ఈమని శంకరశాస్త్రిగారితో రెండు రోజులు

ఇవ్వాళ్ళ (సెప్టెంబరు 23) శ్రీ శంకరశాస్త్రిగారి పుట్టిన రోజట. ఫేస్బుక్కులో మైథిలిగారు చెబితే తెలిసింది. వారితో రెండు రోజులు గడిపే అదృష్టం కలిగింది నా విద్యార్ధి దశలో. అదొక సరదా అనుభవం. శాస్త్రిగారు మంచి భోజనప్రియులు, ఇంకా భోగ పురుషులు. ఇక్కడ చెబుతున్న విషయాలు సరదాగా అప్పటి అనుభవాన్ని నెమరువేసుకోవడానికే తప్ప వారి స్మృతిని కించపరిచే ప్రయత్నం ఎంతమాత్రమూ కాదని ముందే మనవి చేస్తున్నాను.

విజయవాడలో కనీసం నెలకొక కచేరీ అయినా వినే అలవాటున్న నాకు, వరంగల్ ఆర్యీసీలో చదువుతుండగా, మన సాంప్రదాయ సంగీత కచేరీలు బొత్తిగా వినబడక చాలా బాధ పెట్టింది. మా బేచి ఫైనలియరుకి చేరాక మాకు SPIC-MACAY గురించి తెలిసింది. ఇంకొకళ్ళు కచేరీ పెట్టేదేవిటి, మనమే పెట్టేద్దావని చెప్పి, ఓ పదిమందిని పోగేసి, మా పట్ల వాత్సల్యం ఉన్న ఒక మాస్టరుగారిని ఫేకల్టీ ఎడ్వైజరుగా పెట్టుకుని వరంగల్ ఛాపటరుని నమోదు చేసేశాం. మా అంతట మేము ఏర్పాటు చేసిన మొదటి కార్యక్రమం, శ్రీమతి జయంతి రమగారి గాత్రకచేరీ బ్రహ్మాండంగా జరిగింది.

ఇంతలో జాతీయ కార్యాలయం నించి తాఖీదులు వచ్చాయి. జాతీయ స్థాయి కచేరీ పరంపరలో మా వంతు రెండు కార్యక్రమాలు - శుక్రవారం ఈమని శంకరశాస్త్రిగారి వీణ, శనివారం పండిత్ దుర్గాలాల్ గారి కథక్ నృత్యం. తంతే బూర్ల బుట్టలో పడ్డట్టయింది మా పని. శాస్త్రిగారి పేరు చెప్పుకుని కాలేజి గెస్టు హవుసులో రెండు లగ్జరీ రూములు పట్టించాము. కాలేజి కారుకి టెండరు పెట్టాము. ప్రచారం అట్టహాసంగా చేశాము. వచ్చేది మహా వైణిక విద్వాంసుడు. ఆయనా మాతో ఉండేది ఒక్క రోజు. శుక్రవారం పొద్దున హైదరాబాదు నించి వచ్చి, సాయంత్రం కచేరీ చేసి, మర్నాడు శనివారం పొద్దున రైల్లో విజయవాడ పంపించాలి. ఖర్చయినా పరవాలేదని వూళ్ళో కాస్త ఖరీదైన హోటలుగా పేరొందిన అశోకానించి లంచి డెలివరీకి ఆర్డర్ చేశాను. అంతా బానే ఉంది. శుక్రవారం పొద్దుటిదాకా.

శుక్రవారం పొద్దున కారుకోసం నేనూ, మిత్రుడు సుధాకర్ షెడ్డుకెళ్తే, దానికేదో రిపేరొచ్చింది, కదల్దు అన్నాడు డ్రైవరు. ఇదేమిరా భగవంతుడా అని మేం మొగాలు వేలవేస్తే అతనే ఓ సలహా చెప్పాడు. సివిలింజనీరింగు వాళ్ళ దగ్గర జీపుంది, హెడ్డుగారిని అడిగితే ఇస్తారని. మళ్ళీ శాస్త్రిగారి మంత్రం పని చేసింది. సివిల్ హెడ్డుగారు జీపు శేంక్షన్ చేశారు కానీ మాకే ఎక్కడో గింజుకుంటోంది, అంత పెద్ద విద్వాంసుణ్ణి జీపులో తీసుకొస్తామా అని. ఇక చేసేది లేక అదే వేసుకుని కాజీపేట స్టేషనుకి వెళ్ళాం. రైల్లో శాస్త్రిగారిని, వారితో వచ్చిన మృదంగం ఆర్టిస్టుని (అయన పేరు ఆనంద్ అనుకుంటా, బెంగళూరు వాస్తవ్యులు) స్వాగతించి స్టేషను బయటికి వచ్చాం. జీపుని చూడగానే శాస్త్రిగారు కొంచెం మొహం చిట్లించారు. కానీ మధ్య సీటులో ఎక్కి కూర్చోగానే ఆయన మూడ్ మారిపోయింది. అదొక స్పెషల్ జీపు. మామూలు వాహనాలకంటే వెడల్పుగా ఉండేది. అందువల్ల, ఆయన హాయిగా వీణని వొడిలో పెట్టుకుని కూర్చున్నారు. అదే వీణ పెట్టుకుని ఎంబాసడర్ కార్లో ఎక్కాలంటే నానా అవస్థా పడాల్సి వచ్చేది. ఈ జీపు శాస్త్రిగారికి చాలా నచ్చేసింది. ఏవోయ్, మనం స్టేషనుకి వెనక్కి వెళ్ళేప్పుడూ కూడా ఈ జీపే పిలిపించు అని నన్ను ఆదేశించారు, ఏదో నేను చిటికేస్తే కోరిన వాహనం ప్రత్యక్షమయ్యేట్టు.

అతిథులిద్దర్నీ గెస్టుహవుసులో విడిది చేయించాము. ఇంతలోకి లంచి డెలివరీ వచ్చింది. ఏమేమి ఉన్నాయోయ్ అనడిగారు శాస్త్రిగారు. గబగబా కేరేజి తెరిచి వచ్చిన ఐటముల లిస్టు చదివాను. "గోంగూర పచ్చడి లేదా?" అని కేషువల్గా ఓ ప్రశ్న నా మీద విసిరేసి, పక్కనున్న ఆనందు గారితో విశాఖలో వారమ్మాయి గోంగూర పచ్చడి ఎంత రుచిగా చేస్తుందో, అదంటే ఈయనకి ఎంత ఇష్టమో వైనవైనంగా వర్ణించడం మొదలు పెట్టారు. నాకు మాయాబజారు సినిమాలో "అదిలేనిదే ప్రభువులు ముద్దైనా ముట్టరు" అనే డయలాగు గుర్తొచ్చింది. మా సుధాగాణ్ణి సైకిలెక్కించి హాస్టలుకి తరిమాను, ఎవడి దగ్గరన్నా ఇంటినించి తెచ్చుకున్న గోంగూర పచ్చడి ఉన్నదేమో తెమ్మని. మా అందరి అదృష్టం బావుండి మా పక్క రూము వాడి దగ్గరే దొరికిందిట, వాడు కూడా శాస్త్రిగారి పేరు చెప్పేప్పటికి బంగారంలాంటి గోంగూర పచ్చడి సీసాని అపర శిబిచక్రవర్తిలాగా త్యాగం చేశాడు. మొత్తానికి శాస్త్రిగారు ఆ పూట తృప్తిగానే భోజనం చేశారు.

వారిని విశ్రాంతి తీసుకోమని నేను హాలు పర్యవేక్షణ చూసుకోడానికి వెళ్ళిపోయాను. జీపు వెళ్ళిపోయింది. వాళ్ళ డిపార్టుమెంటు పనులున్నై, సాయంత్రం రావడం కుదరదు అనేశాడు. సాయంత్రం టిఫిను ఒక ప్రొఫెసరు గారింట్లో ఏర్పాటయింది. అటునించి అటే కచేరికి వెళ్తామని చెప్పడంతో శాస్త్రిగారు మంచి జరీ కోరారంగు పంచె, దానికి మేచింగ్ సిల్కు చొక్కా, ఉత్తరీయంతో తయారయి బయల్దేరారు. మరీ పొడుగు కాదుగానీ పచ్చటి బంగారం పోతపోసినట్టు నిండైన విగ్రహం. బయటికొచ్చి కార్ లేదా అన్నారు. ఇక్కడే దగ్గరే సార్ అన్నాను. పాపం నడిచే వచ్చారు. ప్రొఫెసరుగారింట్లో అల్పాహార విందు బాగానే జరిగింది. కచేరీ సమయం అవుతోంది. ప్రొఫెసరు గారు తన స్కూటరు మీద శాస్త్రిగారిని ఆడిటోరియంలో దిగబెడతా నన్నారుగానీ, శాస్త్రిగారికి కూడా సరదా పుట్టినట్లుంది .. ఎందుకూ ఇక్కడేగా, నడుద్దాములే అని, ఆడిటోరియం కి నడిచే వచ్చారు. ఈలోపలే మా వాళ్ళు వీణనీ మృదంగాన్నీ స్టేజి మీదకి చేర్చారు. ఎంతో అరుదైన మహా విద్వాంసుడు వచ్చాడని వరంగల్ పట్టణమంతా మా కేంపస్ లోనే ఉన్నదారోజు. కచేరీ అద్భుతంగా జరిగింది-ట. నేను వినలేదు. నేరుగా వెళ్ళి సివిల్ హెడ్ గారింటి దగ్గర కనిపెట్టుకుని ఉన్నాను, ఆయన తిరిగి రాంగానే జీపుని మళ్ళీ ఎవరూ హైజాక్ చెయ్యకుండా. ఆయన వచ్చి జీపు నా చేతికి చిక్కేటప్పటికి ఎనిమిదిన్నర. సరిగ్గా మంగళం వాయించడానికి ముందు ఆడిటోరియం చేరుకున్నాను. కచేరీనించి భోజనానికి మరో ప్రొఫెసరు గారింటికీ, అక్కణ్ణించి మళ్ళీ గెస్టుహవుసులో దింపడానికీ, డ్రైవరు గునిస్తే అతనికో ఇరవై ఇచ్చి (ఇది జరిగింది 80లలో) సముదాయించి, మొత్తానికి ఆ రాత్రికి శాస్త్రిగారిని మళ్ళీ నడిపించకుండా గెస్టుహవుసుకి చేర్పించాము.

రాత్రి హైదరాబాదు నించి ఫోను. శాస్త్రిగారి విజయవాడ ప్రోగ్రాము కేన్సిలయింది. అందుకని వారికి నేరుగా విశాఖకి టిక్కెట్టు మార్పించాము, కాకపోతే రైలు రాత్రికి గానీ లేదు. అందుకని అప్పటిదాకా ఆయన ఆతిధ్యం మేమే చూసుకోవాలి అని సారాంశం. మర్నాడు పొద్దున్నే నాకు బాగా చనువున్న ఒక కనడం ప్రొఫెసరు గారింటికి పరిగెత్తాను, శాస్త్రిగారికి లంచి బుక్ చెయ్యడానికి. మాస్టారికి, అక్కయ్యగారికి కూడా సంగీతమంటే ఇష్టం అవడం వల్ల వెంటనే ఒప్పుకున్నారు. అక్కణ్ణించే కాఫీ, ఇడ్లీ తీసుకుని శాస్త్రిగారిని మేలుకొలపడానికి వెళ్ళి విషయం చెప్పాను. మీరు ఇవ్వాళ్ళంతా ఇక్కడే ఉంటున్నారు. ఫలాని కన్నడం ప్రొఫెసరు గారింటో మధ్యాన్నం భోజనం అని. ఓహో, అయితే లంచికి బిసిబేళ హుళి, మైసూర్రసమూ ఉంటాయన్నమాట అని చాలా సంతోషించారు.

దుర్గాలాల్ గారి కార్యక్రమం KMCలో ఏర్పాటయింది. అందుకని ఆయన ఆతిథ్యానికి ఏర్పాట్లు వాళ్ళె చేసుకున్నారు. అయినా ఛాప్టరు అధ్యక్షుడిగా స్టేషనులో స్వాగతం పలికి మళ్ళీ మా కాలేజికి తిరిగొచ్చి శాస్త్రిగారినీ ఆనంద్ గారినీ ప్రొఫెసరు గారింటీకి భోజనానికి తీసుకెళ్ళాను. భోజనం అద్భుతంగా ఉన్నది కానీ శాస్త్రిగారు ఆశించినట్టు బిసిబేళ హుళి, మైసూర్రసమూ వడ్డించబడలేదు. ఈ ఆతిథ్యం ఇచ్చిన ప్రొఫెసరుగారు కొన్నాళ్ళు ఇంగ్లండులోనూ జెర్మనీలోనూ పనిచేసి వచ్చారు. అందుకని వారింటో, చేసే భోజనం భారతీయమే అయినా, భోజన పద్ధతులన్నీ స్పూనులూ ఫోర్కులతో హడావుడిగా ఉంటుంది. భోజనం చివర్లో డిజర్టుగా పాయసం పింగాణీ కప్పుల్లో పోసి, చిన్న చిన్న సిల్వరు స్పూను వేసి సర్వ్ చేశారు. శాస్త్రిగారేమో, స్పూను తీసి పక్కన పెట్టేసి, కప్పులో పాయసాన్ని కంచంలో పోసేసుకుని, చేత్తో ఒక్క తిప్పు తిప్పి లాఘవంగా అవుపోశన పట్టేశారు. అలా ఊరుకోక, టేబులు చుట్టూ పరికిస్త్ఊ - అబ్బే పాయసాన్ని స్పూనుతో తింటే ఏం బావుంటుందీ? హాయిగా జుర్రుకుంటే తప్ప దాని రుచి తెలీదు - అని స్టేటెమెంటొకటి వదిలారు.నేను ఏం చెయ్యాలో అర్ధంకాక, మా ప్రొఫెసరుగారికేసి చూశాను. ఆయనా అప్పుడే పాయసం కప్పు అందుకోబోతున్నారు, కొంచెం సందిగ్ధంగా ఆగిపోయారు శాస్త్రిగారి స్టేటెమెంటు విని. ఎంతైనా ఆంగ్లేయుడి ట్రెయినింగు బలమే గెలిచింది. ఆయనా స్పూనుతోనే తిన్నారు, ఆయన్ననుసరించి నేనూ స్పూనుతోనే తిన్నాను. కొంత పిచ్చా పాటీ అయ్యాక, శాస్త్రిగారిని గెస్టుహవుసులో దింపి మళ్ళీ మాస్టారింటికి వెళ్ళాను, వారి ఆతిథ్యానికి ధన్యవాదాలు చెప్పడానికి. మాటల్లో - శాస్త్రిగారు ఇవ్వాళ్ళ బిసిబేళహుళి ఉంటుందని ఎక్స్‌పెక్ట్ చేశారు - అనంటే, మాస్టారు భార్య నన్ను కోప్పడ్డారు - అదేవిటి, అంతటి మహానుభావుడు అలా కోరిక వెలిబుచ్చినప్పుడు నువ్వొచ్చి నాకు చెప్పొద్దా? అదేమి భాగ్యం, అదే చేసేదాన్ని కదా? -- అలా అక్షింతలేసుకుని మళ్ళీ శాస్త్రిగారి సేవకి వెళ్ళాను.

ఎప్పుడో రాత్రి పదింటికి ట్రెయిను. ఏం చేద్దాం గురువుగారూ అనడిగితే, దుర్గాలాల్ గారి నాట్యం అన్నావుగా, పోయి చూసొద్దాం పద. అన్నారు. నా గుండేల్లో రాయి పడింది. ఆర్యీసీ నించి కేయెంసీ చాలా దూరం. బతుకు జీవుడాని మళ్ళీ కార్ల వేట మొదలెట్టాను. ముందుగా మాట్లడుకోక పోవడంతో కాలేజి కారూ దొరకలేదు, సివిలు వాళ్ళ జీపూ దొరకలేదు. చివరకి గతి లేక ఆటో పిలిచాను. శాస్త్రిగారు యథావిధిగా మంచి జరీ పంచ కట్టుతో తయారై బయటికి వచ్చేసరికి బయట ఆటో ఉంది. ఆయన పాపం ఏం అనలేదు. అక్కడికీ ఆటో సీట్లో ఆయన్నీ, ఆనంద్ గార్నీ కూర్చో బెట్టి నేనూ సుధాకరూ డ్రైవరుకి అటూ ఇటూ వేళ్ళాడుతూ వెళ్ళాం. కానీ దానికే ఆయన పాపం నలిగి పోయారు. కేయెంసీలో దిగి ఆడిటోరియం వేపు నడుస్తుంటే మెల్లగా అన్నారు, నన్ను ఆటో ఎక్కించావోయ్ నారాయణా! నిన్ను ఈ జన్మలో మరిచిపోను! ఏం చెయ్యను, సైలెంటుగా నెత్తి బాదుకోవడం తప్ప.

దుర్గాలాల్ గారి నృత్యాన్ని గురించి ఇంకో పూట రాస్తాను. ప్రస్తుతానికి శాస్త్రిగారితో ఉందాం. నా కేయెంసీ కో-ఆర్డినేటరుతో మాట్లాడితే, హనంకొండ దాకా అయితే కారిస్తా అన్నాడు.ఆ పూట శనివారం కదా, రాత్రి పలహారమే తప్ప భోజనం చెయ్యను అన్నారు శాస్త్రిగారు. ఇదీ బానే ఉంది, హనుమకొండలో అశోకా హోటల్లోనే టిఫిను చేసి వెళ్ళొచ్చని కారులో బయల్దేరాం. కేయెంసీ కారు మమ్మల్ని అశోకా హోటల్లో దింపి వెళ్ళిపోయింది. పర్సులో యాభై రూపాయల చిల్లరుంది (ఆ రోజుల్లో మసాలా దోస మూణ్ణాలుగు రూపాయలుండేది). పరవాలేదు, మంచి టిఫినే పెట్టించవచ్చు అని ధీమాగా లోపలికి దారితీశాను. సుధాకరు పబ్లిక్ ఫోను దగ్గరికి వెళ్ళాడు, మళ్ళీ సివిల్ వాళ్ళ జీపు దొరుకుతుందేమో ప్రయత్నించడానికి. నేను శాస్త్రిగారినీ, ఆనంద్ గారినీ ఆసీనులని చేసి, వెయిటర్ని పిలిచి వాళ్ళకి ఏమేం కావాలో చూడమని చెప్పి మేనేజర్ని చూడ్డానికి వెళ్ళా. కేషియర్ లేక, కేష్ కౌంటార్లో మేనేజరే కూర్చున్నాడు. ఏంటయ్యా మరీనీ, లంచి కేరేజీ ఆర్డర్ చేస్తే కనీసం గోంగూర పచ్చడన్నా వెయ్యకుండా పంపిస్తారా, అవతల గెస్టుగా వచ్చిందెవరో తెలుసా .. అసలు అంతటి మహానుభావుడికి భోజనం పెట్టగలిగినందుకు నీ హోటల్ ఎప్పుడో పుణ్యం చేసుకుని ఉండాలి - ఈ టైపులో వాయించి పడేశా. అతను పాపం మొహం చిన్నబుచ్చుకుని నాతో పాటు టేబుల్ దగ్గరికొచ్చి, శాస్త్రిగారికి నమస్కారం చేసి వెళ్ళాడు. నేను విజయ గర్వంతో కూర్చున్నా. ఇంతలోకే సుధాకరు కూడా విజయగర్వంతో వచ్చాడు. జీపు దొరికింది. అప్పటికప్పుడే హనుమకొండ వస్తోంది.

హమ్మయ్య అనుకుని మేం కూడ మాకిస్టమైన టిఫినులు లాగించాం. వెయిటర్ బిల్లు తెచ్చి నా చేతికిచ్చాడు. ఎమౌంటు చూసి ఉలిక్కిపడ్డాను. అక్షరాలా అరవయ్యారు రూపాయలైంది! టిప్పుతో కలిపి డెబ్భై. పోనీ సుధాకరు దగ్గర ఓ ఇరవయ్యుందేమోనని సైగ చేశాను. వాడు పైసే లేదన్నట్టు రివర్సిచ్చాడు. ఏవిటి చెయ్యడం. మామూలుగా అయితే మేనేజరుతో చెప్పి, మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తాం అంటే పెద్ద సమస్య ఏం కాదు. కానీ అంతకుముందే పోయి అతన్ని ముక్క చీవాట్లు పెట్టొచ్చాను, ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని అరువడగను! చివరికి గత్యంతరం లేక మృదంగిస్టు ఆనంద్ గారిని పక్కకి పిలిచి నా దీనావస్థ విన్నవించుకున్నాను. ఆయన చిర్నవ్వుతో పర్సులోంచి ఇరవై తీసిచ్చారు. బిల్లు చెల్లించి బయట పడ్డాం. వాళ్ళు గెస్టు హవుసులో సూట్ కేసులు సర్దుకునే లోపల హాస్టలుకి పోయి డబ్బు తెచ్చి - ఆయన వద్దు వద్దు అంటున్నా ముందు ఆనంద్ గారి బాకీ తీర్చి, జీపులో స్టేషనుకి బయల్దేరాం. ఆయన కోరుకున్నట్టుగానే తిరుగు ప్రయాణనికి వీణ పట్టుకెళ్ళడానికి అనువుగా జీపు దొరకడంతో శాస్త్రిగారు ఫుల్ హేపీస్.

గోదావరి ఎక్స్‌ప్రెస్లో ఫస్టు క్లాసులో బెర్తు దగ్గర సామాన్లు సర్ది, శాస్త్రిగారు ఎక్కి కూర్చున్నాక - సుధాకరూ, నేనూ - ఇద్దరమూ ఆయన పాదాలు తాకి నమస్కరించాం.

పిల్లలయినా, బాగా చేశారోయ్! వెళ్ళి రండి. అని శలవిచ్చారు. మహా వైణిక విద్వాంసులు శ్రీ ఈమని శంకరశాస్త్రిగారు.

ఆయన్ని వరంగల్లు వీధుల్లో ఆటోలో తిప్పినందుకు ఆయన నన్ను గుర్తు పెట్టుకున్నారో లేదో గానీ ఆ రెండు రోజులూ మాత్రం నేను జీవితంలో మరిచిపోలేను!

Comments

SD said…
ఆనంద్ గారు మీరు చేసిన నిర్వాకం గురించీ, స్టూడెంట్సే కదా సర్దుకుపోదాం అనీ శాస్త్రిగారికి బాగా చెప్పి ఉండాలి. మీరు ఆనంద్ గారికి ఋణపడి ఉణ్డాలి. ఇది నా మట్టీ బుర్రకి తగిలిన ఆలోచన. ఏమంటారు?

ఇలా అంటున్నందుకేమీ అనుకోకండీ బట్ అనేస్తున్నాను. ఇలా నాకు కావాల్సింది తెప్పించూ, లేకపోతే కుదర్దూ అనడం మన తెలుగు వాళ్లకేనా? చిట్టిబాబు కూడా మందు సీసా లేకుండా అసలు కచేరీ మొదలు పెట్టేవాడు కాదు అంటారు. కానీ ఒకసారి మొదలుపెడితే అంతే - బ్రహ్మానందంలో ముంచు మునుగున్ అన్నట్టు ఉంటుంది.
Anonymous said…
" కచేరీ అద్భుతంగా జరిగింది-ట .." అదేమిటి మాస్టారూ? పైగా శ్రీ శంకర శాస్త్రిగారిని ఓరుగల్లు వీధుల్లో ఆటోలో త్రిప్పిన ఘనతకూడానా? మీరు వర్ణించిన విధానం అద్భుతం. నేను శ్రీశాస్త్రిగారి కచేరీ వినే అదృష్టం ఒకేఒకసారి కలిగింది. తణుకులో మా అత్తగారి ఇంటికి దగ్గరలో, ఎవరో శ్రీశాస్త్రిగారి చుట్టాలమ్మాయి వివాహం సందర్భంలో, ఆయన వీణకచేరీ పెట్టారు. అదేమీ మరీ పబ్లిక్ పెర్ఫార్మెన్సు కూడా కాదు. అయినా పిలవనిపేరంటానికి నేను వెళ్ళి, రెండుగంటలూ ఆస్వాదించాను. శ్రీ చిట్టిబాబుగారివైతే అయిదారు కచేరీలు ప్రత్యక్షంగా వినే అదృష్టం కలిగింది.
v g said…
wow..I am surprised you never blogged about this. Better late than never. thoroughly enjoyed reading this.
Kottapali said…
DG గారు, ఆనంద్ గారికి కచ్చితంగా ఋణపడి ఉన్నాం. అందులో సందేహమేమీ లేదు. ఇకపోతే నేను హోటలు వాడితో అన మాటలు నిజంగా నా మనోభావనే. అంతటి మహానుభావులు, మన ఊరికొచ్చి, మనింటికొచ్చి, నాకిది వడ్డించూ, నాకిది తెప్పించు అంటే - అలా అనిపించుకోడానికి, ఆ సేవ చేసుకోడానికి పెట్టి పుట్టి ఉండాలి. I sincerely believe that. ఇల్లేరమ్మ కథల్లో ఒక ఛాప్టరుంటుంది, వాళ్ళు విజయవాడలో సంగీతం తాతగారింటో అద్దెకుంటారు. ఆ తాతగారింటికి సంగీత విద్వాంసులందరూ అతిథిఉలుగా వస్తుంటే, ఇల్లేరమ్మ ఆ మామ్మగారితో అంటుంది, ఎందుకు వీళ్ళందరైకీ నానా చాకిరీ చేస్తున్నారని. అప్పుడు ఆ మామ్మగారు కూడా ఇదే చెబుతారు. ఒక్కొక్కరిదీ ఒక్కో టేస్టు. మన తబలా ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ - నాకో పాస్తా డిన్నర్ తెప్పించు, ఇంక డిస్టర్బు చెయ్యకు అన్నారు. అదే విక్కూ వినాయకరాం గారు పాస్తా గీస్తా ఒద్దుగానీ కొంచెం పెరుగన్నం, ఓ నిమ్మకాయ బద్ద పెట్టించవోయ్ అన్నారు. :)

Harephala .. మాస్టారూ, చెప్పానుగా. జీపుల వేటలో నేను కచేరీ వినలేదు.

Sivarama Prasad garu, VG garu, thank you.


హ హ.. ఆటో ఎక్కించినందుకు శాస్త్రి గారేమో గానీ ఆనంద్ గారు మాత్రం మిమ్మల్ని బానే గుర్తు పెట్టుకుని ఉంటారు !

బావుంది. చాలా చిన్న వయసులో విజయవాడలో ఆయన కచేరీ కి తీసుకెళ్ల బడ్డాను. వీణ విన్న జ్ఞాపకం ఏమీ గుర్తు లేదు.

అదృష్ట వంతులే మీరు. అంత గొప్ప విద్వాంసుడికి అంత సమీపంగా ఉండి సేవ చేసే అవకాశం దొరికినందుకు
Chandu S said…
చాలా బాగున్నాయి మీ జ్ఞాపకాలు. Thank you for sharing.
Sri Nannayya said…
నాసి, నీ కధనం అద్భుతః.మళ్ళి ఒకసారి REC రోజులకు తీసుకొని వెళ్లావు.ఇంతకీ ఆ సుధాకరుడు మీ రూమ్మేట్ జనగామ సుధాకరేనా? అలాగే మీ తర్వాత ఆ SPIC-MACAY కి రెండేళ్ళు నేను మా రూమ్ మేట్ శ్రీధర్ కనుగుల కలిసి ఎందఱో మహానుభావుల్ని తీసుకోచ్చాము.(మీ తర్వాత సత్య శ్రీనివాస్, ఆ తర్వాత మేము రెండేళ్ళు.) మేము భరత నాట్య కళాకారిణి స్వప్న సుందరి గారికి ఆతిధ్య మిచ్చిన వైనం ఇంతకన్నా పెద్ద కధే అవుతుంది. ఎప్పుడన్నా తీరుకున్నప్పుడు వివరిస్తా.
Unknown said…
ఎంతటి మహోన్నత వ్యక్తిలోనైనా కొన్ని అవలక్షణాలుంటాయి. అంతమాత్రాన వారిని కించపరచలేం DGగారూ. మనకుండేది వారి ప్రతిభా సంపన్నతతో సంబంధమే తప్ప, వ్యక్తిగతం కాదు. అలాగే, కవులు, కళాకారులు, రచయితలు...వారి అభిమానులు పరస్పరం ఆత్మీయ స్నేహాన్ని కోరుకుంటారు. క్షణాల్లోనే కలిసిపోతారు.
చెడు అలవాట్లను మనం ఎక్కువగా ఎందుకు గుర్తుంచుకుంటామంటే, "మనం చేసేది తప్పుకాదు, ఫలానా చిట్టిబాబే సీసా లేనిదే వీణ సవరించేవాడు కాడట" అని సర్దిపుచ్చుకోవడానికి. మనం ఎన్ని సీసాలు తాగేసినా చిట్టిబాబులా తీగ మీటలేము, ఎస్వీలా నటించలేం కదండీ?
+++++++++++++++

మూడ్రోజుల మహా యజ్ఞాన్నీ చాలా బాగా రాశారు స్వామిగారూ. మీరే కాదు, నిర్వాహకులెవరూ కార్యక్రమాన్ని ఆస్వాదించలేరు. వాళ్ళ తాపత్రయమంతా సజావుగా సాగిపోయి 'మాట పడకుండా ఉంటే చాలు' అనే ఉంటుంది.
cbrao said…
జీవితంలో గొప్ప అనుభవం.
బాలు said…
‘‘మహానుభావులు, మన ఊరికొచ్చి, మనింటికొచ్చి, నాకిది వడ్డించూ, నాకిది తెప్పించు అంటే - అలా అనిపించుకోడానికి, ఆ సేవ చేసుకోడానికి పెట్టి పుట్టి ఉండాలి’’
...కాదా మరి! అయినా కార్లో తీసుకెళ్లి కార్లో తీసుకొచ్చి హోటల్ రూములో ఉంచేస్తే.. చెప్పుకోవడానికి ఇలాంటి మధురానుభూతులు ఏముంటాయ్.
Kottapali said…
తృష్ణ, సుజాత, శైలజ, నెనర్లు.
శ్రీనివాసు, అవును సుధాకరే. మీరు నిర్వహిస్తున్నప్పుడు నేనొకసారి కేంపస్ కి వచ్చాను.
Mani Bhushan, CBRao, Balu - థేంక్సండీ!
Anonymous said…
Great moments !!

Surabhi
Sanath Sripathi said…
చాలా బాగున్నదంది మీ మధుర జ్ఞాపకం
వరంగల్లు వీధుల్లో ఆటో కనుక గుర్తుంచుకున్నారో లేదో చెప్పడం కష్టం, అదే ఈనాటి హైదరాబాద్ వీధుల్లో ఐతే ఎన్ని జన్మలైనా మర్చిపోరు...
Anonymous said…
great experience
Vasu said…
మీ తీపి జ్ఞాపకాన్ని తీపిన్నర అందంగా పంచుకున్నందుకు ధన్యవాదాలు.
Karthik said…
Mee theepi anubhavaanni matho share chesukoni maaku kudaa Oka manchi tapaa chadivina anubhavaanni migilchaaru....chaalaa thanq sir:-):-):-)
Lalitha said…
చాలా బావుంది ఈమని శంకరశాస్త్రిగారితో మీ SPIC-MACAY అనుభవం. అంత గొప్ప విద్వాంసులకి ఆతిథ్యం ఇవ్వగలగడం, వారి కోరికలు (చిన్నచిన్నవే అయినా) తీర్చగలగడం చాలా అరుదుగా దొరికే అవకాశం. It's like "once in a life time-kind". TANA-2017 gave me such an opportunity :)
భలే మిస్సయ్యాను. 80లలో మీరు అంత పెద్ద కార్యాన్ని ఒక్కచేత్తో చేశారు. అందునా విద్యార్థిగా ఉండి, తక్కువ వనరులతో కచేరి కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసేసారు. మీకు అభినందనలు, మాతో శాస్త్రిగారి కబుర్లు పంచుకున్నందుకు కృతజ్ఞతలు.
తీపి జ్ఞాపకాలు….