్యాక కాసేపు పిచ్చాపాటీ మాట్లాడుకుని రచయిత్రి పి. సత్యవతిగారిని చూడ్డానికి వెళ్ళాం. కథల్లో కొత్త పోకడలని గురించి ఓ గంటన్నర ఇష్టాగోష్టి తరవాత తన కొత్త పుస్తకం "మెలకువ" కానుకగా ఇచ్చారు.

అక్కణ్ణించి బాలాంత్రపు రజనీకాంతరావుగారింటికి వెళ్ళాము. రజనీగారి పెద్దబ్బాయి హేమచంద్రగారు గేటు దగ్గర
రజనీ, నేను, ఖాదర్ మొహియుద్దీన్
కలుసుకుని ఆహ్వానించారు. నిజానికి అది రజనీగారి వియ్యంకులు, హేమచంద్రగారి మామగారు, విజయవాడలో పేరుపొందిన ఆయుర్వేద మందుల సంస్థ అధినేత, స్వర్గీయ డి. ఎల్. నారాయణగారి ఇల్లు. తీరాచేసి మేమే మొదటి అతిధులం. మిగతావారంతా మెల్లగా వచ్చి చేరారు. ప్రముఖ కవి ఖాదర్ మొహియుద్దీన్ గారితో కూడి విజయవాడలో పేరెన్నికగన్న సాహిత్యవేత్తలు చాలా మంది వచ్చారు. రజనీ గారు కూడా సభ జరిగినంతసేపూ మాతో కూర్చున్నారు. మొదట్లో ఇంకా మిగతా అతిధులు రాకముందు వారితో కొలువైతివా రంగశాయి పాటని ప్రస్తావించినప్పుడు వెంటనే గొంతెత్తి పల్లవి, అనుపల్లవి చక్కటి గమకాలతో ఆలపించారు. అద్భుత మనిపించింది. నిజంగా సంగీత సాహిత్యాలను ఉపాసించిన ఋషి ఆయన.

అందరూ వచ్చాక నన్ను నేను సభవారికి పరిచయం చేసుకున్నాను. అందరమూ ఒక వలయాకారంగా కూర్చున్నాము, సభ ఒక చర్చావేదికలాగా జరుగుతుందని నేను అనుకున్నాను కానీ, చాలా మట్టుకి నన్ను అక్కడ కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేసేశారు. తెలుగు సాహిత్యంలో ప్రస్తుత పోకడల దగ్గర్నించీ అమెరికా రాజకీయాలు,
ఆహూతులు
అమెరికాలో సామాజిక ధోరణులు చర్చనీయాంశాలయినాయి. నా అభిమాన ప్రశ్న .. ఎందుకు తెలుగు పుస్తకాల్ని హెచ్చు సంఖ్యలో అమ్మలేక పోతున్నాం .. అని వాళ్ళ ముందుంచాను. ఏవేవో వాదనలు వచ్చాయిగానీ ఈ ప్రశ్నని గురించి ఎవరూ శ్రద్ధగా ఆలోచించడం లేదని నాకనిపించింది. చివర్లో రజనీగారితో నాకో శాలువా కప్పి ఆదరించారు. బయట గేటు దగ్గర వీడుకోళ్ళలో మరికాసేపు ముచ్చట్లాడుకుని ఇక బయల్దేరాం.

మర్నాడు పొద్దున్నే లొయొలా కాలేజికి బయల్దేరాం. రామకృష్ణతో పాటుగా ఫేస్బుక్ మిత్రులు దండమూడి సీతారాం గారు వచ్చి కలిశారు. మా నాన్నగారి శిష్యులు, తదుపరి వారితో కలిసి లొయొలాలోనే జువాలజీ అధ్యాపకులుగా పనిచేసిన ఈఎస్సార్కె ప్రసాదుగారు కాలేజి ఆవరణలోనే వచ్చి
రామకృష్ణ, ఫా. థెకమరి, నేను, ప్రసాద్, సీతారాం
కలుసుకున్నారు. నలుగురము కలిసి ఫాదర్. థెకమరిని వెళ్ళి కలిశాము. ఆయనకి దాదాపు 85 ఉంటాయి కానీ ఇప్పటికీ చురుగ్గా అనేక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మా నాన్నగారు అక్కడ పనిచేసిన రోజుల్లో ఆయనకి చాలా సన్నిహితులు. ఏలమ్నై ఎసోసియేషన్ తరపున అక్కడ చుట్టుపక్కల ఉండే పేదవారి పిల్లలకోసం ఒక ఉచిత స్కూలుని నడుపుతున్నారు. సుమారొక గంటసేపు ఫాదర్ తో గడిపి కొన్ని పాత మధుర జ్ఞాపకాలని కలబోసుకొని, కొత్తగా జరుగుతున్న కాలేజి కార్యకలాపాలను గురించి తెలుసుకున్నాము.

లక్ష్మీనారాయణ, నేను, జొన్నవిత్తుల
పగటి పూట అంతా బంధుమిత్ర సందర్శనం. సాయంత్రం, ఘంటసాల సంగీత కళాశాల ఆవరణలో జరిగిన ఒక సభలో పాల్గొన్నాను. మాతృదేవోభవ అనే పేరిట స్థానిక వ్యాపారవేత్త నరేంద్రగారు సేవాభావంతో ఏర్పాటు చేశారు. అందులో నా క్లాస్మేట్, మిత్రుడు, సిబీయి జేడీ, వివి లక్ష్మీనారాయణ ముఖ్య అతిధిగా పాల్గొంటూ ఉండగా, నేను కూడా ఊళ్ళో ఉన్నానని తెలిసి నన్ను కూడా ఆహ్వానించారు. అలా నా మిత్రుడితో అనుకోకుండా వేదికని పంచుకోవడం చాలా
ఆనందాన్ని కలిగించింది. ప్రముఖ వక్త సత్యవాణి గారు, కవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు కూడా పాల్గొన్నారు. అక్కణ్ణించి మరొక కాలేజినాటి ఆప్తమిత్రుడు నాగేంద్రకుమార్ వాళ్ళింట్లో భోజనం చేసి తిరిగి హోటలుకి చేరుకున్నాం.

మరునాడు ఇనోవా వాహనమెక్కి రోడ్డుమార్గాన బెంగుళూరికి బయల్దేరాము తిరుగు ప్రయాణానికి. విజయవాడనించి చెన్నై వెళ్ళే రహదారి, బాగున్నది కానీ, చాలా చోట్ల క్రాసింగులపైన ఫ్లయ్యోవర్లు కట్టేందుకని డివర్షన్లు పెట్టారు. అంచేత చీరాల దాటే వరకూ ప్రయాణం కొంచెం మందకొడిగానే సాగింది. నెల్లూరులో మంచి మిత్రులున్నారు గానీ ఊళ్ళోకి వెళ్తే ఇంకా ఆలస్యమవుతుందని విరమించుకోవలసి వచ్చింది. అక్కణ్ణించి మెయిన్ రోడ్డు దిగి తిరుపతి బాట పట్టాము. నెల్లూరునుండి తిరుపతి, తిరుపతి నుండి బెంగుళూరు రోడ్ల అధ్వాన్న స్థితిని చూసి చాలా ఆశ్చర్యమనిపించింది.

తిరుపతి చేరేప్పటికి బాగా రాత్రవుతుందని ఊహించి అక్కడ నైటు హాల్టు చెయ్యడానికి నిశ్చయమైంది. వెంటనే
నేను, నామిని, శ్రీమతి ప్రభావతి
మిత్రులు ఉమామహేశ్వర్రావుగారికి ఫోను చేస్తే, శ్రీనివాసం గెస్టుహవుసులో ఉండమని అక్కడ కలుసుకోవడానికి వారి అసిస్టెంటుని పంపారు. మాధవం గెస్టు హవుసులో ఏసీరూములో బసచేశాం. వసతులన్నీ బావున్నాయి, శుభ్రంగా ఉన్నాయి. మావాళ్ళు ఊళ్ళో ఉన్న బంధువుల్ని చూడ్డానికి వెళ్తే, నేను ఉమామహేశ్వర్రావు, విష్ణుప్రియలతో కలిసి నామిని గారింటికి వెళ్ళాను. ప్రభావతిగారు చక్కటి భోజనం పెట్టారు. నామినిని ఇదే మొదటి సారి కలవడం. ఐనా ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకున్నాము. మధురాంతకం నరేంద్రగారు కూడా నా మీద దయతో ఆలస్యమైనా నొచ్చుకోకుండా వచ్చి కలిశారు. సుమారు పదకొండింటిదాకా ఇష్టాగోష్టి జరిగింది. నామిని ఒక కొత్త నవలిక రాశారు. త్వరలోనే విడుదల అవుతుంది.

మర్నాడు పొద్దున ఉమ, విష్ణు మమ్మల్ని సాగనంపడానికి వచ్చారు. కొత్తగా ప్రచురించిన తొండనాడు కథలు,
మాధవం గెస్టుహౌసు ముందు ఉమామహేశ్వర్రావు దంపతులతో
మొరుసునాడు కథలు ఇచ్చారు. అతి కష్టమ్మీద శలవుపుచ్చుకుని మళ్ళీ రోడ్డెక్కాం.

బెంగుళూరు ట్రాఫిక్ అనే మహాసముద్రాన్ని ఈది, అనుకున్న సమయానికి సుమారు నాలుగ్గంటలు ఆలస్యంగా గమ్యాన్ని చేరుకున్నాం. జేపీనగర్లో 24th Main అనే హోటల్లో ఆ రాత్రి బస. ఆ హోటలు కూడా చాలా హాయిగా ఉన్నది. పెద్దక్క వాళ్ళింటికి వెళ్ళి తన ఇద్దరు మనవళ్ళనీ ఎత్తుకుని ముద్దులాడి, అక్కచేతి భోజనం చేసి ఆఖరి మజిలీ వేపుకి బయల్దేరాం. బ్లాగు స్నేహితుడు నాగమురళి అక్కడే కలిశారు ఒక గంట సేపు.

పప్పునాగరాజుగారితో సుమారు 2007 నించీ బ్లాగుస్నేహం. ఆయన తన బ్లాగులో రాసి ప్రచురించిన ఒక కవితమీద నేను రాసిన కామెంటుతో మా స్నేహం మొదలయింది. నేను ఇండియా వచ్చినా, ఆయన అమెరికా వచ్చినా ఇంతకు మునుపు కలుసుకోవడం పడలేదు. మొత్తానికి ఈ సారికూడా పడుతుందో లేదో అని అనుమానిస్తూనే ఉన్నాం కానీ,
నాగరాజుతో - ఇది ఒక్క బుక్ షెల్ఫు మాత్రమే!
అదృష్టవశాత్తూ ఆయన బయట ఊరి పనులు ముగించుకుని అంతకు ముందు రోజే ఇల్లు చేరారు. నేను కూడా, ఇండియాలో ఆఖరిరోజని ఇంక వేరే పనులేమీ పెట్టుకోలేదు. మధ్యాన్నం భోజనాలయినాక వైట్ ఫీల్డులో నాగరాజుగారింటికి చేరుకున్నాం. హాయిగా, తీరిగ్గా, ఏమీ హడావిడి లేకుండా బోలెడు విషయాలు మాట్లాడుకున్నాం. వాళ్ళున్న చోటు (కాలనీ) చాలా చక్కగా ఉండడమే కాక, ఇంటిని చాలా చక్కగా అలంకరించుకున్నారు. పై అంతస్తులో సగం గోడలు పుస్తకాల షెల్ఫులతో నిండిపోయాయి. ఆ అంతస్తు అంతా చదువుకోడానికి రాసుకోడానికి అనువుగా అమర్చుకున్నారు.

అక్కడికే బ్లాగర్లు కృష్ణప్రియ, అవినేని భాస్కర్, కౌటిల్య చౌదరి వచ్చి కలిశారు. సాయంత్రం ఎనిమిదింటి దాకా కబుర్లు జరిగాక, అయిష్టంగానయినా ఆపక తప్పలేదు. నాగరాజు దంపతులతో ఒక చక్కని చైనీస్ రెస్టారెంటులో భోజనం కానిచ్చి, నిర్మలాంటీ గారింటికి చేరుకున్నాం. మమ్మల్ని దింపేసి నాగరాజు వాళ్ళి వెళ్ళిపోయారు. రాత్రి పదింటికల్లా మేరు టేక్సీలు వచ్చేశాయి. ఏర్పోర్టుకి ఒక గంట ప్రయాణం. విమానాశ్రయంలో కస్టంసు ఆఫీసరు మిత్రుడు నిర్దేశించిన ఒక యువ ప్రొటొకాల్ ఆఫీసరు మమ్మల్ని రిసీవ్ చేసుకుని అడ్డంకులన్నీ దాటించి గేటు దగ్గరికి చేర్చారు. అక్కణ్ణించి, వాళ్ళు పిలిచి విమానం ఎక్కించేదాకా కునికిపాట్లు పడుతూ ఉన్నాము. ఏర్పోర్టు వాళ్ళు త్వరలో దాన్ని విస్తరిస్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఒక బోయింగ్ 747 ప్రయాణికులందరూ కూర్చుని వేచి ఉండేంత చోటు లేదక్కడ.

తిరుగు ప్రయాణం అవాంతరాలేమీ లేకుండా జరిగింది, అక్కడ అమావాస్యనాడు బయల్దేరినా. ఇక్కడ దిగేసమయానికి చలే కానీ, మరీ దుర్భరంగా లేదు. ముందే వాగ్దానం చేసినట్టు మిత్రులు సుధాకర్గారొచ్చి రిసీవ్ చేసుకుని ఇంటి దగ్గర దింపి వెళ్ళారు.

అలా జరిగింది పదిహేను రోజుల ప్రయాణం. కార్తీక పౌర్ణిమనించీ అమావాస్యదాకా జరిగిన ఈ ప్రయాణ కథనాన్ని మొత్తానికి మార్గశిర అమావాస్యకి ముగిస్తున్నాను.

Comments

Anonymous said…
రెండువేల పదమూడు నుండి రెండు వేల పదనాలుగు దాకా... శుభం.
చాలా మందిని పరిచయం చేశారు...