చిన్నప్పటి చెరువులో ఓ మునక

బాల్యమంతా మధురం అనే ఆలోచన నేనెప్పుడూ ఒప్పుకోను గానీ, ఓ తీరిక వేసవి మధ్యాన్నం మనసు అలా బాల్యవీధిలోకి షికారెళ్ళొస్తే, అక్కడ చిన్నప్పటి చెరువు గాలి హాయిగా సోకుతుందన్న మాట మాత్రం నిజం. నాకివ్వాళ్ళ కొంచెం సోకింది.

ఆఫీసుకి కావల్సిన వస్తువులేవో కొనడానికి స్టేపుల్స్ కొట్టుకి వెళ్ళాను. వాళ్ళు అప్పుడే Back To School సంరంభం మొదలెట్టేశారు. రకరకాల నోటు బుక్కులు - రంగుల్లో, పరిమాణంలో, అట్టల్లో ఎంత వైవిధ్యం! రూళ్ళున్నవి, లేనివి, సన్నపాటి రూళ్ళవి. ఇంకా రకరకాల పెన్నులు, రంగు రంగుల పెన్నులు, రకరకాల పెనిసిళ్ళు, ఇరేజర్లు, ఇవన్నీ పెట్టుకోడానికి రకరకాల డబ్బాలు. ఒక్కసారిగా వెనక్కెళ్ళి ఐదో తరగతిలో చేరిపోవాలనిపించింది నాకు.

బడి తెరిచే ముందు కొత్త పుస్తకాలు తెచ్చుకుని, వాటికి బ్రౌను పేపరు అట్టలు వేసుకుని, లేబుల్స్ అంటించి, నీటుగా పేరు రాసుకుని .. అదంతా పెద్ద పరిశ్రమ. వుట్టినే లేబులు మీద మాత్రమే రాసి ఉంటే, ఎవరైనా ఆ లేబులు చించేసి మన పుస్తకం కొట్టేస్తే? అందుకని ఎక్కడో పుస్తకం మధ్యలో ఇంకో పేజీలో రహస్యంగా పేరు రాసుకోవడం!

ఐదో తరగతి దాకా పెనిసిలుతోనే రాసుకోవడం. నటరాజ్ కానీ, అప్సర కానీ. నేను ఎప్పుడూ పెనిసిళ్ళు పారేసుకునే వాణ్ణి, లేకపోతే క్లాసులో ఎవరికో దానధర్మం చేసే వాణ్ణని మా అమ్మ నాకెప్పుడూ పూర్తి సైజు కొత్త పెనిసిలు ఇచ్చేది కాదు. ఒక పెనిసిల్ని సగానికి విరిచి, సగం ముక్కే ఇచ్చేది. నేను చదివిన బళ్ళో ఎవడి దగ్గరా పెనిసిలు చెక్కుకునేందుకు షార్పెనర్ ఉండేది కాదు. ఒకేళ ఎవడి దగ్గరన్నా ఉంటే వాడు పోజు గాడి కింద లెక్క. ఇంచు మించు అందరి దగ్గరా నాన్నలు గెడ్డాలు గీసుకుని పారేసిన, సగం విరగ్గొట్టిన రేజరు బ్లేడు ముక్కలే ఉండేవి. ఈ బ్లేడు ముక్కతో పెనిసిలు చక్కగా చెక్కడం ఒక గొప్ప కళ. ప్రతీ క్లాసులోనూ ఇద్దరో ముగ్గురో ఉండేవాళ్ళు ఈ కౌశలం కలిగిన వాళ్ళు. వాడికి ఓ జాంకాయో, ఒక ఐసుఫ్రూటో లంచం పెట్టి నున్నగా, సూది మొనగా పెనిసిలు చెక్కించుకోడం ఓ గొప్ప. ఇరేజర్లు కూడా కొంచెం అరుదుగానే ఉంటుండేవి. మేం చాలా కాలం వాటిని అచ్చ తెలుగులో లబ్బరి అనేవాళ్ళం. కొంచెం తెనుగుమీరాక రబ్బరు అనడం నేర్చాం. ఐదు పైసలకీ పది పైసలకీ దొరికే రబ్బర్లు చాలా మోటుగా ఉండేవి. వాటితో తుడిపితే పేజీ చిరిగిపోయేది. కాకపోతే వీటితో చాల అదనపు ప్రయోజనాలు ఉండేవి. నెత్తికి రాసిన కొబ్బరి నూనె (క్లాసులో కనీసం పది మందైనా మెడమీదికి కారే లెవెల్లో నూనె రాసుకొచ్చేవాళ్ళు) ఈ రబ్బరుకి పట్టించి, దాన్ని అచ్చు పుస్తకం పేజీల మధ్యలో నొక్కి పడితే, ఆ అచ్చు ఈ రబ్బరుకి అంటుకునేది. అదో గొప్ప వినోదంగా ఉండేది మాకు. కానీ అచ్చు పుస్తకాల్ని ఖరాబు చేస్తున్నాం అని అటు టీచర్లు, ఇటు ఇంట్లోవాళ్ళు ఇద్దరూ వాయగొట్టేవాళ్ళు. ఆ తరవాత యెప్పుడో ఇంచుమించుగా పెనిసిళ్ళ అవసరం తీరిపోయాక నాజూకు ఇరేజర్లు, సెంటు వాసన వచ్చే, ఆకర్షణీయమైన రంగుల ఇరేజర్లు వచ్చాయి.

 ఆరో తరగతిలో కలాలు మొదలు. మేప్ పాయింటింగ్ కోసమూ, సైన్సు బొమ్మల కోసమూ కలర్ పెనిసిళ్ళ వాడకం మొదలైంది కూడా ఆరులోనే. అప్పటిదాకా జీవితం బ్లాకండ్వైటే :) ఎలాగూ రంగు పెనిసిళ్ళు వాడనిస్తున్నారు కదాని నోటు బుక్కుల్లో హెడింగులకీ సబ్ హెడింగులకీ కింద ఏదో ఒక రంగు (సాధారణంగా ఎరుపు రంగు) పెనిసిలుతో అండర్లైన్ గీతలతో అలంకారాలు అద్దటం ఒకటి. ఆరులోనే చేతికందిన మరో మంత్రదండం జామెంట్రీ (అప్పుడు అలాగే అనేవాళ్ళం) బాక్సు. వృత్తలేఖిని, కోణమానిని - ఈ రెండిటితో ఏం చేస్తామో చెప్పుకోండి చూద్దాం!

కలం అంటే ఫౌంటెన్ పెన్నే. బాల్ పెన్నులు ఎక్కువగా ఉండేవి కావు. పైగా టీచర్లు కూడా ఒప్పుకునే వారు కాదు. బాల్ పెన్ తో రాస్తే చేతివ్రాత చక్కగా ఉండదని వాళ్ళకి గాఢనమ్మకం. అదీ కాక అప్పట్లో వచ్చే రీఫిళ్ళు ఊరికే ఇంకు కారేవి. ఆ ఇంకు చొక్కాకి అంతుకున్నదంటే జన్మలో వదలదు. జీవితంలో పెన్నులు ప్రవేశించంగానే ఇంకే మారక ద్రవ్యంగా ఇంకు మీద ఆధారపడిన ఒక వాణిజ్య ఆర్ధిక వ్యవస్థ కూడా మా జీవితాల్లో ప్రవేశించింది. మా యింట్లో బ్రిల్ రాయల్ బ్లూ వాడేవాళ్ళము. కానీ చాలా మందికి ఇళ్ళల్లో ఇంకు బుడ్డి ఉండేది కాదు. అందుకని బడికి వస్తూ వస్తూ వీధి దుకాణంలో ఐదు పైసలకి ఇంకు పోయించుకునే వాళ్ళు. సాధారణంగా ఆ ఇంకు నీళ్ళగానూ, కొంచెం హీనపక్షంగానూ ఉండేది. ఒకసారి ఫైనలు పరీక్షలు జరుగుతుండగా ఒక పిల్ల రాయడం మానేసి దిక్కులు చూస్తోంది. టీచరుగారు ప్రశ్నించిన మీదట ఇంకు ఐపోయింది అని చెప్పింది. టీచరుగారు అదేమిటే, పరిక్షకి వస్తూ ఇంకు నింపుకోవాలని తెలీదా అంటే .. నిన్నటి రోజున ఒక మిత్రురాలికి అరపెన్నుడు ఇంకు అప్పిచ్చిందిట. ఇవ్వాళ్ల ఆ స్నేహితురాలు అప్పు తీరుస్తానందిట. అందుకని అమ్మడు పాపం ఇంకు నింపుకోకుండా వచ్చింది. మొత్తానికెలాగో ఆ స్నేహితురాలు పరిక్షకి ముందు అప్పు తీర్చలేదు. టీచరుగారు ఋణదాతనీ, గ్రహీతనీ ఇద్దర్నీ నాలుగు పీకారు పాపం. ఏప్రిలు ఫస్టుకి మాత్రం ఈ ఇంకు పెన్నులు మరొకందుకు బ్హలే పనికొచ్చేవి

ఈ తీపిచింతపండు బ్లాగులో..అప్పటి ఉపకరణాలు చాలా వాటిని తల్చుకున్నారు

హైస్కూలు కొచ్చేప్పటికి పొడుగు నోటు పుస్తకాలు, బాల్ పెన్నులు అలవడినాయి. పిల్ల వేషాలు చాలా మట్టుకి తగ్గి పోయాయి. అచ్చు పుస్తకాలు కూడా పొడుగు వెడల్పు బాగా పెరిగాయి. ఆ సమయంలోనే డిటెక్టివు పుస్తకాలు అద్దెకి తెచ్చుకోవడం కూడ పరిచయమయింది. కుర్చీలో కదలకుండా కూర్చుని పాఠం చెప్పే మాస్టార్ల క్లాసులో, అచ్చుపుస్తకంలోనో, నోటు పుస్తకంలోనో దాచి పెట్టి డెటెక్టివులు చదవడం ఒక గొప్ప ఎడ్వెంచర్. ఇవ్వాళ్ళ స్టెపుల్స్ కొట్లో చూసిన ఒక అద్భుతమైన వస్తువు ఇది.


పుస్తకానికి తొడిగేందుకు గుడ్డతో కుట్టిన చొక్కా (కవర్) ఇది. 
వార్నీ, ఇట్లాంటిది మా హైస్కూలు రోజుల్లో ఉండి ఉంటే .. !

Comments

Venkata Naresh said…
మేము కూడా ఇవన్నీ చేసాము . నా బాల్య స్మృతులు గుర్తుకుతెచినందుకు చాల సంతోషం. మేము తొంభైయ దశకం లోని వారం . మా అప్పటికి మెజారిటీ పిల్లలు బాల్ పాయింట్ పెన్నులు వాడేవారు. నేను మాత్రం ఆ ఫౌంటెన్ పెన్నుతో కుస్తీలు పడేవాడిని. పరీక్షలలో మాత్రం వేగంగా ఉంటుందని బాల్ పాయింట్ పెన్ను వాడేవాడిని.

చిన్నప్పుడు చేసినవి ఎన్ని మర్చిపోతున్తామో కదా. రబ్బరు మీద బొమ్మలు విషయం గుర్తుకు వచ్చి నా మనసు బాల్యం లోకి పరుగులు తీసింది. చాల సంతోషం.
అప్పట్లో పెన్నులు కక్కేవి.అందుకని బ్లాక్ బోర్డు దగ్గర పడేసిన చిన్నచిన్న సుద్ద ముక్కలు కోసం పోటి. ఇంత లావు పెన్ను నిండా ఇంకు నింపుకొని రొడ్డుమీద వెడుతున్న ఆడపిల్లల వెనుక పెన్ను విదిల్చే అబ్బాయిలు.అబ్బో! ఒక మునకేమిటి? చాలా మునకలు వేయించారు.
SD said…
ఇంజినీరింగ్ లో దాదాపు చివరి సంవత్సరంలో ఒకడు నా వెనక కూర్చుని (మా బేచ్ లో ఇరవై మందే ఉండేవాళ్ళం) నా కున్న ఒకే ఒక తెల్ల చొక్కా (అప్పట్లో బట్టలకి చాలా కష్టంగా ఉండేది బతుకు) మీద వెనక నుంచి ఇంకు చల్లడం మొదలుపెట్టేడు. అసలే ఆ చొక్కా మా అన్న దగ్గిర దండుకున్నది; కొత్త బట్టలు కుట్టించుకోవడానికి డబ్బుల్లేక. ఇలాగ కాసేపయ్యాక 'ఒరే నాయనా ఇంక ఆపుతావా?' అని కోపంగా అనేసరికి వాడు మరింత రెచ్చిపోయేడు. ఆ తర్వాత వెనక్కి కూడా చూడకుండా పిడికిలి బిగించి ఒక్క విసురు విసిరేను. అంతే, వాడు ముద్దలు ముద్దలుగా రక్తం కక్కేడు క్లాసులో, సరిగ్గా ముక్కుమీద తగిలింది దెబ్బ. అయితే ఒకటి చెప్పుకోవాలి. ఎప్పుడూ అలా కొట్టినందుకు చింతించలేదు; ఇప్పుడు కూడా. ఎందుకంటే అప్పట్లో మా ఆర్ధిక పరిస్థితి అలా ఉండేది. అదీ కాక ఎన్ని సార్లో ముందే చెప్పేను వాడికి ఆపమని.

ఉత్తరోత్తరా ఎవరో చెప్పేరు అతను నా కన్నా ముందే అమెరికా వచ్చాడని విన్నాను. ఎక్కడున్నాడో మరి. గాడ్ బ్లెస్ హిం!

ఇంకు గురించి చదివితే ఇదే గుర్తొచ్చింది చటుక్కున. పైలట్ పెన్ గురించి రాయలేదేమండీ? అసలు నేను పెన్సిల్ సీరియస్ గా వాడింది అమెరికాలో గ్రాడ్యు యేట్ స్కూల్లో చెరాకనే. రోజు హోం వర్క్ పెన్నుతో చేస్తూంటే ఒక ప్రొఫేసర్ గారు కరెక్ట్ చేసిన హోం వర్క్ మీద రాసి చెప్పేరు - "పెన్సిల్ మాత్రమే వాడవల్సింది" అని. అప్పట్నుంచి పెన్ వాడినట్టే సరిగ్గా గుర్తు లేదు. ఇప్పుడు ఆఫీసులో కూడా పెన్సిలే.
Anonymous said…
గుర్తుకొస్తున్నాయి.. గుర్తుకొస్తున్నాయి..
నాదీ అదే బాల్యం.
భలే గుర్తు చేసారు.
Kottapali said…
Venkata Naresh .. సంతోషం :)
సూర్యలక్ష్మిగారు, చాన్నాళ్ళ తరవాత నా బ్లాగులో కామెంటారు. అవును, పెన్నులు కక్కడం అదో ప్రహసనం.
DG, Yes, my friends and I had to deal with guys like this in elementary school. If your back bench friend was doing this in final engineering, I suspect he has serious psycho issues. And he certainly deserved the treatment you meted out to him. Kudos to you.
Re. Use of pencils & grad school - ditto here. In fact, it's like life comes full circle - you go back to writing in small ruled books with pencils :) Even now at work, I have two sharpened wooden yellow pencils on my desk and use a small ruled notebook :)

bonagiri, welcome! :)
Kottapali said…
DG, Forgot. What did you expect me to write about pilot pen? If you referred the brand .. my father had one. Gift of a friend who had visited USA at that time. After my father passed on, my elder brother kept it for some time. Not sure if it is still around. I could use it with permission at home under supervision, but was never allowed to take out. I was too prone to lose pens. Even now.
ఆ గాలి మాక్కూడా సోకింది కొత్త పాళీ గారు.
బాగుంది, సీనియర్లూ జూనియర్లూ అందరివీ కాస్త అటూ ఇటూగా ఇవే అనుభవాలు, జ్ఞాపకాలు!!

పెన్నులు కక్కుతూ ఉంటే ఆ కక్కే చోట కాండిల్ తో రుద్దడం, కొబ్బరి నూనె పూయడం లాంటి వెధవ్వేషాలు..అవేమీ పని చేయక పోయినా. :-))

పైలట్ పెన్నులు కాలేజీలో ఉన్న అక్కయ్య, అన్నయ్యలకు తప్ప మాకు అర్హత లేదు అప్పట్లో. ప్రసాద్ పెన్నులు మాత్రమే, ఒక డజను తెచ్చి పడేసేవాళ్ళు. ఇంకు బుడ్డీ, అది పోసుకోడానికి ఒక రబ్బరు ఫిల్లరూ!

ఇంకుపెన్నుల ఉపయోగం ఫైనల్ పరీక్షలు అయిపోయిన రోజు మరీ ఎక్కువ. ఎగస్ట్రా ఇంకు పెన్ను తెచ్చుకుని మరీ, ఇంకు చల్లుకోడం..

జూన్ 13 నుంచీ స్కూల్ స్టోర్స్ లో అమ్మే లేపాక్షి నోట్స్ లు కొనుక్కోడం, లెక్కల టెక్స్ట్ ఇంకా రాలేదని వాళ్ళు చెప్పడం, తెలుగు టెక్స్ట్ లో పాఠాలన్నీ కొన్న రోజూ నవల చదివినట్టు ఒక రౌండ్ వేసి పారేయడం, హిందీ టెక్స్ట్ వంక లెక్క లేనట్టు చూసి అట్టేసి లోపల పారీడం!

జామెట్రీ బాక్స్ ని ఇప్పటికీ "జామెంట్రీ బాక్స్" అనడమే బాగుంటుంది నాకు :-)

బ్రౌన్ అట్టలు వేసి తీరాలన్న నిబంధన వల్ల, ఇంట్లో కట్టలుగా పడి ఉండే జ్యోతి చిత్ర, సితారలకు అన్యాయం జరిగి పోతోందని గుండెల్లో ఒకటే బాధ...! సోవియట్ భూమి వాళ్ళ యాపిల్ తోటలూ, మంచు ఫర్ కోట్ల మనుషుల అట్టలు వేయాలన్న తపనా...ప్చ్ !

ఇప్పటి పిల్లలకు వేలకు వేలు పడేసి ఇవన్నీ కొంటూ ఉన్నపుడు కూడా నాకు "అబ్బా, వీటిలో ఆ నాటి ప్రసాద్ పెన్నులు,(వీటిని చెక్క పెన్నులు అనే వాళ్ళం, అవే రంగులో ఉంటాయని...), ఆ మొద్దు రబ్బర్లు, ఇవేమీ లేవే అని పీకుతూ ఉంటుంది నాకు.

వాటి అందం ముందు ఈ రంగుల హంగులన్నీ తీసికట్టే
Kottapali said…
జ్యోతిర్మయి, బాగు బాగు :)
సుజాత, భలే. తెలుగువాచకాల విషయంలో మీకంటే ఓ రెండాకులు ఎక్కువ చదివాన్నేను. ఎనిమిది, తొమ్మిది, పది తరగతుల వాచకాలూ ఉపవాచకాలూ మా అక్కా వాళ్ళు చదివినవే నాకూనూ. అవన్నీ నేను ఏ నాలుగులో ఉండగానో చదివేశాను :) ఇంకోటి మరిచి పోయా .. తెలుక్కి ఫైవ్ పండిట్స్ గైడ్! అదో పెద్ద ప్రహసనం!!
MURALI said…
కొత్తపాళీగారూ,
అమాంతం తీసుకెళ్ళి స్కూల్లో వదిలారు.

సుజాతగారూ,
నేను చరిత్ర పుస్తకాలు కూడా చదివేసేవాడ్ని. అప్పట్లో ఆ విప్లావల గురించి చదవటం భలే ఆసక్తిగా ఉండేది. సోషల్ బుక్ మొత్తంలోనూ వదలకుండా చదివింది చరిత్రొక్కటే అనుకుంటా.
Unknown said…
along with 5 pundits guide, we used to read 8 pundits telugu guide also, if I remember correct.thank you very much for taking us to our good old days.
బాగున్నాయి మీ జ్ఞాపకాలు :)
SD said…
కొ.పా. గారు
అవునండి. పైలట్ పెన్నులు అలాగే ఉండేవి. మా నాన్న గారి దగ్గిరోటుండేది. "ఒరే ఇది నాకు తాతగారిచ్చేరు, నువ్వు బాగా చదూకుంటే నీకిస్తాను" అనేవారు. అది చూస్తే దుక్క ముక్కలాగా ఉండేది, "అదేం బావుంది? ఇది నాకెందుకూ అనేవాణ్ణి." :-) నాకు బాగా నచ్చిన మేడ్ ఇన్ చైనా పెన్ను హీరో ఉండేది. భలే పెన్ను అది. ఇంకు పోయడం లేదు, పిల్లర్ సీసాలో పెట్టి నొక్కితే అదే పీల్చుకునేది. కామెల్ ఇంకు వాడినట్టు గుర్తు. సరిగ్గా పేరు చెప్పమని అడక్కండే? గుర్తులేదు మరి :-)

ఇంకు కారడం ఒక ప్రహసనం ఐతే, పాళి రిపైర్ చేయడం, నాలిక వేయడం, ఇంకు మార్చడం లాంటివి రోజూ ఉండేవి. ఎప్పుడు ఒక్క సరైన పెన్ను ఉన్నట్టే గుర్తు లెదు. అన్నింటికన్నా పెద్ద జోకు ఏమిటంటే, మేము చదివే రోజుల్లో ఇంజినీరింగ్ ఎంట్రన్స్ టెస్టుల్లో "విమానం ఎక్కినప్పుడు పెన్నులో ఇంకు కారిపోతుంది, ఎందుచేత?" అనే తిక్క ప్రశ్నలన్నీ అడిగేవారు. ఆ మధ్యన "3 ఇడియట్స్" సినిమా చూస్తూంటే ఇదే గుర్తుకొచ్చి నవ్వు వచ్చింది. అందులో ఇలాంటి సన్నివేశం ఉన్నట్లు గుర్తు.

అన్నట్టు ఈ మధ్య ఇండియా వెళ్ళినప్పుడు సాక్షి పేపర్ (అన్నీ పేపర్లూ ఇంచుమించు ఇలాగే వేస్తున్నాయి ఇప్పుడు) లో కాంపిటీటివ్ ఎగ్జాంస్ ప్రశ్నలు చూసాను. "ఏ ఏడాదిలో ఇది జరిగింది", "ఎప్పుడు బోసుగారు ఒంటేలుకి వెళ్ళేరు", "ఫలానా వారు ఎందు ఒంటేలు తాగానని చెప్పుకున్నారు రష్యాలో" లాంటివే ప్రశ్నలన్నీ. కాస్త జాలి వేసింది కుర్రాళ్ళని తల్చుకుంటే. ఒకటేమిటి లెండి మొత్తం దేశం అంతా ఇలాగే ఉంది. కానీ ఈ సారి మాత్రం, ఇండియాలో ఒక ఇల్లు ఉంటే రిటైర్ ఐపోవచ్చు అనిపించింది. వెనక్కి వచ్చేక ఆ ఆలోచన రెండువారాల్లో పోయింది రకరకాల ప్రోబ్లెంస్ గుర్తుకొచ్చి. దేశం గురించి ఇంకోసారి మాట్లాడుకుందాం.

ఫైవ్ పండిట్స్ గైడ్. :-) మేము చదూకునేటప్పుడు, టెక్స్ట్ బుక్ అమ్మేవారు కాదు సరిగ్గా (ఇప్పుడూ అలానే ఉందనుకోండి అటూ ఇటూగా), గైడ్ కొనిపించడం కోసం 'గైడ్ కొంటే టెక్స్ట్ ఫ్రీ' అనే స్లోగన్ ఉండేది.

ధన్యవాదములు చిన్నప్పటివి గుర్తు చేసినండుకు.
Kottapali said…
Murali, cool.
నరసింహారావుగారు, అష్టపండితుల సంగతి తెలియదండీ. ఫైవ్ పండిట్స్ గైడు మాత్రం దిండులా లావుగా ఉండేది.
సూర్యుడు, సంతోషం.
DG, once again, ditto on all counts! :) నేను బడి చదువులు చదివినప్పుడు టెక్స్టు బుక్కులు దొరక్కపోవడం గుర్తులేదు. అప్పుడప్పుడూ ఆలస్యం అయేవి.
స్వామిగారూ, మీ ఈ పోస్ట్ ఇప్పుడే చూసేను.మధురమైన బాల్యాన్ని మరోసారి గుర్తుచేసారు. నేను మీ పోస్టుకి వారం ముందే 10 వ తేదీన ఒక పోస్టు ( ఈ కవిగారి కలానికి రెండువైపులా పాళీలే)రాస్తూ కలానికి రెండువైపులా పాళీ లేమిటనుకుంటారని ఆపోస్టుకి చిన్న తా.క. అనే తోక తగిలించి అందులో పెన్నుల గురించి కొంచెం రాసేను. మరో పోస్టులో వివరంగా రాద్దామనుకున్నాను గానీ మీ ఈ పోస్టు చూసేక మరి ఆ అవసరం లేదనిపించింది.అమ్మాయిల మీద ఇంకు జల్లడాలులేవు గానీ మా చిన్నప్పుడు అందరం పరీక్షలై పోగానే ఒకరి షర్టుమీద ఇంకోకరు ఇంకు జల్లుకునే వారం. పరీక్షలైపోయిన ఆనందానికి సెలిబ్రేషన్ అన్నమాట.మంచి పోస్టు రాసినందుకు అభినందనలు.
Kottapali said…
గోపాలకృష్ణగారు, ఇప్పుడే మీ టపా చదివి వచ్చాను. భలే ఉంది. వత్సవాయి తిమ్మజగపతి పెద్దాపురం రాజు అనుకుంటా. శ్రీపాదవారి వడ్లగింజలు, గులాబీ అత్తరు కథల ప్రకారం.
SD said…
>> తిమ్మజగపతి పెద్దాపురం రాజు అనుకుంటా
పెద్దాపురం కాలేజీ ని ఎస్ ఆర్ వి బి ఎస్ జె బి మహారాణీ కాలేజ్ అనేవారు. అంటే శ్రీ రాజా వత్సవాయి బుచ్చి సీతాయమ్మ జగపతి బహదూర్ మహారాణీ కాలేజ్ అని. నేను ఆంధ్రా బయట చదూకునే రోజుల్లో ఓ సారి ఈ కాలేజ్ పేరు అడిగేరు ఎవరో. పేరు చెప్తే,"ఏంటి మాట్లాడుతున్నావు నన్ను ఏడిపించడానికా? ఇలాంటి పేరున్న కాలేజీలు అసలు ఉన్నాయా" అన్నారు ఒక ప్రొఫెసర్ గారు. వెంటనే, నేను నోరు విప్పేలోపుల మొదటి బెంచీ లోంచి ఒక తమిళతను లేచి చెప్పేడు -"అవునండీ, మాది అసలు విజయనగరం, అక్కడ ఉంది ఇలాంటి కాలేజ్" అని. ప్రొఫేసర్ మాట అలా ఉంచి నేను డంగై పోయేను ఎందుకంటే అలాంటి పేరున్న కాలేజీ విజయనగరం లో ఉందని నాకు అప్పటిదాకా తెలియదు. అక్కడో రాజు గారి సంస్థానం ఉందనీ, కేలేజీ ఉందనీ తెల్సు కానీ ఇదే/ఇలాంటి పేరే అని తెలియదు. అప్పుడు క్లాసులో అందరూ నవ్వులు.
Kottapali said…
DG .. :)
బెజవాడలో మా యింటిపక్కనే ఉన్న ఎస్సారార్ కాలేజి కూడా ఇదే బాపతు. వారు నూజివీడు ప్రభువులు అనుకుంటాను. నా చిన్నప్పుడు ప్రహరీగోడ మీద సింహద్వారం పక్కన నిలువెత్తు బొమ్మ, కాంక్రీటులో అచ్చుపోసినది, ఒక చేతిలో ఈటె, ఇంకో చేతిలో గుర్రపు కళ్ళెం (వెనకాల గుర్రం కూడా) పట్టుకుని మాంఛి ఠీవిగా ఉండేది. ఆయన అసలు పేరు నాకిప్పుడు గుర్తు లేదు.
avsmanyam9 said…
చిన్నప్పుడు చేసినవి ఎన్ని మర్చిపోతున్తామో కదా. రబ్బరు మీద బొమ్మలు విషయం గుర్తుకు వచ్చి నా మనసు బాల్యం లోకి పరుగులు తీసింది. చాల సంతోషం.మేము కూడా ఇవన్నీ చేసాము . నా బాల్య స్మృతులు గుర్తుకుతెచినందుకు చాల సంతోషం. మేము 70 దశకం లోని వారం.
Kottapali said…
avsmanyam గారు, సంతోషం. ఈ బ్లాగులో వ్యాఖ్యలు నేను చూసి ప్రచురిస్తే గానీ బయటపడవు. ఆలస్యానికి క్షమించండి.
ఈ టపా ఇప్పుడే చూసాను. చాలా రోజుల తర్వాత మీ నుండి ఓ ఆహ్లాదకరమైన టపా.

గుర్తుకొస్తున్నాయి..గుర్తుకొస్తున్నాయి.

నేను ఇప్పటికీ రబ్బరనే అంటాను:)

వృత్తలేఖిని, కోణమానిని - ఈ రెండిటితో ఏం చేస్తామో చెప్పుకోండి చూద్దాం!

వృత్తలేఖిని...వృతాలు గీయటానికి

కోణమానిని..కోణాలు కొలవటానికి

మీరు ఇంకేమైనా చేసేవారా!

పెన్ను, పెన్సిలు, రబ్బరు తో పాటు ఇంకోటి కూడా ఉందండోయ్! తుమ్మ బంక...ఆ రోజుల్లో కామెల్ గమ్ లు..స్టిక్కులు ఎరగం. శుభ్రంగా తుమ్మ చెట్ల నుండి బంక తియ్యటమే! తుమ్మ బంక తియ్యటం కూడా ఓ కళే. ముందుగా మంచి చెట్లు చూసుకుని వాటికి గాట్లు పెట్టాలి..కొన్నాళ్ళకి ఆ గాళ్ళలోనుండి బంక ఊరుతూ ఉండేది...అది కొంచం ఎక్కవ అయి గట్టిపడ్డాక తెచ్చుకోవటం...దాన్ని కాచి డబ్బాలకి పోసుకోవటం! ఒకరం గాట్లు పెట్టిన చెట్టు నుండి ఇంకొకళ్ళు బంక తియ్యటానికి లేదు. ఈ బంక పనులు మగపిల్లలే చేసేవాళ్ళులేండి. అన్నయ్యలు ఉన్న ఆడపిల్లలకి ఇదొక అడ్వాంటేజ్!
ఎప్పుడో జూలై లో వ్రాసిన ఈ టపా ఇప్పుడు చదివా ..
నావీ అన్నీ ఇంచుమించు మీ అనుభవాలే...
ఒకటి మాత్రం చెప్తా " ఆరు ఏడూ క్లాసులు చదివిన బడిలో పిల్లలకూ ఆమాట కొస్తే మాస్టర్లకు తాగడానికి మంచి నీరు ఉండేది కాదు. పెద్ద మామిడి చెట్టుకింద ఉన్న పాత భావి, నీరు చేదుకోవటానికి చిల్లుల బొక్కెన ఉండేవి. భావిలో నీటి తో బాటు రాలిన మామిడాకులు, సీజన్లో లో బోనస్ గా మామిడి పూత అప్పుడప్పుడు చిన్న మామిడి పిందెలు ఉండేవి. మినరల్ (?)వాటర్ తో వంట చేస్కుంటున్న ఈ రోజుల్లో అలా ఆ నీళ్ళు తాగామా అని గుర్తు కొస్తే ఆశ్చర్యం తో కూడిన భయం కలిగిన వింతైన ఫీలింగ్. కానీ ఈరోజు అనారోగ్యం పాలవలేదు. ఆ రోజులే వేరు ... ఆ రోజులే వేరు... ఆ రోజులే వేరు !!
Karthik said…
Narayana swami gaaru.. Mee tapaalanni adbuthaha... ee tapa chaduvutunte... ayyo em cheppanu alaa naa chinnatanamloki vellocchaanu... Hha..hha..hm chalaaaa chaalaaa bagundi nee tapaa.. Thanq sir freegaa naa school daggaraku mee tapaatho teesukellinanduku..:-):-):-)