పౌర్ణమి నించీ అమావాస్య దాకా - 4

నవం. 23 శనివారం. తెల్లారెప్పుడో వాన మొదలైంది. ఏడున్నరకి వెంకట్ పాపం వానలో తడుస్తూనే పోయి నాకోసం ఆటో తీసుకొచ్చారు. ఎనిమిదింటికల్లా నా మిత్రుడు చక్రి వాళ్ళింటికి చేరుకున్నా. హైదరాబాదులో ఇక అది చివరి రోజు. రాత్రి తొమ్మిదింపావుకి గౌతమీ ఎక్స్ప్రెస్ ఎక్కాలి. ఆ మూడు రోజులూ ఆత్మీయమైన ఆతిధ్యం ఇచ్చిన చక్రి, విజయ, వారి సుపుత్రుడు అరవింద్ లతో ఒక గంట సేపు హాయిగా గడిపాను ఆ ఉదయం. ఎందుకంటే, ఒకసారి ఇల్లు కదిలి బయటికొచ్చానంటే ఏదీ నా కంట్రోల్లో ఉండదని బాగా తెలిసొచ్చింది గనక. విజయ స్థానిక Waldorf బడిలో తెలుగు అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. ఆయా తరగతులకి అవసరమైన బోధనాసామగ్రిని తామే తయాఉ చేసుకుంటూ, మధ్యమధ్యలో చిన్న చిన్న సంగీత నృత్య రూపకాలు రాసి పిల్లలతో ప్రదర్శింప చేస్తూ రకరకాల ఆసక్తికరమైన పనులు చేస్తున్నారు. తెలుగులో పిల్లలకి అవసరమైన సాహిత్యం ఎక్కువగా లేకపోవడాన్ని గురించి చాలా మాట్లాడుకున్నాం. ఇదొకటి తెలుగు సాహిత్యకారులందరూ కొంత అర్జంటుగా పట్టిచుకో వలసిన విషయం.

ఏ పదిన్నరకో భట్టిప్రోలు అక్కిరాజు, స్వర్ణల ఇంట్లో నన్ను దింపేసి, చక్రి తన ఆఫీసు పని చూసుకోవడానికి వెళ్ళాడు. అప్పుడే టైటానిక్ (కోనేరు) సురేషు, పద్మ దంపతులు, దాసరి అమరేంద్ర గారు కూడా వచ్చారు. యంగ్ టైగర్ అద్దంకి అనంతరామయ్య కొద్ది నిమిషాల తరవాత వచ్చి కలిశాడు. అమరేంద్రగారి మధ్యవర్తిత్వంలో ఐదారు పాయింట్ల మీద మంచి చర్చ జరిగింది. ఆయన ఫేస్బుక్ పేజిలో ఇది కొద్దిగా కేప్చర్ చేశారు. ముఖ్యంగా అక్కిరాజూ సురేషూ ఏమీ రాయకుండా ఉండడం చాలా దారుణమని తీర్మానించాం. సురేషుని తొయ్యవలసిందిగా పద్మని కోరాము. అక్కిరాజు రాయకపోతే, కొద్ది రోజుల్లో వాళ్ళమ్మాయి భావన రచయితగా ఆయన్ని అధిగమించేస్తుందని బెదిరించాం. చర్చల్లో - పిల్లల సాహిత్యం అంటే ఏంటి, పిల్లల సినిమా అంటే ఏంటి అని జరిగిన చర్చ బాగుంది. ఈ విషయమ్మీద చి. భావన అభిప్రాయాలు మనం గమనించాలి. నాకు గుర్తున్నవి -
  • పిల్లల సాహిత్యమంటే అందులో దుఃఖం లేకుండా అంతా సుఖమయం అంటూ ఉండదు. అమెరికను ఇంగ్లీషు పిల్లల సాహిత్యంలో బాగా పేరుపొందిన అనేక కథలు పుస్తకాలు, మృత్యువునీ, దుఃఖాన్నీ రియలిస్టిక్ గా చూపించాయి.
  • పిల్లల ఊహాశాక్తికి దోహదం చేసేట్టుగా ఉండాలి సాహిత్యం కానీ, సినిమా కానీ. అందుకే పిల్లలు ఇప్పటికీ మాయాబజార్ సినిమాని ఇష్టపడతారు.
  • పిల్లలకి హాస్యం అంటే చాలా ఇష్టం. ఆటలన్నా చాలా ఇష్టం. 
  • ఈ కాలపు పిల్లలు కథలోని పాత్రలతో రిలేట్ చేసుకో గలిగేట్లుగా ఉండాలి, కథలోని కాలం ఎప్పటిదయినా.
మన సాహిత్యంలో పిల్లల మానసిక వేదనని నిజాయితీగా చిత్రించిన సందర్భాలు బాగా తక్కువ అని సభ్యులు అభిప్రాయ పడ్డారు. ఈ నేపథ్యంలో తలిదండ్రులు విడిపోవడం (పరస్పర అంగీకారంతో విడాకులు, వదిలెయ్యడం, లేచిపోవడం, ఇత్యాది) లేదా ఒక పేరెంట్ చనిపోవడం - ఈ రెండు సంఘటనలలోనూ ఆ కుటుంబంలోని పిల్లల మీద వచ్చే వత్తిడిలో తేడా ఉంటుందా అని చర్చ. రెండవ సంఘటనలో సంఘంలో కొంత జాలి కలిగితే కలగవచ్చు. మొదటి దానిలో సంఘం ఈసడించుకోవచ్చు. ఏదేమైనా, విఛ్ఛిన్నమైన కుటుంబంలో పిల్లల మనసులపై వత్తిడి చాలా తీవ్రంగా ఉంటుందనే అభిప్రాయానికి వచ్చాము. ఇదే నేపథ్యంలో పి. సత్యవతి గారి దమయంతి కూతురు, వోల్గా గారి మృణ్మయనాదం కథల గురించి మంచి లైవ్లీ చర్చ జరిగింది. ఈ టాపిక్కులన్నీ చూసి అక్కడి సంభాషణ అంతా యమా సీరియస్సుగానూ, హృదయవిదారకంగానూ ఉన్నదనుకుంటే మీరు తప్పులో కాలేశారన్నమాటే. మధ్యమధ్యలో ఎన్నో చమక్కులు, చతురోక్తులు, ఎకసెక్కాలు, చిన్ని చిన్ని సరదాలు. రెండు గంటలు ఎలా గడిచిపోయాయో తెలియలేదంటే అతిశయోక్తి కాదు. విడవలేక విడవలేక (ఇంటి మెయిన్ గేటుదాకా వచ్చాక మళ్ళీ బై బై చెప్పుకోడానికి ఇంకో పావుగంట పట్టింది) విడిచి బయల్దేరాం.



కాలేజి మిత్రుడు కొండల్రావింట్లో భోజనం .. అతి ఇష్టమైన వంకాయ కూర, ఆవడలతో. సౌ. శాంతి అన్నపూర్ణే. అక్కణ్ణించీ మళ్ళీ హడావిడిగా బంజారాహిల్సులోని తరంగా మీడియా కర్యాలయినికి పరుగు. ఈ రోజంతా మా చక్రి నన్నంటిపెట్టుకునే ఉన్నాడు, పాపం. వాన బాగా కురుతోందీపాటికి. మొదట అనుకున్న సమయంకంటే సరిగ్గా గంట ఆలస్యమయింది. రచయిత కస్తూరి మురళీకృష్ణగారు ఈ మధ్య అసలే సస్పెన్సు హారర్ కథలూ గట్రా రాస్తూ ఉన్నారేమో, డైరెక్షన్సు కూడా అలాగే ఇచ్చారు. ఫలాని సందులోకి తిరగమన్నారు. ఆ సందులోకి తిరిగి కారాపి ఆయనకి కాల్ చేస్తే, అక్కడ పెద్ద చెట్టుంది చూడండి? గేటు ముందు నల్ల కారు కూడా ఉంది. అదే బిల్డింగ్ అన్నారు. ఫోను పెట్టేసి, ఆ వానలోనే సందుని పరికించి చూస్తే ఓ ఇరవైమూడు పెద్ద చెట్లూ, ఓ అరడజను నల్ల కార్లూ ఉన్నై. చివరికి ఆయనే స్వయంగా బిల్డింగులోనించి వానలో బయటికొచ్చి మమ్మల్ని లోపలికి తీసుకెళ్ళారు. తుర్లపాటి నాగభూషణం గారిని కూడ కలిశాను. సుమారొక గంట సేపు తరంగ ఆన్లైన్ రేడియో కోసం సంభాషణ రికార్డింగ్. మురళీకృష్ణగారు అమ్మో మహా చమత్కారి, ఆ సంభాషణలో ఏం మాట్లాడానో నాకిప్పుడు గుర్తు లేదుగానీ ఏవిటో చాలానే మాట్లాడాను. బయటికొచ్చాక మా చక్రి బాగా మాట్లాడావురా అన్నాడు. మా చక్రి ఆ మాత్రం మెచ్చుకున్నాడంటే పర్లేదన్నమాట అనుకున్నా. ఇంతలో అరిపిరాల సత్యప్రసాద్ మరో వారంలో విడుదల కాబోతున్న తన ఊహాచిత్రం కథల పుస్తకం తీసుకొచ్చారు. ఆయన ప్రోగ్రాము తరంగలో మొన్ననే బ్రాడ్కాస్ట్ అయింది. మిత్రులందరితో కూర్చుని ఓ కప్పు టీ తాగి తరవాతి అపాయింట్‌మెంటుకి బయల్దేరాం నేనూ చక్రీ.

MPC శర్మగారు, శ్రీలక్ష్మిగారు సుమారు నలభయ్యేళ్ళుగా మా కుటుంబ మిత్రులు. వాళ్లందర్నీ చాలా ఏళ్ల తరవాత కలవడం. సుమారు ఏడాది కిందట వారమ్మాయి పద్మప్రియ ఫేస్బుక్కులో పరిచయమైతే, అలా ఈ స్నేహం మళ్ళీ పునరుద్ధరించబడింది. ఫేస్బుక్కు ద్వారానే పైచయమైన మరొక మిత్రులు మణి భూషణ్ గారు (మీడియా హబ్ సంచాలకులు, జీవన సురభి పత్రిక సంపాదకులు) కూడా అక్కడికే వచ్చి కలిశారు. ఆయనతో పుస్తకాల అమ్మకం గురించి మంచి వాడి వేడి చర్చ జరిగింది. ఇక బయల్దేరకపోతే రైలందుకోలేము అని చక్రి హెచ్చరించడంతో ఇక వీడ్కోలు తీసుకోక తప్పలేదు.

బయట వానతో రోడ్లు మహా బీభత్సంగా ఉన్నాయి. మొదటి ప్రశ్న హైటెక్ సిటీనించి సికిందరాబాదు స్టేషనుకి ఎలా వెళ్ళాలి. ఎమెంటీయెస్ లో వెళ్ళాలి అంటే, ఆ రైలుని అందుకోగలనా అనేది రెండో ప్రశ్న. నిజానికి అక్కడ ఛాయిస్ లేదు - ఆ ఎమెంటీయెస్ని అందుకుని తీరాలి. ఇంటికి చేరంగానే యుద్ధ ప్రాతిపదిక మీద పేకింగ్ పూర్తి చేసి పది నిమిషాల్లో మళ్ళీ కార్లో ఉన్నా. లక్కీగా స్టేషను వీళ్ళింటికి బాగా దగ్గర. సూట్కేసుల్ని బ్రూట్ ఫోర్సుతో ప్లాట్ఫాం మీదికి ఈడ్చిపడేసి టిక్కెట్టు కొనుక్కొచ్చా చక్రి కారుని పార్క్ చేసొచ్చేంతలో. మేము చూసిన రైలు టైము దాటి రెండు నిమిషాలైంది అప్పటికి. రైలెళ్ళిపోయిందా?? గుండెలో గుబులు. చక్రిది ఎంతైనా గొప్ప లాజికల్ బుర్ర. రైలింకా రాలేదని తీర్మానించాడు. ఎలాగంటే, వచ్చేసుంటే మేము స్టేషనుకి చేరుకునే లోపల పట్టాల మీద కనబడి ఉండేది. అదీ కాక, ప్లాట్ఫాం నిండా ప్రయాణికులు చాలా మందున్నారు. హమ్మయ్య, నేను పట్టుకోవలసిన రైలు వెళ్ళిపోలేదు అనే నిర్ధారణకి వచ్చాము. అప్పుడింక మరో టెన్షను పట్టుకుంది. ఒకేళ ఈ రైలు మరీ లేటయితే .. కానీ దాని పుణ్యమాని మరో ఐదు నిమిషాల్లో అది రానే వచ్చింది, ఒక అరగంటలో సికిందరాబాదుకి చేరనే చేర్చింది. చక్రికి హైటెక్ సిటీ స్టేషనులోనే వీడ్కోలిచ్చాను.

సికిందరాబాదు స్టేషనులో నా తోటి ప్రయాణికుడొకతను సూట్కేసులు దింపడానికి సాయం పట్టాడు. ఇంతలోకి నా యువమిత్రులు, అమిత్, అజిత్ సోదరులు వచ్చి చేరారు. వారి సాయంతో బ్రిడ్జీ ఎక్కి, రెండు ప్లాట్ఫాములు దాటి, కిలోమీటరు పొడుగున్న ప్లాట్ఫామంతా నడిచి ఎట్టకేలకు నా కంపార్టుమెంటులో ఎక్కాను. రెణ్ణిమిషాల్లో రైలు కదిలింది! నిజంగా జస్ట్ ఇన్ టైమన్నమాట. శర్మగారింటినించి బయల్దేరనప్పటినించీ, ఈ క్షణందాకా జరిగిన సంఘటనలలో ఏ ఒక్క లింకు తెగినా నేను రైలందుకోలేక పోయేవాణ్ణి.

ఇంతలో దాసరి అమరేంద్రగారి నుండి ఫోను. ఆయనా, శ్రీపతి గారూ, మరి కొందరూ అదే రైల్లో కాకినాడ వస్తున్నారని. సామాను సర్దేసి, వాళ్ళని కలుద్దామని బయల్దేరాను. నాలుగు కంపార్టుమెంట్లు దాటేప్పటికి నా తాతలు దిగొచ్చారు. బహుశా దగ్గరి స్టేషన్లలో దిగిపోవడానికో ఏమో, రిజర్వేషను స్లీపరు కోచిల్లోకూడా చాలా మంది ప్రయాణికులు నిలబడి ఉన్నారు. ఆ జనసముద్రాన్ని ఈదలేక, అమరేంద్రగారికి కాల్ చేసి సారీ చెప్పాను.

అలా గౌతమీ ఎక్స్ప్రెస్లో మరుసటి మజిలీ దిక్కుగా ..
(ఇంక ఒకట్రెండు ఎపిసోడ్లతో ఐపోతుందిలేండి!)

Comments

Anonymous said…
Please don't be hurry to end this series. Very interesting and Iam enjoying. I am a regular reader of your blog for the past five years. Thank you very much for a nice blog.

Sree

Anonymous said…
sir, atleast fifteen posts (i.e. one post per day's stay) please.

regards,

rajasekhar